Sunday, December 30, 2018

Fluorescent Tube light - starter

ఈరోజు ఇంటిలోని హాల్ గదిలోనికి క్రొత్త LED ట్యూబ్ లైట్ పట్టీ తెచ్చాను. అప్పటివరకూ హాల్ గదిలో - గత ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఒక వెలుగు వెలుగుతున్న ఫ్లోరోసెంట్ ట్యూబ్ లైట్ ని తీసేసి ఇది అమర్చాల్సి వచ్చింది. ఆ కథాకమామీషు ఇప్పుడు..

1998 సంవత్సరములో Anchor ఆంకర్ కంపనీ క్రొత్త ట్యూబ్ లైట్ కంప్లీట్ సెట్ తెచ్చి అమర్చాను. అప్పట్లో ఈ ట్యూబ్ లైట్ ఉండటమే ఒక హోదాగా ఉండేది. అప్పట్లో ఈ మొత్తం సెట్ ధర 400 రూపాయలు ( ఇప్పుడు అయితే మరీ చవక అయ్యాయి ) అప్పట్లో ఈ ట్యూబ్ లైట్స్ వెలిగించాలంటే స్టార్టర్స్ తప్పనిసరి. ఈ స్టార్టర్స్ ధర మూడు రూపాయల నుండి పదిరూపాయల వరకూ ఉండేవి. ఈ పది రూపాయలవి దాంట్లో సిరామిక్ లేదా ప్లాస్టిక్ తో కప్పిన కెపాసిటర్ ఉండేది. స్విచ్ వెయ్యగానే ఈ స్టార్టర్ సహాయాన ట్యూబ్ వెలిగేది. ఇప్పటికీ ఇలాంటి ట్యూబ్ వాడుతున్నారు.. త్వరలోనే వీటికి కాలం చెల్లబోతున్నది.

Tube light starters 
ఇవే ట్యూబ్ లైట్ స్టార్టర్స్  


 ఇక ఈ ప్రక్కన ఉన్నది ఆ స్టార్టర్ లోని చిన్న బల్బ్. ఇది వెలిగే ఆ ట్యూబ్ లైట్ ని వెలిగిస్తుంది. ఇది కనపడకుండా పైన అల్యూమినియం డబ్బా లాంటిదో, లేక ప్లాస్టిక్ డబ్బాలోనో ఉంటుంది. ఇది ఇలా స్పష్టముగా ఉంటేనే ఆ స్టార్టర్ బాగా పనిచేస్తుంది. ఇంకా ఇలాంటివి స్టార్టర్స్ వాడుతున్న వారికి ఒక టిప్ చెబుతున్నాను.. స్విచ్ వెయ్యగానే 20 సెకన్లలోగా టూబ్ లైట్ వెలిగిందా ఓకే! ఒకవేళ వెలగకపోతే వెంటనే స్విచ్ ని ఆఫ్ చెయ్యండి. ఇలా చేస్తే ట్యూబ్ మరియు స్టార్టర్ మన్నిక పెరుగుతుంది. ఇపుడైతే వోల్టేజీ సరిగానే ఉంటునది కాబట్టి త్వరగానే వెలుగుతున్నాయి. 
ఇదేమో - స్టార్టర్ లోని బల్బ్ కి అదనముగా ఉండే కెపాసిటర్ టైపు. దీనివలన మరింత ఎక్కువగా సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా మరింత త్వరగా ట్యూబ్ లైట్ ని వెలిగిస్తాయి. ఆ తెల్లగా ఉన్నదే కెపాసిటర్. అలాకాకుండా గోధుమ రంగులో గుండ్రముగా, బద్దలా ఉండే కెపాసిటర్స్ కూడా ఉన్న స్టార్టర్స్ ఉన్నాయి. నాకైతే ఇవన్నీ అనుభవ రూపేణా తెలుసుకున్నవి. 

ఇక ఈ ప్రక ఫోటోలోలాగా స్టార్టర్ బల్బ్ నల్ల బడిందీ అంటే ఇక ఆ స్టార్టర్ ని మార్చాల్సిన సమయం వచ్చినట్లే.. దాన్ని అలాగే ఇంకా వాడుతుంటే - ట్యూబ్ లైట్ మీద ప్రభావం చూపి - ఎక్కువసార్లు ఫ్లాష్ లు వచ్చేలా చేసి, ట్యూబ్ లైట్స్ చివర్లు నల్లగా అయ్యేలా చేస్తుంది. ఫలితముగా ట్యూబ్ మరియు స్టార్టర్ కూడా మార్చాల్సి వస్తుంది. పది రూపాయల మార్పు ఆలస్యమైతే - యాబై రూపాయల ట్యూబ్ వల్ల జేబుకి చిల్లు పడుతుంది. ఇది చాలామందికి తెలీదు అనే ఇంత వివరముగా వ్రాశాను. ఎవరైనా ఇలాగే వాడుతూ ఉంటే స్టార్టర్స్ ని త్వరగా మార్చుకోండి. ( నేనైతే ఆ స్టార్టర్ కవర్ ని తీసేసి, అలాగే దాని స్థానములో ( స్టార్టర్ హోల్డర్ లో ) బిగించి వాడేవాడిని. అందుకే ఇంతబాగా తెలుసుకొని చెప్పగలుగుతున్నాను. 

 ఈ ప్రక్కగా ఉన్న ఫోటోలో - స్టార్టర్ లోని బల్బ్ స్విచ్ వెయ్యగానే  ఇలా లేత వంకాయ రంగులో వెలుగుతుంది. అలా వెలగటం వల్ల వచ్చిన స్పార్క్ Spark వల్ల ట్యూబ్ వెలుగుతుంది.

కొన్ని స్టార్టర్స్ లలో ఇలాంటి బల్బ్స్ కూడా ఉంటాయి. బల్బ్ లోని తీగ చుట్టూరా ఇలాంటి తెల్లని / లేత నీలి రంగు / లేత వంకాయరంగు లోని విద్యుత్ మెరుపుని స్పష్టముగా చూడవచ్చు. 

