Friday, July 30, 2010

Solve the case


Saturday, July 24, 2010

ఇడ్లీ చట్నీ - పోపు



చాలా చాలా హోటల్స్ లలో గమనించాను. అదేమిటో గాని, అన్నీ బాగుంటాయి.. కొన్ని చిన్న చిన్న విషయాల్లో పొరబాట్లు చేస్తుంటారు. మొన్న తిరుమలకి వెళ్లాల్సివచ్చినప్పుడు, దారిలో అక్కడక్కడా ఆగినప్పుడు చాలా హోటల్స్ లలో గమనించాను. అన్నీ బాగుంటాయి.. కాస్త రుచికరముగానే ఉంటాయి. కాని.. ఇడ్లీ లోని చట్నీకి పోపు ఎందుకు పెట్టరో నాకు అర్థం కాదు.

నిజానికి ఈ చట్నీకి పెట్టే పోపుకి ఏమంత ఖర్చూ కాదు. కాసింత నూనె, కొద్దిగా ఆవాలూ, మిరప విత్తులూ, కొద్దిగా కరివేపాకు.. అంతే! నూనె మరిగాక అవి వేసి చిటపటలయ్యాక చట్నీలో కలిపేస్తే సరి. అమోఘమైనరుచి వస్తుంది. ఇదేమంత పెద్ద ఖర్చూ, శ్రమతో చెయ్యాల్సిన పనీ కాదు. అయినా హోటల్స్ లలో ఎందుకు పాటించరో నాకు అర్థం కాదు..

పల్లీల పప్పు అంతగా వేసి చట్నీ చేసే బదులు, టమాటాలు రేటు కాస్త తక్కువగా ఉన్నప్పుడు, వాటితో పచ్చడి చేస్తే, కారంకి కారం, రుచికి రుచీ, బాగుంటుంది. హోటళ్ళలో చేసే ఆ తెల్లని సున్నం ముద్ద (నాకైతే అలాగే అనిపిస్తుంది.) చట్నీ అసలు తినబుద్ది వేయదు. అందులో పల్లీల పప్పు చాలా తక్కువగా వేసి చేస్తారేమోనని, అందుకే అలా చప్ప, చప్పగా ఉండి.. నాలికకు రుచి తగలదు. పల్లీల ధర ఎక్కువగా ఉందనిపిస్తే, హాయిగా టమాటలతో పచ్చడి చేసి పెడితే ఎంత బాగుండునో అని అనుకుంటాను.

ఇక అల్లం చట్నీ అయితే - అది ఒక ఎర్రని రంగు పదార్థములానే ఉంటుంది. ముక్కు వద్ద కాదు, ముక్కు లోపల పెట్టి చూసినా ఇసుమంత అల్లం వాసనే ఉండదు. ఈ పదార్థాన్ని హోటళ్ళలో సరిగ్గా చూడక ఎంతో కాలం అయ్యింది. ఏదో ఉన్నది లాగించేసేయ్యటం అవుతున్నది.. అంతే కదూ!..

అన్నింటికన్నా నాకు నచ్చేది ఒక సాంబారు మాత్రమే!.. అందులో మునక్కాడలు వేసి, ప్రేష్హుగా ఇంత కొతిమీర, కూసింత కరివేపాకూ దట్టించి వేడి,వేడిగా తీసుకొస్తే.. నా సామిరంగా.. ప్రక్కన ఎవరూ లేకుంటే అలాగే సాంబారు గిన్నె ఎత్తి గటగటా త్రాగేయ్యాలనిపిస్తుంది.. అంత మంచి సాంబారు దొరికేచోటు రద్దీ  లేకుండా ఎలా వుంటుందీ!..

Wednesday, July 21, 2010

Motivative Quotes

స్వామి వివేకానంద చెప్పిన ప్రవచనాలు మీకోసం..
అక్షరాలు సరిగా కనపడక పోతే - మీరు ఈ ఫోటో మీద డబుల్ క్లిక్ చెయ్యండి.
పెద్దగా వస్తుంది.

Tuesday, July 20, 2010

Digital Camaras

మీరు డిజిటల్ కెమరా కొనదలచుకున్నారా.. అయితే అందులో ఎక్కువ మెగా పిక్సెల్ ఉన్నదే తీసుకోండి. ఇప్పుడు మీకు మార్కెట్లో 12 మెగా పిక్సెల్ వి లభిస్తున్నాయి. 8, 10 మెగా పిక్సెల్ వీ కూడా దొరుకుతున్నాయి. మీ స్వంతము కోసమైతే 12 మెగా పిక్సెల్ వి తీసుకోండి. దీనివలన మీకు కొద్దిగా లాభం ఏమిటంటే - ఫోటో క్లారిటీ బాగా ఉంటుంది. ఆ ఫోటోని పెద్దగా ప్రింట్స్ వేసుకోవాల్సివచ్చినప్పుడు అప్పుడు బాగా ఉపయోగపడుతుంది.(కాని అలా జన్మలో ప్రింట్స్ వేయించము - అది వేరే సంగతి). ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి 20 మెగా పిక్సెల్ వీ కూడా వచ్చాయి. అవి చాలా ఖరీదు. అంత రేటు పెట్టి తీసుకొనే అవసరం ఏముంటుంది మీకు - మీరు గనుక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయితేనే తప్ప.

నేను నా పిల్లల కోసమని, ఒక డిజిటల్ కెమరా కొన్నాను అని చెప్పానుగా. దాని తాలూకు, ఈ కేమరాల గురించీ, ఇంకొన్ని అనుభవాలూ, ఆసక్తికర విషయాలూ.. ఈ టపాలో చెప్పాలని అనుకుంటున్నాను. ఇదంతా నా స్వానుభవాలు. నేను చెప్పే కోణానికీ, మీ ఆలోచనాలకీ పొంతన ఉండకపోవచ్చు. అది వేరే విషయం. ఒక్కో విషయం మీద ఒక ఒక్కో పెద్ద టపా కూడా వ్రాసేయవచ్చు. కాని క్లుప్తముగా చెబుతాను. అయినా ఇది చాలా పెద్దగా అవబోతున్నదనీ తెలుసు.

