Showing posts with label My Creativity. Show all posts
Showing posts with label My Creativity. Show all posts

Thursday, March 22, 2018

బడిపిల్లలకు ఒక చిన్న సహాయం

మా వీధిలో మురుగు కాలువల పని మొదలెట్టారు. పాత కాలువలన్నింటినీ త్రవ్వేసి, క్రొత్తగా సీసీ మురుగు కాలువలు కట్టేస్తున్నారు. ఆ సీసీ మురుగు కాలువల వల్ల - అవి చాలా ధృడముగా ఉండటమే కాకుండా విశాలమైన వెడల్పుతో, లోతుగా ఉండే వాటివల్ల చాలా మేలు కలుగుతున్నది. ఆ నిర్మాణ ఆలోచన అద్భుతం. పనీ వేగముగా జరిగిపోయింది.. కానీ ముందస్తు ఆలోచన లేని ఆ పని వల్ల అందరూ ఇబ్బంది పడటం మొదలెట్టారు. ఆ మురుగుకాలువకి పైకప్పు కి బడ్జెట్ ఇంకా సాంక్షన్ కాని కారణముగా క్రొత్తగా ఇబ్బందులు మొదలయ్యాయి. అదీ ముఖ్యముగా చిన్నపిల్లల స్కూల్ పిల్లలకు. ఆ మురుగుకాలువకు అవతల ఉన్న ఆ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళాలీ అంటే దాన్ని దాటాల్సిందే. ఇక్కడ ఆ కాలువని దాటాల్సింది ఆ పిల్లలే.


ఈ మురుగు కాలువ పై స్లాబు పనిని పూర్తి చేసేలా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. పైకప్పుకి బడ్జెట్ ఇంకా అనుమతులు రాని కారణాన అలాగే ఇప్పటికీ ఉన్నది కూడా. ఇక లాభం లేదని తలుపు చెక్కని దారిలా వేశారు ఆ స్కూలు ఉపాధ్యాయులు. ...కొద్దిరోజులలో దాని స్వంతదారులు ఆ తలుపు చెక్కని పట్టుకెళ్ళారు. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. అ ఆ ల నుండి ఐదో తరగతి వరకూ అక్కడ చదువుకొనే పిల్లలకు ఆ కాలువని దాటి వెళ్ళడానికి ఇబ్బంది మొదలయ్యింది. ఉపాధ్యాయులు తమ వాహనాలని ఇవతలే పార్క్ చేసుకొని, లోపలికి వెళ్ళాల్సివస్తున్నది. 

ఇలా కాదనుకొని ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, టీచర్లు కలిసి, రెండు పెద్ద బండలను దానిపై పెట్టి, దారిలా చేశారు. సరిగ్గా ఆ సమయం లోనే నేను అక్కడికి వెళ్లాను. "మీకెందుకు ఈ శ్రమ.. మీరూ ప్రభుత్వ ఉద్యోగులే కదా.. కంప్లైంట్ చెయ్యలేక పోయారా ?" అని అడిగితే - "అలా చేశామే అనుకోండి.. మమ్మల్ని టార్గెట్ చేస్తే - అవో ఇబ్బందులు. ఇప్పటికే ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాం.. లాభం లేదు సర్.." అన్నారు. వారి ఇబ్బందీ అర్థం అయ్యింది. ఆ తవ్విన కాలువ వెడల్పుకి ఆ బండలు సరిపోవటం లేదు.. కొద్ది అంచుల ( ఒకటి రెండు ఈంచులు అంతే! ) మీద ఆ కాలువ పైన ఉన్నాయి. కొద్దిగా ప్రక్కకు జరిగితే ఆ బండలు ఆ కాలువలో పడిపోవటం ఖాయం. పిల్లలు దాని మీద కాలు పెట్టి దాటేటప్పుడు - అవి జరిగి పడిపోయినా చాలా పెద్ద ఇబ్బందే.. గతంలో ఒక అమ్మాయి అలా పడిపోయింది కూడా.. 

అప్పుడే నేను అన్నాను కదా.. "మీరు అంతగా శ్రమ పడుతున్నారు కదా.. నా వంతుగా కొద్ది చిరు సాయం చేస్తాను. మీరు బండలు వేసెయ్యండి. నేను దాని చుట్టూరా సిమెంట్ వేయిస్తాను. కదలకుండా ఉంటాయవి. కాకపోతే మీ పాఠశాల ఆయాతో ఆ సిమెంట్ నీటి తడులు కొట్టించండి.." అన్నాను. అందుకు వారు సరే అన్నారు. 

అప్పుడు నేను సిమెంట్ పని చేయిస్తున్నాను. మేస్త్రీ చాలా బీజీగా ఉన్నాడు. తనని సిమెంట్ అక్కడ కొట్టేసేయ్ అని చెప్పాలన్నా కుదరనంత బీజీ.. ఇక లాభం లేదనుకొని - నేనే కొంత సిమెంట్ మాల్ ( సిమెంట్ + ఇసుక మిశ్రమం ) ని ఒక తట్టలో కలుపుకొని ఆ పరచిన బండల చుట్టూ పోశాను. ఒకటి రెండు తట్టల సిమెంట్ మిశ్రమం సరిపోతుందేమో అనుకున్నా.. కానీ ఆరుతట్టల నిండా సిమెంట్ మిశ్రమం కావాల్సి వచ్చింది. ఒక మంచిపనికి నావంతు సహాయం అనుకొని ఆ పనిని పూర్తి చేశాను. 



ఇక ఆయా అయితే కనీసం ఒక్కసారి కూడా ఆ వేసిన సిమెంట్ కి నీటి తడిని ఇవ్వలేదు. ఆ బాధ్యతనూ నేనే తీసుకొన్నా.. తడి ఇవ్వకుంటే ఆ సిమెంట్ పొడిగా రాలిపోతుంది. అందుకే ప్రొద్దునా, సాయంత్రం అంటూ అలా రోజుకి రెండుసార్లు దానికి బకెట్లతో ఐదురోజులు నీరు కొట్టాను. ఫలితముగా సిమెంట్ గట్టిపడింది. ఇంకా బాగా మంచిగా ఉండేలా చేద్దామని అనుకున్నా - కానీ అది తాత్కాలికమైనది. త్వరలో పైన బెడ్ వేస్తే నేను చేసిన శ్రమ అంతా వృధానే.. అనుకోని ఆగిపోయా.. కానీ ఇప్పటివరకూ బెడ్ లేదు.. ఈ రాళ్ళ బండలు అలాగే ఉన్నాయి. పిల్లలూ, ఉపాధ్యాయులూ హాయిగా దాని పైనుండి అటూ, ఇటూ తిరుగుతున్నారు. 

ఏది ఏమైనా కొందరికి నావల్ల కాస్త మేలు జరిగినందులకు చాలా సంతోషముగా ఉంది. 




Tuesday, May 23, 2017

Railing Repair

అలా బాల్కానీ నుండి తొంగి చూస్తుండగా - రేయిలింగ్ Railing కి ఉన్న ఇనుప పట్టీ వదులై అసహ్యముగా కనపడసాగింది. అలాగే వదిలేస్తే మరింతగా పాడేయ్యేలా ఉంది. అప్పట్లో స్క్వేర్ ఐరన్ ట్యూబ్ Square Iron Tube కి డిజైన్ వచ్చేది కాదు. ఆ చదరపు ట్యూబ్ నీ, ఆ డిజైన్ పట్టీని విడివిడిగా వంచి, ఒక్కటిగా దగ్గరకు చేర్చి, వెల్డింగ్ చేశారు. ఈ పని బాగుంది. కానీ కాసింత శ్రద్ధ ( అంటే పట్టీకి ట్యూబ్ కీ మధ్యన ఉండే సన్నని గ్యాప్ ని లప్పం గానీ, సిమెంట్ ద్వారా గానీ పూత వేసి మూసేయ్యలేదు ) తీసుకోక అందులోకి వర్షం నీరు, ఉతికిన బట్టల నీళ్ళూ పడీ, అందులోకి వెళ్ళి... త్రుప్పు పట్టి అ రెండింటి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. ఇలా అవుతుందని ఆ వెల్డర్ గానీ, ఇటు పెయింటర్ గానీ చెప్పలేదు.. ఎవరి స్వార్థాలు వారివి. మనకా తెలీదు. సో, చివరకు బలయ్యేది మనమే.. 

వర్షపు నీరు ఆ సందులోకి చేరి, మరింత త్రుప్పు పట్టేలా చేస్తూ, అక్కడే ఆవిరయ్యేది. ఫలితముగా ఇనుప పట్టీ తడి ఆరిపోగానే సన్నని ఇనుప రజనులా రాలిపోయి, ఆ ట్యూబ్ కీ, పట్టీకీ మరింతగా దూరం చేసింది.. ఫలితముగా అక్కడక్కడా నా చిటికెన వ్రేలు పట్టేలా దూరం జరిగాయి. 

అలా ఉండటం వల్ల వ్రేళ్ళు ఇరుక్కోవడం, త్రుప్పు పట్టడం వల్ల అది సన్నగా అయ్యి, కోసుకపోయేలా మారింది. పెద్దవాళ్ళకే ఇబ్బందిగా ఉంటే ఇక పిల్లల సంగతి..? వామ్మో..! తలుచుకుంటే భయంకరముగా తోచింది. దాన్ని బాగుచేద్దామంటే - వెల్డర్ వచ్చి, చూసి, అది పూర్తిగా తొలగించి, షాపుకి తీసుకరండి. చేసిస్తాను అని అన్నాడు. తన చార్జెస్ ఒక వేయి తీసుకుంటాను అన్నాడు. అదీ నన్ను చూసి.. లేకుంటే ఇంకో ఐదు వందలు అదనంగా చెప్పేవాడట. 

ఇక్కడ వర్షం నీరు పడకుండా ఆపే పరిస్థితి లేదు.. బాల్కానీ కాబట్టి. ఉతికిన బట్టలు అక్కడే ఆరేస్తాం కాబట్టి దాన్నీ నివారించలేం... ఈ వెల్డర్ + పెయింటర్ ల తప్పు వల్ల ఇప్పుడు వెల్డర్ కి 1500 + రెయిలింగ్ గ్రిల్ తీయించినందులకు 350 + రానుపోను రిక్షా 200 + మళ్ళీ బిగించటానికి మేస్త్రీ ఖర్చు 650 + తన సహాయకుడికి 350 + పెయింటర్ కి 1000 + పెయింట్స్ కి 600...........( ఇక్కడి వరకే Rs. 4650 )  ఇదీ ఖర్చు. ఇవి కనిపించేటివి. ఇక కనిపించనివి - అక్కడే ఉండి నిర్వహణ చూసుకోవాలి - ఇది ఒకరోజు మన సమయం, కూలీలని, రిక్షానీ, సిమెంట్, పెయింట్స్ తేవటానికి అయ్యే ఖర్చులూ అదనం.. చూశారా !.. చిన్న పొరబాటుకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నది. అందుకే ఇంటి నిర్వహణ అంత వీజీ కాదు.. అన్నీ బాగుండేలా చూడాలంటే చాలా చిన్న చిన్న విషయాలు తెలుసుకోవాలి.. అవును.. చిన్న చిన్న విషయాలే.. బోర్ గా ఫీలయ్యి నేర్చుకోవటానికి ఇష్టపడం.. కానీ ఆ చిన్నపనులు మన ఆదాయంలో ఎక్కువ భాగాన్ని మింగేస్తాయి. అందుకే ఇలాంటి పనులు ఎలా చెయ్యాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి అయిపోయాక చేయి కాలింది అని తెలిశాక అప్పుడు జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు విచారించటం తప్ప మరేమీ చెయ్యలేం.. అందుకే ఇలాంటి విషయాల్ని మీకు తెలియాలని చెబుతున్నాను. ప్రపంచం లోని చాలామందికి ఇలాంటి విషయాలు చాలా అవసరం. ఇలాంటి విషయాలకు గూగుల్ లో వెదికితే ఏమి చెయ్యాలో తెలియడానికి ఇలాంటి పోస్ట్స్ కూడా పెట్టాల్సి వస్తున్నది. అందుకే చాలా వివరముగా వ్రాస్తున్నాను. నిజానికి ఇలాంటి పోస్ట్స్ కి బ్లాగ్ వీక్షకుల సంఖ్య బాగానే ఉంది. మామూలు పోస్ట్స్ కన్నా వీటికే వ్యూయర్ షిప్ Viewership  ఎక్కువగా ఉంది కూడా..  నా బ్లాగ్ స్టాటిస్టిక్స్ కూడా ఇది నిజమని ఋజువు చూపిస్తున్నది కూడా.. 

