Thursday, August 26, 2010

మెమొరీ కార్డ్ - మొబైల్ సెంటర్ - 1

మనలో చాలా మందికి మొబైల్ ఫోన్స్ వాడుతూ ఉంటారు కదూ.. దానిలోని మెమొరీ కార్డులో పాటలూ, ఫొటోస్ వేసుకొని, వాటిని చూస్తూ, వింటూ ఆనందిస్తారు కదూ.. మనమే కాదు, చాలామంది ఈ మొబైల్స్ సెంటర్స్ కి వెళ్లి అందులోని  కంప్యూటర్ ద్వారా ఈ మెమొరీ కార్డ్ లోనికి పాటలూ, ఫొటోస్, వీడియోలూ.. వేసుకుంటూ ఉంటారు. తిరిగి ఆ మెమొరీ కార్డ్ ని మీ మొబైల్ ఫోన్ లోకి పెట్టేసుకొని ప్లే చేసుకొని, ఆనందిస్తూ ఉంటారు కదూ.. మొదట్లో నేనూ అలాగే చేసేవాడిని.. అందులోని కొంత చాకచాక్యమూ, నేర్పరితనమూ, మోసమూ... చూసి మళ్ళీ ఆ మొబైల్ సెంటర్లలో ఆ పనికోసం అడుగు పెట్టలేదు. అలా ఎందుకో ఇప్పడు మీకు చెబుతాను.

మీరు మీ మెమొరీ కార్డు తీసుకొని వారివద్దకి వెళ్లి - పాటలు / వీడియోలూ / ఫొటోస్.. నింపమని అడుగుతే, సరే అని అంటారు. ఆ మెమొరీకార్డ్ ని ఇమ్మని అడుగుతారు. మీరు మీ ఫోన్ మెమొరీకార్డ్ ని తీసిస్తారు. ఆ మీ మెమొరీకార్డ్ ని ఒక మెమొరీకార్డ్ రీడర్ లోన అమర్చి, సిస్టంకి అమర్చుతాడు.. అప్పుడు అది ఆటో రన్ ద్వారా ప్లే అవుతుంది. అంటే - ముందుగా ఒక మెనూ వస్తుంది. ఆ వచ్చిన మెనూలో ఈ ఫోటో లో చూపినట్లుగా Copy pictures to a folder on my computer అనే ఆప్షన్ ఎన్నుకొని, Always do this selected action అన్న వద్ద క్లిక్ చేస్తాడు. ఇలా ముందుగానే సెట్ చేసుకొని ఉంటాడు. అలా చేస్తే మీరిచ్చిన మేమోరీకార్డు లోని మీ ఫొటోస్, మీ వీడియోలూ, ఇంకా మీరు దాచుకున్న మీ పర్సనల్ ఫైల్స్ అన్నీ అతడి కంప్యూటర్లోకి వెళ్లి ఒక ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. అంటే మీ కార్డులోనివీ అలాగే ఉండి.. ఒక కాపీ అతడి సిస్టం లోనికి చేరుకొని భద్రముగా ఉంటుందన్న మాట. (అందరూ అలా చేస్తారని చెప్పటం లేదు.)


ఇప్పుడు మీరు అలా మీ మెమొరీ కార్డ్ ఇవ్వగానే,మిమ్మల్ని మాటల్లో పెట్టి, అతడు అలా సిస్టం కి పెట్టి, ఇలా మెనూ బాక్స్ రాగానే వెంటనే OK నొక్కేస్తాడు.. ఇదంతా చెయ్యటానికి ఐదు, పది సెకన్ల కన్నా మించి సమయం తీసుకోదు.. అంతా మీరు గమనించేసేలోగా అయిపోతుంది. అప్పుడు ఆ మెమొరీ కార్డ్ లోని డాటా "అంతా" అతడి సిస్టం లోనికి చేరుకోవటం ప్రారంభం అవుతుంది. ఇప్పడు అతడు మీతో తీరిగ్గా ముచ్చట మొదలెడుతాడు - ఇందులో ఏమేమి వేద్దాం అని. మీరు ఎటో ఆలోచిస్తూ, అందులో ఎమేమి ఉండాలో, మీకు ఏమేమి కావాలో అన్నీ వివరముగా చెబుతూ ఉంటారు. మీరు అలా చెప్పేలోగానే అందులోకి కాపీ అయిపోతుంది. ఇప్పుడు అతడు రిఫ్రెష్ చేస్తాడు అతడి సిస్టమ్ ని. 

