Showing posts with label Home tips. Show all posts
Showing posts with label Home tips. Show all posts

Friday, January 18, 2019

LED Tube lights

https://achampetraj.blogspot.com/2019/01/electronic-choke-tube-lights.html తరువాయి భాగం 

LED ట్యూబ్ లైట్స్ - ఇప్పుడు ఎక్కువ చోట్ల వాడటం మొదలయ్యింది. ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్స్ తరవాత వచ్చిన చక్కని విద్యుత్ కాంతి దీపాలు. మొదట్లో ఇవి పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ షాప్స్ లలో  లేదా ఆన్లైన్ అంగళ్ళలో మాత్రమే లభించేవి. అప్పట్లోనే ఒక ట్యూబ్ లైట్ తెచ్చాను. వాటి ధర బయట వేయి రూపాయలుగా, ఆన్లైన్ లో ఏడువందల యాభై చిల్లరలో దొరికేవి.

అప్పట్లో వాటి గురించి అంతగా అవగాహన లేదు.. ఏమిటి ? ఎలా ? ఎందుకు? అనేలా. వాడితే బాగుంటాయేమో అనుకొని వాడా.. కానీ అప్పట్లో టెక్నాలజీ ఇప్పట్లో ఉన్నంత అభివృద్ధిలో లేదు. ఆ LED ట్యూబ్ లైట్ నుండి వచ్చే కాంతి - మామూలు ట్యూబ్ లైట్ కాంతి అంతగా కూడా లేదు. ఒక సెట్ లో రెండు LED ట్యూబ్ లైట్స్ వచ్చేవి. ఆ రెండూ వాడితే ఒక మామూలు ట్యూబ్ లైట్ వెలుతురు అన్నంతగా ఉండేది. అప్పట్లో వాటి గురించి అంతగా టెక్నికల్ గా ఎదగలేదు. ఇప్పుడు చాలా కొద్దిగా తెలుసుకున్నాను. అవి మీకేమైనా ఉపయోగపడతాయని ఇప్పుడు చెప్పడం.

 ధర  :   : మొదట్లో బాగా ఎక్కువ ధరలో ఇవి మార్కెట్లలోకి వచ్చినా ఇప్పుడు చాలా అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. రెండు వందల నుండి మూడు వందల యాభై రూపాయల్లో దొరుకుతున్నాయి. వీటి వల్ల మామూలు ట్యూబ్ లైట్స్ సెట్స్ ధరలు బాగా పడిపోయి, వందా యాభై లలో దొరుకుతున్నాయి. ఒకవేళ మీ మామూలు / ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్ పాడయితే - ఇదే మంచి తరుణం అనుకోని వెంటనే ఆ ట్యూబ్ సెట్ ని మార్చేసి, ఈ LED ట్యూబ్ కి మారిపోవడం చాలా మంచి పని చెప్పవచ్చు. నేనైతే అంత సమయం తీసుకోలేదు.. దాదాపు పది ట్యూబ్ లైట్స్ ని తీసేసి, కొంత సమయం తీసుకొని, ఎంచక్కా ఈ LED మారిపోయా.. అంతగా టెంప్ట్ అయ్యా..

ఇక్కడ ఒక చిన్న షాపింగ్ చిట్కా చెప్పబోతున్నా - అన్ని ట్యూబ్ సెట్స్ ఒకేసారి తీసుకొనే బదులు - కొంతకాలం అంతరం ఇస్తూ - అప్పుడొకటి, ఇప్పుడొకటి అనేలా కొంటే - తక్కువ ధరా, ఎక్కువ మన్నిక ఉన్నదీ, ఎక్కువ వెలుతురు ఉన్నదీ, మరింత అనుకూలమైన ఆకారంలో, అందమైన రూపం లో ఉన్నదీ.. దొరుకుతుంది. ఇలా ఒక్క ట్యూబ్ సెట్స్ అనే కాదు. అన్ని వస్తువులూ ఒకేసారి కొనవద్దు. కొంత గ్యాప్, అంగడీ / దుకాణం మారిస్తే చాలా అద్భుత ఫలితం దొరుకుతుంది.  నేనిలాగే కొనడం మొదలెట్టాను. ఫలితంగా మంచి షాపింగ్ ఫలితాన్ని పొందుతున్నాను. ఒకే ఒక దుకాణంలో నేను కొనుగోలు చేస్తాను అని చెప్పుకోవడం గొప్పగా ఉండొచ్చు కానీ - వారు చాలా చాలా అవకాశాల్ని కోల్పోతారు..

ఆకారం / బరువు :   ఈ సెట్ల బరువు చాలా తక్కువ. సాంప్రదాయ ట్యూబ్ లైట్స్ సెట్ల కన్నా - ఎలక్ట్రానిక్ సెట్స్ చాలా తక్కువ బరువు అనుకుంటే - ఈ LED సెట్లు మరీ తక్కువ బరువు. అలాగే వాటి కన్నా కొద్దిగా తక్కువ పొడవు, మరింత సన్నగా ఉంటాయి. ఇంత సన్నగా ఉన్న ట్యూబ్ నుండి - గదికి సరిపడే వెలుతురు వస్తుందా ? అనే ఆలోచన కలగటం సహజం. కానీ చాలా బాగా వెలుతురు వస్తుంది. మరొక విషయం కూడా గమనించవచ్చు - అందమైన గదికి దీని అమరిక వల్ల మరింత అందమూ, వెలుతురు వల్ల ఆ గదిలోని వస్తువులు మరింత ప్రకాశవంతముగా కనిపిస్తాయి.

 మన్నిక / వారంటీ :  ఇవి చాలా మన్నికనిస్తాయి. కనీసం ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వారంటీ వాటికి ఉంటుంది. ఈ సమయంలో ఆ సెట్ పాడయితే - దాన్ని రిపేర్ చెయ్యాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఎక్కడైతే కొన్నామో అక్కడే ఇచ్చేస్తే - ( బిల్ చూసి, గడువు మించకుండా ఉన్నట్లయితే ) వెంటనే చెక్ చేసి, మరొక ట్యూబ్ లైట్ ఇస్తారు. ఈ సదుపాయం వల్ల మనకు డబ్బు ఆదా అవుతుంది. ఇక్కడ మీకు మరొక చిట్కా - ఈ సదుపాయాన్ని వాడుకోవాలి అనుకుంటే - ఎంచక్కా స్థానికంగా కొనడమే మంచిది. అదే ఆన్లైన్ గానీ / దూరముగా ఉన్న పట్టణం నుండి కొన్నట్లయితే - అక్కడికి వెళ్ళి గానీ / పార్సెల్ చేసి గానీ ఇంకొకటి పొందాల్సి వస్తుంది. ఇది వ్యయ ప్రయాసతోటి కూడుకున్నది. మరొకటి వచ్చేవరకూ అంతవరకూ దాన్ని వాడిన గది చీకట్లో ఉంచలేం కదా.. అందుకే కొన్ని వస్తువులను స్థానికముగానే కొనాల్సి ఉంటుంది.

 వెలుగు :  ఈ LED ట్యూబ్స్ చాలా ప్రకాశవంతముగా వెలుగుని ఇస్తాయి. కాంతిని కొలిచే కెల్విన్ తాపమానం ( Kelvin Temparature ) లో చెప్పాలీ అంటే ఇవి 6500‍‍‌‍‌‌‍‌‌‍k ప్రకాశవంతం గా ఉంటాయి. క్యాండిల్ / మైనం వత్తి 1000k వెలుగునిస్తే - సూర్యుడు 5500k ప్రకాశవంతాన్ని ఇస్తాడు. అంటే ఎరుపు / ఆరెంజ్ రంగు నుండి క్రమక్రమంగా పసుపులోకి మారి ఆతర్వాత తెలుపుగా మారుతుంది. మామూలు విద్యుత్ దీపం లేత పసుపు రంగులో వెలుతురునిస్తాయి. ట్యూబ్ లైట్ వెలుతురులో తెల్లని బట్టలను చూసేదానికన్నా - ఈ LED దీపాల వెలుతురులో మరింత తెలుపుగా కనిపిస్తాయి. అందుకే వ్యాపార సంస్థలు వీటిని బాగా వాడుతున్నాయి. మిగతా అన్నింటికన్నా - ఒక వాట్ విద్యుత్ కి - చాలా ఎక్కువ / దాదాపు ఒక వంద లూమెన్స్ ( కాంతిని కొలిచే ప్రమాణం ) ని ఇస్తాయి. ఇదే వీటిల్లో కీలకమైన అంశం.

 లూమెన్స్ :   ల్యూమెన్స్ Lumens అనేది ఈ విద్యుత్ కాంతి పరికరములలో చాలా ప్రధాన అంశం. అస్సలు ఈ పోస్ట్ లో చెప్పాల్సింది అంతా దీని గురించే. LED సాంకేతికత విషయాల్లో అన్నింటికన్నా ఎక్కువ పట్టించుకోవాల్సిందీ ఈ విషయమే. లూమెన్స్ అనేది ఒక విద్యుత్ కాంతి పరికరము నుండి వచ్చే వెలుతురు ఎంత మొత్తంలో వస్తుందో దీనిని ప్రమాణముగా చెబుతారు. మామూలుగా ఇప్పుడు వచ్చే LED కాంతి పరికరాలు ఒక వాట్ విద్యుత్ ని ఉపయోగించుకొని 100 లూమెన్స్ కాంతిని ఇస్తాయి. అంటే 20w వాట్ల LED ట్యూబ్ మనకు 2000 లూమెన్స్ వెలుతురుని ఇస్తాయన్నమాట. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంత కాంతిని ఇస్తాయన్నమాట.

ఎలాగూ ఈ లూమెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం  కదా.. మరింత వివరముగా చెబుతాను.

ఈ లూమేన్స్ ని మనం అస్సలు విలువ / అంచనా కట్టలేం. వీటిని నిర్దారించాలంటే - తగిన పరికరాలు అవసరం. సదరు కంపనీ వాళ్ళే వీటిని ముద్రిస్తారు. వీటిని తెలుసుకోవటానికి ఆయా విద్యుత్ కాంతి పరికరాల మీద వచ్చే డబ్బా / కార్టన్ / ప్యాకేజ్ మీద ఉన్న వివరాలే ముఖ్యమైన సమాచారం. కొనేటప్పుడు "ఏదో ఒకటి.. అన్నీ అంతేలే.." అంటూ కొంటే మీరే మీకు తగిన వస్తువు తీసుకోలేక పోతున్నారు అని అర్థం.

గుర్తింపు లేని కంపనీలు / ఇతర దేశాల నుండి బల్క్ గా దిగుమతి చేసుకోబడిన వాటి మీద ఈ వివరాలు అస్సలు ఉండవు. ఇలాంటి కంపనీల కవర్ల మీద చాలా ఎక్కువగా లూమేన్స్ ఉన్నట్లు ప్రచురిస్తాయి. కానీ అవి వాస్తవంలో అబద్హాలు - మనం మోసపోయాం అని వాటి వాడుకలో తెలుస్తుంది. తిరిగి వాపస్ ఇవ్వాలంటే - పాడేసిన కవర్. దూరాభారాలు / తగిన సమయం / ఓపిక.... ఇత్యాది కారణాల వల్ల ఇవ్వలేక పోతాం. అలా కొద్దిగా మానసిక అశాంతికి గురి అవుతాం. ఇక్కడ మీకో చిన్న టిప్ ఇస్తాను.

వస్తువు తయారీ సంస్థ చిరునామా ఏదో చిన్నగా - LED Industries, Delhi - 10 అన్నట్లు కాకుండా, వివరముగా ( రోడ్ పేరు, ఏరియా పేరు, పోస్టల్ కోడ్, కస్టమర్ కేర్ నంబర్... ) ఉన్నట్లయితే వాటిని నమ్మవచ్చు. అవి లేని సంస్థల వివరాలని నమ్మి మోసపోవద్దని నా సూచన. ఒకసారి కొన్నాక చాలా కాలం మన్నిక వస్తాయి - కానీ వెలుతురు తక్కువగా ఉండి, వాటిని వాడే కాలమంతా ఏదోలా అనిపిస్తుంది.

వీటిల్లో గొప్ప బ్రాండెడ్ వస్తువులే బాగుంటాయి అని అనుకోవద్దు.. ఒక్కోసారి మామూలుగా ఎప్పుడూ వినని బ్రాండ్ లూ కూడా బాగుంటాయి. కాకపోతే కంపనీ అన్ని వివరాలు + లూమెన్స్ వివరాలు ఉంటే - పరిశీలించి కొనొచ్చు.

మొదట్లో కొన్న ఒక ట్యూబ్ అమెజాన్ సంస్థలో కొన్నాను. కానీ అప్పుడు ఈ లూమేన్స్ గురించి తెలీదు. రెండు LED ట్యూబ్ లైట్స్ వాడితే ఒక  సంప్రదాయ ట్యూబ్ వెలుతురుని ఇచ్చాయి / ఇస్తున్నాయి. అంటే అంత తక్కువ కాంతిని వాటివల్ల పొందుతున్నాను. కానీ నేను కొన్నప్పుడు అవే మంచి బ్రాండ్స్. రెండు సంవత్సరాల క్రిందట మరొకటి స్థానికముగానే కొన్నాను. అక్కడ 20w ట్యూబ్ వాడుతున్నాను. ఈ LED ట్యూబ్ వాటికన్నా బాగా కనిపించింది. చిన్న ట్యూబ్ కీ దీనికి తేడా ఎందుకూ అని అంత పరిశీలన చెయ్యలేదు. ఒక పది రోజుల క్రిందట - మామూలు ట్యూబ్ బాగున్న స్థానంలో - ఏదో క్రొత్త కంపనీ LED ట్యూబ్ బిగించి వాడాను.

