Monday, May 31, 2010

అంతర్జాలములో సోషల్ నెట్వర్కింగ్ సైట్స్

అంతర్జాలములో సోషల్ నెట్వర్కింగ్ సైట్లో చాలా మందికి సభ్యత్వం ఉండి ఉంటుంది. నేనూ రెండు సంవత్సరాలనుండీ అలాంటి సోషల్ నెట్వర్కింగ్ గ్రూపుల్లో మెంబర్ని.. అన్నింట్లోనూ ఉన్నట్లు వీటిల్లోనూ మంచీ, చెడూ గమనించాను. ఇది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ఈ రెండు సంవత్సరాల నా గమనింపు / విశ్లేషణ మీకు చెబుతాను.

ఈ స్నేహాలు ఎందుకు చేయాలి అంటే?
ఈ ప్రపంచములో స్నేహం చెయ్యని వాడంటూ ఎవడూ లేడు. ఎప్పుడో ఒకప్పుడు స్నేహితులతో మాట్లాడటం తప్పనిసరి. చిన్నప్పుడు కలసి తిరిగిన స్నేహితులు పెద్దయ్యాక కూడా కల్సి తిరగటం చాలా తక్కువ ఈ రోజుల్లో. జీవనం సాగించుటకో, లేదా మనలోని స్నేహ వెలతిని దూరం చేసుకోవటానికో ఈ ఆన్లైన్ స్నేహాలు తప్పనిసరి అవుతున్నాయి.

అలా మనకి మంచి  స్నేహాల కోసం ఆన్ లైన్ స్నేహాలు చెయ్యటములో తప్పులేదు.. నిజజీవితములో పరిచయం అయ్యేవారు అందరూ మంచివారే ఉంటారని  ఎలా అనుకుంటాము. అందులో కూడా మోసపోతున్నామే! ఇదీ అలాగే.. కురిసే ప్రతి వర్షం బిందువు స్వాతి ముత్యం ఎలా కాదో, కనపడే ప్రతి రాయీ విగ్రహం ఎలా కాదో.. ఇదీ అలాగే. ఒకమంచివ్యక్తిని కలిసేముందు పదిమంది (అంతకన్నా ఎక్కువే) పనికిరాని వాళ్ళని కలవాల్సివస్తుంది. మనిషి ఆశాజీవి. ఎప్పుడూ ఆ ఆశతోనే బ్రతకాలి. తప్పదు. లేకుంటే జీవితం నిస్సారం అయిపోతుంది.

కానీ ఇక్కడ ఒక భయంకర నిజం చెప్పాలనుకుంటున్నాను. ప్రతి వారి వద్ద నుండీ ఏదో ఒకటి నేర్చుకోలేకుండా ఉండలేము.. ఈరోజు మంచివారు అనుకున్నవారు రేపు మోసగాల్లై కావచ్చును. ఈరోజు బేకార్ అన్నవారు రేపు మనకే మంచీ చేయవచ్చు. చెప్పాగా మనిషి ఆశాజీవి అనీ. హిందీలో ఒక సామెత ఉంది. అదిప్పుడు చెబుతాను .."సోనా ఘస్కే దేఖ్ నా, దోస్తాన్ కర్కె దేఖ్ నా.." అనేది. అంటే - బంగారాన్ని రాయి మీద గీటు పెడితే తెలుస్తుంది. స్నేహాన్ని మాత్రం చేస్తేనే తెలుస్తుంది అని. నిజమే కదూ..

అలాగే ఇంకో విషయం కూడా చెప్పదలచుకున్నాను. ఎవరో ఒకరు ఏదో అన్నారని, ఎవరో ఏదో కామెంట్ చేసారని ఆ ఎకౌంటు క్లోజ్ చేయటం మూర్ఖత్వం నా దృష్టిలో.. అలా చేసిన వారిని డిలీట్ చెయ్యండి. వారినుండి మీ  స్నేహితులనీ దూరం ఉండమని చెప్పండి. ఆ ఒక్కరికోసం మిగతా వారిని దూరం చేసుకోవటం సరియైన చర్య కాదు అనే అంటాను.

ఈ రోజు ఉదయం ఈ టపా పోస్ట్ చేశాక ఆర్కుట్ కి వెళ్లాను. అక్కడ ఈ  టాపిక్ కి సంబంధించిన కో - ఇన్సిడెంట్ కనిపించింది. దాని తెరపట్టు (స్క్రీన్ షాట్) లను తీశాను అదే ఇప్పుడు మీకు చూపిస్తాను. కొద్దిగా వివరణ ఇస్తాను.. మీరే అర్థం చేసుకోండి. ఈ మొదటి తెరపట్టు ని చూడండి. అది నా ఆర్కుట్ అకౌంట్ ని ఓపెన్ చేసినప్పుడు ప్రమోషన్ దగ్గర ఇలా కనిపించింది. ఇలా రావటము ఇదే  క్రొత్తానుకొని ఓపెన్ చేసి చూసి.. నాకే ఈ సైటు వాడకం దారుల మీద అసహ్యం వేసింది. అదేమిటో మీరూ చూడండి. ఇందులో promotion అన్న దగ్గర చూడండి. ఒక అమ్మాయి ఫోటో ఉండ చూడండి. క్రింద అబ్బాయి ఫోటో ఉంది. నిజానికి ఇది ఒక మంచి పనికోసం ఆ ఆర్కుట్ వాడు పెడితే - ఇలా ఉపయోగిస్తున్నారు. ఆ అమ్మాయికి అబ్బాయికి ఏదో గొడవలు అయినట్లున్నాయి. మనసులో దాచుకొని, అందరికీ మంచివాడిలా కనపడాలని (పబ్లిక్ తెలివిమీరారు) ఇలా I have suggested Priya as new friend to you అని పెట్టాడు. నిజానికి ఆమె ఎకౌంటు నేను ఎప్పుడూ చూడలేదు  కనుక ఇది నిజమా తెలీదు. (తాజాకలము: (3-జూన్) ఈ విషయానికి వివరణగా కామెంట్స్ లో సుజిత్ గారి కామెంట్ చూడండి. అసలు విషయం తెలుస్తుంది.)


చూశారు కదూ.. ఆ ఒక్క భాగమే క్రింద పెద్దగా చూపిస్తున్నాను. కావాలనే అమ్మాయి మొఖాన్ని ఎడిట్ చెయ్యటం లేదు - పరిస్థితి బాగా అర్థం కావాలని. (అ అమ్మాయి నన్ను మన్నించాలి). ఈ XXXX అనే అబ్బాయి ఆమె ఫోటో పెట్టి అలా ప్రమోషన్ చేశాడు. చెడుగా పెడితే.. కేసయితే కష్టమని కావచ్చు. ఆ వాక్య నిర్మాణం చూశారు కదూ. ఎంత పోలైట్ గా ఉందో. 


ఆ అమ్మాయి ఫోటో మీద క్లిక్ చేశాను. నిజానికి అలా నొక్కితే ఆ అమ్మాయి ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. కాని అది ఓపెన్ అయ్యేముందు ఇలా ఇంకో బాక్స్ ఓపెన్ అయ్యింది. ఇందులో ఆమె ప్రొఫైల్ కోసమని నేను పసుపురంగులో ఉన్న బాణం గుర్తు వద్ద My Profile వద్ద నొక్కాను. అప్పటికే అలా నొక్కిన వారిలో నేను 8,53,038 వ వ్యక్తిని అన్న విషయం కూడా గమనించండి. 


అలా నొక్కాక, ఇదిగో ఇలా డిలీట్ చేసారు.. అని వచ్చింది. ఆవిడ ఈ బాధపడలేక అలా డిలీట్ చేయవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండండి. చూసారు కదూ.. ఒక్కడి వల్ల ఆమె తన సామాజిక మిత్రులని దూరం చేసుకుంది. అందుకే చెబుతున్నాను. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఇలాంటిదే మరో యదార్థ సంఘటన కూడా ఉంది. అది ఇంకో టపాలో  వ్రాస్తాను.  ఇప్పటికైనా జాగ్రత్తగా ఉంటారు కదూ!..  ఇందులో కాస్త ఐరనీ కూడా ఉంది. వాస్తవం ఏమిటో తెలీకుండా  దీన్ని మా సోషల్ ఫ్రెండ్ స్ప్రెడ్ చేసాడు.. అంటే - అతని అక్కౌంట్ లో ఉన్న మిత్రులందరికీ ఇది చేరుతుందన్నమాట.. ఈ విషయమై అడగాలి అతడిని. సరైన సమాధానం రాకుంటే అతడిని నా ఫ్రెండ్స్ లోంచి రిమూవ్  చేసెయ్యాలి. (తాజా కలము:(2-జూన్ ) సాయంత్రం ఈ  ఫ్రెండ్ ఆన్లైన్ లోకి వచ్చాడు.. నాకు  తెలీక స్ప్రెడ్ చేశాను.. నీవు చెప్పేదాకా ఇలా అవుతుందని తెలీదు.. ఇంకెప్పుడూ  మళ్ళీ ఇలాంటి పనులు అసలు  చెయ్యనని మాట ఇచ్చాడు


పర్సనల్ విషయాలు :
మీ పర్సనల్ విషయాలు అంటే మీ ఇంటి అడ్రెస్, ఆఫీస్ అడ్రెస్, ఫోన్ నంబర్స్, బాంక్ అక్కౌంట్స్, ప్రాపర్టీ విషయాలూ, క్రెడిట్ కార్డ్ డిటైల్స్, పర్సనల్ విషయాలూ.. అలాంటివి అసలు చెప్పకూడదు. చెప్పారా.. ఇక మీరు ఇబ్బందుల్లో పడటం ఖాయం. ఇక ఆడవారు ఇలాంటివి చెబితే.. ..  ఇక ఆ దేవుడే రక్షించాలి. చాట్ లలో కూడా ఈ విషయాలు అసలు ప్రసక్తి రానేకూడదు. అసలు  మనం చేసేది ఫ్రెండ్షిప్పా.. లేక మోసపోవటమా.. అనేది బాగా గుర్తుంచుకోవాలి..

ఫోటోలు :
ఆడవారు అంటే ఏదో భద్రత కోసం తమ పూర్తి వివరాలు సోషల్ వర్కింగ్ సైట్లలో పెట్టకూడదు. ప్రొఫైల్ ఫోటోగా మరీ బాగున్న, అందముగా దిగిన ఫోటో పెట్టకండి. అలాంటిది పెట్టినా తోడుగా భర్తనో, అన్నయ్యో, తమ్ముడో, పిల్లలో కలసి ఉన్న ఫోటో పెట్టండి. మీ ఫోటో ఆల్బం అంటూ పెట్టుకుంటే నమ్మదగ్గ వ్యక్తులకి మాత్రమే అగుపించేలా సెట్టింగులు పెట్టండి..

ఆడవారు తమ ఫొటోస్ ఎక్స్పోజింగ్ లా ఉండేవి పెట్టకండి. బహుశా ఇండియా లో అలా ఫొటోస్ పెట్టడం చాలా తక్కువ. (ఉన్నారు. కాకపోతే వారి ఫోటోలకి తాళాలు వేసి ఉంటాయి.) కొండకచోట అన్నట్టుగా ఉన్నారు. విదేశాలలో ఇది చాలా ఎక్కువ. ఫేస్ బుక్ లలో ఇలాంటివి చాలా ఎక్కువ. అవన్నీ కాపీ చేసి బ్లాక్మెయిల్ చెయ్యగలరు జాగ్రత్త..

సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో అమ్మాయిల ప్రొఫైల్ కి ఫోటో, ఇతర వివరాలు అనవసరం. ఒకవేళ ప్రొఫైల్ కి ఫోటో పెట్టినా మరీ బాగున్న ఫోటో పెట్టకండి. ఇక్కడ మనం చేసేది స్నేహమే.. నాకొక ఫ్రెండ్ ఉంది - తన ఫోటో చూపించింది.. అబ్బో! అలాంటి అమ్మాయిని బహుశా ఏ అబ్బాయి ఇష్టపడకపోవచ్చు. అయినా తను మంచి మనసున్న అమ్మాయి. ఆమె మాటలు మాత్రం చాలా స్వచ్ఛముగా, బాగుండేడివి.

అసలు ఒక్కసారి ఫోటో పెడితే అది ఇక శాశ్వతం అని గుర్తుపెట్టుకోండి. చాలామంది అనుకుంటారు ఇలా ఫొటోస్ పెడితే కాపీ చేసుకోరాదని. ఎందుకంటే వారు అలా ఫోటో మీద రైట్ క్లిక్ చేసి "Save picture as.." అనే ఆప్షన్ కోసం చూస్తారు కాని. అది రాదు కనుక ఇక ఎవరూ కాపీ చేసుకోరని అనుకుంటారు.. వాస్తవం మాత్రం వేరు.. అలా నా బ్లాగులో ఫొటోస్ కాపీ చేసుకోవచ్చు.. (అలా చాలా మంది కాపీ చేసుకుంటున్నారనీ, నాకు తెలుసు.) వేరే ఎక్కడైనా కాపీ చేసుకోవచ్చు.. అలా సోషల్ సైట్లలో కాదు అని అనుకుంటారు.. నాకైతే చాలా సింపుల్ అయిన రెండు పద్దతులు తెలుసు. అలాని నేను ఇంతవరకూ దుర్వినియోగం చెయ్యలేదు. అయినా ఈ విషయాలు చాలామందికి తెలుసు.. ఆ పద్ధతుల గురించి ఇక్కడ వివరించను - క్షమించాలి.

ఫోన్ నంబర్స్ :
సాధారణముగా ఎప్పుడూ వాడే ఫోన్ నంబర్స్ ఆన్ లైన్లో పెట్టకండి. ఒక డబుల్ సిమ్ ఫోన్ కొని మైంటైన్ చెయ్యండి. ఇప్పుడు సిమ్ ధరలు చాలా దిగివచ్చాయి. కొన్ని పది రూపాయలకే వస్తున్నాయ్. ఇంకొన్ని అయితే ఉచితముగానే ఇస్తున్నారు. (వారికేం లాభం అంటే: ప్రతి ఇన్ కమింగ్ కాల్ వస్తే ఆపరేటర్ కి నిముషానికి 37 పైసల ఆదాయం ఉంటుంది.) అలాంటిది ఒకటి తీసుకొని ఫోన్లో పెట్టాక అప్పుడు నంబరు చెప్పండి - అదీ అవతలివారు బాగా నమ్మకంగా  అనిపించాకనే!

మీరు బిజీ ఉన్నప్పుడు ఎవరైనా ఫోన్  చేస్తే - ముందు ఫోన్ చేసిన విషయం ఏమిటో తెలుసుకోండి. తరవాత మాట్లాడుతా అని చెప్పి కట్ చెయ్యండి. వీలున్నప్పుడు వారికి కాల్ చేసి మాట్లాడండి.

ఫోన్చేసి బాగా విసిగిస్తే వారితో మాట్లాడుతూనే ఎటో వైపు చూసి (ఫోన్ ని కొద్ది దూరముగా పెట్టి) "రండి.. రండి.. మీకోసమే ఎదురుచూస్తున్నా.. బాగున్నారా.. కూర్చోండి.." అని, మీకు ఫోన్ చేసిన వారితో - "గెస్ట్స్ వచ్చారు తరవాత మాట్లాడుతా.." అని చెప్పి లైన్ కట్ చెయ్యండి. ఇలా నాలుగైదు సార్లు చేస్తే అవతలివారు ఇక ఫోన్ చెయ్యకపోవచ్చు..

మీరు వాడే సిమ్ మొబైల్ ఆపరేటర్ మీరిచ్చే నంబర్లోనే తెలుస్తుంది. నాకు తెలిసిన ఒక మిత్రుడు - మీరు XXXXXX కంపనీ మొబైల్ సిమ్ వాడుతున్నట్లయితే, ఆన్ లైన్లో చూసి మీరు ఆ ఫోన్ సిమ్ ఖరీదు చేసినప్పుడు ఇచ్చిన అడ్రెస్ ని ఆన్ లైన్లో చూసి చెప్పగలడు. టెక్నాలజీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో, నష్టాలూ అంతే ఉన్నాయి. రెండువైపులా పదను ఉన్న కత్తి ఇది.

ఫోన్ చేసి ఎక్కడైనా కాలవాలని అనుకుంటే ముందుగా బాగా రష్ గా ఉండే పబ్లిక్ ప్లేస్ ఎంచుకోండి. తోడుగా ఇంకో మిత్రుడినీ  దూరముగా ఉంచుకోండి. బోర్ వస్తే సైగ చెయ్యగానే మిమ్మల్ని పలకరించి, మిమ్మల్ని అక్కడి నుండి తీసుకేల్లెలా ఉండగలగాలి.

వీడియోలు :
వీడియోలు పెట్టాలి అనుకునేవారు సాధారణముగా ఇంట్లోని వీడియోలు పెట్టడం అంత మంచి పద్ధతి కాదు. ఒకవేళ పెట్టినా కొద్దిమంది చూసేలా పెట్టండి చాలు. ఇక బెడ్ రూం వీడియోలు అసలే వద్దు.. కొన్ని గ్రూపుల్లో అలాంటి వీడియోలు పెట్టారు. అవి సాధారణముగా పర్సనల్ కోసమని తమ "శక్తి సామర్థ్యాలు" ఇంకొకరికి చూపితే, అవతలి వారు గమ్మున చూసి వదిలేయకుండా, నెట్లో పబ్లిక్ గా పెట్టి విశ్వవ్యాప్తం చేశారు. అందుకే తస్మాత్ జాగ్రత్త.

ఎలాగూ ఆ టాపిక్ వచ్చింది కాబట్టి అలాంటి వీడియోలు మీ సిస్టం లలో పెట్టి ఉంటే ఒక CD లోకి మార్చుకొని డిలీట్ చెయ్యండి. మీ సిస్టం ఎప్పుడైనా హాకింగ్ కి గురవుతే.. ఇక మీ రహస్యాలు విశ్వవ్యాప్తమే! (ఇలాంటి విషయమే మొబైల్ ఫోన్ల గురించి త్వరలో మీకు చెబుతాను)

మీ పర్యటన వీడియోలు.. మీరు కనపడని వీడియోలు అయితే బెస్ట్.

ఫోటో కామెంట్స్ :
మీ ఫొటోస్ కి మీ మిత్రులు కామెంట్స్ చేస్తారు. అది చాలా సాధారణం. ఒకవేళ - ఆలా ఎవరూ చేయ్యవోద్దూ అంటే సెట్టింగ్స్ లలోకి వెళ్లి ఆ ఆప్షన్ ఎన్నుకోవాలి. కాని సరదా ఉండే కామెంట్స్ అయితేనే మంచిది. బోర్ గా ఉన్నప్పుడు అవన్నీ చూస్తే మనసుకి ఉల్లాసముగా ఉంటుంది. నాకైతే బోర్ అనిపించినప్పుడల్లా అలా మళ్ళీ చూస్తాను.. ఈ కామెంట్ కి ఇలా వ్రాయాల్సి ఉండెను అనిపిస్తుంది. ఒక్కోసారి నవ్వు వస్తుంది కూడా..

కామెంట్స్ వ్రాయండి. వారు పెట్టిన ఫొటోస్ బాగుంటే మరీ, మరీ కామెంట్స్ చేసి బాగున్నాయని చెప్పండి. చిన్నగా బాగున్నాయి అని చెప్పకుండా ఒకటి, రెండు వాక్యాల్లో కామెంట్స్ చెప్పడానికే ప్రయత్నించండి. మొదట్లో ఇలా చేయటం కష్టమే అయిననూ.. కొంత అభ్యాసం చేస్తే ఈజీగా వస్తాయి. ఇంకా ఈజీగా తెలుసుకోవాలంటే వారివీ, వీరివీ ఫొటోస్ చూడండి.. అందులోని ఫొటోస్ లకి కామెంట్స్ ఎలా ఉన్నాయో గమనించండి. వాటికి వచ్చిన రిప్లైలను కూడా గమనించండి.

కొంతమంది సరదాగా, వ్యంగముగా, బాంబులు పేల్చినట్లుగా వ్రాస్తారు.. సరదాగా తీసుకోండి. ఇబ్బందిగా ఉంటే ఆ ఫోటో కామెంట్ ని డెలీట్ చేసెయ్యండి. మీ ఇబ్బందిని వారికి పర్సనల్ మెయిల్ లో సున్నితముగా వివరించండి. అలా చేస్తే మీ వ్యక్తిత్వం ఇంకా గొప్పగా ఎదుటివారికి కనిపిస్తుంది. వారు - మనుష్యులు అయితే మళ్ళీ అలా మీకు వ్రాయాలని అనుకోడు.

మీకు బాగా తెలివితేటలూ ఉంటే వారు వ్రాసిన దానికి మీరూ కట్ చేసినట్లుగా చెప్పండి. లేదా మీ దగ్గరి స్నేహితుల్లో, ఆన్ లైన్ స్నేహితుల్లో సహాయము తీసుకోండి. ఇది అన్నివేళలా సాధ్యం కాదు. కొద్దిగా అభ్యాసం చేస్తే ఈ టాలెంటు అబ్బుతుంది.

మీరే ముందుగా ఎవరి ఫోటోలకైన కామెంట్స్ - అదీ వారిని గెలికేలా వ్రాశారే అనుకుందాం. ఆ తరవాత వారు వ్రాసే రిప్లై వాటికి మీరు తట్టుకోగలిగి ఉండాలి. అలా అయితేనే ఎదుటివారిని గెలకండి. బుద్ధిగా ఉన్న, ఉంటున్న వారి జోలికి వెళ్ళకండి.

ఫ్రెండ్ రిక్వెస్టులు :
అసలైయిన చాప్టర్ ఇదే.. నిజజీవితములో కొందరిని రోడ్డు మీదే, ఇంకొందరిని ఇంటి ముందు గేటు వద్దే, మరికొందరిని ఇంటి డ్రాయింగ్ రూం లో.. ఎలా పలకరిస్తామో ఇక్కడా అంతే! వారి మీద అభిప్రాయాలతో మనకి దగ్గర్గానా, దూరము గానా ఉంచేది అన్నది ఎలా ఉంటుందో వారు మనల్ని ఆకట్టుకున్నా దానిమీద  ఆధారపడుతుంది. నాకు తెలిసిన కొన్ని పద్ధతుల్ని చెబుతాను. మీకిష్టమైతేనే పాటించండి.

ఆడవారివి అయితే ఏదో వారికీ ఉండే స్వతహాగా ఉండే భయాల వల్లనో.. పూర్తిగా వివరాలు ఉండవు. ఇక్కడ వారు నిజముగా ఆడవారేనా అని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవటానికి వారికి వచ్చేస్క్రాప్స్, వారు వ్రాసే స్క్రాప్స్ పరిశీలిస్తే తెలుస్తాయి. కొందరు మొగవారు కూడా ఇలా ఆడ పేర్లు పెట్టుకొని స్నేహాలు చేస్తున్నారు. అలా ఒకడిని నేను గుర్తించాను కూడా.

