Thursday, January 31, 2013

Good Morning - 254


మనసుకు రూపమంటూ లేదు. కానీ, అది విశ్వమంతటా విస్తరిస్తుంది. రెక్కలు లేకుండానే అంబర వీధిలో ఎగిరిపోతుంది. పాదాలు లేకుండానే నేల మీద పరుగులు తీస్తుంది. 

Wednesday, January 30, 2013

Good Morning - 253


ఒకరిని దూషించే ముందు, మరొకరిని నిందించే ముందు, ఇంకొకరిని తప్పు పట్టే ముందు, వేరొకరిని అవమానించే ముందు, ఆ మనిషి స్థానమున - నిన్ను ఊహించుకో! అప్పుడు ఆ బాధేమిటో తెలుస్తుంది. 

అవును.. మనం ఒకరిని తిట్టడం, కోప్పడటం, వారి తప్పులు చెప్పటం, అవమానించడం, హేళన చెయ్యటం చాలా తేలిక. ఇలా చెయ్యటం కొందరికి దైనందిక జీవనచర్యలా  కూడా ఉంటుంది. వారికి తమ తప్పుల గురించి తెలీదు. వేరేవారిని ఏదైనా అనడం చేస్తారు. వారు అలా ఇతరులని అనే ముందు ఒకసారి ఆ స్థానమున తాను నిలబడి ఉన్నట్లు, ఎదుటివారు అంటే ఎలా ఉంటుందో చూసుకున్నాక - అప్పుడు ఆ మాటలు అనాలి. అప్పుడే మాటలకి ఉన్న శక్తి, ఆ మాటలు చేసే బాధ ఏమిటో తెలుస్తుంది. 

ఇప్పుడు మీకు రెండు ఉదాహరణలు చెబుతాను. ఒక అమ్మాయిని ఆమె స్నేహితురాలు ఎప్పుడూ ఒక మాట అనేది.. " మీ అమ్మ పోలికలు నీకు లేవని.." దానికి ఆ అమ్మాయి మొహం చిన్న బుచ్చుకోనేది, బదులు ఇచ్చేది కాదు.. ఒక్క మాట అనేది కాదు. ఏదో ఒకసారికి అన్నదే అనుకుందాం. కానీ మాటిమాటికీ అంటుంటే - ఈ అమ్మాయి అలా అన్న అమ్మాయితో ఒంటరిగా ఉన్నప్పుడు ఒక మాట అంది.. "ఈమాట నాతో అన్నావు కానీ ఇంకెవరి వద్దా నీవు అనకు. అంటే బాగోదు. నీవు నా స్నేహితురాలివి కాబట్టి పోనీలే అనుకుంటున్నాను. కానీ అందరూ అలా మౌనముగా ఉండరు. ముఖ్యముగా నీ విషయములో.. ఇదేమాట నిన్నే అంటే ? నీవెంత బాగుంటావు.. మీ నాన్నలా. అదే మీ అమ్మ కి, మీ నాన్నకి ఏమైనా మ్యాచ్ అవుతుందా? అసలు ఎవరూ ఆవిడ మీ అమ్మ అని అంటే ఒప్పుకోరు.. మైండ్ ఇట్. " అంది. ఆ అమ్మాయి అమ్మ రూపం అస్సలు బాగోదు. ఇలా అనిపించుకున్నాక - ఆ అమ్మాయి ఇంకెప్పుడూ అలా అనలేదు. 

అలాగే కొందరు ఒకరితో - మా కుటుంబాన్ని ఉద్దేశ్యిస్తూ " అక్కడేముంది.." అని అన్నారు. (నేను మాత్రం దీన్ని ఆర్థికముగా అన్న రూపములో తీసుకున్నాను. ఆ ఒకరిది తప్పేం లేదు. తనకి మాతో ఒక చక్కని కుటుంబ బంధం ఉంది) ఏమీ ఉందొ, ఏమి లేదో వాళ్లకేం తెలుసు.. నాది నాకు తెలుసు. ఏది ఎంత ఉందో నాకు తెలుసు. ఫరవాలేదు అనే స్థితిలో ఉన్నా. కానీ ఇంత ఉందని అందరికీ చెప్పుకోలేం కదా. ఉన్న కాడికి ఏదో చిన్నగా ఉంది. మా అవసరాలకు సరిపోతుంది. పోగేసేయ్యాలని ఏమీ లేదు. కానీ ఇక్కడ మాత్రం నేను ఎదురు ఏమీ అనలేదు. విన్నాను. చాలా బాధ పడ్డాను. ఆ ఒకరితో "ఎప్పుడూ బాధపెట్టను.." మాట ఇచ్చాను. కాబట్టి ఏమీ అనలేక పోయాను. అలా అన్నవారి గుంపుకి తెలిసిన ఒకరితో చెప్పాను.. "మా వద్ద ఏమీ లేకపోవచ్చును.. కనీసం ఈరోజు అవసరాలు తీర్చుకోవటానికి కూడా ఇబ్బంది పడుతున్న స్టేజీలో నేనుండ వచ్చు. కానీ, ఎవరైనా వస్తే, ఒక మోస్తారు అతిధి మర్యాదలు చేసే స్థాయిలో ఉన్నా.. అదీ ఆ రోజుకి, ఆ పూటకి లేకపోతే, కనీసం ప్రక్కింటి నుండి గ్లాసెడు.. కాదు కాదు చెంచాడు మంచి నీళ్ళు అడిగి తీసుకొచ్చి, ఇచ్చే స్థాయి మాత్రం ఉంది.." అన్నాను. 

అందుకే ఏదైనా మాట అనే ముందు మనం ఆ స్థానము నుండి ఎదుటివారి / మాట పడేవారి స్థానమున ఉండి ఆలోచించండి. ఆ మాట అనాలో వద్దో మీకే తెలుస్తుంది. అప్పటివరకూ మీమీద ఉన్న గొప్ప అభిప్రాయం, అభిమానం ఆ ఒక్కమాటతో పోతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. 

Tuesday, January 29, 2013

చూస్తే చాలు, నోరు ఊరుతుంది.