ఆశ్చర్యం. ఆ ట్యూబ్ కన్నా ఈ LED ట్యూబ్ వెలుతురు మరింత చాలా బాగా ప్రకాశవంతం గా ఉంది. అస్సలు ఆ పెద్దగదిలో రెండు ట్యూబ్ లైట్స్ వాడాల్సింది. 40w + 40w = 80w/గంట ని వాడాల్సింది.. కానీ ధైర్యం చేసి, ఈ ఎన్నడూ పేరు వినని Make in India కంపనీ అయిన ఒక సంస్థ ( అడ్రెస్స్ పూర్తిగా ఉంది ) ట్యూబ్ ని కొన్నాను. ఇందులో నాకు బాగా నచ్చిన అంశం - ఈ ట్యూబ్ - 28w - హా.. నిజమే. క్రొత్తగా వస్తున్నాయి. మార్కెట్లో ఉన్న 20w LED ట్యూబ్ ల కన్నా ఇవి 8w వాట్లు ఎక్కువ. ఫలితం - మరో 800 లూమెన్స్ కాంతిని అదనముగా అదే పరికరం ద్వారా పొందుతాను ( 28w x 100 = మొత్తం 2800 Lumens ) మరొక విద్యుత్ కాంతి పరికరం బిగించాల్సిన అవసరం లేదు. అందువల్ల దీనికే మొగ్గు చూపాను.

దాన్ని బిగించి వాడి చూశాను. అంతకు ముందున్న ఎలక్ట్రానిక్ ట్యూబ్ కన్నా మరింత వెలుగు.. అవాక్కయ్యావా ? అన్నట్లు. నిజమే.! రెండు ట్యూబ్స్ వాడే చోట్ల ఒక్క ట్యూబ్ తోనే సరిపోయింది. అదీ చాలా వెలుతురుతో. ఈ కాంతిలో తెలుపురంగు మరింత కాంతితో కనిపించసాగింది.

మా గదిలో రెండు సంప్రదాయ ట్యూబ్స్ = 40w + 40w = 80w
( - ) ఒక LED ట్యూబ్ 28w
------------------------------------------
( 80w - 28w ) = 52w/ hour మిగులు అన్నమాట
రోజుకి నాలుగు గంటలు వాడినట్లయితే = 52 x 4 = 208w మిగులు
అదే నెలకి అయితే = 208w x 30 రోజులు = 6240w = 6.240kwh
యూనిట్ వెల Rs. 5 అనుకుంటే
6.240kwh x 5 = Rs. 31.20 మిగులుతుంది.
ఈ ట్యూబ్ ధర నేను Rs. 320 పెట్టి కొన్నాను ( 20w వి Rs. 230 నుండి Rs. 260 వరకూ లభిస్తున్నాయి )
దాదాపు పది నెలల్లో ఆ ట్యూబ్ కి అయిన ఖర్చు మొత్తాన్ని తిరిగి పొందుతున్నాను అన్నమాట.

ఈ లెక్కలు - భారీ బంగ్లాల్లో, ఆఫీసుల్లో బాగా పనికివస్తాయి. మామూలుగా అయితే అంత ఆదా కనిపించదు. వెలుతురు కోసమైతే కొనక తప్పదు.

ఇక్కడ ప్రధానముగా గమనించాల్సింది - పైన చెప్పిన టిప్స్ ని పాటించాను.. మళ్ళీ వాటిని గుర్తుచేస్తున్నాను..

  • ఒక వస్తువు మార్కెట్లోకి రాగానే వెంటనే కొనవద్దు. 
  • ఆ వస్తువు గురించిన వివరాలు తెల్సుకోవాలి. 
  • పేరొందిన కంపనీ అని చూడాల్సి వచ్చినా ఒక్కోసారి అరుదుగా మామూలు కంపనీల వస్తువులు బాగుంటాయి. 
  • ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనవద్దు. 
  • కంపనీ వివరాలు లేనివి అస్సలు కొనవద్దు. 
  • ఆ వస్తువు సాంకేతిక వివరాలు వివరాలు లేకుంటే వాటి జోలికి వెళ్ళక పోవడమే మంచిది. 
  • ఎప్పుడూ ఒకే అంగడి / షాప్ లో కొనవద్దు. వాటిని మారుస్తుంటే - మనకు ఎన్నో క్రొత్తవి దొరుకుతాయి అలాగే క్రొత్త విషయాలూ తెలుస్తాయి. 







Monday, January 7, 2019

Electronic choke tube lights

https://achampetraj.blogspot.com/2018/12/fluorescent-tube-light-starter.html తరువాయి భాగం :
ఎలక్రానిక్ చోక్ గల ట్యూబ్ లైట్ సెట్ అమర్చాక ఇక - స్విచ్ వెయ్యగానే అలా ట్యూబ్ లైట్ రావటం మొదలైంది. మామూలు ట్యూబ్ లైట్ సెట్ల కనా ఇవి చాలానయం. కొద్దిగా ఖరీదైననూ మన్నికా, సులభ వాడకం మూలాన ఇవి బాగా ఆకట్టుకున్నాయి. వీటి సాంకేతికత వల్ల ట్యూబ్ పట్టే మీద ఉండే స్టార్టర్ మాయం అయ్యింది. అలాగే రెండు, మూడు సార్లు ఫ్లిక్ అయ్యి నెమ్మదిగా వెలిగే బాధ తొలగింది. అలాగే లో వోల్టేజీ ఇవి చక్కగా వెలుగుతుంటాయి, స్టార్ట్ అవుతాయి కూడా. అంతకు ముందు తరం ట్యూబ్ లైట్స్ మాత్రం అలా ఉండేవి కావు. కాసింత వోల్టేజీ తగ్గితే మినుకు మినుకు మంటూ వెలగటం, మరీ తగ్గితే అస్సలు వెలగక పోవటం లాంటివి జరిగేవి.

పాత తరం ట్యూబ్ లైట్స్ లో ఉండే స్టార్టర్ పాడయితే - ఆ స్టార్టర్ ని తీసేసి, ఆ స్టార్టర్ హోల్డర్ లోని రెండు పాయింట్స్ మీద - రెండు చివర్ల మీదున్న ప్లాస్టిక్ తొడుగుని తీసేసిన మామూలు చిన్న ఎలక్ట్రికల్ వైరు ముక్కతో ఆ రెండు పాయింట్స్ నీ స్పార్క్ వచ్చేలా రాపిడి చేసేవాడిని. అలా చేస్తే ఒక్కోసారి ట్యూబ్ లైట్ వెలిగేది. అంటే స్టార్టర్ కాస్త నలుపులోకి మారి సరైన రేటింగ్లో కరెంట్ ఫ్లిక్ ని ఇవ్వలేకపోతున్నది అన్నమాట.. లేదా కాస్త వోల్టేజీ తగ్గిందన్న కారణం వల్ల అలా అవుతుంది. ఇలా చేస్తున్న క్రమంలో ఎన్నోసార్లు నాకు కరెంట్ షాక్ తగిలింది కూడా.

పాతతరం ట్యూబ్ లైట్స్ ని కేవలం వాటి చోక్ మార్చటం ద్వారా ఈ ఆధునిక ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్ గా మార్చుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉండే ఈ కనెక్షన్ ఒకసారి చూస్తే మనమూ చేసుకోవచ్చు. వీటిల్లో అంతా బాగుంది కానీ ఒకే ఒక లోపం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. వీటిని సేపరేటుగా తెచ్చుకొని, పాత ట్యూబ్ కి ఎక్కించి, వాడుకుందాం అనుకుంటే - వీటిని ఆ ట్యూబ్ ఇనుప పట్టీకి బిగించుకోవడానికి ఎలాంటి రంధ్రాలు, టేపులు, తీగలు పెట్టి చూడటానికి అందముగా ఉండేలా చేసుకోరాదు. కరెంట్ టేపు ద్వారానో, తీగల వల్ల గానీ, రెండు వైపులా జిగురున్న థర్మాకోల్ టేప్ సహాయాన గానీ, కేబుల్ టైస్... వల్లనో ఆ పట్టీకి బిగించుకోవాలి. కానీ రెండు స్క్రూలు సహాయన ఆ పట్టీకి బిగించుకొనే అవకాశం చాలా చోక్స్ లలో లేదు. ఇదొక్కటే లోపం. కొన్నింటిలో ఉన్నా - కంపనీ కంపనీకి వేరు వేరు సైజుల్లో రంధ్రాలు ఇవ్వటంతో - అన్ని సెట్లకూ అడ్జస్ట్ అవవు. ఈ లోపం సరిదిద్దేలోగా ఆధునికముగా వచ్చిన LED ట్యూబ్స్ కారణాన ఇవీ కనుమరుగయ్యే సమయం ఆసన్నమయ్యింది.

ఈ ఎలక్రానిక్ చోక్స్ వల్ల మరిన్ని ఉపయోగాలు ఏమిటంటే :

  • మినుకు మినుకుమంటూ ట్యూబ్ లైట్స్ వెలగవు. 
  • స్విచ్ వేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెలుగు వస్తుంది. 
  • లో వోల్టేజీలో కూడా చక్కగా పనిచేస్తుంది. 
  • స్టార్టర్ బాధ తప్పుతుంది. దాని ఖర్చూ ఉండదు. 
  • ట్యూబ్ లైట్ రూల్ మన్నిక బాగా ఉంటుంది. ఏళ్లకు ఏళ్ళు గా మనుగడ వచ్చి, ట్యూబ్ లైట్స్ మాటిమాటికీ కొనాల్సిన బాధ తగ్గుతుంది. 
  • సాంప్రదాయ బరువైన ( అల్యూమినియం వైండింగ్ ) చోక్స్ కన్నా వీటి బరువు చాలా తక్కువ. ఫలితముగా పట్టీని బలంగా బిగించుకోవాల్సిన అవసరం లేదు. 
  • ఇవి కరెంట్ ని చాలా తక్కువ వాడుకుంటాయి. కరెంట్ బిల్లూ కాస్త తక్కువగానే ఉంటుంది. అల్యూమినియం చోక్స్ దాదాపు 10 నుండి 15 వాట్లు / గంటకు అదనముగా వాడుకుంటాయని ఒక అంచనా. ఇదే విద్యుత్ వృధా అనుకోకుండా - ఒకవేళ ఇంకొక బల్బ్ రూపంలో వాడితే ఈ 10 - 15 వాట్లు గల బల్బ్ వల్ల గదికి మరింత వెలుగుని ఇవ్వవచ్చు. 
  • అందరికన్నా వీటిని మరొక పద్ధతిలో కూడా వీటిని బాగా వాడుకున్నాను. అందరి ఇళ్ళల్లో మామూలు సెట్లు ఉన్న రోజుల్లో - వారి ట్యూబ్స్ ఒకవైపు కాలిపోయి / నల్లగా అయ్యి వేలిగేవి కావు. వాటిని బయట పడేసేవాళ్ళు. నేను మాత్రం అలా పడేసే వాటిని ఈ ఎలక్ట్రానిక్ చోక్స్ సెట్లలో అమర్చి మరొక కొంతకాలం / మూడు నుండి పన్నెండు నెలలు వాడుకొనే వాడిని. ఇలా వాడుకోవచ్చన్నది చాలా మందికి తెలీదు. ఎవరైనా వాడుకుంటారని ఈ టిప్ చెబుతున్నాను. కాకపోతే - రెండు వైపులా నల్లబడినవి మాత్రం మళ్ళీ పనిచెయ్యవు. ఒకవైపు నల్లగా మారినివి మరికొంత కాలం ఈ పద్ధతిలో భేషుగ్గా వాడుకోవచ్చు. 






Sunday, December 30, 2018

Fluorescent Tube light - starter

ఈరోజు ఇంటిలోని హాల్ గదిలోనికి క్రొత్త LED ట్యూబ్ లైట్ పట్టీ తెచ్చాను. అప్పటివరకూ హాల్ గదిలో - గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఒక వెలుగు వెలుగుతున్న ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ ని తీసేసి ఇది అమర్చాల్సి వచ్చింది. ఆ కథాకమామీషు ఇప్పుడు..