ఫిలిం కెమరా ఎందుకు కొనొద్దు, డిజిటల్ కేమరానే ఎందుకు కొనాలి? అని అంటే - రీలు పెట్టి తీసే కెమరా మామూలుది.. పాత టేక్నాలజిది. డిజిటల్ కెమరా క్రొత్త టెక్నాలజీది. రీలుకేమరా కొని రీలువేసి, క్రొత్త బ్యాటరీలు వేసి, ఫొటోస్ తీసాక, డెవలపింగ్ కీ. ప్రింటింగ్ కీ ఇచ్చి చూసుకునేసరికి బోలడంత సమయం వృధా.. అదే డిజిటల్ అయితే కేవలం బ్యాటరీలు వేసుకుంటే సరి.

రీలు లెక్కలు: రీలు 85 రూపాయలు + బ్యాటరీలు 20 రూపాయలు + డెవలపింగ్ కి 20 రూపాయలు. మొత్తం 125 రూపాయలు / (36 + ఆ చివర రెండు, ఈ చివరన రెండూ కలిపి మొత్తం) 40 ఫొటోస్ = మూడు రూపాయల పన్నెండు పైసలకి ఒక ఫోటో నెగటివ్ (అదనము ) అవుతుంది. ప్రింట్లకి డిజిటల్ కీ, రీలుకీ ఒకే ధర.

కాకపోతే రీలు ఫోటో మన్నిక చాలా తక్కువ. డిజిటల్ కి ఎక్కువ మన్నిక.

రీలువి స్థలం బాగా ఆక్రమిస్తాయి. డిజిటల్ వి అయితే చిన్నసైజులో ఒదిగిపోతాయి.

డిజిటల్ వి అయితే మళ్ళీ ఎడిట్ (కలర్, బ్రైట్, డార్క్, సైజ్..) చేసుకోవచ్చు. రీలువి చేసుకోవాలంటే దాన్ని మళ్ళీ డిజిటల్ కి మార్చి, మార్పులు చేసి.. మళ్ళీ నెగటివ్ గా మార్చాలి...

ఇలా చెప్పుకుంటూ పోతే ఈ బ్లాగు సరిపోదనుకుంటా. ఇక పాయింటుకి వస్తాను.

నేను దాదాపు సంవత్సరంన్నర క్రిందట డిజిటల్ కెమరా కొన్నప్పుడు దాని వెల 11,800 రూపాయలు + 2GB మెమొరీ కార్డు 450 రూపాయలు. మొత్తం 12,250 రూపాయలు. ఇప్పుడు ఇదే కెమరా మెమొరీ కార్డుతో 7,000 రూపాయల్లోనే వస్తుంది. అంటే సంవత్సరన్నర కాలములో నా కెమరా మాడల్ విలువ (12,250 - 7,000) 5,250 రూపాయలు తరుగుదల ( Depriciation ) చెందింది అన్నమాట. ఈ సంవత్సరమున్నర  కాలములో నేను దాదాపు ఆరువేల ఫోటోలు తీశాను.. అలాగే చాలా వీడియోలు కూడా. ఇప్పుడు నేను లాభమా, నష్టమా చూస్తే - 5,250 తరుగుదల / 6,000 ఫోటోలు  = ఒక్కొక్కటి  ఫోటో  కేవలం  ఎనభైఏడు పైసలకి  పొందానన్నమాట! అంటే నా కెమరా ద్వారా నేను బాగానే పొందానన్నమాట! అదే నా మిత్రుడు కెమరా దాదాపు అదే ధరకి కొన్నాడు. మహా అంటే 500 ఫోటోలు కూడా మించలా. అతనికి పైలెక్కనే చూస్తే ఒక్కో ఫోటో పదిరూపాయలన్నర అవుతున్నది. (బ్యాటరీలు రెండింటికీ కామన్ అనుకుంటే).

 ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందీ అంటే! - ఏది కొన్నా, ఏమి చేసినా దాని నుండి ఫలితాన్ని, అతి తక్కువ ఖర్చులో పొందగలగాలి. మా దూరపు బంధువు ఒకరు డబ్బులు మిగుల్చుకుంటానని - ఒక రూములో, నిండు వేసవిలో, మధ్యాహ్నం పూట తనే సెమ్ (సున్నం లాంటిది) పెయింట్ వేశాడు. మహా అంటే 100-150 కూలి రూపాయలు మిగిలిఉండొచ్చు.  కాని ఎండవేడికి, సెమ్ వేడికీ ఆరోగ్యం పాడయి, రెండున్నర వేలు బొక్క పెట్టించుకున్నాడు.  అతనికి ఇంకేమి మిగిలింది.? అందుకే తక్కువ ఖర్చులో అత్యుత్తమ ఫలితాన్ని పొందాలి.

హబ్బో! ఇప్పటికే చాలా పెద్దగా అయ్యిందే! ఇక ముఖ్యమైన పాయింట్లు అలాగే మిగిలిపోయాయి. ఇక అవే చెబుతానేం!.. 

డిజిటల్ జూమ్ కన్నా ఆప్టికల్ జూమ్ ఎక్కువగా ఉన్న కెమరాని తీసుకోవాలి.
డిజిటల్ కెమరా కొన్నప్పుడు మామూలు బ్యాటరీల మాడల్, మొబైల్ ఫోన్  బ్యాటరీ లాగా రెండు మోడల్స్ ఉంటాయి. రెండింటికీ తేడా ఏమీ ఉండదు. సెల్ బ్యాటరీ సెల్లులు ఉండే కేమరాకీ, AA సైజు నికెల్ కాడ్మియం బ్యాటరీలు వాడే కేమరాకీ తేడా ఏమీ ఉండదు. ఒక ఉపయోగం / అదనపు ఫీచరు తేడాగా ఉంటుంది. అదేమిటంటే AA సైజు బ్యాటరీల కెమరా కొంటే ఎక్కడికైనా వెళ్ళితే, ఫోటోలు తీసాక చార్జింగ్ అయిపోతే, కిరాణా షాపుల్లోనో, వీధి చివర కోట్లల్లోనో ఈ AA సైజు మామూలు బ్యాటరీలు కొని వెంటనే కెమరాలో వేసుకొని, మన పని చేసుకోవచ్చును. ఇదొక్కటే వెసులుబాటు అంతే!.. అన్నట్టు ఈ ఆ బ్యాటరీల వల్ల కెమరా బరువుకూడా పెరుగుతుందండోయ్.. మిగతా అన్నీ మామూలే!