ఈ మామిడి ముక్కలు, ఉప్పూ కారం ను చూస్తే చాలు.. నోరూరిపోతున్నది కదూ.. ఆ వగరు + తీపి ఉన్న మామిడి ముక్కలు కోసుకొని నోట్లో వేసుకున్న మరుక్షణాన నాలికకి రుచి తగలగానే - ఏదో తెలీని పులకరింత, ఆనందం. నా  చిన్నప్పుడు మా స్కూల్ వద్ద ఎన్నో మామిడి చెట్లు ఉండేడివి. చలికాలాన చలికి ఆ మామిడి చెట్ల మొదలులో, ఉషోదయ ఎండలో మా తరగతి మొత్తం పాఠాలు వినేవాళ్ళం. వేసవి మొదలు అవుతున్న తరుణములో ముందే ఆ చెట్లకి మామిడి పూత విరగ కాసేడిది. దాన్ని చూసి, " ఇక కాయలు కాచే సమయం మొదలయ్యిందన్నమాట.." అని అనుకునే వాళ్ళం. 

మామిడి కాయలు కాచాక, ఇక మా ఆటా, పాటా అంతా ఆ చెట్ల వద్దే. కనీసం అక్కడ ఇరవై చెట్లు అయినా ఉండేవి. తినగలిగే సైజులోకి కాయలు కాయగానే, ఇక మా దూకుడు మొదలయ్యేది. ఆ చెట్లు ఎక్కగలిగే నైపుణ్యం నాకు లేదు. నా మిత్రులలో కొందరు ఎంచక్కా ఆ చెట్లని ఎక్కి, కాళ్ళతో ఊపి, కాయలు క్రింద పడేలా చేసేవాళ్ళు. వాటిని ఏరుకొని, అందరమూ సమభాగాలుగా చేసుకొని తినేవాళ్ళం. కొందరు ఆలస్యముగా వస్తే వాళ్ళ కోసం మళ్ళీ చెట్లు ఎక్కి కాయలు తెంపే వాళ్ళు. 

కొద్దిరోజులు అలా గడిచాక, ఇక పుస్తకాలల్లో బ్లేడ్లూ, చిన్న సైజు మొండి కత్తి పట్టుకోచ్చేవాళ్ళు. వాటితో ముక్కలు చేసి పంచుకోనేవాళ్ళం. ఇంకొందరు కాగితాల్లో ఉప్పు పొట్లం లా కట్టుకొని పట్టుకోచ్చేవాళ్ళు. మొదట్లో నేను మామిడి ముక్కలని అలాగే తినేవాడిని. స్నేహితులు ఇలా ఉప్పు అడ్డుకొని తింటే బాగుంటుంది అని చెప్పటంతో ఆ రుచి చూశాను. వావ్! చాలా బాగా అనిపించింది. అదీ కొద్దిరోజులే.. 

ఆతరవాత ఉప్పూ, కారం పొడి కలిపి పొట్లం కట్టుకొని వచ్చేవాళ్ళు. మొదట్లో - అలా ఆ కాంబినేషన్ బాగుండదు అనుకున్నా కానీ, ఒక్కసారి తిను.. వదల్లేవ్ అని ఆ రుచీ అలవాటు చేశారు. నిజముగా అద్భుతం. ఇక అలాగే రుచి మరిగాను. వదల్లేవ్ అని అన్నది వరమా? శాపమా?? అని ఇప్పటికీ తెలీదు కానీ - ఇప్పటికీ ముక్కలు అలాగే తినాలనిపిస్తుంది. తింటాను కూడా. 

వేసవిలో వచ్చే పరీక్షల దాకా, ఇవే మా టిఫినీ. ఎవరైనా సేపరేటుగా ఉప్పు మాత్రమే పట్టుకొస్తే - ఆ ఉప్పుని వేరేవాళ్ళు తెచ్చిన కారం లోకి కలిపెసేవాళ్ళం. అందరిదీ ఒక్కటే అని, ఏమాత్రం తారతమ్యాలు చూపేవాళ్ళం కాదు. పరీక్షలు కాగానే సహచరుల కోసం ఎదురుచూస్తూ, మరికొన్ని కాయలు తెంపేవాళ్ళం. చివరి పరీక్షనాడు అయితే - కాయల మీద దృష్టి లేకుండా వీడుకోలు మీదే దృష్టి పెట్టి, స్కూల్ నుండి ఇళ్ళ వరకూ అందరమూ గుంపుగా నడిచి వచ్చేవాళ్ళం.  


Monday, January 28, 2013

Good Morning - 252


ఒక చిన్ని చిరునవ్వు ఎందరినో మీ స్నేహితులని చేస్తుంది. కానీ క్షణికమైన కోపం ఎందరినో శత్రువులని ఇస్తుంది. కనుక మీ విలువైన జీవితాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చిరునవ్వుతో ఆస్వాదించండి. 

ఎవరైనా ఎదురుకాగానే మీ మొహాన వెలిసే ఒక చిన్ని చిరునవ్వు ఎదుటివారిని చాలా బాగా ఆకట్టుకుంటుంది. మీరు మాట్లాడేదాని కన్నా ఎక్కువగా ఇదే అవతలివారిని ఇంప్రెస్ చేస్తుంది. మీమీద ఒక మంచి అభిప్రాయాన్ని కలిగిగించేలా చేస్తుంది. ఎదుటివారికి ఆత్మీయులుగా దగ్గరికి చేస్తుంది. కానీ - ఒక క్షణికమైన కోపం మీ మీద ఎదుటివారికి ఉన్న ఒక మంచి అభిప్రాయాన్ని తొలగిస్తుంది. మీరు ఆ అర్థం లేని కోపాన్ని అలాగే కొనసాగిస్తే మీకు వారు శత్రువులు అయ్యే ప్రమాదమూ ఉంది. శత్రువులు మన జీవితాన పెరుగుతున్న కొలదీ మన జీవితం ఎదుగుదలలో ప్రతికూలత ఎదురవుతుంది. అప్పుడు మనలో ఎంత ప్రతిభ ఉన్నా - చివరకు మామూలు వ్యక్తుల్లా ఉండిపోతాము. ఇంత ప్రమాదం ఉంది కాబట్టే - కోపాన్ని తగ్గించుకొని, మీ మొహాన కాసింత ప్రసన్న వదనముతో, , ఎక్కడైనా, ఎప్పుడైనా మీ జీవితాన్ని చిరునవ్వు మోముతో అనుభవించండి. 

Sunday, January 27, 2013

Good morning - 251


మనిషికి జనన మరణాల మధ్య దొరికే ఒకే ఒక్క అవకాశం జీవితం. పోరాటాలే తప్ప ఓటమి తెలియకూడదు. ప్రయత్నాలే తప్ప నిస్పృహలుండరాదు. ఆశాతత్వమే తప్ప నిరాశావాదం తలెత్తరాదు. అప్పుడు నీకు దక్కిన అవకాశం వందశాతం సద్వినియోగమే అవుతుంది. 