1998 సంవత్సరములో Anchor ఆంకర్ కంపనీ క్రొత్త ట్యూబ్ లైట్ కంప్లీట్ సెట్ తెచ్చి అమర్చాను. అప్పట్లో ఈ ట్యూబ్ లైట్ ఉండటమే ఒక హోదాగా ఉండేది. అప్పట్లో ఈ మొత్తం సెట్ ధర 400 రూపాయలు ( ఇప్పుడు అయితే మరీ చవక అయ్యాయి ) అప్పట్లో ఈ ట్యూబ్ లైట్స్ వెలిగించాలంటే స్టార్టర్స్ తప్పనిసరి. ఈ స్టార్టర్స్ ధర మూడు రూపాయల నుండి పదిరూపాయల వరకూ ఉండేవి. ఈ పది రూపాయలవి దాంట్లో సిరామిక్ లేదా ప్లాస్టిక్ తో కప్పిన కెపాసిటర్ ఉండేది. స్విచ్ వెయ్యగానే ఈ స్టార్టర్ సహాయాన ట్యూబ్ వెలిగేది. ఇప్పటికీ ఇలాంటి ట్యూబ్ వాడుతున్నారు.. త్వరలోనే వీటికి కాలం చెల్లబోతున్నది.

Tube light starters 
ఇవే ట్యూబ్ లైట్ స్టార్టర్స్  


 ఇక ఈ ప్రక్కన ఉన్నది ఆ స్టార్టర్ లోని చిన్న బల్బ్. ఇది వెలిగే ఆ ట్యూబ్ లైట్ ని వెలిగిస్తుంది. ఇది కనపడకుండా పైన అల్యూమినియం డబ్బా లాంటిదో, లేక ప్లాస్టిక్ డబ్బాలోనో ఉంటుంది. ఇది ఇలా స్పష్టముగా ఉంటేనే ఆ స్టార్టర్ బాగా పనిచేస్తుంది. ఇంకా ఇలాంటివి స్టార్టర్స్ వాడుతున్న వారికి ఒక టిప్ చెబుతున్నాను.. స్విచ్ వెయ్యగానే 20 సెకన్లలోగా టూబ్ లైట్ వెలిగిందా ఓకే! ఒకవేళ వెలగకపోతే వెంటనే స్విచ్ ని ఆఫ్ చెయ్యండి. ఇలా చేస్తే ట్యూబ్ మరియు స్టార్టర్ మన్నిక పెరుగుతుంది. ఇపుడైతే వోల్టేజీ సరిగానే ఉంటునది కాబట్టి త్వరగానే వెలుగుతున్నాయి. 




ఇదేమో - స్టార్టర్ లోని బల్బ్ కి అదనముగా ఉండే కెపాసిటర్ టైపు. దీనివలన మరింత ఎక్కువగా సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా మరింత త్వరగా ట్యూబ్ లైట్ ని వెలిగిస్తాయి. ఆ తెల్లగా ఉన్నదే కెపాసిటర్. అలాకాకుండా గోధుమ రంగులో గుండ్రముగా, బద్దలా ఉండే కెపాసిటర్స్ కూడా ఉన్న స్టార్టర్స్ ఉన్నాయి. నాకైతే ఇవన్నీ అనుభవ రూపేణా తెలుసుకున్నవి. 

ఇక ఈ ప్రక ఫోటోలోలాగా స్టార్టర్ బల్బ్ నల్ల బడిందీ అంటే ఇక ఆ స్టార్టర్ ని మార్చాల్సిన సమయం వచ్చినట్లే.. దాన్ని అలాగే ఇంకా వాడుతుంటే - ట్యూబ్ లైట్ మీద ప్రభావం చూపి - ఎక్కువసార్లు ఫ్లాష్ లు వచ్చేలా చేసి, ట్యూబ్ లైట్స్ చివర్లు నల్లగా అయ్యేలా చేస్తుంది. ఫలితముగా ట్యూబ్ మరియు స్టార్టర్ కూడా మార్చాల్సి వస్తుంది. పది రూపాయల మార్పు ఆలస్యమైతే - యాబై రూపాయల ట్యూబ్ వల్ల జేబుకి చిల్లు పడుతుంది. ఇది చాలామందికి తెలీదు అనే ఇంత వివరముగా వ్రాశాను. ఎవరైనా ఇలాగే వాడుతూ ఉంటే స్టార్టర్స్ ని త్వరగా మార్చుకోండి. ( నేనైతే ఆ స్టార్టర్ కవర్ ని తీసేసి, అలాగే దాని స్థానములో ( స్టార్టర్ హోల్డర్ లో ) బిగించి వాడేవాడిని. అందుకే ఇంతబాగా తెలుసుకొని చెప్పగలుగుతున్నాను. 

 ఈ ప్రక్కగా ఉన్న ఫోటోలో - స్టార్టర్ లోని బల్బ్ స్విచ్ వెయ్యగానే  ఇలా లేత వంకాయ రంగులో వెలుగుతుంది. అలా వెలగటం వల్ల వచ్చిన స్పార్క్ Spark వల్ల ట్యూబ్ వెలుగుతుంది.

కొన్ని స్టార్టర్స్ లలో ఇలాంటి బల్బ్స్ కూడా ఉంటాయి. బల్బ్ లోని తీగ చుట్టూరా ఇలాంటి తెల్లని / లేత నీలి రంగు / లేత వంకాయరంగు లోని విద్యుత్ మెరుపుని స్పష్టముగా చూడవచ్చు. 













ఆ తరవాత వీటిల్లో మార్పులు వచ్చాయి. ఎలక్ట్రానిక్ చోక్స్ వచ్చాయి. వచ్చిన మొదట్లో వీటి ఖరీదు - మొత్తం సెట్ 700 ఏడువందల రూపాయల్లో ఉండేది. అప్పట్లో ఉన్న గ్రామ్ బంగారు మారకం విలువ ప్రకారం అప్పటి ఆ 700 ని ఇప్పట్లోకి ఉన్న విలువలోకి మారిస్తే ఈ క్రొత్త ఎలక్రానిక్ ఛోక్ ట్యూబ్ సెట్ ధర ఆరేడు వేల ( 6,000 - 7,000 ) వరకూ ఉండేది అన్నమాట. అందుకే అప్పట్లో అవి ఎవరికీ తెలీకుండా - చరిత్రలోకి చేరిపోయాయి. నేను కొందామనుకున్నా వాటి లభ్యత నాకు కుదరలేదు.. కానీ ఇతరుల ఇళ్ళల్లో చూశాను. 

ఆ తరవాత ఎలక్ట్రానిక్ చోక్స్ వచ్చాయి. 200 రూపాయల ధరలో ఉన్నప్పుడు ఒక ఛోక్ తీసుకవచ్చి, మొదట్లో చెప్పిన - తీసేసిన ట్యూబ్ సెట్ కి నేనే బిగించాను. అది చాలా రోజులు పనిచేసింది.. ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది కూడా. దీనివల్ల స్విచ్ వెయ్యగానే ట్యూబ్ లైట్ వెంటనే - ఆలస్యం ఏమీ లేకుండానే వెలగటం మొదలయ్యింది. అలాగే లో వోల్టేజీ ఉన్నా చక్కగా పనిచెయ్యటం చవి చూశాను. వీటి హవా చాలా ఏళ్ళు కొనసాగింది. ఇప్పుడిప్పుడే వీటి అమ్మకాలు తగ్గుతున్నాయి - అదీ LED ట్యూబ్ లైట్స్ రాకతో.. ఇవీ చరిత్రలో కలిసిపోయే రోజు త్వరలోనే ఉంది కూడా. ఈ క్రొత్తగా తీచ్చిన LED ట్యూబ్ గురించి మరొక పోస్ట్ లో వివరముగా మాట్లాడుకుందాం.. ఆ పోస్ట్ పెట్టాక ఇక్కడ లింక్ కూడా ఇస్తాను. 



Tuesday, July 4, 2017

క్రొత్త తినడం - గురించి మరింత సమాచారం.

2011 నవంబర్ 11 న ఇదే బ్లాగులో " క్రొత్త తినడం " గురించి ఒక పోస్ట్ ( లంకె : https://achampetraj.blogspot.in/2011/11/blog-post_27.html ) పెట్టాను. ఆ పోస్ట్ కి బాగా వీక్షణలు వచ్చాయి. అలాగే కామెంట్స్ కూడా.. " ఇలా క్రొత్త తినడం గురించి మేమెప్పుడూ వినలేదు.. మాది రైతు కుటుంబాలు అయినా.. " అని కామెంట్స్ పెట్టారు. వాటికి వివరముగా జవాబు ఇవ్వాలని అనుకున్నాను. కానీ దాని గురించి నాకు తెలిసినదంతా ఆ పోస్ట్ లోనే వ్రాశాను. అందువల్ల వారికి మరింతగా జవాబు ఇవ్వలేక పోయాను. 

మొన్న ఒక మిత్రుడు - ఈ క్రొత్త తినడం గురించి ఒక దినపత్రికలో వచ్చిన దాన్ని నాకు తెలియచేశారు. అది ఎలా ఉందో అలాగే ఫోటో తీసి మీకు ఇప్పుడు పరిచయం చెయ్యబోతున్నాను. ఇది చదివి, ఆ " క్రొత్త తినడం " అనే పాత సంప్రదాయం / పద్ధతి గురించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఫోటో మీద డబల్ క్లిక్ చేసి, పెద్దగా అయ్యాక చూడమని నా మనవి. 



Tuesday, May 23, 2017

Railing Repair

అలా బాల్కానీ నుండి తొంగి చూస్తుండగా - రేయిలింగ్ Railing కి ఉన్న ఇనుప పట్టీ వదులై అసహ్యముగా కనపడసాగింది. అలాగే వదిలేస్తే మరింతగా పాడేయ్యేలా ఉంది. అప్పట్లో స్క్వేర్ ఐరన్ ట్యూబ్ Square Iron Tube కి డిజైన్ వచ్చేది కాదు. ఆ చదరపు ట్యూబ్ నీ, ఆ డిజైన్ పట్టీని విడివిడిగా వంచి, ఒక్కటిగా దగ్గరకు చేర్చి, వెల్డింగ్ చేశారు. ఈ పని బాగుంది. కానీ కాసింత శ్రద్ధ ( అంటే పట్టీకి ట్యూబ్ కీ మధ్యన ఉండే సన్నని గ్యాప్ ని లప్పం గానీ, సిమెంట్ ద్వారా గానీ పూత వేసి మూసేయ్యలేదు ) తీసుకోక అందులోకి వర్షం నీరు, ఉతికిన బట్టల నీళ్ళూ పడీ, అందులోకి వెళ్ళి... త్రుప్పు పట్టి అ రెండింటి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇలా అవుతుందని ఆ వెల్డర్ గానీ, ఇటు పెయింటర్ గానీ చెప్పలేదు.. ఎవరి స్వార్థాలు వారివి. మనకా తెలీదు. సో, చివరకు బలయ్యేది మనమే.. 

వర్షపు నీరు ఆ సందులోకి చేరి, మరింత త్రుప్పు పట్టేలా చేస్తూ, అక్కడే ఆవిరయ్యేది. ఫలితముగా ఇనుప పట్టీ తడి ఆరిపోగానే సన్నని ఇనుప రజనులా రాలిపోయి, ఆ ట్యూబ్ కీ, పట్టీకీ మరింతగా దూరం చేసింది.. ఫలితముగా అక్కడక్కడా నా చిటికెన వ్రేలు పట్టేలా దూరం జరిగాయి. 

అలా ఉండటం వల్ల వ్రేళ్ళు ఇరుక్కోవడం, త్రుప్పు పట్టడం వల్ల అది సన్నగా అయ్యి, కోసుకపోయేలా మారింది. పెద్దవాళ్ళకే ఇబ్బందిగా ఉంటే ఇక పిల్లల సంగతి..? వామ్మో..! తలుచుకుంటే భయంకరముగా తోచింది. దాన్ని బాగుచేద్దామంటే - వెల్డర్ వచ్చి, చూసి, అది పూర్తిగా తొలగించి, షాపుకి తీసుకరండి. చేసిస్తాను అని అన్నాడు. తన చార్జెస్ ఒక వేయి తీసుకుంటాను అన్నాడు. అదీ నన్ను చూసి.. లేకుంటే ఇంకో ఐదు వందలు అదనంగా చెప్పేవాడట. 