ఇప్పుడు మీరు చెప్పినవన్నీ మీ మెమొరీకార్డ్ లోకి చేరుస్తూ ఉంటాడు.. అన్నీ ఒక ఫోల్డర్ లోకి వేసి, దాన్ని ఆ మెమొరీ కార్డు లోకి, సిస్టం సహాయముతో ఎక్కించేస్తాడు. అలా ఆ మెమొరీకార్డ్ లో డాటా పూర్తిగా నిండగానే, సిస్టం నుండి దాని డిటాచ్ చేసి, ఆ కార్డుని, మీ ఫోన్ లోకి అమర్చి, ప్లే చేసి చూపిస్తాడు. మీరు ఆ సంతోషములో వాటిని తన్మయత్వము లో ఉండి అసలు విషయాన్ని మరచిపోతారు. అతడు అడిగిన డబ్బులు ఇచ్చేసి బయటకి వచ్చేస్తారు.

ఇలా మీరు వెళ్ళిపోయాక, లేదా తన షాప్ కట్టేసే వేళ, లేదా ఎవరూ లేని సమయాన - తన సిస్టం లోకి కాపీ చేసుకున్న మీ మెమొరీ కార్డ్ లోని డాటాని పరిశీలిస్తాడు.. మీ దాంట్లోని పాటలు ఉంటే తన సిస్టం లోని పాటల ఫోల్డర్ లోకి వేసుకుంటాడు. వీడియోలు ఉంటే వీడియోల ఫోల్డర్ లోకి... అలా వేసుకుంటాడు. ఇక్కడే అసలైన తిరకాసు ఉంది. మీ కార్డులో ఏమైనా రహస్యమైన బెడ్ రూం వీడియోలూ, ఫొటోస్ గాని ఉండి ఉంటే, లేదా అలా కార్డ్ ఇచ్చిన వారు అమ్మాయి ఆయితే - అమ్మాయిల ఫొటోస్ గనుకే ఉంటే ఇక వారికి పండగే పండగ. అక్కడి నుండి యే యూ ట్యూబ్ కో, పోర్న్ సైటులోనో, లేదా ఏదైనా అప్లోడ్ సైటులో గాని చేరుస్తారు. ఇక అలా విశ్వరూపమే.. విశ్వవ్యాప్తమే. అలాంటి మూడు ఫొటోస్ మీకు చూపిస్తున్నాను చూడండి.




(పై ఫోటోలూ మూడూ అలాగా నెట్లో పెట్టినవే!..చాలా ఫొటోస్, వీడియోలు అలా నెట్లోకి ఎక్కినవే అని వినికిడి.!! నాకే ఏదోలా అనిపించి అన్నీ కనపడకుండా దాచేసి, క్లారిటీ (బ్లర్) కూడా తగ్గించేశాను.. మొదటి ఫోటో ఏదో సరదాగా వారు చూడనప్పుడు తీసుకున్నారు అనుకుందాం. ఆ రెండో ఫోటో - కావాలనే అలా పిట్ట గోడ మీద కూర్చొని దిగారు. ఇక ఈ మూడో ఫోటో చూడండి. ఈ ప్రేమికులు ఎన్నో జాగ్రత్తలు తీసుకొని - అంటే వెనక బ్యాక్ గ్రౌండ్ కనిపించనీయకుండా కర్టేన్స్ వేసి మరీ సెల్ఫ్ ఫోటోగ్రఫీ చేసుకున్నారు. అంతగా జాగ్రత్తలు తీసుకున్నవారు - ఈఫోటో ని ఎలా బయటకి పంపించారో నాకు అర్థం కాలేదు. అన్నింటిలో నాకు కామన్ గా అనిపించినది ఏమిటంటే - అలాంటి ఫోటోలలో నెట్ లోకి ఎక్కేవి చాలా వరకు ఆడవారి ఫొటోస్. వారితో ఉన్న మగవారి ముఖాలు కనపడటం చాలా అరుదు. భార్యలో, ప్రియురాల్లో, స్నేహితులో, సన్నిహితులో.. ఇలా వీరే బలి అవుతున్నారు. పైశాచిక ఆనందం ఆ మగవారిది. మానసిక క్లేశం ఈ ఆడవారిది. ఇదంతా నా బ్లాగు రేటింగ్స్ కోసం చెప్పటం లేదు. ఆడవారు ఈ విషయాన్ని కాస్త గమనించ గలరు - అని హెచ్చరించటం అంతే. )

కొసమెరుపు: మీరు అనుకోవచ్చు.. మా కార్డుని అంతా డిలీట్ చేసి ఇస్తానుగా.. ఎలా చూస్తాడు.. అని అడగవచ్చు. టెక్నాలజీ రెండువైపులా పదనున్న కత్తి. దాన్ని వాడే బుద్ధిని బట్టి ఉంటుంది. నెట్లో ఉచితముగా దొరికే ఒక సాఫ్ట్వేర్ ని (పేరు చెప్పను) ఉపయోగించి అలా డెలీట్ చేసిన మెమొరీ కార్డ్ లోని సమాచారం అంతా యధాతతముగా తిరిగి తీయవచ్చును. దీనికి పట్టే కాలము రెండు నుండి ఐదు నిముషాల సమయం అంతే! నా ఫ్రెండ్ నమ్మకపోతే - వాడి కళ్ళముందే అలా తీసి చూపాను నేను. తన ఫొటోస్ డెలీట్ అయ్యాయి అని అంటేనూ.. కాసేపట్లో మళ్ళీ తీసిచ్చాను. 