జీవితం అనేది పుట్టుక మరియు చావు మధ్య ఉండే చిన్ని కాలం. ఇది మనిషికి దొరికే ఒకే ఒక్క అవకాశం. ఎన్నో జన్మలు ఎత్తిన తరవాతే - మనిషిగా జన్మించేందుకు అవకాశం వస్తుంది అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అలాంటి మనిషి జన్మని సద్వినియోగం చేసుకుంటే - " మనీషి "  అవుతాడు. 

అలాంటి మన జీవితములో - ఎన్నెన్నో అడ్డంకులు, అవరోధాలు, ఇబ్బందులు.. అవి సర్వ సాధారణం. వాటితో  నిత్యమూ పోరాటం చెయ్యక తప్పదు. ఈ పోరాటములో విజయం తేలికగా లభించదు. మొదటగా ఓటమే వరిస్తుంది. అలాని బేలగా మారితే - ఇక విజయం సిద్ధించదు. ఎదురుగా అడ్డంకులు కొండలా ఉన్నా, దాన్ని దాటేందుకు ఎక్కడో ఒక చిన్న ఆధారం ఉంటుంది. దాన్ని వెతికి, తెలివిగా పట్టుకోండి. దాని సహాయాన రెట్టించిన ఉత్సాహముతో మళ్ళీ పోరాటం మొదలెట్టండి. మళ్ళీ ఓడినా - ఆ అవకాశం వల్ల విజయాన్ని గెలుచుకోవటానికి మరొక దారి కనుకున్నామనీ - పాత దారిలో వెళ్ళితే ఓటమే దొరుకుతుంది అని తెలుసుకోండి. ఏమీ చెయ్యకుండా వదిలేసే వాడికన్నా క్రొత్త దారిలో ప్రయత్నించేవాడే గొప్పవాడు. అలా ప్రయత్నిస్తూ ఉంటే - ఏదో ఒకనాటికి విజయం వరిస్తుంది. 

మీకు తెలుసనే అనుకుంటాను - థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బ్ కనిపెట్టే ముందు కనీసం వే-యి పద్ధతుల్లో ప్రయత్నించాడు. విజయం సాధించలేదు. ఓడిపోయాడు. ఆ తరవాత చేసిన 1,001 వ ప్రయత్నానికి విజయం సాధించాడు. ఆ తరవాత ఒక ఇంటర్వ్యూలో విలేఖరి అడిగిన " వేయిసార్లు ప్రయత్నించారు కదా.. ఏమని తెలుసుకున్నారు.. " అనే ప్రశ్నకి సమాధానంగా - " ఆ వేయి మార్గాలు విద్యుత్ బల్బ్ ని తయారుచేయుటకి పనికిరావు అని కనుగొన్నాను.." అన్నారు చిరునవ్వుతో. 

ఆయన తన రంగములో చేసిన పోరాటం వల్లనే - ఈరోజు రాత్రి పూట కూడా సులభముగా జీవనాన్ని కొనసాగిస్తున్నాము. అందుకే ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండండి. విజయం సిద్ధించేవరకూ మీ పోరాటం ఆపకండి. ఏదో ఒకరోజు మిమ్మల్ని విజయం పలకరిస్తుంది. ఈ ప్రయత్నములో నిరాశలూ, నిస్పృహలు ఉండరాదు. ఆశావాద దృక్పథంతో రేపు దక్కే విజయం మీద ఆశ, లక్ష్యం ఉండాలి. అప్పుడు మీకు దక్కిన విజయం మీకు వంద శాతం మీకు అమితమైన తృప్తినీ, సంతోషాన్ని, విజయ గర్వాన్ని కలిగిస్తుంది. 

Saturday, January 26, 2013

Good Morning - 250


నమ్మకమైన స్నేహానికి, ప్రేమకి - చూపులతో, మాటలతో ఏ పని లేదు. నాగుండెకి చెప్పాను - నువ్వు గుర్తొచ్చినప్పుడే స్పందించమని. నాకోసం నీవున్నావన్న భ్రమలోనే వేచి ఉంటా. 

Good Morning - 249


నీ ఉనికి పదే పదే చాటుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు. నువ్వు లేనప్పుడు ఆ వెలతిని అవతలివాళ్ళు ఫీలయ్యేలా చెయ్యాలి. 

Friday, January 25, 2013

స్కూటీ - లాంగ్ డ్రైవ్

జీవితం చాలా చిత్రమైనది. సాధారణ విషయాలతో బాటూ, కొన్ని హాస్చర్యపడే విషయాలూ జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాలని అందరితో పంచుకోవాలనిపిస్తుంది కూడా. ఈమధ్యనే జరిగిన అలాంటి విషయమే ఒకటి మీతో పంచుకుంటున్నాను.

మా అమ్మాయికి ఈ సంక్రాంతి సెలవుల్లో - హాస్టల్ నుండి ఇంటికి వచ్చినప్పుడు, తనకోసం తీసుకున్న స్కూటీని ఎలా నడిపించడం నేర్పించాలని అనుకున్నాను. ఈ ప్రతిపాదన ఎన్నోసార్లు ముందు పెట్టినా, నిర్లక్ష్యం చేసింది. కాసింత జ్ఞానబోధ చేసిన తరవాత తను ఓకే అంది. నయాన్నో, భయాన్నో, నచ్చచెప్పి మన బలవంతం మీద నేర్పించవచ్చు, కానీ అది ఎన్నడూ మంచిది కాదు అని నా అభిప్రాయం. ఒక సామెత మీరు వినే ఉంటారు - గుర్రాన్ని నీటి వద్దకి లాక్కురాగలం. కానీ, దానితో నీరు త్రాగించలేము. అలాగే ఇక్కడా నేను - తనకి ఆసక్తి ఉన్నప్పుడే నేర్పించాలని నా ఆలోచన. అందుకే చాలా కాలం ఆగాను.

వాహానాన్ని నడపడం చాలా ఈజీనే అనుకుంటారు. మొదట్లో చాలా ఇబ్బందులే ఉంటాయి. అది అందరికీ అనుభవమే. ఆ ఇబ్బందులన్నీ తగ్గించాలి అనుకున్నాను. తేలికగా నేర్చుకోవాలని అనుకున్నాను.