ఆ తరవాత వీటిల్లో మార్పులు వచ్చాయి. ఎలక్ట్రానిక్ చోక్స్ వచ్చాయి. వచ్చిన మొదట్లో వీటి ఖరీదు - మొత్తం సెట్ 700 ఏడువందల రూపాయల్లో ఉండేది. అప్పట్లో ఉన్న గ్రామ్ బంగారు మారకం విలువ ప్రకారం అప్పటి ఆ 700 ని ఇప్పట్లోకి ఉన్న విలువలోకి మారిస్తే ఈ క్రొత్త ఎలక్రానిక్ ఛోక్ ట్యూబ్ సెట్ ధర ఆరేడు వేల ( 6,000 - 7,000 ) వరకూ ఉండేది అన్నమాట. అందుకే అప్పట్లో అవి ఎవరికీ తెలీకుండా - చరిత్రలోకి చేరిపోయాయి. నేను కొందామనుకున్నా వాటి లభ్యత నాకు కుదరలేదు.. కానీ ఇతరుల ఇళ్ళల్లో చూశాను. 

ఆ తరవాత ఎలక్ట్రానిక్ చోక్స్ వచ్చాయి. 200 రూపాయల ధరలో ఉన్నప్పుడు ఒక ఛోక్ తీసుకవచ్చి, మొదట్లో చెప్పిన - తీసేసిన ట్యూబ్ సెట్ కి నేనే బిగించాను. అది చాలా రోజులు పనిచేసింది.. ఇప్పటికీ పనిచేస్తూనే ఉంది కూడా. దీనివల్ల స్విచ్ వెయ్యగానే ట్యూబ్ లైట్ వెంటనే - ఆలస్యం ఏమీ లేకుండానే వెలగటం మొదలయ్యింది. అలాగే లో వోల్టేజీ ఉన్నా చక్కగా పనిచెయ్యటం చవి చూశాను. వీటి హవా చాలా ఏళ్ళు కొనసాగింది. ఇప్పుడిప్పుడే వీటి అమ్మకాలు తగ్గుతున్నాయి - అదీ LED ట్యూబ్ లైట్స్ రాకతో.. ఇవీ చరిత్రలో కలిసిపోయే రోజు త్వరలోనే ఉంది కూడా. ఈ క్రొత్తగా తీచ్చిన LED ట్యూబ్ గురించి మరొక పోస్ట్ లో వివరముగా మాట్లాడుకుందాం.. ఆ పోస్ట్ పెట్టాక ఇక్కడ లింక్ కూడా ఇస్తాను. Friday, December 28, 2018

Good Morning - 751


మనం చిన్నప్పుడు వ్రాసుకోవటానికి పెన్సిల్ వాడేవాళ్ళం. ఇప్పుడు పెన్ ని వాడుతున్నాం. పెన్సిల్ వాడుతున్నప్పుడు - మన తప్పులని రబ్బర్ తో తుడిపేసే వాళ్ళం. ఇప్పుడు అలా చెయ్యలేం.. జీవితం అంతే!. 

అవును.. చిన్నప్పుడు మనం ఏదైనా వ్రాయటానికి పెన్సిల్ వాడేవాళ్ళం. పెన్సిల్ తో కాస్త బాగా వ్రాయటం వచ్చాక పెన్ ని వాడేవాళ్ళం. పెన్సిల్ తో వ్రాస్తున్నప్పుడు ఏదైనా పదాలు / అక్షరాలు తప్పుగా వ్రాస్తే - దాన్ని తుడిచివేయటానికి  రబ్బర్ ని వాడేవాళ్ళం. ఆ తరవాత సరియైన పదాన్ని / అక్షరాన్ని వ్రాసేవాళ్ళం కదూ.. కానీ జీవితం విషయంలో  అలా కుదరదు. చేసిన తప్పులని. పొరబాట్లని ఏమాత్రం తుడిచివేయానికి కుదరదు. కానీ చేసిన తప్పులని - సమీక్షించుకొని ఎక్కడ తప్పు చేశామో తెలుసుకొని, ఆ తప్పుని సరిచేసుకొని ( క్షమాపణ / నష్టపరిహారం / నష్ట పరిహార చర్యలు ) అవకాశం తప్పక ఉంటుంది. అది మాత్రం మరచిపోవద్దు.  Saturday, December 22, 2018

Quiz

ఈ క్రింది కుళాయిల్లో ఏది తొట్టిని నింపుతున్నది..? 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : ఇలాంటి ప్రశ్నలకు సమాధానము తేలికగా తెలుసుకోవటానికి - రివర్స్ లో వెనక్కు ఆలోచించాలి. అలా అయితే ఖచ్చితమమైన సమాధానం తేలికగా, త్వరగా గుర్తుపట్టవచ్చు. 
ఇక్కడ సమాధానం రెండవ కుళాయి. 
Friday, December 7, 2018

​[తెలుగుబ్లాగు:22458] త కి ర వత్తు మరియు య వత్తు ఇవ్వటానికి సూచన

[తెలుగుబ్లాగు:22458] త కి ర వత్తు మరియు య వత్తు ఇవ్వటానికి సూచన ఇవ్వండి

నాకు "త కి ర వత్తు మరియు య వత్తు" (trya - త్ర్య) అని ఇవ్వాల్సిన అవసరం వచ్చింది.  లేఖిని లో రావట్లేదు. దీనికి సూచన ఇవ్వగలరు. 

ఈ ప్రశ్నకు నేనిచ్చిన సమాధానం..

త్ర్య ని లేఖినిలో తేలికగా వ్రాయోచ్చును.. మీరు ఆ అక్షరం ఎలా ఉండాలని చెప్పారో - అచ్చు ఈ క్రింది విధముగా వ్రాస్తే చాలు.. మీకు కావాల్సిన త్ర్య అక్షరం వస్తుంది. కావాలంటే ఈ దిగువన జతపరచిన తెరపట్టు - స్క్రీన్ షాట్ ని గమనించవచ్చు.
            

Wednesday, December 5, 2018

చలికాలం - స్నానాలు

ఇది నా చిన్ననాటి జ్ఞాపకం. ఇప్పుడంటే గీజర్లు, వాటర్ హీటర్స్ వచ్చాయి కానీ - అప్పట్లో వేడి నీళ్ళు కావాలంటే కట్టెల పొయ్యి మీద రాగి, ఇత్తడి లేదా అల్యూమినియం పెట్టి, ఆ పాత్రల్లో నీరు పోసి, క్రిందన కట్టెలు, కొబ్బరి పీచు కానీ, పిడకలు కానీ పెట్టి, వాటిని కాసింత కిరసనాయిలుతో తడిపి, అగ్గిపుల్ల సహాయాన దాన్ని మండించే వాళ్ళం. ఆ వేడికి కాగిన నీళ్ళను స్నానాలకు వాడుకొనే వాళ్ళం. అప్పట్లో చాలామంది ఇళ్ళల్లో - చలికాలం వచ్చిందంటే ఇదే తంతు.. 

