Showing posts with label వంటలు. Show all posts
Showing posts with label వంటలు. Show all posts

Friday, August 12, 2011

Potato Roses

ఆలుగడ్డ చిప్స్ తో కరకరలాడే రోజాపూవులు చేసుకొని, అనక చక్కగా తినేసేలా చెయ్యటం ఎలాగో ఇక్కడ చూసి నేర్చుకోండి. అలా చేసి మీ ఇంటికివచ్చిన అతిధులకి వడ్డిస్తే, వారు సంభ్రముతో షాక్ కి గురి కావటం ఖాయం. ఇవి నేను చేసినవి కావు.. బాగా నచ్చేసి మీకు పరిచయం చెయ్యటం. 

ముందుగా మీరు ఆలుగడ్డలని ఇలా సన్నగా కోసుకోవాలి. 


ఇలా సన్నగా పేపర్ లా కోసుకోవాలి.. 


ఇపుడు వాటిని ఇలా చుట్టేసుకోవాలి. 


 వాటి మీదనుండి ఇంకోటి ఇలా మళ్ళీ చుట్టాలి.


ఇలా టూత్ పిక్ ని గుచ్చేసుకోవాలి. అలా చేస్తే నూనె లో వేయించేటప్పుడు విడిపోవు. 


అలా చుట్టేసుకొని, అన్నీ య్యాక కదలకుండా మరిన్ని టూత్ పిక్స్ గుచ్చేసుకోవాలి.


నూనెలో వేయించండి


అప్పుడు ఇలా వస్తాయి. 


ఇలా గార్నిషింగ్ చేసి అతిధులకి పెట్టండి. అలా పెట్టేసేముందు ఆ టూత్ పిక్స్ తీసెయ్యండి. లేకుంటే నోట్లో దిగబడి పోతాయి.. జాగ్రత్త !!


మరికొన్ని అలంకరణలా ఫ్లవర్ వాజ్లో  పెట్టండి. 


లేదా ఇలా వడ్డించండి. 


ఇలా చెయ్యటం నాకు బాగా నచ్చేసింది. మీకూ నచ్చేస్తుందని ఆశిస్తున్నాను.. 

Monday, April 11, 2011

గోధుమ పడి (ఉగాది సాంప్రదాయ స్వీట్)



గోధుమ పడి (ఉగాది సాంప్రదాయ స్వీట్) అనేది ఆంధ్రప్రదేశ్ లోని, ఒక తెలంగాణా ప్రాంతాలలో ఉగాది రోజులలో చేసే సాంప్రదాయకమైన స్వీట్ పదార్ధం. ఇది చాలా బాగుంటుంది. చల్లగా కన్నా, వేడిగా తింటే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఆ రిసీప్ ఎలా చెయ్యాలో మీకు చెబుతాను. 

కావలసిన పదార్థములు ::

గోధుమలు - పావుకిలో

బియ్యం - ఒక కప్పెడు

పంచదార - పావు కిలో

శనిగె పప్పు - సగం కప్పు

ఖాజు - 20  గ్రాములు.

సారా పలుకులు - 20 గ్రాములు

కిస్మిస్ - 20 గ్రాములు

గసాలు - రెండు టేబుల్ స్పూన్స్

ఎండుకొబ్బరి కోరు - రెండు టేబుల్ స్పూన్స్

ఇలాచీ పొడి - కొద్దిగా.

నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్

తయారుచేయు విధానం ::


1. గోధుమలను ముందుగా ఒక నీటి గిన్నెలో వేసుకొని, ఒక గంట సేపు నానపెట్టాలి.

2. ఆ గంట సేపు అయిన తరవాత ఆ నీటిని వంపేసుకోవాలి.

3. ఆ తరవాత ఆ గోధుమలని, రోట్లో వేసుకొని బాగా దంచవలెను.

4. ఆ తరవాత ఆ రోకట్లో ఉన్న గోధుమలని తీసి, చేటలో వేసుకొని పొట్టు చేరుగుకోవాలి. ఈ పొట్టు అసలే ఉండనంతగా దంచుకోవాలి. 

5. ఆ తరవాత స్టవ్ మీద ఒక గిన్నెలో నీరు వేడి చేసి, అందులో ఈ గోధుమలని వేసి, బాగా ఉడికించాలి.