ముందుగా స్కూటీ గురించి అవగాహన చేశాను - ఏది ఏమిటో. ఆ తరవాత చెప్పాను - సాధారణముగా ఒక పని చెయ్యాలంటే - మన చేతులు, కాళ్ళు, కన్నులు, చెవులు, మెదడు.. ఇలా అన్నీ చేసే పని మీదే దృష్టి పెడతాయి. అంటే అన్నీ కలసి ఒక పనిని సమిష్టిగా చేస్తాయి. ఇక్కడ అంటే - ఈ వాహనం నడపడం అనేది - దేనికది విడిగా పని చేస్తూ, అన్నీ కలసి సమిష్టిగా పనిచేస్తాయి.. ఇదే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఏమిటో అర్థమై, నేర్చుకుంటే అంతా తేలికనే.. అని చెప్పాను. అంటే - చేతులలో ఎడమచేయి హాండిల్, బ్రేక్ ని నిర్వహిస్తుంటే, కుడిచేయి ఎక్సిలరేట్ చేస్తూ, బండిని బ్యాలన్స్ చెయ్యడం అన్నమాట. ఇలా మిగతా భాగాలు అన్నీ దేనికదే ప్రత్యేక పనిని నిర్వహిస్తాయి అని విడమరిచి చెప్పాను. అర్థం చేసుకుంది.

అలా స్కూటీ నడపడం మొదలెట్టింది. రోజూ ఉదయాన్న లేవడం, అలా గ్రౌండ్ కి వెళ్లి రోజూ ఒక గంట క్లాస్ తీసుకోవడం మొదలెట్టాను. రెండు రౌండ్స్ వెనకాల కూర్చొని, పరిశీలించి, ఒంటరిగా నడపించమనటం చేశాను. ఈ జనవరి 16 బుధవారంన మొదలెట్టాం. నేను చెప్పిన సూత్రం వల్లనేమో గానీ త్వరగా బండి నేర్చేసుకుంది. మూడో రోజుకే ఉదయాన రోడ్డు మీద నడపడం మొదలెట్టింది. అలా రోజూ ఉదయాన ప్రాక్టీస్ కార్యక్రమం జరిగింది. బుధ, గురు, శుక్ర, శని వారాలు అలా గడిచాయి. ఆదివారాన దగ్గరలోని ఒక గుడి వద్దకి ప్రోగ్రాం వేశాను.

అలా గుడికి వెళ్లడం ప్రోగ్రాం చెయ్యటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. తను ఒక కోరిక అడిగింది. ఆ స్కూటీ మీద అలా అలా లాంగ్ డ్రైవ్ వెళ్లాలన్నది. నేను నమ్మలేక పోయాను. మొదట్లో వద్దన్నాను. తనూ ఊరుకుంది. నేను మళ్ళీ ఏమనుకుంటానో అనుకొని, ఆ కోరిక అణిచేసుకుంది. కానీ నాకు - తన కోరిక తీర్చడమే సబబు అని అనిపించింది. తాను అలా వెళ్ళటానికి సిద్ధముగా ఉందొ లేదో చూడటానికి దగ్గరలోని (20 kms.) లోని ఒక లక్ష్మీనరసింహ స్వామి గుడికి వెళ్ళాం. మొదటి ప్రయాణం ఏదైనా దేవుని సన్నిధికి వెళ్లటం నా ఆచారముగా మారింది. అలాగే తన విషయములో అలాగే చేశాను.

మరో కారణం ఏమిటంటే - తను ఎలా బండి నడిపిస్తుంది.? శారీరకముగా లాంగ్ డ్రైవ్ కి తగినట్లుగా ఉందా?? అంత ఓపిక తనలో ఉందా???.. రోడ్డు మీద తన డ్రైవింగ్ ఎలా చెయ్యగలుతుంది? అలాగే ఇంకా ఏమైనా లోపాలు ఉంటే సరిదిద్దాలన్నది నా ఆలోచన. ఇలాంటి విషయాలు తేల్చేసుకోవడానికే ఈ పర్యటన. ఇవన్నీ ఆ ఆదివారాన్నే తేల్చేయ్యాల్సిందే. ఎందుకూ అంటే మరునాడు - సోమవారాన్నే (21 జనవరి) హాస్టల్ కి వెళ్ళాల్సింది ఉంది కాబట్టి.

గుడికి వెళ్లి వచ్చాం. దారిలో తనని గమనించాను. అంత సంతృప్తికరముగా డ్రైవింగ్ రాకున్నా ఓకే అనిపించింది.

మరునాడు తను హాస్టల్ కి వెళ్ళాల్సిన పరిస్థితి. తనని స్కూల్ / హాస్టల్ వద్ద వదలేసి వస్తాను అని చెప్పి స్కూటీ తీశాను. మా ఆవిడకి ఈ విషయం పసిగట్టి "స్కూటీ మీద వద్దు.." అని అభ్యంతరం. బస్టాండ్ వద్ద పెట్టేసి, అక్కడనుండి బస్ లో వెళతాం లే.. అని నచ్చచెప్పి, బయలుదేరాం.

దారిలో - డాడీ! ఇలాగే వెళ్ళిపోదాం.. అని బ్రతిమాలింది. ఎందుకో ఆ క్షణాన తన కోరిక తీర్చాలనిపించింది. "నాకు నడపాలని లేదు. నీవు నడిపిస్తావా? అంత దూరం.." అడిగాను. నడిపిస్తాను అంది. నేను వెనకాల కూర్చున్నాను. మా అమ్మాయి ముందుకి వచ్చి బండి నడపడం మొదలెట్టింది. కేవలం ఐదురోజుల అనుభవముతో - నాలుగులైన్ల రహదారి మీద - కొంతదూరం సింగిల్ రహదారి మీద తానే డ్రైవ్ చేసింది. అది ఎంత దూరమో సరిగ్గా గుర్తులేదు. రెండు గంటల్లో హాస్టల్ కి చేరుకున్నాం.

ఆ తరవాత నేను ఒక్కడినే తిరిగి వచ్చేశాను. అప్పుడు దూరం లెక్కించాను. ఒకవైపు దూరం - సరిగ్గా ఎనభై (80) కిలోమీటర్లు. (మొత్తం 160 kms.) అక్కడక్కడా కొన్ని పొరబాట్లు ఉన్నా చాలా బాగానే నడిపింది. తనలో - నేనూ సాధించగలను అన్న ఆత్మవిశ్వాసం ఏర్పడటానికి ఈ సాహాస కార్యక్రమాన్ని ఎంచుకున్నాను. తనకో ఒక మరుపురాని అనుభూతిని, జ్ఞాపకాన్ని ఇచ్చాను.

Thursday, January 24, 2013

Good Morning - 248


చినుకులా మొదలైన మన స్నేహం వర్షంలా కురిసి, సెలయేరులా సాగి, నదిలా ప్రవహించి, ఎప్పటికీ ఇంకిపోని సముద్రం వలె ఉండాలని ఆశిస్తూ.. నీ నేస్తం. 