ఇక మరింత పెద్ద కుటుంబాలలో - వారి స్నానపు గదుల్లో కానీ, ఆరు బయట గానీ, పెరడుల్లో గానీ బాత్ రూమ్ ప్రక్కనే మూడు రాళ్ళు వేసి, వాటిల్లో కట్టెలను పేర్చి, వాటిని కిరసనాయిల్ తో వెలిగించి, పైన పెద్ద అండా / డేకిసా / బగోనే / కొప్పెర / పెద్ద పాత్రని ఉంచి నీరు వేడి చేసేవాళ్ళు. 

పై రెండింట్లో ప్రధాన ఇంధన వనరు - కట్టెలు. వీటిని ఒక వైపుగా సిద్ధం చేసుకొని ఉండేవాళ్ళు. వర్షాకాలంలో తడిచి / చూరు గుండా కారే నీటితో తడిచి / ఈదురు జల్లుల వల్ల / స్నానం నీరు చింది ఆ చెక్కలు నాని మంట సరిగా రాక - బాగా పొగ వచ్చేది. ఒక గొట్టాన / పైపు సహాయాన ఆ నిప్పుల మీదకు నోటితో ఊదుతూ మంటకు ప్రయత్నించే వాళ్ళు. ఈ తెల్లని పొగ వల్ల ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసినట్లుగా ఉండేది. సరిగా మండని కట్టెల వాసన దీనికి అదనం. 

ఇక ఆ వేడి నీటి పాత్రల బాహ్య రూపం అంతా ఆ పొగ వల్ల నల్లగా మసి / మురికి / మకిలి పట్టేది. వీటిని ఇంటివారో, పనివాళ్ళో కొబ్బరి పీచు / ఇసుక / పుల్లని చింతపండు రసం / మిగిలిపోయిన సాంబారు రసం / బూడిద ఇలా నానా పదార్థాలతో మెరిసేలా తోమి మళ్ళీ వాడేవాళ్ళు. ఆతర్వాత కొద్దిరోజుల వాడకంతో మళ్ళీ ఎప్పటిలా నల్లగా / జిడ్డుగా మారేది. అయిననూ విసుగు చెందక - మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకుంటూ వాడేవాళ్ళు. ఇప్పుడైతే "ఇంత" శుభ్రం చేసి వాడుకొనే వాళ్ళు చాలా తక్కువనే చెప్పుకోవాలి. 

అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి నలుగురూ సాయం చేసేడి వాళ్ళు. స్నానానికి బోలెడంత క్యూ ఉండేది. ఇక పండుగలకూ, పబ్బాలకు తలంటి స్నానం వల్ల ఈ స్నాన కార్యక్రమం అంటే విసుగొచ్చేది. స్నానం చెయ్యకుండా ఇల్లంతా తిరుగుతుంటే - నాన్నేమో తిట్లతో తలంటే వారు. ఇక అమ్మేమో - ప్రొద్దునే తలంటి స్నానం చేసి, మడి అంటూ ఇల్లంతా తిరగనిచ్చే వారు కాదు.. ఆ బాధలు పడలేక ఏదో తొందరగా స్నానం కానిచ్చేసేవాళ్ళు. అప్పుడైనా స్నానానికని వేడి నీళ్ళు బాత్ రూమ్ లో పెట్టుకున్నామా - బావ గారనో, చుట్టాలో చేస్తారని ఆ పెట్టుకున్న వేడి నీళ్ళు కాస్తా వారికే వెళ్లిపోయేవి. మళ్ళీ నీరు వేడి చేసుకొని ... పోసుకొని స్నానం కానిచ్చేసేయ్యాల్సిందే. ఆ నీరు వేడెయ్యేదాకా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాల్సిందే. 

ఇహ ఇదంతా నాల్ల కాదనుకున్నవారు - ఊరిలో ఏదైనా చెరువో, వాగో, కుంటనో గానీ ఉంటే అక్కడికే వెళ్లి స్నానం చేసి వచ్చేవారు. నాకింకా జ్ఞాపకం. ఉమ్మడి కుటుంబాలలో - పండుగ పబ్బాలలో స్నానం అయ్యేలోపు, కాస్త తెలివిపరులు - సమీప పుణ్యక్షేత్రాలకు ఏదైనా బండి మీద వెళ్లి అక్కడ స్నానం.. దర్శనం చేసుకొని వచ్చేవారు. అప్పటికీ ఇంట్లో స్నానాలు పూర్తయ్యేవి కావు.. కారణం సరిగా మండని కట్టెలు, వేడి నీరు అయ్యే సమయం,  స్నానం చేసేవాళ్ళు బోలెడంత మంది క్యూలో ఉండటం.. ఇవీ ప్రధాన కారణాలు. 

ఈ వేడినీటితో స్నానాలు చేస్తామా - బయటకు వచ్చాక పెట్టే చలికి గజగజా వణుకుతూ ఉండేవాళ్ళం. నిజానికి చన్నీళ్ళ స్నానం ఎంతో మంచిది. కానీ ఈ చలికాలంలో ఆ మాటని ఒప్పుకోరు. 

ఇప్పటివాళ్ళకు / నేటితరం వాళ్లకు ఈ ఇబ్బందులు ఏమిటో తెలీవు. ఎంచక్కా గీజర్స్ వాడి ఇట్టే స్నానం చేసుకొని వచ్చేస్తారు. వారికి అప్పటికాలంలోని స్నానాలు అంటే ఏమిటో తెలియాలని ఈ టపా. 
Sunday, October 28, 2018

[తెలుగుబ్లాగు:22573] "స్వాతంత్ర్యము" వగైరా... పదాలు

[తెలుగుబ్లాగు:22573] "స్వాతంత్ర్యము" వగైరా... పదాలు 

Monday, September 24, 2018

Good Morning - 750


మనం అందరికీ నచ్చాలన్నది లేదు.. 
కాబట్టి ప్రతి ఒక్కరినీ సంతృప్తి పరచాలన్న ఆరాటం అనవసరం. 
మనపని మనం చేసుకుంటూ పోవాలి. 
మనల్ని ఇష్టపడాలా, వద్దా అనే ఎంపికని వారికే వదిలెయ్యాలి. 