6. సగం ఉడికాక అందులో బియ్యం, శనిగె పప్పు వెయ్యాలి.

7. బాగా ఉడికాక, పంచదార వెయ్యాలి.

8. అందులోని నీరు ఆవిరి అయ్యి, ఆ పదార్ధం అంతా దగ్గరికి అయ్యాక నెయ్యిని అందులో పోసుకోవాలి.

9. ఇలాచీ పొడి, గసాలు, సారాపలుకులు, కిస్మిస్, ఎండుకొబ్బరి పొడి అందులో వేసి, బాగా కలియత్రిప్పి, దింపుకోవాలి.

10. అందమైన పాత్రలలో లోకి వంపేసి, ఖాజులతో గార్నిషింగ్ చేసుకోవాలి.

సూచనలు :

ఈ స్వీట్ రెండురోజుల వరకూ చాలా బాగుంటుంది. చల్లగా అనిపించినవారు కాస్త పాలని బాగా వేడి చేసి, ఇందులో కలుపుకుంటే చాలా బాగుంటుంది. మైక్రోవేవ్ ఉన్నవారు పాలు పోసుకొని, ముప్పై సెకనులు వేడి చేస్తే సరి. చాలా కమ్మని రుచిగా ఉంటుంది.

Tuesday, October 5, 2010

క్యాబేజీ పచ్చడి.



కావలసిన పదార్థములు :


క్యాబేజీ = పావు కిలో.
అల్లం + వెల్లుల్లి పేస్ట్ = అవసరం అయినంత
అవాలపొడి = రెండు టీ స్పూన్స్
జిలకర + మెంతుల పొడి = ఒక టీ స్పూన్
పసుపు = సరిపడా
నూనె = సరిపడా
వెల్లుల్లి రెబ్బలు (నుజ్జు నుజ్జుగా దంచినవి) = ఒక మొత్తం వెల్లుల్లిపాయ.
ఉప్పు = సరిపడా
ఆవాలు + జిలకరా = పోపుకి సరిపడా.
నిమ్మకాయలు = నాలుగు

తయారు చేయు విధానం :
1. క్యాబేజీని చాలా సన్నగా తరుముకోవాలి.

2. ఒక గిన్నెలో కారమూ, ఉప్పూ, అవాలపోడీ, జిలకర మెంతుల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసికొని, అందులో చిటికెడు పసుపు వేసుకోవాలి.

3. ఇప్పుడు వాటిని బాగా కలియ త్రిప్పాలి. తరవాత ప్రక్కన పెట్టుకోండి.

4. తిరగమోతగా - స్టవ్ ముట్టించి కొద్దిగా నూనె + ఆవాలు + జిలకర + దంచిన వెల్లుల్లి + కొంచం పసుపు కలుపుకొని, స్టవ్ ఆపేసి దించుకొని, అందులో ఈ పోపుని కలియ త్రిప్పిన గిన్నెలో వంపుకోవాలి.

5. గిన్నెలో క్యాబేజీ తురుము + పొపూ కలిపాక కొద్దిగా చల్లారిన తరవాత నిమ్మకాయ రసం పోసెయ్యాలి.

- ఇంక అంతే - వాడుకోవటానికి సిద్ధం.

* ఇది ఎక్కువ రోజులు నిలవ ఉండదు. ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఉప్పూ, కారం సరిపడా వేసుకోవాలి..

Sunday, July 26, 2009

నేను చేసిన చికెన్ వంటకం

నేను అప్పుడప్పుడూ సరదాకోసమనీ, రొటీన్ కి భిన్నముగా, కొద్దిగా మూడ్ మార్పు కోసమనీ వంటలు చేస్తుంటాను. నేను వంటలలో అంత ప్రావీన్యుడిని కాను గాని ఎప్పుడైనా అవసరం ఉంటుందేమోనని ఈ వంట నేర్చుకున్నాను.. "మడిసన్నాక కాస్త కలాపోసన ఉండాలని" అన్నట్లు ఈ రంగములో కూడా కొద్దిగా తెలిసుండాలని సరదాగా నేర్చుకున్నాను.. ఇప్పుడు ఆ వంటకం ఎలా చెయ్యాలో ఫోటోల సహాయముతో మీకు వివరిస్తాను.. మీరూ నేర్చుకొండే!.. కమాన్!.. మీరూ రెడీ కదూ.. 