ఇక మీరు మగవారి / ఇతరుల నుండి నుండి వచ్చే అభ్యర్టనల లోని గమనించాల్సిన పద్ధతులు ఏమిటంటే :

1. ఎవరి వద్దనుండైనా మీకు ఫ్రెండ్ ఆడ్ రిక్వెస్ట్ వచ్చిందే అనుకోండి. వెంటనే ఆక్సెప్ట్ చెయ్యకండి.

2. అలా పంపిన వారి ప్రొఫైల్ ఫోటో మీద, లేదా మెయిల్ ID మీద గానీ క్లిక్ చెయ్యండి. వారి ప్రొఫైల్ కనీసం సగమైనా నిండి ఉందా చూడండి. కొందరి దాంట్లో ఏ...మీ ఉండదు. కేవలం మేల్, ఇండియా అని అంతే! మిగతావి చెప్పకపోవటములో వారికేం అభ్యంతరం? పోనీ అలా ఖాళీలు నింపకపొవటములో నిర్లక్ష్యమే అనుకుందాము.. అలాగే మనమీద కూడా నిర్లక్ష్యం చూపరని గ్యారంటీ ఏమిటీ?

3. అతను మొగవాడయితే ప్రొఫైల్ ఫోటో తనది పెట్టకుండా ఏదో పువ్వులూ, సినీ హీరోల బొమ్మలు పెట్టాడే అనుకుందాము.. కొద్దిగా అనుమానించాల్సిందే. అతని ఫోటో పెట్టుకోలేనంతగా వికారియా?.. లేక పెద్ద ఫాన్ ఫాలోయింగ్ హీరోలా? నేను గమనించిన వారిలో మాత్రం - అమ్మాయిలతో హస్కు వేసే, అందమైన మాటలూ చెప్పే వారే కనిపించారు. అలాంటి విషయాల్లో వారు ఫుల్లీ  టాలెంటేడ్ పర్సన్స్.. అదే ఫోటో పెట్టుకున్న వారిలో అమ్మాయిలతో చాలా మర్యాదగా ఉంటున్నారు / మాట్లాడుతున్నారు. రేపు ప్రొద్దున ఏమైనా జరిగితే - అయ్యో నావల్ల ఇది జరిగిందే అని ఫీల్ అయ్యే వారిని చాలా మందిని చూశాను. ఉదాహరణకి - పైన నేను పరిచయం చేసిన ప్రమోషన్ అబ్బాయి. అతడు ఆ మాత్రం దానికే తెగ ఫీలయ్యాడు.. ఇలా ఒక్క ఫొటోనే పెట్టుకున్న వారు కాదు. తమ వివరాలూ దాదాపు అన్నీ పెట్టిన వారు చాలా బుద్ధిగా ఉండటం గమనించాను. అలా ఎందుకోగాని, కారణం ఏమి ఉంటుందో గాని తెలియదు.. .. బహుశా ఎవరైనా చీకట్లో ఉండి ఏమైనా ఎదుటి వారిని అనొచ్చు.. అదే వాడిని స్టేజి ఎక్కించి ఏదైనా మాట్లాడమంటే మాట్లాడక పోతాడుగా, కాళ్ళూ చేతులు వణుకుతాయి... ఇదీ అలాగే అనుకుంటాను. ఫోటో ఉన్నవారు చాలా అనుకువగా ఉన్నవారే ఉన్నారు. ఫోటో ఉన్న, మర్యాద తెలీని వాడిని ఒక్కడిని చూసాను. ఫ్రెండ్ రిక్వెస్ట్  పంపితే..  నేను అతని  పేజిలో ఏమీ డిటైల్స్ లేవని, అందుకే రిజెక్ట్  చేస్తున్నా అంటే అమర్యాదగా మాట్లాడాడు. ఆ ఒక్కటి కేసు మినహా అంతా నేను అనుకున్నట్లే - ఫొటోస్ ఉన్నవారు అందరూ బుద్ధిమంతులే..(నేను చూసిన వరకు)

4. నా మిత్రురాలు ఒక లింక్ చెప్పారు.. అందులో ఉన్నది ఈమె మహిళా ఫ్రెండ్ కి ఫ్రెండ్. కొద్దిగా బంధుత్వం కూడా నట. అతను ఫోటో లేదు.. వివరాలూ లేవు. ఆడ్ చేసుకున్నాక బంధువు తెలిసింది.. ఎప్పటివో పగలు ఉంచుకొని రోజూ సతాయిస్తున్నాడు. డెలీట్  చెయ్యనివ్వడు..  నరకం చూపిస్తున్నాడు. అన్నింటికన్నా మించి అతను గవర్నమెంట్ ఆఫీసరు. తరచి చూస్తే ఇలాంటివి ఎన్నెన్నో వ్యధలు.

5. అమ్మయిలెప్పుడూ రాత్రి తొమ్మిది అవగానే నెట్ లోంచి వెళ్ళిపొండి. రాత్రి గడుస్తున్నా ఇంకా చాట్ అవైలబుల్ లో ఉన్నారే అనుకోండి - దీనికి బాగా ........... ఎక్కువ అయినట్లుంది.. అనుకుంటూ చాట్ చర్చలు అన్నీ "అటువైపు" దారి తీస్తాయి. ఇది నిజమే.. నాకు తెలిసిన ఒక FM రేడియో యాంకరూ, వారి అమ్మగారూ ఇలా బలయ్యారు. లండన్ లో వారి కూతురు ఉండేడిది. అలా రోజూ రాత్రి పన్నెండు గంటలకి జిమెయిల్ లో చాట్ చేసుకోనేడివారు. వీరు చేసినపోరబాటు ఏమిటంటే చాట్ అవైలబుల్ లో ఉండి  చాట్ చేసేవారు. నిజానికి వారు చాలా అందముగా ఉండెడివారు అనుకోండి. వీరేంటీ! ఇలా చాట్ అవైలబుల్ లో ఉండి చాట్ చేస్తారు.. ఇలా ఇబ్బంది కాదా వీరికి.. అనుకున్నాను. ఇలా మీరు ఉండొద్దు అని చెప్పే చనువు నాకు వారితో లేదు. అనుకున్నట్లే వారు ఆ తరవాత వారం పదిరోజుల్లో వారిద్దరూ నెట్ కి రావటం కట్ అయ్యింది. ఒకరు నెట్ కి అసలే రానని, ఇంకొకరు ఇలా వచ్చి తనకి వచ్చిన ఆర్కుట్ స్క్రాప్స్ చూసుకొని వెళతారు. వారు చేసిన పోరబాటులు మీరే చూడండి. అంత రాత్రిపూట చాట్ అవైలబుల్ పెట్టడం, ఫొటోస్ అందరికీ కనపడేలా పెట్టడం (తమ మిత్రులకే కాదు వేరేవారు చూసినా కనపడేలా), తమ అక్కౌంట్ కి తగిన సెట్టింగ్స్ ఎలాపెట్టాలో తెలీకపోవటం.. అడిగితే ఎవరైనా చెబుతారుగా.. అదే నెట్లో, లేదా అదే సోషల్ సైట్లోని  మిత్రులతో చర్చించినా ఏ సమస్యకి పరిష్కారం దొరికేది వారికి. ఆ అమ్మాయి పుట్టినరోజు కి ఆమె స్క్రాప్ బుక్లో పదిహేడు  పేజీల వరకూ స్క్రాప్స్ ఉండేడివి.అంటే 170 వరకూ పుట్టినరోజు శుభాకాంక్షల సందేశాలు. నాకే ఈసారి కష్టపడితే ఏడు పేజీల గ్రీటింగ్స్ ( అంటే డెబ్భై ) అంతే. అంతగా ఫాలోయింగ్ ఉన్న వారిని ఎక్కడా చూడలేదు. (చాలా అందమైన అమ్మాయి కదా) అలాంటిది ఆమె చేసిన పొరబాట్లకి, ఆమెనే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఏమైంది ఆన్లైన్ కి రావటం లేదూ అని తనతో అంటే అసహ్యకర వ్రాతలూ, చేష్టలను చూసి మొత్తానికి వెళ్ళిపోయాను - అన్నారు. నాకైతే వీరే పొరబాటు చేశారేమోనని అనిపిస్తుంది అప్పుడప్పుడు. అలా ఇబ్బంది పెట్టినవారిని తీసేస్తే సరిపోయేడిది. ఇక్కడ మరొక విషయాన్ని గమనించాలి. ఇలా అయిందని తన అకౌంట్ ని పూర్తిగా తీసేశారు. తరవాత నచ్చిన మిత్రులతో (వందకు లోపే) ఇంకో అకౌంట్ ఓపెన్ చేశారు. మళ్ళీ అలాగే అయ్యిందంట. ఇక లాభం లేదని మొత్తానికే దూరం అయ్యారుట. నన్ను పరిష్కారం అడిగితే - సెట్టింగ్స్ మార్చుకోండి అని చెప్పేవాడిని. అలాగే ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పేవాడిని.

6. ఇంకో ఆమెది ఇలాంటి కథనే. వచ్చిన రిక్వెస్ట్ అన్నింటినీ ఓకే చేసి తీరుబాటుగా ఒక్కొక్కడినీ పరిచయం చేసుకొని, వారితో మాట్లాడాక అప్పుడు ఒక అభిప్రాయానికి వచ్చేడిది. ఎంచక్కా సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య అయిన ఆమె దాంట్లో ఎన్నో పేరూ, అడ్డ్రెస్ లేనివి చాలానే ఉన్నాయి. నేను ఒకసారి చూసినప్పుడు తొమ్మిది వందలకి పైగా స్నేహితులు, అందులో కొంతమంది ప్రోఫైల్స్ లలో బాహాటముగానే సెక్స్ గురించిన అభిప్రాయాలు ఉన్నాయి. ఈవిడా అలాంటిదేనా అనే అనుమానం వచ్చింది.. కొద్ది నెలల క్రిందట వారూ, వీరూ "ఇబ్బంది" పెడుతున్నారని చాట్లో నాతో అంది.. కొన్ని నివారణా మార్గాలు చెప్పాను. ఆ తరవాతేమైందో గాని.. నాకు దూరం అయ్యారు. మనమేదో మేలు చేద్దాం అని చూస్తే అప్పుడప్పుడూ ఇలాంటి చిన్ని చిన్ని బహుమతులు దొరకవచ్చు.

7. అతనే కాదు, అతని మిత్రులు ఎలా అతన్ని ట్రీట్ చేస్తున్నారు, ఎలాంటి భావాలను వారు కలిగి ఉన్నారో మీకు వీలయితే గమనించండి.

8. ఆడ్ చేసుకునే ముందు - వారికీ మీకు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారిద్దరి (ఆ క్రొత్త అతనూ, మీ మధ్య మ్యూచుయల్ ఫ్రెండ్) మధ్య ఉన్న / వ్రాసుకున్న స్క్రాప్స్ చూడండి. అతనికి వచ్చిన టెస్తిమోనియల్స్ కూడా ఒకసారి లుక్కెయ్యండి. అ తరవాత ఆ మ్యూచువల్ ఫ్రెండ్ ని అతడి గురించి అడగండి. అతని గురించి కనీసం ఫరవాలేదు అని వచ్చినా వెంటనే వారి ఫ్రెండ్ రిక్వెస్ట్ లని ఒప్పేసుకోండి. అతనికి నచ్చనివారు - మీకు నచ్చవచ్చు. లేదా అతనే వారిని తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చును.

