Showing posts with label మీతో చెప్పాలనుకున్నవి. Show all posts
Showing posts with label మీతో చెప్పాలనుకున్నవి. Show all posts

Sunday, December 5, 2021

Narsapur Forest Urban Park.

ఈమధ్యనే నేను అనుకోకుండా బాలానగర్, హైద్రాబాద్ నుండి క్రొత్తగా వేసిన నేషనల్ హైవే నంబర్ 765D గుండా వెళ్ళాను.. దారిలో నర్సాపూర్ ఆటవీప్రాంతం గుండా వెళ్ళాను. ఇది నర్సాపూర్ పట్టణానికి దగ్గరలో ఉంటుంది. 

అటవీ ప్రాంతం గుండా వేసిన రోడ్డు కాబట్టి, ఎన్నెన్నో మలుపులున్న స్టేట్ రోడ్డుని ఈమధ్యే నేషనల్ హైవే గా మార్చారు. ఆరోడ్డు మీదుగా వస్తుండగా దారిలో ఇలా అర్బన్ పార్క్ కనిపించింది. ఒకసారి వెళ్ళి చూద్దామనిపించి, బండిని ప్రక్కగా పార్క్ చేసాను. ఇదిగో ఆ అర్బన్ +అటవీ పార్క్ ముఖ ద్వారం. 


ఆ ప్రక్కనే ఉన్న టికెట్ బుకింగ్ కౌంటర్ లో టికెట్ తీసుకున్నాను. ఎంట్రన్స్ ఫీ 50 రూపాయలు. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5 వరకూ తెరచి ఉంటుంది. మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫోటో ని చూడండి. 

అలా తీసుకొని, లోపలికి వెళ్ళితే మొదటగా ఇలా కనిపిస్తుంది. 

కొద్దిదూరంలో అడవిలోకి వెళ్ళటానికి దిగువగా మెట్లుంటాయి. ఈ క్రింది చిత్రంలో బుకింగ్ ఆఫీస్ ని చూడవచ్చు. 

ఇక్కడ నుండి ఆ మెట్లమీదుగా అడవిలోకి ప్రయాణం మొదవుతుంది. 

ఆ మెట్లు దిగాక వెనక్కి చూస్తే ఇలా ఉంటుంది..


ఎడమగా మనకు ఒక రాతి అడ్డుకట్ట ఉన్న కాలువ కనిపిస్తుంది. 

ఇది ఈ ఎండాకాలంలో ఆ కాలువ ఎండిపోయి ఉంటుంది. వర్షాకాలంలో నిండుగా పారుతూ ఉంటుంది అనుకుంటాను. 

ఇదే ఫారెస్ట్ లోకి వెళ్లే దారి.. 

ఎంట్రన్స్ కుడి ప్రక్కన ఇలా ఉంటుంది. 

అటవీ పార్క్ లోపలికి వెళ్లేందుకు వేసిన మెట్లు 

ఇలా ఈ దారిలో మన నడక మొదలవుతుంది. 

అలా వెళుతుండగా ఇలాంటి వాగు కనిపిస్తుంది.  

Sunday, February 17, 2019

Ink pen



నాకున్న జ్ఞాపకాల్లో ఇదీ ఒకటి. ఈ ఫోటో నాకు గూగుల్ వారి ఫొటోస్ లలో దొరికింది. నాకున్న జ్ఞాపకాలని మీతో పంచుకోవాలని ఈ పోస్ట్.

పైన ఫోటోలో ఉన్నది ఒక పెన్. పెన్ అంటే ఇప్పటిలా వాడే జెల్ మరియు బాల్ పాయింట్ పెన్ కాదు. ఇంక్ / సిరా / శాయి పెన్. శాయి అంటే సిరా అని మరొక పేరు. పల్లెటూరి జనాలు ఎక్కువగా ఈ పదాన్ని వాడేవాళ్ళు. ఇప్పటి తరం వాళ్ళకి ఆ పెన్ గురించి అస్సలే తెలియదు. వారికోసం అని ఈ పోస్ట్. ఆ పెన్నులో రిఫిల్ అంటూ ఉండేది కాదు. పైన ఉన్న స్టీల్ క్యాప్ ని తీస్తే, క్రిందన ఒక చివర పాళీ / Nib ఉన్న పెన్ను ఉండేది. దాన్ని పట్టుకునే దగ్గర - రెండు చివర్లో గట్టిగా వ్యతిరేక దిశల్లో త్రిప్పితే - లోపల ఒక గొట్టం లాగా కనిపించేది. అందులో ద్రవరూపంలో ఉండే సిరాని / ఇంకుని జాగ్రత్తగా పోసేడి వాళ్ళం. అలా పోశాక మూతని బిగించి, ఒకసారి విదిలించి, ఇక వ్రాత పని మొదలెట్టే వాళ్ళం.

పైన ఉన్న పెన్ రెండు మోడల్స్ లలో దొరికేది. అప్పట్లో ఆ పెన్ రూపాయికి మరియు రూపాయిన్నరకి ( Rs.1.50 )  వచ్చేది. ఈ రూపాయి పెన్ లో ఆ పెన్ లో సిరా ఎంత ఉందో చూసుకోనేలా ఒక పారదర్శక ప్లాస్టిక్ ( Transparent ) భాగం ఉండేది. అందులోంచి ఆ పెన్ లో ఉన్న సిరా చక్కగా అగుపించించేది. దానివలన ఆ సిరా వల్ల మనం ఎంతగా వ్రాసుకొనే వాళ్ళమో ఒక అంచనాకి వచ్చే వాళ్ళం.



ఇక రూపాయిన్నర ఖరీదు పెన్ లో ఈ ట్రాన్స్ప రెంట్ ప్లాస్టిక్ భాగంతో పాటూ - ఆ బుడ్డి వెనకాల ఒక ఇంకు పిల్లర్ లాంటి ఆకారంలో ఒక రబ్బరు తిత్తి ఉండేది. పెన్ పాళీని సిరా బుడ్డిలో ఉంచి, వెనకాల ఉన్న ఈ తిత్తిని నొక్కితే - ఆ పెన్ లో ఉన్న గాలి బయటకి వెళ్ళిపోయి, ఆ తిత్తి సరి అయ్యే క్రమంలో ఆ పెన్ లోకి ఇంకు నీ పీల్చేది.( Sucking ) అలా ఆ పెన్ లోకి సిరాని నింపడం చాలా తేలిక అయ్యేది. కాస్త స్థోమత గల వాళ్ళందరూ వీటినే ఎక్కువగా వాడేవాళ్ళు. అప్పట్లో ఈ ఇంకు ని చేతి క్రింది పని వారే నింపి, పెన్ ని వ్రాత పనికి సిద్ధముగా ఉంచే వాళ్ళు. ఈ పెన్ మాడల్ రాక ముందు పెన్ లోకి నేరుగా సిరా బుడ్డితో సిరాని వంపుతూ... కారి చేతులూ, పేపర్లూ, నోట్సూ, టేబులూ, నేలా, వేసుకున్న దుస్తులూ.. పాడయ్యేవి. అలాంటి ఇబ్బందిని ఈ పెన్ తొలగించింది. ఇలాంటి సిస్టం ఉన్నమరొక పెన్ - Hero పెన్. ఇది చైనా తయారీ. దీని గురించి ఇంకో టపాలో తెలుసుకుందాం.

ఈ పెన్ కి పాళీలు మొదట్లో బంగారు వర్ణములో వచ్చేవి. వీటి ప్రభావం చివరల్లో స్టీలు రంగులో కూడా వచ్చాయి. ఇవి ఇదు పైసల నుండి పావలా వరకు ఉండేవి. అప్పట్లో ఈ పాళీలని ( NIB ) పత్తీలని అని కూడా అనేవాళ్ళు. దానితో ఈ పెన్ లని పత్తి పెన్ లని అనేవాళ్ళు. ఈ పత్తికి / పాళీ కి చివరన ఒక పాయింట్ ఉండేది. కాస్త లావుగా వ్రాయాలంటే పాళీ ని గట్టిగా వత్తితే ముందు భాగం కాస్త సందు వచ్చి, కాస్త లావుగా వ్రాసేది. ఒక్కోసారి ఇలా వత్తితే పెన్ పాళీ విరిగేది కూడా. పెన్ క్రిందన పడ్డప్పుడు కూడా పెన్ ములికి ( పాళీ ) విరిగేది కూడా.

ఇక ఇంకు నింపాక వెంటనే వీటితో అంటే ఈ సిరా పెన్ లతో వ్రాయటం కష్టం అయ్యేది. అందుకు కారణం - ఆ సిరాలో కాస్త గాలి చేరి, ఆ గాలి బుడగ వ్రాసేటప్పుడు ఆ పాళీ లోకి వచ్చి, ఇంకు ని ప్రవహించనీయకుండా చేసేది. అంటే Air Lock / ఎయిర్ లాక్ అయ్యేది అన్నమాట. అలాంటి సమయాల్లో పెన్ ని విదిలించే వాళ్ళు. అప్పుడు ఆ సిరా ఆ ఎయిర్ / గాలిని తోసుకుంటూ వచ్చి, కాస్త బయటపడేది. ఇలా పడటం ఒక్కోసారి ఎదుటి వ్యక్తుల మీదో, బట్టల మీదో పడేది అన్నమాట. వీటి వల్ల ఇదొక ఇబ్బంది అన్నమాట.

పై ఇబ్బందిని తొలగించటానికి ఆ తరవాత కనుకున్నదే - ఇంకు పిల్లరు. ఇది ప్లాస్టిక్ తో చేసి, వెనకాల ఒక చిన్న గాలి బుడగ తిత్తి ఉండేది, దాని సహాయాన ముందు భాగాన్ని సిరా బుడ్డిలో ఉంచి, వెనకాల భాగాన్ని నొక్కితే అందులోని గాలి బయటకి పోయి, ఆ స్థానాన, ఇంకు చేరేది. అప్పుడు ఆ పిల్లరు లోని ఇంకుని పెన్నులోకి పెట్టి వత్తితే - ఆ ఇంకు పెన్ లోకి సురక్షితముగా వెళ్ళేది.

