Thursday, February 28, 2013

Good Morning - 283


డబ్బుని చూసి పుట్టే ప్రేమలు కొద్దిరోజులే ఉంటాయి. 
రూపాన్ని చూసి ప్రేమలు కొంతకాలమే ఉంటాయి. 
నమ్మకం మీద నిలిచే ప్రేమలు కలకాలం నిలిచి ఉంటాయి. 

Good Morning - 282


నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తీ, ఇప్పటికీ నిన్ను ఇష్టపడేది - నీ స్నేహితుడు మాత్రమే..

Wednesday, February 27, 2013

Good Morning - 281


ప్రేమ ఎంత మంచిదో, అంత పిచ్చిది.. 

Tuesday, February 26, 2013

Good Morning - 280


చినుకుతో కబురు పంపాను నీ చెలిమిలో నేను తడవాలని..
చంద్రునితో నీ కుశలం అడిగాను - 
నా చెలి నాకయి వెదుకుతుందా అని, 
చినుకు నిన్ను చేరిన క్షణాన, మబ్బులతో కమ్ముకున్న చందమామ 
నీ మోము చూడలేకపోయానని చిన్నబోయింది..
చినుకు నిన్ను తాకానని నాకు చెప్పి చింత తీర్చింది. 

Good Morning - 279


మానసికముగా ఇష్టపడండి.. కానీ శారీరకముగా ఇష్టపడకండి.. ఈరోజు ఉన్న అందముగా రేపటికి ఉండదు. 

Monday, February 25, 2013

Good Morning - 278


మన బలాల్ని మనం రహస్యముగా ఉంచుకోవాలి. ఈ విషయములో తాబేలే మనకు ఆదర్శం. పైపొర చాటున తన పాదాలని ఎంత జాగ్రత్తగా దాచుకుంటుంది..! - చాణక్యుడు. 

అవును..మన బలాల్ని రహస్యముగా ఇతరులకు తెలీకుండా ఉంచుకోవాలి. అవసరమైన సమయాల్లో వాటిని ప్రదర్శించాలి. మన శక్తులు, యుక్తులు బయటవారిని ముందే చూపిస్తే, శత్రువులు పసిగట్టేస్తే - వాటికి విరుగుడేమిటో  దాన్ని మనపై చూపి ఆధిపత్యం వహిస్తారు - అని చాణక్యుడి అభిప్రాయం. 

Sunday, February 24, 2013

Good Morning - 277


సంతోషాలు వికసించిన సుమాలు.. 
వాటి జ్ఞాపకాలు ఎన్నటికీ వాడిపోని సుమగంధాలు. 

Saturday, February 23, 2013

Good Morning - 276


అర్థం చేసుకోవటానికి ఒక జీవితకాలం పడుతుందేమో కానీ, అపార్థం చేసుకోవటానికి ఒక నిమిషం చాలు. 

నిజమే కదా...! ఒక వ్యక్తి మనసుని, అతని వ్యక్తిత్వాన్నీ, చేస్తున్న పనుల్నీ, పలికే మాటలనీ, నడవడికనీ... అర్థం చేసుకోవటానికి చాలాకాలం పడుతుంది. అది ఒక్కోసారి  జీవిత కాలం కూడా అవచ్చును. కానీ అదే ఎదుటివ్యక్తిని  - అపార్థం చేసుకోవటానికి - కేవలం ఒక నిమిషం మాత్రమే చాలు. అంటే ఒక మనిషిని తప్పుగా అంచనా వేసుకోవడం చాలా ఈజీ అన్నమాట. అందుకే ఒక మనిషి మీద అంచనాకి వచ్చే ముందు కాసింత సమయం తీసుకొని, క్షుణ్ణంగా తెలుసుకొని, ఒక అభిప్రాయానికి రండి. అలా చేస్తే మీ జీవితాన ఒకరి పరిచయం / స్నేహం / ప్రేమ / అభిమానం .. ఇవేవీ మీ నుండి దూరం కాదు. 

ఒకవేళ దూరం అయితే - వెంటనే ఒక మెట్టు దిగి, ఆ అవతలి వ్యక్తిని తొందరగా కలిసి, క్షమాపణ వేడుకోండి. మీ తప్పుని నిర్లజ్జగా ఒప్పేసుకోండి. ఇది చాలా నిజాయితీగా చెయ్యండి. అప్పుడు ఎప్పటిలా మీ అనుబంధం కొనసాగవచ్చును. 


Friday, February 22, 2013

Good Morning - 275


ఒకరిని దూషించే ముందు, 
మరొకరిని నిందించే ముందు, 
ఇంకొకరిని తప్పు పట్టే ముందు, 
వేరొకరిని అవమానించే ముందు, 
ఆ మనిషి స్థానమున - 
నిన్ను ఊహించుకో!.. 
అప్పుడు ఆ బాధేమిటో తెలుస్తుంది. 

అవును.. ఒకరు తప్పు చేస్తే - వారిని తిట్టే ముందు, ఆస్థానమున మనల్ని ఊహించుకోవాలి. అలాని ఎందుకంటే - మనం ఆ స్థానాన ఉంటే - అలాంటి పొరబాటు చేస్తామా? లేదా? అని ఆలోచించుకోవాలి. మనం ఆ స్థానాన ఉంటే అవతలి వ్యక్తి చేసిన తప్పే మనం చేసేటట్లయితే, మనకి ఆ వ్యక్తిని తప్పు పట్టే అర్హత లేదు. ఇలా నిర్ణయం తీసుకోవటంలో నిజాయితీ ఉండాలి. ఒకవేళ అవతలివారి స్థానములో మనం  ఉన్నప్పుడు - వారికన్నా ఇంకా మెరుగైన ప్రదర్శన చేసేవాళ్ళం అయితే - అప్పుడు వారిని విమర్శించే అర్హత వస్తుంది. 