ఇక్కడ వర్షం నీరు పడకుండా ఆపే పరిస్థితి లేదు.. బాల్కానీ కాబట్టి. ఉతికిన బట్టలు అక్కడే ఆరేస్తాం కాబట్టి దాన్నీ నివారించలేం... ఈ వెల్డర్ + పెయింటర్ ల తప్పు వల్ల ఇప్పుడు వెల్డర్ కి 1500 + రెయిలింగ్ గ్రిల్ తీయించినందులకు 350 + రానుపోను రిక్షా 200 + మళ్ళీ బిగించటానికి మేస్త్రీ ఖర్చు 650 + తన సహాయకుడికి 350 + పెయింటర్ కి 1000 + పెయింట్స్ కి 600...........( ఇక్కడి వరకే Rs. 4650 )  ఇదీ ఖర్చు. ఇవి కనిపించేటివి. ఇక కనిపించనివి - అక్కడే ఉండి నిర్వహణ చూసుకోవాలి - ఇది ఒకరోజు మన సమయం, కూలీలని, రిక్షానీ, సిమెంట్, పెయింట్స్ తేవటానికి అయ్యే ఖర్చులూ అదనం.. చూశారా !.. చిన్న పొరబాటుకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. అందుకే ఇంటి నిర్వహణ అంత వీజీ కాదు.. అన్నీ బాగుండేలా చూడాలంటే చాలా చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి.. అవును.. చిన్న చిన్న విషయాలే.. బోర్ గా ఫీలయ్యి నేర్చుకోవటానికి ఇష్టపడం.. కానీ ఆ చిన్నపనులు మన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని మింగేస్తాయి. అందుకే ఇలాంటి పనులు ఎలా చెయ్యాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి అయిపోయాక చేయి కాలింది అని తెలిశాక అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు విచారించటం తప్ప మరేమీ చెయ్యలేం.. అందుకే ఇలాంటి విషయాల్ని మీకు తెలియాలని చెబుతున్నాను. ప్రపంచం లోని చాలామందికి ఇలాంటి విషయాలు చాలా అవసరం. ఇలాంటి విషయాలకు గూగుల్ లో వెదికితే ఏమి చెయ్యాలో తెలియడానికి ఇలాంటి పోస్ట్స్ కూడా పెట్టాల్సి వస్తున్నది. అందుకే చాలా వివరముగా వ్రాస్తున్నాను. నిజానికి ఇలాంటి పోస్ట్స్ కి బ్లాగ్ వీక్షకుల సంఖ్య బాగానే ఉంది. మామూలు పోస్ట్స్ కన్నా వీటికే వ్యూయర్ షిప్ Viewership  ఎక్కువగా ఉంది కూడా..  నా బ్లాగ్ స్టాటిస్టిక్స్ కూడా ఇది నిజమని ఋజువు చూపిస్తున్నది కూడా.. 

సరే.. ఇక అసలు విషయానికి వద్దాం.. 

ఆ గ్యాప్ లో ఏమి పెడితే బాగుంటుందో ఆలోచన చేశాను. వాల్ పుట్టీ పెడితే ?? అన్న ఆలోచన. బాగుంది కానీ అంత లావుగా అయితే పగుళ్ళు వచ్చి, ఊడిపోతుంది.. పోనీ M-seal లాంటిది పెడితే?? ఇది బాగుంటుంది కానీ అంత పెద్ద గ్యాపుల్లో దాన్ని నింపేసరికి ఖర్చు మరింతగా పెరిగిపోతుంది. మనకు తక్కువ ఖర్చులో - తక్కువ సమయంలో అంతా బాగా కావాలి. మరి ఎలా ? అని ఆలోచిస్తే - సిమెంట్ పెడితే..? వావ్.. మంచి ఆలోచన. అదే బెస్ట్ ఇది 10 - 20 రూపాయల్లో అయిపోతుంది. 

ముందుగా చదరపు ట్యూబ్ కీ, పట్టీకి మధ్యన జాగాలో ఉన్న తుప్పుని ఒక స్క్రూ డ్రైవర్ సహాయన వచ్చినంతవరకూ తొలగించాను. 

ఆ రెండింటినీ కలిపి ఉంచేలా చేసిన వెల్డింగ్ వద్ద ఉన్న త్రుప్పుని ఒక చిన్న సుత్తె సహాయన లోతుగా త్రుప్పుని రాలగొట్టాను. 

ఆ తరవాత మామూలు బైండింగ్ వైర్ ( ఇంటి స్లాబుల్లో స్టీలు వూచలని బంధించడానికి వాడేది ) కాకుండా GI వైర్ మీడియం మందముగా ఉన్నది తీసుకున్నాను. ఇందులో తేడా ఏమిటంటే - బైండింగ్ వైర్ కొద్ది కాలానికే త్రుప్పు పట్టి విరిగిపోతుంది. అదే GI వైర్ త్రుప్పు పట్టక అలాగే ఉంటూ గట్టిగా ఆ రెండింటినీ పట్టి ఉంచుతుంది. అందువల్ల ఇలాంటి చిన్న విషయాలు కీలకం. ఈ తీగ ఎల్లప్పుడూ అక్కడ వాతావరణానికి ఎక్స్ పోజ్ అవుతుంది. కాబట్టి ఇదే వాడమని సలహా. 

( ఇది చేసి, విజయం సాధిస్తానని నాకు తెలీదు. నా స్వంత ఆలోచన.. నిజానికి ఈ పనిలో సక్సెస్ అవుతాననీ తెలీదు. కనుక రెయిలింగ్ మొదట ఎలా పాడయ్యిందో చూపే ఫోటోలు తీయలేదు. అందులకు మన్నించండి. )

GI వైరుతో రెండు చుట్లు చుట్టి, కొనలని ముడివేసి, మెలి త్రిప్పాను. దీనివల్ల అది వాటిని దగ్గరగా లాగుతుంది. అలాగే గట్టిగా బంధించి ఉంచుతుంది. ఈ క్రింది ఫోటో చూడండి. 


ఆ తరవాత సన్నని ఇసుక, సిమెంట్, కాస్త నీరూ కలిపి చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. 

ఆ రెండింటి గ్యాప్ లో ఆ సిమెంట్ వేసే ఒక నిమిషం ముందు - సిమెంట్ వేసే ప్రాంతాన్ని నీటితో తడుపుకోవాలి. ఇలా ఎందుకూ అంటే - ఆ సిమెంట్ మిశ్రమం ఆ ఇనుప రెయిలింగ్ గోడలకి గట్టిగా పట్టుకుంటుంది. చాలామంది మేస్త్రీలు ఈ చిన్న విషయాన్ని మరుస్తారు. ఫలితముగా పగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే కాస్త తడి ఉన్నప్పుడే సిమెంట్ వేసుకోవాలి. 

క్రింది వైపున అట్టముక్క లేదా ఎడమచేతిని వాడి, ఆ గ్యాప్ లో సిమెంట్ మిశ్రమాన్ని వేసి సన్నని తాపీతో అదమాలి. అలా పైవరకూ చేసి, కాసేపు ఆగాక ఒక చెక్క ముక్కతో లెవల్ చేసుకోవాలి. 

స్మూత్ / నునుపు ఫినిషింగ్ కావాలంటే ఒక లప్పం రేకుతో రాస్తే సరి.. నేను మాత్రం ఇక్కడ నీటిలో తడిపిన స్పాంజ్ ముక్కతో నునుపు చేశాను. ఫలితముగా గరకుగా వస్తుంది. ( అది ఆరాక వాల్ పుట్టీ ని లప్పం రేకు సహాయాన పూసి, స్మూత్ / నునుపు చేసి, ఎమరీ పేపర్ తో రుద్ది, మరీ నునుపు చెయ్యాలని నా ఆలోచన. ఆ తరవాత పెయింట్ వేస్తే ఇలా అయ్యిందని మనం చెబితే గానీ ఎవరూ తెలుసుకోలేరు..) 

అలా చేశాక నీటి తడులు చాలానే ఇచ్చాను. ఫలితముగా చాలా బాగా ధృడముగా ఆ రెయిలింగ్ మారింది. 


ఆ తరవాత ఈ రెయిలింగ్ గోడకి కలిసే చోట అక్కడ నీటి తేమ వల్ల పూర్తిగా పాడయ్యి, సన్నని పోచ మీద ఆగింది. ఇక్కడ నిలబడితే ఆధారం లేక పడిపోతామేమో అన్నంతగా భయం వేసేది. అంత ధృడమైన రెయిలింగ్ నీటి తేమ వల్ల త్రుప్పు పట్టి, సన్నని పోచలుగా మారింది.. రెండు పోచల తీగలా మారి దాని ఆధారముగా గోడకి ఫిక్స్ అయ్యింది. ( ఇది ఫోటో తీయటం మరిచా.. తీసుంటే అది ఏ మేరకు త్రుప్పు పట్టి పాడయ్యిందో తేలికగా తెలిసేది. అది గనుక మీరు చూసుంటే అది ఖచ్చితముగా క్రొత్త రెయిలింగ్ ని మార్చాలి అని అనేవాళ్ళు. నేను చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని నాకే నమ్మకం లేక... అలా ఫోటో తీయటం మరిచా. ఎందుకంటే ఇలా నేనెప్పుడూ చెయ్యలేదు. వేరేవారు చెయ్యగా నేనెప్పుడూ చూడలేదు ) దీనికీ చక్కగా సిమెంట్ వేశాను. వేశాక తడి స్పాంజ్ తో ఎక్కువైన  సిమెంట్ ని తొలగించాను. 

వారం రోజులు చక్కని నీటి తడులని ఇచ్చాను. బాగా గట్టిపడిపోయింది. బలముగా నెట్టినా ఏమాత్రం కదలనంతగా గట్టిగా మారింది. దూరం నుండి చూస్తే అది ఆ గ్రిల్ లోని భాగమే అన్నట్లు కుదిరిపోయింది. ఇలా వెయ్యక ముందు అక్కడ నిలబడాలంటేనే భయముగా తోచేది.. ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉండి, నమ్మకముగా ఆనుకొని ఉండేలా మారింది. 


ఇక కొద్దిరోజుల తరవాత వాల్ పుట్టీని లప్పం రేకుతో వేసి, ఎమరీ పేపర్ సహాయాన నునుపు చేసి, రంగు వెయ్యాల్సిన పని మిగిలింది. అదీ త్వరలోనే ముగిస్తాను. అప్పుడు ఈ గ్రిల్ అలా రిపేర్ చేశా అంటే ఎవరూ నమ్మకుండా తయారవుతుంది. క్రొత్త రెయిలింగ్ మాదిరిగా కనిపిస్తుంది. 

చూశారా ! ఎంత ఖర్చుని తప్పించి, తక్కువ ఖర్చులో బాగుచేసుకున్నాను కదూ.. మొత్తం ఖర్చు అంతా ఇరవై Rs. 20 రూపాయలకు మించలేదు.. ఇక వాల్ పుట్టీ, రంగులూ వంద లోపే అయిపోతాయి.. అవీ నేనే వేసుకుంటే. మొత్తానికి నా కాసింత శ్రమ, ఆలోచనతో  పెద్ద ఖర్చుని తొలగించుకున్నాను.

ఈ పద్ధతిని ఆరుబయట ఎండకు ఎండీ, వానకు నానే పాఠక్ / గేట్లు / జాలీ గేట్లు / గ్రిల్స్ కి శుభ్రముగా వాడుకోవచ్చును.

Railing repair

మీకు తేలికగా అర్థం కావటానికి  ఫోటోలు అన్నీ Extra Large మోడ్ లో అప్లోడ్ చేశాను. 

Tuesday, May 16, 2017

Repairing of Cheppal Stand

మొన్న ఖాళీగా ఉన్నప్పుడు - ఇల్లు సర్దుతూ ఉంటే మూలన ఉన్న చెప్పుల స్టాండ్ Cheppal stand కనిపించింది. దాని ఒక కాలు నీటి తేమ వల్ల తుప్పు పట్టి విరిగిపోయింది. ఇదే స్టాండ్ ని గతం లో ( 2012 సం.) బాగు చేసుకొని, రంగులు వేశాను. అదెలా చేశానో ఈ బ్లాగ్ పోస్ట్ లో http://achampetraj.blogspot.in/2012/01/blog-post_07.html లో వివరముగా వ్రాసాను. అప్పుడు తరవాత ఇన్నాళ్ళకు ఇప్పుడు పని పెట్టింది. ఒక మామూలు ఇనుప చెప్పుల స్టాండ్ ఇన్ని సంవత్సరాల కాలం పనిచెయ్యడం చాలా గొప్ప విషయమే.. బహుశా నేను దాన్ని 2008 - 2009 లో కొని ఉండొచ్చు. అంతగా గుర్తులేదు. 

ఇప్పుడు ఒక కాలు విరిగి - కదులుతూ పైన పెట్టిన చెప్పుల జతలు పడిపోవటం మొదలెట్టాయి. అయినా దాన్ని చెత్తలోకి పారెయ్యటం నాకు మనసొప్పలేదు.. ఇంకొంత కాలం దాని సేవలని పొందాలనిపించింది. బాగు చేసుకోవాలని అనుకున్నాను. కొద్దిసేపు ఆలోచిస్తే చాలా తేలికైన పరిష్కారం కనిపించింది. అది చాలా తక్కువ ఖర్చులో చేసుకోనేదిగా ఉంది. కేవలం 10 - 20 రూపాయల్లో అయిపోతుంది. ఇది గనుక సక్సెస్ ఐతే మరో ఐదేళ్ళు తేలికగా పనిచేస్తుంది అనిపించింది. చెప్పుల స్టాండ్ మరొకటి రెండొందలు పెట్టి కొనొచ్చు, కానీ 10 - 20 రూపాయల్లో బాగయ్యి, మరింతకాలం ఉపయోగానికి వస్తుందీ అంటే ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా.. అదీ చాలా తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తక్కువ శ్రమ వల్ల. చూద్దాం ఈ ప్రయత్నం చేసి చూద్దాం అనుకున్నాను. బాగయితే వాడుకుందాం.. లేకుంటే చెత్తలోకి పంపడమే.. ఒకసారి ట్రై చేస్తే - నాకున్న సాంకేతిక నైపుణ్యాన్ని మరింతగా అప్డేట్ చేసుకున్నట్లూ అవుతుంది కదా.. అని అనుకున్నాను. 