 అందుకే తస్మాత్ జాగ్రత్త.. ఒకసారి మీ చేతినుండి జారిందా -
ఆపటం మీ తరం కాదని గుర్తుపెట్టుకోండి!!.

Tuesday, August 17, 2010

బ్లాగులకి కూడా SPAM ఆప్షన్

బ్లాగులకి కూడా SPAM ఆప్షన్ ఇచ్చిన ఆ గూగుల్ వాడికి ముందుగా ధన్యవాదములు చెప్పుకుంటున్నాను..

ఎందుకంటే ఇంతకు ముందే ఒకసారి చెప్పాను.. నా బ్లాగులోని ఒక పోస్టు కి (శ్రీ వైకుంఠ ఏకాదశి అభిషేకం - ఇస్కాన్ టెంపుల్, బెంగళూర్ లో) ఒకతను anonymous (అనానీమస్ ) గా ఉండి రోజూ ఒక కామెంట్ పోస్ట్ చేసి ఇబ్బంది పెడుతున్నాడని.. ఈ స్పాం ఆప్షన్ ఇచ్చాక - అతడి కామెంట్ వచ్చింది.. దాన్ని నేను జాగ్రత్తగా ఆ స్పాం బాక్స్ లో చేర్చాను.. ఈ రోజూ ఇంకొకటి వచ్చింది. అది ఆటోమేటిక్ గా స్పాం బాక్స్ లోకి వెళ్ళిపోయింది. కామెంట్ వచ్చినట్లుగా ఆయితే ఉంది. కాని ఆ కామెంట్ స్పాం లోకి చేరిపోయింది. నిత్యం చూడాల్సిన అవసరం లేకుండా పోయింది..

ఇంతమంచి అవకాశం ఇచ్చిన గూగుల్ వాడికి మరొకసారి ధన్యవాదములు తెలుపుకుంటున్నాను.

Saturday, August 7, 2010

మా బాబు - MS ఆర్టూ

మొన్న ఆమధ్య - రాత్రి పదకొండు గంటలప్పుడు అనుకుంటా.. నా  బ్లాగు  కార్యక్రమాన్ని చూస్తున్నాను. అప్పుడే  మొదటి తరగతి చదివిన మా బాబు వచ్చాడు..
"ఏంట్రా.. నిద్రరావటం లేదారా!.." అని అడిగాను.
"లేదు డాడీ!.." అన్నాడు.
మొఖం చూస్తే నిద్ర మొఖం లేదు. వచ్చి నా సిస్టం దగ్గరకి కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు.
"పడుకుంటే  కాదా? రేపు ఊరికి వెళ్ళాలిగా.." అన్నాను - వాడిని అక్కడినుండి పంపించేసి నా బ్లాగు పని చూసుకుందామనే ఉద్దేశ్యముతో.
"రేపు సండే కదా.." అన్నాడు.
వాడలా కూర్చున్నప్పుడు బ్లాగు కోసమని ఒక ఫోటో MS పెయింట్ లో ఎడిట్ చేస్తున్నాను.
"ఇది ఇలా చేస్తారా.." అని అడిగాడు..
"అవును" అని చెప్పాను.

వాడు ఆసక్తి చూపిస్తున్నప్పుడే చెప్పాలి - ఇనుము వేడయ్యినప్పుడే ఎలా అంటే అలా వంగుతుంది అనే సూక్తి గుర్తుకవచ్చి - "సరే నేర్చుకుంటావా?.. చెబుతాను.." అని ఏమి బొమ్మ వెయ్యాలో అడిగాను.
"జంతువుల బొమ్మలు" అని చెప్పాడు.
జంతువుల బొమ్మలు వెయ్యటం వాడికి కష్టమని నేనే "బస్సుల ఫోటో ఎలా వెయ్యాలో నేర్పుతాను నేర్చుకుంటావా.. లేక నిద్రవస్తున్నదా? పడుకుంటావా?.." అని అడిగాను.
"చెప్పు డాడ్!.." అన్నాడు.

