Saturday, November 29, 2014

[తెలుగుబ్లాగు:22320] assistance:

please help me  to create my on blog in ''Telugu'',because already i am
having blog english type to telugu   ''smile n smile4blog.com''
regards,       అనే ప్రశ్నకి నేను ఇచ్చిన సమాధానం : 

మీరు మీ తెలుగు బ్లాగుని  బ్లాగర్.కామ్ లోనైనా లేదా వర్డ్ ప్రెస్.కామ్ లోనైనా తెరవవచ్చును. ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయని వినికిడి. ఎందులో తెరిచినా - ఆ బ్లాగుల్లో చూపే మన ప్రజ్ఞా పాటవాలే  బ్లాగ్ ఉన్నతికి సోపానాలు అవుతాయి.  

బ్లాగర్. కాం అడ్రెస్ = www.blogger.com 
వర్డ్ ప్రెస్. కాం అడ్రెస్ = www.wordpress.com 

blog.com అన్నది blogger.com కానే కాదు. ఆ రెండూ వేరు వేరు. ఒక్క అక్షరం మారినా సైటు అడ్రెస్ మారిపోతుంది. మనం వెళ్ళాలనుకున్న సైటు తప్ప, వేరే సైటుకి వెళుతామన్న దానికి ఇదొక చక్కని ఉదాహరణ. 

అలాగే మీరు మీ బ్లాగు అడ్రెస్ ని - ఎక్కడా స్పేస్ వదలకుండా ఒకేఒక ముక్కగా చెప్పాలి. ( క్రిందన నా సంతకం వద్ద నా బ్లాగ్ అడ్రెస్ లింక్ ఇచ్చాను..అలా ఒకే ఒక ముక్కగా వ్రాయాలి ) అలా అయితేనే ఆ అడ్రెస్ లింక్ గా నీలిరంగులోకి మారి - దాన్ని నొక్కితే నేరుగా మీ బ్లాగ్ కి చేరుకోవచ్చు. బ్లాగ్ ఆరంభ సమయాన ఇలాంటివి అందరికీ మామూలే. ఈ విషయాన్ని ఇంతకు ముందే ఒకసారి చెప్పినట్లు గుర్తు. 

- అచంపేట్ రాజ్. 


Sunday, November 23, 2014

Quiz

ఒక కొలనులో 6 చేపలున్నాయి. అందులో మూడు చేపలు చనిపోతే ఆ కొలనులో ఎన్ని చేపలు ఉంటాయి.. ? 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 

Friday, November 21, 2014

బ్లాగ్ వ్యూయర్స్

ఒక బ్లాగ్ క్రియేట్ చేసుకున్న తరవాత మనం వేసే టపాలు చదివి - మన బ్లాగ్ ఎంతగా పాపులారిటీ పొందిందీ, మన టపాలను ఎంతమంది చూశారు, నిన్నటికీ ఈరోజుటికీ ఎంతమంది వీక్షకులు ( viewers ) ఉన్నారో సులభముగా తెలుసుకోవడానికి బ్లాగర్ వారు ఒక సౌలభ్యాన్ని కలుగజేశారు. ఇది ఎప్పుడో కలుగజేశారు కానీ నూతన బ్లాగర్లకి ఒక ఇన్ఫర్మేషన్ గా ఉండాలని ఈ టపాని వ్రాస్తున్నాను. 

బ్లాగ్ హోం పేజీ ఓపెన్ చెయ్యగానే - ఈ క్రింద ఫోటోలో మాదిరిగా కనిపిస్తుంది. అక్కడ మన బ్లాగు పేరు, దాని క్రిందుగా - ECG గ్రాఫ్ లా ఉండే బ్లాగ్ స్టాటిస్టిక్స్ ఓవర్ వ్యూ, ( blog statistics over view ) బ్లాగుకి వచ్చిన పేజీ వ్యూస్, ఇప్పటి వరకూ ఆ బ్లాగులో ఎన్ని పోస్ట్స్ పబ్లిష్ చేశామో అక్కడ కనిపిస్తుంది. 