9. క్రొత్తవారు మీ పేజిలో స్క్రాప్స్ వ్రాసేలా సెట్టింగులు పెట్టండి. కొందరు - వారి ఫొటోస్, వీడియోలు చూడనీయకుండా పెట్టడములో అర్థం ఉంది.కానీ కొత్తవారు స్క్రాప్స్ వ్రాయనీకుండా సెట్టింగ్స్ పెట్టడములో ఉన్న ఇబ్బంది ఏమిటో నాకు అర్థం కాలేదు. నా పేజిలో అలా ఏమీ పెట్టలేదు. అయినా కొందరు మిత్రులు అలా నా స్క్రాప్స్ పేజిలో వ్రాసిన స్క్రాప్స్ వల్ల మిత్రులు అయ్యారు.. అలా అయినవారిలో ఇద్దరినీ కలిసాను కూడా.. ఎవరైనా అలా వచ్చి ఇబ్బంది పెడితే వారిని 'బ్లాక్' చెయ్యొచ్చు. అంటే వారిని మనదాకా రానీయకుండా ఆర్కుట్ వాడే (గూగుల్ వాడే) ఆపేస్తాడన్నమాట. ఇంకా మీకు నమ్మకం లేకపోతే.. ఈ మాత్రం దానికి ఆర్కుట్ కి వచ్చే బదులు హాయిగా జిమెయిల్ లో చాట్ చేసుకోవచ్చు, లేదా క్రొత్తగా వచ్చిన "బజ్" (ట్వీటార్ లాంటిది) వాడుకుంటే బెస్టు.

10. ఎన్ని వడపోతలూ,లెక్కలూ అయినా కూడా అప్పుడప్పుడూ కొందరు "మహానుభావులు" దొరుకుతారు. కొద్దిగా దూరం ఉంటే చాలు. ముందే చెప్పాగా - ఒకరు మంచి స్నేహితులుగా దొరికేముందు పదిమందికి పైగా పనికిరాని వాళ్ళని కలవాల్సి ఉంటుందని. మనం చిన్నప్పుడు క్లాసులో ముప్పై, నలభై మంది ఉన్నా.. అందరూ మనతో మాట్లాడినా కొద్దిమందితోనే ఎక్కువ సమయం గడుపుతాము.. ఇక్కడా అంతే అనుకోండి.

ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ..

Sunday, May 30, 2010

Antivairus - Installing methods

మీరు అంటి వైరస్ ప్రోగ్రాం ని మీ సిస్టం లో ఇన్స్టాల్ చెయ్యాలని అనుకుంటున్నారా? అయితే ఈ పద్దతులని పాటించండి.

ముందుగా మీరు ఏదైనా అంటివైరస్ ప్రోగ్రాం ని డౌన్లోడ్ చెయ్యండి.
http://www.avira.com/ ,
http://www.avast.com/ ,
http://www.avg.com/  ,
http://www.kaspersky.com/   లాంటి ఏదో ఒక నమ్మకమైన సైట్లనుండి డౌన్లోడ్ చెయ్యండి.

డౌన్లోడ్ ఫైల్ సైజు సాధారణముగా  25 MB నుండి 50 MB వరకూ ఉంటుంది.

డౌన్లోడ్ అయ్యిందా.. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని "D" డ్రైవ్ లో ఒక ఫోల్డర్ క్రొత్తగా పెట్టి ఆ ఫోల్డర్ పేరు "SOFTWARES " అని పేరు పెట్టండి.. ఆ ఫోల్డర్ లోకి ఈ సాఫ్ట్వేర్ ని పేస్ట్ చెయ్యండి. ఇలా చెయ్యడం ఎందుకు అంటే అవసరం అనుకున్నప్పుడు డౌన్లోడ్ చేసే పని తప్పుతుంది. సమయమూ మిగులుతుంది. ఎవరికైనా కాపీ చేసి ఇవ్వటానికి ఈజీగా ఉంటుంది.. మనం మన సిస్టం ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ క్రొత్తగా ఇన్స్టాల్ చేసినప్పుడు డౌన్లోడ్ / CD నుండి కాపీ లాంటి సమయం వృధా పనులు ఉండవు..

ఇప్పుడు మీ సిస్టం లోని ముఖ్యమైన ఫైల్స్ ని ఒక DVD లోకి కాపీ చెయ్యండి. అవి వైరస్ తో ఉన్నా సరే.. వేరు వేరు ఫైల్స్ గా చెయ్యండి.. ఒకే ఫోల్డర్ గా చెయ్యకండి. ఒక్కటే ఫోల్డర్ లాగా మీ సిస్టం లో ఎలా ఉంటే అలాగే చెయ్యండి.. క్రొత్తగా ముద్దగా అంటే ఒకే ఫోల్డర్ లో వేయకండి. ఇలా చేస్తే వైరస్ అన్నింటికీ అంటో- చ్చు అని నా ఆలోచన. ఒకసారి అలాగే జరిగింది కూడా.. ఇలా DVD లోకి కాపీ చెయ్యటం ఎందుకూ అంటే వైరస్ ఉండి ఆ ఫైల్స్ పోయాయే అనుకోండి. మీకు ఆ డాటా దొరకటం కష్టం. ఇలా సేవ్ చేసి పెడితే కనీసం ప్రింటవుట్ అయినా తీసుకోవచ్చు. మహా ఒక DVD విలువ ఎనిమిది రూపాయలేగా! అందుకని.

ఆ అంటి వైరస్ సాఫ్ట్వేర్ ని రన్ చేసి ఇన్స్టాల్ మొదలు పెట్టండి.  :

1. ఇంటర్నెట్ ఆన్ చేసి "C" డ్రైవ్ లో ఆ అంటివైరస్ ప్రోగ్రాం ని ఇన్స్టాల్ చేయండి.. ఇలా చేయటం వలన అప్డేట్ ఉంటే అదీ ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అవుతాయి. ఆన్లైన్ లో ఉండి ఇన్స్టాల్ చేస్తే ఇదొక లాభం. మాటి మాటికీ అప్డేట్స్ వెదకాల్సిన అవసరం ఉండదు. సాఫ్ట్వేర్ లని అప్డేట్ చెయ్యాల్సిన సాఫ్ట్వేర్ వేసుకోవాల్సిన అవసరం లేదు..


2. ఇన్స్టాల్ అయ్యాక,  ఒక్కసారి మీ సిస్టం ని అంతా (అన్ని డ్రైవ్ లూ కలిపి) ఒక్కసారి ఆ సాఫ్ట్వేర్ తో స్కాన్ చెయ్యండి..


3. అంతా స్కాన్ అయ్యాక వైరస్ లు ఏమైనా ఉంటే వైరస్ చెస్ట్ కి పంపిస్తుంది - మీరు అనుమతి ఇస్తేనే!


4. అలా స్కాన్ అయ్యాక ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి. (ఈ పాపప్ విండో దానంతట అదే వస్తుంది.. వెదకాలసిన అవసరముండదు. కొన్నింటికి అంతా స్కాన్ అయ్యాక వస్తుంది. కొన్నింటికి ముందే వస్తుంది. )


5. అప్పుడు మీ మెయిల్ ID, మీ వయస్సు, లింగం, ఎన్ని రోజులనుండి వాడుతున్నారు, ఈ సాఫ్ట్వేర్ గురించి మీకెలా తెలిసింది?.. అలాంటి ప్రశ్నలు అడుగుతుంది. వాటికి జస్ట్ క్లిక్ (ఆబ్జెక్టివ్ టైప్) ఇచ్చేలా ఉంటాయి.


6. అవన్నీ క్లిక్ చేశాక వెంటనే మీ మెయిల్ ID కి ఒక రిజిస్టర్ కోడ్ వస్తుంది.


7. దాని ఆ పాపప్ విండో లో అడిగిన చోట పేస్ట్ చేసి ఓకే చేస్తే ఇక మీరు ఆ సాఫ్ట్వేర్ వాడుటకి అంతా సవ్యముగా జరిగినట్లే! ఇక మీరు నిశ్చింతగా ఉండొచ్చు..

8. రెండు అంటి వైరస్లు వేసుకోవచ్చు.. కాని ఒక్కోసారి ఒకదాన్ని ఒకటి తొలగించే క్రమములో మీ సిస్టం హ్యాంగ్ కావచ్చును. అందుకే "నిక్కమైన నీలము ఒక్కటైనను చాలు.." అనే సామెత గుర్తుపెట్టుకోండి.

ఇదీ పద్ధతులు.. వీటిని తూ.చ. తప్పకుండా పాటించండి..

Wednesday, May 26, 2010

Stand by

మీరు తరచుగా మీ కంప్యూటర్ ని ఆన్ చేసి పని చూసుకొని, తరవాత షట్ డౌన్ చేసి.. మళ్ళీ పని ఉందనుకొని మళ్ళీ ఆన్ చేస్తున్నారా? ఇలా చేస్తే చాలా సమయం వృధా! అలాగే విద్యుత్ ఖర్చూ పెరుగుతుంది.. మీ హార్డ్ డిస్క్ మన్నిక తక్కువ ఉంటుంది.

 • మీరు ఆఫీసు కి వెళ్ళాకనో, లేక ఇంట్లోనో సిస్టం ఆన్ చేసాక...  మీ పని ముగిసాక మీరు ఇంకా ఆఫీసు లోనో, ఇంట్లోనో ఉన్నట్లయితే మీ సిస్టాన్ని షట్ డౌన్ చెయ్యకుండా స్టాండ్ బై లో ఉంచండి. 
 • ఇలా చెయ్యటం వల్ల మాటి మాటికీ ఆన్ / ఆఫ్ చెయ్యాల్సిన అవసరం ఉండదు. 
 • విద్యుత్తు కొంత వాడకాన్ని తగ్గించిన వారిమీ అవుతాము.  
 • స్టాండ్ బై లో ఉంచడం వల్ల గంటకు కేవలం 3 (మూడు) వాట్ల విద్యుత్ ని మాత్రమే వాడుకుంటుంది. అంటే మూడు వందల ముప్పై మూడు గంటలు స్టాండ్ బై లో ఉంచితే కాలేది ఒక యూనిట్ విద్యుత్ మాత్రమే. అంటే ఇంటికి అయితే 2 నుండి 4 రూపాయలు, వాణిజ్యం అయితే  3 నుండి 7 రూపాయలు అన్నమాట!
 • ఊరి వూరికే సిస్టాన్ని ఆఫ్ / ఆన్ చేస్తే మీ హార్డ్ డిస్క్ మన్నిక తగ్గుతుంది. గీతలు పడే అవకాశం ఎక్కువ.
 • హార్డ్ డిస్క్ లో ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉండి, అవన్నీ సిస్టం ఆన్ చేసినప్పుడు రన్ అయ్యేవి అయితే మీ సిస్టం వాడకానికి / సిద్ధం అవటానికి కొంత సమయం పడుతుంది.
 • మీరు ఇలా స్టాండ్ బై లో ఉంచటం వల్ల ఆన్ చేసిన వెంటనే అన్ని ప్రోగ్రామ్స్ ని రన్ చేసి వాడుకోవచ్చును.
 • మీది మోనిటర్ CRT అయితే విద్యుత్ వినియోగం ఎక్కువే.. LCD అయితే తక్కువ విద్యుత్ వాడుకుంటుంది.
 • స్టాండ్ బై లో ఉంచడం వల్ల CRT మోనిటర్ ని UPS మీదనూ, ఇన్వర్టార్ మీద సులభముగా వాడుకోవచ్చును.
 • ఇలా చేయటానికి మీరు కేవలం షట్ డౌన్ అని చేసేముందు స్టాండ్ బై ని ఎంచుకుంటే సరి.
 • ఆఫీసులో కాసేపు అలా బయటకో, వేరేపని ఉండో సిస్టాన్ని వాడక్కున్నట్లయితే, ఇలా స్టాండ్ బై లో ఉంచటం మంచిది.