సరేనని మొదలెట్టాను. ఒక్కక్కటీ వివరిస్తూ ఎలా వెయ్యాలో చూపాను. నిజానికీ నాకూ MS పెయింట్ ని ఊరికే ఫోటోల మీద పేర్లు వ్రాయటానికి వాడటం మాత్రమే తెలుసు. బొమ్మలు వేసేటంత అనుభవం, పాటవం గానీ నాలో లేవు. ఒక్కమాటలో చెప్పాలీ అంటే అప్పటికప్పుడు ఒక్కో పద్దతీ, టూల్స్ గురించీ తెలుసుకుంటూ, నేర్చుకుంటూ వాడికి బొమ్మలు ఎలా వెయ్యాలో చూపాను. నిజానికి  MS పెయింట్ వాడి ఇంత అందమైన బొమ్మలు వెయ్యోచ్చనీ నాకు తెలీదు. నాకు మొదటగా దాన్ని చూపిన అతను కేవలం గీతలు ఎలా కొట్టాలో, డబ్బాలు ఎలా గీయాలో నేర్పాడు అంతే. దానికే "అబ్బో! నాకు చాలా వచ్చేసిందే..!" అని చాలారోజులు ఫీలయ్యా. అలా వాడికి - స్కూల్ బస్ బొమ్మ వేస్తూ ఎలా వెయ్యాలో చూపించాను.. వేస్తున్నా కొద్దీ ఇంకా అందముగా  వెయ్యొచ్చు.. అని తెలుస్తూనే ఉంది. కాని వాడి తెలివికి ఇదే సరిపోతుందని సగములోనే ఆపేసి, రంగులూ, హంగులూ అద్దాను. అందులోనే పిల్లల ఫోటోలూ కాపీ, పేస్ట్ చేసి అతికాను. ఒక ముప్పావు  గంటలో  ఇలా  వేసేశాను..

ఆ తరవాత నేను బాత్రూం కి వెళ్లి వచ్చేసరికి, వాడు సిస్టం ముందు కూర్చొని, నేను వేసిన బొమ్మనే - ఇప్పుడు తను గీయటం మొదలెట్టాడు. నేను హాశ్చర్యపడిపోయాను. ఏమీ అనలేదు. ఇప్పుడు నేను వాడి స్థానములో కూర్చొని చూస్తూ పోయాను. వాడేలా గీసినా ఏమీ అనటం లేదు. ఎందుకంటే వాడి ఊహాశక్తికి నేను అడ్డుపడదలచుకోలేదు. అలా పడితే వాడు ఇక తనలోని సృజనని, బయటకి తీయడేమోనని నా భయం.

మధ్యలో ఏదైనా టూల్స్ గురించి అడిగితేనే - చెప్పాను. ఎక్కడా జోక్యం చేసుకోలేదు. మొత్తం వేశాక గుడ్ అని వాడి వీపు తట్టాను. ఇక చాలు రేపు వేసుకుందువు గానీ.. రేపు సండేనే కదా.." అని చెప్పాను వాడితో. పుత్రోత్సాహము వల్ల నేను ఏమీ చెప్పను.. చెబితే ఆయుక్షీణం అంటారుగా. వాడేలా గీశాడో మీరే చెప్పాలి. ఇదిగో వాడు వేసింది చూడండి. 

ఇక్కడ ఒక విషయం చెబుతాను. నేను అలా వాడికి నేర్పించక ముందు వాడు "అద్భుత చిత్రకళా నైపుణ్యం" చూపేవాడు. అవి క్రింద చూపిస్తున్నాను. అవీ చూడండి ఇక్కడ. ఇలా వేసేవాడు ఆ రాత్రి నేర్పినదానితో బాగా వేయటం మొదలెట్టాడు.

అబ్బా!.. ప్లీజ్.. నవ్వకండీ.. వాడు ఫీల్ అవుతాడు..

Friday, August 6, 2010

Updates.

మీ కంప్యూటర్లో అప్డేట్స్ అన్నీ జరుగుతున్నాయా.. అలాగే ఆంటివైరస్, ఫైర్ వాల్, ఆటోమేటిక్ అప్డేట్స్ అన్నీ జరుగుతున్నాయా? ఇలా ఈ క్రింది ఫోటోలోలాగా అన్నీ ఆకుపచ్చ లైటింగ్ లో ఉన్నాయా... అలా ఉంటే మీ కంప్యూటర్ భద్రముగా ఉందని అర్థం. లేకుంటే (ఎర్ర రంగులో బల్బ్ వెలిగినట్లయితే ) మీ కంప్యూటర్ కి హాని తప్పదు.


అవి అన్నీ - ఇంటర్ నెట్ ఆన్ లో ఉన్నప్పుడు అప్డేట్స్ అవుతాయి. ఇలా చెయ్యటం ఎందుకంటే - ఆ ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు కొన్ని లోటుపాటులు ఉంటాయి. వాటికి తగిన పాచెస్ / అప్డేట్స్ ఆటోమేటిక్ గా వస్తుంటాయి - ఇలా సెట్టింగ్స్ పెట్టుకుంటేనే!.అలాగే సిస్టాన్ని మాల్వేర్స్, వైరస్ల బారిన పడకుండా అంటి వైరస్ అప్డేట్స్ అవసరము. మిగతావారు మీ సిస్టం లోకి చొచ్చుక రావటాన్ని ఫైర్ వాల్ అడ్డుకుంటుంది. 