ఒక్కోసారి ఈ ఇంకు పిల్లర్ లేని స్థానంలో - సిరా బుడ్డి సహాయాన నేరుగా ఇంకు ని పోసి, అప్పుడు మూత కాస్తంత బిగించి, పెన్ ని నిలువుగా, పాళీ ని సిరా బుడ్డిలోకి వచ్చేలా నిలబెట్టి, పెన్ కి మూత బిగించే వాళ్ళు. అలా చేస్తే - ఆ పెన్ లోని గాలి మాయమై. ఎక్కువైన సిరా కూడా బయటకు వచ్చేది. ఈ క్రమంలో ఆ పెన్ సిరా కాలువ శుభ్రం అయ్యి, పెన్ సాఫీగా వ్రాసేది.

ఈ బిగించే కార్యక్రమం ఎక్కువగా చేతులతో అయ్యేది.. బలం సరిపోనప్పుడు - నోటిలోని పళ్ళతో బిగించి, తిప్పెడి వాళ్ళు. ఒక్కోసారి అప్పుడు సిరా కారి, నోరంతా సిరామయం అయ్యేది. ఆ పెన్ ని పక్కన పెట్టి, నోరుని పుక్కిలించి, కడిగేవాళ్ళు.

ఇవీ నా ఇంకు పెన్ జ్ఞాపకాలు.



Friday, January 18, 2019

LED Tube lights

https://achampetraj.blogspot.com/2019/01/electronic-choke-tube-lights.html తరువాయి భాగం 

LED ట్యూబ్ లైట్స్ - ఇప్పుడు ఎక్కువ చోట్ల వాడటం మొదలయ్యింది. ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్స్ తరవాత వచ్చిన చక్కని విద్యుత్ కాంతి దీపాలు. మొదట్లో ఇవి పెద్ద పెద్ద ఎలక్ట్రికల్ షాప్స్ లలో  లేదా ఆన్లైన్ అంగళ్ళలో మాత్రమే లభించేవి. అప్పట్లోనే ఒక ట్యూబ్ లైట్ తెచ్చాను. వాటి ధర బయట వేయి రూపాయలుగా, ఆన్లైన్ లో ఏడువందల యాభై చిల్లరలో దొరికేవి.

అప్పట్లో వాటి గురించి అంతగా అవగాహన లేదు.. ఏమిటి ? ఎలా ? ఎందుకు? అనేలా. వాడితే బాగుంటాయేమో అనుకొని వాడా.. కానీ అప్పట్లో టెక్నాలజీ ఇప్పట్లో ఉన్నంత అభివృద్ధిలో లేదు. ఆ LED ట్యూబ్ లైట్ నుండి వచ్చే కాంతి - మామూలు ట్యూబ్ లైట్ కాంతి అంతగా కూడా లేదు. ఒక సెట్ లో రెండు LED ట్యూబ్ లైట్స్ వచ్చేవి. ఆ రెండూ వాడితే ఒక మామూలు ట్యూబ్ లైట్ వెలుతురు అన్నంతగా ఉండేది. అప్పట్లో వాటి గురించి అంతగా టెక్నికల్ గా ఎదగలేదు. ఇప్పుడు చాలా కొద్దిగా తెలుసుకున్నాను. అవి మీకేమైనా ఉపయోగపడతాయని ఇప్పుడు చెప్పడం.

 ధర  :   : మొదట్లో బాగా ఎక్కువ ధరలో ఇవి మార్కెట్లలోకి వచ్చినా ఇప్పుడు చాలా అందుబాటు ధరల్లో దొరుకుతున్నాయి. రెండు వందల నుండి మూడు వందల యాభై రూపాయల్లో దొరుకుతున్నాయి. వీటి వల్ల మామూలు ట్యూబ్ లైట్స్ సెట్స్ ధరలు బాగా పడిపోయి, వందా యాభై లలో దొరుకుతున్నాయి. ఒకవేళ మీ మామూలు / ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్ పాడయితే - ఇదే మంచి తరుణం అనుకోని వెంటనే ఆ ట్యూబ్ సెట్ ని మార్చేసి, ఈ LED ట్యూబ్ కి మారిపోవడం చాలా మంచి పని చెప్పవచ్చు. నేనైతే అంత సమయం తీసుకోలేదు.. దాదాపు పది ట్యూబ్ లైట్స్ ని తీసేసి, కొంత సమయం తీసుకొని, ఎంచక్కా ఈ LED మారిపోయా.. అంతగా టెంప్ట్ అయ్యా..

ఇక్కడ ఒక చిన్న షాపింగ్ చిట్కా చెప్పబోతున్నా - అన్ని ట్యూబ్ సెట్స్ ఒకేసారి తీసుకొనే బదులు - కొంతకాలం అంతరం ఇస్తూ - అప్పుడొకటి, ఇప్పుడొకటి అనేలా కొంటే - తక్కువ ధరా, ఎక్కువ మన్నిక ఉన్నదీ, ఎక్కువ వెలుతురు ఉన్నదీ, మరింత అనుకూలమైన ఆకారంలో, అందమైన రూపం లో ఉన్నదీ.. దొరుకుతుంది. ఇలా ఒక్క ట్యూబ్ సెట్స్ అనే కాదు. అన్ని వస్తువులూ ఒకేసారి కొనవద్దు. కొంత గ్యాప్, అంగడీ / దుకాణం మారిస్తే చాలా అద్భుత ఫలితం దొరుకుతుంది.  నేనిలాగే కొనడం మొదలెట్టాను. ఫలితంగా మంచి షాపింగ్ ఫలితాన్ని పొందుతున్నాను. ఒకే ఒక దుకాణంలో నేను కొనుగోలు చేస్తాను అని చెప్పుకోవడం గొప్పగా ఉండొచ్చు కానీ - వారు చాలా చాలా అవకాశాల్ని కోల్పోతారు..

ఆకారం / బరువు :   ఈ సెట్ల బరువు చాలా తక్కువ. సాంప్రదాయ ట్యూబ్ లైట్స్ సెట్ల కన్నా - ఎలక్ట్రానిక్ సెట్స్ చాలా తక్కువ బరువు అనుకుంటే - ఈ LED సెట్లు మరీ తక్కువ బరువు. అలాగే వాటి కన్నా కొద్దిగా తక్కువ పొడవు, మరింత సన్నగా ఉంటాయి. ఇంత సన్నగా ఉన్న ట్యూబ్ నుండి - గదికి సరిపడే వెలుతురు వస్తుందా ? అనే ఆలోచన కలగటం సహజం. కానీ చాలా బాగా వెలుతురు వస్తుంది. మరొక విషయం కూడా గమనించవచ్చు - అందమైన గదికి దీని అమరిక వల్ల మరింత అందమూ, వెలుతురు వల్ల ఆ గదిలోని వస్తువులు మరింత ప్రకాశవంతముగా కనిపిస్తాయి.

 మన్నిక / వారంటీ :  ఇవి చాలా మన్నికనిస్తాయి. కనీసం ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల వారంటీ వాటికి ఉంటుంది. ఈ సమయంలో ఆ సెట్ పాడయితే - దాన్ని రిపేర్ చెయ్యాల్సిన అవసరం లేదు. ఎంచక్కా ఎక్కడైతే కొన్నామో అక్కడే ఇచ్చేస్తే - ( బిల్ చూసి, గడువు మించకుండా ఉన్నట్లయితే ) వెంటనే చెక్ చేసి, మరొక ట్యూబ్ లైట్ ఇస్తారు. ఈ సదుపాయం వల్ల మనకు డబ్బు ఆదా అవుతుంది. ఇక్కడ మీకు మరొక చిట్కా - ఈ సదుపాయాన్ని వాడుకోవాలి అనుకుంటే - ఎంచక్కా స్థానికంగా కొనడమే మంచిది. అదే ఆన్లైన్ గానీ / దూరముగా ఉన్న పట్టణం నుండి కొన్నట్లయితే - అక్కడికి వెళ్ళి గానీ / పార్సెల్ చేసి గానీ ఇంకొకటి పొందాల్సి వస్తుంది. ఇది వ్యయ ప్రయాసతోటి కూడుకున్నది. మరొకటి వచ్చేవరకూ అంతవరకూ దాన్ని వాడిన గది చీకట్లో ఉంచలేం కదా.. అందుకే కొన్ని వస్తువులను స్థానికముగానే కొనాల్సి ఉంటుంది.

 వెలుగు :  ఈ LED ట్యూబ్స్ చాలా ప్రకాశవంతముగా వెలుగుని ఇస్తాయి. కాంతిని కొలిచే కెల్విన్ తాపమానం ( Kelvin Temparature ) లో చెప్పాలీ అంటే ఇవి 6500‍‍‌‍‌‌‍‌‌‍k ప్రకాశవంతం గా ఉంటాయి. క్యాండిల్ / మైనం వత్తి 1000k వెలుగునిస్తే - సూర్యుడు 5500k ప్రకాశవంతాన్ని ఇస్తాడు. అంటే ఎరుపు / ఆరెంజ్ రంగు నుండి క్రమక్రమంగా పసుపులోకి మారి ఆతర్వాత తెలుపుగా మారుతుంది. మామూలు విద్యుత్ దీపం లేత పసుపు రంగులో వెలుతురునిస్తాయి. ట్యూబ్ లైట్ వెలుతురులో తెల్లని బట్టలను చూసేదానికన్నా - ఈ LED దీపాల వెలుతురులో మరింత తెలుపుగా కనిపిస్తాయి. అందుకే వ్యాపార సంస్థలు వీటిని బాగా వాడుతున్నాయి. మిగతా అన్నింటికన్నా - ఒక వాట్ విద్యుత్ కి - చాలా ఎక్కువ / దాదాపు ఒక వంద లూమెన్స్ ( కాంతిని కొలిచే ప్రమాణం ) ని ఇస్తాయి. ఇదే వీటిల్లో కీలకమైన అంశం.

 లూమెన్స్ :   ల్యూమెన్స్ Lumens అనేది ఈ విద్యుత్ కాంతి పరికరములలో చాలా ప్రధాన అంశం. అస్సలు ఈ పోస్ట్ లో చెప్పాల్సింది అంతా దీని గురించే. LED సాంకేతికత విషయాల్లో అన్నింటికన్నా ఎక్కువ పట్టించుకోవాల్సిందీ ఈ విషయమే. లూమెన్స్ అనేది ఒక విద్యుత్ కాంతి పరికరము నుండి వచ్చే వెలుతురు ఎంత మొత్తంలో వస్తుందో దీనిని ప్రమాణముగా చెబుతారు. మామూలుగా ఇప్పుడు వచ్చే LED కాంతి పరికరాలు ఒక వాట్ విద్యుత్ ని ఉపయోగించుకొని 100 లూమెన్స్ కాంతిని ఇస్తాయి. అంటే 20w వాట్ల LED ట్యూబ్ మనకు 2000 లూమెన్స్ వెలుతురుని ఇస్తాయన్నమాట. ఇవి ఎంత ఎక్కువగా ఉంటే అంత కాంతిని ఇస్తాయన్నమాట.