Tuesday, May 25, 2010

Nee sukhame ne korukunnaa - Muralikrishna

చిత్రం పేరు : మురళీకృష్ణ (1964)
పాడిన వారు : ఘంటసాల 
సంగీతం : మాస్టర్ వేణు
రచన : ఆత్రేయ 
నటీనటులు : అక్కినేని, హరినాథ్, జమున, శారద..
****************
పల్లవి :
ఎక్కడ ఉన్నా ఏమైనా - మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నేను కోరుకున్నా - నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం  1:
అనుకున్నామని జరగవు అన్నీ - అనుకోలేదనీ ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికనీ - అనోకోవడమే మనిషి పనీ..
నీ సుఖమే నేను కోరుకున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం  2:
పసిపాపవలె ఒడి చేరినాను - కనుపాపవలె కాపాడినాను
గుండెను గుడిగా చేశానూ -
గుండెను గుడిగా చేశానూ - నువ్వుండ లేననీ వెళ్లావూ
నీ సుఖమే నేను కోరుకున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

చరణం  3:
వలచుట తెలిసిన నా మనసునకు - మరచుట మాత్రం తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే - మన్నించుటయే ఋజువు కదా!
నీ సుఖమే నేను కోరుకున్నా
నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా

నీ కలలే కమ్మగా పండనీ - నాతలపే నీలో వాడనీ
కలకాలం చల్లగా ఉండాలనీ - దీవిస్తున్నా నా దేవిని
దీవిస్తున్నా నా దేవిని

ఎక్కడ ఉన్నా ఏమైనా - మనమెవరికి వారై వేరైనా
నీ సుఖమే నేను కోరుకున్నా - నిను వీడి అందుకే వెళుతున్నా
నీ సుఖమే నే కోరుకున్నా
నీ సుఖమే నేను కోరుకున్నా..

Saturday, May 22, 2010

ఒక చిన్ని సహాయం

సోషల్ సైట్ లో నాకు ఈమధ్యనే ఒకావిడ పరిచయం.. అయి మహా అంటే రెండు, మూడు నెలలు కావచ్చును.. ఏదో హాయ్ అంటే హాయ్ పోలైట్ గా నడుస్తున్నదీ మా మధ్య ఆన్లైన్ స్నేహం. బహుశా నెల రోజుల క్రితం అనుకుంటాను.. ఆర్కుట్ లోకి లాగిన్ అవగానే చాట్ కి వచ్చారు ఆవిడ. అసలు ఆవిడ అలా చాట్ చేస్తారని ఊహించలేదు.. అయినా కంటిన్యూ చేశాను..

ఆవిడకి కొన్ని పాత తెలుగు పాటలు కావాలని అడిగారు.

ఎందుకూ అన్నాను..

చెప్పారు ఆవిడ - తను ఉండేది విదేశములో.. ఇండియా లోని ఒక మహా నగరం లో వారి డాడీ ఉంటారు. వారి డాడీ కోసమని ఒక ఐపాడ్ కొనుగోలు చేశారట. అందులో ఆయనకిష్టమైన పాత సినిమా పాటలు నింపి - ఆ ఐపాడ్ ని కానుకగా ఇవ్వాలని తన ఆలోచన. రెండురోజులనుండీ తనకి తెలిసిన మిత్రులను, ఆన్లైన్ మిత్రులనూ అడిగినా కొన్నిపాటలు మాత్రమే సేకరించగలిగారు. కొందరు ఆ పాత పాటల లింకులని చెప్పారు.. కాని తనకి అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ( పేమెంట్ సైట్లు అవి ) అర్థం కావటం లేదని - వదిలేసింది. తనకోరిక నెరవేరేలా లేదని నిరాశలో ఉంది తను.

ఎందుకో నాకే తన బాధని చూడబుద్ది కాలేదు.

ఇక "మీరు ఆ విషయం మరచిపోండి" అన్నాను. 

అంటే "మీ వల్ల కాదా..?" అని అటువైపు నుండి ప్రశ్న.

"కాదని అనలేదే.. అవుతుంది. మీకు ఏ ఏ సినిమాల పాటలు కావాలో చెప్పండి" అన్నాను.

కొన్ని సినిమాల పేర్లు తను చెప్పారు. "ఇంకా ఏమున్నాయి.. మీ దగ్గర" అని అడిగారు.

"మీకు ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి" అన్నాను.

"ఆన్లైన్ లో పంపండి ప్లీజ్!" అన్నారు.

నేను వాటిని అప్లోడ్ చేసి.. ఆవిడ డౌన్లోడ్ చేసుకొని, ఆ ఐపాడ్ లోకి లోడ్ చెయ్యటం.. అంత సమయం లేదు. ఎందుకంటే అప్పటికే ఆవిడ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యింది. మరుసటి రోజు తెల్లవారిఝామున ఇండియా కి ప్రయాణం.

"ఇలా అయితే కాదు.. మీరు ఇండియా లో మీరు ఎక్కడ ఉండబోతున్నారో అక్కడ నెట్ కనెక్షన్ ఉన్న సిస్టమ్ ఉందా" అని అడిగితే లేదని చెప్పారావిడ.

"అబ్బో! పెద్ద చిక్కే వచ్చింది" అనుకున్నాను.

"పోనీ మీది లాప్ టాపా? అది ఇండియా కి తీసుకొస్తున్నారా?" అని అడిగాను.

"ఆ.. తీసుకొస్తున్నాను.. అయితే ఏం!" అని తను అంటే

"ఇక మీ బాధ అంతా తీరినట్లే.. ఇక నిశ్చింతగా ఉండండి.. మీరు ఇండియాకి యధావిధిగా వచ్చేస్తారు.. అంతలోగా నేను మీకు కావలసిన పాటలని ఒక DVD లోకి మార్చి, మీకు కొరియర్ చేస్తానని, అక్కడ మీరు ఆ పాటలని మీ లాప్ టాప్ లో లోడ్ చేసి, అనక ఆ ఐపాడ్ లోకి లోడ్ చేసివ్వండి.. కాకపోతే చిన్న ఒక కండీషన్.. థాంక్స్ అంటూ ఏమీ వద్దు.. నేను మీకు సహాయం చేసినట్లు అనుకోకండి.. ఏదో ఇలా సరదాగా చేసాను - మన ఫ్రెండ్ షిప్ కి గుర్తుగా మాత్రమే అనుకోండి" అన్నాను.

తను "సరే" నని అన్నారు..

తనకి చెప్పినట్లుగానే నేను ఆ పాత పాటలని ( 865 పాటలు -  2.85 GB) ఒక DVD లోకి కాపీ చేసిచ్చాను. తను చెప్పిన అడ్రెస్ కి కొరియర్ చేసాను.  ఆవిడకి అందింది. లోడ్ చేసి.. వారి నాన్నగారికి ఇచ్చారు.. నా సోషల్ అకౌంట్ కి ఓ చిన్ని స్క్రాప్. "Thanks" అని.(నా కండీషన్ మేరకు)

నా మనసులో ఒక సంతోషం.. ఒకరికి అజ్ఞాతముగా ఉండి సహాయపడ్డానని. వారెవరో నాకు తెలీదు.. తన డాడీ ఇంతవరకు తెలీనే తెలీదు. అయినా సహాయం చేశాను. అందులో నాకు ఎంతో ఆనందం దొరికింది. నేను దీనికోసం చేసింది కొంత సమయం కేటాయింపూ, కొరియర్ ఖర్చూ.. అంతే!.. కాని నేను పొందిన మానసిక ఉల్లాసం చెప్పంలేనంత.. ఇదంతా నా గొప్పకోసం చెప్పటం లేదు. ఏదో ఇలా చేస్తానూ అని షో చెయ్యటానికి కాదు.

మన స్నేహితుల అవసరాలు మనం తీర్చగలం అనుకుంటే - అవి పెద్ద ఖర్చూ లేనివి, వారికీ మనకీ అంతులేని ఆనందం లభించేటివియితే - తప్పక తీర్చాలి. ఇలాంటి అనుకోని సహాయాల వల్ల స్నేహబంధం బాగా పెనవేసుకుంటుంది. అలాని మళ్ళీ నిరూపితం అయ్యింది. అలాని ఆవిడతో చాట్లూ, స్క్రాప్స్.. అంటూ మరింతగా ఏమీ లేదు. ఈ సంఘటన జరగక ముందు మా మధ్య ఎలా స్నేహం ఉందో ఇప్పుడూ అలాగే ఉంది. అంతే! అలాగే ఉండటం నాకిష్టం.

Friday, May 21, 2010

Over burn CD

మీరు ఎప్పుడైనా CD కాని, DVD నింపేటప్పుడు ఆ డిస్క్ లో పట్టే పరిమాణము కన్నా మీరు ఆ డిస్క్ లో నింపే డాటా ఎక్కువగా ఉంటే "Over burn CD" అనే ఆప్షన్ ఎంచుకోకండి. దానివలన మీరు కొంత డాటా కోల్పోవుతారు.

మీరు ఏదైనా ఫైల్ గానీ, డాటా గానీ, ఫొటోస్ గానీ, పాటలు గానీ ఒక డిస్క్ లో నింపాలీ ( బర్న్ ) అనుకున్నప్పుడు ఒక DVD ని DVD రైటర్ లో పెట్టి, సమాచారాన్ని నీరో ద్వారా గానీ, మరే ఇతర సాప్ట్ వేర్ తో గానీ, మీరు అందులో బర్న్ చేస్తున్నారే అనుకుందాము. అందులో సింగిల్ లేయర్ DVD [DVD-5]  (మనదగ్గర దొరికేవి అన్నీ ఇవే..) మరియు DVD-9 అంటే డబుల్ లేయర్ DVD లు ఉంటాయి. DVD రైటర్ లో పెట్టాక అందులో ఆ DVD లో 4485 MB డాటా అందులో పడుతుంది. ఇందులో కొంత డాటా స్పేస్ సిస్టం అవసరాలకి పోతుంది. అంటే నికరముగా మనకి అందుబాటులో ఉండేది 4450 MB మాత్రమే. ఇప్పుడు మీకు చెబుతున్నది ఏమిటంటే ఈ 4483 MB జాగాలో అంతకన్నా ఎక్కువ డాటా స్టోర్ చెయ్యాలి అనుకున్నప్పుడు 'Overburn CD'  అనే ఆప్షన్ ఎంచుకోకండి. అలా ఎంచుకున్నప్పుడు ఆ ఎక్కువగా ఉన్న డాటా అందులో స్టోర్ అవుతుంది.. కాని కొన్నిసార్లు (చాలాసార్లు) ఆ డాటా రీడ్ అవ్వదు. అప్పుడు కొంత (విలువైన) డాటా కోల్పోతాము. అందుకే ఎక్కువ డాటా స్టోర్ ఈ ఆప్షన్ ఉపయోగించి చెయ్యకండి.

అలాగే DVD చివరల వరకూ డాటా నింపకండి. కొంత ఖాళీ స్థలాన్ని వదిలెయ్యండి. DVD ని  పట్టుకునేటప్పుడో, స్థలం మార్చునపుడో.. వాటిమీద గీతలు, మడ్డి, మురికి పడే అవకాశాలు ఎక్కువ. అంటే ఆ DVD లో మీరు 4400 MB వరకూ డాటా నింపాలన్న మాట. ఇలా చేస్తే డాటా కోల్పోయే అవకాశాలు తగ్గుతాయి.