Thursday, August 5, 2010

కంప్యూటర్ ఫార్మాట్ - F2

నేను నా కంప్యూటర్ ఫార్మాట్ చెయ్యాల్సి వచ్చినప్పుడు దగ్గరలోని ఒక నెట్ సెంటర్ కి తీసుకెళ్ళి ఫార్మాట్ చేయించేవాడిని.. వైరస్ వల్లనో, వాడకం తెలీక వల్లనో  గాని మళ్ళీ కొద్దిరోజులకి ఫార్మాట్ చేయించేవాడిని. అలా క్రొత్తలో చాలా ఇబ్బందులకి గురి అయ్యాను. ఇది తెలిసిన మా బంధువుల అబ్బాయి - అదేంటి ఊరి ఊరికే అలా అవుతున్నది, ఒకసారి ఆ సీపీయు తీసుకొని రా.. దాన్ని అంతా బాగా చేద్దాం అన్నాడు. 

అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకిష్టం లేకున్నా సరే.. అదీ ఎలాగో చూద్దాం ఒకసారి అని నా సీపీయు అంతా మోసుకెళ్ళాను. మూడు గంటల ప్రయాణం. వెళ్లాను. ప్రాబ్లం చూసి మొత్తం ఫార్మాట్ చేద్దామని అన్నాడు. నేను వద్దన్నాను. ఎందుకంటే హార్డ్ డిస్క్ లో ఉన్న అన్ని ఫైల్స్ వేల్లిపోతాయని. కాపీ చేద్దామంటే DVD రైటర్ పనిచెయ్యటం లేదు. తప్పనిసరిగా ఒక DVD రైటర్ కొని. అందులో అమర్చాము. దాని సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ కూడా చేశాము.

ముందుగా అందులో ఉన్న ఫైల్స్ అన్నీ DVD లలోకి బర్న్ చేశాను.. మొత్తం 14 DVD లు అయ్యాయి. అవన్నీ భద్రపరిచాక. . ఇక ఫార్మాట్ మొదలెట్టాము. ముందుగా ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ వేశాము.. సక్సెస్. తరవాత డ్రైవర్స్ CD వేస్తే ఇన్స్టాల్ అవటం లేదు.. ఎన్నిసార్లు ప్రయత్నించినా.. లాభంలేదు. నేనూ ఆ CD తోనే చేశాను అంతకు ముందు.. నాకూ రాలేదు. అలా ఎందుకు రాదూ.. వస్తుందే అని అతను అంటే - సరేనని వారింటివద్ద ఇలా ప్రయత్నాలు చెయ్యటం. అతనికీ రాలేదు.. రెండుసార్లు ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ వేసి చూసాము.. ఊహు!.. లాభం లేదు.. నాకు విసుగు వచ్చేస్తున్నది. అప్పటికే రాత్రి పన్నెండు అయ్యింది. పడుకొని మరుసటి రోజున మళ్ళీ ప్రయత్నాలు.. ఊహు.!.. మళ్ళీ అదే ఫలితం.

ఇలా కాదనుకొని వేరేవారి దగ్గరనుండి సాఫ్ట్వేర్ CD తెచ్చి మళ్ళీ ఇన్స్టాల్ చేశాము. తరవాత డ్రైవర్స్ CD వేస్తే అప్పుడు ఇన్స్టాల్ అయ్యింది. అతనికి ఆ విషయం తెలీకపోవటం వల్ల చాలా సమయం వృధా అయ్యింది.. అది పైరేటెడ్ లాగా ఉన్నట్టుంది. ఆ తరవాత అన్నీ మళ్ళీ ఇన్స్టాల్ చేశాము.. అప్డేట్స్, మళ్ళీ అనీ లోడింగ్.. అదంతా అయ్యేసరికి చాలా సమయం గడిచింది. అలాగే కొన్ని ప్రత్యేక సాఫ్త్వేర్లూ కొన్ని ఇన్స్టాల్ చేశాడు. అప్పటికే రాత్రి అవటం మూలాన మరునాడు ఉదయాన సంతోషముగా నా సీపీయు తీసుకొని వచ్చేశాను.