సరే.. ఇక అసలు విషయానికి వద్దాం.. 

ఆ గ్యాప్ లో ఏమి పెడితే బాగుంటుందో ఆలోచన చేశాను. వాల్ పుట్టీ పెడితే ?? అన్న ఆలోచన. బాగుంది కానీ అంత లావుగా అయితే పగుళ్ళు వచ్చి, ఊడిపోతుంది.. పోనీ M-seal లాంటిది పెడితే?? ఇది బాగుంటుంది కానీ అంత పెద్ద గ్యాపుల్లో దాన్ని నింపేసరికి ఖర్చు మరింతగా పెరిగిపోతుంది. మనకు తక్కువ ఖర్చులో - తక్కువ సమయంలో అంతా బాగా కావాలి. మరి ఎలా ? అని ఆలోచిస్తే - సిమెంట్ పెడితే..? వావ్.. మంచి ఆలోచన. అదే బెస్ట్ ఇది 10 - 20 రూపాయల్లో అయిపోతుంది. 

ముందుగా చదరపు ట్యూబ్ కీ, పట్టీకి మధ్యన జాగాలో ఉన్న తుప్పుని ఒక స్క్రూ డ్రైవర్ సహాయన వచ్చినంతవరకూ తొలగించాను. 

ఆ రెండింటినీ కలిపి ఉంచేలా చేసిన వెల్డింగ్ వద్ద ఉన్న త్రుప్పుని ఒక చిన్న సుత్తె సహాయన లోతుగా త్రుప్పుని రాలగొట్టాను. 

ఆ తరవాత మామూలు బైండింగ్ వైర్ ( ఇంటి స్లాబుల్లో స్టీలు వూచలని బంధించడానికి వాడేది ) కాకుండా GI వైర్ మీడియం మందముగా ఉన్నది తీసుకున్నాను. ఇందులో తేడా ఏమిటంటే - బైండింగ్ వైర్ కొద్ది కాలానికే త్రుప్పు పట్టి విరిగిపోతుంది. అదే GI వైర్ త్రుప్పు పట్టక అలాగే ఉంటూ గట్టిగా ఆ రెండింటినీ పట్టి ఉంచుతుంది. అందువల్ల ఇలాంటి చిన్న విషయాలు కీలకం. ఈ తీగ ఎల్లప్పుడూ అక్కడ వాతావరణానికి ఎక్స్ పోజ్ అవుతుంది. కాబట్టి ఇదే వాడమని సలహా. 

( ఇది చేసి, విజయం సాధిస్తానని నాకు తెలీదు. నా స్వంత ఆలోచన.. నిజానికి ఈ పనిలో సక్సెస్ అవుతాననీ తెలీదు. కనుక రెయిలింగ్ మొదట ఎలా పాడయ్యిందో చూపే ఫోటోలు తీయలేదు. అందులకు మన్నించండి. )

GI వైరుతో రెండు చుట్లు చుట్టి, కొనలని ముడివేసి, మెలి త్రిప్పాను. దీనివల్ల అది వాటిని దగ్గరగా లాగుతుంది. అలాగే గట్టిగా బంధించి ఉంచుతుంది. ఈ క్రింది ఫోటో చూడండి. 


ఆ తరవాత సన్నని ఇసుక, సిమెంట్, కాస్త నీరూ కలిపి చపాతి పిండిలా గట్టిగా కలుపుకోవాలి. 

ఆ రెండింటి గ్యాప్ లో ఆ సిమెంట్ వేసే ఒక నిమిషం ముందు - సిమెంట్ వేసే ప్రాంతాన్ని నీటితో తడుపుకోవాలి. ఇలా ఎందుకూ అంటే - ఆ సిమెంట్ మిశ్రమం ఆ ఇనుప రెయిలింగ్ గోడలకి గట్టిగా పట్టుకుంటుంది. చాలామంది మేస్త్రీలు ఈ చిన్న విషయాన్ని మరుస్తారు. ఫలితముగా పగుళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే కాస్త తడి ఉన్నప్పుడే సిమెంట్ వేసుకోవాలి. 

క్రింది వైపున అట్టముక్క లేదా ఎడమచేతిని వాడి, ఆ గ్యాప్ లో సిమెంట్ మిశ్రమాన్ని వేసి సన్నని తాపీతో అదమాలి. అలా పైవరకూ చేసి, కాసేపు ఆగాక ఒక చెక్క ముక్కతో లెవల్ చేసుకోవాలి. 

స్మూత్ / నునుపు ఫినిషింగ్ కావాలంటే ఒక లప్పం రేకుతో రాస్తే సరి.. నేను మాత్రం ఇక్కడ నీటిలో తడిపిన స్పాంజ్ ముక్కతో నునుపు చేశాను. ఫలితముగా గరకుగా వస్తుంది. ( అది ఆరాక వాల్ పుట్టీ ని లప్పం రేకు సహాయాన పూసి, స్మూత్ / నునుపు చేసి, ఎమరీ పేపర్ తో రుద్ది, మరీ నునుపు చెయ్యాలని నా ఆలోచన. ఆ తరవాత పెయింట్ వేస్తే ఇలా అయ్యిందని మనం చెబితే గానీ ఎవరూ తెలుసుకోలేరు..) 

అలా చేశాక నీటి తడులు చాలానే ఇచ్చాను. ఫలితముగా చాలా బాగా ధృడముగా ఆ రెయిలింగ్ మారింది. 


ఆ తరవాత ఈ రెయిలింగ్ గోడకి కలిసే చోట అక్కడ నీటి తేమ వల్ల పూర్తిగా పాడయ్యి, సన్నని పోచ మీద ఆగింది. ఇక్కడ నిలబడితే ఆధారం లేక పడిపోతామేమో అన్నంతగా భయం వేసేది. అంత ధృడమైన రెయిలింగ్ నీటి తేమ వల్ల త్రుప్పు పట్టి, సన్నని పోచలుగా మారింది.. రెండు పోచల తీగలా మారి దాని ఆధారముగా గోడకి ఫిక్స్ అయ్యింది. ( ఇది ఫోటో తీయటం మరిచా.. తీసుంటే అది ఏ మేరకు త్రుప్పు పట్టి పాడయ్యిందో తేలికగా తెలిసేది. అది గనుక మీరు చూసుంటే అది ఖచ్చితముగా క్రొత్త రెయిలింగ్ ని మార్చాలి అని అనేవాళ్ళు. నేను చేస్తున్న ఈ ప్రయోగం విజయవంతం అవుతుందని నాకే నమ్మకం లేక... అలా ఫోటో తీయటం మరిచా. ఎందుకంటే ఇలా నేనెప్పుడూ చెయ్యలేదు. వేరేవారు చెయ్యగా నేనెప్పుడూ చూడలేదు ) దీనికీ చక్కగా సిమెంట్ వేశాను. వేశాక తడి స్పాంజ్ తో ఎక్కువైన  సిమెంట్ ని తొలగించాను. 

వారం రోజులు చక్కని నీటి తడులని ఇచ్చాను. బాగా గట్టిపడిపోయింది. బలముగా నెట్టినా ఏమాత్రం కదలనంతగా గట్టిగా మారింది. దూరం నుండి చూస్తే అది ఆ గ్రిల్ లోని భాగమే అన్నట్లు కుదిరిపోయింది. ఇలా వెయ్యక ముందు అక్కడ నిలబడాలంటేనే భయముగా తోచేది.. ఇప్పుడు మాత్రం చాలా గట్టిగా ఉండి, నమ్మకముగా ఆనుకొని ఉండేలా మారింది. 


ఇక కొద్దిరోజుల తరవాత వాల్ పుట్టీని లప్పం రేకుతో వేసి, ఎమరీ పేపర్ సహాయాన నునుపు చేసి, రంగు వెయ్యాల్సిన పని మిగిలింది. అదీ త్వరలోనే ముగిస్తాను. అప్పుడు ఈ గ్రిల్ అలా రిపేర్ చేశా అంటే ఎవరూ నమ్మకుండా తయారవుతుంది. క్రొత్త రెయిలింగ్ మాదిరిగా కనిపిస్తుంది. 

చూశారా ! ఎంత ఖర్చుని తప్పించి, తక్కువ ఖర్చులో బాగుచేసుకున్నాను కదూ.. మొత్తం ఖర్చు అంతా ఇరవై Rs. 20 రూపాయలకు మించలేదు.. ఇక వాల్ పుట్టీ, రంగులూ వంద లోపే అయిపోతాయి.. అవీ నేనే వేసుకుంటే. మొత్తానికి నా కాసింత శ్రమ, ఆలోచనతో  పెద్ద ఖర్చుని తొలగించుకున్నాను.

ఈ పద్ధతిని ఆరుబయట ఎండకు ఎండీ, వానకు నానే పాఠక్ / గేట్లు / జాలీ గేట్లు / గ్రిల్స్ కి శుభ్రముగా వాడుకోవచ్చును.

Railing repair

మీకు తేలికగా అర్థం కావటానికి  ఫోటోలు అన్నీ Extra Large మోడ్ లో అప్లోడ్ చేశాను. 

Tuesday, May 16, 2017

Repairing of Cheppal Stand

మొన్న ఖాళీగా ఉన్నప్పుడు - ఇల్లు సర్దుతూ ఉంటే మూలన ఉన్న చెప్పుల స్టాండ్ Cheppal stand కనిపించింది. దాని ఒక కాలు నీటి తేమ వల్ల తుప్పు పట్టి విరిగిపోయింది. ఇదే స్టాండ్ ని గతం లో ( 2012 సం.) బాగు చేసుకొని, రంగులు వేశాను. అదెలా చేశానో ఈ బ్లాగ్ పోస్ట్ లో http://achampetraj.blogspot.in/2012/01/blog-post_07.html లో వివరముగా వ్రాసాను. అప్పుడు తరవాత ఇన్నాళ్ళకు ఇప్పుడు పని పెట్టింది. ఒక మామూలు ఇనుప చెప్పుల స్టాండ్ ఇన్ని సంవత్సరాల కాలం పనిచెయ్యడం చాలా గొప్ప విషయమే.. బహుశా నేను దాన్ని 2008 - 2009 లో కొని ఉండొచ్చు. అంతగా గుర్తులేదు. 

ఇప్పుడు ఒక కాలు విరిగి - కదులుతూ పైన పెట్టిన చెప్పుల జతలు పడిపోవటం మొదలెట్టాయి. అయినా దాన్ని చెత్తలోకి పారెయ్యటం నాకు మనసొప్పలేదు.. ఇంకొంత కాలం దాని సేవలని పొందాలనిపించింది. బాగు చేసుకోవాలని అనుకున్నాను. కొద్దిసేపు ఆలోచిస్తే చాలా తేలికైన పరిష్కారం కనిపించింది. అది చాలా తక్కువ ఖర్చులో చేసుకోనేదిగా ఉంది. కేవలం 10 - 20 రూపాయల్లో అయిపోతుంది. ఇది గనుక సక్సెస్ ఐతే మరో ఐదేళ్ళు తేలికగా పనిచేస్తుంది అనిపించింది. చెప్పుల స్టాండ్ మరొకటి రెండొందలు పెట్టి కొనొచ్చు, కానీ 10 - 20 రూపాయల్లో బాగయ్యి, మరింతకాలం ఉపయోగానికి వస్తుందీ అంటే ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా.. అదీ చాలా తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తక్కువ శ్రమ వల్ల. చూద్దాం ఈ ప్రయత్నం చేసి చూద్దాం అనుకున్నాను. బాగయితే వాడుకుందాం.. లేకుంటే చెత్తలోకి పంపడమే.. ఒకసారి ట్రై చేస్తే - నాకున్న సాంకేతిక నైపుణ్యాన్ని మరింతగా అప్డేట్ చేసుకున్నట్లూ అవుతుంది కదా.. అని అనుకున్నాను. 

ముందుగా స్టాండ్ ని బయట పెట్టి శుభ్రం చేసాను. ఇలా ఈ క్రింది ఫోటోలో ఎర్రని వృత్తాల వద్ద చూపిన చోట్ల తుప్పు పట్టి పాడయ్యింది. ఒక రంధ్రం పడింది, ఒక కాలు విరిగింది. 



నిజానికి ఇలా జరగకుండా చెయ్యటానికి ఒక మార్గం ఉంది. అదేమిటంటే - ఆ స్టాండ్ ని బిగించే ముందు ఆ పైపుల్లో ఎనామిల్ పెయింట్ గానీ, వేడి చేసిన క్రొవ్వొత్తి మైనం గానీ పోసి, లోపల ఒక పూతలా చేస్తే చాలు. కానీ అంత ఓపిక ఎవరికి ఉంది? తక్కువ ఖర్చులో మరొక స్టాండ్ వస్తుంది కదా.. అనుకొని ఆ ఆలోచనని అమలు చెయ్యరు.. ఇప్పుడు నేను బాగుచేసుకున్న పద్ధతిని చూద్దాం.  