ఇందులో ఆ ఈసీజీ గ్రాఫ్ లా ఉండేదే ( ఫోటోలో ఎర్రని బాణం గుర్తుతో చూపించినది ) మన బ్లాగ్ వీక్షకుల గ్రాఫ్. ఎంతమంది మన బ్లాగ్ ని సందర్శించారో, నిన్నటికీ, మొన్నటితో, ఈరోజుతో వచ్చిన వీక్షణల సంఖ్య ఏమైనా పెరిగిందా, తరిగిందా అని తేలికగా తెలుసుకోవచ్చు.. 

కాకపోతే ఇలా చూసుకోవడం అంత బాగోదు. ఒకవేళ - చూసుకున్నా ఆ విశ్లేషణని మామూలు విషయంలా తీసుకోండి. నా బ్లాగ్ వీక్షణలు పెరగటం లేదు అన్న చింతతో - మీమీద మీరే వత్తిడి తెచ్చుకొని, అనక శారీరక, మానసిక, ఉద్యోగ విషయాల్లో లేనిపోని చికాకులని పెంచుకోవద్దని నా మనవి. ఇది సలహా కూడా కాదు - నా ఆర్డర్ కూడా. 

తెలుగు బ్లాగులకు ఆడ్ సెన్స్ ని ఇంకా బ్లాగర్ వారు ఇవ్వలేదు.. ( ఆడ్ సెన్స్ అంటే - మీ బ్లాగ్ ని సందర్శకులు వీక్షణలు ఎక్కువగా చేస్తే, మీ బ్లాగ్ కి ప్రకటనలని గూగుల్ వారు జత చేస్తారు. అలా చేసినందున ఆ ప్రకటన ఆదాయము నుండి కొంత భాగాన్ని మీకు ఇస్తారు. కానీ తెలుగు మరికొన్ని భాషలో ఉన్న బ్లాగులకు ఆ ఆఫర్ ఇంకా ఇవ్వలేదు ) మీ బ్లాగ్ పని మీరుగా చేసుకుంటూ వెళ్ళండి. పేరూ, ఖ్యాతి, వీక్షకులు... అవంతట అవే వస్తుంటాయి. 

Saturday, November 15, 2014

Good Morning - 571


ఎప్పుడూ నిరాశగా ఉండే వాళ్ళతో, అలా మాట్లాడే వాళ్ళతో కాకుండా - చురుకుగా ఉండేవాళ్ళు, లోకం పోకడ గురించి తెలిసిన వారితో స్నేహం చెయ్యండి. 

అవును.. ఎపుడూ ఏదో కోల్పోయినట్లుగా, జీవితాన్ని నిరాసక్తముగా లాగిస్తున్న, ఏమిట్రా నాకీ బ్రతుకు.. నా జీవితమే వృధా అనుకొనే వాళ్ళు, ఎప్పుడూ నిరాశాపూరితముగా మాట్లాడుతూ ఎదుటివారి ఉత్సాహాన్ని కూడా తగ్గించేవారితో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలా జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెబుతున్నానూ అంటే  - ఈ నిరాశ అనేది ఒక అంటువ్యాధి లాంటిది. ఒకసారి ఇది మనకి అంటుకున్నది అయితే ఇక మనమూ అలాగే మారుతాం - అలాగే నిరాశగా మాట్లాడటం, ఏదో కోల్పోయినట్లుగా ఎప్పుడూ బాధగా ఉండి, ఈ ప్రపంచం నా బాధ తొలగించటం లేదు అని బాధపడటం మన దినచర్య అవుతుంది. ఇది మనల్ని వదలాలి అంటే చురుకుగా, ఉత్సాహముగా, ప్రేరణ ఇచ్చేవారి తోడ్పాటు తప్పనిసరిగా అవసరమవుతుంది. 