అవును.. మనం అందరికీ నచ్చాలన్నది రూలేమీ లేదు. అలాగే మనం కూడా అందరికీ నచ్చతీరాలన్నది నియమమేమీ లేదు. మన ప్రవర్తన, భాష, నడవడిక, హుందాతనం, సంస్కారం... ఇత్యాది విషయాలే ఎదుటివారిని బాగా ప్రభావితం చేస్తాయి.. ( ఈరోజుల్లో అయితే మన వెనక ఉన్న పలుకుబడి, డబ్బూ కూడా ఈకోవకే చెందుతాయి. ) మనల్ని చూసి  మనతో వచ్చేవారితో సఖ్యతగా ఉండటం చాలా మంచిది. మనమంటే ఇష్టపడని వారినీ వారి మనసుల్ని ఆకట్టుకోవాలన్న తాపత్రయం మాత్రం మంచిది కాదు. అలా చెయ్యటం మీకు అమితమైన బాధని కలిగిస్తుంది. మనమంటూ ఎలా ఉండాలో అలాగే ఉంటూ జీవన ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. నచ్చిన వారు మనతో ఉంటారు. నచ్చినవారు మనతో ఉంటారు. నచ్చనివారు మన జీవితం నుండి వైదొలుగుతారు. అది వారి ఇష్టం. 
Monday, September 3, 2018

పొడుపు కథలు - 39


నేను శుభ్రముగా ఉన్నప్పుడు నల్లగా ఉంటా..
మురికిగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటా.. 
నేనెవరిని.. ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


Tuesday, August 7, 2018

Good Morning - 749


గతంలో సాధించిన విజయం చూసుకొని, మురిసిపడితే - భవిష్యత్తులో వచ్చే విజయాలు అన్నీ దూరం అవుతాయి. 
అన్నింటినీ సమానముగా పరిగణిస్తూ ముందుకు పయనం చేసినప్పుడే - మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాము. 

మనం ఎప్పుడో సాధించిన విజయాలను జ్ఞాపకం చేసుకుంటూ - నేనిలా చేశా, అలా చేశా, ఫలానా వారు మెచ్చుకున్నారు, నాతో ఇలా అన్నారు అనుకుంటూ ఉంటుంటే - ఆ మానసిక తృప్తితో ఇక ముందున్న కాలములో అంత కష్టపడలేని, నిరాశాపూరిత వాతావరణాన్ని మనమే మనకు తెలీకుండా కల్పించుకున్నవారిమి అవుతాం. అలా అనుకోవడం - ఒక సంతృప్తికరమైన ( Saturated సాచురేటేడ్ ) భావన. అది మన భవిష్యత్తు ఎదుగుదలని ఆపేస్తుంది. ఫలితముగా మనం ఎక్కడో ఒకచోట మన అభివృద్ధి ఆగిపోతుంది. అది ఆగింది అని తెలుసుకొనేలోపు మన జీవితాలలో ఎదుగుదల ఆగిపోతుంది. ఇది ఎక్కువగా - ఒకప్పుడు నేనిలా చేశా, ఇంతగా సంపాదించా, ఈ పని మొదటగా నేనే చేశా, ఈ ప్రాంతములో మొదటగా నేనే మొదలుపెట్టా... ఇలా చెప్పుకొనే వారి జీవితాలు చక్కని ఉదాహరణ. 

ఉదాహరణకు : ఒకతను బ్యాంక్ క్లర్క్ కావాలని - రాత్రింబవళ్ళు కష్టపడి ఆ ఉద్యోగం సాధిస్తాడు. పదే పదే నేను ఇంతలా కష్టపడ్డా అని అనుకుంటూ పోతుంటే - ఇక మేనేజర్ స్థాయికి ఎదగాలన్న లక్ష్యం మీద అంతగా దృష్టి పెట్టలేకపోతాడు. ఫలితముగా సాంఘికముగా మరింత హోదా, పలుకుబడి, సౌకర్యాలు, జీవన ప్రమాణాలు వచ్చేవి అలాగే నిలిచిపోతాయి. అందుకే మన లక్ష్యాన్ని ఒకటి తరవాత ఒకటి పెట్టుకుంటూ ఎదుగుతూ కష్టపడుతూ అభివృద్ధిలోకి రావాల్సిందే. అలా చేస్తే మన జీవితం మరింత బాగా అగుపిస్తుంది. 
Sunday, July 29, 2018

[తెలుగుబ్లాగు:22491] mlaana పదాన్ని లెఖినిలో వ్రాయడమెలా?

mlaana పదాన్ని లెఖినిలో  వ్రాయడమెలా?

మీరడిగిన mlaana అనే పదాన్ని లేఖినిలో తెలుగులో ఎలా వ్రాయాలి అని అడిగారు కదా.. అలాగే టైపు చేస్తే ఈ క్రింది - మొదటి తెరపట్టు లాగా వచ్చిందని అనుకుంటున్నాను. ( జూమ్ చేసి ఎర్రని గదుల్లో పెద్దగా అందరికీ కనిపించేలా చేశాను ) కొన్ని కాంబినేషన్ పదాలు టైపింగ్ లో ఇబ్బంది పెడుతాయి. 
ఇలాంటి కాంబినేషన్ పదాలని & కీ తో ( కీ బోర్డ్ లో shift + & ) వాడితే మీకొచ్చిన ఇబ్బందిని తేలికగా తొలగించుకోవచ్చును. అది ఎలాగో ఈ క్రిందన చూడండి. 
Saturday, July 21, 2018

Good Morning - 748


రోజూ ఓ గంటసేపు నిశ్చలంగా కూర్చో, ఆ కాసేపు మనోమౌనముగా ఉండు. ఆ తర్వాత ఒక తెల్లకాగితం తీసుకొని నీ లక్ష్యమేమిటో దానిపై వ్రాయు. ఆ లక్ష్యమే నీ గురువు, దైవం, ఆ కాగితాన్ని జేబులో పెట్టుకొని పడే పడే జ్ఞాపకం చేసుకో, అది నీకు శక్తిని, సామర్థ్యాన్ని ఇస్తుంది. 