ముందుగా ఆ స్టాండ్ కాళ్ళు దూరేంతగా వెడల్పు ఉన్న ప్లాస్టిక్ పైపుని వెదికాను. ఒకరివద్ద కనిపించింది. వారు దాన్ని వృధాగా పడేశారు. ఒకరికి వృధా అన్నది మరొకరికి అవసరం. అది PVC పైపుల్లో హెవీ గేజ్ ది. ఇప్పుడు క్రొత్తగా నిర్మించే ఇళ్ళకు వాడే వాటర్ పైపులు అయితే మరింత ధృడంగా ఉంటాయి. హెవీ గేజ్ Heavy gauge అంటే - పైపు గోడలు మందముగా / లావుగా ఉంటాయని అర్థం. ఆ పైపుని తీసుకోచ్చేసి, ముందుగా ఒక కాలు సైజు తీసుకొని, ఆ సైజుకి హెక్సా బ్లేడ్ సహాయన కోశాను. అదే సైజుని ప్రామాణికముగా పెట్టుకొని, ఈ క్రింది విధముగా పెట్టి, మరో మూడు కాళ్ళు కోశాను. వాటి అంచులని, వెలుపలి భాగాల్ని ఎమరీ పేపర్ / సాండ్ పేపర్ మీద రుద్ది నునుపు / శుభ్రం చేశాను. 


ఇపుడు ఆ స్టాండ్ ని ఒక పేపర్ మీద తిరగేసి పెట్టి, పైకి వచ్చిన కాళ్ళకి ఆ పైపులని తొడిగాను. ఒక గిన్నెలో కాస్త సన్నని ఇసుక + సిమెంట్ ని జారుడుగా కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ గరాటు తీసుకొని ఆ ప్లాస్టిక్ కాలులో పెట్టి, అందులోకి ఈ సిమెంట్ మిశ్రమాన్ని పోయాలి. బాగా కుదురుకోనేందుకు ఒక సన్నని స్క్రూ డ్రైవర్ తో లోపలికి అదమాలి. అలా ఆ కాలులో నిండుగా సిమెంట్ వేసుకోవాలి. ( క్రింది ఫోటోని చూడండి ) ఇలా స్టాండ్ నాలుగు కాళ్ళలో వేసుకోవాలి. సిమెంట్ వేశాక ఎలా ఉంటుందో మరొక కాలుని ఫోటోలో చూడండి. 


ఆ తరవాత ఆ సిమెంట్ మిశ్రమం గట్టి పడ్డాక - కారిన సిమెంట్ మిశ్రమాన్ని హెక్సా బ్లేడ్ తో గీసేసుకోవాలి. 
ఒక తడి స్పాంజ్ తో తుడిచినా శుభ్రమవుతుంది. ఇది జాగ్రత్తగా చెయ్యాలి. 
ఎందుకంటే లోపల పోసిన సిమెంట్ మిశ్రమం గట్టిపడలేదు. పౌడర్ లాగే ఉంటుంది.
అందువల్ల కదిపితే పగుళ్ళు వచ్చి, ఎక్కువ కాలం నిలబడదు. 
రెండు మూడు సార్లు నీటి తడి ఇవ్వాలి. అప్పుడు కాస్త గట్టి పడుతుంది.
అలా తడి ఇచ్చాక ఆ స్టాండ్ ని మాములుగా పెట్టుకోవాలి. 
ఆ తరవాత నాలుగు ప్లాస్టిక్ గ్లాసుల్ని తీసుకొని, వాటిల్లో ఈ సిమెంట్ పోసిన స్టాండ్ కాళ్ళని పెట్టాలి. 
ఆ గ్లాసుల్లో నీటిని పోయాలి. ( మన్నించాలి.. ఈ ఫోటోని తీయడం మరిచాను ) 
ఇలా కొన్ని రోజులు ఉంచాలి. 
ఇలా చేస్తే ఆ సిమెంట్ మిశ్రమం చాలా గట్టిగా తయారవుతుంది. 
ఆ తరవాత మామూలుగానే ఆ స్టాండ్ ని వాడుకోవచ్చు. మరింత ఎక్కువ కాలం వస్తుంది. 
పైపులు ఊడిపోయినా, సిమెంట్ రాడ్ లా ఉంటుంది. 
ఈ సిమెంట్ వేసేటప్పుడు GI / ఇనుప వైర్ ముక్క అందులో పెట్టి, 
సిమెంట్ వేస్తే - పగుళ్ళు వచ్చినా గట్టిగా ఆపుతుంది. 
ఇంతే.. 
ఆ స్టాండ్ ని మరో ఐదేళ్ళు లేదా ఇంకా ఎక్కువ కాలం నిరభ్యంతరముగా వాడుకోవచ్చును. 


Thursday, March 23, 2017

Wall Hanging Cover box

ఈ మధ్యన ఏమీ తోచక ఉంటే - అటూ ఇటూ చూసినప్పుడు కొన్ని సన్నని బీడింగ్ చెక్క ముక్కలు కనిపించాయి. అవి - ఉపయోగించగా మిగిలిన ముక్కలు. వాటితో ఏమైనా చేసుకుంటే - వాటి రద్దీ పోతుంది కదా.. అని అనుకున్నాను. వాటితో ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తే - కాగితాలు, ఉత్తరాలు, కవర్లూ.. దాచుకొనే స్టాండ్ Wall Hanging Cover box చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది. సరే అని ముందుగా అది నాకు ఏ విధముగా ఉండాలో, ఎలాగ నాకు ఉపయోగపడాలో వివిధ ఆలోచనను చేసి, స్కెచ్ వేసి, ఒక రూపానికి ఒకే చేసి, ఇక మొదలెట్టాను. 

ఆ మిగిలిన బీడింగ్ చెక్క ముక్కలూ, కాసిన్ని సన్నని మేకులూ, చెక్కలని అతికే జిగురు, ఒక చిన్న సుత్తె, ఒక హెక్సా బ్లేడ్.. ని వాడి ఈ క్రింది రూపాన్ని తయారుచేశాను. 

దీన్ని చాలా త్వరగానే చేసాను. నిజానికి వడ్రంగి పని నా అభిరుచి మాత్రమే.. దైనందిక జీవితములోని వత్తిడిని ఎదురుకోవడానికి, అందులో ఉండే వత్తిడి నుండి బయటపడేందుకు ఇలాంటివి చేస్తుంటాను. నాకు అది అవసరమయ్యే విధముగా ముందే ఆలోచించాను, స్కెచ్ వేసుకున్నాను కాబట్టి చెయ్యటం కాస్త తొందరగానే అయ్యిందనిపించింది. మొత్తం చేసాక - దాన్ని ఆరబెట్టి, ఆతర్వాత దాన్ని సాండ్ పేపర్ కి రుద్ది, నునుపు చేశాను. ఆ తరవాత టచ్ వుడ్ ని ఒక సింగల్ కోటింగ్ వేసి, ఆ తరవాత దాన్ని వాడుకోవడం మొదలెట్టాను. నా తయారీని మీరూ చూడండి. 


Bottom side view 

Left side view 

Right side view 

Top side view 

Top view 

Ready for use 


ఎలా ఉంది? బాగానే చేశాను కదూ..!!


Friday, February 17, 2017

Wall Graphity

ఈ మధ్య నేనొక గోడ మీద బార్డర్ డిజైన్ వేశాను. ఊబుసుపోక ఏం చెయ్యాలో తోచని వేళ ఆ పని పెట్టుకున్నాను. దాని గురించి మీకు తెలియచేస్తున్నాను.

రోడ్డు వైపున ఉండే గోడ అది. ఆ గోడకి ఈ మధ్యే రంగు వేశాను.. హా.. మీరు విన్నది నిజమే. నేనే వేశాను. అంతకు ముందు ఆ గోడకి - చాలా ఖరీదైన రాయల్ వెల్వెట్ ఎమల్షన్ పెయింట్ వేయించాను. మంచిగా కనిపిస్తే జనాలు ఓర్వలేరు కదా.. దాన్ని మేకులతో గీకి, పాడు చేశారు. ఇలా కాదనుకొని వంకాయ రంగు నుండి బూడిద రంగుకి మార్పించాలనిపించింది. మహా అంటే 15' x 11' అడుగుల గోడ. దీనికి రంగు వెయ్యటానికి Rs. 500 అడిగాడు పెయింటర్ అబ్బాయి. మరొకరిని అడిగినా దాదాపుగా అంతే!.. 

చూస్తే అది చిన్న పని.. వాళ్ళైతే అలవాటైన పని గనుక మహా అంటే పది నిమిషాల్లో ముగించేసే పని. ఆమాత్రం దానికే అంత డబ్బా!! పోనీ అదేమైనా స్కిల్ వర్క్ Skill work కూడా కాదు. మరొక ఎమల్షన్ పెయింట్ ని పెయింట్ రోలర్ సహాయాన పూసేయ్యడమే. ఇక లాభం లేదని నేనే వేసుకోవడానికి సిద్ధమయ్యాను. ఓ ఆదివారాన దానికి సుముహూర్తం పెట్టాను. 

ఆరోజు రానే వచ్చింది. రోడ్డు కదా.. జనాలు బాగానే అటూ, ఇటూ తిరుగుతూ ఉన్నారు. వారి ముందు అలా వెల్ల వేయటం కాస్త నామోషీగా అనిపించి, మొదలెట్టక ఆగాను. కానీ వారి రాకపోకలు ఆగిపోవాలంటే - ఇక చీకటి పడాల్సిందే.. అపుడైతే నామోషీగా ఉండదేమో గానీ, ఎక్కడ రంగు బాగా వచ్చింది, ఎక్కడ గుడ్డి గుడ్డిగా వచ్చిందో తెలీదు. ఇక కాదని సాయంత్రం పూట రంగేయ్యటం మొదలెట్టాను. 

ఇంతకు ముందు రంగేసినప్పటి పెయింట్ రోలర్ ఇంట్లో ఉంది కాబట్టి, ఈజీగా అయ్యింది. దాన్ని ఒక కట్టెకు గుచ్చి ( ఇలా చెయ్యటానికి ఆ రోలర్ హాండిల్ కి ఈ సదుపాయం ఉంటుంది ) రంగు పూయటం మొదలెట్టాను. వాళ్ళూ, వీళ్ళు వచ్చి, ఇలా ఎలా వేస్తున్నానో చూడటానికి వచ్చినా, ఇక పట్టించుకోక దాదాపు పావుగంటలోనే ఒక కోటింగ్ పూర్తి చేశాను. అది ఆరాక మరో కోటింగ్ కూడా వేశాను. రోలర్ సహాయన అలా వెయ్యటం చాలా తేలికగా పని ముగిసింది. 

ఇలా వేస్తున్నప్పుడు తెలిసిన పెయింటర్ అటుగా వెళుతూ, చూసి, ఆగాడు. వచ్చి " నేను వెయ్యాలా అన్నా!.." అని అడిగాడు. 

" వేయు.. ఎంత తీసుకుంటావ్.." అన్నాను. 

" మూడొందలు ఇవ్వన్నా.." అన్నాడు. అప్పటికే సగం అయ్యింది. రోలర్ తో వెయ్యడం క్రొత్తగా, భలేగా అనిపిస్తున్నది. అంతా నేనే వేసుకోవాలని అనుకున్నాను. ఈరోలర్ ని చూసే - ఈ పెయింట్ వెయ్యటానికి వచ్చాడంట. అంటే రోలర్ వల్ల అంత తేలికగా పెయింట్ వెయ్యడం జరిగిపోతుందన్నమాట. తను ఉన్నప్పుడే ఒక కోటింగ్ వెయ్యటం పూర్తయ్యింది కూడా.. ఇంకో కోటింగ్ అతనికి ఎందుకివ్వాలనిపించింది. ఇచ్చి డబ్బులు ఎందుకు వృధా చేసుకోవాలనిపించింది..!! కాసేపు ఆ మొదటి కోటింగ్ ని ఆరనిచ్చాను. ఆతర్వాత రెండో కోటింగ్ ని ఇట్టే లాగించేశాను. 