మనిషి అరవై ఏళ్లు బ్రతుకుతాడు అని లెక్కలేసుకుంటే - మొదటి ఇరవై ఏళ్లు ఏమీ తెలీని వయస్సులో ఉంటాం. చివరి ఇరవై ఏళ్లు చెయ్యటానికి శక్తీ, శరీరం సహకరించదు. ఇక మధ్యన ఉన్నఇరవై ఏళ్లు - అసలైన సమయం. మనజీవితం, భవిష్యత్తు ఎలా ఉండాలో దానికి తగ్గట్లుగా శ్రమ చేసి, పాకులాడే వయస్సు. కానీ ఆ సమయాన్ని - ఇలాంటి నిరాశాపూరిత మాటలు వింటూ ఉంటే అసలైన కాలం వృధా అవుతుంది. ఇలా ఎందుకనిపిస్తుంది అంటే - ఆరేళ్ళు సహవాసం చేస్తే - వారు వీరు అవుతారు. వీరు వారవుతారు అనీ.. అంటే వారిలా అన్ని విషయాల్లో నిరాసక్తముగా ఉంటూ ఉంటాం. జీవిత చరమాంకంలో - మన జీవితాన ఏమి సాధించాం అన్న ఆలోచన వస్తే - ఖచ్చితముగా తీవ్ర విచారమే కలుగుతుంది. వచ్చి మళ్ళీ జీవితాన్ని పునర్మించుకుందామని అనుకున్నా రాలేని కాలం. అందుకే జాగ్రత్తగా ఉండమని చెప్పేది. 

మరి ఇలాకాకుండా ఏమి చెయ్యాలి  / ఇలాంటి నిరాశాపూరిత మనస్తత్వాల మనష్యుల సహవాసం నుండి బయటపడాలీ అనుకుంటే దానికి సులువైన, అద్భుతమైన పద్ధతి - చురుకుగా, జీవితాన ఎప్పుడూ సంతోషముగా ఉండేవాళ్ళు, లోకం గురించి బాగా తెలిసిన వారితో సహవాసం. నిజానికి ఇది కూడా నిరాశాలాగే అంటువ్యాధిలా ఉంటుంది. కానీ దీన్ని అంటించుకోవడానికి అంతగా ఇష్టపడం. వారి సహచర్యంలో మనం మన జీవితాన ఎన్నడూ చూడని క్రొత్త సంతోషాలకు, ప్రేరణలకూ ఆలవాలం అవుతుంది.  మిగిలిన జీవితాన్ని క్రొత్తగా మొదలు పెట్టామా అన్నట్లు అగుపిస్తుంది. ఇన్నిరోజులూ ఇలాంటి జీవితాన్ని ఎందుకు, ఎలా మిస్ అయ్యామా అనిపిస్తుంది. అనవసరముగా అలాంటి నిరాశాపూరిత వ్యక్తుల సహవాసం చేసి, అమూల్యమైన సమయాన్ని ఎందుకు వృధా చేశామా అనిపిస్తుంది. 

ఇక్కడ ఒక విషయాన్నీ బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవితాన ఎదురుపడే ప్రతి వ్యక్తీ మనకి స్నేహితుడు కాకపోవచ్చు, మనకి స్నేహితుడయిన వ్యక్తి ఒక మంచి మిత్రుడు కాకపోవచ్చు. అలాగే నిరాశాపూరితమైన వ్యక్తిని వదులుకొనే ముందు - తనలోని ప్రతిభాపాటవాల్ని తెలుసుకోండి. ఒక్కోసారి ప్రతిభావంతులు - తమ తమ రంగాల్లో ఏర్పడ్డ అనుకోని అపజయాల వల్ల కూడా అలా తయారవవచ్చు. అలాంటి సమయాల్లో మీరు నిరాశ నుండి బయటపడి, వారిని బయటకు లాగేయ్యండి. అలాచేసిన నాడు మిమ్మల్ని జీవితాంతం మీ పట్ల కృతజ్ఞతగా ఉంటారు. 

Sunday, November 9, 2014

Good Morning - 570


మీకు ఇష్టం లేని పనులు చెయ్యడం నేర్చుకోండి. 
మీకు నచ్చని వారితో సమయం గడపడం నేర్చుకోండి. 
అలా చేస్తూ కూడా మీ మీ జీవితాన్ని 
ఆనందముగా, ప్రేమగా, అర్థవంతముగా జీవించడం నేర్చుకోండి. 

