నీకు బాగా దగ్గరివారు ఎవరో తెలుసా..?
ఎవరిని నువ్వు కలిసినప్పుడు నీకు ఆనందం కలుగుతుందో వారు కాదు..
ఎవరిని కోల్పోయినప్పుడు నీకు అమితమైన దుఃఖం కలుగుతుందో వారు.
అవును కదా.. మన దగ్గరివాళ్ళు / ఆత్మీయులు అంటూ కొందరిని అనుకుంటాం.. వారు మన రక్త సంబంధీకులే కావచ్చు, జన్మనిచ్చిన తల్లితండ్రులే కావొచ్చును.. లేదా మిత్రులే కావొచ్చును.. వారు మన మనసుకి దగ్గరై ఉంటారు. మన హృదయములో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వారి చెంతకి చేరినప్పుడు - మన కష్టాలు, బాధలు మరచిపోతాం.. వారితో చెప్పుకున్నప్పుడు అవి సగం తగ్గిపోయాయి అనిపిస్తుంది. వారి సమక్షములో ఉన్నప్పుడు మనలో ఎప్పుడూ చూడని ఏదో సంతోషం, ఆనందం కలుగుతుంది. అప్పుడు మన హోదా, పరపతి, వయసు, లింగభేదం అన్నీ మరచిపోతాం. అవన్నీ మనకి చెందినవి కాకుండా అన్నట్లు ప్రక్కన పెట్టేస్తాం. ప్లాస్టిక్ నవ్వుల్లా పై పై నవ్వుల్లా కాకుండా, చిన్నపిల్లల్లా స్వచ్చమైన మనసుతో, హృదయ లోతుల్లోంచి మనసారా నవ్వేస్తాం. వారి వద్ద గంటలు నిమిషాల్లా గడిపేస్తుంటాం. సమయం క్షణాల్లా గడిచిపోతుంటాయి. నిజానికి నిజమైన ఆత్మీయత అంటేనే అలాగే ఉంటుంది. ఆలాగే ఉండాలి కూడా.. అదో రూలు.
అలాంటివారిని దూరం చేసుకున్న నాడు - పై పరిస్థితికి భిన్నముగా జరుగుతుంది. క్షణాలు యుగాలుగా, ఈ లోకములో మనకేవ్వరూ లేరు, మన భావనలు ఎవరూ వినరు.. మన మాటల కోసం ఎవరూ ఎదురుచూడరు, మనకంటూ ఒక ఆత్మీయ ఆత్మ నేస్తం లేరు అన్న తలంపుతో - కళ్ళు జలపాతాలు అవుతాయి. అవి ఎప్పటికీ ఆగిపోని, ఉప్పొంగే జలప్రవాహాల్లా సాగిపోతుంటాయి. వారు లేని ఈలోకములో ఎందరున్నా - వారివల్ల వచ్చే అనుభూతి మరెవ్వరి వల్లా దొరకక, లోకమంతా చిన్నబోయినట్లు అగుపిస్తుంది. అనుక్షణం వారి జ్ఞాపకాలు గుర్తుక వస్తాయి. ఈ సమయములో ఇలా అన్నారు, ఇలా చేశారు. అవి తలచుకుంటుంటే ఒకవైపు సంతోషం, అవి అయిపోగానే శూన్యంలో కూరుకపోయిన భావన వెంటాడుతుంది. అప్పుడే ఇలాంటి నరకయాతన పగవారికీ రాకూడదని అనుకుంటాం. ఇంతటి మానసిక పరిస్థితిని మనలో కలుగచేసే వారే మన దగ్గరివారు.. అంటే మన ఆత్మీయులు. ఇలాంటి పరిస్థితి - వారు చనిపోయినపుడో, మనకి దూరం అయినపుడో జరుగుతుంది.
నావిషయం వరకు వస్తే - ఇలాంటి పరిస్థితిని ఇప్పటికి కేవలం రెండు సార్లు మాత్రమే ఎదురుకున్నాను. ఒకసారి చాలా ఏళ్ళ క్రితం (ఇరవై రెండేళ్ళ క్రితం).. మరోసారి దాదాపు రెండు సంవత్సరాల క్రిందట. అంతే!.
No comments:
Post a Comment