అలా రెండు కోటింగ్స్ పూర్తయ్యాక - ఆ గోడ నాకైతే మరింత అందముగా కనిపించటం మొదలెట్టింది... బహుశా నేను వేశానని కాబోలు. ( ఇదంతా ఈ పోస్ట్ హెడ్డింగ్ కి సరిపోదు కానీ, జ్ఞాపకం కోసం వ్రాసుకున్నాను ) 

ఆ తరవాత కొద్దిరోజులకు ఆ గోడకి క్రిందన బార్డర్ కొట్టాలనిపించింది. అలా అయితే ఆ గోడ మరింత అందముగా కనిపిస్తుందని. ఆలివ్ గ్రీన్ ఎమల్షన్ Alive Green Emulsion కాస్త మిగిలినట్లు ఉంటే - దాన్ని వాడేసి, ఆ డబ్బాని తీసేద్దామని ఆ రంగుని ఎంచుకున్నాను. ఆ డబ్బా తీసేస్తే నాకు కాస్త స్టోరేజీ సమస్య తీరుతుంది. 

మళ్ళీ ఒక ఆదివారం ఎంచుకొని, ఆ గోడ మీద బార్డర్ లైన్ వ్రాసుకొని, ఆ రంగుని 50mm నంబర్ బ్రష్ సహాయాన పూసేశాను. అదీ రెండు కోటింగ్స్ వేశాను. ఇలాంటి వాటిని వేసేటప్పుడు - కొన్ని విషయాలు బాగా గుర్తు పెట్టుకోవాలి. అందులో ఇది ఒకటి - ఎక్కడైతే పెయింట్ పోయిందో / క్రొత్తగా వెయ్యాల్సి ఉంటుందో / మరకలతో అసహ్యముగా కనిపిస్తుందో - అక్కడ అన్నింటికన్నా ముందే ప్యాచెస్ మాదిరిగా పెయింట్ చేసుకొని, ఆతర్వాత మిగతా అంతా మొదలెట్టుకోవాలి. అలా అయితే మరింత లుక్ వస్తుంది.

ఇలా రెండు, మూడు కోటింగ్స్ అయ్యాక - ఆ పెయింట్ కొద్దిగా అంటే 50 ml. మిగిలింది. అలా మిగల్చాలి కూడా! పెయింట్ వేశాక ఎక్కడైనా మరకలుగా ఉంటే టచప్స్ Touch up కోసం అది అవసరానికి అట్టే పెట్టుకోవాలి. 

ఇదయ్యాక చాలా వారాలకు / కాదు నెలలకు - ఆ క్రింది బార్డర్ ని మార్చాలనిపించింది. ఎలా మార్చాలో, ఎలా ఉండాలో అప్పటికి ఇంకా నిర్ణయమూ తీసుకోలేదు.. జస్ట్ అనుకున్నా అంతే!. 

ఒకరోజు రాత్రి సడన్ గా ఒక ఐడియా. ఇది నా జీవితాన్ని మార్చలేదు కానీ గోడ అందాన్ని మారుస్తుంది అనుకున్నాను. ఎన్నోసార్లు క్రాస్ చెక్  చేసి, ఆలోచించా.. బాగుంటుంది అనిపించింది. ఎమ్మెస్ పెయింట్ లో అలా గీసి, రంగులేసి, చూశా.. వావ్! అనిపించింది. మరి ఇది అందరికీ నచ్చుతుందో లేదో.. అనిపించింది. 

మరోరోజు రాత్రిన ఆ ఐడియాని అప్డేట్ చేసుకున్నాను - నా ఫేస్ బుక్ గోడ Wall నా ఇష్టం, నాకు నచ్చింది వ్రాసుకుంటా, ఇష్టమైనది వేసుకుంటా.. అన్నట్లు నా గోడ నా ఇష్టం అనిపించి, ముందుకు సాగాను. ఒకవేళ బాగా రాకుంటే ? హా! ఏముంది? మరొక రంగుతో ఆ బార్డర్ ని మార్చితే సరి అని నిర్ణయించుకున్నాను.

ఆ మిగిలిన 50ml ఆలివ్ గ్రీన్ ఎమల్షన్ పెయింట్ లో కాస్త ఫాస్ట్ గ్రీన్ fast green స్టైనర్ ని కలిపి ఆ రంగుని మరింత డార్క్ చేసి, అక్కడక్కడ ప్యాచెస్ రూపములో ఆ బార్డర్ పట్టీ మీద పూశాను. అప్పటికీ మరికొద్దిగా మిగిలితే నలుపురంగు స్టైనర్ ని కలిపి, మరింత ముదురు ఆకుపచ్చగా మార్చి - అక్కడక్కడ మళ్ళీ ప్యాచెస్ మాదిరిగా వేశాను. అప్పటికి ఆ రంగు అయిపోయింది. ఆ తరవాత తెలుపు రంగు ఎమల్షన్ తీసుకొని, అందులో ఫాస్ట్ పసుపు Fast Yellow, ఫాస్ట్ రెడ్ Fast Red లను తగుపాళ్ళలో కలుపుతూ మరిన్ని రంగులని తయారుచేసి, వాడాను. కాస్త కాఫీ బ్రౌన్ కలర్ కూడా ఉంటే అదీ వాడాను. ఒక ప్యాచ్ కీ, మరొక ప్యాచ్ కీ ఆనుకోనేలా, వివిధ రంగులు కలుసుకోనేలా వేశాను. ఇక ఆరోజు అంతటితో ముగించేశాను. స్టైనర్ అంటే -  ఎమల్షన్ పెయింట్ లో మనకి కావాల్సిన షేడ్ వచ్చేందుకు కలిపే అతిచిక్కని, గాఢమైన రంగు.

దాన్ని చూసి, ఇదేమిట్రా - వీడు గోడని ఇలా రకరకాల రంగులు వేస్తూ పాడుచేస్తున్నాడు అనుకున్నారు. కొద్దిమంది నాతో అన్నారు కూడా. కానీ నేనేమీ పట్టించుకోలేదు. నాకైతే - అది పూర్తయితే మరింతగా బాగుంటుందని నమ్మకముగా ఉన్నాను.

మరో రెండు మూడు వారాల సమయం తీసుకొని తెలుపు ఎమల్షన్ లో ఎక్కువగా నలుపురంగు స్టైనర్ ని కలిపి నల్లని రంగుని తయారుచేశాను. ఆ రంగుని ఒక సన్నని బ్రష్ సహాయాన - ఆ ప్యాచెస్ ని ఒక్కొక్కటీ సేపరేటుగా ఉండేలా, బార్డర్స్ గీశాను. ఇప్పుడు మరింత అందముగా వచ్చింది. అప్పుడు దాన్ని చూసిన వారు - నన్ను అభినందించారు. నాకు మాత్రం నాకు నచ్చిన డిజైన్ ని అలా బార్డర్ గ వేసుకొని నాలోని కోరికని నేరవేర్చుకున్నానని అనిపించింది.

ఇదే ఆ గోడ గ్రాఫిటీ -





Sunday, February 12, 2017

My Creativity

ఈరోజు నుండీ నా బ్లాగులోని లేబుల్స్ Label లలో మరొకటీ చేర్చుతున్నాను. ఇన్నిరోజులూ ఆ విభాగాన్ని బాగా నిర్లక్ష్యం చేశాను. నా గురించి, నా అభిరుచుల గురించి నేను చెప్పుకోలేక పోతే ఎలా? ఎన్నో రంగాల్లో కొద్దికొద్దిగా ప్రవేశం ఉన్న నాకు వాటిల్లో - చాలా కొద్దిగా తెలిసినా, నాకున్న పనిదాహాన్ని / పని చేస్తుంటే వచ్చే తృప్తి దాహాన్ని అవి చక్కగా తీరుస్తుంటాయి. అందులోనే నాకు చాలా విజయం తాలూకు గెలుపుని ఆస్వాదిస్తుంటాను. వాటిని ఇక్కడ మీకందరికీ పరిచయం చెయ్యాలని అనుకుంటున్నాను. ఇలాంటి వాటన్నింటినీ మై క్రియేటివిటీ My Creativity అనే వర్గీకరణ లేబుల్ క్రిందన చూపించబోతున్నాను. ఇందులో నాకొచ్చిన చాలా పనులవి - చిన్నవి నుండి పెద్దవి వరకూ - (నానా చెత్తా చెదారం) ఉంటాయి. అలాగే వాటిలోన సూచనలూ కూడా ఉంటాయి.


అలాగే దానిలోనే - ఇంతకు ముందు నా బ్లాగులో పబ్లిష్ చేసిన నా క్రియేటివిటీ పోస్ట్స్ అన్నీ వీలువెంబడి చేర్చుతాను. 



Wednesday, December 21, 2016

Cheapest Bobbin box

ఈమధ్య చాలా తక్కువ వ్యవధిలో, చాలా తక్కువ వ్యయంతో ఒక చిన్న ఉపయోగకర వస్తువుని తయారుచేసుకున్నాను. అదేమిటో మీకు కూడా చూపెట్టాలని అనుకొని ఈ పోస్ట్. 

చాలా ఏళ్ల క్రితం కొన్న Usha Janome కుట్టు మెషీన్ కొన్నాం.. దాంతో ఉచితముగా రెండు ప్లాస్టిక్ బాబిన్స్ వచ్చాయి. అవి ఎలాగూ సరిపోవని మరో నలబై బాబిన్స్ కొన్నాను. వీటిని పెట్టేందుకై ఒక బాక్స్ కూడా కొనాలని చూశాను కానీ సౌకర్యవంతమైది కనిపించక, మామూలుగా అన్నీ ఒక డబ్బాలో కలగలిపి ఉంచేవాళ్ళం. అలా ఉంచటం వలన వాటిని తీసుకోవటంలో ఇబ్బందులూ, దారాలు బయటకు వచ్చి, ఒకదానిని తీయబోతుంటే మరొకటి దారం వచ్చి... ఇబ్బంది పెట్టడం జరిగేది. వీటికి పరిష్కారం గురించి ఆలోచించా.. ఏమీ తట్టలేదు. 

మొన్నటికి మొన్న ఒక చక్కని పరిష్కారం తట్టింది. వెనువెంటనే దానికి ఒక రూపుని ఇచ్చాను. ఇదంతా చెయ్యటానికి ఎక్కువలో ఎక్కువ - అరగంట కన్నా ఎక్కువ సమయం తీసుకోదు. అది మీరూ తయారుచేసుకోవచ్చును. 
చాలా తక్కువ సమయంలో, 
తక్కువ ఖర్చులో, 
ఎక్కువ సౌకర్యముగా, 
తక్కువ జాగాలో ఇమిడిపోయే విధముగా ఉంటుంది. 

ముందుగా మీరు ఏదైనా స్టేషనరీ సామాను అమ్మే దుకాణాల్లో దొరికే పిల్లల పెన్సిల్ బాక్స్ ని తీసుకోవాలి. ఇవి రకరకాల ఆకారాల్లో, ధరల్లో ఉంటాయి. కానీ క్రింద చూపిన సైజులోని డబ్బా తీసుకోవడం మంచిది. ఇందులో అయితే రెండు వరుసలలో ఆ కుట్టుమెషీన్ బాబిన్స్ చక్కగా అమరుతాయి. అందుకే ఈ ఫోటోలో వాడిన డబ్బా లాంటిదే తీసుకోమని సలహా ఇస్తాను. ఇది బ్రాండెడ్ కంపనీ తయారీ కాదు. కేవలం 5 - 6 రూపాయల్లో దొరికే పెన్సిల్ బాక్స్. ఇదే బాక్స్ లో దానితో బాటే - A to Z అక్షరాల మరియు 1 - 10 అంకెల స్టెన్సిల్ కూడా వస్తుంది. అది పిల్లలకు ఇస్తే బోలెడంత సంతోషపడతారు. మన తయారీకి ఇది అవసరం లేదు. 


ఇప్పుడు ఒక అర అడుగు కి పైగా పొడుగు గల ఒక చదునైన ఫ్లాట్ బీడింగ్ చెక్కని 7" inches length Thin flat teak  beeding తీసుకోవాలి. ఇది ప్లైవుడ్ షాపుల్లో దొరుకుతుంది. ఒక అడుగు / Feet కి మూడు రూపాయల చొప్పున ఇది దొరుకుతుంది. ఏడు ఇంచీల చెక్క ముక్క ఇందులకు సరిగ్గా సరిపోతుంది. దీన్ని సరియైన సైజులోకి హెక్సా Hexa బ్లేడుతో కోసుకొని, అంచులని గరుకు / ఉప్పు కాగితముతో గానీ, గరుకు సిమెంట్ గోడకేసి రుద్ది ట్రిమ్ Trim చేసుకోవాలి. ఆ బాక్స్ లోపలి భాగాన్ని - అడ్డముగా రెండు భాగాలుగా చెయ్యటానికి సరిగ్గా సరిపోయేలా ఉండాలి. 