నిజమే ! ఎప్పుడూ మనకిష్టమైన పనులే కాకుండా ఒక్కోసారి ఏమాత్రం ఇష్టం లేని పనులు చెయ్యాల్సి వస్తుంది. అలా ఆయా పరిస్థితుల్లో చెయ్యక తప్పదు. ఉదాహరణకు - అత్తగారు చెప్పిన పనులు కోడలు చెయాల్సిరావడం, ఆఫీసులో బాస్ చెప్పిన పనులు ఉద్యోగి చెయ్యాల్సి రావడం వంటివి. నిజానికి తమకి ఏమాత్రం ఆసక్తిలేనివి అని అవతలి వారికి తెలిసినా కావాలనో, తప్పకనో ఆ పనులు చెయ్యమని పురమాయిస్తారు. 

అలాంటి సమయాల్లో మనం గొడవ పడితే - ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఆ పని మీతో కాకున్నా వేరేవారితో అప్పటికి చేయించుకోవచ్చు. కానీ దానివలన నష్టపోయేదీ మనమే.. అలాగే నచ్చని వారితో కూడా ఉండాల్సి రావడం జరుగుతుంది. అలాంటి సమయాల్లో చక్కని కిటుకు ఒకటుంది. అదేమిటంటే - మీవైపు నుండి కాకుండా వారివైపు నుండి వారిని అర్థం చేసుకోండి. అప్పుడు నచ్చటం లేదు అన్న స్తాయి నుండి కనీసం - ఫరవాలేదు అనిపిస్తుంది. జీవితం అన్నాక ఇలాంటి ఇబ్బందులు తప్పవు. అయినా అందరినీ కలుపుకుంటూ వెళ్ళితేనే మనం సంతోషముగా ఉండగలం. ఇలా ఉండనివారికి - అన్నీ దగ్గరికి వస్తూ దూరం జరిగిపోయి - చివరికి వారు ఒంటరిగా మిగిలిపోతుంటారు. 

నిజానికి బ్రతకడంలోని ఆనందం కూడా ఇలా కూడా లభిస్తుంది. ఇష్టం లేని, అర్థంగాని అవతలివారిని, వారి చర్యలనీ  - మనవైపు నుండి కాకుండా వారివైపు నుండి అలోచించి అర్థం చేసుకుంటే - వారి వల్ల ఏర్పడిన విసుగూ, అయిష్టత స్థానాల్లో ఆనందం వస్తుంది. అలా చేసుకున్న నాడు జీవితముగా చాలా చికాకులు తొలగించుకున్న వారిమి అవుతాము. 


Tuesday, November 4, 2014

కాళేశ్వరం వద్ద గోదావరి

తెలంగాణలో ప్రసిద్ధ పరమ శివుడి ఆలయం కాళేశ్వరం ( Kaleshwaram ) - కాళేశ్వర మరియు ముక్తేశ్వరం ( Muktheshwaram ) అని కూడా ప్రసిద్ధి. పవిత్ర గోదావరి నది ప్రక్కన ఉంది. ఆలయానికి కొద్ది దూరములో ఈ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఒకే పానపట్టం మీద రెండు లింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఒక లింగాన్ని యమ ధర్మరాజు ప్రతిష్టించాడు అందుకే కాళేశ్వరుడు (కాలుడు = యమధర్మరాజు, ఈశ్వరుడు = శివుడు) అని స్థల పురాణం. ఇంకో లింగాన్ని ముక్తీశ్వరుడు అని పిలుస్తారు. అంటే ఆ లింగాన్ని కొలిస్తే / అభిషేకం చేస్తే ఈ జన్మతో ముక్తి లభించి, సర్వ పాపాలు తొలగిపోయి, పునర్జన్మ లేకుండా ఉంటుంది అని విశ్వాసం. ఇక్కడ శివ అభిషేకాలు ఎక్కువగా ఉంటాయి. ఆలయ ప్రాంగణాన్ని చాలా విశాలముగా అభివృద్ధి చేశారు. ఎప్పుడో ఇరవై రెండేళ్ళ క్రితం వెళ్ళిన నాకు అప్పటికీ, ఇప్పటికీ ఆలయ అభివృద్ధి స్పష్టముగా కనిపించింది. 