ఇంటికి వచ్చాక .... నా సీపీయు ని యధావిధిగా అమర్చి, సిస్టాన్ని ఆన్ చేస్తే రావటమే లేదు. వైర్లు అన్నీ సరిగా పెట్టానో లేదో అని నాలుగైదు సార్లు చెక్ చేశాను. అన్నీ సరిగా ఉన్నాయి. కేబుల్స్ మార్చాను. అయినా రాదే!. ఇలా కాదనుకొని మళ్ళీ అన్నీ సరిగా ఉన్నాయో.. టేస్ట్ చేశాను. రామ్ మళ్ళీ తీసి, శుభ్రం చేసి పెట్టాను.. ఊహు.. లాభం లేదు. అప్పటికి అలాగే వదిలేసాను.. కాసేపు నా కార్యక్రమాలని చూశాక.. మళ్ళీ ఒకసారి ప్రయత్నించాను. ఊహు..

ఇలా కాదనుకొని అతడికి ఫోన్ చేశాను.. అతను ఫోన్ తీయటమే లేదు.. బాత్రూం కి వెళ్ళాడేమో అని అనుకొని, మళ్ళీ కాసేపయ్యాక కాల్ చేశాను. లేపాడు కట్ చేశాడు. పొరపాటున కట్ అయ్యిందేమోనని మళ్ళీ ఫోన్ చేశా.. మళ్ళీ కట్. అంటే అక్కడే ఉన్నారన్నమాట!. మళ్ళీ చేశా.. మళ్ళీ కట్. నాకూ పంతం పెరిగింది.. చూద్దాం. ఎంతవరకు అలా చేస్తారేమోనని. అలా చేస్తూ పోయాను. ఒకవేళ ఫోన్ లేపితే ఏమి మాట్లాడాలో కూడా డిసైడ్ అయ్యాను.

అలా చేస్తూనే పోయాను. కట్ కట్ కట్... నాకూ పంతం పెరిగిపోయింది. ఏదో ఒకటి తేల్చుకోనిది వదిలేయ్యబుద్ది కాలేదు. చివరికి వాళ్ళావిడ ఫోన్ ఎత్తింది. "తను ఇప్పుడు మాట్లాడట.. మూడ్ బాగోలేదట.. తరవాత ఫోన్  చేస్తాడట " అన్నారు. సరే అన్నాను.  నేను  మళ్ళీ  ఫోన్  చెయ్యలేదు. (తనూ చెయ్యలేదు) ఏమిటో ..అదేమాట  తనే ఫోన్  లేపి  చెప్పొచ్చుగా . ఇంకా గౌరవముగా ఉండేదిగా. నాకున్న చిన్నపాటి తెలివితో మళ్ళీ నా సిస్టాన్ని ట్రై చేశాను.. లాభం లేదు.. బయట డబ్బులు పెట్టి బాగు చేయించాలని  అనుకున్నాను.
ఇక నా వల్ల కాదనుకొని మా ఊళ్లోనే ఉండే ఒక సాఫ్ట్వేర్ అతని దగ్గరకి వెళ్లాను. బాగా పేరున్నోడు అని అంటే వెళ్ళా.
"నీ ప్రాబ్లెం ఏమిటీ?.." అని అడిగితే - చెప్పాను.. "సిస్టం ఆన్ అవటం లేదని".
"మొత్తం ఫార్మాట్ చెయ్యాలి.. వైరస్ వల్ల అలా అయ్యింది" అన్నాడు.
"మీరు ఒరిజినల్ ఆపరేటింగ్ సాఫ్టవేర్ CD పెట్టి ఫార్మాట్ చేస్తారా.. "
"అవును" అన్నాడు.
"ఎంత తీసుకుంటారు" అని అడిగాను - "ఒక్క C డ్రైవ్ మాత్రమే అలా చెయ్యాలి, అప్డేట్స్ అవీ కావాలి" అని చెప్పా.
"ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ పెట్టేవారిని నిన్నోక్కడినే చూస్తున్నాను - ఈ ఊరిలో.." అని ఆన్నాడు.
అప్డేట్స్ ఎవరూ పెట్టుకోరట. అంటే మనోడిది పైరేటెడ్ ఆపరేటింగ్ CD అన్నమాట!.
"ఎంత తీసుకుంటారు.." అన్నాను.
"ఐదు వందల రూపాయలు." అని చెప్పాడు.
"ఆ మాత్రం దానికే అంతనా.. ఏమీ తగ్గించారా" అని అడిగా..
"ఊహు.. నావల్ల కాదు.. నాకు పని ఉంది." (ఏం నాకు మాత్రం పని లేదా!)

ఏమిటబ్బా! అంత ఇలాజరుగుతుంది అనుకున్నా. ఇక లాభం లేదని వేరేవారికోసం వెదికా. అప్పుడే గట్టిగా నిర్ణయించేసుకున్నాను. ఇక అన్నీ నేనే నేర్చేసుకోవాలని. ఎవరి దయా దాక్షిణ్యాలు కోసం చూడొద్దని. అలా వెదికితే ఒక స్టూడెంట్ దొరికాడు. అతడికి  నా ప్రాబ్లెం చెప్పాను చేసిపెడతాను అన్నాడు. ఎంత అన్నాను.. ఒకవందా యాభై రూపాయలు అని చెప్పాడు. ఆ రాత్రికే నా కంప్యూటర్ ఫార్మాట్ చేసిచ్చాడు. మరుసటి రోజున ఉదయం తీసుకున్నాను. అలాగే శుభ్రముగా యే ఇబ్బంది లేకుండా వాడుకుంటున్నాను. ఆ తరవాత నా కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ వెళుతున్నాను. ఇప్పుడు కాస్త పరవాలేదు. సిస్టం గురించి బాగానే తెలుసుకుంటున్నాను..