దాన్ని ఒక సన్నని మేకు వల్ల ఆ బాక్స్ మీదుగా కొట్టి బిగించాలి. నిజానికి ఇలా కొట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి బదులుగా గ్లూ గన్ వాడి అతకడం మంచిది. (ఇలాంటి ఐడియాలు మొదటిసారి చేశాక వస్తుంటాయి ) ఆ సన్నని చెక్కకు సన్నని డ్రిల్ వేసి, స్క్రూ బిగించి గానీ, మేకుని ఫెవిక్విక్ తో గానీ బిగించుకోవాలి. ఇవన్నీ చెయ్యరాని వారు |------| ఆకారములో ( మూడు ముక్కలని కలిపి ) చేసి, అ లోపలి భాగాన అమరేలా చేసుకోవాలి. 


పైన చిత్రంలో - బాక్స్ కి పై భాగము నుండి చెక్కకు మేకు కొట్టాను. మేకు కొద్దిగా తిన్నగా లోనికి దిగక, కాస్త ప్రక్కకి జరిగి, చెక్కని విరిచింది. కానీ గ్లూ గన్ వాడి అతికితే మరీ బాగుంటుంది. లేకుంటే ప్లాస్టిక్ ముక్కని వేడి చేసి, అతికితే మరీ బాగుంటుంది. ( మరో బాక్స్ కి మాత్రం ఏమాత్రం పగలకుండా చెక్కని బిగించాను ) ఇలా చెయ్యటంలో ఏదైనా పొరబాటు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే సన్నని స్క్రూ ని డ్రిల్ వేసి, బిగించుకుంటే ఈజీగా ఉంటుంది. 

అలా అడ్డుగా ఆ చెక్కను బిగించుకున్నాక - మీరు వాడుకోవటానికి ఆ బాక్స్ సిద్ధముగా ఉన్నట్లే. ఇక అందులో బాబిన్స్ ఇలా క్రింది ఫోటోలో చూపెట్టినట్లు - నిలువుగా అమర్చుకుంటే 
  • వాటిని ఎన్నుకోవటానికీ, 
  • ఏ రంగు బాబిన్ ఎక్కడ ఉందో తేలికగా చూడవచ్చు. 
  • తేలికగా మనకు కావలసిన రంగుదారం బాబిన్ ఆ బాక్స్ లో ఉందో లేదో చూడవచ్చు. 
  • దారాలు కలగలసి, ఇబ్బంది పెట్టవు. 
  • అన్నింటికన్నా మించి తక్కువ ధరలో ( బాక్స్ Rs. 5 + చెక్కముక్క Rs. 3 + గ్లూ Re. 1 ) కేవలం తొమ్మిది 9 రూపాయల్లో చేసుకోవచ్చు. Cheap bobbin box 
  • తక్కువ జాగాలో బాబిన్స్ అన్నింటినీ సర్దుకోవచ్చు. 
  • డార్క్ రంగులవీ, లైట్ రంగులవీ అంటూ వేరు వేరు బాక్స్ లని పెట్టుకొని మన పనులని వేగముగా చేసుకోవచ్చు. 
  • విడి బాబిన్స్ ని చక్కగా అమర్చుకోవచ్చు.
  • ఈ బాక్స్ ల నుండి మనకు కావలసిన బాబిన్ ని తేలికగా తీసుకోవచ్చు.  
  • ఎక్కడికైనా తేలికగా, అనుకూలముగా ఈ బాక్స్ ని పట్టుకెళ్ళవచ్చును. 





Friday, December 4, 2015

Repairing of Bolt Cutter

Bolt Cutter బోల్ట్ కట్టర్ - అనేది ఒక కత్తెర లాంటి పనిముట్టు. ఇది సాధారణ ప్రజానీకానికి అంతగా తెలీకపోవచ్చు. దీన్ని ఎక్కువగా నిర్మాణ రంగములో, ఫ్యాక్టరీలలో... మొదలగునవి చోట్ల దీన్ని వాడుతుంటారు. దీనితో కొద్దిగా మందపాటి ముక్కలని, తీగల్ని, సలాకా, బోల్ట్ లనీ, ఇనుప గొలుసులనీ.. లాంటి వాటిని కత్తిరించడానికి వాడుతుంటారు. దీనితో అర అంగుళం మందపాటి ఇనుప బోల్ట్ లనీ కొద్దిపాటి శ్రమతో తేలికగా రెండు ముక్కలుగా చెయ్యవచ్చును. అందుకే దీన్ని వెండి, బంగారు బిళ్ళల్ని కత్తిరించడానికి విరివిగా వాడుతుంటారు. దీన్ని ఎపుడూ చూడని వారు ఇలా చేస్తుంటే హశ్చర్యం గా చూస్తారు. 

నాకు ఈ పనిముట్టు పదిహేను సంవత్సరాలుగా ( 15 ) తెలుసు. అప్పట్లో చాలా క్రొత్తగా అనిపించేది. కొందామంటే చాలా ధరలో ఉండెడిది. ఇప్పుడూ ధర ఏమీ తగ్గలేదు. పైపెచ్చు బాగా పెరిగిపోయింది కూడా.. ఈ పనిముట్టులో నాకు తెలిసి మంచి ప్రోడక్ట్ అంటే HIT company - Bolt cutter. నేను మొదటగా చూసింది కూడా ఆ కంపనీ వారిదే. ఈ కంపనీ జపాన్ లో ఉంది. జపాన్ వారి పనిముట్ల నాణ్యత గురించి మీకు క్రొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటా. చాలా నాణ్యతగా ఉండే ఈ వస్తువు రకరకాల సైజుల్లో దొరుకుతుంది. పెద్ద సైజులో ఉన్నది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ధరనేమో చాలా మొత్తంలో ఉంది. నాకు అంత తప్పనిసరి వస్తువు కాకపోవటంతో అంతగా కొనాలన్న దృష్టి లేకపోయింది. కానీ నా దగ్గర అలాంటిది ఒకటి ఉంటే బాగుండును అనుకున్నాను. నాకు కావలసిన సైజు 24" కానీ ఆ సైజులోని ఆ కట్టర్ విలువ Rs. 2900+ గా ఉంది ఇప్పుడు. అందుకే కొనకుండా ఆగిపోయాను. ఆ కట్టర్ ఎలా ఉంటుందీ అంటే ఈ క్రింది ఫోటో చూడండి. 


ఈ పనిముట్టు - ఇనుప సలాక, కమ్మీలు, గొలుసులు, బోల్ట్ లనీ ఎలా కత్తిరించగలదో ఈ క్రింది ఫోటో చూడండి. ఇప్పుడు యాంగిల్ గ్రైండర్, పైప్ కట్టర్ మెషీన్స్, Abrasive wheels  వచ్చాక ఆయా రంగాల్లో దీని వాడకం అరుదై పోయింది. 


అలాంటి ఈ అద్భుత పనిముట్టుని నా స్వంతం చేసుకోవాలని ఉన్నా, నాకు ఎక్కువగా ఉపయోగం ఉండదు కాబట్టి  అంత ధరపెట్టి కొనడం ఇష్టం లేక ఆగిపోయాను. అలాంటిది ఈ 24" కట్టర్ పనిముట్టు విచిత్ర పరిస్థితుల్లో నా స్వంతం అయ్యింది. అదెలాగో మీకు చెప్పాలనే ఈ టపా. 

నా పనిమీద ఒక వర్క్ షాప్ కి వెళ్ళాను. అక్కడ చూస్తే ఇలాంటి పనిముట్టు ఒకటి కనిపించింది. ఒకరు వాడుతుంటే చూడసాగాను. నిర్వహణా లోపం వల్ల అది కాస్త పాడయినట్లు ఉంది. సరిగా పనిచెయ్యడం లేదు. దానితో కత్తిరిస్తున్న అతను చాలా అసహనానికి గురి అవుతున్నాడు. అతను కాదని వేరే పద్దతిలో చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నేను ఆ వర్క్ షాప్ వాడిని అడిగా.. " ఏమైంది? " అనీ. దానికి అతడు - " అది పాడయింది.. క్రొత్తది కొనాలి.." అన్నాడు. 

నేను అన్నాను " బాగుంది కదా.. కొద్దిగా రిపేర్ చేస్తే వస్తుందేమో.. ఒకసారి నీవు ఖాళీగా ఉన్నప్పుడు నా వద్దకు దాన్ని తీసుకొని రా.. చూసి, సరి చేస్తాను.." అన్నాను. 

" కాదన్నా.. నేను చూశాను. " అన్నాడు. 

" ఒకసారి నేను ట్రై చేస్తే పోయేదేమీ ఉంది? " అన్నాను. 

ఆ తరవాత మరో నాలుగుసార్లు ఇలాగే మాటలు గడిచాయి. కానీ ఆ అబ్బాయి నా వద్దకు దాన్ని తీసుకరాలేదు. నావల్లే కానిది తనవల్ల ఏమి అవుతుందని - ఆగిపోయినట్లున్నాడు. 

మరో నెల రోజులకి - తన వద్దకి వెళితే - తన వద్ద మరొక క్రొత్త కట్టర్ కనిపించింది. " ఇదెప్పుడు కొన్నావ్..? ఎంతకి కొన్నావ్?? పాతది ఏమి చేస్తావ్..??? " అని ప్రశ్నలు గుప్పించాను. 

" నిన్ననే కొన్నాను. ఈరోజే మొదలెడుతున్నాను. ధర : రూ. 2900.." అన్నాడు. 

"మరి పాతది ఏమి చేస్తావ్ ? " 

" దాన్ని పాత ఇనుప సామానుకి అమ్మేయ్యాలి.. లేదా ఎవరికైనా ఇచ్చేయ్యాలి.. ఎవరూ రిపేర్ చెయ్యరు. ఎక్కడా రిపేర్ కాదని తెలిసింది.." అన్నాడు. 

" అలా అయితే నాకే ఇవ్వొచ్చు కదా.. నేనే తీసుకుంటాను.. అదీ నీకు ఇష్టమైతేనే.." అన్నాను. దానికి అతడు సరే అన్నాడు.. నాకు నమ్మబుద్ది కాలేదు. నిజమే అంటున్నాడా అని కాస్త ఆగి అడిగాను. తీసుకపో.. చెప్పాడు. ఎందుకైనా మంచిదని సాయంత్రం వచ్చి తీసుకెల్లుతా అని చెప్పా. తన మనసు మారి వద్దంటాడా ? అనీ. అలాని ఆగడం ఎందుకూ అంటే - నేను దాన్ని బాగుచేసుకున్నాక - వచ్చి నాది నాకివ్వు అంటే నా శ్రమ అంతా వృధానే. అందుకే ఆగాను. 

సాయంత్రం వచ్చి, దాన్ని తీసుకొని అడిగా.. ఇచ్చాడు. దాన్ని తీసుకొని వెళుతున్నా అని చెప్పా. వెళ్ళు అని చెప్పాడు. ఊరికే తీసుకోకుండా చేతిలో ఒక ఇరవై రూపాయలు పెట్టి - దీన్ని పాత ఇనుప సామానులా నీ వద్ద నుండి కొన్నాను అని చెప్పాను. ఇలా చెయ్యడం ఎందుకూ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. 

1. ఇచ్చినది మనసు మారి వాపస్ తీసుకోకుండా చేసేలా చెయ్యడం. 
2. ఊరికే తీసుకున్నాడు.. డబ్బులేమీ ఇవ్వలేదు.. ఎంతో కొంత ఇస్తే పోయేదేమి ఉంది అనే మాటలు రాకుండా ఉండటానికి.. 
3. మనమేమీ ఊరికే అతని వద్ద నుండి తీసుకోలేదు.. కొంత డబ్బు ఇచ్చి, ఆ వస్తువుని కొన్నట్లుగా ఉండి, మనం దానికి ఇకనుండీ హక్కుదారులుగా మారుతాం. ఇక ఆ వస్తువుని అట్టే పెట్టుకోవచ్చు, దానం ఇవ్వొచ్చును, కానుకగా ఇవ్వొచ్చు, వాడుకోవచ్చును, వాడకంలో పాడయితే - వారు అడిగినప్పుడు తిరిగి క్రొత్తది కొని ఇవ్వాల్సిన ప్రశ్నే ఎదురవ్వదు. 
4. దాన్ని బాగు చేసుకొని, మనం అమ్ముకున్నా మనకే ఇక అధికారాలు సంక్రమిస్తాయి. 

ఇలాంటి కారణాల వల్ల తనకి డబ్బులిచ్చి తీసుకోవడం..