ఇక్కడ ఉన్న గోదావరి నదిలో పిండ ప్రదానాలు మరియు ఆస్థిక నిమజ్జనాలకి కూడా ప్రసిద్ధి. ఉత్తర భారత దేశములో ఉన్న కాశీ ( వారణాసి ) వరకూ వెళ్ళలేని వాళ్ళు / స్థోమత లేనివారు ఇలా అనుకొంటారు - 
అక్కడ ప్రవహిస్తున్న గంగ - ఇక్కడ ప్రవహిస్తున్న గోదావరి 
గంగ జీవనది - ఈ గోదావరి కూడా జీవనది 
రెండూ ఎల్లప్పుడూ ప్రవహిస్తుంటాయి.
అక్కడా పిండ ప్రదానాలకి / ఆస్థిక నిమజ్జనానికి ప్రసిద్ధి - ఇక్కడా అంతే.
అక్కడ పురాతన శివాలయం - ఇక్కడా ప్రాచీనమైన శివుని ఆలయం.
కాశీ మరియు కాళేశ్వరం రెండూ పురాణ ప్రసిద్ధి ఆలయాలు. 
కాశీలోన లింగం స్వయం భూలింగం అయితే - ఇక్కడ యమధర్మరాజు చేసిన ప్రతిష్టలింగం. 
కాశీలోన గంగానదిలో యమున, సరస్వతి నదులు కలుస్తాయి అందుకే త్రివేణీ సంగమ స్థలంగా ప్రసిద్ధి. ఈ కాళేశ్వరం వద్ద కూడా గోదావరి ప్రాణహిత నదులు కలుస్తాయి. సరస్వతి నది అంతర్వాహిని అని ఇక్కడ చెబుతారు కాబట్టి ఇలా భావించుకొని, ఇక్కడికి చాలామంది ఆయా కార్యక్రమాలకి వస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలకు సాధారణముగా ప్రవహిస్తున్న కాలువలు కన్నా దగ్గరలోని నదులకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ నదులలో కూడా ఇలా ఇంకో నది వచ్చి కలిసే సంగమ స్థలాలకి మరింత అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అలాంటి స్థలాలు గొప్పనైనవన్న భావన చాలామందిలో ఉంది. అందుకే కాశీకి అంతటి ప్రాధాన్యత ఇస్తుంటారు అనిపిస్తుంది. 

నాకు తెలిసి ఉత్తర భారత దేశంలోని ఈ నది ఎప్పుడో అంతర్థానమైంది.. ఇక్కడ అంతర్వాహిని అంటే - తెలిసిన వారికి ఒప్పుకోబుద్ధి అవదు.. కానీ స్థల విశ్వాసాలని నమ్మాలి. అదే తృప్తి. ఆ తృప్తి అంటూ ఉంటేనే వెళ్ళిన పర్యటన సఫలం అయినట్లు అనిపిస్తుంది. లేకుంటే వెళ్లామా ! వచ్చామా !! అన్నట్లు అగుపిస్తుంది. 

పిండప్రదానాలకి అవసరమైన పూజా సామాగ్రి 80 - 100 రూపాయల్లో వస్తాయి. పిండప్రదాన పంతులుకి పూజ చేసేందుకై 516 రూపాయలు తీసుకుంటాడు. ఇది అక్కడ ఫిక్స్ రేటు. పది రూపాయలు కూడా తగ్గించరు. మామూలుగా అయితే పది, పన్నెండు రోజులప్పుడు చేసిన పూజ సరిపోతుంది. మనసులో ఏమూలనో అది సరిపోలేదు, ఇదే చివరిసారి ఆస్థికలకు పూజ అని భావించిన వారు ఇక్కడ మళ్ళీ పూజ ( పది, పదిహేను నిముషాల పాటు ఉంటుంది ) చేసుకుంటారు.. ఇది ఎవరి ఇష్టాలకు వారికి సంబంధించినది. గంగానది వద్ద జరిగినట్లుగా ఇక్కడ ఆస్థికలకు పూజ ఉండకపోవచ్చు. 