నిజానికి అవతలివ్యక్తి  యొక్క పోనీలే అనే మనస్తత్వమే ఒక్కోసారి మనల్ని అలా విమర్షించేలా చేస్తుంది. ఇది ఎలా అంటే - మనం వారిని విమర్శించినప్పుడు అవతలి వ్యక్తి మనతో - " ఓహో!. అలాగా.. నిజముగా నాకు తెలీదు ఇలా చెయ్యాలి అనీ.. మీరొకసారి చేసి చూపిస్తే నేర్చుకుంటాను. మీవల్ల ఒక విషయం నేర్చుకున్నవాడినీ అవుతాను.." అని అంటే - అప్పుడు ఆ విషయం మనం వారికి ప్రదర్శించే సత్తా ఉండాలి. అప్పుడు మనలో అంతటి ప్రతిభ లేకున్నట్లయితే - మనం మొహం ఎలా చూపెట్టగలం.? 

నన్ను విమర్శించేవారిని నేను ఇలాగే ప్రశ్నిస్తాను. చాలామంది ఎలా చెయ్యాలో చేసి చూపలేరు. అప్పుడు వారికి మనసుకి తగిలేలా ఒక చిన్న ఆధిపత్యపు చిరునవ్వు నవ్వుతాను. వారు గిల గిల కొట్టుకుంటారు. అది చాలు వారికి అదే శిక్ష. ఒకవేళ వారు చూపిస్తే, చిన్నగా " కృతజ్ఞతలు.. మీరు ఇలా అర్థమయ్యేలా చూపించాక, ఇక ఆ లోపాన్ని మళ్ళీ నాలో చూపించను.. ఎనీ వే థాంక్స్ వన్సగైన్ .." అని చెబుతాను. 

ప్రతి మనిషిలో లోపాలు ఉంటాయి. ఆ లోపాలని పెద్దగా చేసి చూడవద్దు. అలా చూసినప్పుడు ప్రతి వ్యక్తిలో లోపాలే కనిపిస్తాయి. 

ఈ క్రింది వీడియో చూడండి. సాగరసంగమం సినిమాలోనిది. ఈ సన్నివేశములో - ఒక ఆడిటోరియంలో శైలజ ఒక నృత్యప్రదర్శన ఇస్తుంది. ఆ ప్రదర్శన గురించి అందరూ మెచ్చుకుంటారు. పత్రికల్లో కూడా బాగుంది అని రివ్యూలు వస్తాయి - ఒక్క బాలు (కమల్ హాసన్) ది తప్ప. ఈ బాలు ఆ నృత్యాన్ని విమర్శిస్తాడు. అదేమిటీ అని దౌర్జన్యముతో అడిగిన శైలజ ప్రియుడిని, ఆమెనీ - అందరి ముందూ ఆమె చేసిన నృత్య భంగిమలని మళ్ళీ చెయ్యమని చెప్పి, తను చేశాక, అసలు నృత్యం అంటే ఏమిటో తన ముందు చేసి చూపిస్తాడు. ఒకే భాగాన్ని వేరు వేరు నృత్య రీతుల్లో చేసి చూపిస్తాడు. అది చూశాక నాట్యం అంటే ఏమిటో అందరికీ తెలుస్తుంది. నన్ను బాగా ఇంప్రెస్ చేసిన సన్నివేశం అది. క్రింద వీడియోలో మీరూ ఒకసారి, వీలైతే మళ్ళీ ఇంకొకసారి చూడండి. 



Thursday, February 21, 2013

[తెలుగుబ్లాగు:21985] సమాధానం

అందరికి నమస్కారం 
నాకు ఒక చిన్న డౌటు, అదిఏమిటంటే నేను ఒక బ్లాగు క్రియేట్‌ చేశాను అయితే గూగుల్‌లో సెర్చి కొడితే నా బ్లాగు అడ్రసు కనిపించటంలేదు. దానికి నేను ఏమి చేయాలి.తేలియజేయగలరు.
 [తెలుగుబ్లాగు:21985] కి నేను ఇచ్చిన సమాధానం. 

క్రొత్తగా బ్లాగ్ తెరచిన వాళ్ళందరికీ ఎదురుక్కొనే సాధారణ సమస్య ఇది. ముందుగా మీకు - కొత్త బ్లాగ్ ప్రారంభించిన సందర్భముగా మీకు అభినందనలు. ఇది చాలా చిన్న సమస్య. మీరు ఈ క్రింది పద్ధతుల ద్వారా మీయొక్క సమస్యని తేలికగా తొలగించుకోవచ్చును. 

ముందుగా మీరు మీ బ్లాగ్ హోం పేజీ ఓపెన్ చెయ్యండి. ఇది తెరవటానికి మీరు www.blogger.com అనే లింక్ నొక్కి గానీ, అడ్రెస్ బార్ లో ఓపెన్ చేస్తే - నేరుగా మీ బ్లాగ్ హోం పేజీ తెరచుకుంటుంది. అప్పుడు మీరు ఇలా కుడివైపున ఉన్న More options (ఇది - మౌస్ కర్సర్ దాని మీద పెడితే అలా More options అని కనిపిస్తుంది. క్రింది ఫోటోలో ఆకుపచ్చ బాణం గుర్తుతో చూపబడిన స్థానములో ఉంటుంది) ప్రక్కన ఉన్న చిన్న గడిలోని త్రికోణాన్ని నొక్కితే, ఇలా క్రింది ఫోటోలో మాదిరిగా డ్రాప్ మెనూ తెరచుకుంటుంది. అందులో Over view, Posts... ... ఇలా ఉండి, చివరిలో Settings అని ఉంటుంది. ఫోటో సరిగా కనపడక పోతే - ఆ ఫోటో మీద డబల్ క్లిక్ చెయ్యండి. 


పైన ఫోటోలో నీలి రంగు బాణం గుర్తుతో చూపిన వద్ద Settings ని నొక్కితే, మీకు ఇలా సెట్టింగ్స్ పేజీ ఓపెన్ అవుతుంది. 

ఇప్పుడు 2 వద్ద నున్న Settings ని నొక్కితే, ఆ సెట్టింగ్స్ లోని, బేసిక్ అనే మొదటి విభాగం 1 మీకు కనిపిస్తుంది.

అలాగే 3 వద్ద నున్న Edit ని నొక్కండి.  