ముందుగా స్టాండ్ ని బయట పెట్టి శుభ్రం చేసాను. ఇలా ఈ క్రింది ఫోటోలో ఎర్రని వృత్తాల వద్ద చూపిన చోట్ల తుప్పు పట్టి పాడయ్యింది. ఒక రంధ్రం పడింది, ఒక కాలు విరిగింది. 



నిజానికి ఇలా జరగకుండా చెయ్యటానికి ఒక మార్గం ఉంది. అదేమిటంటే - ఆ స్టాండ్ ని బిగించే ముందు ఆ పైపుల్లో ఎనామిల్ పెయింట్ గానీ, వేడి చేసిన క్రొవ్వొత్తి మైనం గానీ పోసి, లోపల ఒక పూతలా చేస్తే చాలు. కానీ అంత ఓపిక ఎవరికి ఉంది? తక్కువ ఖర్చులో మరొక స్టాండ్ వస్తుంది కదా.. అనుకొని ఆ ఆలోచనని అమలు చెయ్యరు.. ఇప్పుడు నేను బాగుచేసుకున్న పద్ధతిని చూద్దాం.  

ముందుగా ఆ స్టాండ్ కాళ్ళు దూరేంతగా వెడల్పు ఉన్న ప్లాస్టిక్ పైపుని వెదికాను. ఒకరివద్ద కనిపించింది. వారు దాన్ని వృధాగా పడేశారు. ఒకరికి వృధా అన్నది మరొకరికి అవసరం. అది PVC పైపుల్లో హెవీ గేజ్ ది. ఇప్పుడు క్రొత్తగా నిర్మించే ఇళ్ళకు వాడే వాటర్ పైపులు అయితే మరింత ధృడంగా ఉంటాయి. హెవీ గేజ్ Heavy gauge అంటే - పైపు గోడలు మందముగా / లావుగా ఉంటాయని అర్థం. ఆ పైపుని తీసుకోచ్చేసి, ముందుగా ఒక కాలు సైజు తీసుకొని, ఆ సైజుకి హెక్సా బ్లేడ్ సహాయన కోశాను. అదే సైజుని ప్రామాణికముగా పెట్టుకొని, ఈ క్రింది విధముగా పెట్టి, మరో మూడు కాళ్ళు కోశాను. వాటి అంచులని, వెలుపలి భాగాల్ని ఎమరీ పేపర్ / సాండ్ పేపర్ మీద రుద్ది నునుపు / శుభ్రం చేశాను. 


ఇపుడు ఆ స్టాండ్ ని ఒక పేపర్ మీద తిరగేసి పెట్టి, పైకి వచ్చిన కాళ్ళకి ఆ పైపులని తొడిగాను. ఒక గిన్నెలో కాస్త సన్నని ఇసుక + సిమెంట్ ని జారుడుగా కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ గరాటు తీసుకొని ఆ ప్లాస్టిక్ కాలులో పెట్టి, అందులోకి ఈ సిమెంట్ మిశ్రమాన్ని పోయాలి. బాగా కుదురుకోనేందుకు ఒక సన్నని స్క్రూ డ్రైవర్ తో లోపలికి అదమాలి. అలా ఆ కాలులో నిండుగా సిమెంట్ వేసుకోవాలి. ( క్రింది ఫోటోని చూడండి ) ఇలా స్టాండ్ నాలుగు కాళ్ళలో వేసుకోవాలి. సిమెంట్ వేశాక ఎలా ఉంటుందో మరొక కాలుని ఫోటోలో చూడండి. 


ఆ తరవాత ఆ సిమెంట్ మిశ్రమం గట్టి పడ్డాక - కారిన సిమెంట్ మిశ్రమాన్ని హెక్సా బ్లేడ్ తో గీసేసుకోవాలి. 
ఒక తడి స్పాంజ్ తో తుడిచినా శుభ్రమవుతుంది. ఇది జాగ్రత్తగా చెయ్యాలి. 
ఎందుకంటే లోపల పోసిన సిమెంట్ మిశ్రమం గట్టిపడలేదు. పౌడర్ లాగే ఉంటుంది.
అందువల్ల కదిపితే పగుళ్ళు వచ్చి, ఎక్కువ కాలం నిలబడదు. 
రెండు మూడు సార్లు నీటి తడి ఇవ్వాలి. అప్పుడు కాస్త గట్టి పడుతుంది.
అలా తడి ఇచ్చాక ఆ స్టాండ్ ని మాములుగా పెట్టుకోవాలి. 
ఆ తరవాత నాలుగు ప్లాస్టిక్ గ్లాసుల్ని తీసుకొని, వాటిల్లో ఈ సిమెంట్ పోసిన స్టాండ్ కాళ్ళని పెట్టాలి. 
ఆ గ్లాసుల్లో నీటిని పోయాలి. ( మన్నించాలి.. ఈ ఫోటోని తీయడం మరిచాను ) 
ఇలా కొన్ని రోజులు ఉంచాలి. 
ఇలా చేస్తే ఆ సిమెంట్ మిశ్రమం చాలా గట్టిగా తయారవుతుంది. 
ఆ తరవాత మామూలుగానే ఆ స్టాండ్ ని వాడుకోవచ్చు. మరింత ఎక్కువ కాలం వస్తుంది. 
పైపులు ఊడిపోయినా, సిమెంట్ రాడ్ లా ఉంటుంది. 
ఈ సిమెంట్ వేసేటప్పుడు GI / ఇనుప వైర్ ముక్క అందులో పెట్టి, 
సిమెంట్ వేస్తే - పగుళ్ళు వచ్చినా గట్టిగా ఆపుతుంది. 
ఇంతే.. 
ఆ స్టాండ్ ని మరో ఐదేళ్ళు లేదా ఇంకా ఎక్కువ కాలం నిరభ్యంతరముగా వాడుకోవచ్చును. 


Friday, March 24, 2017

Stone turning Mortar

మన చుట్టూ ఉన్న వస్తువులు ఎంతో ఆధునికతని సంతరించుకుంటున్నాయి. టెక్నాలజీ నమ్మశక్యం కాని రీతిలో ఎంతగానో అభివృద్ధి చెందుతూనే ఉంది. పాతవస్తువులు కూడా క్రొత్తగా ఆధునిక రూపుని పొందుతున్నాయి. బండగా ఉండే బండ వస్తువులు కూడా క్రొత్తగా, నాజూకుగా మారి, షోకేసుల్లో పెట్టుకునేలా తయారవుతున్నాయి. అలాంటిదే - అలా ఆధునికంగా మారిన ఒక వంటింటి పనిముట్టుని పరిచయం చేద్దామని ఈ పోస్ట్. 

మొన్న అలా మార్కెట్ గుండా వస్తుండగా సూదంటురాయిలా ఒక బండి నన్ను ఆకర్షించింది. చూసిన క్షణమే అదేమిటో, దాని తయారీ వెనక ఉన్న శ్రమ, ఇప్పటి పనితనం వెనుక ఉన్న విజ్ఞానం, తయారీ నేర్పు.. ఏమిటో అర్థమయ్యాయి. ధర అందుబాటులో గనుక ఉంటే ఒక కలెక్షన్ పీస్ లా దాచుకోవాలని వెంటనే అనుకున్నాను. ఆ బండి వద్దకు వెళ్లాను. చేతుల్లోకి తీసుకొని చూశాను. సన్నని రాతి పౌడర్ చేతులకు అంటుకొని చేతులు మురికి అవుతున్నా పట్టించుకోలేదు. నాకు అది అపురూపముగా తోచింది. ఆ వస్తువుని నేను ఏమాత్రం వాడకున్నా అంత బాగా తయారీ ఉన్న దాన్ని తప్పక తీసుకోవాలనుకున్నాను. 

సుత్తి, ఉలితో చెక్కిన రోలు సాధారణముగా అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అవి కాస్త రఫ్ గా ఉంటాయి. వాటినే ఇప్పుడు నాజూకుగా చేస్తున్నారు. అదే ఇది. టేకు చెక్కలని సంగడి Turning పట్టించి చేసే పద్ధతిలోనే గ్రానైట్ రాయినీ డైమండ్ టూల్స్ సహాయాన గుండ్రముగా తిరిగే లేత్ మెషీన్ మీద తొలచి వీటిని తయారుచేస్తున్నారు. ఇవి తమిళనాడు లో తయారు అవుతాయని చెప్పాడు. రాతిని కూడా అలా సంగడి పట్టి, చెయ్యటం ఇదే తొలిసారిగా, ప్రత్యక్షముగా చూస్తున్నాను. యూట్యూబ్ లో Stone turning lathe అని టైపు చేసి వెదికితే చాలా వీడియోలు కనిపిస్తాయి. ఈ క్రింది ఫోటోల మీద డబల్ క్లిక్ చేసి, చూస్తే వాటి పనితనం, అందం కనిపిస్తాయి. 

ధర ఎంతనో అడిగా.. రెండువందల యాభై రూపాయలు చెప్పాడు. చివరకు నూటా యాభై Rs. 150 కి ఇచ్చాడు. నేను కాస్త పరిశీలనగా చూస్తుంటే - అది నల్లని గ్రానైట్ తో చేసినదనీ, నీటిలో కడిగితే, ఆ పైన ఉన్న పౌడర్ వెళ్ళిపోయి, నల్లని గ్రానైట్ కనిపిస్తుందని చెప్పాడు. కడిగీ చూపించాడు. నిజమే.. నల్లని గ్రానైట్ తో చేసినదే అది. ఇందులో ఇంకా చిన్నవీ, సన్నగా ఉన్నవీ ఉన్నాయి కూడా. కానీ సన్నగా ఉండి, వాడకములో పగిలి ఎక్కువ రోజులు రావేమో అని వద్దనుకున్నాను. 





Thursday, March 23, 2017

Wall Hanging Cover box

ఈ మధ్యన ఏమీ తోచక ఉంటే - అటూ ఇటూ చూసినప్పుడు కొన్ని సన్నని బీడింగ్ చెక్క ముక్కలు కనిపించాయి. అవి - ఉపయోగించగా మిగిలిన ముక్కలు. వాటితో ఏమైనా చేసుకుంటే - వాటి రద్దీ పోతుంది కదా.. అని అనుకున్నాను. వాటితో ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తే - కాగితాలు, ఉత్తరాలు, కవర్లూ.. దాచుకొనే స్టాండ్ Wall Hanging Cover box చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. సరే అని ముందుగా అది నాకు ఏ విధముగా ఉండాలో, ఎలాగ నాకు ఉపయోగపడాలో వివిధ ఆలోచనను చేసి, స్కెచ్ వేసి, ఒక రూపానికి ఒకే చేసి, ఇక మొదలెట్టాను. 

ఆ మిగిలిన బీడింగ్ చెక్క ముక్కలూ, కాసిన్ని సన్నని మేకులూ, చెక్కలని అతికే జిగురు, ఒక చిన్న సుత్తె, ఒక హెక్సా బ్లేడ్.. ని వాడి ఈ క్రింది రూపాన్ని తయారుచేశాను. 

దీన్ని చాలా త్వరగానే చేసాను. నిజానికి వడ్రంగి పని నా అభిరుచి మాత్రమే.. దైనందిక జీవితములోని వత్తిడిని ఎదురుకోవడానికి, అందులో ఉండే వత్తిడి నుండి బయటపడేందుకు ఇలాంటివి చేస్తుంటాను. నాకు అది అవసరమయ్యే విధముగా ముందే ఆలోచించాను, స్కెచ్ వేసుకున్నాను కాబట్టి చెయ్యటం కాస్త తొందరగానే అయ్యిందనిపించింది. మొత్తం చేసాక - దాన్ని ఆరబెట్టి, ఆతర్వాత దాన్ని సాండ్ పేపర్ కి రుద్ది, నునుపు చేశాను. ఆ తరవాత టచ్ వుడ్ ని ఒక సింగల్ కోటింగ్ వేసి, ఆ తరవాత దాన్ని వాడుకోవడం మొదలెట్టాను. నా తయారీని మీరూ చూడండి. 


Bottom side view 

Left side view 

Right side view 

Top side view 

Top view 

Ready for use 


ఎలా ఉంది? బాగానే చేశాను కదూ..!!


Friday, February 17, 2017

Wall Graphity

ఈ మధ్య నేనొక గోడ మీద బార్డర్ డిజైన్ వేశాను. ఊబుసుపోక ఏం చెయ్యాలో తోచని వేళ ఆ పని పెట్టుకున్నాను. దాని గురించి మీకు తెలియచేస్తున్నాను.

రోడ్డు వైపున ఉండే గోడ అది. ఆ గోడకి ఈ మధ్యే రంగు వేశాను.. హా.. మీరు విన్నది నిజమే. నేనే వేశాను. అంతకు ముందు ఆ గోడకి - చాలా ఖరీదైన రాయల్ వెల్వెట్ ఎమల్షన్ పెయింట్ వేయించాను. మంచిగా కనిపిస్తే జనాలు ఓర్వలేరు కదా.. దాన్ని మేకులతో గీకి, పాడు చేశారు. ఇలా కాదనుకొని వంకాయ రంగు నుండి బూడిద రంగుకి మార్పించాలనిపించింది. మహా అంటే 15' x 11' అడుగుల గోడ. దీనికి రంగు వెయ్యటానికి Rs. 500 అడిగాడు పెయింటర్ అబ్బాయి. మరొకరిని అడిగినా దాదాపుగా అంతే!.. 