తరవాత మూములుగా గోదావరినదిలో ఆస్థికలని కలుపుతారు. లేదా ప్రాణహిత గోదావరి నదీ సంగమ స్థలంలో కలుపుతారు. అలా సంగమ స్థలంలో కలపాలీ అంటే ఏదైనా నాటు పడవ గానీ, మోటార్ బోటుని తీసుకొని వెళ్ళాలి. ఇందులకు మామూలు రోజుల్లో బోటు వారు 500 రూపాయలు తీసుకుంటారు. నదీ సంగమ స్థలంలో మోటారు బోటుని ఆపుతారు. అప్పుడు వెనక్కి చూడకుండా ఆస్థికల పాత్రని వెనక్కి తిరిగి, భుజం మీదుగా ఆ సంగమ ప్రదేశంలో వేస్తారు. సంగమ స్థలంలో కలిపాక - అవతలి ఒడ్డున ఆపితే, అక్కడ లోతు తక్కువ స్థలం చూసుకొని, పదకొండు మునకలు మునుగుతారు. స్నానాదులు అయ్యాక తిరిగి అదే పడవలో ఇవతలి ఒడ్డున చేరుస్తారు. 

గోదావరి నదిలో స్నానాదులు చేసేటప్పుడు లోతు స్థలాలకి వెళ్ళకూడదు. ఎందుకంటే - అక్కడక్కడా లోతైన గుంటలు ఉంటాయి. మనం స్నానం చేస్తున్న ప్రదేశం బాగానే ఉంది అనుకొని కాస్త దూరం ( కొద్ది అడుగుల దూరం) వెళ్ళితే - గల్లంతు అయిపోవటం మామూలే. ఎందుకంటే - నీళ్ళలో ఉన్న రాతి గుట్టలు, ( ఫోటోలలో చూడవచ్చును ) ఇసుక తోడిన గుంటలూ, ప్రవాహానికి కోసుకపోయిన ఇసుక మేటల వల్ల అలా జరుగుతుంటాయి. చాలామంది అత్యుత్సాహం చూపి, హెచ్చరికలు బేఖాతరు చేసి, గల్లంతు అయినవారు చాలామందే ఉన్నారుట. అందుకే స్నానాల ఘాట్ వద్ద ఒక బోర్డ్ కూడా పెట్టారు. 

గోదావరి నీరుని బాటిళ్ళలో నింపుకొని ఇంటికి తీసుకొని రావటం ఇక్కడ పరిపాటి. ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని, అక్కడికి ( కాళేశ్వరం వరకూ ) రాలేని ఇంటిల్లిపాదీ ఇంటివద్దే స్నానాలు చెయ్యటం - తద్వారా తాము ఆ గంగ ( గోదావరి ) నీటితో స్నానం చేశామనే తృప్తి భక్తులకు ఉంటుంది. కొంతమంది ఆ సంగమ స్థలం వద్ద నీటిని తీర్థంలా కూడా సేవిస్తుంటారు. అందుకే ఇక్కడికి వచ్చినవారు సాధ్యమైనన్ని బాటిళ్ళలో పవిత్ర గోదావరి నీటిని ఇంటికి తీసుకవెళతారు. 

కాళేశ్వరానికి దారి ఫోన్ GPS ద్వారా తెలుసుకుంటూ వెళ్లాను. రూట్ మ్యాప్ మీకోసం. కారులో బయలుదేరాం కాబట్టి కొద్దిగా మాత్రమే ఆలసట అనిపించింది. ఇందులో మీకు హైదరాబాద్ నుండి దారి మరియు మధ్యలో వచ్చే ప్రదేశాలు, దూరం, గమ్యం చేరటానికి పట్టే కాలం.. ఉన్నాయి. 


ఈమధ్య అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గోదావరి అందాలు నా మొబైల్ కెమరాతో తీశాను. అవి ఇప్పుడు మీకోసం. 

ఇదే కాళేశ్వరం వద్ద నున్న గోదావరి పరివాహక ప్రాంతం. హెచ్చరిక బోర్డ్ కూడా ఉంది. ఫోటోలో సగం కనిపిస్తున్నది. స్నానాలకు, ఇతర కార్యక్రమాల కోసం మెట్లు కూడా కట్టారు. 


ఇవి గోదావరి నదిలో ఉన్న రాళ్ళ గుట్టలు. నీరు తక్కువగా ఉన్నందున ( ఈసంవత్సరం తగినంత వర్షపాతం లేదు కనుక ) ఇలా నదిలో నీరు తగ్గి, ఇలా రాళ్ళు బయట పడ్డాయి. 