ఇప్పుడు ఇక్కడ: నూటాయాభై తీసుకొని మాటమీదనిలబడి వెంటనే ఒరిజినల్ CD తో ఫార్మాట్ చేసిచ్చిన పిల్లాడు నాకు బాగా నచ్చాడు. అప్డేట్స్ అయ్యాయి కూడా.. ఆ ఐదు వందల రూపాయల ఇంజనీరు (ఇలా అంటే బాగోదేమో!) కన్నా ఇతడు నయం.

ఇక మా బంధువు విషయానికి వస్తే - అంతా చేసి, వారింట్లో రెండురోజుల ఆథిత్యం ఇచ్చి, అన్నీ చేసిచ్చి, అది ఆన్ కాకపోయేసరికి ఫోన్ చేస్తే - లేపక, మాట్లాడక మనసుకి దూరమయ్యాడు. ఆ తరవాత సాంకేతిక సలహాల కోసం అడగటం అతన్ని అడగటం మానేశాను. ఏమి ప్రాబ్లం వచ్చినా ఎదురుకోవటానికి అన్నీ నేర్చుకుంటున్నా.. మధ్యలో ఏదైనా సమస్య వస్తే నా సోషల్ నెట్వర్కింగ్ సైట్ల లోని మిత్రులని చాట్ లో అడుగుతున్నాను. వారూ ఓపికగా తెలుసుకొని, నాకు చెబుతున్నారు. వారందరికీ చాలా కృతజ్ఞతలు అని ఇక్కడే చెబుతున్నాను. సోషల్ వర్కింగ్ సైట్ల వల్ల నాకు అదో లాభం. అలా వారిని నాకు కలిపిన ఆ సైట్ల వారికీ నా కృతజ్ఞతలు.

ఇకపోతే - నా బంధువు ఫార్మాట్ చేశాక సిస్టం ఆన్ కాలేదని చెప్పాగా... ఆ తరవాత ఎదురుపడితే - (ఫోన్లో కాదు).. అడిగాడు.. "సిస్టమ్ బాగా పని చేస్తున్నదా" అని.
"ఆ చేస్తున్నదిగా.." అన్నాను.
"నేను వేసిన సాఫ్ట్వేర్ ఒకటి చూశారా.." అని అడిగితే
"ఏమో తెలీదు.. మళ్ళీ ఫార్మాట్ చేయించాను.. అది లేదని" చెప్పాను.
"ఏమైంది మళ్ళీ!.." అని అడిగితే
"మీరు చేశాక సిస్టం తీసుకొని ఇంటికి వచ్చాక - ఆన్ చేస్తే ఆన్ కాలేదు. కనుక ఫార్మాట్ చేయించాను.." అని చెప్పా.
"అయ్యో! ఫోన్ చేసి ఆడగవచ్చుగా.. చెప్పేవాడినిగా.." అని అన్నాడు.
"ఆ రోజు చేస్తేనేగా ఫోన్ తీయలేదు.. కట్ చేస్తూ పోయారు.." అని అన్నాను.
" అలాగా!.. ఏముంది.. జస్ట్ F2 బటన్ నొక్కితే ఆన్ అయ్యేదిగా.. అలా మార్చానుగా.." అన్నాడు.
"నాకు తెలీదు అలాని. నేనేమైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాదుగా" అన్నాను.
"మీకు తెలుసు అనుకొన్నాను.." అన్నాడు.
ఇక నేను ఏమీ మాట్లాడలేదు.