అలా తెరచుకున్న ఆ బేసిక్ సెట్టింగ్స్ లలో 4 వద్దన ఉన్న Add your blog to our listings అన్న చోట Yes అనే ఆప్షన్ వద్ద " క్లిక్ " చెయ్యాలి. ఇలా చేస్తే గూగుల్ వారి బ్లాగుల లిస్టు లోకి మీ బ్లాగ్ ని చేర్చుతున్నారన్న మాట. 

అలాగే 5 వద్ద నున్న Let search engines find your blog అన్న చోట కూడా Yes అనే ఆప్షన్ వద్ద " క్లిక్ " చెయ్యాలి. ఇక్కడ అలా చేస్తే - మీరు కోరుకుంటున్నట్లుగా - మీ బ్లాగ్ గూగుల్ సెర్చ్ లోకి వెళ్ళి - మీ బ్లాగ్ పేరు టైపు చేసి, వెదికితే - దొరుకుతుంది. 

( ఇలా ఈ ఆప్షన్ ఉండటం ఎందుకూ అంటే - కొన్ని బ్లాగ్స్ పర్సనల్ పని మీద కూడా ఉంటాయి. అవి కొందరికే కనిపించేలా చెయ్యాలి అనుకుంటే అలా పబ్లిక్ గా సర్చింగ్ లోకి రాకూడదు. అందుకే అలా ఈ ఆప్షన్. ఉదాహరణకి : మీ కుటుంబాలలో పెళ్లి చూపులు, ఎంగేజ్ మెంట్, లగ్నపత్రిక, ఉపనయనము, పెళ్లి, రిసెప్షన్ లాంటివి ఇక్కడ పోస్ట్ చేసుకొని, కొందరికే ఆ ఆ బ్లాగ్ లింక్ ఇచ్చి, కనిపించేలా చేసుకోవచ్చును. అలా ఒక పాతిక మెయిల్ అడ్రెస్స్ ల వారికే ఈ సదుపాయం ఉంటుంది. అలాంటివారికి వారి బ్లాగ్ సర్చింగ్ లో కనిపించకూడదు కదా.. ఇలా పెళ్లి అనే కాదు.. ఒక ప్రత్యేకమైన పనికోసం కూడా చేసుకోవచ్చును. కానీ ఈ సెట్టింగ్స్ ఎలా చెయ్యాలో తెలీక, ఇప్పుడు అందరూ సోషల్ సైట్లలో ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నారు. ఇది జెనరల్ నాలెడ్జి కోసం చెబుతున్నాను. ఇది మీకు అవసరం పడదు ) 


అలా మీరు అక్కడ Yes ఆప్షన్స్ ఎన్నుకున్నాక, 6 వద్దనున్న Save changes ని నొక్కండి. అంతే! కొంత సమయం తరవాత మీ బ్లాగ్ పేరుని సర్చ్ చేసి, వెదుక్కోవచ్చును. 

Wednesday, February 20, 2013

Good Morning - 274


అవతలివారు నీ గురించి ఏమనుకుంటున్నారో అని ఆలోచిస్తూ కూర్చుంటే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవడమే మరచిపోతావ్..! ఇది నీ జీవితం. నీకు నచ్చినట్లుగా జీవించు.. జీవితం ఉన్నది జీవించడానికే కదా..!

అవును.. అవతలి వారు ఏమనుకుంటున్నారో అనుకుంటూ - ఆలోచిస్తూ కూర్చుంటే మన గురించి, మన ఎదుగుదల గురించీ అన్నీ మరచిపోతాం.. ఫలితముగా జీవితాన ఏమీ అభివృద్ధి లోకి రాము. నీకు నచ్చినట్లుగా ఉండు. అలాని అందరికీ దూరం అయ్యేలా ప్రవర్తించకు.. నీవు ఏమేమి సాధించాలని అనుకుంటావో, ఆ పనుల వల్ల నీ జీవితం అభివృద్ధి చెందుతుందని, ఉల్లాసముగా ఉంటావని నమ్మకం ఉంటుందో ఆయా చర్యలని వెంటనే చేసేయ్.. 

Tuesday, February 19, 2013

Good Morning - 273


ప్రేమ ఎంత మంచిదో అంత పిచ్చిది..

Sunday, February 17, 2013

Good Morning - 272


నీ జ్ఞాపకాలే తోడుంటే - ఎలాంటి గాయాన్నైనా చిరునవ్వుతో భరించటానికి నా మనసు ఎప్పుడూ సిద్ధమే!..


Good Morning - 271


ఇంతలేసి కళ్ళతో అంత లేత మనసుతో, 
చేస్తున్నావు అంత వింత మాయలో, 
మెరుపు వంటి చూపుతో, 
నా మనసుకు గిలిగింతలు పెడుతుంది...

Friday, February 15, 2013

Good Morning - 270


గాలి వంటిది నీ జ్ఞాపకం.. ప్రతిక్షణం నన్ను తాకుతూనే ఉంటుంది.. స్పందన కలిగిస్తుంది.. 

Thursday, February 14, 2013

Good Morning - 269


ఏ మనిషికైనా జీవితములో ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్య సాధన కోసం అహర్నిశలు కృషి చేసి సాధించాలి. 

Wednesday, February 13, 2013

Good Morning - 268


విమర్శలకు భయపడకు, ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది..

Tuesday, February 12, 2013

Good Morning - 267


స్నేహితులు జన్మిస్తారు, రూపొందించబడరు. 

Monday, February 11, 2013

Good Morning - 266


నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి - ఇప్పటికీ నిన్ను ఇష్టపడేది - నీ స్నేహితుడు మాత్రమే..! 

అవును.. మీ గురించి, మీ అలవాట్ల గురించీ, మీ ఆలోచనల గురించీ, మీ ప్రవర్తన గురించీ, మీరు ఎలా నిర్ణయాలు తీసుకుంటారో, ఎలా చొరవ చూపిస్తారో, ఎలా స్నేహ బంధాన్ని నిర్వహిస్తారో, ఇతరులమీదా, మీ మీద ఎలా శ్రద్ధ చూపిస్తారో, మీలోని లోపాలు ఏమిటో, మీ బలహీనతలు ఏమిటో.. ఇత్యాది విషయాలు అన్నీ తెలిసిన వ్యక్తి ఈ ప్రపంచములో ఒకరున్నారు. వారే - మీ స్నేహితుడు. 