ఎలాగూ ఈ లూమెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం  కదా.. మరింత వివరముగా చెబుతాను.

ఈ లూమేన్స్ ని మనం అస్సలు విలువ / అంచనా కట్టలేం. వీటిని నిర్దారించాలంటే - తగిన పరికరాలు అవసరం. సదరు కంపనీ వాళ్ళే వీటిని ముద్రిస్తారు. వీటిని తెలుసుకోవటానికి ఆయా విద్యుత్ కాంతి పరికరాల మీద వచ్చే డబ్బా / కార్టన్ / ప్యాకేజ్ మీద ఉన్న వివరాలే ముఖ్యమైన సమాచారం. కొనేటప్పుడు "ఏదో ఒకటి.. అన్నీ అంతేలే.." అంటూ కొంటే మీరే మీకు తగిన వస్తువు తీసుకోలేక పోతున్నారు అని అర్థం.

గుర్తింపు లేని కంపనీలు / ఇతర దేశాల నుండి బల్క్ గా దిగుమతి చేసుకోబడిన వాటి మీద ఈ వివరాలు అస్సలు ఉండవు. ఇలాంటి కంపనీల కవర్ల మీద చాలా ఎక్కువగా లూమేన్స్ ఉన్నట్లు ప్రచురిస్తాయి. కానీ అవి వాస్తవంలో అబద్హాలు - మనం మోసపోయాం అని వాటి వాడుకలో తెలుస్తుంది. తిరిగి వాపస్ ఇవ్వాలంటే - పాడేసిన కవర్. దూరాభారాలు / తగిన సమయం / ఓపిక.... ఇత్యాది కారణాల వల్ల ఇవ్వలేక పోతాం. అలా కొద్దిగా మానసిక అశాంతికి గురి అవుతాం. ఇక్కడ మీకో చిన్న టిప్ ఇస్తాను.

వస్తువు తయారీ సంస్థ చిరునామా ఏదో చిన్నగా - LED Industries, Delhi - 10 అన్నట్లు కాకుండా, వివరముగా ( రోడ్ పేరు, ఏరియా పేరు, పోస్టల్ కోడ్, కస్టమర్ కేర్ నంబర్... ) ఉన్నట్లయితే వాటిని నమ్మవచ్చు. అవి లేని సంస్థల వివరాలని నమ్మి మోసపోవద్దని నా సూచన. ఒకసారి కొన్నాక చాలా కాలం మన్నిక వస్తాయి - కానీ వెలుతురు తక్కువగా ఉండి, వాటిని వాడే కాలమంతా ఏదోలా అనిపిస్తుంది.

వీటిల్లో గొప్ప బ్రాండెడ్ వస్తువులే బాగుంటాయి అని అనుకోవద్దు.. ఒక్కోసారి మామూలుగా ఎప్పుడూ వినని బ్రాండ్ లూ కూడా బాగుంటాయి. కాకపోతే కంపనీ అన్ని వివరాలు + లూమెన్స్ వివరాలు ఉంటే - పరిశీలించి కొనొచ్చు.

మొదట్లో కొన్న ఒక ట్యూబ్ అమెజాన్ సంస్థలో కొన్నాను. కానీ అప్పుడు ఈ లూమేన్స్ గురించి తెలీదు. రెండు LED ట్యూబ్ లైట్స్ వాడితే ఒక  సంప్రదాయ ట్యూబ్ వెలుతురుని ఇచ్చాయి / ఇస్తున్నాయి. అంటే అంత తక్కువ కాంతిని వాటివల్ల పొందుతున్నాను. కానీ నేను కొన్నప్పుడు అవే మంచి బ్రాండ్స్. రెండు సంవత్సరాల క్రిందట మరొకటి స్థానికముగానే కొన్నాను. అక్కడ 20w ట్యూబ్ వాడుతున్నాను. ఈ LED ట్యూబ్ వాటికన్నా బాగా కనిపించింది. చిన్న ట్యూబ్ కీ దీనికి తేడా ఎందుకూ అని అంత పరిశీలన చెయ్యలేదు. ఒక పది రోజుల క్రిందట - మామూలు ట్యూబ్ బాగున్న స్థానంలో - ఏదో క్రొత్త కంపనీ LED ట్యూబ్ బిగించి వాడాను.

ఆశ్చర్యం. ఆ ట్యూబ్ కన్నా ఈ LED ట్యూబ్ వెలుతురు మరింత చాలా బాగా ప్రకాశవంతం గా ఉంది. అస్సలు ఆ పెద్దగదిలో రెండు ట్యూబ్ లైట్స్ వాడాల్సింది. 40w + 40w = 80w/గంట ని వాడాల్సింది.. కానీ ధైర్యం చేసి, ఈ ఎన్నడూ పేరు వినని Make in India కంపనీ అయిన ఒక సంస్థ ( అడ్రెస్స్ పూర్తిగా ఉంది ) ట్యూబ్ ని కొన్నాను. ఇందులో నాకు బాగా నచ్చిన అంశం - ఈ ట్యూబ్ - 28w - హా.. నిజమే. క్రొత్తగా వస్తున్నాయి. మార్కెట్లో ఉన్న 20w LED ట్యూబ్ ల కన్నా ఇవి 8w వాట్లు ఎక్కువ. ఫలితం - మరో 800 లూమెన్స్ కాంతిని అదనముగా అదే పరికరం ద్వారా పొందుతాను ( 28w x 100 = మొత్తం 2800 Lumens ) మరొక విద్యుత్ కాంతి పరికరం బిగించాల్సిన అవసరం లేదు. అందువల్ల దీనికే మొగ్గు చూపాను.

దాన్ని బిగించి వాడి చూశాను. అంతకు ముందున్న ఎలక్ట్రానిక్ ట్యూబ్ కన్నా మరింత వెలుగు.. అవాక్కయ్యావా ? అన్నట్లు. నిజమే.! రెండు ట్యూబ్స్ వాడే చోట్ల ఒక్క ట్యూబ్ తోనే సరిపోయింది. అదీ చాలా వెలుతురుతో. ఈ కాంతిలో తెలుపురంగు మరింత కాంతితో కనిపించసాగింది.

మా గదిలో రెండు సంప్రదాయ ట్యూబ్స్ = 40w + 40w = 80w
( - ) ఒక LED ట్యూబ్ 28w
------------------------------------------
( 80w - 28w ) = 52w/ hour మిగులు అన్నమాట
రోజుకి నాలుగు గంటలు వాడినట్లయితే = 52 x 4 = 208w మిగులు
అదే నెలకి అయితే = 208w x 30 రోజులు = 6240w = 6.240kwh
యూనిట్ వెల Rs. 5 అనుకుంటే
6.240kwh x 5 = Rs. 31.20 మిగులుతుంది.
ఈ ట్యూబ్ ధర నేను Rs. 320 పెట్టి కొన్నాను ( 20w వి Rs. 230 నుండి Rs. 260 వరకూ లభిస్తున్నాయి )
దాదాపు పది నెలల్లో ఆ ట్యూబ్ కి అయిన ఖర్చు మొత్తాన్ని తిరిగి పొందుతున్నాను అన్నమాట.

ఈ లెక్కలు - భారీ బంగ్లాల్లో, ఆఫీసుల్లో బాగా పనికివస్తాయి. మామూలుగా అయితే అంత ఆదా కనిపించదు. వెలుతురు కోసమైతే కొనక తప్పదు.

ఇక్కడ ప్రధానముగా గమనించాల్సింది - పైన చెప్పిన టిప్స్ ని పాటించాను.. మళ్ళీ వాటిని గుర్తుచేస్తున్నాను..

  • ఒక వస్తువు మార్కెట్లోకి రాగానే వెంటనే కొనవద్దు. 
  • ఆ వస్తువు గురించిన వివరాలు తెల్సుకోవాలి. 
  • పేరొందిన కంపనీ అని చూడాల్సి వచ్చినా ఒక్కోసారి అరుదుగా మామూలు కంపనీల వస్తువులు బాగుంటాయి. 
  • ఒకేసారి ఎక్కువ మొత్తంలో కొనవద్దు. 
  • కంపనీ వివరాలు లేనివి అస్సలు కొనవద్దు. 
  • ఆ వస్తువు సాంకేతిక వివరాలు వివరాలు లేకుంటే వాటి జోలికి వెళ్ళక పోవడమే మంచిది. 
  • ఎప్పుడూ ఒకే అంగడి / షాప్ లో కొనవద్దు. వాటిని మారుస్తుంటే - మనకు ఎన్నో క్రొత్తవి దొరుకుతాయి అలాగే క్రొత్త విషయాలూ తెలుస్తాయి. 







Monday, January 7, 2019

Electronic choke tube lights

https://achampetraj.blogspot.com/2018/12/fluorescent-tube-light-starter.html తరువాయి భాగం :
ఎలక్రానిక్ చోక్ గల ట్యూబ్ లైట్ సెట్ అమర్చాక ఇక - స్విచ్ వెయ్యగానే అలా ట్యూబ్ లైట్ రావటం మొదలైంది. మామూలు ట్యూబ్ లైట్ సెట్ల కనా ఇవి చాలానయం. కొద్దిగా ఖరీదైననూ మన్నికా, సులభ వాడకం మూలాన ఇవి బాగా ఆకట్టుకున్నాయి. వీటి సాంకేతికత వల్ల ట్యూబ్ పట్టే మీద ఉండే స్టార్టర్ మాయం అయ్యింది. అలాగే రెండు, మూడు సార్లు ఫ్లిక్ అయ్యి నెమ్మదిగా వెలిగే బాధ తొలగింది. అలాగే లో వోల్టేజీ ఇవి చక్కగా వెలుగుతుంటాయి, స్టార్ట్ అవుతాయి కూడా. అంతకు ముందు తరం ట్యూబ్ లైట్స్ మాత్రం అలా ఉండేవి కావు. కాసింత వోల్టేజీ తగ్గితే మినుకు మినుకు మంటూ వెలగటం, మరీ తగ్గితే అస్సలు వెలగక పోవటం లాంటివి జరిగేవి.