ఇక్కడ:
1 వద్ద త్రికోణ గుర్తుని నొక్కితే advanced మెనూ ఓపెన్ అవుతుంది.
2 వద్ద Options ని ఎన్నుకోండి.
3 వద్ద నున్న Expert features ని నొక్కండి.
4 వద్ద టిక్ మార్కుతో ఎనేబుల్ చేసి ఉంటే తీసెయ్యండి. 
ఇప్పుడు ఓకే చెయ్యండి.   

Thursday, May 20, 2010

Aadi bhikshuvu vaadinedi - Sirivennela

చిత్రం : సిరివెన్నెల (1987)
సంగీతం : కే. వి. మహదేవన్
రచన : చెంబోలు సీతారామశాస్త్రి
గానం : ఎస్. పి. బాలసుబ్రమణ్యం
*************************
పల్లవి :
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ - బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఆదిభిక్షువు వాడినేది కోరేదీ - బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఏది కోరేదీ - వాడినేది అడిగేది
ఏది కోరేదీ - వాడినేది అడిగేది

చరణం 1:
తీపిరాగాల కోకిలమ్మకు - నల్ల రంగులమిన వాడినేమి కోరేది
తీపిరాగాల కోకిలమ్మకు - నల్ల రంగులమిన వాడినేమి కోరేది
కరకు ఘర్జనల మేఘముల మేనికి
మెరుపు హంగు కూర్చిన వాడినేది అడిగేది
ఏది కోరేదీ - వాడినేది అడిగేది
ఏది కోరేదీ - వాడినేది అడిగేది

చరణం 2:
తేనెలొలికే పూల బాలలకు - మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
తేనెలొలికే పూల బాలలకు - మూన్నాళ్ళ ఆయువిచ్చిన వాడినేది కోరేది
బండరాళ్ళను చిరాయువుగ జీవించమని
ఆనతిచ్చిన వాడినేది అడిగేది
ఏది కోరేదీ - వాడినేది అడిగేది
ఏది కోరేదీ - వాడినేది అడిగేది

చరణం 3:
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప - దరిజేరు మన్మధుని మసిజేసినాడు
వాడినేది కోరేది
వరగర్వమున మూడులోకాల పీడింప - తలపోయు దనుజులను కరుణించినాడు
వాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బు శంకరుడు - వాడినేది కోరేదీ
ముక్కంటి ముక్కోపి - ముక్కంటి ముక్కోపి తిక్క శంకరుడు

ఆదిభిక్షువు వాడినేది కోరేదీ - బూడిదిచ్చేవాడిని ఏది అడిగేది
ఏది కోరేదీ - వాడినేది అడిగేది

Tuesday, May 18, 2010

Inka edo idai pothave - Darling

చిత్రం : డార్లింగ్ (2010)
రచన : అనంత శ్రీరాం
పాడినవారు : సూరజ్, ప్రశాంతిని
************************
పల్లవి :
ఇంకా ఏదో ఇంకా ఏదో - ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకూ - ఏదె చేరాలి  ఈరోజే చెలీ చెంతకు
తనలోని స్వరం వినరో ఈక్షణం - అనుకుండేది నీలోనీ నువ్వు దాచకు
నీ మనసే నీకిలా ఆ మగువై నిండుగా - కనిపించక మౌనాన్నే చూపించకు
పద పద రారా పరుగున రా రా  - గురువా గురువా
ఇక భయపడకుండా బయటకి తేరా - చొరవా చొరవా

ఇంకా  ఏదో ఇంకా ఏదో - ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు

చరణం 2:
మేఘాల వొళ్లోనే ఎదిగిందనీ - జాబిల్లి చల్లేనా జడి వాననీ
ముళ్ళపై మేమిలా విచ్చుకున్నామనీ - నీకు పూరేకులే గుచ్చుకోవే మరి
తీరమే మారిన తీరులో మారునా - మారదు ఆ ప్రాణం
పద పద రారా పరుగున రా రా - గురువా గురువా
ఇక భయపడకుండా బయటకి తేరా - చొరవా చొరవా

ఇంకా ఏదో ఇంకా ఏదో - ఇదైపోతావే ఇష్టాలే తెలిపేందుకు

చరణం 3 :
వేల్లెల్లు చెప్పేసే ఏమవ్వదు - లోలోన దాగుంటే ప్రేమవ్వదు
అమృతం పంచడం నేరమే అవదురా - హాయినే పొందడం భారమే అనదురా
హారతే చూపుతూ స్వాగతం చెప్పదా - ఇప్పుడే ఆ అందం
పద పద రారా పరుగున రా రా - గురువా గురువా
ఇక భయపడకుండా బయటకి తేరా - చొరవా చొరవా

ఇంకా ఏదో ఇంకా ఏదో - ఇదై పోతావే ఇష్టాలే తెలిపేందుకు
సంకెళ్ళతో బంధించకు - ఏదే చేరాలి ఈరోజే చెలీ చెంతకు
తనలోని స్వరం వినరో ఈక్షణం - అనుకుండేది నీలోనే నువు దాచకు
నీ మనసే నీకిలా - ఆ మగువై నిండుగా - కనిపించాక మౌనాన్నే చూపించకు

Friday, May 14, 2010

బైక్ మీద భద్రాచలం - అన్నవరం టూర్ (3)

..అలా అన్ని చూసుకొని, ఉదయం 9:30 కి బయలుదేరాము. నా మిత్రునితో ఒక చిన్ని ఒప్పందం! అడవిలో అంతా నేనే బండి నడుపుతాను అని. ఇందులో నా స్వార్థం ఏమిటంటే - అడవిని ఇలా ఎదురుగా ఉండి చూడొచ్చని. అలాని చెప్పాక అడవి వచ్చేవరకూ తనే నడిపాడు. కొద్దిదూరం వచ్చాక దారి తప్పాము. మధ్యలో ఒక ఊరు వస్తుంది. అక్కడి నుండి ఎడమకి వెల్లాలిసింది తిన్నగా వెళ్ళిపోయాము. అలా చాలా దూరం వెళ్ళాక పెద్ద వంతెన. మేము అంతకు ముందు వచ్చినప్పుడు ఇలాంటి దారి వంతెన మాకు ఎదురవ్వలేదు. ఇదెప్పుడు కట్టారో అనుకొన్నాము. పోయిన సారి వచ్చినప్పుడు వంతెన లేదు అప్పుడే ఎలా కట్టారు? మన దేశములో ఇంత తొందరగా వంతెన కడుతారా? ఇప్పుడు ఎలా? అనుకొని ఒకడిని అడిగితే ఇది "కిన్నెరసాని వంతెన" అని చెప్పాడు. రాజమండ్రికి ఎలా వెళ్ళాలి అని అడిగాము. " మీరు అక్కడే దారి తప్పారు.. కానీయండి.. ఇలా తిన్నగా వెళ్ళినా దారి వస్తుంది.. వెళ్ళండి" అని చెప్పాడు. ఇంకోతన్ని అడిగాము - సెకండ్ ఒపీనియన్ కోసమని. అతడూ అలాగే చెప్పేసరికి అలాగే ముందుకు సాగిపోయామువారు చెప్పినట్లుగానే మొదటి దారిలోకి కలిసాము. నాకది ఇప్పటికీ చిత్రముగానే ఉంటుంది. అక్కడ నుండి ముందుకు సాగాక ఒక దగ్గర చిన్న మూడు రోడ్ల జంక్షన్ వస్తుంది. ఒకటేమో భద్రాచలం వైపుకి, ఇంకోటేమో రాజమండ్రికి, ఇంకోటి వైజాగ్ కి వెళతాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండక పోతే అంతే సంగతి! ఎటో వెళ్లిపోతాము. అక్కడ ఒక బోర్డు తప్పించి మరే ఆధారమూ ఉండదు.

మధ్యలో ఎన్నో చిన్న చిన్న తండాలు, గూడెం లు అనబడే నివాస స్థలాలు చాలా కనపడతాయి. చాలావరకు అవన్నీ తాటాకుల గుడిసేలే! ఎక్కడో కొండక చోట పెంకుటిల్లులు ఉంటాయి. ఈమధ్య స్లాబులతో ఇల్లులు కట్టుకుంటున్నారు. ఇక్కడ ఆశ్చర్యకర సంఘటన ఏమిటంటే! నీరు కావాలంటే దొరకదు. అది పరిశుభ్రముగా ఉండదు. లోటాలు, గ్లాసులు చూసి మనకి త్రాగేయ బుద్ధి కాదు. గోదారి ప్రక్కనే కాబట్టి అలానే పట్టుకొని త్రాగుతారన్నమాట. అక్కడక్కడా బోర్లు ఉన్నాయి. ఎందుకోనీరు త్రాగాలనిపించలేదు. త్రాగితే ఆరోగ్యం ఏమైనా అవచ్చని మానుకున్నాము. ఇంత ఇబ్బంది ఉన్ననూ చిన్న చిన్న తండాలల్లో నీరు దొరకడం కష్టమేమో గాని, కూల్ డ్రింకులు మాత్రం బాగా దొరుకుతాయి. ఏమి చేస్తాము.. వారి నీటికి వంక పెట్టి, ఎప్పుడో చేసిన పురుగుల మందు అవక్షేపాల కూల్డ్రింకులు త్రాగాము.

ఇక్కడి వరకూ బాగా ఎండలో వచ్చాము. చెమటలు పట్టాయి. అక్కడ నుండి బయలు దేరగానే కాసేపటికే బాగా వర్షం మొదలయ్యింది. పెద్ద పెద్ద వర్షపు చినుకులతో, మొఖాన్ని కొడుతూ ఉంటే ఒక చెట్టు క్రింద ఆగాము. ఒక వైపు ఎండ, మరో వైపు వర్షం.. ఆహా! ఎంత బాగుంది అనుకున్నాము. మేము పోయి పోయి దగ్గరలో యే చెట్లూ లేని ప్రదేశములో ఉండటముతో వర్షానికి బాగా నానినాము. దగ్గరలోని చెట్లవద్దకి పోదామన్నా ఇంత తెరపి ఇవ్వకుండా ఒక్కసారిగా వర్షం పడింది. బండిని ఇలా చెట్టుక్రింద పెట్టి, మేము వర్షానికి నానాల్సి వచ్చింది. (అప్పటికే బండి ఇంజను చాలా వేడి మీద ఉండటముతో ఆ పని చెయ్యాల్సివచ్చింది. ) అలా పడటం కూడా మాకు మంచిదే అయ్యింది. ఎండదెబ్బ నుండి తప్పించుకోవటానికి బాగా ఉపయోగపడింది. అలా ముందుకు సాగాము. వర్షానికేమో చెట్ల సందుల్లోంచి ఒక అందమైన దృశ్యం దోబూచులాడింది. అది బాగాకనపడే వరకు ప్రయాణించి, అక్కడ ఒక ఫోటో తీసుకున్నానుఎండ వేడికి, ఆ తరవాత పడ్డ వర్షానికి - భూమిలోంచి వచ్చిన ఆవిరి అనుకుంటాను.. అలా మేఘములా మారి ఆకాశములో పాములా, కొండలకి ఒక పయ్యేదలాగా ఉన్నట్లు అనిపించింది. అలాంటి మనోహర దృశ్యం నేను అంతకు మునుపెన్నడూ చూడలేదు. డిజిటల్ కమెరా ఎందుకు తెచ్చుకోలేనందులకి నామీద నాకే చాలా కోపం వచ్చింది. నా పార్టనర్ కి ఇలా ఫొటోస్ తీయటం నచ్చలేదు. చాలా వరకు బండి రన్నింగ్ లో ఉన్నప్పుడు తీశాను గాని అవన్నీ షేకులతో బాగా రాలేదు. కాసేపట్లో అడవి మొదలయ్యింది. అలాగే వర్షపు కారు మబ్బులు కూడా.. విషయాన్ని పై ఫోటోలలో కూడా గమనించవచ్చును