ఇప్పుడు ముందుగా చికెన్ ముక్కలను నీటితో శుభ్రముగా కడుక్కోవాలి.. పెద్ద ముక్కలకి కాస్త లోతుగా గాట్లు పెట్టుకోవాలి. ఇలా చేస్తే గ్రేవీ ఆ సందుల గుండా లోపలి వెళ్ళుతుంది. తినేటప్పుడు కాస్త ఎక్కువ రుచిగా ఉంటుంది కూడా..


పసుపూ, కారం, అల్లం-వెల్లుల్లి పేస్టూ, ఉప్పూ, కొంత వెనిగరూ.. కలపాలి.. ఇలా చేసి ప్రక్కన పెడితే అవన్నీ ముక్కలకి బాగా పట్టుకుంటుంది.


వాటిని బాగా కలియదిప్పి పక్కన ఉంచుకోవాలి.. అవన్నీ ముక్కలకి బాగా పట్టుకోవటానికి అలా కాసేపు వదిలెయ్యాలి..



అలా మారినేట్ అయ్యేలోగా - ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పూదినా పక్కన పెట్టుకోవాలి. పచ్చి మిరపకాయలను నిలువుగా కోసుకోవాలి. అలాగే ఉల్లిపాయలనూ సన్నగా తరుముకోవాలి.


ఇలా అన్నీ సిద్దముగా ఒక ప్లేట్ లో రెడీ గా పెట్టుకోవాలి..


ఇప్పుడు స్టౌ వెలిగించి.. పాన్లో నూనె వేడిచేసుకోవాలి.. మంచి రుచి రావటానికి, రిఫైండ్ పల్లి (వేరుసెనగ) నూనె వాడండి. కర్రీ బాగా రుచిగా ఉంటుంది. కాని ఆ నూనె లో కొవ్వు పదార్థాలు ఎక్కువ. కనుక బాగా రుచిగా వండాలి అంటేనే ఆ వేరుసెనగ నూనె వాడండి.



నూనె వేడయ్యాక, అందులోకి పచ్చి మిర్చి వేపుకోవాలి..



ఆ తరవాత ఉల్లిపాయలనీ వేసి, కలియత్రిప్పాలి..



..కరివేపాకూ, కొత్తిమీర, పూదినా వేసుకొని వేపుకోవాలి.. పూదీన కాస్త ఎక్కువగా వేసుకోవాలి.



అవన్నీ కాస్త రంగు మారాక, అప్పుడు అందులోకి - ముందే సిద్దముగా ఉంచుకున్న చికెన్ పేస్టు ముక్కలను పాన్లోకి వంపుకోవాలి..


..కొద్దిగా సోయాసాస్ పోయాలి..



..కొద్దిగా వెనిగరూ కలుపుకోవాలి (ముక్కలు పులుపుగా మెత్తగా ఉడికేందుకై )..


అలాగే కాస్త ఘాటుగా ఉండాలి అంటే - పచ్చి మిర్చి పేస్ట్, దాల్చిన పొడి, లవంగాల పొడి, దంచిన అల్లం ముక్క, ధనియాల పొడి.. వేసుకోవాలి. కొద్దిసేపు (ముక్కలు మెత్తగా అయ్యేవరకూ) మూత పెట్టాలి.. నీరు అసలే పోయవద్దు. చికెన్ లోనుండి వచ్చే రసాలు చాలానే ఉంటుంది. అది సరిపోతుంది.



కొద్దిగా ఉప్పును కలుపుకోవాలి.. కొద్దిగా అల్లము పేస్టు కలపాలి.



ఎండుకొబ్బరిని పొడిగా చేసుకొని, ఇలా వేసుకోవాలి.. అలాగే కాసింత గసాలు మెత్తగా నూరి, ఇందులోకి కలుపుకోవాలి.



తరవాత కొంచెం కారం, చికెన్ మసాలా.. వేసి బాగా కలుపుకోవాలి.



చివరిగా గార్నిషింగ్ కోసం కొద్దిగా కొత్తిమీర, పూదిన, నిమ్మరసం.. వేసుకోవాలి. ఇదిగో.. నోరూరించే చికెన్ వంటకము రెడీ..


బావుందా.. మీరు చేసారా - ఇలా!. ఈ వంటకం మీకు నచ్చిందా..?

updated on 27-July-2008
Related Posts with Thumbnails