ఇవీ రాళ్ళ గుట్టలే.. ఒడ్డు నుండి నదీ లోపలికి వెళుతున్నప్పుడు కనిపిస్తాయి. ఎగుడు దిగుడుగా ఉంది, నీరున్నప్పుడు కాళ్ళు జారి నీటిలోన పడిపోతాం.. కనుక జాగ్రత్త. అలాగే ఇక్కడ మనుష్యులు వేసిన చెత్తనీ చూడవచ్చును. ఇక్కడ కూడా స్వచ్ఛ భారత్ ప్రోగ్రాం నిర్వహిస్తే బాగుండును. 


ఇదే పవిత్ర గోదావరి నది.


మోటార్ బోటు నుండి గోదావరి నదీ అందాలు. 


మత్స్యకారుల తాత్కాలిక ఆవాసాలు. 


తీరానికి దూరముగా.. 


మోటార్ బోటులో గోదావరి - ప్రాణహిత - సరస్వతి నదుల సంగమ స్థలానికి బయలుదేరినప్పుడు -


అలా తీరము నుండి దూరముగా జరుగుతూ, నదీ మధ్యలోకి రావటం.. 


ఈ క్రింది ఫోటోనే - గోదావరి - ప్రాణహిత - సరస్వతి నదుల సంగమ స్థలం. మహారాష్ట్ర నుండి ప్రాణహిత వచ్చి, ఇక్కడే గోదావరి నదిలో కలుస్తుంది. 





గోదావరి ఇసుక తిన్నెల అందాలు. 









అక్కడ ఎవరో చేసిన - సైకత శివలింగం.. ఎవరోగానీ చాలా బాగా చేశారు.





Saturday, November 1, 2014

కాళేశ్వర ముక్తీశ్వర ఆలయం.

కాళేశ్వర ఆలయం Kaaleshwara muktheeshwara alayam తెలంగాణా రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో - గోదావరీ నది పరివాహక ప్రాంతములో ఉంటుంది. ఈమధ్య అక్కడికి వెళ్ళినప్పుడు తీసిన ఫొటోస్ మీకోసం.. ఆలయం లోపల ఫోటోలు తీయడం నిషిద్ధం కాబట్టి పూర్తిగా అందించలేకున్నాను. 

ఆలయ ప్రవేశద్వారం. ఉదయం మరియు సాయంకాల సమయాల్లో ఆలయం తెరుస్తారు. సాయంత్రం నాలుగు గంటలకి తెరుస్తారు. అప్పటివరకూ భక్తులు ఇక్కడే ఉంటారు. 


బయట కనిపిస్తున్న ఆ అల్యూమినియం గ్లాస్ ఛాంబర్ - స్వామీ వారి ప్రసాద కౌంటర్. ఇక్కడే లడ్డూలని ఇస్తారు.


ఆలయ ప్రవేశ ద్వారం. 


అప్పటికి ఇంకా తీయలేదు కాబట్టి ప్రక్కన ఉన్న మరో గుడికి వెళ్లాను. ఎడమ ప్రక్కన నుండి ఆలయ ప్రవేశ ద్వారం. 


ఎడమ ప్రక్కన నుండి ఆలయ ప్రవేశ ద్వారం. 


ఎడమ ప్రక్కన నుండి ఆలయ ప్రవేశ ద్వారం. 


రావి చెట్టుకి ఇక్కడ పూజలు చేస్తారు. 



గుడిలోపల శివ పార్వతుల కళ్యాణ ఘట్టాన్ని ఇలా మండపములో ఆవిష్కరించారు. 


ఈ డబ్బా - లడ్డూ ప్రసాదం కి సంబంధించినది. ఒక లడ్డూ Rs. 10 కి మామూలుగా ఒక లడ్డూ కవర్ లేకుండానే ఇచ్చేస్తారు. Rs. 20 ఇలా స్వామివారి ఫోటోలు గల ఒక డబ్బాలో రెండు లడ్డూలు పెట్టి ఇస్తారు. ఇలాగే ఎవరికైనా ప్రసాదం కానుకగా ఇవ్వొచ్చు అనీ. ప్రసాదం తినేశాక - ఈ డబ్బాలని చెత్తలో వెయ్యటానికి మనసొప్పదు.. కారణం స్వామివారి ఫోటో ఉండటం వల్లే. నేను ఇబ్బంది పడ్డాను. 




Related Posts with Thumbnails