అప్పటిదాకా మనము అంటే ప్రాణంగా, ఎంతో ప్రేమగా - మనమే లోకంగా భావించే మనషులలో మనమీద ప్రేమ తగ్గిపోతే - వాళ్ళు మారిపోయారు - అని నిందిస్తూ ఉంటాం. కానీ, వాళ్ళు అలా మారటానికి కారణం మనమే అని మాత్రం ఆలోచించము. ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.. తప్పు ఎవ్వరిది..? అనీ, ఒకరిని అనటం చాలా తేలిక కదా..!!
నిజమే కదా.. మనం అంటే ఇష్టపడేవారిని, మనమీద అభిమానం చూపేవారిని, మనమే వారి లోకం అంటూ ఆత్మీయతని, అనురాగాన్ని చూపించే వ్యక్తులు - మన మీద చూపే ప్రేమ / కన్సర్న్ తగ్గిపోతే - వారు మారిపోయారు అని నిందించటం తగదు. మామూలు వ్యక్తులు లేదా అవసరార్థం మనకి చేరువ అయ్యేవారి సంగతి వేరు. వారు ఏదో ఆశించి దగ్గర అవుతారు, వారు ఆశించింది దక్కినప్పుడో, దక్కనప్పుడో దూరం జరుగుతారు. అలాంటివారి గురించి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మనమంటే ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని, అనురాగాన్ని, ఆత్మీయతనీ అందించే తల్లితండ్రులే గానీ, స్నేహితులే గానీ, బంధువులే గానీ, ఇరుగు పొరుగే కానీ.. అంతకు ముందు మన మీద చూపిన ప్రేమ పిసరంత తగ్గితే - అది గమనించుకొని, బాధ పడుతాము. ఫలితముగా వారు మారిపోయారు అని నిందిస్తాం. కానీ ఎందుకు అలా చేస్తున్నారు / మారిపోయారు అనే దిశగా ఆలోచన చెయ్యం. వారినే నేరుగా అడగలేకపోతాం. కారణం అభిజ్యాతం ( ఈగో ).
ఒక్కసారి దాన్ని బ్రేక్ చేసి, ముందుకు అడుగు వేస్తే, మళ్ళీ వారు ఎప్పటిలా మనమీద అభిమానాన్ని చూపించేలా చెయ్యవచ్చును. కానీ, నేను ఇంతవరకూ ఒకసారి కాదనుకున్న వారిని వెనక్కి తిరిగి అడగదలచుకోలేదు / మాట్లాడదలచుకోలేదు అనుకుంటే - ఏదో తెలీని వెలతి మన జీవితాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంతా డబ్బే అయిన ఈ రోజుల్లో స్వచ్చందముగా మన మీద ప్రేమ / ఆత్మీయతని చూపించేవారిని దూరం చేసుకోవడం అంత తెలివైన పని కాదు. అలా చేసుకుంటే - జీవితాన చాలానే మిస్ అవుతాం.
No comments:
Post a Comment