చూస్తే అది చిన్న పని.. వాళ్ళైతే అలవాటైన పని గనుక మహా అంటే పది నిమిషాల్లో ముగించేసే పని. ఆమాత్రం దానికే అంత డబ్బా!! పోనీ అదేమైనా స్కిల్ వర్క్ Skill work కూడా కాదు. మరొక ఎమల్షన్ పెయింట్ ని పెయింట్ రోలర్ సహాయాన పూసేయ్యడమే. ఇక లాభం లేదని నేనే వేసుకోవడానికి సిద్ధమయ్యాను. ఓ ఆదివారాన దానికి సుముహూర్తం పెట్టాను. 

ఆరోజు రానే వచ్చింది. రోడ్డు కదా.. జనాలు బాగానే అటూ, ఇటూ తిరుగుతూ ఉన్నారు. వారి ముందు అలా వెల్ల వేయటం కాస్త నామోషీగా అనిపించి, మొదలెట్టక ఆగాను. కానీ వారి రాకపోకలు ఆగిపోవాలంటే - ఇక చీకటి పడాల్సిందే.. అపుడైతే నామోషీగా ఉండదేమో గానీ, ఎక్కడ రంగు బాగా వచ్చింది, ఎక్కడ గుడ్డి గుడ్డిగా వచ్చిందో తెలీదు. ఇక కాదని సాయంత్రం పూట రంగేయ్యటం మొదలెట్టాను. 

ఇంతకు ముందు రంగేసినప్పటి పెయింట్ రోలర్ ఇంట్లో ఉంది కాబట్టి, ఈజీగా అయ్యింది. దాన్ని ఒక కట్టెకు గుచ్చి ( ఇలా చెయ్యటానికి ఆ రోలర్ హాండిల్ కి ఈ సదుపాయం ఉంటుంది ) రంగు పూయటం మొదలెట్టాను. వాళ్ళూ, వీళ్ళు వచ్చి, ఇలా ఎలా వేస్తున్నానో చూడటానికి వచ్చినా, ఇక పట్టించుకోక దాదాపు పావుగంటలోనే ఒక కోటింగ్ పూర్తి చేశాను. అది ఆరాక మరో కోటింగ్ కూడా వేశాను. రోలర్ సహాయన అలా వెయ్యటం చాలా తేలికగా పని ముగిసింది. 

ఇలా వేస్తున్నప్పుడు తెలిసిన పెయింటర్ అటుగా వెళుతూ, చూసి, ఆగాడు. వచ్చి " నేను వెయ్యాలా అన్నా!.." అని అడిగాడు. 

" వేయు.. ఎంత తీసుకుంటావ్.." అన్నాను. 

" మూడొందలు ఇవ్వన్నా.." అన్నాడు. అప్పటికే సగం అయ్యింది. రోలర్ తో వెయ్యడం క్రొత్తగా, భలేగా అనిపిస్తున్నది. అంతా నేనే వేసుకోవాలని అనుకున్నాను. ఈరోలర్ ని చూసే - ఈ పెయింట్ వెయ్యటానికి వచ్చాడంట. అంటే రోలర్ వల్ల అంత తేలికగా పెయింట్ వెయ్యడం జరిగిపోతుందన్నమాట. తను ఉన్నప్పుడే ఒక కోటింగ్ వెయ్యటం పూర్తయ్యింది కూడా.. ఇంకో కోటింగ్ అతనికి ఎందుకివ్వాలనిపించింది. ఇచ్చి డబ్బులు ఎందుకు వృధా చేసుకోవాలనిపించింది..!! కాసేపు ఆ మొదటి కోటింగ్ ని ఆరనిచ్చాను. ఆతర్వాత రెండో కోటింగ్ ని ఇట్టే లాగించేశాను. 

అలా రెండు కోటింగ్స్ పూర్తయ్యాక - ఆ గోడ నాకైతే మరింత అందముగా కనిపించటం మొదలెట్టింది... బహుశా నేను వేశానని కాబోలు. ( ఇదంతా ఈ పోస్ట్ హెడ్డింగ్ కి సరిపోదు కానీ, జ్ఞాపకం కోసం వ్రాసుకున్నాను ) 

ఆ తరవాత కొద్దిరోజులకు ఆ గోడకి క్రిందన బార్డర్ కొట్టాలనిపించింది. అలా అయితే ఆ గోడ మరింత అందముగా కనిపిస్తుందని. ఆలివ్ గ్రీన్ ఎమల్షన్ Alive Green Emulsion కాస్త మిగిలినట్లు ఉంటే - దాన్ని వాడేసి, ఆ డబ్బాని తీసేద్దామని ఆ రంగుని ఎంచుకున్నాను. ఆ డబ్బా తీసేస్తే నాకు కాస్త స్టోరేజీ సమస్య తీరుతుంది. 

మళ్ళీ ఒక ఆదివారం ఎంచుకొని, ఆ గోడ మీద బార్డర్ లైన్ వ్రాసుకొని, ఆ రంగుని 50mm నంబర్ బ్రష్ సహాయాన పూసేశాను. అదీ రెండు కోటింగ్స్ వేశాను. ఇలాంటి వాటిని వేసేటప్పుడు - కొన్ని విషయాలు బాగా గుర్తు పెట్టుకోవాలి. అందులో ఇది ఒకటి - ఎక్కడైతే పెయింట్ పోయిందో / క్రొత్తగా వెయ్యాల్సి ఉంటుందో / మరకలతో అసహ్యముగా కనిపిస్తుందో - అక్కడ అన్నింటికన్నా ముందే ప్యాచెస్ మాదిరిగా పెయింట్ చేసుకొని, ఆతర్వాత మిగతా అంతా మొదలెట్టుకోవాలి. అలా అయితే మరింత లుక్ వస్తుంది.

ఇలా రెండు, మూడు కోటింగ్స్ అయ్యాక - ఆ పెయింట్ కొద్దిగా అంటే 50 ml. మిగిలింది. అలా మిగల్చాలి కూడా! పెయింట్ వేశాక ఎక్కడైనా మరకలుగా ఉంటే టచప్స్ Touch up కోసం అది అవసరానికి అట్టే పెట్టుకోవాలి. 

ఇదయ్యాక చాలా వారాలకు / కాదు నెలలకు - ఆ క్రింది బార్డర్ ని మార్చాలనిపించింది. ఎలా మార్చాలో, ఎలా ఉండాలో అప్పటికి ఇంకా నిర్ణయమూ తీసుకోలేదు.. జస్ట్ అనుకున్నా అంతే!. 

ఒకరోజు రాత్రి సడన్ గా ఒక ఐడియా. ఇది నా జీవితాన్ని మార్చలేదు కానీ గోడ అందాన్ని మారుస్తుంది అనుకున్నాను. ఎన్నోసార్లు క్రాస్ చెక్  చేసి, ఆలోచించా.. బాగుంటుంది అనిపించింది. ఎమ్మెస్ పెయింట్ లో అలా గీసి, రంగులేసి, చూశా.. వావ్! అనిపించింది. మరి ఇది అందరికీ నచ్చుతుందో లేదో.. అనిపించింది. 

మరోరోజు రాత్రిన ఆ ఐడియాని అప్డేట్ చేసుకున్నాను - నా ఫేస్ బుక్ గోడ Wall నా ఇష్టం, నాకు నచ్చింది వ్రాసుకుంటా, ఇష్టమైనది వేసుకుంటా.. అన్నట్లు నా గోడ నా ఇష్టం అనిపించి, ముందుకు సాగాను. ఒకవేళ బాగా రాకుంటే ? హా! ఏముంది? మరొక రంగుతో ఆ బార్డర్ ని మార్చితే సరి అని నిర్ణయించుకున్నాను.

ఆ మిగిలిన 50ml ఆలివ్ గ్రీన్ ఎమల్షన్ పెయింట్ లో కాస్త ఫాస్ట్ గ్రీన్ fast green స్టైనర్ ని కలిపి ఆ రంగుని మరింత డార్క్ చేసి, అక్కడక్కడ ప్యాచెస్ రూపములో ఆ బార్డర్ పట్టీ మీద పూశాను. అప్పటికీ మరికొద్దిగా మిగిలితే నలుపురంగు స్టైనర్ ని కలిపి, మరింత ముదురు ఆకుపచ్చగా మార్చి - అక్కడక్కడ మళ్ళీ ప్యాచెస్ మాదిరిగా వేశాను. అప్పటికి ఆ రంగు అయిపోయింది. ఆ తరవాత తెలుపు రంగు ఎమల్షన్ తీసుకొని, అందులో ఫాస్ట్ పసుపు Fast Yellow, ఫాస్ట్ రెడ్ Fast Red లను తగుపాళ్ళలో కలుపుతూ మరిన్ని రంగులని తయారుచేసి, వాడాను. కాస్త కాఫీ బ్రౌన్ కలర్ కూడా ఉంటే అదీ వాడాను. ఒక ప్యాచ్ కీ, మరొక ప్యాచ్ కీ ఆనుకోనేలా, వివిధ రంగులు కలుసుకోనేలా వేశాను. ఇక ఆరోజు అంతటితో ముగించేశాను. స్టైనర్ అంటే -  ఎమల్షన్ పెయింట్ లో మనకి కావాల్సిన షేడ్ వచ్చేందుకు కలిపే అతిచిక్కని, గాఢమైన రంగు.

దాన్ని చూసి, ఇదేమిట్రా - వీడు గోడని ఇలా రకరకాల రంగులు వేస్తూ పాడుచేస్తున్నాడు అనుకున్నారు. కొద్దిమంది నాతో అన్నారు కూడా. కానీ నేనేమీ పట్టించుకోలేదు. నాకైతే - అది పూర్తయితే మరింతగా బాగుంటుందని నమ్మకముగా ఉన్నాను.

మరో రెండు మూడు వారాల సమయం తీసుకొని తెలుపు ఎమల్షన్ లో ఎక్కువగా నలుపురంగు స్టైనర్ ని కలిపి నల్లని రంగుని తయారుచేశాను. ఆ రంగుని ఒక సన్నని బ్రష్ సహాయాన - ఆ ప్యాచెస్ ని ఒక్కొక్కటీ సేపరేటుగా ఉండేలా, బార్డర్స్ గీశాను. ఇప్పుడు మరింత అందముగా వచ్చింది. అప్పుడు దాన్ని చూసిన వారు - నన్ను అభినందించారు. నాకు మాత్రం నాకు నచ్చిన డిజైన్ ని అలా బార్డర్ గ వేసుకొని నాలోని కోరికని నేరవేర్చుకున్నానని అనిపించింది.

ఇదే ఆ గోడ గ్రాఫిటీ -





Monday, January 2, 2017

Wireless Optical Mouse repairing

నేను సిస్టం కొన్నప్పుడే దానితో బాటే మైక్రోసాఫ్ట్ వైర్ లెస్ కీబోర్డ్ Wireless key board కొన్నాను. అప్పటి నుండీ నేటివరకూ ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కీ బోర్డ్ వాడుతూనే ఉన్నాను. గత సంవత్సర కాలం నుండీ మౌస్ లో ఎదో తేడా వచ్చి, మానిటర్ స్క్రీన్ మీద కర్సర్ కదిలిపోవడం మొదలెట్టింది. అంటే కర్సర్ మానిటర్ స్క్రీన్ మీద ఒకదగ్గర ఉండకుండా వణుక్కుంటూ ప్రక్కకి కదిలిపోయేది. ఏదైనా సెలెక్ట్ చెయ్యడం, మార్కింగ్ చెయ్యటం కొద్దిగా ఇబ్బందిగా ఉండేది. ఇలా కాదనుకొని, ఇంకో మౌస్ కొనడానికి నిర్ణయించుకున్నాను. 

కొనే ముందు ఒకసారి ఈ మౌస్ సంగతి తేల్చుకోవాలనుకున్నాను. ఒకసారి దాన్ని తెరచి ఏమైందో చూడాలనుకున్నాను. నాకున్న హాబీలలో - రిపేర్లు చెయ్యటం కూడా పిచ్చ పాషన్. రిపేర్ వల్ల అది బాగయితే - క్రొత్త మౌస్ కొనాల్సిన అవసరం తప్పిపోతుంది. బాగు కాకుంటే ఎలాగూ కొనబోతున్నాను కదా.. వదులుకొనే ముందు చివరివరకూ ప్రయత్నిస్తే - ఒక చిన్న ఆత్మ సంతృప్తి ఉండిపోతుంది - చివరికి వరకూ ప్రయత్నించాం అనీ.. 

ఇదే నా సిస్టం వైర్లెస్ మౌస్.. @ పాడయిన మౌస్. 


ముందుగా మౌస్ తీసుకొని చూశా.. విడదీయటం ఎలా అనీ.. లోపల స్క్రూస్ ఉండొచ్చు అని అనుకున్నాను. పైన ఉన్న బ్యాటరీ సెల్స్ కవర్ తెరిచాను. 2.0 వర్షన్ మౌస్ కాబట్టి AA సైజు బ్యాటరీలు ఉన్నాయి. 