పాత తరం ట్యూబ్ లైట్స్ లో ఉండే స్టార్టర్ పాడయితే - ఆ స్టార్టర్ ని తీసేసి, ఆ స్టార్టర్ హోల్డర్ లోని రెండు పాయింట్స్ మీద - రెండు చివర్ల మీదున్న ప్లాస్టిక్ తొడుగుని తీసేసిన మామూలు చిన్న ఎలక్ట్రికల్ వైరు ముక్కతో ఆ రెండు పాయింట్స్ నీ స్పార్క్ వచ్చేలా రాపిడి చేసేవాడిని. అలా చేస్తే ఒక్కోసారి ట్యూబ్ లైట్ వెలిగేది. అంటే స్టార్టర్ కాస్త నలుపులోకి మారి సరైన రేటింగ్లో కరెంట్ ఫ్లిక్ ని ఇవ్వలేకపోతున్నది అన్నమాట.. లేదా కాస్త వోల్టేజీ తగ్గిందన్న కారణం వల్ల అలా అవుతుంది. ఇలా చేస్తున్న క్రమంలో ఎన్నోసార్లు నాకు కరెంట్ షాక్ తగిలింది కూడా.

పాతతరం ట్యూబ్ లైట్స్ ని కేవలం వాటి చోక్ మార్చటం ద్వారా ఈ ఆధునిక ఎలక్ట్రానిక్ ట్యూబ్ లైట్ గా మార్చుకోవచ్చు. చాలా సింపుల్ గా ఉండే ఈ కనెక్షన్ ఒకసారి చూస్తే మనమూ చేసుకోవచ్చు. వీటిల్లో అంతా బాగుంది కానీ ఒకే ఒక లోపం ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.. వీటిని సేపరేటుగా తెచ్చుకొని, పాత ట్యూబ్ కి ఎక్కించి, వాడుకుందాం అనుకుంటే - వీటిని ఆ ట్యూబ్ ఇనుప పట్టీకి బిగించుకోవడానికి ఎలాంటి రంధ్రాలు, టేపులు, తీగలు పెట్టి చూడటానికి అందముగా ఉండేలా చేసుకోరాదు. కరెంట్ టేపు ద్వారానో, తీగల వల్ల గానీ, రెండు వైపులా జిగురున్న థర్మాకోల్ టేప్ సహాయాన గానీ, కేబుల్ టైస్... వల్లనో ఆ పట్టీకి బిగించుకోవాలి. కానీ రెండు స్క్రూలు సహాయన ఆ పట్టీకి బిగించుకొనే అవకాశం చాలా చోక్స్ లలో లేదు. ఇదొక్కటే లోపం. కొన్నింటిలో ఉన్నా - కంపనీ కంపనీకి వేరు వేరు సైజుల్లో రంధ్రాలు ఇవ్వటంతో - అన్ని సెట్లకూ అడ్జస్ట్ అవవు. ఈ లోపం సరిదిద్దేలోగా ఆధునికముగా వచ్చిన LED ట్యూబ్స్ కారణాన ఇవీ కనుమరుగయ్యే సమయం ఆసన్నమయ్యింది.

ఈ ఎలక్రానిక్ చోక్స్ వల్ల మరిన్ని ఉపయోగాలు ఏమిటంటే :

  • మినుకు మినుకుమంటూ ట్యూబ్ లైట్స్ వెలగవు. 
  • స్విచ్ వేసిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా వెలుగు వస్తుంది. 
  • లో వోల్టేజీలో కూడా చక్కగా పనిచేస్తుంది. 
  • స్టార్టర్ బాధ తప్పుతుంది. దాని ఖర్చూ ఉండదు. 
  • ట్యూబ్ లైట్ రూల్ మన్నిక బాగా ఉంటుంది. ఏళ్లకు ఏళ్ళు గా మనుగడ వచ్చి, ట్యూబ్ లైట్స్ మాటిమాటికీ కొనాల్సిన బాధ తగ్గుతుంది. 
  • సాంప్రదాయ బరువైన ( అల్యూమినియం వైండింగ్ ) చోక్స్ కన్నా వీటి బరువు చాలా తక్కువ. ఫలితముగా పట్టీని బలంగా బిగించుకోవాల్సిన అవసరం లేదు. 
  • ఇవి కరెంట్ ని చాలా తక్కువ వాడుకుంటాయి. కరెంట్ బిల్లూ కాస్త తక్కువగానే ఉంటుంది. అల్యూమినియం చోక్స్ దాదాపు 10 నుండి 15 వాట్లు / గంటకు అదనముగా వాడుకుంటాయని ఒక అంచనా. ఇదే విద్యుత్ వృధా అనుకోకుండా - ఒకవేళ ఇంకొక బల్బ్ రూపంలో వాడితే ఈ 10 - 15 వాట్లు గల బల్బ్ వల్ల గదికి మరింత వెలుగుని ఇవ్వవచ్చు. 
  • అందరికన్నా వీటిని మరొక పద్ధతిలో కూడా వీటిని బాగా వాడుకున్నాను. అందరి ఇళ్ళల్లో మామూలు సెట్లు ఉన్న రోజుల్లో - వారి ట్యూబ్స్ ఒకవైపు కాలిపోయి / నల్లగా అయ్యి వేలిగేవి కావు. వాటిని బయట పడేసేవాళ్ళు. నేను మాత్రం అలా పడేసే వాటిని ఈ ఎలక్ట్రానిక్ చోక్స్ సెట్లలో అమర్చి మరొక కొంతకాలం / మూడు నుండి పన్నెండు నెలలు వాడుకొనే వాడిని. ఇలా వాడుకోవచ్చన్నది చాలా మందికి తెలీదు. ఎవరైనా వాడుకుంటారని ఈ టిప్ చెబుతున్నాను. కాకపోతే - రెండు వైపులా నల్లబడినవి మాత్రం మళ్ళీ పనిచెయ్యవు. ఒకవైపు నల్లగా మారినివి మరికొంత కాలం ఈ పద్ధతిలో భేషుగ్గా వాడుకోవచ్చు. 






Sunday, December 30, 2018

Fluorescent Tube light - starter

ఈరోజు ఇంటిలోని హాల్ గదిలోనికి క్రొత్త LED ట్యూబ్ లైట్ పట్టీ తెచ్చాను. అప్పటివరకూ హాల్ గదిలో - గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఒక వెలుగు వెలుగుతున్న ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ ని తీసేసి ఇది అమర్చాల్సి వచ్చింది. ఆ కథాకమామీషు ఇప్పుడు..

1998 సంవత్సరములో Anchor ఆంకర్ కంపనీ క్రొత్త ట్యూబ్ లైట్ కంప్లీట్ సెట్ తెచ్చి అమర్చాను. అప్పట్లో ఈ ట్యూబ్ లైట్ ఉండటమే ఒక హోదాగా ఉండేది. అప్పట్లో ఈ మొత్తం సెట్ ధర 400 రూపాయలు ( ఇప్పుడు అయితే మరీ చవక అయ్యాయి ) అప్పట్లో ఈ ట్యూబ్ లైట్స్ వెలిగించాలంటే స్టార్టర్స్ తప్పనిసరి. ఈ స్టార్టర్స్ ధర మూడు రూపాయల నుండి పదిరూపాయల వరకూ ఉండేవి. ఈ పది రూపాయలవి దాంట్లో సిరామిక్ లేదా ప్లాస్టిక్ తో కప్పిన కెపాసిటర్ ఉండేది. స్విచ్ వెయ్యగానే ఈ స్టార్టర్ సహాయాన ట్యూబ్ వెలిగేది. ఇప్పటికీ ఇలాంటి ట్యూబ్ వాడుతున్నారు.. త్వరలోనే వీటికి కాలం చెల్లబోతున్నది.

Tube light starters 
ఇవే ట్యూబ్ లైట్ స్టార్టర్స్  


 ఇక ఈ ప్రక్కన ఉన్నది ఆ స్టార్టర్ లోని చిన్న బల్బ్. ఇది వెలిగే ఆ ట్యూబ్ లైట్ ని వెలిగిస్తుంది. ఇది కనపడకుండా పైన అల్యూమినియం డబ్బా లాంటిదో, లేక ప్లాస్టిక్ డబ్బాలోనో ఉంటుంది. ఇది ఇలా స్పష్టముగా ఉంటేనే ఆ స్టార్టర్ బాగా పనిచేస్తుంది. ఇంకా ఇలాంటివి స్టార్టర్స్ వాడుతున్న వారికి ఒక టిప్ చెబుతున్నాను.. స్విచ్ వెయ్యగానే 20 సెకన్లలోగా టూబ్ లైట్ వెలిగిందా ఓకే! ఒకవేళ వెలగకపోతే వెంటనే స్విచ్ ని ఆఫ్ చెయ్యండి. ఇలా చేస్తే ట్యూబ్ మరియు స్టార్టర్ మన్నిక పెరుగుతుంది. ఇపుడైతే వోల్టేజీ సరిగానే ఉంటునది కాబట్టి త్వరగానే వెలుగుతున్నాయి. 




ఇదేమో - స్టార్టర్ లోని బల్బ్ కి అదనముగా ఉండే కెపాసిటర్ టైపు. దీనివలన మరింత ఎక్కువగా సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా మరింత త్వరగా ట్యూబ్ లైట్ ని వెలిగిస్తాయి. ఆ తెల్లగా ఉన్నదే కెపాసిటర్. అలాకాకుండా గోధుమ రంగులో గుండ్రముగా, బద్దలా ఉండే కెపాసిటర్స్ కూడా ఉన్న స్టార్టర్స్ ఉన్నాయి. నాకైతే ఇవన్నీ అనుభవ రూపేణా తెలుసుకున్నవి. 