ఈ ఉరుకుల పరుగుల పరుగుల జీవితములో కాసింత వీలు చేసుకొని - అది ఉదయమే కావొచ్చు, సాయంత్రమే కావొచ్చు.. ఆఖరికి రాత్రి పడుకొనే ముందే కావొచ్చు.. మనకు వీలున్నప్పుడు అది గంటైనా  కావొచ్చు, పట్టుమని పది నిముషాలే కావొచ్చు.. ఒక చోట ప్రశాంతముగా కూర్చోవాలి. అప్పుడు పరిపరివిధాలుగా ఆలోచనలతో పరిగెత్తే మన మనసుని నిలిపి, నిశ్చలముగా ఉంచాలి. మీ లక్ష్యాలేమిటో వాటిని ఒక చిన్న కాగితం మీద వ్రాసుకొని, మీ వెంటే ఉంచుకోవాలి. ఇలాంటి సమయాల్లో దాన్ని తెరచి, మననం చేసుకోండి. మీరు మీ లక్ష్యాల నెరవేరణలో మీరు ఎంత దూరం విజయవంతముగా రాగలిగారో మీరంతట మీరుగా విష్లేశించుకోండి. ఇలా చేస్తే అనతికాలములోనే మీ లక్ష్యాలని చేరుకోవచ్చు. 

మీ వెంట లక్ష్యాల కాగితాలను ఉంచుకోవడం కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. అందువల్లనేమో - పూజా కార్యక్రమాల్లో మనసులో సంకల్పించుకొని, చేతికి కంకణం కట్టుకోనేది ఇందువల్లనేమో అని అనుకుంటాను. దైనందిక జీవితములో అరచేతి వైపుగా తరచుగా చూస్తుంటాం. ఆ చేయికి కట్టిన కంకణం కనిపించి, మన లక్ష్యాన్ని గుర్తుచేస్తుంటుందని కాబోలు - అలా చేతికి కంకణం కట్టడం ఆచారముగా మారి ఉండొచ్చు. Monday, July 9, 2018

Good Morning - 747


విజయాలు, ఓటములు దినచర్యలో చిన్న భాగం మాత్రమే.. 
జీవితానికి అంతకు మించి లోతైన నిర్వచనం ఉంది. 
Thursday, July 5, 2018

Tuesday, July 3, 2018

Good Morning - 745


ఉన్నవాటితో ఏం చెయ్యాలో తెలియదు కానీ.. 
లేని వాటికోసం ఎప్పుడూ ఆరాటం ఆగదు. 

Friday, June 22, 2018

Good Morning - 744


మార్గం మార్చకు, 
లక్ష్యం మరవకు, 
ఎరుకతో ముందుకు సాగు, 
యాత్ర ప్రారంభించాక - అన్వేషిగా మిగిలిపో.. 
Sunday, June 17, 2018

బిగ్ బాస్ సీజన్ 2 కి వోటింగ్ చెయ్యడం ఎలా?

బిగ్ బాస్ సీజన్ 2 కి వోటింగ్ చెయ్యడం ఎలా? 
How to voting to BIG BOSS Telugu season 2 

స్టార్ మా టీవీలో ప్రస్తుతం ప్రసారం అవుతున్న - అత్యంత ప్రాచుర్యం పొందిన " బిగ్ బాస్ " కార్యక్రమం లోని పోటీదారులకు ఎలా వోటింగ్ చెయ్యాలో మీకు ఇప్పుడు తెలియ చేస్తున్నాను. చాలామంది వేరే వేరే సైటుల్లోని ఇలాంటి వోటింగ్ లలో పాల్గొని, వోటింగ్ అయ్యాక అప్పటికప్పుడు ఎవరికి ఎంత శాతం వోటింగ్ వచ్చింది అని తెలుసుకొని ఆనందపడుతున్నారు. కానీ అది నిజం కాదు. ఈ విషయం గత బిగ్ బాస్ సీజన్ 1 లో తెలిసింది. అప్పుడు కొన్ని సైట్స్ వ్యూయర్ షిప్ పెంచుకొని, ఆడ్స్ / ప్రకటనలు పెంచుకొని ఆదాయాలు పొందాయి. ఆ సీజన్ చివరిలో జూనియర్ ఎన్టీయార్ ప్రకటన వల్ల అప్పుడు నిజం తెలిసి, అధికార సైట్లో వోటింగ్ చేశారు. అందువల్ల ఆ సీజన్ చివరిలో వోటింగ్ శాతం బాగా పెరిగింది.

నిజానికి బిగ్ బాస్ అధికారిక సైటులోని వోటింగ్ మనం వెయ్యటమే కానీ, ఎవరికి ఎన్ని వోట్లు పడ్డాయి, వారికి వచ్చిన వోటింగ్ శాతం ఎంత అనీ, ఎవరికి తక్కువ వోట్లు పోలయ్యాయి / పడ్డాయి అన్నదీ... తదితర  ఇవేవి వివరాలు బయటకు తెలీవు. ఇక్కడ గమనించాల్సిన విషయాలు ఏమిటంటే :

  1. మనం వోటింగ్ వెయ్యటం వరకే మన పని.
  2. ఎవరికి ఎన్ని వోట్లు వెయ్యాలో అది మన ఇష్టం.
  3. మనం వోట్లు వేస్తేనే వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. లేకుంటే లేదు.
  4. మనకు ఏదైనా లింక్ ఇచ్చి, అది నొక్కి వచ్చిన సైటు కి వెళ్లి వోటింగ్ చెయ్యండి అనే విజ్ఞప్తులు ఏవీ రావు. ఒకవేళ వస్తే అది అధికారిక సైటు కాదని గమనించండి.
  5. వోటింగ్ వెయ్యగానే ఇక ఆ సైటు నిర్ణీత సమయం వరకు అంటే తరవాతి వోటింగ్ టైమింగ్ వరకు - మళ్ళీ వోటింగ్ చెయ్యటానికి కుదరదు. కానీ ఆ సైటు మనకి కనిపిస్తూనే ఉంటుంది, ఎవరికి ఎన్ని వోట్లు వేశామో కూడా కనిపిస్తూనే ఉంటుంది కూడా.
  6. అలాగే ఎవరికీ ఎన్ని వోట్లు వచ్చాయో ఏమీ కనిపించదు. అంటే మనం వోటింగ్ చెయ్యటం వరకే మన పని.
  7. ఇలా వోటింగ్ లో పాల్గొంటే మనకేమీ రివార్డ్స్ / పాయింట్స్ / బహుమతులు గానీ రావు. ఇన్ని వోట్లు వేస్తే లేదా మీరు వోట్లు వేసిన వారు గెలిస్తే మీకు ఫలానా బహుమతి వస్తుంది అనీ ఊరింపులు ఏమీ ఉండవు అని కూడా తెలుసుకొని ఉండాలి.