రీచార్జ్ సెల్స్ వాడండి. ఇవి ఎక్కువ మన్నికనీ, చాలా పొదుపునీ ఇస్తాయి. అవి నికెల్ కాడ్మియం తో చేస్తారు. లీథియం అయాన్ తో చేసిన బ్యాటరీల కన్నా కొద్దిగా బరువుగా ఉంటాయి. కంపనీలు వారు ఇలా AA సైజులో లిథియం అయాన్ బ్యాటరీలు ఎందుకు చెయ్యరో అని అనుకుంటాను. - బహుశా ఖరీదు ఎక్కువ అవుతుందని కాబోలు.

అలాగే కెమరా చార్జర్ ఒకటి కొనుక్కోండి. అలాగే ఇంకో రెండు ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్ లు కొనుక్కోండి. ఒకటి బ్యాటరీ అయిపోగానే వెంటనే ఇంకోటి వాడుకోవచ్చు.

మీరు AA బ్యాటరీలు కొనదలచుకుంటే 2500mAH లేదా 2800mAH నంబర్ బ్యాటరీలు కొనుక్కోండి. ఇవి ఎక్కువసేపు మీ కెమరాకి పవర్ ని ఇస్తాయి. వీటిని  చార్జర్లో ఏడు గంటలు చార్జ్ చేస్తే సరిపోతుంది.

కెమరా పౌచ్ ఒకటి తప్పని సరిగా ఉంచుకోవాలి. కాస్త గట్టిగా ఉండి కెమరాకి రక్షణ కల్పించేలా ఉండాలి. కెమరా ఒక్కటే పట్టేలా కాకుండా బ్యాటరీ సెల్లూ, ఐపాడ్ పెట్టుకునేలా పౌచ్ లు మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి 250 రూపాయల నుండి మొదలవుతాయి. ఈ పౌచ్ ని బెల్ట్ సహాయముతో పాంట్ భాగములో బిగించుకుంటే వాడకానికి తేలికగా ఉంటుంది.

కెమరాని వాడేటప్పుడు కెమరాకి ఉన్న స్ట్రాప్ తప్పనిసరిగా చేతికి తోడిగించుకోన్నాకనే కేమరానే వాడటం మొదలెట్టాలి. లేకపోతే ఆ కెమరా పాడయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. చాలామంది ఆ స్ట్రాప్ వేసుకోకుండానే ఫోటోలు తీస్తుంటారు.

కెమరా లోని ఆప్షన్లు అన్నీ బాగా తెలుసుకోండి. కేమరాతో వచ్చే బుక్-లెట్ చదవండి. అవసరమైతే మిత్రుల సహాయం తీసుకోండి. ఇంకా కావాలంటే నెట్లో వెదకండి.

ఫోటో తీయటానికి బటన్ ని నొక్కుతామే.. అలా పూర్తిగా నొక్కక సగం మాత్రమే నొక్కితే చాలా లాభాలు ఉన్నాయి.
  1. సగం మాత్రమే నొక్కగానే AF బీం అనే ఎర్రని లేజర్ కాంతి ఫోటో తీసే వస్తువు మీద పడుతుంది. అది పడ్డ చోటు ఆ ఫోటోకి సెంటర్ ప్లేస్ అని భావించాలి.
  2. అలా రావటానికి కెమరా సెట్టింగులలో ఆ AF బీం ఆన్ లో పెట్టుకోవాలి.
  3. అలా ఆ బీం లైట్ రాగానే ఫోటో దిగేవారికి ఒక ఇండికేషన్ గా ఉండి, స్టడీగా ఉండటానికి ఉపయోగపడుతుంది.
  4. అంతలోగా ఆ కేమరాలోని చిన్ని మోటారు లెన్స్ ని అడ్జస్ట్ చేస్తుంది. అంటే స్పష్టముగా ఫోటో రావటానికి లెన్స్ ని సిద్ధం చేస్తుందన్న మాట!
  5. అప్పుడు ఆ నాబ్ ని పూర్తిగా నొక్కాలి. అలా నొక్కి వెంటనే - అంటే టైపు కీ నొక్కినట్లుగా కాకుండా, ఒకటి, రెండు సెకనులు ఉండేలా నొక్కి ఉంచాలి. దాని వల్ల కెమరా షేక్ కాదు. ఫోటోలూ బాగుంటాయి. ఈ టెక్నిక్ ఎక్కువగా  రీల్  కేమరాలకి  తప్పనిసరి.  డిజిటల్ కెమరాలకీ కూడా వాడాలి.

మెమొరీ కార్డులు మరీ ఎక్కువ సామర్థ్యం లోనివి అంటే 8GB, 16GB లాంటి కార్డులు వాడకండి. ఇవి చాలా ధర. అలాగే సగం అయ్యాక - ఫోటో తీస్తుంటే సేవ్ అవటానికి సమయం బాగా తీసుకుంటుంది. ముఖ్యముగా మల్టీ షాట్స్ తీస్తుంటే అప్పడు ఈ ప్రాబ్లెం బాగా ఫేస్ చెయ్యాల్సివస్తుంది. మామూలుగా 4GB సరిపోతుంది. 2GB కూడా ఫరవాలేదు.

మెమొరీ కార్డు ఫోటోలతో ఫుల్ అవగానే దాన్ని లాక్ చేసెయ్యండి. ఇదిగో ఇలా... పసుపు వర్ణములో బాణం గుర్తు చూపానే అక్కడ ఉన్న చిన్న నాబ్ ని గోటితో క్రిందకి అనండి. అలాగే లాక్ లో ఉంచి ప్లే చేసుకోవచ్చు. డెలీట్ మాత్రం చెయ్యరాదు.  అంటే పొరబాటుగా ఎవరూ తీసేయ్యరు అన్నమాట. మళ్ళీ ఆ లాక్ ని పైకి జరిపేదాకా ఇక అందులోని డాటాని డిలీట్ గానీ, ఎడిట్ గానీ చేయలేము. ఇది బాగుంది కదూ!. కాని ఈ విషయం చాలా మందికి తెలీదు.