స్క్రూల కోసం వెదికితే - ప్రక్కగా రెండు స్క్రూలు కనిపించాయి. వాటిని ఒక స్క్రూ డ్రైవర్ సహాయన విడదీశాను. 


వాటిని విప్పి, మౌస్ ని తెరిచాను. లోపల ఇలా ఉంది. 


మౌస్ క్రింద బాడీ నుండి ఆ లోన ఉన్న మౌస్ మదర్ బోర్డ్ ని విడదీశాను. అప్పుడు ఇలా అడుగు భాగం విడిపోతుంది. ఇందులో ఉన్న ట్రాన్స్పరెంట్ Transparent పార్ట్ ని సేపరేటుగా విడదీయాలి. ఈ భాగమే కర్సర్ కదలికల్లో కీలమైన భాగం. దీని పైన LED డయోడ్ ( మదర్ బోర్డ్ మీద ) ఉంటుంది. 


మౌస్ లోని మదర్ బోర్డ్ ఈ క్రింది విధముగా ఉంటుంది. ఇది Microsoft వారి 2.0v కీబోర్డ్ మౌస్. ఇందులో ఉన్న LED డయోడ్ మీద సెక్యూరిటీ గా ఒక ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా తీసి, ప్రక్కన పెట్టండి. 


ఈ రెండు ట్రాన్స్పరెంట్ భాగాలను మెత్తటి గుడ్డతో శుభ్రముగా తుడవాలి. 


ఇవే ఆ రెండు ట్రాన్స్పరెంట్ భాగాలు. వీటిని ఏమాత్రం మరకలు, దుమ్ము లేకుండా శుభ్రం చెయ్యాలి. 


ఇలా వీటిని శుభ్రం చేశాక మళ్ళీ వాటిని యధావిధిగా బిగించేసేయ్యాలి. అలా బిగించాక చూస్తే ఆశ్చర్యం.. నా సిస్టం మౌస్ కర్సర్ ఏమాత్రం వణుకు లేకుండా నిశ్చలముగా మానిటర్ స్క్రీన్ మీద ఉంటున్నది. ఇక క్రొత్త మౌస్ కొనాల్సిన బాధ తప్పింది. 


Wednesday, December 21, 2016

Cheapest Bobbin box

ఈమధ్య చాలా తక్కువ వ్యవధిలో, చాలా తక్కువ వ్యయంతో ఒక చిన్న ఉపయోగకర వస్తువుని తయారుచేసుకున్నాను. అదేమిటో మీకు కూడా చూపెట్టాలని అనుకొని ఈ పోస్ట్. 

చాలా ఏళ్ల క్రితం కొన్న Usha Janome కుట్టు మెషీన్ కొన్నాం.. దాంతో ఉచితముగా రెండు ప్లాస్టిక్ బాబిన్స్ వచ్చాయి. అవి ఎలాగూ సరిపోవని మరో నలబై బాబిన్స్ కొన్నాను. వీటిని పెట్టేందుకై ఒక బాక్స్ కూడా కొనాలని చూశాను కానీ సౌకర్యవంతమైది కనిపించక, మామూలుగా అన్నీ ఒక డబ్బాలో కలగలిపి ఉంచేవాళ్ళం. అలా ఉంచటం వలన వాటిని తీసుకోవటంలో ఇబ్బందులూ, దారాలు బయటకు వచ్చి, ఒకదానిని తీయబోతుంటే మరొకటి దారం వచ్చి... ఇబ్బంది పెట్టడం జరిగేది. వీటికి పరిష్కారం గురించి ఆలోచించా.. ఏమీ తట్టలేదు. 

మొన్నటికి మొన్న ఒక చక్కని పరిష్కారం తట్టింది. వెనువెంటనే దానికి ఒక రూపుని ఇచ్చాను. ఇదంతా చెయ్యటానికి ఎక్కువలో ఎక్కువ - అరగంట కన్నా ఎక్కువ సమయం తీసుకోదు. అది మీరూ తయారుచేసుకోవచ్చును. 
చాలా తక్కువ సమయంలో, 
తక్కువ ఖర్చులో, 
ఎక్కువ సౌకర్యముగా, 
తక్కువ జాగాలో ఇమిడిపోయే విధముగా ఉంటుంది. 

ముందుగా మీరు ఏదైనా స్టేషనరీ సామాను అమ్మే దుకాణాల్లో దొరికే పిల్లల పెన్సిల్ బాక్స్ ని తీసుకోవాలి. ఇవి రకరకాల ఆకారాల్లో, ధరల్లో ఉంటాయి. కానీ క్రింద చూపిన సైజులోని డబ్బా తీసుకోవడం మంచిది. ఇందులో అయితే రెండు వరుసలలో ఆ కుట్టుమెషీన్ బాబిన్స్ చక్కగా అమరుతాయి. అందుకే ఈ ఫోటోలో వాడిన డబ్బా లాంటిదే తీసుకోమని సలహా ఇస్తాను. ఇది బ్రాండెడ్ కంపనీ తయారీ కాదు. కేవలం 5 - 6 రూపాయల్లో దొరికే పెన్సిల్ బాక్స్. ఇదే బాక్స్ లో దానితో బాటే - A to Z అక్షరాల మరియు 1 - 10 అంకెల స్టెన్సిల్ కూడా వస్తుంది. అది పిల్లలకు ఇస్తే బోలెడంత సంతోషపడతారు. మన తయారీకి ఇది అవసరం లేదు. 


ఇప్పుడు ఒక అర అడుగు కి పైగా పొడుగు గల ఒక చదునైన ఫ్లాట్ బీడింగ్ చెక్కని 7" inches length Thin flat teak  beeding తీసుకోవాలి. ఇది ప్లైవుడ్ షాపుల్లో దొరుకుతుంది. ఒక అడుగు / Feet కి మూడు రూపాయల చొప్పున ఇది దొరుకుతుంది. ఏడు ఇంచీల చెక్క ముక్క ఇందులకు సరిగ్గా సరిపోతుంది. దీన్ని సరియైన సైజులోకి హెక్సా Hexa బ్లేడుతో కోసుకొని, అంచులని గరుకు / ఉప్పు కాగితముతో గానీ, గరుకు సిమెంట్ గోడకేసి రుద్ది ట్రిమ్ Trim చేసుకోవాలి. ఆ బాక్స్ లోపలి భాగాన్ని - అడ్డముగా రెండు భాగాలుగా చెయ్యటానికి సరిగ్గా సరిపోయేలా ఉండాలి. 

దాన్ని ఒక సన్నని మేకు వల్ల ఆ బాక్స్ మీదుగా కొట్టి బిగించాలి. నిజానికి ఇలా కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి బదులుగా గ్లూ గన్ వాడి అతకడం మంచిది. (ఇలాంటి ఐడియాలు మొదటిసారి చేశాక వస్తుంటాయి ) ఆ సన్నని చెక్కకు సన్నని డ్రిల్ వేసి, స్క్రూ బిగించి గానీ, మేకుని ఫెవిక్విక్ తో గానీ బిగించుకోవాలి. ఇవన్నీ చెయ్యరాని వారు |------| ఆకారములో ( మూడు ముక్కలని కలిపి ) చేసి, అ లోపలి భాగాన అమరేలా చేసుకోవాలి. 


పైన చిత్రంలో - బాక్స్ కి పై భాగము నుండి చెక్కకు మేకు కొట్టాను. మేకు కొద్దిగా తిన్నగా లోనికి దిగక, కాస్త ప్రక్కకి జరిగి, చెక్కని విరిచింది. కానీ గ్లూ గన్ వాడి అతికితే మరీ బాగుంటుంది. లేకుంటే ప్లాస్టిక్ ముక్కని వేడి చేసి, అతికితే మరీ బాగుంటుంది. ( మరో బాక్స్ కి మాత్రం ఏమాత్రం పగలకుండా చెక్కని బిగించాను ) ఇలా చెయ్యటంలో ఏదైనా పొరబాటు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సన్నని స్క్రూ ని డ్రిల్ వేసి, బిగించుకుంటే ఈజీగా ఉంటుంది. 

అలా అడ్డుగా ఆ చెక్కను బిగించుకున్నాక - మీరు వాడుకోవటానికి ఆ బాక్స్ సిద్ధముగా ఉన్నట్లే. ఇక అందులో బాబిన్స్ ఇలా క్రింది ఫోటోలో చూపెట్టినట్లు - నిలువుగా అమర్చుకుంటే 
  • వాటిని ఎన్నుకోవటానికీ, 
  • ఏ రంగు బాబిన్ ఎక్కడ ఉందో తేలికగా చూడవచ్చు. 
  • తేలికగా మనకు కావలసిన రంగుదారం బాబిన్ ఆ బాక్స్ లో ఉందో లేదో చూడవచ్చు. 
  • దారాలు కలగలసి, ఇబ్బంది పెట్టవు. 
  • అన్నింటికన్నా మించి తక్కువ ధరలో ( బాక్స్ Rs. 5 + చెక్కముక్క Rs. 3 + గ్లూ Re. 1 ) కేవలం తొమ్మిది 9 రూపాయల్లో చేసుకోవచ్చు. Cheap bobbin box 
  • తక్కువ జాగాలో బాబిన్స్ అన్నింటినీ సర్దుకోవచ్చు. 
  • డార్క్ రంగులవీ, లైట్ రంగులవీ అంటూ వేరు వేరు బాక్స్ లని పెట్టుకొని మన పనులని వేగముగా చేసుకోవచ్చు. 
  • విడి బాబిన్స్ ని చక్కగా అమర్చుకోవచ్చు.
  • ఈ బాక్స్ ల నుండి మనకు కావలసిన బాబిన్ ని తేలికగా తీసుకోవచ్చు.  
  • ఎక్కడికైనా తేలికగా, అనుకూలముగా ఈ బాక్స్ ని పట్టుకెళ్ళవచ్చును. 





Friday, September 16, 2016

వినాయక పూజ

ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం వినాయక చవితి ని ఈసారి కూడా బాగా జరుపుకున్నాం. ఆ విశేషాలు ఏమిటో మీకు తెలియచేద్దామని ఈ టపా.
అందరిలాగానే ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవం అందరితో బాటూ జరుపుకుంటూ ఉంటాం.. మామూలుగా ఉత్సవ వివరాలు చెప్పక విశేషాలు మాత్రమే మీకు చెప్పబోతున్నాను. ఇదేదో మా గొప్పకోసమనీ, మా డాబు ప్రదర్శించటానికో చెప్పట్లేదు. ఎవరికి ఎలా అనిపించినా మా పండగ మాది. ప్రతి సంవత్సరానికీ క్రొత్త క్రొత్తగా, ఉత్సవాన్ని కాస్త అభివృద్ధి చేసి చేసుకుంటున్నాం.. మొదట గణేశుడి ప్రతిమని గూట్లో పెట్టి పూజ చేసుకున్నప్పటి నుండి, ఇప్పటివరకు ఎన్నెన్నో మార్పులు. ప్రతి సంవత్సరానికీ ఏదో మార్పు. 

అందరిలాగానే మామూలుగా ఈ ఉత్సవాన్ని జరుపుకునే మాకు - చాలా సంవత్సరాల క్రిందట మా ఆవిడ ఒక ప్రతిపాదన చేసింది. అది - పండగ ప్రారంభం అయ్యాక మూడురోజులకే నిమర్జనం చేసే బదులు నవరాత్రులు పూజ చేశాక, నిమర్జనం చేద్దామని. బాగానే ఉంది కానీ రోజూ ఆ దేవుడికి చేసే కైంకర్యాలు ఎలా? పూజ, పూలదండ, శుద్ధి, పరిశుభ్రత, పూజా సంస్కారాలు, తీర్థ ప్రసాదాలు... ఇవన్నీ రోజూ శుభ్రతతో శుచిగా చెయ్యాలి. అప్పుడే ఆచారాలని సక్రమముగా నిర్వర్తించినట్లు. ఒకవేళ అలా చెయ్యడం అవకుంటే - ఆ ఆలోచనని మానుకోవడమే బెస్ట్. కానీ తన చిన్నప్పటి నుండీ ఇది కోరికనట. కాదని అనలేను.. అలాని అంటే తనని నొప్పించినట్లు అవుతుంది. పూజాఫలం మిస్ అవుతానేమో అనే శంక.. ఒప్పుకుంటే తన చిన్నప్పటి కోరికా నేరవేర్చినట్లు అవుతుంది. ఆ పూజ వల్ల మంచి అవుతుందేమో అని ఆశ. ఒప్పుకుంటే బయట వ్యవహారాలూ ( అంటే ప్రతిమ తేవడం, ప్రసాదాలకు కావలసినవి తేవడం.. నిమర్జనం చెయ్యడం వంటివి ) నావి, పూజా వ్యవహారాలు తనవి ( పూజ చెయ్యడం, శుచీ, శుభ్రత, ప్రసాదాల తయారీ, అవి పంచడం.. లాంటివి. ) ఇంత వివరముగా ఎందుకు చెబుతున్నానూ అంటే ఎవరికైనా ఇలాగే చేసుకోవాలని అనిపిస్తే కాస్త వివరముగా ఉంటుందనీ.. 