ఇక వోటింగ్ ఎలా చెయ్యాలో తెలుసుకుందాం. 
ఇందులో రెండు పద్ధతులు ఉన్నాయి. అవి :
  • 1. బిగ్ బాస్ పోటీదారుల / కంటెంస్టెంట్స్ కి ఇచ్చిన ప్రత్యేక ఫోన్ నంబర్స్ కి లాండ్ ఫోన్ లేదా మొబైల్ ద్వారా మిస్ కాల్ ఇవ్వడం. 
  • 2. ఆన్ లైన్ పద్దతిలోఒక ప్రత్యేక సైట్లోకి వెళ్లి వోటింగ్ చెయ్యడం. 
ఈ రెండో పద్ధతే చాలా తేలికగా ఉంటుంది. కంటెంస్టెంట్స్ యొక్క ప్రత్యేక నంబర్స్ ని టైపు చేసి, మిస్ కాల్ ఇవ్వడం కన్నా ఇది చాలా తేలిక. ఒకేసారి యాభై (50) వోట్లు వేసుకొనే వీలూ ఉంది.
ఇప్పుడు ఆ రెండో పద్ధతి అయిన ఆన్ లైన్ వోటింగ్ గురించి తెలుసుకుందాం.

ముందుగా ఆన్లైన్ లో గూగుల్ సెర్చ్ ఇంజన్ ని ఓపెన్ చెయ్యాలి. సెర్చ్ బాక్స్ లో BIGG BOSS TELUGU VOTE అని ఇంగ్లీష్ లో పెద్ద అక్షరాలలో అయినా సరే, చిన్న అక్షరాలలో అయినా సరే టైప్ చెయ్యాలి. అప్పుడు మీకు ఒక డ్రాప్ మెనూ వస్తుంది. అందులో అయినా బిగ్ బాస్ తెలుగు వోట్ ని ఎన్నుకొని ఎంటర్ చెయ్యాలి.


అప్పుడు మీకు ఇలా క్రింది విధముగా ఆ సైట్ కనిపిస్తుంది. ఈ షో లో పాల్గొనే వారు 16 మంది అయినా, ఇక్కడ మాత్రం కేవలం ఆరుగురు (6) మాత్రమే కనిపిస్తారు. ( త్వరలో మారుస్తారని అనుకుంటున్నాను ) మనకు నచ్చిన వారు / వోట్ వెయ్యాలని అనుకుంటున్న వారు ఆ లిస్టు లో ఉన్నారేమో ఒకసారి చూసుకోవాలి. 

ఇక్కడ ఉదాహరణకు : నూతన్ నాయుడు ని ఎంచుకున్నాను. తన ఫోటో ప్రక్కన ఉన్న ( ఎర్రని వృత్తములో చూపిన విధముగా ) త్రిభుజాకారాన్ని / బాణం గుర్తుని నొక్కాలి. 


అలా క్లిక్ చెయ్యగానే - తనకు ఇచ్చే పాయింట్స్ / స్కోర్ / వోట్స్ వేసేందుకు వీలుగా తన ప్రొఫైల్ వస్తుంది. తన ప్రక్కన - కుడి పై మూలన తనకు ఇచ్చిన వోట్స్ వస్తాయి. ఇప్పుడు అక్కడ 0 వోట్స్ ఉంటుంది. వోట్లు వేశాక మనం ఎన్ని వేశామో తెలిపే సంఖ్య అక్కడ నీలిరంగులో కనిపిస్తుంది. తన ఫోటో క్రిందన ఎర్రని వృత్తములో చూపిన నీలిరంగు చుక్కని మౌస్ సహాయాన - ఆ ప్రక్కన గీత వెంబడి జరపాలి / డ్రాగ్ చెయ్యాలి / స్లైడ్ చెయ్యాలి. మనం ఎన్ని వోట్లు వెయ్యాలని అనుకుంటున్నామో అంత సంఖ్య వచ్చేవరకూ జరపాలి. 

ఆ గీత చివరిలో సిమెంట్ రంగులో మనకు ఎన్ని వోట్లు ఉన్నాయో తెలుపుతుంది. ఇప్పుడే మొదలెట్టాం కాబట్టి మనకు యాభై ( 50 ) వోట్లు ఉన్నాయని చూపిస్తుంది. 


ఇప్పుడు తనకు ఇరవై వోట్లు ఇద్దామని అనుకుందాం. కుడి పైమూలన నీలిరంగులో ఆ సంఖ్య కనిపించేవరకూ ఆ నీలిరంగు చుక్కని జరపాలి. ఇప్పుడు మనం తనకు ఎన్ని వోట్లు వేశామో తెలుస్తుంది. ఇక మిగతావారికి వోట్లు వెయ్యాలని అనుకుంటే / లేదా అక్కడితోనే ఆపెయ్యాలని అనుకుంటే క్రిందన కుడి క్రింది మూలన ఉన్న- క్రింది ఫోటోలో ఎర్రని వృత్తములో చూపిన   CONTINUE  కంటిన్యూ బటన్ ని నొక్కాలి.

అప్పుడు ఇలా క్రింది విధముగా వస్తుంది. తన ప్రక్కన మనం వేసిన వోట్లు ఎన్నో తెలుస్తాయి. అలాగే ఇక మిగతావారికి వోట్లు వెయ్యాలని అనుకుంటే వారి ఫోటోల / పేర్ల ప్రక్కన ఉన్న బాణం గుర్తుని ఇంతకు ముందు తెలియచేసిన విధముగానే నొక్కి వోట్లు వెయ్యాలి. 

ఇక మిగతా వోట్లు ఎవరికీ వెయ్యను, ఇక్కడితో ముగిస్తాను అని మీరు అనుకుంటే క్రిందన - ఎడమ దిగువగా ఉన్న VOTE  అనే బటన్ ని నొక్కాలి. 