మీరు ఇంకా చాలా ఫొటోస్ దిగగలరు, తీసేవి ఉన్నాయి అనుకుంటే ముందుగానే అదనపు మెమొరీ కార్డులని కొనుగోలు చెయ్యండి. ఇంత పెద్దవి కాకుండా ఇప్పుడు మైక్రో SD కార్డులు అని వస్తున్నాయి. ప్రక్క ఫోటోలో చూడండి. అవి ఆ పెద్ద వాటి పరిమాణములో సగం కన్నా తక్కువ సైజులో ఉంటాయి. వీటి ధర కూడా చాలా తక్కువే. 2GB మెమొరీ కార్డు కేవలం రెండు వందల ఇరవై రూపాయలకి దొరుకుతుంది. ఇవి కొంటే లాభాలు ఏమిటంటే అతి తక్కువ సైజులో బ్యాగులో ఒదిగిపోతాయి. కెమరాలో వాడనప్పుడు వీటిని మొబైల్ ఫోన్ లలో శుభ్రముగా వాడుకోవచ్చును. సిస్టమ్ లోని ఏవైనా ఫైల్ లని ఇందులో తాత్కాలికముగా దాచుకోవచ్చును. "బాగుంది!.. వీటిని ఆ డిజిటల్ కేమరాలలో ఎలా వాడుతారు.." అనుకుంటున్నారా? శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అని ఊరికే అన్నారా! ఆ పెద్దసైజు మెమొరీ కార్డ్ సైజులో "SD కార్డ్ షూ" అని దొరుకుతుంది. (ఇక్కడ క్రింద ఫోటో పెట్టాను చూడండి.) ఇది యే మొబైల్ షాప్ లలో అయినా దొరుకుతుంది. ధర ఇరవై రూపాయల వరకూ ఉంటుంది. దానిలో ఈ చిన్న మెమొరీ కార్డ్ పెట్టి మన పని చేసుకోవచ్చు. అది నిండగానే అది తీసేసి, అందులో ఇంకో మెమొరీ కార్డ్ పెట్టి పని కొనసాగించొచ్చు. ఫోటోలు తీయనివి, ఫోటోలు  తీసినవి అంటూ రెండు చిన్న కవర్లు లలో ఉంచుకుంటే ఇంకా బాగుంటుంది. నేను ఎటైనా టూర్ కి వెళ్ళినప్పుడు ఇలా నాలుగైదు మెమొరీ కార్డులతో వెళతాను.

టూర్ కి వెళ్ళినప్పుడు మొదటగా గుర్తుంచుకోవాలసింది ఏమిటంటే - అన్నీ నచ్చినవి ఫోటో తీస్తూ పోవటమే! ఇంటికి తిరిగి వచ్చాక అవి ఉంచటమా, డెలీట్ చేసేయ్యటమా అనేది తీరుబాటుగా డిసైడ్ చేసుకోవచ్చు. ఒక స్టిల్ తీయలేదని మళ్ళీ టూర్ కి వెళ్ళలేముగా.. అందుకే అన్నీ తీసుకోవాలి. తీరుబడిగా ఎడిట్ చేసుకోవాలి అనేది నా పద్ధతి.  

ఇవీ అంటే ఇన్ని మెమొరీ కార్డులు అయిపోయాయే అనుకుందాము. అప్పుడు దగ్గరలోని మొబైల్ షాప్ కి వెళ్లి అందులో ఒక మెమొరీ కార్డు కొని వాడుకోవటమే!.. ఇక్కడొక గమనిక. ఇలా క్రొత్తగా కొన్నప్పుడు దాన్ని కెమరాలో పెట్టి ఫార్మాట్ (ఈ ఆప్షన్ అన్ని కెమరాలలో ఉంటుంది) చెయ్యాలి ఇలా ఎందుకు అంటే అందులో ఏమైనా వైరస్ ప్రోగ్రామ్స్ ఉంటే మనం తీసిన ఫొటోస్ కి పట్టి, ఉన్న ఫొటోస్ అన్నీ గోవిందా.. గోవిందా.. అందుకే ఫార్మాట్ తప్పక చెయ్యాలి అనేది. ఈ ఫార్మాట్ కేవలం ఐదారు సెకనుల్లో అయిపోతుంది. అంతే!

కొంతమంది మధ్యలో కనపడిన బోర్డులని చదువుతూ ఉంటారు. అందులో కావలసినది ఎంచుకొని వెంటనే ముందుకు వెళ్ళరు. అలా చదువుతూ ఉండే బదులు ఆ బోర్డుని ఫోటో తీసుకుంటే, దారిలో జూమ్ చేసుకొని చదువుకోవచ్చు. సమయం వృధా కాదు. అలాంటి ఒక ఫోటో చూపిస్తాను. అది నిజమని మీరే ఒప్పుకుంటారు. ఈ క్రింది ఫోటోలో ఒక ఆలయములో ఎన్ని దేవతా విగ్రహాలు ఉన్నాయో చెప్పారు. అవన్నీ చదివి గుర్తుపెట్టుకోలేముగా.. ఇలా ఒక ఫోటో తీసుకున్నామే అనుకోండి. జూమ్ చేసుకొని, ఒక్కొక్కటే చూసి, ఎక్కడికి వెళ్ళాలో త్వరగా నిర్ణయించుకోవచ్చు. కావాలంటే మీరు ఇప్పుడు ఈ క్రింది ఫోటో మీద రెండుసార్లు క్లిక్ చెయ్యండి. నేను చెప్పిన పాయింటు మీకు త్వరగా అర్థం అవుతుంది.

ఒకరే - అందముగా దిగాలనుకుంటున్నారా? అయితే.. కేమరాలోని మల్టీ షాట్స్ ఆప్షన్ ని ఎన్నుకోండి. అప్పుడు క్రొత్త మెమొరీ కార్డ్ వేసుకోండి. తొందరగా సేవ్ అవుతుంది. లైటింగ్ బాగుంటే మీ పని చాలా సులువుగా ఉంటుంది. అలా తీసిన షాట్ల నుండి నచ్చినవి ఉంచుకొని మిగతావి డిలీట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ వల్ల చాలా అందమైన ఫొటోస్ తీయవచ్చు.