నేను చూసినా వాటిల్లో ఇదే భయంకరమైన అడవి. ఇంత కన్నా పెద్ద అడవిని నేను చూస్తే ఇది నాకు చిన్నదిగా అనిపించేడిది. ఆకాశాన్ని తాకుతున్నాయా అనిపించినట్లుండే చెట్లు, కావలించుకొని ఉంటే చేతులు అందనంత లావాటి కాండాలు గల రక్షిత అడవి అది. మామూలుగానే అడవి అంటే భయంకరముగానే ఉంటుంది. రోజు అంతకు ముందు నుంచే వర్షాలు పడ్డట్టు ఉన్నాయి - చెట్లన్నీ మళ్ళీ పచ్చని రూపు సంతరించుకున్నాయి. పైగా అడవిలో అక్కడక్కడ క్రొత్త నీరు ప్రవహిస్తున్నది. ఇంకా మమ్మల్ని భయపెట్టుటకా అన్నట్లు ఆకాశం పట్టపగలే నల్లని కారుమబ్బులుతో నిండి ఉండి, అప్పటిదాకా కూలింగ్ గ్లాసులు పెట్టుకున్న నేను, తీసెయ్యాల్సి వచ్చింది. పైగా స్పష్టముగా కనిపించే ఏమైనా అద్దాలు ఉంటే అవి పెట్టుకోవాలి అనిపించేలా వాతావరణం. అంటే పట్టపగలే (ఒంటిగంట కే) అక్కడక్కడ - చెట్లు దట్టముగా ఉన్న చోట్ల చీకటి. రోడ్డు అంతా సింగల్ రోడ్డే! ఇంత అడవి మధ్యలో నుండి రోడ్డుని ఎంత ప్రయాసలకు లోని వేసారో అని అనుకున్నాను. అంతా సన్నని మార్గాలే.. ఒక బస్ వస్తే రోడ్డు దిగాల్సిందే! అక్కడక్కడా మలుపులు ఎంత భయంకరముగా ఉన్నాయి అంటే 20 కిలోమీటర్ల స్పీడుతో ఉంటేనే గాని బండిని మలపలేము. వర్షాలకి రోడ్డు ప్రక్క చెట్లు మొలచి రోడ్డు మీదకి వచ్చాయి. తారు రోడ్డు పోసిన మేరకు భూమి. మిగతాది అంతా గుబురు చెట్లే! కొన్ని మలపుల్లో ఏముందో కూడా కనపడదు. ఏదైనా ఎదురయినా సడన్గా వెనక్కి తిరగలేని పరిస్థితి. కంటికి మానవుడేవడూ కనపడడు. మొబైల్ సిగ్నల్స్ ఉండవు. ఎక్కడైనా ఒక మనిషి కనపడితే వాడి చేతిలో ఒక కర్ర గాని, కత్తి గాని ఉంటున్నది. (అడవి జంతువుల నుండి రక్షణ కోసం) కొంపదీసి మనల్ని ఎసేయ్యడు గదా! అని మదిలో అనుమానం. ఇంత దూరం వచ్చి.. వాడి చేతిలో ఏమైనా జరిగితే మా ఆచూకి కూడా దొరకదు ఇక. అక్కడక్కడా చెట్లు బాగా గుబురుగా ఉండి సంధ్యా సమయములో ఉన్నామా అనిపిస్తుంది. ఒకవైపు బండి నడపటం,, మరోవైపు ప్రకృతి అస్వాదన.. జుగల్బందీ చేస్తున్నాను. అలా చేయటం ఏమిటో గాని నాలుగు సార్లు అయినా బండి లోయలోకి పడిపోయేదే. మిత్రుడి హెచ్చరికతో ఆస్వాదన నుండి బయటకి వచ్చి.. ఇంకా లోకములో నాకు మిగిలున్న నూకలను పొందాను. నిజమే! అనంత గిరి కొండల్లో చేసిన మార్గాలు నిజముగా డ్రైవింగ్ కి పరీక్షే! ఇటు ఆస్వాదన, అటు మంచి డ్రైవింగ్ పాటవం చూపడం కష్టమే! ఎన్నో అడవి ప్రకృతి రమణీయ దృశ్యాలు చాలా చూశాను. నేనే డ్రైవింగ్ లో ఉండటం మూలాన ఫోటోలు తీయలేక పోయాను. అక్కడక్కడా మంచి రోడ్లు, మరోచోట అడుగు లోతు గుంటలు.. చాలా చోట్ల భారీ వర్షాలకి మట్టి కొట్టుక పోయి చెట్ల వ్రేళ్ళు బయటకి వచ్చి, బ్యాలన్స్ కాక కూలిపోయాయి. మాముందు వెళ్ళిన వాహనాలు ఎవరో గాని వాటిని ప్రక్కకి తోసుకుంటూ వెళ్ళారు. అలా మేమూ ఇబ్బంది లేకుండా బయట పడ్డాము. కొన్ని చోట్లలో అయితే కూలనా, కూలనా అని మనల్ని ఆడుగుతున్నట్లు అనిపించేట్లు ఉన్నాయా భ్రమపడతాము. సింగిల్ రోడ్డులో గుంతలూ, పడిపోయిన చెట్లనీ తొలగించుకుంటూ.. ఒక ప్రక్క కొండ, మరో ప్రక్క లోయ ఉన్న దారిలో ఆస్వాదనా, ఇటు జాగ్రత్తగా రావటం ఎంత కష్టమో ఆలోచించండి. ముందే చిన్న దారి అంటే ఇంకా అందులో భారీ ట్రక్కులు కూడా ఇదే మార్గాన కనిపిస్తాయి. అవి దారి మలపుల్లో ఎలా తిరుగుతాయో చూడాలన్పించింది గాని.. అప్పటికే సమయం లేదు గనుక ముందుకు సాగాల్సివచ్చింది. ఇది చూడండి.


ఇలాంటి  దారిల్లోంచి అందరమూ వెళ్ళక తప్పలేదు. ఇది అంత తేలికగా ఉందనిపించలేదు. ఒక కర్ర తీసుకొని గుంట లోతు చూసాను. ఏమంత ఎక్కువ లేదు అనుకొని దాటాము. ఇలాంటిదే ఇంకో దగ్గర కనపడితే అలాగే ఉంటుందని అనుకున్నాము. అది ఇంకా లోతు గుంటలతో ఉన్నాయి. అప్పటికే అక్కడ రెండు భారీ ట్రక్కులు దాటేందుకై సిద్ధముగా ఉన్నాయి. అవి దాటబోయి మధ్యలో ఇరుకుతాయేమో నని అనుమానముతో మేము వెళ్ళాక వారిని వెళ్ళమని రిక్వెస్ట్ చేశాను. అవి మధ్యలోకి వచ్చి ఆగిపోతే ఇక వేరే దారే ఉండదిక అనే ఆలోచనతో అలా చెప్పాను. ఎందుకంటే మరోవైపు కొండ, ఇంకోవైపు సుమారు ఇరవై అడుగులలోతు లోయ. నేనే బండిని నడిపాను. కాని గుంట మధ్యలో లోతు ఎక్కువ ఉండి.. బండి పికప్ / రైజింగ్ సరిపోక మధ్యలో మా బండే ఆగింది. కాలు భూమ్మీద ఆనించలేనంతగా లోతు. పడబోయాము.. కాని ఇద్దరం ఒకేసారి బురద నీళ్ళలో కాలు పెట్టి ఆపాము. ఫలితముగా మా ప్యాంట్ లకి ఇంకో రంగు.. నాది నీలి రంగు జీన్స్ అయితే సగం మొకాలివరకూ ఎర్రని బురద రంగు. అడవిలో ఎవడూ చూడటానికి లేదు గనుక అలాగే ముందుకు సాగిపోయాను. కొంత దూరం పోయాక మంచి వర్షము నీరు కనపడితే అక్కడ శుభ్రముగా కడుక్కున్నాము


ఆదారి లో ఒక్కో చోట ఒక్కో అనుభవం. ఒక దగ్గర ఆనందం వేస్తే, ఇంకో చోట భయం, మరోచోట సంభ్రమం.. కొన్నింటి చోట్ల V ఆకారము లో రోడ్లు. ఇంకొన్ని చోట్ల ఒక వైపు లోతైన లోయ, ఇంకోవైపు నాలుగైదు అంతస్థుల ఎత్తుండే కొండ. ఇంకొన్ని చోట్ల మొదటి గేరులోనే ఎక్కాల్సిన ఎత్తు - అప్పుడు ఫుల్లు త్రోటిల్ ఇవ్వక తప్పదు. చెప్పాగా జుగల్బందీ చేసుకుంటూ ఇందులోంచి వెళ్ళటం కష్టం అని. మధ్యలో ఒక కొండ ఎక్కి దిగాలి ఇలాగే. అక్కడే ఉంటుంది సుమారు ఒక పది అంతస్థుల సైజులోని కొండ. మీద పడుతుందా అన్నట్లుగా నిట్టనిలువుగా ఉంటుంది అది. మొత్తానికిది చాలా డేంజరస్ రోడ్డు. సింగల్ రోడ్, అడవి, ఎత్తైన కొండలు, V షేపులో రోడ్లూ, మధ్యలో ఎపుడో గాని ఎదురవని వాహనాలు, మన బండికి ఏమైనా అయ్యిందా ఎవడూ రక్షించలేడు. టెంటు వేసుకొని కూడా ఉండలేము. పంక్చర్ అయితే ఇక మన బాధ వర్ణనాతీతం. మళ్ళీ జన్మలో టూర్ కి ఇలా అడవి వైపుకి రాకూడదు అనిపిస్తుంది.

ఇలాంటి దారిలో రోడ్డును దాటుతున్నప్పుడు ఒక మలుపులో రూపాయలు 20 + 5 + 2 నాణెం దొరికాయి నా మిత్రునికి. వాటిని ఉంచుకోవద్దు అనే సెంటిమెంటుతో, ఎక్కడైనా గుడి కనపడితే అందులో వేసేద్దాం అన్నాడు. అడవిలో గుళ్ళు ఎక్కడ ఉంటాయి? అందుకే టీ త్రాగేద్దాం అన్నాడు. సరేనని నేనూ అన్నాను. ఆలా టీ దుకాణం వెదుకుతూ ప్రయాణం సాగించాము.