ఇక మిగిలిన వోట్లూ వేస్తానూ అనుకుంటే - మిగతావారికి ఎదురుగా ఉన్న బాణం గుర్తుని నొక్కి, వారి దిగువగా ఉన్న నీలిరంగు చుక్కని - ప్రక్కగా జరిపి వెయ్యాలనుకున్న వోట్లు వెయ్యాలి. 

ఇలా మీకున్న యాభై వోట్లనీ వేసేయ్యాలి. ఇక్కడ చూపిన కంటెంస్టెంట్స్  ప్రొఫైల్స్ వి ఎంచుకున్నాను అంటే కేవలం ఉదాహరణ కోసం ఎలా వోటింగ్ చెయ్యాలో చూపెట్టడానికి వాడుకోబడ్డాయే కానీ వీరికే ఇలా వెయ్యాలనీ, అలా వారిని మాత్రమే ఎన్నుకోవాలని కాదు.. అని గమనించ ప్రార్థన. 

ఇలా ఇద్దరికి 42 వోట్లు గనక వేస్తే - ఇక మిగిలిన ఆ ఎనిమిది వోట్లు మిగిలాయని - వేరే కంటెంస్టెంట్ ని ఎంచుకున్నప్పుడు ఇలా దిగువగా చూపబడిన చిత్రములో ఎర్రని వృత్తములో చూపినట్లుగా - అగుపిస్తాయి. 

ఇలా మీ 50 వోట్లని మీకు నచ్చినవారికి ఒక్కరికే - ఒకటి నుండి యాభై వరకు వేయవచ్చును. లేదా ఒక్కొక్కటీ వేయవచ్చును. అది మీ ఇష్టం. 


ఇలా మీకున్న ( అన్ని ) వోట్లని వేశాక - అప్పటికీ మీరు వేసిన వోట్లు వారికి చెందినట్లుగా భావించరాదు. కేవలం మీరు అలా వారికి ఎంచారు / ఇచ్చారు / పంచారు అన్నట్లు. కానీ అది వోట్లు వేసినట్లు కాదు. ఈ క్రింది ఫోటోలో మాదిరిగా వచ్చిన  VOTE  అనే బటన్ నొక్కేవరకూ - వోట్లు వేసినట్లు కాదు. దాన్ని నొక్కితేనే మీ వోట్లు పరిగణలోకి / లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. 
 
అలా  VOTE  అనే బటన్ నొక్కాక - ఇలా ఈ క్రింది విధముగా THANK YOU FOR VOTING అని కనిపిస్తుంది. ఇక్కడితో మీ వోటింగ్ క్రియ పూర్తయినట్లు భావించాలి. 

క్రింది ఫోటోలోని ఎర్రని వృత్తములో SHARE అనే బటన్ ని చూపాను. దాన్ని నొక్కితే - ఆ వోటింగ్ ప్రక్రియని మీ ఫేస్ బుక్ / ట్విట్టర్ స్నేహితులు అనుసరించేలా ఒక లింక్ లాగా మీ టైం లైన్ మీద చూపించవచ్చును. పైన చూపిన బాక్స్ లో ఏదైనా ఎన్నుకున్నాక క్లిక్ చేస్తే మీకు - ఈ క్రింది విధముగా కనిపిస్తుంది. 


అలా SUBMITTED  సబ్మిటేడ్ అని వచ్చాక - దీనితో వోటింగ్ ప్రక్రియ సంపూర్ణముగా ముగిసినట్లు. 

మీరు ఒక ఈమెయిల్ ఐడీ తో కేవలం యాభై వోట్లు మాత్రమే - అదీ ఒకరోజుకి మాత్రమే అని గుర్తుంచుకోండి. ఇంకా ఎక్కువ వోట్లు వెయ్యాలీ అనుకుంటే - వేరే మెయిల్ ఐడీ తో మళ్ళీ లాగిన్ అయ్యి వోటింగ్ చెయ్యాలి. అది మీ ఓపిక, మీ అభిమానం. 

 గమనిక : శనివారాన సాయంత్రం నుండీ - 
ఆదివారం రోజంతా 
సోమవారంన సాయంత్రం దాకా ఈ వోటింగ్ లింక్ తెరచుకోదు.. 
Wednesday, June 13, 2018

Good Morning - 743


మార్గం మార్చకు, 
లక్ష్యం మరవకు, 
ఎరుకతో ముందుకు సాగు, 
యాత్ర ప్రారంభించాక - అన్వేషిగా మిగిలిపో.. 
Saturday, June 9, 2018

Good Morning - 742


మనలో - అహంకారం వంటి ఎన్నో స్వతంత్ర శక్తులు ఉన్నాయి. అది సైతాన్ కి ప్రతినిధి, మనిషికి ప్రధాన శత్రువు. 
Wednesday, June 6, 2018

Good Morning - 741
 ఓపెన్ మైండ్ తో ఉండండి. నేను తప్పకుండా సాధించగలను అనే సానుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోండి. Sunday, June 3, 2018

Good Morning - 740


ఈ ప్రపంచములో నేనొంటరిని.. కానీ నా ప్రపంచములో నేనే - ఒక ప్రపంచం. 
Friday, June 1, 2018

Good Morning - 739


వ్యక్తిగత సంతోషానికి రాచమార్గమేమిటంటే - 
నిన్ను నిర్దేశిస్తున్న శక్తులకి , నీ నిర్దేశలతో సహకరించడమే.. 
చురుగ్గా ఉండు. బాధ్యత తీసుకో.. 
నువ్వు నమ్మిన వాటికోసం కృషి చెయ్యి. 
అలా చెయ్యడం లేదంటే నీ విధిని ఎవరికో అప్పగిస్తున్నావన్నమాటే.. 

Sunday, May 27, 2018

Good Morning - 738


నీకు బాగా దగ్గరివాళ్ళు ఎవరో తెలుసా.. ? 
ఎవరిని నువ్వు కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు.. 
ఎవరిని కోల్పోయినప్పుడు నీకు అమితమైన దుఃఖం కలుగుతుందో వారు. 