నా వద్దకు తెచ్చుకున్నా - ఒక నెల రోజులు రిపేర్ ఏమీ చెయ్యకుండా అలాగే అట్టిపెట్టాను. మనసు మారి వచ్చి, నాది నాకు ఇమ్మని అంటాడేమో అనీ.. కానీ - రాలేదు. ఆ తరవాతే దాన్ని శుభ్రం చేశాను. అందరూ దాన్ని ఎలా పడితే అలా వాడారు కాబట్టి అది బాగా జిడ్డుగా, తుప్పు పట్టి, బిగిసి పోయి ఉంది. కనీస నిర్వహణ కూడా చెయ్యలేదు. కనీస నిర్వహణ అంటే అదేదో పెద్ద పని కూడా కాదు.. వారానికొకసారి బట్టతో తుడిచి, జాయింట్ల వద్ద కొద్దిగా నూనె చుక్కలు వేసి, మళ్ళీ శుభ్రం చేస్తే సరి.. అంతే. ఇదంతా చెయ్యటానికి మహా అంటే ఐదు నిమిషాలు కూడా పట్టవు. దానికున్న బోల్టులూ నట్లూ విప్పి, అదంతా శుభ్రం చేశాను. ఆ తరవాత రిపేర్ చేయటం మొదలెట్టాను. 


ముందుగా కిరసనాయిల్ లో పాత పళ్ళ బ్రష్ ని ముంచి, వాడి పైన పేరుకొని ఉన్న త్రుప్పునీ, మురికిని తొలగించాను. ఆ తరవాత సమస్య ఎక్కడ అన్నది వెదికాను. సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తే - సగం విజయం సాధించినట్లే.. అలా చూస్తూ పోతే హ్యాండిల్స్ మధ్యలో ఉండే బోల్ట్ వద్ద అస్సలు సమస్య ఉంది. అక్కడ ఉండే బోల్ట్ రంధ్రం అరిగిపోయింది. ఈ క్రింది ఫోటోలో అది స్పష్టముగా కనిపిస్తున్నది చూడండి. గుండ్రంగా ఉండాల్సిన ఆ రంధ్రం పొడుగ్గా మారింది. ఆ కాసింత అరుగుదల వల్ల ఆ కట్టర్ పనిచెయ్యలేదు. ఇప్పుడు సమస్య ఏమిటో తెలుసుకున్నాను. అంటే సగం విజయం సాధించాను. ఇక సమస్యని సరిదిద్దాలి. ఇలాంటిదే సమస్య బైక్ సైడ్ స్టాండ్ లో కూడా ఎదురయ్యింది. మీకు వీలుంటే ఆ పోస్ట్ కూడా చూసిపెట్టండి. లింక్ : http://achampetraj.blogspot.in/2013/04/blog-post.html


ఇలా సాగిన రంధ్రం సరి చెయ్యాలీ అంటే 
ఒక పద్ధతి : వెల్డింగ్ చెయ్యడం. 
లేదా ఆ షేపులో బోల్ట్ ని అరగదీసి అక్కడ పెట్టడం. 
లేదా ఆ రంధ్రాన్ని గట్టి స్టీలు లాంటి పదార్థముతో మూసి, వాడుకోవడం.. 
ఇందులో ఆ మూడో పద్ధతియే కరెక్ట్ అనిపించింది. 

ముందుగా ఒక బోల్ట్ వెదికాను. ఆ సైజులో, సరిగ్గా అమరే, సరియైన కొలతలో ఉండే బోల్ట్ దొరకలేదు. అన్ని షాపుల్లో వెతికా.. ఊహు లాభం లేదు. చివరికి ఒక షాపుకి వెళితే - అక్కడ ముందు ట్రే లో వృధాగా పారేసిన TVS కంపనీ వారి 10.9 గ్రేడ్ బోల్ట్ కనిపించింది. 


అలాంటి గ్రేడ్ బోల్ట్స్ ఇందులకు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి. ఈ నంబర్ పెరుగుతూ ఉంటే - ఆయా వాటికి దృఢత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికోసం వెదికా. పైన చూపిన ఫోటోలోని మధ్యలో ఉన్నదే - ఆ నంబర్ బోల్ట్. ఇవి ఎక్కువగా ఆటోమోటివ్ రంగాల్లో ఉపయోగిస్తారు. బోల్ట్ దొరికింది కాకపోతే నట్ లేదు. అయినా సరే అనుకొని ఆ బోల్ట్ ని 10 రూపాయలకు కొన్నాను. వారికి వృధా అనుకున్నది నాకు మిక్కిలి అవసరం. ఎందుకంటే చాలా శక్తి అంతా ఆ బోల్ట్ మీదే పనిచేస్తుంది. ఆ బోల్ట్ గనుక బాగుంటే ఇక అంతా బాగున్నట్లే. నట్ కూడా కావాలని రిక్వెస్ట్ చేస్తే వారే వెదికి ఇచ్చారు. హమ్మయ్య.. ఒక పని అయిపోయింది. ఇక మిగిలింది - సాగిన రంధ్రాన్ని గుండ్రముగా చెయ్యటానికి ఒక స్టీల్ ఫిలప్ మెటీరియల్. 

నా దగ్గర గ్రైండర్ గానీ, యాంగిల్ గ్రైండర్ గానీ లేకపోవటంతో - సన్నని రంపంతో ఒక నట్ ని కోసి, గరకు కాగితం మీద అరగదీశాను. ఇలా చెయ్యటానికి బోలెడంత సమయం తీసుకుంది. అయినా నాకో కట్టర్ మిగిలిపోతుందని ఇష్టముగా చేశా. అలా ఆ గ్యాప్ నిండేలా దానిని అమర్చాను. ( ఈ క్రింది ఫోటోలో ఆ ఫిలప్ ముక్క - బాణం గుర్తు వెనకాల తెల్లని అర్ధ చంద్రాకారములో ఉండి, చూపెట్టబడి ఉన్నది. దాన్ని ఆ సాగిన రంధ్రంలో అమర్చి, నట్లు అన్నీ బిగించాను ) అది ఎంత బాగా సెట్ అవ్వాలీ అంటే - అది అమర్చాక - మిగిలిన గ్యాప్ లో బోల్ట్ పెడితే - ఆ బోల్ట్ ఏమీ ప్లే లో ఉండకూడదు. అందుకే ఈ చిన్న ముక్క సెట్టింగ్ కోసం చాలా సమయం, శ్రమ, ఆలోచన చెయ్యాల్సి వచ్చింది. 


అన్నీ బిగించాక ప్రతీ జాయింట్ వద్ద కొద్దిగా నూనె వేశాను. నాలుగైదుసార్లు అలా ఆడించి చూసి, ఒక ఇనుప ముక్కని కత్తిరించి చూశాను. క్రొత్తదానిలా కత్తిరించడం మొదలెట్టింది. మరింతగా కత్తిరించి చూశాక, అప్పుడు ఒక విజయగర్వం నాలో కలిగింది.. చాలా తక్కువ ఖర్చులో ( రూ. 40 ) దాన్ని బాగు చేసుకొని, మళ్ళీ వాడుకోనేలా చేసుకోగలిగాను అన్న సంతోషం - ఈ టపా వ్రాయటానికి కారణమయ్యింది. నాకొక పెద్ద కట్టర్ ఉండాలీ అన్న కోరికా నెరవేరింది. పాతగా ఉన్న హ్యాండిల్స్ ని కలరింగ్ చేసుకోవాలి. ఇక యాంగిల్ గ్రైండర్ ని కొనుక్కోవాలి. అదొక కల. అది మొదలయింది కూడా ఈ మధ్యే. ఈ యాంగిల్ గ్రైండర్ నాకు చాలా చాలా పనులలో సాయం చేస్తుంది. క్రొత్త కట్టర్ కొనక మిగిలిన డబ్బులలో దాన్ని తేలికగా కొనుక్కోవచ్చును. అదీ త్వరలోనే కొనుక్కుంటాను. 

నాకు దీన్ని ఇచ్చిన అతనికి ఈ బాగుచేసిన కట్టర్ ని చూపించా. మొఖం వాడిపోయింది.. అనవసరంగా ఇచ్చి, మంచి కట్టర్ ని కోల్పోయి, మరో కట్టర్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చిందీ అని అనుకొని ఉండొచ్చును. 


Tuesday, August 11, 2015

My creation : Tray

నేను చేసిన ట్రే - ఇందులో చిన్న చిన్న వస్తువులని దేనికి దానికి విడిగా పెట్టుకోవచ్చును. ఒక ప్లైవుడ్ చెక్క మీద టేకు పట్టీలని సన్నని మేకులతో, జిగురుతో బిగించి, మధ్య మధ్యన చిన్న చిన్న ముక్కలతో కలుపుతూ, ఇలా తయారు చేశాను.. కేవలం ఒక్కరోజులో చేశాను. సరియైన సామాను ఉంటే కొద్ది గంటల్లో చేసుకోవచ్చు. ఖర్చు కేవలం Rs. 100 లోపే.. ఒక్కో చిన్న గడి 2" x 2" అంగుళాలు ఉంటుంది. 

ఇవన్నీ చేసుకోవడం ఎందుకో పాత టపాల్లో చెప్పాను.. జస్ట్ నన్ను నేను క్రొత్తగా తయారుచేసుకోవాలని అంతే!.. కొన్ని క్రొత్త పనులూ, అభిరుచులూ పెంచుకోవాలనీ.. క్రొత్త విజయాలని పొందాలనీ.. 

ఫోటోలని పెద్దగా చూడటానికి డబల్ క్లిక్ చెయ్యండి. ( ఇంకా పెద్దగా ఎలా చూడాలో త్వరలోనే పోస్ట్ పెడతాను )



Friday, July 3, 2015

నేను చేసిన Jewellery mini Work table

ఈమధ్య నేను చేసిన నా క్రియేటివిటీ ని చూపదలచుకున్నాను. నా మిత్రుడు అడగగా - మిగిలి ఉన్న చెక్కలతో ఒక చిన్న టేబుల్ ని చెయ్యాలనుకున్నాను. 6mm ప్లైవుడ్ ముక్కలు ఉన్నాయి, కానీ పెద్దవీ, కాసింత లావువీ లేవు. వాటిని బయటే కొన్నాను. వాటితో చిన్న టేబుల్ చెయ్యాలని అనుకున్నాను. 

మొదటగా - స్కెచ్ వేసి, కొలతలతో వ్రాసుకున్నాను. ఆ తరవాత ఇంకా కొన్ని మార్పులూ, చేర్పులూ చేశాను. ఆ తరవాత పని మొదలెట్టాను.

ఇదంతా నా క్రియేటివిటినీ, నిర్మాణ కౌశలాన్నీ, క్రొత్త పనులు చేస్తుంటే - జీవితం క్రొత్తగా, తెలీని ఆసక్తీ, ఉత్సాహాన్ని కలిగిస్తుందనే ఆలోచనతో ఇలా క్రొత్త క్రొత్త పనులు మొదలెట్టాను. ఆన్లైన్ లో ఉండటం తగ్గించాను.. అలా మిగిలిన సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నాను. వీలున్నప్పుడల్లా మెల్లిగా, మళ్ళీ మళ్ళీ చేస్తూ, ఇంకా బాగా రావాలని ప్రయత్నిస్తూ, చేసుకుంటూ వెళ్లాను. నిజానికి ఇలా కార్పెంటరీ పని చెయ్యటం నాకు క్రొత్త. అందులో ఏమీ అనుభవం లేదు. కనీస పనిముట్లూ కూడా లేవు. నా కులవృత్తీ కూడా కాదు. అసలు ఆ రంగంలో మా వంశస్థులే లేరు - అంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ రంగం నాకు ఎంత క్రోత్తనైనదో.. అయినా ఇక్కడ ఆసక్తి ప్రధానం. చెయ్యాలన్న ఆసక్తీ.. నా పనితనం మీద నాకున్న నమ్మకం. చేస్తే ఒక టేబుల్ అవుతుంది. లేకుంటే చిన్న టూల్ బాక్స్ లా చేసెయ్యాలని అనుకున్నాను. అలా స్కెచ్ మొదలెట్టాను. ఇలా వేశాను. ఇదే నేను మొదట అనుకున్నది. రఫ్ గా అలా అంచనాలు చేశాను. అలాగే కొలతలు కూడా లెక్కపెట్టాను. ఏది ఎంత ఉంటే బాగుంటుందో అనీ..