మీ గురించి తెలుసుకున్నాక - ఈ ప్రపంచం మిమ్మల్ని అట్టే దూరం పెట్టాక, లేదా ఒక్కొక్కరూ మీ నుండి దూరం జరుగుతున్నప్పుడు, మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అని వచ్చే వ్యక్తి స్నేహితుడు ఒక్కడే. 

మీరు తనతో సరిగా ప్రవర్తించకున్నా, సరిగా మాట్లాడకున్నా, కొద్దిగా అయిష్టత చూపించినా - అయినప్పటికీ మీతో స్నేహాన్ని కొనసాగించేవాడే స్నేహితుడు. స్నేహం అన్నాక ఎన్నో గిల్లి కజ్జాలు, చిరు అలకలు, పోట్లాటలు, త్యాగాలు, పంచుకోవటాలు అన్నీ ఉంటాయి. అవన్నీ మీ స్నేహ బంధాన్ని మరింతగా బలపరిచేవే. 

ఎలాగూ స్నేహితుడు అన్నాక, ఏమైనా అంటే పడతారనీ, నాకే బాగా విలువ ఇవ్వాలని, నన్నొక ప్రత్యేక వ్యక్తిగా పరిగణించాలనీ, నా మాటే చెల్లుబాటు కావాలని అనుకుంటే - ఇక ఆ కాస్త ఉన్న వారూ దూరం అయిపోతారు. తస్మాత్ జాగ్రత్త.. ఈ విషయాన్ని మరోసారి చెప్పుకుందాం. 




Sunday, February 10, 2013

Good Morning - 265


ఒక పాత స్నేహితుడు ఎదుగుదలకు సుదీర్ఘ సమయం పడుతుంది. 

Saturday, February 9, 2013

Good Morning - 264


స్నేహం అనేది ఒక ఆత్మ, రెండు దేహాలు నివసించే చోటు. 

Good Morning - 263


Friday, February 8, 2013

Good Morning - 262


మిత్రులు, మంచి నడత - సంపద వెళ్ళలేని చోటుకు కూడా మిమ్మల్ని తీసుకువెళ్ళుతుంది. 

అవును కదా.. సంపద వల్ల ఎన్నెన్నో చోట్లకి వెళ్ళగలం. ఎన్నెన్నో చవి చూడగలం. కానీ మనకి ఉన్న మంచి మిత్రులూ, మంచి నడవడిక - ఆ సంపద తీసుక వెళ్ళలేని చోటుకి కూడా మిమ్మల్ని తీసుక వెళతాయి. ఆ సజ్జన మిత్రుల సహచర్యం, నడవడిక మనలో అంతులేని, జీవితాంతం వెన్నాడే మధుర స్మృతులని అందిస్తాయి. సంపద వల్ల వచ్చే ఆనందాలన్నీ తాత్కాలికమైనవి.. అదే మంచి మిత్రులు, నడత - మీకు అంతులేని జ్ఞాపకాలని ఇస్తాయి. 

Good Morning - 261


బద్ధకానికి వెంటనే గుడ్ బై చెప్పి, కష్టంగా కాదు.. ఇష్టంగా.. పట్టుదలతో కృషి చేస్తే జీవితములో ఏదైనా సాధ్యమే.. !

Thursday, February 7, 2013

Good Morning - 260


మీరు - ఎవరి నుంచి ఏమీ ఆశించకండి..! నిజాయితీగా వ్యవహరించండి. మీరు అలా ఉండగలిగితే, మిమ్మల్ని చూసి మిగిలినవాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. 

Good Morning - 259


ముఖ స్తుతి చేసేవారికీ, వెన్నుపోటు పొడిచేవారికీ - పెద్దగా తేడా ఏమీ ఉండదు. 

Wednesday, February 6, 2013

సాంకేతిక సమస్యలు - సమాధానాలు

Telugu Group లో నేను ఒకరి ప్రశ్నలకి ఇచ్చిన సమాధానాలు. మీలో ఎవరికైనా ఉపయోగపడతాయేమో అని, కాపీ, పేస్ట్ చేస్తున్నాను. [తెలుగుబ్లాగు:21977]

1) నేను బరహా వాడి తెలుగులో టైపు చేస్తున్నాను. బరహా పేడ్’లో అయినా, వర్డ్’లో అయినా టైపు చేసేటప్పుడు ‘కర్సర్’ బాగా కదిలిపోయి ఇక్కడా, అక్కడా కదిలిపోయి రక రకాల ‘టేబ్’లు’ తెరచి తెగ ఇబ్బంది పెడుతోంది. దాదాపు 170 పైన పోస్టింగులు చేసినా ఇంత వరకు దీనికి నివారణ కనిపెట్టలేక పోయాను. అలాగే నెట్టుకొస్తున్నాను. కర్సర్ కదలకుండా ఉండాలంటే ఏం చేయాలి ?

2) వర్డ్’లో టైపు చేసాక సేఫ్ చేసేటప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘ఫైల్ సబ్’మిషన్ ఎర్రర్’ అని చూపిస్తూ , అదే ఫైల్లో సేవ్ కావడం లేదు ! మాటి మాటికీ ఫైలు పేరు మార్చ వలసి వస్తోంది ! దీనికి ఏం చేయాలి ?

3) లేప్ టాప్ త్వరగాఅ వేడి ఎక్కిపోతోంది. అప్పుడప్పుడు, బహుశా టెంపరేచర్ కంట్రోల్ వల్లనేనేమో కంప్యూటర్ ఉన్నట్లుంది ,‘డెడ్’ అయి పోతోంది ! మళ్లీ సిస్టంని ఆన్ చేసి ఫైలు తెరచేసరికి, చేసినదంతా చెరిగిపోతోంది,
మీ సలహాల కోసం ఎదురు చూస్తుంటాను --- 

=======================

మీరు పడుతున్న ఇబ్బందులు చదివాను. అవి తొలగటానికి - నా సలహాలు ఏమైనా ఉపయోగపడతాయేమో చూడండి.. 