అక్కడనుండి ముందుకి సాగిన మా ప్రయాణం చివరకి సాయంత్రం ఐదు గంటల ప్రాంతములో ఒక వంతెన వద్దకి వచ్చాము. అక్కడ కాసేపు రెస్టు. అక్కడ కొన్ని చిన్న చిన్న 3, 4 గుడిసెలు ఉన్నాయి. లారీలు, వ్యానూ ఆగి ఉంటే టీ త్రాగుదామని వెళ్ళాము. అక్కడి వారి చూపులు అదోలా ఉన్నాయి. పట్టించుకోక రెండు టీలు చెప్పాము. మాకు టీ కాసే అబ్బాయి ని పక్కకి నెట్టి ఒక ఆమె టీ చేస్తూ అదే పనిగా మమ్మల్నే చూస్తున్నది. ఆమె చూపులూ, దేహ భాష, కట్టూ బొట్టూ, తలలో పూలు, కాటుక కళ్ళూ అన్నీ "అవే"! (అర్థం చేసుకోండి) ఆమె టీ చేసేలోగా మాడా టైపులో ఉన్న ఒక అబ్బాయి మా వెంట పడ్డాడు.. "ఏమైనా ఇవ్వు.. ఏదైనా పని చెప్పు పనైనా చేస్తా.." అని అంటే పోనీలే అని .. దొరికిన దాంట్లోంచి వాడికో ఐదు రూపాయలు ఇచ్చాము. వాడు ప్లేట్ ఫిరాయించి "మీరు చాలా అందముగా ఉన్నారు.. మీకు ఏమి కావాలో చెప్పండి. ఏదైనా సరే పట్టుకొస్తా.. ...లాంటిదైనా సరే.." వత్తి మరీ చెప్పాడు. టీ చిన్నది మా కేసే ఆశగా చూస్తున్నది. ఐదు నిముషాల్లో అందించే టీ ని అరగంట చేసింది. వేల్లిపోదామంటే "అయిపోయింది అయిపోయింది.." అంటూ ఆపారు. (ఏమిటో అయిపోయింది?) టీ అందించే దశలో కావాలనే పైటను తప్పించి, మాకు గ్లాసు అందిస్తూ కావాలని మా చేతులని తాకుతూ టీ ఇచ్చింది. ఇలా ఉంటుందనుకుంటే అసలు అక్కడ బండి ఆపే వారిమే కాదు. నాతో వచ్చిన మిత్రుడు ప్రొద్దున నుండీ టీ త్రాగక నాలుక చేదేక్కింది అంటే ఆపాను. నాకేం తెలుసు. ముందుగా అతడు త్రాగాక బాగుందంటే నేనూ ఇంకో టీ త్రాగాను - సెక్యూరిటీ ప్రాబ్లం కదా. ఈసమయములో ఇద్దరూ మమ్మల్ని చూపులతో ఆట ఆడుకున్నారు. ఏదో ఇంత టీ త్రాగి బయట పడ్డాము. (మళ్ళీ వెళ్ళిన టూర్ లో వారు కనిపించలేదు.. వారి కోసం ఆశ పడకండి. నేను అందుకోసమే మళ్ళీ వెళ్లాను అనుకోకండి - రామ రామ..)

ఇక్కడ ప్రకృతి బాగా అనిపించి వీడియో తీశాను. (అది చూసి వారి టీ కోసం వెదుక్కుంటూ వెళ్ళేరు.. చెప్పాగా లేరని. ఉన్న ప్రపంచములో మందులేని జబ్బు అంటడం ఖాయం. అంటే - పులిరాజా అవటం ఖాయం)చూశారా! ఇలా ఉంది అక్కడి ప్రకృతి రమణీయత! ఇంకా దీనికన్నా మంచి సీనులు దారిలో మిస్ అయ్యాను - నా డ్రైవింగ్ ఉండటముతో. అక్కడ నుండి రాజమండ్రికి బయలు దేరాము. అప్పటికే చిమ్మని చీకటి.. బండి వెలుతురుకి పురుగులు రావటం మొదలయ్యింది. కాసేపయ్యాక ఆ బాధ పోయింది. ఫారెస్ట్ నుండి బయటకి వచ్చేసరికి రాత్రి పావు తక్కువ పది అయ్యింది. అక్కడ పోలీస్ చెకింగ్. ప్రశ్నలూ, సమాధానాలు అయ్యాక, అన్ని రుజువులూ చూపాక అక్కడ నుండి బయలుదేరి అంతా మగవారు ఉన్న ఒక హోటల్ వద్ద ఆపాము. అక్కడ టీ త్రాగుతూ తరవాతి ప్రోగ్రాం సంగతి ఆలోచించాము.

అన్నవరనానికి ఆ రాత్రే చేరాలని డిసైడ్ అయ్యాము. మళ్ళీ ప్రయాణం మొదలు. ఈసారి మెల్లగా కాకుండా బాగానే స్పీడుగా మొదలెట్టాము. అన్నవరానికి చేరేసరికి రాత్రి పావు తక్కువ పన్నెండు. దేవాలయ సత్రం తీసుకున్నాము. బయటకొచ్చి తినడానికి ఏమైనా ఉన్నాయి అని చూస్తే కేవలం చపాతీలే దొరికాయి. అవే తినేసి సత్రం గదికి వచ్చి హాయిగా పడుకున్నాము. మరుసటి రోజు ఉదయాన్నే లేచి దైవ దర్శనం చేసుకున్నాము. పెద్దగా ఉండే ఇక్కడి సత్యదేవుడు క్రింది, పై అంతస్థుల నుండి దర్శనం చేసుకోవాలి.. చేసుకున్నాము. అక్కడి ప్రసాదం చాలా బాగుంటుంది. అది తిన్నాక మా ప్రయాణం బడలిక చాలా వరకు పోయింది. తొందరగానే దర్శనం అయిపోయింది.. ప్రసాదం తనివితీరా తిన్నాము. దేశములో అక్కడ తప్ప మరెక్కడా ఆ ప్రసాదం దొరకదు. కాసేపు గుడి అంతా తిరిగి చూసాను. ఫొటోస్ తీద్దామంటే ఫోన్ మెమొరీ కార్డ్ అప్పటికే ఫుల్ అయ్యింది.

ఒక గుడి సెక్యూరిటీ గార్డు అతని పేరు ఏదో ఉండి సరిగా కనపడలేదు.. గుడిలోని పుస్తక విక్రయ కేంద్రం ఎదురుగా మేము కూర్చున్నప్పుడు అతను వచ్చి షాప్ వాడికి ఒకటి అని సైగ చేశాడు. ఆ షాప్ వాడు అటూ ఇటు చూసి అదేదో మామూలు వస్తువు ఇచ్చినట్లు చాటుగా ఇచ్చాడు. కొద్దిగా కనపడింది.. అది సిగరెట్. అది జేబులో  అలాగే పెట్టుకొని అలా గుడిలోనికి పోయాడు.. నేను అతన్ని ఫాలో అయ్యాను. చాలా దూరం వెంటాడాను - గుడి చూస్తున్నట్లుగా వెళుతూ. చివరికి ఒక ఆఫీస్ రూం లోకి పోతూ వెనక్కి చూశాడు.. నేను తల తిప్పాను. మళ్ళీ వెదికితే దొరకలేదు. గుడిలో ఇలా సిగరెట్లు దొరుకుతాయని అదే మొదలు మరియు ఆఖరిగా చూడటం. నేను ఎన్ని గుళ్ళు తిరిగినా ఇంతటి మహత్తర సీను చూడలేదు. నా చేతిలో కెమరా ఉన్నా, నా ఫ్రెండ్ దగ్గరలో ఉన్నా ఆ రోజు వాడిని పట్టిచ్చేవాడినే! ఇలా స్వామి వారి వద్ద ఉంటూ ఆ స్వామి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నారు కొందరు దుర్మార్గులు.

భోజనం చేసుకొని పదకొండు గంటలకి మళ్ళీ ప్రయాణం - ఈసారి సింహాచలం కి. తొందరగా చేరుకున్నాము. దర్శనం క్యూ బాగుంది. స్పెషల్ టికెట్స్ తీసుకొని దర్శనం చేసుకున్నాము. కప్ప స్థంభం కి కట్టుకొని మ్రోక్కుకున్నాను. సింహాచల ఆలయ శిల్ప సంపద చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో బాగా శిల్పకళ ఉన్నవాటిల్లో అదొకటి. గ్రానైట్ మీద బాగా చెక్కారు. అక్కడ నరసింహ మూర్తికి ఒక పచ్చల పేరు ఉండేడిది. అది చాలా విలువైనది, విలువ కట్టే షరాబు ఎవరూ లేరు, అలాంటి దాన్ని ఎవరో తస్కరించారు. తరవాత అది దొరికిందని విన్నాను.. కాని అది ఎంత వరకు నిజమో తెలీదు. నరసింహస్వామి మూర్తి చుట్టూ అన్నీ సాలిగ్రామ శిలలే! చాలా బాగా శక్తివంతమైనవి అవి.

ఆలయ దర్శనం తరవాత వైజాగ్ కి వెలదామనుకున్నాము. కాని మళ్ళీ బండి నడుపుకుంటూ మళ్ళీ చాలా దూరం రావాలి. అబ్బో! అనుకొని.. తిరుగు ప్రయాణం మొదలెట్టాము. రాత్రి అవటముతో ఒకదగ్గర పడుకున్నాము.. ఎక్కడో సరిగా గుర్తుకు రావటం లేదు. అక్కడినుండి వెకువఝామున్నె బయలుదేరి విజయవాడకి వచ్చేశాము. అక్కడ దుర్గామాతని దర్శించుకున్నాము. అదయ్యాక నేరుగా నా స్వస్థాలాలకి వచ్చేశాము. అనుకోకుండా బయలుదేరటముతో టూర్ బాగా సాగింది. చాలా ఆనందం కలిగించింది. అలా అనుకోకుండా వెళితేనే నిజముగా ఆనందం వస్తుంది అని నా టూర్ల విషయ సంగ్రహం.

ఎక్కడా బండి ఇబ్బంది పెట్టలేదు. లీటరు పెట్రోల్ కి 68 కిలోమీటర్ల మైలేజి ఇచ్చింది. మేము మొత్తం తిరిగిన దూరం = పదిహేను వందల కిలోమీటర్లు. మొత్తం ఖర్చు / ఇద్దరం వేసుకుంటే ఒక్కొక్కరికి ఎనిమిది వందల అరవై అయిదు రూపాయలు (అన్ని ఖర్చులూ ఉన్నాయి ఆఖరికి వక్కపోడితో కలుపుకొని). ఈ సంవత్సరం తిరుపతి వైపు వెళదామని అనుకున్నాము. కాని అతను గత డిసెంబర్ లో రోడ్డు ప్రమాదములో మరణించాడు. తోడూ లేక టూర్లు ఆగిపోయాయి. భద్రాచలం వద్ద తీసిన ఫోటోలలో ఒక షాప్ వద్ద అతని ఫోటో కూడా ఉంది.

ఇదీ నా మోటార్ సైకిల్ మీద లాంగ్ డ్రైవ్. మీరు ఒక్కసారి అలా చాలా దూరం వెళ్లి రండి. అందులోని ఆనందం మీకే తెలుస్తుంది. మళ్ళీ లాంగ్ డ్రైవ్ ఎప్పుడు వెళదామా అన్నట్లు ఉంటారు. ఖర్చు తక్కువ ఉండి, అన్ని పరిస్థుతులని తట్టుకునేవారే వెళ్ళడం మంచిది. ముందుకే వెళదాం అన్నవారితోనే వెళ్ళండి.. పక్కా రూటుని నిర్ణయించుకొని వెళ్ళండి. అన్ని సాధక భాధకాలని ఊహించి వెళ్ళండి. ఒకసారి వెళ్ళిరండి అలా. ఎన్నో ఏళ్ళు మీకు ఆ సంఘటనలు గుర్తుండిపోతాయి. నా అభిప్రాయం చెప్పాలంటే - సిటీ మాల్స్ లో, పబ్ లలో, బార్ లలో ఒకసారి ఖర్చు మీది కాదనుకుంటే ఎన్నో అనుభూతులు మీ స్వంతం..  100 % గ్యారంటీ!

ఇంత చెప్పి సుత్తి కొట్టానా..  ఏమి చేస్తాము.. ఎన్నో రోజుల నుండి వ్రాయాలనుకున్నాను. ఇవాల్టికి తీరింది.

"ఎద లోతులో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయీ.. గుర్తుకొస్తున్నాయి.."

( అయిపోయింది. )
Related Posts with Thumbnails