Work table sketch

ఆతరవాత దాన్ని మరింత అభివృద్ధి చేసి, ముందు కన్నా బాగా ఉండేట్లు, కొన్ని అంత సౌకర్యవంతముగా లేని అటాచ్మెంట్లూ తీసేసి, తేలికగా ఉండి, ఈజీగా వాడుకోవడానికీ, అవసరమైతే వేరే పనికీ వాడుకోనేలా ఉండాలని అన్నట్లు ఆలోచించి, దానికి తగిన విధముగా మళ్ళీ స్కెచెస్ వేశాను. మరికొన్ని అదనపు సౌకర్యాలు ఆలోచించాను. కానీ అవి నేను చెయ్యగలిగే స్థితిలో ఉన్నా, చేసే వడ్రంగి పరికరాలు గానీ, అనుభవం గానీ నాలో లేకపోయింది.    అందుకే చేసినదానికే మళ్ళీ క్రొత్త సౌకర్యాలు చేసుకొనేలా వాటిని అట్టే పెట్టి ఉంచాను. ఊహల్లో ఉన్న ఆలోచనల్ని ఇతరుల ద్వారా చేయించుకోవచ్చు కానీ మొత్తం నేనే చేశాను అనే సంతృప్తి కోసం ఆగిపోయాను. అలా సాగిన నా ఆలోచనల పరంపర - ఇలా ఫైనల్ స్కెచ్ తో ఆగిపోయింది. అప్పుడు అనుకున్న ఆ టేబుల్ స్కెచ్ ని ఇలా నీటుగా ఒక పేపర్ మీద వేసుకున్నాను. అయిననూ ఆ స్కెచ్ ప్రకారం టేబుల్ చేస్తున్నప్పుడు మరిన్ని మార్పులు చేశాను.  
( Jewellery ) Work table Final sketch

అలా చిన్న టేబుల్ చెయ్యాలనుకున్నాను. చెయ్యటం మొదలెట్టాను. వీలు చేసుకొని నా సమయం అంతా ఆ టేబుల్ నిర్మాణం లోనే గడిపాను. అలా ఒక్కొక్కటీ చేస్తూ పోయాను. చివరికి ఇలా తయారు అయ్యింది. ఈ క్రింది వీడియో చూడండి. అందులో కొన్ని పొరబాటులు ఉన్నాయి. అవి తగిన పరికరాలు ( యాంగిల్ గ్రైండర్, స్పిరిట్ లేవలర్, 90 డిగ్రీల L పట్టీ, చెక్కలని కోసే మిషన్. బీడింగ్ చేసుకొనే మిషీన్, డ్రిల్.... ఇవన్నీ త్వరలోనే కొనాలనుకుంటున్నాను ) లేక, అనుభవం లేక వచ్చే తప్పులు. అవి చేశాక తెలిశాయి. అయినా నా తృప్తి కోసమని చేశాను. ఎలా ఉందో చూసి చెప్పండి.

నా దగ్గర ఉన్న 6mm ప్లైవుడ్ ముక్కలని మేకులతో, చెక్క జిగురు Fevicol తో జత చేశాను. అంత సన్నని చెక్కలని మేకులతో జత చెయ్యడం చాలా కష్టమే. అయిననూ అలాగే చేశాను. కొన్ని మేకులు ప్రక్కకి వెళ్ళిపోయేవి. వాటిని మధ్యలోనే కత్తిరించేసి, అలాగే దిగగోట్టేశాను. లెవలర్, యాంగిల్ లాంటి చిన్న పని ముట్లు లేకున్నా ( చూడటానికి చిన్నవైనా అవి ఉంటే సరియైన ఆకారములో సరిగ్గా వస్తాయి ) అలాగే చేశాను. ల్యామినేట్ షీట్ ని కట్టర్ తో కత్తిరించి, పేపర్ టేపు సహాయాన ( cost : Rs. 20 ) అతికాను. బయట ప్రక్కలు మాత్రం నోవాపాన్ బోర్డ్ ప్లైవుడ్ ని వాడాను. ఆ బోర్డ్ కి అందముగా పెయింట్ వేసి ఉంటుంది కాబట్టి - దానికి ల్యామినేట్ షీట్ అతకాల్సిన అవసరం ఉండదు కూడా. డ్రాలు తేలికగా కదలడానికి చానల్ పట్టీలు ( Sliding channels ) వాడాలని అనుకున్నాను. కానీ డబ్బులు బాగా అవుతాయనీ ( cost : per inch = Rs. 25 ) ఆగాను. పైన మాత్రం ప్లైవుడ్ కి బదులుగా సిమెంట్ బోర్డ్ వాడాను. అలాని ఎందుకూ అంటే - ఆ బోర్డ్ వేడినీ, ఇటు నీటినీ, చిన్న చిన్న దెబ్బలనీ, ఆసిడ్ నీ తట్టుకోవడమే కాకుండా - చాలా ధృడంగా ఉంటుంది.

ఎక్కడెక్కడ ఏమేమి వాడాను, వాటి వివరణలూ, వాటి కొలతలూ అన్నీ ఈ వీడియోలో - మీరు చూస్తున్నప్పుడే అప్పుడే కనిపించేలా పెట్టాను. అన్నట్లు ఈ వీడియోని నేనే తయారు చేశాను.. ప్రక్కన ఉన్న ఫ్యాన్ శబ్దం అంతగా రికార్డింగ్ అవుతుందని తెలీదు. ఆ శబ్దాన్ని ఎడిట్ చేసి, తీసేసే శక్తీ ఇంకా అబ్బలేదు. అదీ నేర్చుకోవాలి.


Tuesday, June 16, 2015

My creation : Tool Box

Tray box, Home theatre box లు తయారు చేసుకున్నాక ఇక మిగిలిన చెక్కముక్కల మీద దృష్టి పడింది. అందులో మిగిలిన చెక్కలతో ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుండగా - వాటితో ఒక టూల్ బాక్స్ Tool Box చేసుకోవాలనిపించింది. ఇక ఆలస్యమెందుకూ.. అనుకొని, రంగంలోకి దిగాను. టూల్ బాక్స్ అంటే - నేను వాడే ముఖ్యమైన పనిముట్ల కోసమని ఒక డబ్బా చేసుకోవాలనుకున్నాను. దానికి పైన ఒక చెక్కమూత కూడా ఉండాలనుకున్నాను. 
  • అలా మూత పెట్టేస్తే అదొక డబ్బాలా Box ఉంటుంది. 
  • లోపలి పనిముట్లు ఎవరికీ కనిపించవు. కాబట్టి వాటిని తీసుకెళ్ళి వాడుకోవటానికి ఎవరూ అడగరు. మన పనిముట్లు మనవద్దే భద్రముగా ఉంటాయి. 
  • మూతపైన ఏమైనా సామానులు పెట్టేసుకోవచ్చును. 
  • అదొక చిన్నసైజు స్టూల్ మాదిరిగా వాడుకోవచ్చును. 

...ఇలా ఆలోచించాక, డబ్బా ఆకారములోనే నా టూల్ బాక్స్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మూలగా ఉన్న ఒక ప్లై వుడ్ ముక్కని - చెయ్యాల్సిన డబ్బా అడుగుభాగముగా తీసుకున్నాను. దానిపైన నాలుగువైపులా నాలుగు ప్లైవుడ్ ముక్కలని మేకులూ, జిగురుతో కలిపి బిగించాను. ఆ తరవాత లోపల భాగములో డేకోలం / లామినేట్ షీట్ ని ఆ లోపలిసైజు కొలత తీసుకొని, దాని ప్రకారం కట్టర్ తో కత్తిరించి, జిగురుతో అతికాను. అది సరిగ్గా అతుక్కోవడానికి చిన్న చిన్న చెక్క బీడింగ్స్ ని సన్నని మేకుల సహాయాన అంచుల్లో కొట్టాను. ఇలా చేస్తే ఆ డేకోలం మీద చిన్న రంధ్రం ఏర్పడుతుంది. కానీ ఆ చెక్క ముక్క వత్తిడివల్ల ఆ ల్యామినేట్ షీట్ బాగా ఆ ప్లైవుడ్ కి అతుక్కుంటుంది. ఆ చిన్న రంధ్రం అంతగా కనిపించదు కూడా.. చాలామంది ఈ పనులకి బరువైన వస్తువులని వాడుతారు. అవి అన్ని చోట్లా సమయానికి దొరకవు. ఈ చెక్కముక్కలైతే ఆ ప్లైవుడ్ వాటిల్లోంచే కోసుకొని వాడుకోవచ్చును. చిన్నదైనా ఈ చిట్కా అమోఘముగా పనిచేస్తుంది. ఫర్నీచర్ వర్క్ చేసేవారు ఈ విషయాన్ని తెలుసుకోవాలని వివరముగా చెప్పాను. ఆ సందర్భములోని ఆ డబ్బా తాలుకు ఫోటో ఇది. ఇందులో అలా కొట్టాక మేకులు కూడా కనిపిస్తాయి. కాస్త పరిశీలనగా చూస్తే - అవి సగం వరకు మాత్రమే లోపలి దిగగొట్టినట్లుగా కనిపిస్తాయి. అలా ఎందుకూ అంటే - పని అయ్యాక వాటిని తేలికగా పట్టకారు పట్టి లాగేయ్యటానికి అన్నమాట. 


ఆ తరవాత లోపలి ప్రక్కభాగాలకూ, వెలుపలి ప్రక్క భాగాలకూ - ల్యామినేట్ షీట్ అతికాను. ఆ ప్లైవుడ్ పైన ఒక ఇంచీ టేకు బద్దలను జిగురూ, సన్నని మేకులూ వాడి, బిగించాను. ఆ తరవాత పైన ఆ లోపలి సైజు కన్నా కాస్త పెద్దగా ఉన్న ప్లైవుడ్ ని హింజీస్ సహాయాన బిగించాను. ఆ ప్లైవుడ్ కి  చుట్టూరా టేకుది హాఫ్ రౌండ్ బీడింగ్ ని కొట్టాను. ఇప్పుడు టూల్ బాక్స్ వాడుకోవటానికి రెడీగా ఉంది. ( క్రిందన ఉన్న ఫోటోని చూడండి ) 


మూతకి లోపల భాగాన కూడా  ల్యామినేట్ షీట్ ని కట్టర్ తో కత్తిరించి అతికాను. కానీ ఆ ముక్క కాస్త చిన్నగా ఉంటే - మధ్యభాగములోకి వచ్చేలా చేసి, చుట్టూరా బార్డర్ గా వేరే రంగులో ఉన్న ల్యామినేట్ షీట్ ని ఆ సైజులో కత్తిరించి అతికాను. ఫలితముగా ఒక క్రొత్త అందం వచ్చింది. ఇప్పుడు మూత ఉన్న టూల్ బాక్స్ అంతా సిద్ధమై - వాడుకోవడానికి రెడీగా ఉంది. 

Tool Box




బాగుందా? నేను బాగా చేశానా ? చేశాననే అనుకుంటాను.. 
నిజానికి నేను కార్పెంటర్ పని నేర్చుకోలేదు.. నా కుల వృత్తీ కూడా కాదు. అందుకు తగ్గ సమానులు కూడా సరిగా లేవు.. ( ఉన్నది - ఒక రంపం, హెక్సా బ్లేడు, సన్నని మొలలు, స్క్రూలు, ల్యామినేట్ షీట్స్, హింజ్స్, టేకు బీడింగ్స్, చిన్న సుత్తె, ల్యామినేట్ షీట్ అతకడానికి జిగురూ, టేపు, ఒక స్కేలు, కొలత పట్టీ.. అంతే - ఇవే సామానులతో ఈ బాక్స్ ని చేశాను అంటే ఎవరూ నమ్మటం లేదు. నన్ను నేను - నా జీవితం క్రొత్తగా కనిపించేందుకు చేసుకుంటున్న ప్రయత్నాలల్లో భాగం ఇది. విజయం సాధించానని అనుకుంటున్నాను. కొన్ని పరికరాలు త్వరలో కొనుక్కుంటాను. వాటితో మరికొన్ని వస్తువులు చేశాక - వాటి గురించీ పోస్ట్స్ పెడతాను ) 

ఇది చేశాక ఒక వడ్రంగి పని చేసే అతన్ని పిలిచి, చూపించా.. ఎలా ఉందనీ ? 

దానికతడు అన్నాడు కదా - " అన్నా! నీవు ఇది ఖచ్చితముగా చెయ్యలేదు.. ఎవరో చేశారు.. నీకు అంత సీన్ లేదు.. " అన్నాడు. " అదేమీ లేదు.. నేనే చేశా.. కావాలంటే చేస్తున్నప్పుడు చూసిన వారిని అడుగు.." అంటూ అప్పుడున్న వారితో ఒక క్లారిటీ ఇప్పిస్తే అప్పుడు నమ్మాడు - నేనే చేశానని. 