1. మీరు వాడుతున్న బరహా సాఫ్ట్వేర్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. బరహా ప్యాడ్ లో మీరు టైప్ చేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ సమస్యల్లా మౌస్ పాయింట్ ' కర్సర్ ' వల్లనే. ఈ సమస్య మీకు డెస్క్ టాప్ వాడుతున్నప్పుడా? లేదా లాప్ టాప్ వాడుతున్నప్పుడా తెలియచేయలేదు.. 

డెస్క్ టాప్ లో ఇలా కర్సర్ కదలటానికి గల కారణాల్లో ఒకటి - మీరు వైర్ లెస్ మౌస్ వాడటం వలన కూడా జరుగుతుంది. 
  1. అందులోని బ్యాటరీలు వీక్ గా ఉన్నా, 
  2. మౌస్ లో సరిగా అమర్చలేకున్నా, 
  3. మౌస్ - రిసీవర్ కి సరిగా కనెక్ట్ అవకున్నా, 
  4. రీచార్జ్ బ్యాటరీలు సరిగా చార్జ్ కాకున్నా.. అలాగే కర్సర్ కదిలిపోతుంది. నేను వాడేది వైర్ లెస్ కీ బోర్డ్, మౌస్ కాబట్టి అలా చెబుతున్నాను. 

ఒకవేళ మీది లాప్ టాప్ అయితే - మౌస్ పాడ్ మీద వత్తిడి ఎక్కువై, లేదా అది మరీ సున్నితం అవటం మూలాన  అలా జరుగుతుండవచ్చును. 

ఇక టాబ్స్ ఓపెన్ చెయ్యటం : 

ఇది మీ సిస్టం నెమ్మదిని తెలియచేస్తున్నది. ఇది మీరు ఎక్కువగా మౌస్ క్లిక్ చేస్తున్నారు అనుకుంటున్నాను. మీరు నొక్కడమే - మీకు తెలీకుండా డబల్ డబల్ సార్లు నొక్కుతున్నారనుకుంటాను. మొదటిసారి నొక్కగానే విండోస్ వెంటనే తెరచుకోలేదని, సరిగా నోక్కలేదేమో అనుకొని డబల్ క్లిక్ చేస్తే, మీ సిస్టం నెమ్మది వల్ల కాసింత ఆలస్యముగా ట్యాబ్స్ ఓపెన్ అవుతున్నాయి అనుకుంటాను. అలా ట్యాబ్స్ రావటానికి - ముఖ్యముగా ఇదే కారణంగా ఉంటుంది. సాధారణముగా సిస్టం నెమ్మదనానికి ఈ క్రింది కారణాలు ఉంటాయి. 

  1. మీరు మీ పని చేసుకుంటున్నప్పుడు ఏవైనా ఎక్కువ ర్యాం మెమొరీ వాడుతున్న ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసి ఉన్నట్లయితే అలా నెమ్మదిగా పనిచేస్తుంది. ఇదొక్కటే కాదు. చాలా కారణాలు ఉంటాయి. 
  2. స్క్రీన్ సేవర్ ని హై రిజల్యూషన్ లో వాడటం, 
  3. ర్యాం RAM మేమోరీని ఎక్కువగా వాడే ప్రోగ్రామ్స్ ఓపెన్ చెయ్యటం (యు ట్యూబ్ వీడియోలు పనిచేస్తున్నప్పుడు వీక్షించటం వంటివి), 
  4. అలాగే ఎక్కువ ట్యాబ్స్ తెరచి ఉంచి వాడకుండా ఓపెన్ చేసి ఉంచటం.. 
  5. మీ ఆపరేటింగ్ సిస్టం My Documents లో ఫైల్స్ ఎక్కువైపోయి కూడా అలా మీ సిస్టం నెమ్మదిగా పనిచేస్తుంది. 
  6. మీ సిస్టం ర్యాం తక్కువ మెమొరీదై ఉండవచ్చును. ఇంకా చెప్పాలీ అంటే DDR 1 లేదా 2 లో 1 GB కన్నా తక్కువ అయి ఉండొచ్చు. ఇవన్నీ సరిగ్గానే ఉన్నాయే అనుకుందాం.. 
  7. బ్యాక్ గ్రౌండ్ లో కొన్ని ప్రోగ్రామ్స్ నడుస్తుంటాయి. వాటిని మీరు మీ సిస్టం లోని టాస్క్ మేనేజర్ లోకి వెళ్లి వాటిని " కిల్ " చెయ్యాలి (ఆపాలి). 
  8. ఇంకొన్ని కారణాలు కూడా ఉంటాయి. మీరు వాడుతున్న ఆపరేటింగ్ సిస్టం డ్రైవ్ పార్టిషన్ లోని ఖాళీ స్థలం ఒక జీబీ ( 1 GB ) కన్నా తక్కువ అయిన సందర్భాల్లో కూడా జరుగుతుంది. 
  9. సాఫ్ట్ వేర్ అప్డేట్స్ పెట్టినప్పుడు / అవుతున్నప్పుడు కూడా ఇలా అవుతుంది. 
  10. మీ ఆపరేటింగ్ సిస్టం అప్డేట్స్ వల్ల కూడా అయి ఉండొచ్చును.
  11. మీ సిస్టం Disk fragmentation వల్ల కూడా అలా సిస్టం నెమ్మదిగా పనిచేస్తుంది. 
  12. ఏదైనా మాల్వేర్ అటాక్ జరిగి ఉండొచ్చు. ఇదే కారణం అయితే పాత అంటి వైరస్ సాఫ్ట్ వేర్ తీసేసి, క్రొత్తగా అంటి సాఫ్ట్ వేర్ ఇన్స్టాల్ చెయ్యండి. ఇది మీ సిస్టములో అంతర్జాల కనెక్షన్ కనెక్ట్ అయ్యాక ఆ పని చెయ్యండి. అలా చేస్తే అప్డేట్స్ అన్నీ ఆటోమేటిక్ గా జరుగుతాయి. 
2. ఎమ్మెస్ వర్డ్ గురించి అంతగా తెలీదు. కారణం దాన్ని ఎప్పుడూ వాడలేదు.. బ్లాగులో నేరుగా టైప్ చేస్తాను కాబట్టి అంతగా తెలీదు. మీరు నేరుగా బ్లాగ్ లోనే టైప్ చేస్తే మీకు చాలా సమయం సేవ్ అవుతుంది అనుకుంటాను. " ఆటోసేవ్ " అనే ఆప్షన్ ని మీరు ఎన్నుకుంటే - టైప్ చెయ్యగానే వెంటనే సేవ్ అవుతుంది. మధ్యలో పవర్ పోయినా సేవ్ అయి ఉండటంతో మీరు టైప్ చేసినదంతా కోల్పోరు. మీరు ఆఫ్ లైన్ లో బ్లాగ్ వ్రాసుకుంటానూ అంటే వర్డ్ యే చాలా మంచిది. కానీ వ్రాస్తున్నప్పుడు ఎప్పటికప్పుడు Control + Save నోక్కాల్సి ఉంటుంది. అలా మరిచామా! పవర్ పోతే వ్రాసినదంతా పోతుంది. 