చివరిగా ఫోటోలని సిస్టం కి ఎక్కించి, ఆ ఫోటోలని ఫోటో ఎడిటర్ల సహాయముతో అందముగా అంటే కలరూ, బ్రైట్, సైజూ, క్రాప్, డార్క్, ఇలాంటివి అన్నమాట - మార్చాలి. అప్పుడు ఇంకా బాగా కనిపిస్తాయి. ఇందుకు ఎన్నోసాఫ్త్వేర్స్ ఉచితముగా లభిస్తాయి. ఇంకొన్నింటిలో ఆన్లైన్లో వెళ్లి అక్కడే ఎడిట్ చేస్కొని ఫోటోలని డౌన్లోడ్ చేసుకోవాలి. అలా వచ్చిన వాటికి రినెమ్ (Rename) ద్వారా సీరియల్ నంబర్స్ వేసుకొని.. ఒక క్రమ పద్ధతిలో పెట్టుకోవచ్చు. ఆ ఫోటో ప్రాపర్టీస్ కి వెళ్లి ఆ ఫోటో గురించి డిటైల్స్ వ్రాసుకోవాలి. అంతా అయ్యాక అన్ని ఫొటోస్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి అందులో Read Only ఆప్షన్ ని ఎంచుకుంటే సరి. ఇక శాశ్వతముగా మధురానుభూతులు మిగిలిపోతాయి.

ఇంకా చెప్పొచ్చు.. కాని నేను PHD చేయటం లేదుగా.. ఓకే.  

Monday, July 19, 2010

ఫోటోల యాంగిల్ ని సరిచేయ్యటం

చాలామంది సోషల్ వర్కింగ్ సైట్లలో గానీ, ఈ మెయిల్లో ఎవరికైనా పంపేటప్పుడు గానీ, లేదా వారి ఆల్బం లలో గానీ ఫొటోస్ అడ్డదిడ్డముగా అప్లోడ్ చేస్తారు. అంటే మామూలుగా చూడాల్సిన ఫోటోలని మనం మెడలు వంచి చూసేలా చేస్తారు. అలా ఎందుకు పోస్ట్ చేశారూ అంటే.. నాకు తెలీదనో, నాకు ఆ ఫోటోలని సరి చెయ్యాలో తెలీదు అనో కారణం చెబుతారు. అంతే కాని ఆ లోపాన్ని ఎలా సరిచేయ్యాలో తెలుసుకోరు. అలాగే కొనసాగిస్తారు. అలాగే అప్లోడ్ చేస్తుంటారు.

నిజానికి ఇది చిన్న విషయం. ఎంత చిన్నది అంటే ఓస్! ఇంతేనా.. అనుకునేలా ఉంటుంది. ఇప్పుడు మీకు చెప్పేదిచూసాక ఓస్! ఇంతేనా.. అనుకుంటారు. మీది విండోస్ XP కదా.. అయితే ఓకే!

ఇపుడు మీ ఆల్బంలో ఒక ఫోటో 90 డిగ్రీలలో తిరిగి ఉన్నదని అనుకుందాము. అంటే ఇలా క్రింది ఫోల్డర్ లో ఉన్న ఫోటోలో మాదిరిగా అన్నమాట! ఈ ఫోటోని చూడాలి అనుకుంటే మనం మెడ ఎడమకో, కుడికో వంచి ఆ ఫోటోని చూస్తాము కదూ..

చాలామంది ఇలాగే ఫొటోస్ ఉంచేసి, తమ అవసరాల మేరకు అలాగే ...అప్లోడ్ చేస్తూ ఉంటారు. చూసేవారిది వారి బాధ.. అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు అ ఫోటో ని యే సాఫ్ట్వేర్ అవసరం లేకుండా ఎలా సరి చెయ్యాలో ఇప్పుడు పద్దతులు చెబుతాను. ఫాలో అయిపోండి.

1. మీది విండోస్ XP అయితే ముందుగా ఆ ఫోటో మీద right click చెయ్యండి.
2. అలా నొక్కగా వచ్చే మెనూ బాక్స్ లో Open with ని ఎంచుకోండి.
3. దాని మీద నొక్కగా వచ్చే మరో చిన్న మెనూలో Windows Picture and Fax Viewer అని ఉంటుంది. దాన్ని ఎంచుకోండి. ఈ ఆప్షన్ అన్ని XP లలో ఉంటుంది.

చేశారు కదూ!.. ఇప్పుడు మీకు ఇలా ఒక ప్రోగ్రాం ఓపెన్ అవుతుంది. అది ఇలా, క్రింది దాని మాదిరిగా ఉంటుంది.

4. ఇక్కడ మీరు ఈ ఫోటోలో అడుగు భాగాన, ఎర్రని వృత్తములో చూపినట్లు  అక్కడ మీకు రెండు బటన్లు కనిపిస్తాయి. అందులో మొదటిది - సవ్య దిశనూ (Clock wise), ఇంకోటి అపసవ్య దిశనూ (Anti clock wise) చూపిస్తున్నాయి.

ఈ రెండు బటన్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని, నొక్కుతూ ఉంటే మన ఫోటో సరియైన దిశలో మారుతుంది.  అంటే క్రింది ఫోటో లాగా మారుతుంది. ఇప్పుడు మనం ఆ ఫోటోని మెడలు వంచకుండానే చూడొచ్చు.

ఇలాగ సరియైన స్థితికి వచ్చేదాకా నొక్కాక, ఇప్పుడు 5 నంబర్ ఉన్న క్లోజ్ బటన్ వద్ద నొక్కితే, ఆ ప్రోగ్రాం ముగిసిపోతుంది.

ఇప్పుడు ఆ ఫోటో మీ ఆల్బం లో ఇలా కనపడుతుంది.

చాలా తేలికగా ఉంది కదూ.. నిజం చెప్పాలంటే ఇది నా ముందు టపాలో చెప్పినట్లు స్వంతముగా నేర్చుకున్నదే! ఇంతకన్నా తక్కువ లోనే పని కావాలి అనే వారికోసం ఇంకో పద్దతీ ఉంది. అది ఇంకా చాలా సింపుల్. తిరిగి ఉన్న ఫోటో మీద రైట్ క్లిక్ చేశారుగా. అప్పుడు ఒక మెనూ వస్తుందని చెప్పానుగా.. అందులో ఈ క్రింద ఫోటోలో ఎర్రరంగు వృత్తములో చూపినట్లుగా అక్కడ ఏదో ఒకటి ఎన్నుకొని, సరియైన యాంగిల్ వచ్చే వరకూ నొక్కుకుంటూ వెళ్ళటమే. ఇది చాలా ఇంకా ఈజీగా ఉంది కదూ.

