Monday, November 11, 2013

Good Morning - 494


ఎన్నటికీ తిరిగిరాని ఆ మధురానుభూతులు.. ఆ రోజులు..
అప్పట్లో ఆ విలువ తెలీదు.. ఇప్పట్లో పొందాలనుకున్నా పొందలేం.. 

బాల్యం ఒక మధురానుభూతి.. ఎన్నెన్నో మరపురాని అనుభూతులకు నెలవు అది. మది లోలోతుల్లో దాగుండి పోయే చక్కని, చిక్కనైన, అందమైన, ప్రత్యేక పరిమళం అద్దుకున్న వెలకట్టలేని జ్ఞాపకాలు అవి. 

నాన్నగారికి ఉండే పాత డొక్కు సైకిల్ మీద ముందున ఉండే అడ్డు రాడ్ మీద చెల్లినీ, వెనకాల ఉండే క్యారియర్ మీద మనల్నీ, పుస్తకాల బరువుతొ సహా ఎక్కించుకొని, వయసు పెరిగినా, లేని శక్తిని కూడబెట్టుకొని, తాను ఆయాసపడుతూ, హాయిగా ముందూ వెనకాల కూర్చున్న మనకు ఎన్నెన్నో కబుర్లు చెబుతూ, ఎక్కడా విసుక్కోకుండా, మధ్య మధ్య సరిగా కూర్చున్నారా? అని ఆరా తీస్తూ, మధ్యలో చాక్లెట్స్ ఇప్పిస్తూ (ఆ నెపం మీద తనకొచ్చిన ఆయాసం తీర్చుకుంటూ , అదీ కనపడకుండా దాచుతూ ) దారిలో వచ్చే అడ్డంకులను తప్పించుకొంటూ, స్కూల్ కి చేర్చి, అలాగే స్కూల్ అయ్యాక మళ్ళీ అదే పద్ధతిలో ఇంటికి తీసుకవచ్చే నాన్న - నిజముగా మహోన్నత వ్యక్తి. గమ్యం చేర్చాక కండువాతో / జేబులోని రుమాలుతో మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ ఇవాల్టి తన బాధ్యత తీరిందని ఆనందపడుతూ ఉండే నాన్న గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇలాంటి మనసు మదిలో దాగుండి పోయే మధురాభూతులు మరెన్నో.. 

ఎంతైనా ఆరోజులే వేరు.. ఈరోజుల్లో అన్నీ ఉన్నా, అంతకు మించి మోటార్ సైకిల్, కార్ ఉన్నా - రోజూ స్కూల్ వద్ద దిగబెడుతున్నా - అది బై బై చెప్పుకోవడం కన్నా ఇంకేమీ ఉండటం లేదు. అప్పటి రోజుల్లో ఉన్న ఆర్ద్రత ఇప్పుడు శూన్యం. అప్పట్లో బుద్ధి వికసించదు. ఆ కష్టం, ఆ ఆర్ద్రత, మమకారం వెనుక  ఉండే భావనలని అర్థం చేసుకోలేం. ఇప్పుడు అన్నీ అర్థం చేసుకుంటున్నా - చెయ్యటానికి ఏదో నామోషీగా ఫీల్ అవుతుంటాం. మన పిల్లలకు చేద్దామనుకున్నా ఏదోలా అనిపిస్తుంటుంది. ఎవరో, ఎక్కడి నుండో తొంగి చూస్తూ, ఏదో అనుకుంటున్నారని ఫీల్ అవుతూ ఆ ఆత్మీయతని పంచలేక పోతున్నాం. ఎంత తప్పు చేస్తున్నాం కదూ.. ఎంతైనా, ఎన్ని చెప్పినా ఆరోజులూ, ఆ భావనలూ, ఆ జ్ఞాపకాలు అన్నీ ప్రత్యేకాతిప్రత్యేకం..

No comments:

Related Posts with Thumbnails