Wednesday, January 23, 2013

Good Morning - 247


నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే, 
ఏదీ నీకు అందుబాటులోకి రాదు. 
కష్టే ఫలి అని గుర్తుపెట్టుకోవాలి.!

Tuesday, January 22, 2013

Good Morning - 246


స్నేహం కన్నీరు తుడుస్తుంది. 
స్నేహం భావాలని పంచుకుంటుంది. 
అవసరములో నీ శ్వాస తానౌతుంది. 
అనుబంధముగా నీ మనసుని అల్లుకుంటుంది. 
స్నేహపు పందిరి క్రింద సేద తీరే అదృష్టం లభించిందంటే 
స్వర్గం నీ చెంత ఉన్నట్లే. 

అవును.. స్నేహం అన్నీ చేస్తుంది. మనం బాధల్లో ఉన్నప్పుడు మన కన్నీరు తుడుస్తుంది. మన అభిప్రాయాలని, అభిరుచులనీ, భావజాలాన్ని పంచుకుంటుంది. మన అవసరాలలో మన శరీరములో, మన మనసుతో మమేకమై మన శ్వాస అవుతుంది. ఒక చక్కని పవిత్ర అనుబంధముగా మనసుని ఏర్పరచుకుంటుంది. అలాంటి స్నేహం మనకి దొరికితే - అలాంటి స్నేహితుడు / స్నేహితురాలే  మనకు దొరికినట్లయితే - స్వర్గం లాంటి లోకం మన చెంత ఉన్నట్లే.. 

Monday, January 21, 2013

Good Morning - 245


చినుకుతో కబురు పంపాను నీ చెలిమిలో నేను తడవాలని..
చంద్రునితో నీ కుశలం అడిగాను - 
నా చెలి నాకై వెతుకుతుందా అని.
చినుకు నిన్ను చేరిన క్షణాన, మబ్బులతో కమ్ముకున్న 
చందమామ నీ మోము చూడలేకపోయానని చిన్నబోయింది.. 
చినుకు నిన్ను తాకానని నాకు చెప్పి చింత తీర్చింది. 

Sunday, January 20, 2013

Good Morning - 244


కొన్నిసార్లు కొన్నిటిని వదిలిపెట్టడం కష్టమనిపిస్తుంది. కానీ వాటిని ఎప్పుడూ నీ దగ్గరే ఉంచుకోవాలని చూడటం వల్ల - నువ్వు జీవితములో ఇంకేమీ చేయడానికి వీల్లేకుండా అవి నీ చేతుల్ని కట్టిపారేస్తాయి. కాబట్టి కాస్త బాధగా ఉన్నా కొన్నింటిని వదులుకోవడమే మంచిది.

Saturday, January 19, 2013

Good Morning - 243


ఈ ప్రపంచములో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే - అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేం. 

Friday, January 18, 2013

Good morning - 242


ఎంత బీజీగా ఉన్నా, పిల్లలతో కబుర్లు చెప్పాలి. 
వాళ్ళు చెప్పేది వినాలి. 

హా! అవునండీ.. పిల్లలు చెప్పే ముద్దు ముద్దు ఊసులు, ఎగతెగని విసుగు కబుర్లుగా అనుకుంటే - మీరు, మీ పిల్లలు, టోటల్ గా మీ కుటుంబం మొత్తమూ - చాలా కోల్పోతున్నారు అని చెప్పాల్సిందే. దానివల్ల మీ పిల్లలలో ఆత్మనూన్యత ఏర్పడటానికి దోహదం చేస్తున్నారు. వాళ్లకి వచ్చిన అనుమానాలు, ఏదో చెప్పాలనిపించే ఊసులు వినకపోతే - వారు మా మాటలు ఎవరూ వినలేరు అని చిన్నబుచ్చుకుంటారు. వాటిని వినేవాళ్ళు లేకపోయేసరికి ఈ ప్రపంచములో నేను అందరు ఉన్న ఒంటరి అన్నట్లు ఊహించేసుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దీనివల్ల వారు తమ తమ ఊహాలోకములో ఉండిపోతూ, నలుగురిలో కలవలేకపోతుంటారు. దాన్ని చూసి పెద్దలు కాస్త కసురుకోగానే, మరింత ఆత్మనూన్యతకి గురి అయి, తమ లోకములోనే బిగుసుకపోతారు. దానివలన వారిలో శారీరకముగా ఎదుగుదల ఉంటుందే కానీ, మానసికముగా ఒంటరులం అనే భావనలో ఉండిపోతారు. దీనివలన మన పిల్లల ఎదుగుదలని మనమే అడ్డుకున్నవారిమి అవుతాము. అలా వారి ఎదుగుదలకి మనం అడ్డు రావటం భావ్యమా?

మీకున్న కాసింత సమయం - అది ఎన్ని గంటలు అన్నట్లు కేటాయించలేకున్నంత బీజీగా ఉన్నా కనీసం రోజుకి కొద్ది సెకనులైనా అయినా కానీ.. వారికి కేటాయించండి. అది ఎప్పుడైనా కానీ.. ఎక్కడైనా కానీ.. వారికోసం కాసింత తీరిక చేసుకోండి. 

మీలోని - నేను పెద్దవారిని అన్నఅహం ని కాసింత ప్రక్కన పెట్టండి. మనసుని రిఫ్రెష్ చేసుకొని, మొహాన చిరునవ్వు పులుముకొని, వీలుంటే మీ కళ్ళల్లో చిరునవ్వుని చూపిస్తూ మీ మొహాన స్నేహభావాన్ని చూపిస్తూ (ఆ రెండు భావనలు వేరు వేరు - ఒకటేమో కృతిమం, ఇంకోటి సహజమైనది ) మాట్లాడండి. వారి ముద్దు ముద్దు మాటలు ఓపికగా వినండి. మీరు వింటున్నట్లు, ఊ కొట్టండి. ఊ ఊ అనే కాదు, అవునా.. అలాగా.. అప్పుడేమయ్యింది.. ఓహో.. లాంటి మాటలు చిరునవ్వుతూ మాట్లాడండి. మీరు వింటున్నారు అన్న ధీమాతో నాలుగు మాటలు మాట్లాడేవాళ్ళు పది మాటలు చెబుతారు. దానివలన వారికి లాభం ఏమిటంటే - 
మాటలు సరిగ్గా ఉచ్చారణ 
వారి ఊహాలోకం ఏమిటో 
వారి భావనలు ఏమిటో, 
వారి ఆలోచనల పరిధి ఏమిటో 
మాటలు ఎలా మాట్లాడితే అవతలివారిని ఇంప్రెస్ చెయ్యొచ్చు 
తాను ఏమైనా తప్పులు చేస్తున్నానా? 
వారిలోని బెరుకుని క్రమక్రమంగా తొలగించుకోవటం 
భావవ్యక్తీకరణ ఎలా చెయ్యాలో 
వినటానికి, చెప్పుకోవటానికి - ఒక ఆత్మీయ నేస్తంని పొందటం 
ఇతరులతో చొరవ తీసుకొని మాట్లాడటం, 
క్రొత్త వ్యక్తుల ముందు కూడా సిగ్గు, బెరకు అంటూ లేకుండా మాట్లాడగలగటం
ఎదుటివారు చెబుతున్నది ఎలా అర్థం చేసుకోవాలో....