దాదాపు పదిహేను సంవత్సరాల క్రిందట నుండీ అలా ఇంట్లోనే నవరాత్రులనీ చెయ్యడం మొదలెట్టాం.. మొదట్లో మట్టి విగ్రహాలనే పూజకి పెట్టేవాళ్ళం.. ఈ లడ్డూ ప్రాముఖ్యతని గుర్తించి, ఆ తరవాత వామ హస్తంలో లడ్డూ ఉంచడానికి కోసమని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకి మారాల్సి వచ్చింది. ఇలా ఎడమ చేతిలో లడ్డూ పెట్టడానికి అనువుగా ఉండే మట్టి ప్రతిమలు దొరికితే మరింత సంతోషమే... 

ఒకప్పుడు ప్రతిమలు ముందుగా కొనేవాళ్ళం. పండగ రోజున ధర ఎక్కువగా ఉంటుందనీ. ఇప్పుడేమో అమ్మే వాళ్ళు ఎక్కువై, పండగ రోజున తక్కువలో ( ఆరోజు గనుక అమ్మకపోతే వాటిని వచ్చే సంవత్సరం వరకూ కాపాడాల్సిందే, వడ్డీ నష్టం మరొకటి.. ) అందుకే ఆరోజునే తక్కు వగా ధర ఉంటుంది - స్టాక్ ఎక్కువగా ఉంటే. 

సత్యనారాయణ స్వామివారి పూజాపీటని ఈ ఉత్సవానికి వాడుతున్నాం.. ఆ రెండు పూజలకి మిక్కిలిగా ఆ పీట ఉపయోగపడుతున్నది. భక్తి, శ్రద్ధలతో వినాయక వ్రతం చేశాక, ఎప్పటికప్పుడు మరిన్ని అలంకరణలు చేస్తూ బయట మండపాలకి ఏమాత్రం తగ్గకుండా ప్రతిరోజూ స్వామివారికి చెయ్యాల్సిన కైంకర్యాలు చేస్తూనే ఉన్నాం. ప్రతి ఏటా కాస్త మార్పులు చేస్తూనే ఉన్నాం. 

ఉదయాన శుచిగా పరిసరాలని శుభ్రం చేసి, ఆ తరవాత పూజ చేసి, ఆ సమయం తరవాత హోం థియేటర్ లో భక్తి పాటలు పెట్టి.. సాయంత్రాన రోజుకో వెరైటీ ప్రసాదాలు నివేదన చేసి, ఆ పిమ్మట చుట్టూ ప్రక్కల వారికి పంచటం.. జరుగుతుంది. ఇలా నవరాత్రులూ జరుగుతుంది. ఈసారి వినాయకుడి మీద లైట్ ఫోకస్ ని ఏర్పాటు చేశాను. 3watts LED బల్బుని లోపలి వైపుగా అమర్చాను. ఫలితముగా విగ్రహం దేదీప్యమానముగా వెలిగిపోతున్నది. ప్రొద్దున పూజ నుండీ రాత్రి వరకూ ఆ లైట్ వెలుగుతూనే ఉంటుంది. క్రిందన ఉన్న రెండు ఫోటోలలో చివరి ఫోటో అప్పటిదే. 

ఇక నిమర్జనం రోజున పెద్ద విగ్రహాలను పెట్టినవారికి మా విగ్రహాన్ని ఇచ్చి నిమర్జనం చేయించేవాళ్ళం. కానీ గత నాలుగైదు సంవత్సరాలుగా మేమే స్వయంగా పది కిలోమీటర్ల దూరంలోని చెరువులో నిమర్జనం చేస్తున్నాం.. ఈసారి మా అమ్మాయి తను నిమర్జనం చేస్తానని అంటే తననే చేయనిచ్చాం.. 

ఇవీ మా వినాయక ఉత్సవం ప్రత్యేకతలు. చిన్నబడ్జెట్లోనే కానీ బాగా ఆడంబరముగా, శుచిగా, త్రికరణ శుద్ధిగా, బయట ఎలా చేస్తున్నారో అలాగే మేమూ ఈ నవరాత్రులూ చేస్తున్నాం.. శ్రావణ మాస ఆరంభం నుండీ ఈ వినాయకనిమర్జనం వరకూ నీచు (Non-veg) పూర్తిగా బంద్. ఇలా అందరి వద్దా ఉండొచ్చు.. కానీ మా పద్ధతులని మీకు తెలియచేశాను. మాకు అంతా మంచే జరుగుతున్నది కూడా.. వచ్చే ఏట కూడా మరింత బాగా జరుపుకోవాలని అనుకుంటున్నాం.. ఈపోస్ట్ ని ఎప్పుడో వ్రాయాలని అనుకున్నా.. కానీ, నేడు నెరవేరింది. 

ఓం గం గణపతయే నమః 

వినాయక ఉత్సవం 2016

రాత్రివేళ 


Saturday, September 10, 2016

LED 23 watts BULB

ఈమధ్య LED పేరు బాగా వినపడుతుంది కదా అనీ - ఇంట్లోకి ఇక అన్నీ LED బల్బులు అమర్చాలీ అనుకున్నా.. శాంపిల్ కోసమని మామూలు వాటిల్లో ఒక కాస్త పేరున్న (ఆ కంపనీ పేరు ఎప్పుడూ వినలేదు..) బల్బ్ తీసుకున్నాను. వాడి చూశాను.. బాగుంది. ఆ బల్బ్ ధరనే కాస్త ఎక్కువగా ఉంది. కాస్త మన్నికగా అనిపించగానే ఇకనుండీ మంచి కంపనీలవే వాడాలనుకొని - బ్రాండెడ్ కంపనీ Surya సూర్య కంపనీ వారి 0.5 watt బల్బ్ తీసుకున్నాను. ఇంటి ముందు రాత్రంతా వెలుగు ఉండాలని. అలాని ఎందుకూ అంటే - ఇంటి ముందు రాత్రిన వెలుతురు ఉంటే - ఆ రాత్రిన దొంగ(లా) రావాలంటే ఆ వెలుతురు అడ్డంకిగా ఉంటుంది. నిజముగా అవసరముండి రావాలనుకున్నవారికి అదొక ఉపయోగకరముగా ఉంటుంది. మాకేమో ఆ చీకట్లో ఎవరైనా వస్తే చూడటానికి తేలికగా గుర్తుపట్టేలా ఉపయోగపడుతుంది. ఇది అప్పట్లో Rs. 70 రూపాయలు. అయినా ఆ LED బల్బ్ జీవితకాలంతో పోలిస్తే లాభమే. ( రోజుకి 10 గంటలు వాడినట్లయితే 0.5w X 10 Hours = రోజుకి 5 వాట్లు X 30 రోజులు = 150 వాట్స్ X 12 నెలలు = సంవత్సరానికి ఆ బల్బ్ విద్యుత్ వినియోగం 1800 watts / 5 Rs. ఒక యూనిట్ ధర అనుకుంటే = సంవత్సర కాలానికి రాత్రి పూట పది గంటల పాటు ఆ బల్బ్ వాడితే 9 రూపాయలు అవుతుంది అన్నమాట. బాగా చవక కదూ ) 

ఈ లెక్కలన్నీ చూస్తుంటే వీడేదో పీనాసి లా ఉన్నాడే అనుకోవచ్చు. మామూలుగా నా ఇంటి విద్యుత్ బిల్లు దాదాపు వెయ్యి రూపాయలు. అందుకే ఆ బిల్లు తగ్గిద్దామని ప్రయత్నాలు. ఆ చిన్న బల్బు ఇంకా అమోఘముగా పనిచేస్తుండటముతో మరో రెండు Surya LED 14w బల్బ్స్ తీసుకున్నాను. అవీ బాగా పని చేస్తుండటంతో మొన్న ఆగస్ట్ 20 న  ఐ సినిమాలో మాదిరిగా " అంతకు మించి.. " అనుకుంటూ ఎక్కువ వాటేజీ బల్బ్ కోసం వెళ్లాను. అనుకోకుండా ఆ షాప్ లో Surya 23w బల్బ్ కనిపించింది. అడిగి ఆ బల్బ్ వివరాలు తెల్సుకున్నాను.. 




కవర్ అట్ట మీదున్న బొమ్మలా లోపల బల్బ్ ఉంది. ( క్రింది ఫోటోలో ఆ LED బల్బ్ ఫోటో పెట్టాను. చూడండి ) మిగితా LED బల్బులా కన్నా కాస్త బరువుగా ఉండి, ధర ఎక్కువగా ఉంది. మామూలు బల్బ్ హోల్డర్ లో నేరుగా పెట్టేసుకొని వాడుకోవచ్చు. వెలుతురు ఎలా ఉంటుందో బల్బ్అ హోల్డర్ లో పెట్టి టెస్ట్ చేశా.. చాలా బాగుంది. కూల్ డే లైట్ వెలుతురు వస్తుంది అని కవర్ మీదుంది. ఈ బల్బ్ వెలుతురు కాస్త నీలిరంగులో ఉండి, పరిసరాలు, వస్తువులు మరింత ప్రకాశవంతముగా కనిపిస్తాయి. మామూలు LED బల్బ్స్ పెట్టిన చోట ఈ ఎక్కువ వాటేజీ బల్బ్ పెడితే మరింతగా వచ్చే వెలుతురు మనల్ని బాగా ఆకట్టుకుంటుంది. ధర కవర్ మీద MRP ఎనిమిది వందల చిల్లర ధర ఉన్నా నేను Rs. 630 కి కొన్నాను. కొన్ని ఆన్ లైన్ సైట్లలో Rs. 500 కే దొరుకుతున్నా కొట్టులోనే కొన్నాను. ఆ షాప్ వాడు రెండు సంవత్సరాల వారంటీ ఇచ్చాడు. ఆ రెండు సంవత్సరాల కాలములో బల్బ్ వెలగక పోతే మరో బల్బ్ రిప్లేస్ మెంట్ ఉంటుంది అన్నమాట. ఈ విషయం మరింత ఆకర్షణీయముగా ఉందనుకున్నాను. ఒక బల్బ్ కొని వాడటం మొదలెట్టాను. హాశ్చర్యం కలిగించే వెలుతురు. గదులన్నీ బాగా వెలిగిపోయాయి. కాంతిని కొలిచే ల్యూమేన్స్ పరముగా చూసినా ఎక్కువ వెలుతురు ఇస్తున్నది. ధర ఒక్కటే కాస్త ఆలోచించాల్సిన విషయం కానీ ఒక ట్యూబ్ లైట్ల స్థానములో రెండు ఈ బల్బ్స్ వాడితే మరింతగా వెలుతురు వస్తుంది. కరంట్ బిల్ ఏమాత్రం ఎక్కువ అవదు. షాపుల్లో ముఖ్యముగా చిన్న కొట్లలలో, బట్టలు, ఇమిటేషన్ నగల కొట్లలో వాడితే వెలుతురుకి వెలుతురు.. అమ్మే వస్తువులు కూడా బాగా ప్రకాశవంతముగా కనిపిస్తాయి. మొత్తానికి ఒక గదిలో వాడటానికి నిర్ణయించుకున్నాను. 

మూడు రోజుల తరవాత ఒకరోజు సాయంత్రం ఆ బల్బ్ జీరో బల్బ్ లా వెలగటం మొదలెట్టింది. ఆ బల్బ్ కవర్ అలాగే ఉంచాను కాబట్టి దానిలో ప్యాక్ చేసి, ఆ షాప్ వాడికి చూపించాను. అతను చెక్ చేసి, మరో మాట మాట్లాడక మరో 23w బల్బ్ మార్పిడి చేసిచ్చాడు. హమ్మయ్య.. అది అలా అవటం వల్ల నాకున్న ఒక సందేహం తీరింది. ఇదే బల్బ్ ఆన్లైన్ లో కొని ఉంటే రిప్లేస్ చెయ్యటం బహుశా అసాధ్యమేమో... కాస్త డబ్బులు ( Rs. 130 ) ఎక్కువైనా షాపులో కొన్నదే మంచిది అయ్యింది. ఈరోజుకీ ఆ బల్బ్ శుభ్రముగా పనిచేస్తూనే ఉంది. దాని మీద వారంటీ మరో దాదాపు సంవత్సరం మీద పదకొండు నెలల కాలముంది. అంతవరకూ నిశ్చింతగా వాడుకోవచ్చు. ఆ బల్బ్ మీద పెట్టుబడి పరంగా లెక్క చూస్తే  
= Rs. 630 / 24 నెలలు ( 2 సంవత్సరాల కాలం ) 
= Rs. 26.25 / నెలకు అవుతుంది. 
= రోజుకి అంటే ( 26.25 / 30 రోజులు ) = 87.5 పైసల పెట్టుబడి. అంటే రూపాయికి కన్నా తక్కువే. . 
త్వరలోనే మరో నాలుగైదు బల్బ్స్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. 

LED బల్బుల కలర్ టెంపరేచర్ గురించి ఈ క్రింది చార్ట్ లో చూడొచ్చు. నేను ఇదే బల్బ్ ని తప్పక వాడండి అని చెప్పట్లేదు. నాకు అందుబాటులో ఉన్న కొట్టులో కొన్న ఈ 23watt LED గురించి వ్రాస్తున్న రివ్యూ ఇది. 




Related Posts with Thumbnails