ఇక ఈ ప్రక ఫోటోలోలాగా స్టార్టర్ బల్బ్ నల్ల బడిందీ అంటే ఇక ఆ స్టార్టర్ ని మార్చాల్సిన సమయం వచ్చినట్లే.. దాన్ని అలాగే ఇంకా వాడుతుంటే - ట్యూబ్ లైట్ మీద ప్రభావం చూపి - ఎక్కువసార్లు ఫ్లాష్ లు వచ్చేలా చేసి, ట్యూబ్ లైట్స్ చివర్లు నల్లగా అయ్యేలా చేస్తుంది. ఫలితముగా ట్యూబ్ మరియు స్టార్టర్ కూడా మార్చాల్సి వస్తుంది. పది రూపాయల మార్పు ఆలస్యమైతే - యాబై రూపాయల ట్యూబ్ వల్ల జేబుకి చిల్లు పడుతుంది. ఇది చాలామందికి తెలీదు అనే ఇంత వివరముగా వ్రాశాను. ఎవరైనా ఇలాగే వాడుతూ ఉంటే స్టార్టర్స్ ని త్వరగా మార్చుకోండి. ( నేనైతే ఆ స్టార్టర్ కవర్ ని తీసేసి, అలాగే దాని స్థానములో ( స్టార్టర్ హోల్డర్ లో ) బిగించి వాడేవాడిని. అందుకే ఇంతబాగా తెలుసుకొని చెప్పగలుగుతున్నాను. 

 ఈ ప్రక్కగా ఉన్న ఫోటోలో - స్టార్టర్ లోని బల్బ్ స్విచ్ వెయ్యగానే  ఇలా లేత వంకాయ రంగులో వెలుగుతుంది. అలా వెలగటం వల్ల వచ్చిన స్పార్క్ Spark వల్ల ట్యూబ్ వెలుగుతుంది.

కొన్ని స్టార్టర్స్ లలో ఇలాంటి బల్బ్స్ కూడా ఉంటాయి. బల్బ్ లోని తీగ చుట్టూరా ఇలాంటి తెల్లని / లేత నీలి రంగు / లేత వంకాయరంగు లోని విద్యుత్ మెరుపుని స్పష్టముగా చూడవచ్చు. 













ఆ తరవాత వీటిల్లో మార్పులు వచ్చాయి. ఎలక్ట్రానిక్ చోక్స్ వచ్చాయి. వచ్చిన మొదట్లో వీటి ఖరీదు - మొత్తం సెట్ 700 ఏడువందల రూపాయల్లో ఉండేది. అప్పట్లో ఉన్న గ్రామ్ బంగారు మారకం విలువ ప్రకారం అప్పటి ఆ 700 ని ఇప్పట్లోకి ఉన్న విలువలోకి మారిస్తే ఈ క్రొత్త ఎలక్రానిక్ ఛోక్ ట్యూబ్ సెట్ ధర ఆరేడు వేల ( 6,000 - 7,000 ) వరకూ ఉండేది అన్నమాట. అందుకే అప్పట్లో అవి ఎవరికీ తెలీకుండా - చరిత్రలోకి చేరిపోయాయి. నేను కొందామనుకున్నా వాటి లభ్యత నాకు కుదరలేదు.. కానీ ఇతరుల ఇళ్ళల్లో చూశాను. 

ఆ తరవాత ఎలక్ట్రానిక్ చోక్స్ వచ్చాయి. 200 రూపాయల ధరలో ఉన్నప్పుడు ఒక ఛోక్ తీసుకవచ్చి, మొదట్లో చెప్పిన - తీసేసిన ట్యూబ్ సెట్ కి నేనే బిగించాను. అది చాలా రోజులు పనిచేసింది.. ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది కూడా. దీనివల్ల స్విచ్ వెయ్యగానే ట్యూబ్ లైట్ వెంటనే - ఆలస్యం ఏమీ లేకుండానే వెలగటం మొదలయ్యింది. అలాగే లో వోల్టేజీ ఉన్నా చక్కగా పనిచెయ్యటం చవి చూశాను. వీటి హవా చాలా ఏళ్ళు కొనసాగింది. ఇప్పుడిప్పుడే వీటి అమ్మకాలు తగ్గుతున్నాయి - అదీ LED ట్యూబ్ లైట్స్ రాకతో.. ఇవీ చరిత్రలో కలిసిపోయే రోజు త్వరలోనే ఉంది కూడా. ఈ క్రొత్తగా తీచ్చిన LED ట్యూబ్ గురించి మరొక పోస్ట్ లో వివరముగా మాట్లాడుకుందాం.. ఆ పోస్ట్ పెట్టాక ఇక్కడ లింక్ కూడా ఇస్తాను. 



Friday, December 7, 2018

​[తెలుగుబ్లాగు:22458] త కి ర వత్తు మరియు య వత్తు ఇవ్వటానికి సూచన

[తెలుగుబ్లాగు:22458] త కి ర వత్తు మరియు య వత్తు ఇవ్వటానికి సూచన ఇవ్వండి

నాకు "త కి ర వత్తు మరియు య వత్తు" (trya - త్ర్య) అని ఇవ్వాల్సిన అవసరం వచ్చింది.  లేఖిని లో రావట్లేదు. దీనికి సూచన ఇవ్వగలరు. 

ఈ ప్రశ్నకు నేనిచ్చిన సమాధానం..

త్ర్య ని లేఖినిలో తేలికగా వ్రాయోచ్చును.. మీరు ఆ అక్షరం ఎలా ఉండాలని చెప్పారో - అచ్చు ఈ క్రింది విధముగా వ్రాస్తే చాలు.. మీకు కావాల్సిన త్ర్య అక్షరం వస్తుంది. కావాలంటే ఈ దిగువన జతపరచిన తెరపట్టు - స్క్రీన్ షాట్ ని గమనించవచ్చు.




            

Wednesday, December 5, 2018

చలికాలం - స్నానాలు

ఇది నా చిన్ననాటి జ్ఞాపకం. ఇప్పుడంటే గీజర్లు, వాటర్ హీటర్స్ వచ్చాయి కానీ - అప్పట్లో వేడి నీళ్ళు కావాలంటే కట్టెల పొయ్యి మీద రాగి, ఇత్తడి లేదా అల్యూమినియం పెట్టి, ఆ పాత్రల్లో నీరు పోసి, క్రిందన కట్టెలు, కొబ్బరి పీచు కానీ, పిడకలు కానీ పెట్టి, వాటిని కాసింత కిరసనాయిలుతో తడిపి, అగ్గిపుల్ల సహాయాన దాన్ని మండించే వాళ్ళం. ఆ వేడికి కాగిన నీళ్ళను స్నానాలకు వాడుకొనే వాళ్ళం. అప్పట్లో చాలామంది ఇళ్ళల్లో - చలికాలం వచ్చిందంటే ఇదే తంతు.. 

ఇక మరింత పెద్ద కుటుంబాలలో - వారి స్నానపు గదుల్లో కానీ, ఆరు బయట గానీ, పెరడుల్లో గానీ బాత్ రూమ్ ప్రక్కనే మూడు రాళ్ళు వేసి, వాటిల్లో కట్టెలను పేర్చి, వాటిని కిరసనాయిల్ తో వెలిగించి, పైన పెద్ద అండా / డేకిసా / బగోనే / కొప్పెర / పెద్ద పాత్రని ఉంచి నీరు వేడి చేసేవాళ్ళు. 

పై రెండింట్లో ప్రధాన ఇంధన వనరు - కట్టెలు. వీటిని ఒక వైపుగా సిద్ధం చేసుకొని ఉండేవాళ్ళు. వర్షాకాలంలో తడిచి / చూరు గుండా కారే నీటితో తడిచి / ఈదురు జల్లుల వల్ల / స్నానం నీరు చింది ఆ చెక్కలు నాని మంట సరిగా రాక - బాగా పొగ వచ్చేది. ఒక గొట్టాన / పైపు సహాయాన ఆ నిప్పుల మీదకు నోటితో ఊదుతూ మంటకు ప్రయత్నించే వాళ్ళు. ఈ తెల్లని పొగ వల్ల ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసినట్లుగా ఉండేది. సరిగా మండని కట్టెల వాసన దీనికి అదనం. 

ఇక ఆ వేడి నీటి పాత్రల బాహ్య రూపం అంతా ఆ పొగ వల్ల నల్లగా మసి / మురికి / మకిలి పట్టేది. వీటిని ఇంటివారో, పనివాళ్ళో కొబ్బరి పీచు / ఇసుక / పుల్లని చింతపండు రసం / మిగిలిపోయిన సాంబారు రసం / బూడిద ఇలా నానా పదార్థాలతో మెరిసేలా తోమి మళ్ళీ వాడేవాళ్ళు. ఆతర్వాత కొద్దిరోజుల వాడకంతో మళ్ళీ ఎప్పటిలా నల్లగా / జిడ్డుగా మారేది. అయిననూ విసుగు చెందక - మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకుంటూ వాడేవాళ్ళు. ఇప్పుడైతే "ఇంత" శుభ్రం చేసి వాడుకొనే వాళ్ళు చాలా తక్కువనే చెప్పుకోవాలి. 

అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి నలుగురూ సాయం చేసేడి వాళ్ళు. స్నానానికి బోలెడంత క్యూ ఉండేది. ఇక పండుగలకూ, పబ్బాలకు తలంటి స్నానం వల్ల ఈ స్నాన కార్యక్రమం అంటే విసుగొచ్చేది. స్నానం చెయ్యకుండా ఇల్లంతా తిరుగుతుంటే - నాన్నేమో తిట్లతో తలంటే వారు. ఇక అమ్మేమో - ప్రొద్దునే తలంటి స్నానం చేసి, మడి అంటూ ఇల్లంతా తిరగనిచ్చే వారు కాదు.. ఆ బాధలు పడలేక ఏదో తొందరగా స్నానం కానిచ్చేసేవాళ్ళు. అప్పుడైనా స్నానానికని వేడి నీళ్ళు బాత్ రూమ్ లో పెట్టుకున్నామా - బావ గారనో, చుట్టాలో చేస్తారని ఆ పెట్టుకున్న వేడి నీళ్ళు కాస్తా వారికే వెళ్లిపోయేవి. మళ్ళీ నీరు వేడి చేసుకొని ... పోసుకొని స్నానం కానిచ్చేసేయ్యాల్సిందే. ఆ నీరు వేడెయ్యేదాకా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాల్సిందే. 

ఇహ ఇదంతా నాల్ల కాదనుకున్నవారు - ఊరిలో ఏదైనా చెరువో, వాగో, కుంటనో గానీ ఉంటే అక్కడికే వెళ్లి స్నానం చేసి వచ్చేవారు. నాకింకా జ్ఞాపకం. ఉమ్మడి కుటుంబాలలో - పండుగ పబ్బాలలో స్నానం అయ్యేలోపు, కాస్త తెలివిపరులు - సమీప పుణ్యక్షేత్రాలకు ఏదైనా బండి మీద వెళ్లి అక్కడ స్నానం.. దర్శనం చేసుకొని వచ్చేవారు. అప్పటికీ ఇంట్లో స్నానాలు పూర్తయ్యేవి కావు.. కారణం సరిగా మండని కట్టెలు, వేడి నీరు అయ్యే సమయం,  స్నానం చేసేవాళ్ళు బోలెడంత మంది క్యూలో ఉండటం.. ఇవీ ప్రధాన కారణాలు. 