ఇలా చాలా లాభాలు పొందుతారు. వారు వాటితో నిజజీవితములో ప్రశంసనీయమైన జీవితాన్ని గడుపుతారు. మీరు సాధ్యమైనంత సమయాన్ని వారికి కేటాయించండి. అది సమయం లేకున్నా, మీరు ఆఫీస్ కి బయలుదేరేముందో, భోజనాల బల్ల వద్దనో, షూస్ వేసుకోనేటప్పుడో, టీ త్రాగుతున్నప్పుడో.. ఇలా ఎంత చిన్న సమయం ఉన్నా సరే! దాన్ని అలా సద్వినియోగం చేసుకోండి. వారితో మాట్లాడాక, దగ్గర తీసుకోవడం, ఒక ఆత్మీయ స్పర్శ ఇవ్వండి. అంటే  బుగ్గ మీద ఒక చిన్న ముద్దో, కౌగిలింతనో కావచ్చును. ఇది అన్నింటికన్నా వారిని ఆకట్టుకుంటుంది. 

ఈ విషయం చాలా చిన్నదే అయినా పిల్లల జీవితాలో గణనీయ మార్పుని, వారికి ఒక విశాల దృక్పథాన్ని కలుగ చేస్తుంది. ఇది కూడా తెలీనివారిమి మేము కాము అనుకుంటాం - కానీ ఆచరణలో పెట్టం. నిజాయితీగా మన అంతరాత్మని ప్రశ్నించుకుంటే - యే కొద్దిమంది తప్ప మిగతావారు అలా చేయమనే చెబుతారు. బాల్యం నుండి కౌమార ప్రాయం వరకు వారికి వచ్చే సందేహాలకి - ధైర్యం చెబుతూ సమాధానం చెప్పండి. దానివల్ల వారు వారి జీవితాలలో చాలా ఉన్నత సంస్కారాన్ని పొంది, ఒక చక్కని గుర్తింపు లభిస్తుంది. 

ఇలా నాకు తెలిసినా, మళ్ళీ ఒకసారి - నా మిత్రురాలు చెప్పారు. ఒకసారి నా బాధ్యత ఏమిటో తెలియచేశారు. తనకి కృతజ్ఞతలు. 

పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు - చక్కని అమ్మానాన్నలుగా , 
బాల్యములో - మంచి గురువుగా, 
కౌమార, యవ్వన దశలో చక్కని స్నేహితులుగా ఉండాలి. 
ఈ విషయం గురించి మరోసారి తెలుసుకుందాం. 

Wednesday, January 16, 2013

Good Morning - 241


స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వటం గొప్పకాదు..
ప్రాణాలు ఇచ్చే స్నేహితుడు దొరకటం గొప్ప. 

Tuesday, January 15, 2013

Good Morning - 240


మీరు - ఎవరి నుంచి ఏమీ ఆశించకండి..! 
నిజాయితీగా వ్యవహరించండి. మీరు అలా ఉండగలిగితే, 
మిమ్మల్ని చూసి మిగిలినవాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తారు. 



Good Morning - 239


కొందరు మన జీవితములోకి వచ్చి, మనల్ని సంతోషముగా ఉంచుతారు.. మరికొందరు మన జీవితము నుండి వెళ్ళిపోయి, మనల్ని సంతోషముగా ఉంచుతారు. జీవితములో ఏమి జరిగినా మన మంచికోసమే అని ముందుకు సాగిపోవాలి. 

Monday, January 14, 2013

Good Morning - 238


బద్ధకానికి వెంటనే గుడ్ బై చెప్పి, కష్టముగా కాదు.. ఇష్టముగా.. 
పట్టుదలతో కృషి చేస్తే, జీవితములో ఏదైనా సాధ్యమే!. 


Sunday, January 13, 2013

సంక్రాంతి శుభాకాంక్షలు.

మీకూ, 
మీ కుటుంబ సభ్యులకూ, 
మీ మిత్రులకూ, 
తోటి బ్లాగర్స్ కీ, 
శ్రేయోభిలాషులకూ, 
భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. 






Saturday, January 12, 2013

Good Morning - 237

Telugu quotations


మనం చిన్నప్పుడు వ్రాసుకోవటానికి పెన్సిల్ వాడేవాళ్ళం. ఇప్పుడు పెన్ ని వాడుతున్నాం. పెన్సిల్ వాడుతున్నప్పుడు - మన తప్పులని రబ్బర్ తో 
తుడిపేసే వాళ్ళం. ఇప్పుడు అలా చెయ్యలేం. జీవితమూ అంతే! 

Good Morning - 236


ఈ క్షణం కాకపోతే మరుక్షణం 
ఈరోజు కాకపోతే రేపు! 
ఏదో ఒకనాటికి నిన్ను మరచిపోవాలి. 
ఏదో ఒకనాటికి నువ్వు గుర్తుకురాని క్షణాలని గడపాలి. 
కానీ, అది జరగదేమో అనిపిస్తుంది. ఎందుకంటే - 
నిన్ను మరచిపోవడం కష్టమే కాదు.. అసాధ్యం కూడాను..



Friday, January 11, 2013

Good Morning - 235

Telugu Quotations


నీ గురించి నువ్వు నీలోపల 
అనుకున్నంతగా బయటకి చెప్పుకోకు. 

అవును కదా.. ! మన గురించి మనం చెప్పుకుంటే డబ్బా అని జనాలు అంటారు. అదే వేరేవారు మన గురించి చెప్పితే ఆహా అంటారు. మన గురించి మనం అనుకున్నదంతా - నేను ఇలా, ఇలా ఉంటాను, ఇలా చేస్తాను, నా ఆలోచనలు ఇలా ఉంటాయి, నా అభిప్రాయాలు ఇలా.. అంటూ మనవి మనం చెప్పనేకూడదు. అలా చేస్తే మనంతట మనమే - ఎదుటివారిలో మన పట్ల చెడు అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నవారిమి అవుతాము. 