వావ్! బాగుంది కదూ.. ఇంకేం! మీ ఫొటోస్ అన్నీ సరిచేయ్యటం మొదలెట్టేయండి.


Sunday, July 18, 2010

మొదటిసారిగా సైకిల్ పంక్చర్

ఇది నా ఇంటర్మీడియట్ చదువులో ఉన్నప్పుడు జరిగింది. ఈ సంఘటన చెప్పే ముందు కొంత వివరణ ఇస్తాను. ఈ మధ్య చాలామంది తల్లి తండ్రులు తమ పిల్లలకి బాగా స్వేచ్చనిస్తూ, అతి గారాబముగా పెంచుతూ, వారి శారీరక మానసిక ఎదుగుదలని ఆదిలోనే బుగ్గిపాలు చేస్తున్నారు. ఎంతసేపూ ఆ ర్యాంకుల గొడవే! వేరే యే విషయమూ తెలీకపోవటం విచారకరం. అన్ని విషయాల్లో చాలా జోక్యం చేసున్తున్నారు. దానివలన ఆ పిల్లలు తామేదో ఆకాశము నుండి ఊడి పడ్డవారముగా భావించుకుంటున్నారు. మనిషి అన్నాక అన్ని పనులూ అంతో ఇంతో చెయ్యాలని నా అభిప్రాయం. పెద్ద పెద్ద పనుల నుండి చిన్న చిన్న పనుల వరకూ కొద్దో, గొప్పో తెలిసుకునే ఉండాలి.

ఇంటర్లో నేను కాలేజీకి పోవటానికి ఒక సైకిల్ ఉండేడిది. ఒకరోజు ప్రొద్దున లేచి చూసేసరికి ముందు టైర్ పంక్చర్.. ఏమి చెయ్యాలో తెలీదు. ఆ రోజు ఏదో బంద్. అన్ని దుఖానాలూ బంద్. ఏమి చేద్దాం! పదకొండు గంటలకి క్రికెట్ ఆడటానికి రమ్మన్నారు ఫ్రెండ్స్. అదీ ఊరవతల. ఎలా వెళ్ళాలో తెలీదు. నేను లేకపోతే ఆట మొదలవదు. వెళ్దామంటే ఈ సైకిలేమో ఇలా. "నేనేమి సేతురా లింగా.." అని పాడుకోవాల్సిందే!..

ఇలా కాదనుకొని మొఖం కడిగి, టీ త్రాగి సైకిల్ రిపైర్ షాపుల వెంట తిరిగా.. అన్నీ బంద్!.. ఇక లాభం లేదని అనుకుంటుండగా సైకిల్ సామానులు అమ్మే దుఖానం ఒకటి కొద్దిగా ఓపెన్ ఉంటే అందులో కాస్త ట్యూబ్ రబ్బరూ, ఎరుపూ, పసుపు రంగుల్లో ఉండే డన్లప్ కంపనీ వారి రబ్బర్ సులీషణ్ (అందరూ దాన్ని అలాగే అంటారు. నిజానికి దాన్ని ఫిలిం సొల్యూషన్ అని పిలవాలి.) వాటిని ఇరవది ఐదు పైసలకి కొనుక్కొని (నిజమే! అప్పట్లో చాలా ధర అది.) ఇంటికి వచ్చాను.

అప్పుడు సమయం ఉదయం ఏడున్నర అయ్యింది. మెల్లగా నా పని మొదలెట్టాను. సైకిల్ షాపువాడు ఎలా పంక్చర్ చేస్తాడో ఒకసారి గుర్తు చేసుకున్నాను. అలా చెయ్యాలని మొదలెట్టాను.

రెండు స్క్రూ డ్రైవర్ల సహాయాముతో ముందు టైరు విప్పాను. అలాగే లోపలి ట్యూబూ విప్పాను. ఈ రెండూవిప్పేసరికి గంటన్నర పట్టింది. అప్పటికే తొమ్మిదిన్నర అయ్యింది. మొదటిసారిగా చేస్తే ఎన్ని చిక్కులో, ఎంత సమయం వృధానో! అయినా ఆరోజు ఖాళీనే కాబట్టి అలా చేస్తూనే పోయాను.

ట్యూబు పంక్చర్ చూడాలంటే అందులో గాలి నింపాలి. ఎలానింపాలి?. నా దగ్గర గాలి నింపే పంపు కూడా లేదు. మా నాన్నగారి వద్ద పనిచేసే కుర్రాడు ఒకడు వచ్చి ఆ ట్యూబ్ వాల్వ్ విప్పి, అందులోకి నోటితో గాలిని నింపి, ఆ ట్యూబు అడుగు భాగముతో వాల్వ్ భాగాన నొక్కి వాల్వ్ బిగించాడు. ఇలా కూడా సైకిల్ ట్యూబ్ లోకి  నోటితో గాలిని నింపి, పంక్చర్ చెక్ చెయ్యొచ్చు అని ఆరోజు తెలుసుకున్నాను. అంతలోనే ఇది మా నాన్న గారు చూసారు. ఆ పని కుర్రాడని పిలిచారు. ఏదో పని చెప్పి నా నుండి దూరముగా ఉంచారు. నన్ను మాత్రం ఏమీ అనలేదు. నన్ను "ఆ అడ్డమైన పని ఎందుకు చేస్తున్నావు.. అది చేసుకొనే బ్రతుకుతావా.." లాంటి తిట్లు ఏమాత్రం తిట్టకుండా దూరము నుండి నన్ను గమనిస్తూ ఉండిపోయారు. (అలా ఎందుకు చేశారో ఆ తరవాత అర్థం చేసుకున్నాను. అది చివరలో చెబుతాను.)