ఈ వేడినీటితో స్నానాలు చేస్తామా - బయటకు వచ్చాక పెట్టే చలికి గజగజా వణుకుతూ ఉండేవాళ్ళం. నిజానికి చన్నీళ్ళ స్నానం ఎంతో మంచిది. కానీ ఈ చలికాలంలో ఆ మాటని ఒప్పుకోరు. 

ఇప్పటివాళ్ళకు / నేటితరం వాళ్లకు ఈ ఇబ్బందులు ఏమిటో తెలీవు. ఎంచక్కా గీజర్స్ వాడి ఇట్టే స్నానం చేసుకొని వచ్చేస్తారు. వారికి అప్పటికాలంలోని స్నానాలు అంటే ఏమిటో తెలియాలని ఈ టపా. 




Sunday, June 17, 2018

బిగ్ బాస్ సీజన్ 2 కి వోటింగ్ చెయ్యడం ఎలా?

బిగ్ బాస్ సీజన్ 2 కి వోటింగ్ చెయ్యడం ఎలా? 
How to voting to BIG BOSS Telugu season 2 

స్టార్ మా టీవీలో ప్రస్తుతం ప్రసారం అవుతున్న - అత్యంత ప్రాచుర్యం పొందిన " బిగ్ బాస్ " కార్యక్రమం లోని పోటీదారులకు ఎలా వోటింగ్ చెయ్యాలో మీకు ఇప్పుడు తెలియ చేస్తున్నాను. చాలామంది వేరే వేరే సైటుల్లోని ఇలాంటి వోటింగ్ లలో పాల్గొని, వోటింగ్ అయ్యాక అప్పటికప్పుడు ఎవరికి ఎంత శాతం వోటింగ్ వచ్చింది అని తెలుసుకొని ఆనందపడుతున్నారు. కానీ అది నిజం కాదు. ఈ విషయం గత బిగ్ బాస్ సీజన్ 1 లో తెలిసింది. అప్పుడు కొన్ని సైట్స్ వ్యూయర్ షిప్ పెంచుకొని, ఆడ్స్ / ప్రకటనలు పెంచుకొని ఆదాయాలు పొందాయి. ఆ సీజన్ చివరిలో జూనియర్ ఎన్టీయార్ ప్రకటన వల్ల అప్పుడు నిజం తెలిసి, అధికార సైట్లో వోటింగ్ చేశారు. అందువల్ల ఆ సీజన్ చివరిలో వోటింగ్ శాతం బాగా పెరిగింది.

నిజానికి బిగ్ బాస్ అధికారిక సైటులోని వోటింగ్ మనం వెయ్యటమే కానీ, ఎవరికి ఎన్ని వోట్లు పడ్డాయి, వారికి వచ్చిన వోటింగ్ శాతం ఎంత అనీ, ఎవరికి తక్కువ వోట్లు పోలయ్యాయి / పడ్డాయి అన్నదీ... తదితర  ఇవేవి వివరాలు బయటకు తెలీవు. ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏమిటంటే :

  1. మనం వోటింగ్ వెయ్యటం వరకే మన పని.
  2. ఎవరికి ఎన్ని వోట్లు వెయ్యాలో అది మన ఇష్టం.
  3. మనం వోట్లు వేస్తేనే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. లేకుంటే లేదు.
  4. మనకు ఏదైనా లింక్ ఇచ్చి, అది నొక్కి వచ్చిన సైటు కి వెళ్లి వోటింగ్ చెయ్యండి అనే విజ్ఞప్తులు ఏవీ రావు. ఒకవేళ వస్తే అది అధికారిక సైటు కాదని గమనించండి.
  5. వోటింగ్ వెయ్యగానే ఇక ఆ సైటు నిర్ణీత సమయం వరకు అంటే తరవాతి వోటింగ్ టైమింగ్ వరకు - మళ్ళీ వోటింగ్ చెయ్యటానికి కుదరదు. కానీ ఆ సైటు మనకి కనిపిస్తూనే ఉంటుంది, ఎవరికి ఎన్ని వోట్లు వేశామో కూడా కనిపిస్తూనే ఉంటుంది కూడా.
  6. అలాగే ఎవరికీ ఎన్ని వోట్లు వచ్చాయో ఏమీ కనిపించదు. అంటే మనం వోటింగ్ చెయ్యటం వరకే మన పని.
  7. ఇలా వోటింగ్ లో పాల్గొంటే మనకేమీ రివార్డ్స్ / పాయింట్స్ / బహుమతులు గానీ రావు. ఇన్ని వోట్లు వేస్తే లేదా మీరు వోట్లు వేసిన వారు గెలిస్తే మీకు ఫలానా బహుమతి వస్తుంది అనీ ఊరింపులు ఏమీ ఉండవు అని కూడా తెలుసుకొని ఉండాలి.

ఇక వోటింగ్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. 
ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి. అవి :
  • 1. బిగ్ బాస్ పోటీదారుల / కంటెంస్టెంట్స్ కి ఇచ్చిన ప్రత్యేక ఫోన్ నంబర్స్ కి లాండ్ ఫోన్ లేదా మొబైల్ ద్వారా మిస్ కాల్ ఇవ్వడం. 
  • 2. ఆన్ లైన్ పద్దతిలోఒక ప్రత్యేక సైట్లోకి వెళ్లి వోటింగ్ చెయ్యడం. 
ఈ రెండో పద్ధతే చాలా తేలికగా ఉంటుంది. కంటెంస్టెంట్స్ యొక్క ప్రత్యేక నంబర్స్ ని టైపు చేసి, మిస్ కాల్ ఇవ్వడం కన్నా ఇది చాలా తేలిక. ఒకేసారి యాభై (50) వోట్లు వేసుకొనే వీలూ ఉంది.
ఇప్పుడు ఆ రెండో పద్ధతి అయిన ఆన్ లైన్ వోటింగ్ గురించి తెలుసుకుందాం.

ముందుగా ఆన్లైన్ లో గూగుల్ సెర్చ్ ఇంజన్ ని ఓపెన్ చెయ్యాలి. సెర్చ్ బాక్స్ లో BIGG BOSS TELUGU VOTE అని ఇంగ్లీష్ లో పెద్ద అక్షరాలలో అయినా సరే, చిన్న అక్షరాలలో అయినా సరే టైప్ చెయ్యాలి. అప్పుడు మీకు ఒక డ్రాప్ మెనూ వస్తుంది. అందులో అయినా బిగ్ బాస్ తెలుగు వోట్ ని ఎన్నుకొని ఎంటర్ చెయ్యాలి.


అప్పుడు మీకు ఇలా క్రింది విధముగా ఆ సైట్ కనిపిస్తుంది. ఈ షో లో పాల్గొనే వారు 16 మంది అయినా, ఇక్కడ మాత్రం కేవలం ఆరుగురు (6) మాత్రమే కనిపిస్తారు. ( త్వరలో మారుస్తారని అనుకుంటున్నాను ) మనకు నచ్చిన వారు / వోట్ వెయ్యాలని అనుకుంటున్న వారు ఆ లిస్టు లో ఉన్నారేమో ఒకసారి చూసుకోవాలి. 

ఇక్కడ ఉదాహరణకు : నూతన్ నాయుడు ని ఎంచుకున్నాను. తన ఫోటో ప్రక్కన ఉన్న ( ఎర్రని వృత్తములో చూపిన విధముగా ) త్రిభుజాకారాన్ని / బాణం గుర్తుని నొక్కాలి. 


అలా క్లిక్ చెయ్యగానే - తనకు ఇచ్చే పాయింట్స్ / స్కోర్ / వోట్స్ వేసేందుకు వీలుగా తన ప్రొఫైల్ వస్తుంది. తన ప్రక్కన - కుడి పై మూలన తనకు ఇచ్చిన వోట్స్ వస్తాయి. ఇప్పుడు అక్కడ 0 వోట్స్ ఉంటుంది. వోట్లు వేశాక మనం ఎన్ని వేశామో తెలిపే సంఖ్య అక్కడ నీలిరంగులో కనిపిస్తుంది. తన ఫోటో క్రిందన ఎర్రని వృత్తములో చూపిన నీలిరంగు చుక్కని మౌస్ సహాయాన - ఆ ప్రక్కన గీత వెంబడి జరపాలి / డ్రాగ్ చెయ్యాలి / స్లైడ్ చెయ్యాలి. మనం ఎన్ని వోట్లు వెయ్యాలని అనుకుంటున్నామో అంత సంఖ్య వచ్చేవరకూ జరపాలి. 

ఆ గీత చివరిలో సిమెంట్ రంగులో మనకు ఎన్ని వోట్లు ఉన్నాయో తెలుపుతుంది. ఇప్పుడే మొదలెట్టాం కాబట్టి మనకు యాభై ( 50 ) వోట్లు ఉన్నాయని చూపిస్తుంది. 


ఇప్పుడు తనకు ఇరవై వోట్లు ఇద్దామని అనుకుందాం. కుడి పైమూలన నీలిరంగులో ఆ సంఖ్య కనిపించేవరకూ ఆ నీలిరంగు చుక్కని జరపాలి. ఇప్పుడు మనం తనకు ఎన్ని వోట్లు వేశామో తెలుస్తుంది. ఇక మిగతావారికి వోట్లు వెయ్యాలని అనుకుంటే / లేదా అక్కడితోనే ఆపెయ్యాలని అనుకుంటే క్రిందన కుడి క్రింది మూలన ఉన్న- క్రింది ఫోటోలో ఎర్రని వృత్తములో చూపిన   CONTINUE  కంటిన్యూ బటన్ ని నొక్కాలి.

అప్పుడు ఇలా క్రింది విధముగా వస్తుంది. తన ప్రక్కన మనం వేసిన వోట్లు ఎన్నో తెలుస్తాయి. అలాగే ఇక మిగతావారికి వోట్లు వెయ్యాలని అనుకుంటే వారి ఫోటోల / పేర్ల ప్రక్కన ఉన్న బాణం గుర్తుని ఇంతకు ముందు తెలియచేసిన విధముగానే నొక్కి వోట్లు వెయ్యాలి. 