Thursday, January 10, 2013

Good Morning - 234


నిజమైన ప్రేమ అరుదైనది. 
నిజమైన స్నేహం అపూర్వమైనది. 

ఈరోజుల్లో నిజమైన ప్రేమ అరుదైనది. అలాగే నిజమైన స్నేహం అపూర్వమైనది. ఇప్పుడు కనిపిస్తున్న ప్రేమల్లో చాలావరకు ఆకర్షణ ని ప్రేమగా భావిస్తున్నారు. నిజమైన ప్రేమని అనుభవిస్తున్నవారు చాలా అరుదు. అలా ప్రేమించినప్పుడు నిజమైన ప్రేమ ఎంత మధురముగా ఉంటుందో తెలుస్తుంది. 

నిజమైన స్నేహం కూడా అలాగే ఉంటుంది. ఆస్థి, అంతస్థు, వయసు, సామాజిక హోదా, లింగ బేధం.. మొదలైనవి స్నేహం ఎన్నడూ పట్టించుకోదు. చిన్నప్పుడు చేసే స్నేహాలు అన్నీ చిరకాలం కొనసాగుతాయి. అలా ఎప్పటి వరకూ అంటే - పైన చెప్పిన భేదాలు వారిరువురి మధ్య రానంత వరకూ. అలారానంత వరకూ ఆ స్నేహం చాలా బాగుంటుంది. ఒకవేళ వచ్చినా వారిరువురు వెంటనే మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ స్నేహం అలాగే కొనసాగుతుంది.  

Wednesday, January 9, 2013

Good Morning - 233

Telugu Quotations


Good Morning - 232

Telugu Quotations


మన జీవితాన ఎదురయ్యే వారిని దూరం చేసుకోకు. 
ఎందుకంటే - మంచివాళ్ళు మనల్ని సంతోషపరచవచ్చు.
చెడ్డవాళ్ళు మనకి అనుభవం మిగల్చవచ్చు.
కానీ జీవితానికి ఆ రెండూ అవసరమే.!

అవును. మన జీవితాన ఎదురయ్యే ప్రతివారూ మనకి అంతో ఇంతో మేలు చేస్తుంటాడు. అలాగే ఎన్నో రకాల అనుభవాల్ని మిగులుస్తుంటారు. ప్రతివారూ మనకి అవసరమే!. కేవలం మంచివారితోనే ఉంటాం, చెడ్డవారితో ఉండలేం అనుకుంటూ ఉంటే - మంచితనమేమిటో, చెడ్డ పనుల వల్లనే గ్రహించగలం. ఇలా మనకి తెలియచేసే చెడ్డవారి సాన్నిహిత్యం కూడా అవసరమే! అలా రెండు వైరుధ్యాలూ గల వారితోనూ మన జీవితంలో ఎదగటానికి అవకాశం దొరుకుతుంది. 

Tuesday, January 8, 2013

Good Morning - 231

Telugu Quotations 


మిత్రులు, మంచి నడత - ఈ రెండూ మిమ్మల్ని 
సంపద వెళ్ళలేని చోటుకి కూడా మిమ్మల్ని తీసుకువెళుతుంది.

Good Morning - 230

Telugu Quotations


నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి - 
ఇప్పటికీ నిన్ను ఇష్టపడేదీ - నీ స్నేహితుడు మాత్రమే! 

అవును.. నీ గురించీ, నీ మనస్తత్వం గురించీ, నీ అవసరాలు ఏమిటో, నీ బలాలు, బలహీనతలు, మదిలోని అంతరంగాన్నీ - ఇవన్నీ బాగా తెలిసినవాడు నీ స్నేహితుడొక్కడే! నీ బంధువులకు గానీ, తల్లితండ్రులకు గానీ - నీ గురించి, నీ స్నేహితునికి తెలిసినంతగా కూడా వారు తెలుసుకోలేరు. అదే స్నేహితునికి ఉండే ప్రత్యేకత. 

అలాగే నీవు తనతో ఉన్నా, మాట్లాడక దూరముగా ఉన్నా - దగ్గర రాకుండా - కావాలని దూరముంచినా, అలా ఉండేలా కోప్పడ్డా, అవమానానికి గురి చేసినా, వెక్కిరింతలకు గురి చేసినా - అయినా కూడా ఇంకా నీ పట్ల ఇష్టం చూపించేది - స్నేహితుడు ఒక్కడే. అదే (నిజమైన) స్నేహ బంధములోని గొప్పదనం. 



Monday, January 7, 2013

Good Morning - 229


స్నేహపు పరిభాష మాటలలో లేదు. 
కానీ, వాటి అర్థాలలో దాగుంది. 

స్నేహపు పరిభాష అంటే - దేహభాష ఎలాగో స్నేహానికీ ఒక భాష, దేహ భాష ఉంటుంది. వినటానికి క్రొత్తగా అనిపించినా, అది నిజమే!. సాధారణముగా చాలామంది ఈ విషయాన్ని గ్రహించలేరు. " మాటల్లో  కనిపించినదే / వినిపించినదే "- స్నేహం అని అనుకుంటారు. అలా అనుకొనే, ప్రతి స్నేహితుడు మాట్లాడే మాటలు విని, తమది ఎంతో గొప్ప స్నేహం అనుకుంటారు. కానీ ఆ మాటల వెనుక అర్థాలలో ఏముందో తెలుసుకోరు. ఫలితముగా స్నేహాల్లో దెబ్బ తింటారు. మమ్మల్ని ఆ స్నేహితుడు మోసం చేశాడు అంటూ ఫిర్యాదు చేస్తూ ఉంటారు. అసలు స్నేహమే ట్రాష్ / అబద్ధం / మోసం అంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు కూడా. ఇలా చాలామందికి అనుభవమే. ఇది వారి వారి మైండ్ మెచ్యూరిటీ బట్టి ఉంటుంది. అలా ఎదిగిన వాళ్ళకి స్నేహం అంటే ఏమిటో, అందులోని మాధుర్యం ఏమిటో తప్పక తెలుస్తుంది. పోచికోల కబుర్లు చెప్పే స్నేహాల్ని అంతగా ఇష్టపడరు. ఎదుటివారు చెప్పే మాటల్లో ఎంత నిజాయితీ ఉందో వారు తేలికగా గుర్తుపట్టగలరు. ఇదే స్నేహాలలో ఉండే అర్థాలు. ఇలాంటి వారికే చక్కని స్నేహబంధాలు ఏర్పడతాయి. 