హమ్మయ్య! ట్యూబులో గాలి కొద్దిగా ఉంది. పంక్చర్ ఎక్కడ అయ్యిందో ఇక చూడాలి అనుకొని ఒక బకెట్ నీటిని తెచ్చి, అందులో ట్యూబుని చెక్ చేశాను. ఒక దగ్గర చిన్న చిన్న బుడగలు రావటం మొదలెట్టాయి. ఓహొ! ఇక్కడేనా రంధ్రం పడింది అనుకొని అక్కడ గుర్తుగా ఒక అగ్గిపుల్లని గుచ్చి, (పంక్చర్ వారు అలాగే గుచ్చుతారు) ఆ ట్యూబులోని గాలిని విప్పేశాను. రోగాన్ని కనిపెట్టాను.. ఇక వైద్యం మాత్రమే మిగిలింది. ఇదే అసలు కథ జరిగింది.

ముందుగా ట్యూబు లో గుచ్చిన పుల్లను తీసేసాను. అక్కడ ఇప్పుడు గరకు పేపరుతో రుద్దాలి. బాగానే ఉంది.. మరి ఇప్పుడు ఆ గరకు పేపరు ఏదీ? అది మరిచాను. మళ్ళీ ఆ షాప్ కి వెళ్లాను. షాప్ బంద్. ఏమి చెయ్యాలి. అన్నీ ఉంది ఆ ఒక్క కారణం వద్ద చేయబోయే పని ఆపేయబుద్ది కాలేదు. ఏం చేద్దాం.?

అంతలో నా బుర్రకి (? నిజానికి బుర్రనేనా? అందులో ఏమైనా ఉందా?) ఒక ఆలోచన తట్టింది. ఇంటి బయట క్రొత్తగా కట్టిన గోడ ఉంది. పైగా దానికి స్పాంజ్ ఫినిష్ చేశారు. ఉప్పు కాగితముగా ఉంటుంది. ఇంకేం ఆ సైకిల్ ని ఆ గోడ వద్ద వరకూ లాక్కొచ్చాను. ఆ పంక్చర్ అయిన భాగాన్ని ఆ గోడకి రుద్దాను. సూపర్ గా పని చేసుంది. కాసింత రబ్బరు ముక్క కత్తిరించాను. దాన్నీ అలాగే ఆ గోడకేసి రుద్దాను. ఇప్పుడు అతకడానికి అంతా సిద్ధం.

ఇప్పుడు ఆ పాచ్ కీ, అలాగే పంక్చర్ చేసే ప్రాంతానికి ఆ రబ్బర్ సొల్యూషన్ పూసి అతికాను. కొద్దిగా గాలి నింపి,నీటిలో చెక్ చేశాను. ఊహు! లాభం లేదు. గాలి లీక్. మళ్ళీ అ పాచ్ ఊడదీసి మళ్లీ గోడకి రుద్ది, సొల్యూషన్ పూసి మళ్ళీ అతికాను.. ఊహు! లాభం లేదు.. మళ్ళీ లీక్. ఇలా చాలా చాలా సార్లు చేశాను. ఊహు. అప్పటికి పదకొండున్నర అయ్యింది.

మధ్యలో మా నాన్న వద్ద ఉండే కుర్రవాడు చాలాసార్లు చెప్పాలని ట్రై చేశాడు కాని.. మా నాన్నగారు అతడిని గమనిస్తూ, నా వద్దకి రానీయకుండా చేశారు. ఎన్నిసార్లు జాగ్రత్తగా అతికినా ఒకదగ్గర లీక్. ఏమి చెయ్యాలో తెలీదు. అలాగే చేస్తూ ఉండగా మధ్యాహ్నం పన్నెండున్నరకి సొల్యూషన్ ట్యూబూ అయిపోయింది. కాని నా సైకిల్ పంక్చర్ పూర్తి కాలేదు.

ఇక లాభం లేదని అప్పుడు ఒక షాప్ ఓపెన్ చేస్తే, వాడి వద్దకి వెళ్లి పంక్చర్ అయ్యింది చెప్పాను. అతను చేశాడు. ఈ పాచ్ ఎవరు అతికారు అని అడిగితే "ఇంతకు ముందే బస్టాండ్ వద్ద చేయించాను. ఎవరో పిల్లాడు ఉన్నాడు. నాకు ఎలా చెయ్యాలో తెలీదు అంటే చేస్తుంటే అదే వస్తుంది. అర్జెంట్ అని అతడితో చేయించాను.అతడు ఈ బంద్ గొడవలో సరిగా అతకకపోవచ్చు. అలా కవరింగ్ ఇచ్చాను. వాడి అడ్రెస్ ఏమిటో అని ఆరాలు తీస్తే - ఏదేదో చెప్పాను. ఇతడు ఎలా అతుకుతాడో జాగ్రత్తగా చూసాను.

ఇతడు చేసిన దానికీ, నేను చేసిన దానికీ తేడా ఏమీ లేదు కాకపోతే సొల్యూషన్ పూసాక బాగా ఆరనివ్వాలి. ఆరిపోయాకే అతకాలి అప్పుడే బాగా అతుక్కుంటు౦ది. ఈ చిన్న విషయం తెలీక చాలాసార్లు కష్టపడ్డాను. లాభం లేక పోయింది. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ కనిపెట్టేముందు వేయి సార్లకి పైగా ఫెయిల్ అయ్యాడట అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను.

ఇక అసలు విషయం - మా నాన్నగారు అలా ఎందుకు ఉండిపోయారో తను నాకు చెప్పలేదు గాని, వేరేవారితో అన్నారుట! వాడంతట వాడుగా నేర్చుకోనీ!..
నిజమే! ఆ రోజు తను అలా అలవాటు చేసారు కాబట్టే!.. ఇప్పుడు నాకు తెలీదని వదిలేయటం లేదు. అన్నీ నా అంతట నేను తెలుసుకుంటూనే ఉన్నాను. అలా ఎంతో సాధించాను. ఆరోజు నా ఏదైనా నేర్చుకోవాలన్న తపన మీద నీళ్ళు కుమ్మరిస్తే ఈ రోజు కి కూడా ఏమీ తెలీనివాడినై ఉండిపోయేవాడిని.