ఏమని అంటాము. నాకంత పరిజ్ఞానం లేదని తనకి తెలుసు. అలా సెట్టింగ్ మార్చి ఇవ్వటం భావ్యమా.. పోనీ మార్చాడే అనుకుందాం!.. కనీసం అది తీసుకొని వాళ్ళింటి నుండి వెళ్ళినప్పుడు అయినా, ఫోన్ చేసి ఈ చిన్నమాట - F2 నొక్కమని చెబితే ఏమి పోయేది?. ఆఖరికి నేను చేసినప్పుడన్నా చెప్పినా - నాదే ఫోన్ బిల్లాయే!.. అంతా చేసి చివరలో విలువ కోల్పోయాడు. ఒకే ఒక చిన్నమాట చెప్పక - అవతలి వారిని ఇబ్బంది పెట్టాడు. ఎందుకో కారణం కూడా ఇంతవరకూ తెలీదు. ఒకవేళ నేనేమైనా తప్పు చేసుంటే చెప్పాలిగా.. అదేమీ లేదు అని వేరేవారి ద్వారా తెలుసుకున్నాను. ఇక సాంకేతిక సమస్యల కోసం అతడిని అడగటం ఇప్పుడు పూర్తిగా మానేసాను.. అందుకే చెబుతున్నాను.. ఒకసారి గమనించండి.. ఆ విషయములో వారికి తగిన దూరాన్ని పాటించండి. మీకు చాలా మంచిది. ఒకరకముగా మీకే మేలే అవుతుంది. ఎలాగో "అంతా మన మంచికే" అనే టపాలో వ్రాస్తాను.

Monday, August 2, 2010

మెమొరీ కార్డు - ఫోటోలు

నేను వ్రాసిన టపా Digital Camara   చదివాక  నా మిత్రుడు ఒకరు, ఫ్యామిలీతో టూర్ కి వెళ్ళాడు.. చాలా రోజులుగా చూడాలనుకుంటున్న ప్రదేశం అది.. దారిలో ఎన్నెన్నో వీడియోలూ, ఫోటోలు తీసుకున్నాడుట. చివరికి తను చూడాలనుకున్న విహారస్థలానికి వచ్చాడు. అక్కడ తాను చూసిన ప్రకృతి ప్రదేశములో ఎన్నో ఫొటోస్ దిగాలని అనుకున్నాడు.. అలా తన ఫ్యామిలీవి, తనవీ  దిగటం మొదలెట్టాడు.

కొద్దిగా ఫోటోల కార్యక్రమం అయ్యాక అతడి కేమరాలోని మెమొరీ కార్డ్ అందాక తీసిన ఫోటోలతో నిండిపోయింది. అతడికి ఏమి చెయ్యాలో తోచలేదు.. కొన్ని ఏమైనా ఫొటోస్ డెలీట్ చేద్దామన్నా అన్నీ ఇప్పుడు తీసినవే.. అన్నీ అవసరమే!.. ఏమి చెయ్యాలో తోచలేదు.. కెమరా బ్యాగు వెదికాడు.. అదృష్టం కొద్దీ మెమొరీ కార్డ్ అడాప్టర్ కనిపించింది. అంతకి ముందు మొబైల్ ఫోన్ లోనికి పాటలు వేయటానికి అది వాడాడు. అలా వేశాక మరచిపోయి ఆ బ్యాగులో వేశాడు. అది ఉంది. సరే.. ఇంకో మెమొరీ కార్డ్?.. బల్బ్ వెలిగింది..

మొబైల్ ఫోన్ లోని 4 GB మెమొరీ కార్డ్ ని బయటకి తీశాడు.. ఆ మెమొరీ కార్డ్ అడాప్టర్ లోకి అమర్చాడు. దాన్ని ఆ డిజిటల్ కెమరా లోకి ఎక్కించాడు. ఇంకేం.. మళ్ళీ ఫొటోస్ కార్యక్రమం మొదలు.. అలా తాను చూడాలనుకున్న ఆ విహార స్థలాన్ని బాగా తృప్తిగా మదిలో నింపుకున్నాడు.. వాటిని శాశ్వతం చేయటానికి కెమరాలో కూడా బంధించాడు. దాదాపుగా ఆ మెమొరీ కార్డ్ నిండింది. అప్పుడు అదీ నిండిపోతే అతని భార్య మొబైల్ ఫోన్ లోని 2 GB మెమొరీకార్డుని అలాగే వాడటానికి మానసికముగా సిద్ధపడిపోయాడుట!. ..

ఆ టూర్ నుండి వచ్చాక నాకు ఫోన్ చేసి చెప్పాడు.. ఇలా జరిగిందని.. నీవు నీ బ్లాగులో వ్రాసినది చదివాని కాబట్టి నాకు ఆ ఆలోచన వచ్చింది.. లేకపోతే అక్కడి ఫొటోస్ కావాలంటే మళ్ళీ వెళ్లి ఫొటోస్ దిగిరావాల్సి వచ్చేడిది. నీవు రాసిన టపా వల్ల నాకు ఇంత మేలు జరిగింది అంటూ చెప్పాడు.. కనీసం నా బ్లాగు ఒకరికి ఉపయోగపడింది అన్న సంతోషముతో ఆ రోజు మరీ హుషారుగా ఉన్నాను. ఆ స్నేహితుడు అలా ఫోన్ లో చెప్పకుండా నాకు ఆ టపా క్రింద కామెంట్ గా వ్రాస్తే మరీ బాగుండేది ఏమోనని అనిపించింది..  


Related Posts with Thumbnails