మీరు వర్డ్ లో వ్రాసింది సేవ్ చేసుకున్నాక, అందులోనే మళ్ళీ వ్రాయాలనుకున్నప్పుడు మీరు ఆ ఫైల్ ఓపెన్ చేసి, అందులోనే వ్రాసి, సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇంకో ఫైల్ గా సేవ్ కాదు. ఇది మీకు తెలియనిది కాదు. ఇందాక వర్డ్ పరీక్షించి చూశాను. అంతా బాగానే ఉంది. వేరే ఫైల్ ఓపెన్ చేసి అందులో వ్రాసి, మొదటి ఫైల్ పేరు మీద సేవ్ చేస్తే - అప్పుడు తప్పకుండా ఎర్రర్ వస్తుంది. అప్పుడు అక్కడ ఒక చిట్కా పాటించండి. అది ఏమిటంటే - మీరు సేవ్ చేస్తునపుడు, ముందున్న ఫైల్ పేరు ప్రక్కన 1, 2, 3, 4.. ఇలా పెట్టేసుకుంటూ వెళ్ళండి. ఒకదాని గురించి వ్రాస్తున్న ఫైల్స్ అన్నీ వరుసగా సేవ్ అవుతాయి. 

3. లాప్ టాప్ త్వరగా వేడి అవుతుంది అంటే లోపల ఉన్న కూలింగ్ ఫ్యాన్ తిరగటం లేదేమో.. ఒకసారి సరి చూడండి. దానికి అంటుకొని ఉన్న దుమ్ము వల్ల కూడా అది పనిచెయ్యదు. ఆ ఫ్యాన్ కి అడ్డముగా ఏదైనా వుండి ఉండవచ్చును. దీనికి లాపీ అధీకృత సర్విస్ పర్సన్ అవసరం. ఒకవేళ ఫ్యాన్ సరిగా ఉంటే - చిన్న ఫ్యాన్స్ ఉన్న లాప్ టాప్ స్టాండ్ మార్కెట్లో దొరుకుతుంది. దాని మీద మీ లాప్ టాప్ పెట్టుకొని పనిచేసుకోవటం వలన మీ లాప్ టాప్ మరింత సమర్థవంతముగా పనిచేస్తుంది. 

మళ్ళీ తెరిచేసరికి మీరు టైప్ చేసినదంతా పోతుంది అన్నారు.. అది ఎప్పటికప్పుడు కంట్రోల్ + సేవ్ నోక్కాల్సిందే. దీనికి మరింత వివరణ రెండవ సమాధానములో చూడండి. 


Tuesday, February 5, 2013

I miss you friend..

ఫిబ్రవరి 5


మిత్రమా..! 
మీ స్నేహ జీవితాన ఒక శ్రేయోభిలాషిలా ఉన్న నేను, ఇదేరోజున ఒక ముద్దాయిలా దూరం అయ్యాను. అలా ఎందుకు చేశావు అని మీరు అడగలేదు. నేను చెప్పలేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం.! 
నేను మీకు దూరమైతే - మీరు మరింత సంతోషముగా ఉంటారని అలా దూరమయ్యాను. ఉన్నారు కూడా.. మిమ్మల్ని బాధ పెట్టనని మాటిచ్చాను. నేనుంటే సంతోషముగా మీరుండరు. అందుకే నామీద మీకు అసహ్యం కలిగేలా చేశాను. దూరమయ్యాను. నా నేస్తం సంతోషముగా ఉంటుందీ అంటే అంతకన్నా ఈ ప్రపంచములో నాకు కావలసింది ఏముందీ..?

ప్రేమే కాదు స్నేహం కూడా త్యాగాన్ని కోరుకుంటుంది. నమ్మకమే జీవితం అన్నట్లే - స్నేహం కూడా నమ్మకం పునాది మీదే ఆధారపడుతుంది. అవతలివారికి మనమీద నమ్మకం ఎప్పుడైతే తొలగిపోతుందో - ఇక దూరంగా ఉండటం చాలా మంచిది. పూర్తిగా దూరం కానవసరం లేదు.. వదిలి వెళ్ళిపోయే పరిస్థితి వరకూ కాదు. వారికి ఎప్పుడైనా మీనుండి మాత్రమే అయ్యే సహాయం అవసరమయ్యేటప్పుడు కనీస అందుబాటు దూరములో ఉంటే చాలు. అంతవరకూ బాగున్న స్నేహం ఒక్కసారిగా దూరం అయితే ఆ ఇద్దరూ లోలోన కుమిలిపోతూనే ఉంటారు. ఎదుటివారు బాగుండాలి అని కోరుకుంటుంటారు. కాలమే ఇక బాధని తీర్చాలి.  