Monday, June 8, 2015

My creation : Home theatre Box

నా హోం థియేటర్ Creative 2.1 లో పాటలు వింటుంటాను. అప్పట్లో దాన్ని నేను Rs. 1700 లకి కొన్నాను. దానిలో నాకు నచ్చినది ఏమిటంటే - బాస్ బూస్ట్ అయ్యి, బాగా డీప్ గా రావటం. అలాంటి హోం థియేటర్ కి చిన్న బాక్స్ లా చెయ్యాలనుకున్నాను. నా దగ్గర మిగిలిన - చిన్న చెక్కముక్కలు ఉంటే వాటిని వాడాలనిపించింది. గది లోపలగా ఉండే ఈ హోం థియేటర్ - ముందూ, వెనక భాగాలు మాత్రమే బయటకు కనిపిస్తాయి. ప్రక్కభాగాలు గోడా, వేరే బాక్స్ రావటం మూలాన అవి కనిపించవు. సో, ఆయా భాగాల్లో ముక్కలని జత చేసి, వాడుకోవాలనిపించింది. నిలువుగా ఉన్న ఐదు చిన్న చిన్న చెక్కలని మేకులు కొట్టి, ప్రక్క ప్రక్కగా జత చేశాను. ఇలా చేశాక ఒక పెద్ద ప్లయ్ వుడ్ ముక్కగా మారింది. దాన్ని నాకు కావలసిన సైజులో రంపంతో కోశాను. ( ఆ ఫోటోలు తీసుకోలేదు అప్పుడు )  ముందూ వెనక భాగంలో గాలి తగలటానికి వీలుగా ఓపెన్ చేసి ఉంచేలా ఉండే డిజైన్ ని ఎంచుకున్నాను. ఈ డిజైన్ ని సైజులు తీసుకొని చేసినది కాదు.. ఇంత సైజు ఉండొచ్చు అనుకొని, చేసినది అని ప్రత్యేకముగా చెబుతున్నాను. 

ముందుగా హోం థియేటర్ బాక్స్ ని దానితో బాటుగా వచ్చిన ప్లాస్టిక్ కవర్లో అలాగే ఉంచి ప్యాక్ చేశాను. ( క్రింద ఫోటోలో అలాగే కనిపిస్తుంది ) అంటే దుమ్మూ, ధూళీ ఆ హోం థియేటర్ మీద పడి, అసహ్యముగా కనిపించకుండా ఉండాలనుకున్నాను. అందుకే అలా ప్లాస్టిక్ కవర్ని అలాగే ఉంచి, స్పీకర్ వద్ద మాత్రం గుండ్రముగా కవర్ని కత్తిరించాను. కనెక్షన్స్ పూర్తికి అక్కడ చిన్నగా రంధ్రాలు చేసి, కనెక్షన్స్ వచ్చేలా చేశాను. 

ఆ తరవాత ఆ 12mm చెక్కలని - కలప జిగురూ, మేకులు వాడి బిగించేశాను. పైన ఏదైనా వస్తువులని పెట్టుకోనేలా - టీపాయ్ మాదిరిగా ఉండేలా పాత ప్లైవుడ్ చెక్కని అమర్చాను. దానికి మిగిలిపోయిన డేకోలం ముక్కని ఫెవికాల్ తో అతికాను. ఇలా ఎందుకూ అంటే - రేపు ఎప్పుడైనా ఆ టేబుల్ ని ఆ హోం థియేటర్ కి మాత్రమే కాకుండా వేరే పనులకి కూడా వాడుకోనేలా అనువుగా ఉండాలన్న ఆలోచన. లేకుంటే ఆ టేబుల్ని ఇటు వాడుకోలేం, అటు పారవెయ్యనూలేం. 

ఒక వస్తువు మనకి రెండు, మూడు విధాలుగా పనికొచ్చేలా ఉండాలి. లేకుంటే అవి తెచ్చుకోవడం వృధా అని నాకు అనిపిస్తుంది. వాటిని వాడనప్పుడు ఇంటిని స్టోరేజ్ రూం లా తయారు చెయ్యడం ఎందుకూ అని నా ఆలోచన. అందుకే ఏవైనా క్రొత్తగా వస్తువు కొనేటప్పుడు / చేసుకోబోతున్నప్పుడు ఇలాగే ఆలోచిస్తాను. అలా చేస్తే - మనదగ్గర, చుట్టూ ఎంతో చెత్త నింపుకోలేము. వినడానికి ఫన్నీగా అనిపించినా చాలా ఇళ్ళు - చిన్న స్టోర్ రూమ్స్ గా మిగిలిపోతున్నాయి. మన ఇళ్ళు చెత్తగా, వేరేవారి ఇళ్ళు అందమైన ఇళ్ళుగా కనిపిస్తున్నాయీ అంటే ఇదొక కారణం. అందుకే ఒక వస్తువు బహువిధాలుగా పనికి రావాలన్నది నా అభిమతం. దానివలన మనకి ఒక వస్తువుకి వివిధ ఉపయోగాలు ఉండాలన్నది. 

అలా బిగింపు అయ్యాక - చెక్కల ప్రక్క భాగాలు గరకుగా అసహ్యముగా కనిపిస్తున్నాయని, వాటికి - టేకు హాఫ్ రౌండ్ బీడింగ్ ( Teak Half round beeding ) మిగిలి ఉంటే అవీ కొట్టేశాను. ఇక ప్రక్క భాగాలకి గోల్డెన్ బ్రౌన్ ఎనామిల్ కలర్ మిగిలితే - అదీ పూసేశాను. రాత్రంతా ఆరనిచ్చేసి, మరుసటిరోజున నుండీ ఎంచక్కా వాడుకుంటున్నాను. 

ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. ముందు, వెనకాల భాగాల ఫోటోలని మీరు చూడవచ్చును. ఫోటోలు అంత క్లారిటీగా లేనందులకు మన్నించాలి. మొబైల్ కేమరాని వాడాను. 






Thursday, June 4, 2015

Wooden trays

హ్మ్!.. రోజులన్నీ బోరుగా, నిరాసక్తముగా సాగిపోతూ...నే ఉన్నాయి. ఇలా అయితే నాకూ, మెషీన్ కీ పెద్ద తేడా తెలీకుండా అయిపోయేలా అనిపించింది. ప్రొద్దున్నే లేవడం, వాకింగ్ వెళ్లడం, రావడం,టీ, టిఫినీ కానిచ్చేసేయ్యడం, ఆ తరవాత నెట్ లో కాస్త విహారం.. మళ్ళీ రాత్రి కాసేపు నెట్ చూసి, తిని తొంగేయ్యడం.. ఇంతేనా జీవితం అంటే? కాదు.. ఇది కాదు నా జీవితం అనిపించింది. పరమ రొటీన్ గా ఉండే ఇది కాదు.. వేరేదేదో నాకోసం ఎదురుచూస్తున్నది. ఏదైనా క్రొత్త వ్యాపకం పెట్టుకోవాలి. తద్వారా ఈ ఆన్లైన్ కి రావటం తగ్గించాలి. నా ప్రియ స్నేహితునికి ఇచ్చిన మాట నెగ్గించాలి. నా జీవితాన్ని క్రొత్తగా ఆకర్షణీయముగా ఉండేలా మొదలెట్టాలి అని అనుకున్నాను. 

ఏమున్నాయి అలా అని ఆలోచిస్తుంటే - మూలగా ఫర్నీచర్ చెయ్యగా మిగిలిన ప్లైవుడ్ ముక్కలు కనిపించాయి. వాటిని ఏమైనా పనికొచ్చే వస్తువులుగా మార్చాలనుకున్నాను. నిజానికి నాకు ఈ వడ్ల / వడ్రంగి ( Carpenter ) పని రాదు. వేరేవారు చేస్తున్నప్పుడు చూశాను.. ఇది చాలా ఈజీగా అనిపించింది. ఎక్కడో చిన్న మెలికలు తప్ప అంతా ఈజీగా కనిపించింది. కొలతలు సరిగ్గా తీసుకొని, ముక్కలుగా కోసి, దగ్గరగా చేర్చటం వస్తే కొద్దిగా పనితనం వచ్చేసినట్లే! 

నామీద నాకు నమ్మకం వచ్చేంతవరకూ - ఏది ఎలా చెయ్యాలో, ఎలా చేస్తే నేను అనుకున్న పద్ధతిలో వస్తుందో మనసులోనే రిహాల్సల్స్ చేశాను. నా జీవితాన ఇదే మొదటి వడ్రంగి పని కాబట్టి - చిన్నదీ + తేలికైన పనిని ఎంచుకున్నాను. ఇలా ఎంచుకోవడానికి గల కారణమూ చిన్నదే - కానీ అది చేసే మేలు చాలా పెద్దది. నేనూ చెయ్యొచ్చు, నాకూ ఫర్నీచర్ చెయ్యవచ్చు అని నామీద నాకు నమ్మకం ఏర్పడేలా ఉండాలనుకున్నాను. 

మూలగా పడిఉన్న ఒక 6mm దీర్ఘ చతురస్రాకార ప్లైవుడ్ ముక్కని తీసుకున్నాను. రెడీమేడ్ గా దొరికే టేకు ప్లాట్ 1.5" అంగుళాల వెడల్పు గల ( 38mm ) బీడింగ్ కోసం వెదికాను. ఒక ఫర్నీచర్ షాపులో దొరికింది. దానిని వాడి, ఒక ట్రే బాక్స్ గా చేసుకోవాలనీ, అందులో ఏమైనా వస్తువులు వేసుకోనేలా ఉండాలనీ అనుకున్నాను. ఒక ఫీట్ పొడవుకి మూడు రూపాయలు. ఆరుఫీట్ల బీడింగ్ కి పద్దెనిమిది రూపాయలు తీసుకున్నాడు. 

ఇంటికి వచ్చాక నేను చెయ్యవలసిన ట్రే సైజు కొలిచా.. అది నాలుగు అడుగుల చుట్టుకొలత ఉంది. సరిగ్గా కొలతలు తీసుకుంటూ ఆయా సైజుల్లో ఈ బీడింగ్ ని హెక్సా బ్లేడు ముక్కతో కోసాను. ఆ తరవాత ఆ బీడింగ్ ని నాణ్యమైన చెక్క జిగురుని వాడి, ఆ 6mm ప్లైవుడ్ కి ఆనించి, సన్నని Headless nails ( తల లేని సన్నని మేకులు ) తో కొట్టాను. అలా మిగతా మూడు వైపులా చేశాను. అలాగే ఈ బీడింగ్ చెక్కలనీ కలిపేలా సన్నని మేకులు కొట్టాను. ఒక రాత్రంతా అలాగే వదిలేశాను. 

మరుసటి రోజున - నా దగ్గర ఆంగిల్ గ్రైండర్ ( Angle grinder )లేని కారణాన - ఒక గరకు కాగితముతో ఆ ట్రే ను నున్నగా తయారుచేశాను. మూలల్లో బాగా రుద్దాల్సివచ్చింది. ఆ తరవాత లోహ వస్తువులకి వాడే మెటల్ గ్రే కలర్ లప్పం ( Grey coloured knife paste for metals ) అంతటా పూసి,ఆరనిచ్చాను. ఆ తరవాత మళ్ళీ ఒకసారి - నీళ్ళల్లో ముంచిన wet and dry emery paper 180 no. తో బాగా రుద్దాను. ఇప్పుడు ట్రే మీద ఉన్న ఎక్కువైన లప్పం అరిగిపోయి, నున్నగా తయారయ్యింది. అదే ఇలా ఈ క్రింది ఫోటోలో మాదిరిగా ఉంది. 


ఇలా అయ్యిన ట్రేని చూశాక చాలా ముద్దుగా అనిపించింది. నామీద నాకే నమ్మకం కలగసాగింది. నాకు ఇంత బాగా చెయ్యడం వచ్చా? అనిపించింది. మరింత రెట్టించిన ఉత్సాహముతో ఆ చెక్క ట్రేని మరింత అందముగా చేసుకోవాలనిపించింది. నాకు అందుబాటులో ఉన్న పెయింట్లని కలిపి, లోపల తేలిక రంగు, బయట గోల్డెన్ బ్రౌన్ రంగునీ  - మల్టీ కలర్ గా వేశాను. అలా రెండో కోటింగ్ నీ వేశా. ఆ తరవాత ఇలా తయారయ్యింది. 


ఈ ట్రేని వాడుకోక బుద్ధి కాక, నా మొదటి చెక్క పనితనం కి గుర్తుగా అలాగే దాచుకున్నాను. దీన్ని చూసి, తెలిసినవాళ్ళు కొందరడిగితే వారికీ చేసిచ్చాను - ఏదో మామూలుగా ఉండేలా. ఇంత బాగా మాత్రం వారికి చేసివ్వలేదు. కారణం : నా ట్రే నే బాగుండాలని కోరిక కాబోలు.  

Related Posts with Thumbnails