Saturday, July 17, 2010

Floor Design 2


Floor Design 1


Emisethuraa lingaa - Thatvam

చిత్రం : (ఏమీ లేదు - ఇది ఒక తత్వం - అంతే.)
సంగీతం : డా|| బాలమురళీకృష్ణ
గానం: డా|| బాలమురళీకృష్ణ
తాళం : రూపక
రాగం : హుసేని
****************
పల్లవి :
ఏమిసేతురా లింగా ఏమిసేతురా

చరణం 1 :
గంగ ఉదకము తెచ్చి నీకు - లింగపూజలు సేదమంటే
గంగనున్న చేప కప్ప - ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా! మహదేవశంభో! - మా లింగ మూర్తి   || ఏమి సేతురా ||

చరణం 2:
అక్షయావుల పాడి తెచ్చి - అరిపితము చేదమంటే.. ఒహొ!
అక్షయావుల లేగదూడ - ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా! మహదేవశంభో! - మా లింగ మూర్తి   || ఏమి సేతురా ||

 
చరణం 3:
తుమ్మిపూవులు తెచ్చి - నీకు తుష్టుగా పూజ్జేద్దమంటే - ఒహొ!
కొమ్మకొమ్మకు కోటి తుమ్మెద - ఎంగిలంటున్నాది లింగా
మహానుభావా! మహదేవశంభో! - మా లింగ మూర్తి   || ఏమి సేతురా ||

ఏమి సేతురా లింగా ఏమి సేతురా - ఏమి సేతురా లింగా ఏమి సేతురా
ఏమి సేతురా లింగా ఏమి సేతురా..

Thursday, July 8, 2010

ఒక బ్యాంక్ మేనేజర్ విజయం వెనక..

నాకు తెలిసిన ఒక బ్యాంకు మిత్రుడు మా ఇంటికి దగ్గరలో ఉండేవాడు. చాలా చిన్ని, అందమైన కుటుంబం. అతనూ అతడి భార్య, ఇద్దరు పిల్లలు. చాలా సరదాగా, సంతోషముగా జీవనము గడిపేవాడు. అతనితో పరిచయం కేవలం ఒక సంవత్సరమే.. ఆ సంవత్సరములోనే ఎన్నో మధురానుభూతులు.

ప్రతివారివద్ద నుండి మనం ఎన్నో నేర్చుకునేవి ఉంటాయి. చాలా వరకు అలా చూసి నేర్చుకోము. నాకైతే ఇతడిలో ఒక సుగుణం చాలా నచ్చింది. ఎంతగా అంటే - దీని గురించి ఆలోచిస్తూ.. అలాగే నేనూ ఫాలో అయిపోయాను. ఒకప్పుడు నేను ఒంటరిగా పొందే కొన్ని అలవాట్లు (సినిమాలు, హోటల్, సైట్సీయింగ్.. లాంటివి) ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలసి పంచుకుంటున్నాను. అందులో ఏదో నాకు ఆనందం కనిపిస్తున్నది. అదేమిటో మీకు చెప్పనే లేదు కదూ..

అతను తన ఆఫీసులో ఏదైనా చిన్న పార్టీ జరిగినా, ఎవరైనా పార్టీ ఇచ్చినా.. తాను మాత్రం ఆ పార్టీలో పాల్గొని కమ్మగా, కడుపు నిండా తిని బ్రేవ్ మని అనేవాడు కాదు. ఆ పార్టీ కి ఫుడ్ సమకూర్చే కేటరింగ్ వారికి ఇంకిద్దరికి సరిపడా పార్టీ ఐటమ్స్ ఆర్డరు ఇచ్చి, వాటిని వారు తేగానే, బాంక్ లోని అటెండరు కి కొంత టిప్ ఇచ్చి, ఇంటికి పంపించేవాడు. అంటే తాను అక్కడ తినే ఆ పార్టీ ఫుడ్ తన ఇంట్లో వారితో కూడా (తన డబ్బులతో కొని, పంపి..) వారితో షేర్ చేసుకునేవాడు అన్నమాట. తాను ఏది బయట తింటున్నాడో అదీ తనవారు కూడా తినాలి అనే అతని ఉద్దేశ్యం.

మొదట్లో ఇది విన్నప్పుడు ఇదేదో సుత్తిగా, ఫూలిష్ గా అగుపించింది. ఇదేమి వింత మనస్తత్వం అని. ఆ తరవాత కొద్ది కొద్దిగా అర్థం కాసాగింది. నిజానికి ఇప్పుడు నా మనసులో అతను ఒక గొప్ప హీరో. అతను ఇలా చేసినందుకు అనుకుంటా.. అలాని కూడా కాకపోవచ్చు.. అతను పట్టుదలగా బ్యాంక్ పరీక్షలు వ్రాసి అందులో అతను మేనేజర్ పోస్ట్ సంపాదించాడు. అందులో అతని కష్టమే కాక, వారి కుటుంబ తోడ్పాటూ (అతనికి ఇబ్బంది చేయకుండా, అల్లరి చేయకుండా, కనీసం టీవీ చూడకుండా, వేసవి సెలవులన్నింటినీ ఎక్కడికీ వెళ్ళకుండా - దూరం చేసుకొని అతని ప్రిపరేషన్ లో సాయం చేస్తూ..) ఉంది. కనుకనే తేలికగా పాసయ్యాడు. ఇప్పుడు గొప్ప స్థాయికి చేరుకున్నాడు. ఇలాంటి ఫామిలీ  ఉండటం అతని అదృష్టం అయితే, అలాంటి వ్యక్తి వారికి దొరకటం వారి గొప్ప విషయం.

నిజముగా నేను దగ్గర నుండి చూసిన - విజయవంతమైన మనిషి జీవితం అతనిది.

Saturday, July 3, 2010

బంగ్లాదేశ్ కార్మికులు - ఇటుకలు

మన దగ్గర నాలుగైదు ఇటుకలు తలపైన పెట్టి మోస్తారు.. కాని బంగ్లాదేశ్ కార్మికులు ఇంకా ఎక్కువగా, ఎన్ని ఇటుకలు తలమీద పెట్టుకొని మోస్తారో చూడండి.
(గూగుల్ వాడు న్యూ ఎడిటర్ లో కూడా వీడియో ఆప్షన్ పెట్టాడు. ఇందాకే గమనించాను.)
Related Posts with Thumbnails