నిజానికి ఇలా విడిపోవటం చాలా బాధని కలుగజేస్తుంది. మామూలుగా చేసిన స్నేహాల్లో తొందరగానే విడిపోతారు. రెండుమూడు రోజుల్లో తేరుకుంటారు. కానీ మనసుతో స్నేహం చేసినప్పుడు మాత్రం - ఆ బాధ అంత తొందరగా తీరదు. వెంటాడుతూనే ఉంటుంది. ముఖ్యముగా ఇరువురి మధ్యా వచ్చిన అపోహలు ఏమిటో తెలుసుకొని, చర్చించుకుంటే అంతా సర్దుకుంటుంది. కానీ అలా చెయ్యటానికి అహం ( Ego ) అడ్డు వస్తుంది. అయినా స్నేహితునితో మాట్లాడటానికి అహం ఎందుకూ.. నిజానికి ఆ అహమే పెద్ద అడ్డు. 

ఒక్క నిముషం భరించండి. ఆ అహం పటాపంచలు అవుతాయి. దూరం అయిన స్నేహితునితో మాట్లాడండి. లేదా మధ్యవర్తితో మాట్లాడించండి. ఎక్కడ మనస్పర్థలు జరిగాయో, ఆ అంశాల మీద ఇద్దరూ మనసు విప్పి చర్చించుకోండి. ఒకరి మాటలకు లేని పోని భేషజాలకి పోకుండా నిజాయితీగా సమాధానం ఇవ్వండి. అది ఒక మెట్టుదిగి మాట్లాడినట్లుగా ఉండాలి. కాసేపట్లో అంతా మామూలు అవుతుంది. పూర్వం లాగే మళ్ళీ మంచి మిత్రుల్లా కలసిపోతారు. 

స్నేహం అన్నాక, పొరపొచ్చాలు రావటం సహజమే, భార్యాభర్తల బంధములో ఉన్న అలకలూ, కోల్డ్ వార్, గిల్లికజ్జాలు .. ఇక్కడా మామూలే. మళ్ళీ కలిస్తే - ఆ స్నేహానికి పట్టిన దోషాలు, దిష్టీ పోయాయి అనుకోవాలి. హ హ హ్హ. 

Monday, February 4, 2013

Soul mate friend - 1

Soul mate friend - ఈ పదం క్రొత్తగా ఉందా? ఉంటుంది కూడా.. సోల్ మేట్ అనే పదానికి ఫ్రెండ్ అనే పదం కలిపి చెబుతున్నాను. క్రొత్తగా వినటానికి ఉన్నా, పాత అర్థమే అది. Sole అంటే ఆత్మ. mate అంటే జోడీ, చెలికాడు / చెలికత్తె . friend అంటే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.. స్నేహితుడు. ఈ ఫ్రెండ్ అని కలపకుండా చెబితే - ప్రాణ సఖుడు అని అర్థం వస్తుంది. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది స్నేహితుడి గురించి. అందుకే ఆ పదానికి స్నేహితుడు - friend అని కలిపాను.

అసలు ఈ soul mate అనేది నా నేస్తం తన ఫోటో కామెంట్ గురించి అన్నప్పుడు మొదటిసారిగా విన్నాను. ఆ పదం గురించి తెలుసుకుంటే పైన చెప్పినట్లు అర్థం తెలుసుకున్నాను. ఆ పదానికే ఫ్రెండ్ అని కలిపాను. ఈ పదంని తెలుగు లోకి మారిస్తే -  ఆత్మ స్నేహితుడు అని చెప్పవచ్చు. క్రొత్తగా ఉంది కదూ.. 

ఇక్కడ నేను చెప్పేది ఆ పదానికి కొంత వివరణ అంతే! 

ఈ సృష్టిలో అందమైనది స్నేహమేనోయి అన్నారు. నిజమే. చాలా అందమైనది. మనిషి సంఘజీవి. సహచర మిత్రుడు లేనివాడు చాలా అరుదు. అలాంటివాడు లోలోన కుమిలిపోతాడు, ఒంటరిగా ఉంటాడు, ఎప్పుడూ బాధతో, ఏదో పోగొట్టుకున్న వాడిలా ఉంటాడు. మొహం లో చాలా గంభీరత ఉంటుంది. ఎక్కువగా మాట్లాడరు. వారి మాటల్లో విచారం ఎప్పుడూ తొంగి చూస్తుంది. ఏవైనా ఇలా చేస్తే - పని జరుగుతుంది అన్నప్పుడు - అబ్బే! అలా కుదరదు అని తేలికగా, అపనమ్మకముగా చెప్పేస్తారు. ఇలాంటి లక్షణాలు మీలో గనుక ఉంటే - మీకు స్నేహితులు అయినా ఉండక పోవాలి. లేదా మీరే మీ స్నేహితుల గుంపు నుండి ఒంటరిగా మసలేలా ఉండాలి. అదే నిజమైతే మీరు మారాలి. 

నేను క్రొద్దిసంవత్సరాల క్రిందటి వరకూ స్నేహాన్ని నమ్మేవాడిని కాదు. ఆ విషయం నా సోషల్ సైట్స్ సీరిస్ పోస్ట్స్ లలో చెప్పాను. అది నా పొరబాటు కొంత.. నాకు దొరికినవారు అలా.. ఒక గ్యాంగ్ ( ఈ గ్యాంగ్ గురించి తరవాత చెబుతాను.. ఆ టపా వ్రాశాక ఇక్కడ లింక్ ఇస్తాను) తప్ప మిగతా అంతా అవసరార్ధం స్నేహాలే!. అందుకే విరక్తి వచ్చేసింది. అందుకే ఆ పోస్ట్ లలో చెప్పినట్లు ఈ ఆన్లైన్ లో అట పాట అన్నట్లు మొదట్లో ఉన్నా, తరవాత మంచి స్నేహాల వల్ల మారాను. 

ఇప్పుడు ఒక యాభై మంది పరిచయాలు ఏర్పడి, స్నేహితులుగా మారారు. వారిలో కొందరు నా శ్రేయోభిలాషులు, సన్నిహితులుగా మారారు. కొద్దిమంది ఈ sole mate friends అయ్యారు. వీరందరికీ కృతజ్ఞతలు. వీరికి సర్వదా రుణపడి ఉన్నాను.