ఇక మిగతా వోట్లు ఎవరికీ వెయ్యను, ఇక్కడితో ముగిస్తాను అని మీరు అనుకుంటే క్రిందన - ఎడమ దిగువగా ఉన్న VOTE  అనే బటన్ ని నొక్కాలి. 


ఇక మిగిలిన వోట్లూ వేస్తానూ అనుకుంటే - మిగతావారికి ఎదురుగా ఉన్న బాణం గుర్తుని నొక్కి, వారి దిగువగా ఉన్న నీలిరంగు చుక్కని - ప్రక్కగా జరిపి వెయ్యాలనుకున్న వోట్లు వెయ్యాలి. 

ఇలా మీకున్న యాభై వోట్లనీ వేసేయ్యాలి. ఇక్కడ చూపిన కంటెంస్టెంట్స్  ప్రొఫైల్స్ వి ఎంచుకున్నాను అంటే కేవలం ఉదాహరణ కోసం ఎలా వోటింగ్ చెయ్యాలో చూపెట్టడానికి వాడుకోబడ్డాయే కానీ వీరికే ఇలా వెయ్యాలనీ, అలా వారిని మాత్రమే ఎన్నుకోవాలని కాదు.. అని గమనించ ప్రార్థన. 

ఇలా ఇద్దరికి 42 వోట్లు గనక వేస్తే - ఇక మిగిలిన ఆ ఎనిమిది వోట్లు మిగిలాయని - వేరే కంటెంస్టెంట్ ని ఎంచుకున్నప్పుడు ఇలా దిగువగా చూపబడిన చిత్రములో ఎర్రని వృత్తములో చూపినట్లుగా - అగుపిస్తాయి. 

ఇలా మీ 50 వోట్లని మీకు నచ్చినవారికి ఒక్కరికే - ఒకటి నుండి యాభై వరకు వేయవచ్చును. లేదా ఒక్కొక్కటీ వేయవచ్చును. అది మీ ఇష్టం. 


ఇలా మీకున్న ( అన్ని ) వోట్లని వేశాక - అప్పటికీ మీరు వేసిన వోట్లు వారికి చెందినట్లుగా భావించరాదు. కేవలం మీరు అలా వారికి ఎంచారు / ఇచ్చారు / పంచారు అన్నట్లు. కానీ అది వోట్లు వేసినట్లు కాదు. ఈ క్రింది ఫోటోలో మాదిరిగా వచ్చిన  VOTE  అనే బటన్ నొక్కేవరకూ - వోట్లు వేసినట్లు కాదు. దాన్ని నొక్కితేనే మీ వోట్లు పరిగణలోకి / లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. 
 
అలా  VOTE  అనే బటన్ నొక్కాక - ఇలా ఈ క్రింది విధముగా THANK YOU FOR VOTING అని కనిపిస్తుంది. ఇక్కడితో మీ వోటింగ్ క్రియ పూర్తయినట్లు భావించాలి. 

క్రింది ఫోటోలోని ఎర్రని వృత్తములో SHARE అనే బటన్ ని చూపాను. దాన్ని నొక్కితే - ఆ వోటింగ్ ప్రక్రియని మీ ఫేస్ బుక్ / ట్విట్టర్ స్నేహితులు అనుసరించేలా ఒక లింక్ లాగా మీ టైం లైన్ మీద చూపించవచ్చును. 



పైన చూపిన బాక్స్ లో ఏదైనా ఎన్నుకున్నాక క్లిక్ చేస్తే మీకు - ఈ క్రింది విధముగా కనిపిస్తుంది. 


అలా SUBMITTED  సబ్మిటేడ్ అని వచ్చాక - దీనితో వోటింగ్ ప్రక్రియ సంపూర్ణముగా ముగిసినట్లు. 

మీరు ఒక ఈమెయిల్ ఐడీ తో కేవలం యాభై వోట్లు మాత్రమే - అదీ ఒకరోజుకి మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇంకా ఎక్కువ వోట్లు వెయ్యాలీ అనుకుంటే - వేరే మెయిల్ ఐడీ తో మళ్ళీ లాగిన్ అయ్యి వోటింగ్ చెయ్యాలి. అది మీ ఓపిక, మీ అభిమానం. 

 గమనిక : శనివారాన సాయంత్రం నుండీ - 
ఆదివారం రోజంతా 
సోమవారంన సాయంత్రం దాకా ఈ వోటింగ్ లింక్ తెరచుకోదు.. 




Thursday, March 22, 2018

బడిపిల్లలకు ఒక చిన్న సహాయం

మా వీధిలో మురుగు కాలువల పని మొదలెట్టారు. పాత కాలువలన్నింటినీ త్రవ్వేసి, క్రొత్తగా సీసీ మురుగు కాలువలు కట్టేస్తున్నారు. ఆ సీసీ మురుగు కాలువల వల్ల - అవి చాలా ధృడముగా ఉండటమే కాకుండా విశాలమైన వెడల్పుతో, లోతుగా ఉండే వాటివల్ల చాలా మేలు కలుగుతున్నది. ఆ నిర్మాణ ఆలోచన అద్భుతం. పనీ వేగముగా జరిగిపోయింది.. కానీ ముందస్తు ఆలోచన లేని ఆ పని వల్ల అందరూ ఇబ్బంది పడటం మొదలెట్టారు. ఆ మురుగుకాలువకి పైకప్పు కి బడ్జెట్ ఇంకా సాంక్షన్ కాని కారణముగా క్రొత్తగా ఇబ్బందులు మొదలయ్యాయి. అదీ ముఖ్యముగా చిన్నపిల్లల స్కూల్ పిల్లలకు. ఆ మురుగుకాలువకు అవతల ఉన్న ఆ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళాలీ అంటే దాన్ని దాటాల్సిందే. ఇక్కడ ఆ కాలువని దాటాల్సింది ఆ పిల్లలే.


ఈ మురుగు కాలువ పై స్లాబు పనిని పూర్తి చేసేలా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. పైకప్పుకి బడ్జెట్ ఇంకా అనుమతులు రాని కారణాన అలాగే ఇప్పటికీ ఉన్నది కూడా. ఇక లాభం లేదని తలుపు చెక్కని దారిలా వేశారు ఆ స్కూలు ఉపాధ్యాయులు. ...కొద్దిరోజులలో దాని స్వంతదారులు ఆ తలుపు చెక్కని పట్టుకెళ్ళారు. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. అ ఆ ల నుండి ఐదో తరగతి వరకూ అక్కడ చదువుకొనే పిల్లలకు ఆ కాలువని దాటి వెళ్ళడానికి ఇబ్బంది మొదలయ్యింది. ఉపాధ్యాయులు తమ వాహనాలని ఇవతలే పార్క్ చేసుకొని, లోపలికి వెళ్ళాల్సివస్తున్నది. 

ఇలా కాదనుకొని ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, టీచర్లు కలిసి, రెండు పెద్ద బండలను దానిపై పెట్టి, దారిలా చేశారు. సరిగ్గా ఆ సమయం లోనే నేను అక్కడికి వెళ్లాను. "మీకెందుకు ఈ శ్రమ.. మీరూ ప్రభుత్వ ఉద్యోగులే కదా.. కంప్లైంట్ చెయ్యలేక పోయారా ?" అని అడిగితే - "అలా చేశామే అనుకోండి.. మమ్మల్ని టార్గెట్ చేస్తే - అవో ఇబ్బందులు. ఇప్పటికే ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాం.. లాభం లేదు సర్.." అన్నారు. వారి ఇబ్బందీ అర్థం అయ్యింది. ఆ తవ్విన కాలువ వెడల్పుకి ఆ బండలు సరిపోవటం లేదు.. కొద్ది అంచుల ( ఒకటి రెండు ఈంచులు అంతే! ) మీద ఆ కాలువ పైన ఉన్నాయి. కొద్దిగా ప్రక్కకు జరిగితే ఆ బండలు ఆ కాలువలో పడిపోవటం ఖాయం. పిల్లలు దాని మీద కాలు పెట్టి దాటేటప్పుడు - అవి జరిగి పడిపోయినా చాలా పెద్ద ఇబ్బందే.. గతంలో ఒక అమ్మాయి అలా పడిపోయింది కూడా.. 

అప్పుడే నేను అన్నాను కదా.. "మీరు అంతగా శ్రమ పడుతున్నారు కదా.. నా వంతుగా కొద్ది చిరు సాయం చేస్తాను. మీరు బండలు వేసెయ్యండి. నేను దాని చుట్టూరా సిమెంట్ వేయిస్తాను. కదలకుండా ఉంటాయవి. కాకపోతే మీ పాఠశాల ఆయాతో ఆ సిమెంట్ నీటి తడులు కొట్టించండి.." అన్నాను. అందుకు వారు సరే అన్నారు. 

అప్పుడు నేను సిమెంట్ పని చేయిస్తున్నాను. మేస్త్రీ చాలా బీజీగా ఉన్నాడు. తనని సిమెంట్ అక్కడ కొట్టేసేయ్ అని చెప్పాలన్నా కుదరనంత బీజీ.. ఇక లాభం లేదనుకొని - నేనే కొంత సిమెంట్ మాల్ ( సిమెంట్ + ఇసుక మిశ్రమం ) ని ఒక తట్టలో కలుపుకొని ఆ పరచిన బండల చుట్టూ పోశాను. ఒకటి రెండు తట్టల సిమెంట్ మిశ్రమం సరిపోతుందేమో అనుకున్నా.. కానీ ఆరుతట్టల నిండా సిమెంట్ మిశ్రమం కావాల్సి వచ్చింది. ఒక మంచిపనికి నావంతు సహాయం అనుకొని ఆ పనిని పూర్తి చేశాను. 



ఇక ఆయా అయితే కనీసం ఒక్కసారి కూడా ఆ వేసిన సిమెంట్ కి నీటి తడిని ఇవ్వలేదు. ఆ బాధ్యతనూ నేనే తీసుకొన్నా.. తడి ఇవ్వకుంటే ఆ సిమెంట్ పొడిగా రాలిపోతుంది. అందుకే ప్రొద్దునా, సాయంత్రం అంటూ అలా రోజుకి రెండుసార్లు దానికి బకెట్లతో ఐదురోజులు నీరు కొట్టాను. ఫలితముగా సిమెంట్ గట్టిపడింది. ఇంకా బాగా మంచిగా ఉండేలా చేద్దామని అనుకున్నా - కానీ అది తాత్కాలికమైనది. త్వరలో పైన బెడ్ వేస్తే నేను చేసిన శ్రమ అంతా వృధానే.. అనుకోని ఆగిపోయా.. కానీ ఇప్పటివరకూ బెడ్ లేదు.. ఈ రాళ్ళ బండలు అలాగే ఉన్నాయి. పిల్లలూ, ఉపాధ్యాయులూ హాయిగా దాని పైనుండి అటూ, ఇటూ తిరుగుతున్నారు. 