Sunday, January 6, 2013

Good Morning - 228

Telugu Quotations


సంతోషాలు వికసించిన సుమాలు. 
వాటి జ్ఞాపకాలు ఎన్నటికీ 
వాడిపోని సుమ గంధాలు. 

Saturday, January 5, 2013

Good Morning - 227

Telugu Quotations


నీ గురించి అన్నీ తెలిసిన ఏకైక వ్యక్తి - 
ఇప్పటికీ నిన్ను ఇష్టపడేదీ - 
నీ స్నేహితుడు మాత్రమే. 

అవును కదూ.. మన గురించి అంతా తెలిసిన వ్యక్తీ, 
మనతో ఎప్పుడూ ఉండే వ్యక్తి, 
కష్టాలలో, సుఖాలలో ఉండే వ్యక్తి, 
మన అంతరంగాన్ని పంచుకొనే ఏకైక వ్యక్తి, 
ఆపదలలో ఆదుకొనే వ్యక్తి,
ఈ ప్రపంచం వెలివేసినా అక్కున చేర్చుకొనే వ్యక్తి, 
మన శ్రేయస్సును కోరుకునే వ్యక్తి, 
మన అభివృద్ధిని ఎప్పుడూ కాంక్షించే వ్యక్తీ, 
నాలుగు మాటలు తిట్టి, మనం బాగుపడాలని కోరుకొనే వ్యక్తీ, 
అన్నీ కలగలిసిన వ్యక్తి - 
స్నేహితుడు మాత్రమే!. 

Friday, January 4, 2013

Good Morning - 226

Telugu Quotations


స్నేహితులు జన్మిస్తారు. 
రూపొందించబడరు. 

Good Morning - 225

Telugu Quotations


విమర్శలకు భయపడకు, 
ఎదురుగాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది. 

నిజానికి విమర్శలు చాలా మంచిని చేస్తాయి. అందులో దురుద్దేశం తో కూడినవీ, మంచి ఉద్దేశ్యముతో చేసే విమర్శలు అని రెండు రకాలు. సదుద్దేశ్యముతో చేసే విమర్శల వలన మన జీవితాలు బాగుపడుతాయి. అది నిజం. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే, ఏమాత్రం కోపం తెచ్చుకోకండి. వారు చెప్పేది వినండి. వారు చెప్పింది సబబా? అని ఆలోచించండి. బాగుంటే - కృతజ్ఞతలు చెప్పండి. బాగాలేకుంటే - నవ్వేసి ఊరుకోండి. 



Thursday, January 3, 2013

Spam comments

Mark as Spam, ఇంకొకటి Spam Box అనే పోస్ట్స్ లలో ఈ పనికిమాలిన, వృధా కామెంట్స్ గురించి చెప్పాను. అసలు ఆ కామెంట్స్ వల్ల లాభం ఏమీ ఉండదు అనీ. ఆ కామెంట్స్ పోస్ట్స్ చేస్తున్నవారికీ ఇంకా అలసట రానట్లుంది. ఇంకా అలా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు. కానీ అవన్నీ ఆటోమేటిక్ గా స్పాం బాక్స్ లోకి వెళ్లిపోతున్నాయి. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా వేరే విధముగా పోస్ట్ చేస్తూనే ఉన్నారు.

ఒక పోస్ట్ (Spam box) లో చెప్పినట్లు - 2012 జనవరి ఒకటిన ఆ స్పాం బాక్స్ మొత్తం శుభ్రం చేశాను. ఈ 2012 లో ఎన్ని స్పాం మెసేజెస్ వస్తాయో చూద్దామని. అలాగే ఆ విషయం మీకు చెబుదామని. ఇప్పుడు ఆ విషయమే చెప్పబోతున్నాను.

2012 లో నాకు వచ్చిన స్పాం కామెంట్స్ మొత్తం - 311. ఎలాంటి కామెంట్స్ యో ఈ ఫోటో మీద డబల్ క్లిక్ చేసి చూడండి. అవన్నీ స్పాం బాక్స్ లో భద్రముగా ఉన్నాయి. అవన్నీ తీసేస్తున్నాను.. ఏమీ పనీపాట లేకుండా ఇలా జనాలని ఇబ్బంది పెట్టే ఇలాంటి చదువుకున్న అడ్డ గాడిదల్ని కోసి, ఉప్పూ, కారం వేసి రుద్దాలి.



Wednesday, January 2, 2013

Good Morning - 224


ఏ మనిషికైనా జీవితములో ఒక లక్ష్యం ఉండాలి. 
ఆ లక్ష్య సాధన కోసం అహర్నిశలు కృషి చేసి, సాధించాలి. 

అవును. జీవితాన ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం కూడా కాసింత శ్రమ పడితే పొందేలా ఉండాలి కానీ, అసాధారణ లక్ష్యం మాత్రం ఉండకూడదు. అలా ఏర్పరుచుకుంటే - నిరాశే మిగులుతుంది. లక్ష్యం కూడా చిన్న చిన్న కాలపరిమితితో కూడి ఉండి, ఓ మోస్తారు కష్టం వల్ల విజయం పొందగలిగినదై ఉండాలి. ఒక లక్ష్యాన్ని చేరుకున్నాక మరో లక్ష్యం ని వెంటవెంటనే పెట్టుకొంటే - మనమీద మనకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. మనసు చాలా తృప్తిగా ఉంటుంది. 

ఇలాంటి లక్ష్య చేదన లో - ఊరకే అనుకోకుండా లక్ష్యాన్ని చేరుకొనే ప్రయత్నాలు ఆరభించాలి. కష్టపడాలి. వచ్చే అడ్డంకులని తెలివిగా తొలగించుకోవాలి. మన చేతలూ, దృష్టి, మనసూ - అంతా ఆ లక్ష్యం మీదనే ఉండాలి. అప్పుడే విజయం సిద్ధిస్తుంది. 

Good Morning - 223


నీ జ్ఞాపకాలే తోడుంటే ఎలాంటి గాయాన్నైన 
చిరునవ్వుతో భరించటానికి 
నా మనసు సిద్ధమే!

Tuesday, January 1, 2013

Good Morning - 222


గాలి వంటిది నీ జ్ఞాపకం..
ప్రతిక్షణం నన్ను తాకుతూనే ఉంటుంది.. 
స్పందన కలిగిస్తుంది. 

Good Morning - 221



Related Posts with Thumbnails