ఇప్పుడు సోల్ మేట్ ఫ్రెండ్ గురించి చెబుతాను.. ఇది నా వెర్షన్ మాత్రమే! ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి.

సోల్ మేట్ ఫ్రెండ్ ని అలా ఇలా చూసి, ఎంచుకోలేం. ఎన్నెన్నో చూసి, ఎన్నెన్నో వడపోతల తరవాత ఎంచుకుంటాం. ఏదో అలా కలసి మాట్లాడినంత మాత్రాన, ప్రాణ స్నేహితులు గా ఏర్పడరు.

ప్రాణ స్నేహితులు అన్నవారిలో మన అభిరుచులకి తగ్గట్లుగా, మన వేవ్ లెంత్ కి తగినట్లుగా సరిపడినవారినే అలా స్నేహితులుగా అర్హతనిస్తాం.

న మనస్తత్వం గురించి, బాగా తెలిసినవారైనాక అప్పుడు ఇలా ప్రాణ స్నేహితులు అన్న హోదానిస్తాం. అంతకు ముందే ఇచ్చేసుకుంటే అది తొందర తప్ప మరేం కాదు.

ప్రాణ స్నేహితులు ఆడవారై ఉండొచ్చును, లేదా మొగవారై ఉండొచ్చు. అలా ఎంచుకొనేటప్పుడు ఆస్థి, అంతస్థులు, మతం, హోదా, సామాజిక వర్గం, దగ్గర దూరం, పరువూ, ప్రతిష్టలూ, ఐశ్వర్యం, కలిమి, లేమి, పెద్దా చిన్న.. లాంటి అడ్డంకులు రావు. ఇవి చూసుకుంటే ఇక ప్రాణ స్నేహితులు ఏర్పడరు. అలాని చూసుకొని, నా ప్రాణ స్నేహితునికి ఇలా గొప్పగా ఉంది అనుకుంటే అది కొద్దిరోజులే. కలకాలం నిలబడని స్నేహం అది. ఆతరవాత బాధనే మిగులుతుంది. 




స్నేహం, ప్రేమా రెండు ఒకేలా ఉంటాయి. రెండూ పరిచయం, ఆకర్షణ పునాదుల మీదే ఏర్పడతాయి. రెండింటిలో ఒకేలా ప్రవర్తిస్తాం. భావాలూ, చేతలూ ఒకేలా అనిపిస్తాయి.. కానీ కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి. ఉదాహరణకి (వయసులో వచ్చే) ప్రేమలో వయస్సు వల్ల వచ్చే ఆకర్షణ, వ్యామోహం ఉంటుంది. కానీ ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత వేరు చేస్తుంది. దూరాన నుండి చూస్తే ఒకేలా ఉంటాయి. అబ్బాయి, అమ్మాయి నిజముగా స్నేహమే చేస్తున్నారే అనుకుందాం. దూరాన నుండి అది ప్రేమలాగే కనిపిస్తుంది. స్నేహం అనేది వారిని బాగా గమనించిన వారికే అర్థం అవుతుంది. ఆ తేడాలు గమనించగలం.. కానీ అవి ఏమిటో చెప్పలేం.

స్నేహం - పరిచయం, స్నేహితుడు, శ్రేయోభిలాషి, ఆప్తుడు, ప్రాణస్నేహితుడు.. అన్న రూపములో ఎదిగితే; ప్రేమ - ఆకర్షణ , పరిచయం, ఇష్టం, అభిమానం  ఆరాధన.. లా సాగుతుంది. ఇందులో ఆరాధన స్థాయికి వచ్చాక ఇక ఆ మనిషి తన ఆస్తిత్వం కోల్పోతాడు. అంతవరకూ రానిచ్చుకోకండి. రెండింటిలో వేరోకదానిలో ఉన్నవీ కనిపిస్తాయి. ప్రేమలో కనిపించే అభిమానం స్నేహంలో కూడా ఉంటుంది. అందుకే ఈరెండూ ఒకేలా ఉంటాయి. నిర్వచించటం చాలా కష్టం.

స్నేహములో కానీ, ప్రేమలో కానీ మనిషి పూర్తిగా మారిపోతాడు. మునపటి కన్నా ఆనందమయ జీవనాన్ని గడుపుతాడు. అది కొనసాగటానికి అలాగే మరింత ధృడముగా చర్యలు తీసుకోవాలి. 


(మిగతా ఇంకో టపాలో చెప్పుకుందాం..) 

Sunday, February 3, 2013

Good Morning - 258


మనుష్యులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. తొందరగా శక్తిని ఖర్చు చేసుకొని, అలసిపోయినవాడికే అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకొనే అవకాశం చిక్కుతుంది. 

Saturday, February 2, 2013

Good Morning - 257


నిదురపో.. మిత్రమా.. నిదురపో..!!
చల్లటి గాలికి - చిరాకులని వదిలేసి, హాయిగా నిదురపో.. 
లోకం లోని కుళ్ళుని, ప్రొద్దున నుంచీ పడ్డ కష్టాన్ని అంతా 
మరచిపోయి, ప్రశాంతముగా నిదురపో..!
అన్నీ మరచిపోయి హాయిగా నిదురపో!! 

కానీ పడుకొనే ముందు - 
నిన్నటి నుండి ఏమి నేర్చుకున్నాను, 
నేడు ఎలా గడిపాను, 
రేపు ఎలా నడుచుకోవాలి అనేది ఆలోచించుకో.. 
నిదురపో.. మిత్రమా నిదురపో..!! 

Good Morning - 256


ఏ రంగం వారికైనా విజయరహస్యం ఒకటే!.. 
ఎన్ని అవరోధాలు ఎదురైనా మన కలల్ని సజీవముగా ఉంచుకోవాలి. 
ఏదో ఒకరోజు - అవి నిజమై తీరుతాయి. 

Friday, February 1, 2013

Good Morning - 255


నిజమైన ప్రేమలో తీసుకోవటం కన్నా ఇవ్వటమే ఎక్కువగా ఉంటుంది. 



Related Posts with Thumbnails