ఏది ఏమైనా కొందరికి నావల్ల కాస్త మేలు జరిగినందులకు చాలా సంతోషముగా ఉంది. 




Monday, November 20, 2017

LED Street lights

ఈ మధ్య మా నగర రహదారులన్నీ రాత్రిపూట తెల్లగా, పండు వెన్నెలతో మెరసిపోతున్నాయి. నగరమంతా పండుగ వాతావరణం ఏర్పడినట్లుగా, రహదారుల మీదున్న కరెంట్ స్థంభాలన్నింటిమీదా దేదీప్యమాన వెలుతురునిచ్చే ఎల్ ఈ డీ LED బల్బ్స్ అమర్చడం వల్ల ఈ మార్పు. అంతకు ముందు ఈ కరెంట్ స్థంభాల మీద ఉన్న ట్యూబ్ లైట్స్ కొన్ని వెలిగేవి.. మరికొన్ని వెలగక పోయేవి. వెలిగే ట్యూబ్ లైట్స్ కాంతి కన్నా మరింత ఎక్కువ వెలుగునిచ్చే - ఈ రహదారుల మీద ఒక ఫంక్షన్ చేస్తున్నట్లుగా - అందుకే ఇలాంటి మరింత ప్రకాశవంతమైన బల్బులను పెట్టారా అన్నట్లుగా అగుపించుచున్నది. ఇక్కడ మార్పు అంతా ట్యూబ్ లైట్స్ స్థానాన LED బల్బ్స్ అమర్చడమే.. అంతే 

ఈ LED ల్యాంప్స్ ఎప్పటి నుండో అమర్చుతున్నారు. కానీ ఈ మధ్యే ఆ అమర్చడం అన్నది మరింత వేగవంతం చేశారు. ప్రతీ గల్లీలో నుండి పెద్ద పెద్ద రహదారుల వరకూ అన్ని రోడ్ల మీదున్న ట్యూబ్ లైట్స్ ని తొలగించి, వాటి స్థానాన ఈ LED బల్బ్స్ ని పెడుతున్నారు. ఇవి సైజులో చిన్నగా ఉండి, ట్యూబ్ లైట్స్ కన్నా మరింత కాంతిని ఇస్తున్నాయి. ఆ వెలుతురులో రోడ్డు మీద ఏదైనా పడినా చక్కగా వెతుక్కోనేలా ఉంది వీటి వెలుగు. మొదట్లో వచ్చిన LED లైట్ల కన్నా ఈ మధ్య వచ్చిన LED లైట్స్ మరింత వెలుగుని ఇస్తున్నాయి. ఈ విషయమే మరింతగా నన్ను ఆకట్టుకొని ఈ టపా వ్రాయటానికి మూల కారణమైంది. 

ఈ LED లైట్స్ కీ - ట్యూబ్ లైట్స్ కీ తేడాలు చూద్దాం.. 

                      ట్యూబ్ లైట్స్                            LED 

సెట్ ధర                            తక్కువ                         ఎక్కువ 
వెలుతురు                         తక్కువ                         ఎక్కువ 
ఛోక్                                  తప్పనిసరి                     అవసరం లేదు 
స్టార్టర్                               తప్పనిసరి                     అవసరం లేదు 
సైజు                                 పెద్ద ఆకారం                    చిన్నగా ఉంటుంది. 
స్టార్టప్                              ప్లిక్ అయ్యాక వస్తుంది.    వెంటనే వెలుగునిస్తుంది. 
లోవోల్టేజ్                          వెలగటం  కష్టం               భేషుగ్గా వెలుగునిస్తుంది.  
నిర్వహణ                         అప్పుడప్పుడు అవసరం   అవసరం లేదు. 
ఖరీదు                             తక్కువ                           చాలా ఎక్కువ 
మన్నిక                           అన్నీ బాగుంటేనే ఎక్కువకాలం వస్తుంది.   మరింత ఎక్కువకాలం వస్తుంది. 
ప్రతి వాట్ కి ఇచ్చే వెలుగు   తక్కువ                          ఎక్కువ 
సెట్ కి గ్యారంటీ                  ఏమీ లేదు                      కనీసం ఒక సంవత్సరం 
వెలుగు                            తెలుపు                           మరింత తెలుపు  

ఈ LED లైట్లని గమనిస్తున్నాను కదా.. వెనకటి తరం లైట్ల కన్నా ప్రస్తుతం వస్తున్న లైట్లు రాత్రిపూట రహదారులని పట్టపగలుగా మార్చుతున్నాయి. ఇక్కడ మరింతగా ఆకట్టుకున్నది ప్రస్తుతం మా వీధిలో అమర్చిన LED వీధి దీపాలు. ఆ వీధి దీపం వెలుతురుని చూశాక మరుసటి రోజున వాటి గురించి తెలుసుకున్నాను. 



ప్రభుత్వం  వారు ఈ వీధి దీపాలని ప్రతి నగరాల్లో, పల్లెల్లో అమర్చుతున్నారు. దీని వల్ల రహదారులన్నీ మరింత ఎక్కువ వెలుతురుతో జిగేల్మని మెరసిపోతున్నాయి. 

వీటి వివరాలని తెలుసుకోవాలని గూగుల్ లో వెతికాను. పైన చూపిన ఫోటో లోని LED లైట్ ( వీటినే మా వీధి రహదారుల స్థంభాలకు అమర్చారు ) అమెజాన్ కంపనీ వారి సైట్ లో కనిపించింది. దాని గురించి వివరాలు తెలుసుకున్నాను. ఇది 20W వాట్ల LED వీధి దీపం. ఆకారం అంతగా ఆకట్టుకోకున్నా, వీటి వెలుగు మాత్రం భలేగా మనల్ని ఆకట్టుకుంటుంది. కేవలం ఈ 20 వాట్ల కరెంట్ ఖర్చుతో ( ట్యూబ్ లైట్ కరెంట్ వినియోగం లో సగం ఖర్చుతో ) వాటికన్నా ఎన్నో రెట్లు ప్రకాశవంతముగా వీటి సామర్థ్యం  ఉంది. వీటి ధర ప్రస్తుతం అమెజాన్ లో  కేవలం 1500 రూపాయలుగా ఉంది.  బల్బ్ చుట్టూ ఉన్న బాడీ ఆకారం మారిస్తే మరింత అందముగా కనిపిస్తుంది. 




Thursday, October 5, 2017

[తెలుగుబ్లాగు:22483] కి నా జవాబు

[తెలుగుబ్లాగు:22483] BhutEbhya&@H  ani koditE భుతేభ్యః Ya vattu last lo vasthondi Bha prakkana raavadaaniki nenu emi cheyyali? అనే ప్రశ్నకు నేనిచ్చిన జవాబు : 

మీరు అడిగిన ప్రశ్నలోనే మీకు కావలసిన పదాన్ని తెలుగులో చూపించారు. అది చూస్తే - మీకు కావలసిన పదం (  భుతేభ్యః  ) మీకు వచ్చేసినట్లుగా కనిపిస్తున్నది. అలా వచ్చాక కూడా మీరు అలా ఎలా టైప్ చెయ్యాలో మళ్ళీ అడిగినట్లుగా తికమకగా ఉంది. అయిననూ మీకు సమాధానంగా ఈక్రింది తెరపట్టుని చూపిస్తున్నాను. అందులో మీకు పరిష్కారం కనిపించవచ్చు. 

గూగుల్ తెలుగు లిప్యంతరములో : 


లేఖిని లో : 


ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు నాకు ఏర్పడిన ఇబ్బందులను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఇలాంటి ప్రశ్నలను ఇకమీదట అడిగే ఈ బ్లాగర్స్ గ్రూప్ సభ్యులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఇవి. 

1. మీరు టైప్ చెయ్యాలనుకుంటున్న పదం ని టైప్ చెయ్యడం రాకపోతే - దాన్ని ఒక పేపర్ మీద వ్రాసి, ఫోటో తీసి మెయిల్ తో బాటుగా పంపండి. దాన్ని చూశాక ఎలా దాన్ని టైప్ చెయ్యాలో చెప్పడం ఇతర సభ్యులకు తేలికగా ఉంటుంది. 

2. మీరు అడుగుతున్న పదం ఎలా టైపు చెయ్యాలన్నది - ఇంస్క్రిప్ట్, లేఖిని..... లాంటి సైట్లలోనా లేక గూగుల్ వారి లిప్యంతరం లోనా అన్నది కూడా తెలియచెయ్యండి. ఇది ఎందుకంటే ఈ రెండింటిలో కాస్త వేరుగా టైప్ చెయ్యాల్సి ఉంటుంది. పైన ఉన్న తెరపట్లలో ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. చాలామంది ఇక్కడే అయోమయానికి గురి అవుతారు. మీరు ఇంస్క్రిప్ట్ లో టైప్ చెయ్యాలని అనుకొని అది ( ఇంస్క్రిప్ట్ అని ) ప్రస్తావించకుండా అడిగితే - సభ్యులు లిప్యంతరం లో గనుక మీకు సమాధానం ఇస్తే - అది మీకు సరియైన పరిష్కారంగా తోచదు. అందువల్ల మీరు ఎందులో టైపింగ్ చేస్తున్నారో  తప్పనిసరిగా చెప్పాలన్నది గుర్తుపెట్టుకోవాలి. 

3. మీరు టైప్ చేస్తున్నప్పుడు వచ్చిన తప్పుడు పదాన్ని - ఎలా వస్తున్నదో గ్రూప్ లోని ఇతర సభ్యులకు చూపించడానికి - దాన్ని స్క్రీన్ షాట్ ( తెరపట్టు ) తీసి, పోస్ట్ చెయ్యండి. మీ సమస్య ఏమిటో తోటి బ్లాగర్స్ కి బాగా అర్థం అవుతుంది. 

- అచ్చంపేట్ రాజ్  



Related Posts with Thumbnails