Friday, May 25, 2018

Good Morning - 737


ఒక చిన్ని చిరునవ్వు ఎందరినో మీ స్నేహితులని చేస్తుంది. కానీ క్షణికమైన కోపం ఎందరినో శత్రువులని ఇస్తుంది. కనుక మీ విలువైన జీవితాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చిరునవ్వుతో ఆస్వాదించండి. 
Wednesday, May 23, 2018

Good Morning - 736


నమ్మకం : 
ఇది ఏర్పడాలంటే కొన్ని సంవత్సరాలు కావాలి.. కానీ నమ్మకం పోవటానికి కొద్ది క్షణాలు చాలు 
Friday, May 18, 2018

Good Morning - 735


స్నేహం, బంధం, బంధుత్వం.. వీటిల్లో ఏదైనా కానీ, ఇరువైపులా ఏ ఒక్కరిలో బాధనూ, మానసిక క్షోభను కానీ కలిగిస్తున్నదీ అంటే - వారిలో ఒకరిపై ఒకరికి పూర్తిగా అవగాహన లేనట్లు అని అర్థం..! వారింకా తమ పరిధులేమిటో, తన పరిమితులేమిటో ఇంకనూ పూర్తిగా తెలుసుకోనట్లే..! 
Monday, May 14, 2018

Good Morning - 734


మన బలాల్ని మనం రహస్యముగా ఉంచుకోవాలి. 
ఈ విషయంలో తాబేలే మనకు ఆదర్శం. 
పైపొర చాటున తన పాదాలని ఎంత జాగ్రత్తగా దాచుకుంటుంది.. ! 
- చాణక్యుడు.

Thursday, May 10, 2018

Good Morning - 733


ప్రేమ అనేది ఓ వస్తువు కాదు.. అదో అనుభూతి మాత్రమే.. ఏ అనుభూతి అయినా మనసుతో ముడిపడి ఉంటుంది. ఒకరికి ఒకరు సర్డుకపోయే మనస్తత్వం, ఒకరిని ఒకరు గౌరవించే తత్వం, ఒకరికోసం త్యాగం చేసే తత్వం, ఒకరికి ఒకరు అన్నీ అందివ్వడమే కాదు. ఆ ఇచ్చేదాంట్లో - ఆప్యాయత, అనురాగం, ప్రేమ, కనికరం, జాలి మిళితమై ఉండాలి. ఇద్దరి ఆలోచనలు దాదాపు ఒకేలా ఉండాలి. నిజమైన ప్రేమ గల వ్యక్తికి మనసులో ఎన్ని వత్తిడులున్నా అవి భాగస్వామి దగ్గర పైకిరావు అని గుర్తుపెట్టుకోండి. నిజమైన ప్రేమ కలిగి ఉన్నప్పుడు, స్నేహితుడు - స్నేహితురాలు మధ్య శృంగార, చిలిపి తలపులు రావు. 
Sunday, May 6, 2018

Good Morning - 732


మనకు ఇష్టమైన వాళ్ళకి మనం నచ్చం.. 
మనమంటే ఇష్టపడే వాళ్ళు మనకు నచ్చరు. 
మనకు ఇష్టమైనవాళ్ళు, మనమంటే ఇష్టపడే వాళ్ళు చాలా దూరములో ఉంటారు.. 
మనకు ఇష్టమైన వాళ్ళు, మనమంటే ఇష్టపడే వాళ్ళు దగ్గరున్నా -  అది చెప్పే ధైర్యం లేక దూరమైపోతారు. 
Monday, April 30, 2018

Good Morning - 731


ఇతరుల తిరస్కారాన్ని ఆమోదించడం నేర్చుకోండి. 
ఇతరులకు ఎవరినైనా, దేన్నైనా తిరస్కరించే హక్కు ఉంటుంది. 
అంత మాత్రాన వాళ్ళకి నచ్చనివన్నీ పనికిరానివై పోవుకదా.. !

అవును.. ఇతరులకు మనం నచ్చకుంటే / మనం చేసిన పనులు నచ్చకపోతే.. వారు మన పట్ల చూపే తిరస్కారాన్ని ఒప్పుకోవడం మనకు అలవాటు లేకుంటే ఇకనుండైనా ఆమోదించడం నేర్చుకోండి. మనం ఎంత పర్ఫెక్షన్ గా పనిచేసినా, ఎంత సరిగ్గా ఉన్నా ఒక్కోసారి ఎదుటివారికి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన మనం ఎదో తప్పు చేశామనో, మనలో ఎదో పొరబాటు ఉందని - తప్పుడు భావనని మనసు మీదకు తెచ్చుకోవద్దు. అన్నీ అందరికీ నచ్చాలన్న నియమేమీ లేదు. మనం చేసిన పని మన వృత్తిలో భాగమైతే - మనకన్నా బాగాచేసే వారి నుండి ఇంతకు ముందు పనిని పొంది ఉండొచ్చు. దానితో పోల్చితే వారికి మన పని నచ్చకపోవచ్చు. లేదా మనలో ఏదో లోపం కనిపించి ఉండవచ్చు. వారిని అలా ఎందుకు భావిస్తున్నారో అడిగి తెలుసుకోవడం చాలా తెలివైన చర్య. అప్పుడు వారు తెలియచేస్తే - మీకు ఎదిగే అవకాశాన్ని ఇచ్చిన వారు అవుతారు. అది తెలుసుకోవడం వల్ల మీ లోపమేమిటో తెలుసుకొని, దానిని కాసింత కృషితో దాన్ని మరింత మెరుగుపరుచుకొనే ఒక అద్భుత అవకాశం మీకు లభించినట్లే. ఒకవేళ వారు చెప్పిన కారణం మీ అనుభవ రూపేణా తప్పే అనుకున్నట్లైతే - నవ్వేసి ఊరుకోండి. వాదనల వల్ల ఎదుటివారిని ఈకాలంలో మార్చలేం.. అది మన పని కూడా కాదని గ్రహించండి. 
Saturday, April 28, 2018

Good Morning - 730


మనుష్యులు రకరకాల శక్తి సదుపాయాలతో జన్మిస్తారు. 
తొందరగా శక్తిని ఖర్చు చేసుకొని, అలసిపోయినవాడికే - 
అందరికన్నా ముందుగా బలాన్ని పుంజుకొనే అవకాశం చిక్కుతుంది. 
Wednesday, April 25, 2018

Good Morning - 729


ప్రతి ఒక్కరూ దేనికో ఒక దానికి, ఏదో విధముగా బందీయే! దాన్నుంచి తప్పించుకొనే అవకాశం కోసం తపించడమే - సాధన. 

Saturday, April 21, 2018

Good Morning - 728


ఎదగటానికి ఎప్పటికీ అవకాశం ఉంటుంది. 

Related Posts with Thumbnails