Monday, August 15, 2011

రాఖీ పండగ అనుభూతులు.

రాఖీ పండగ - అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ఒక చక్కని పండగ రూపం. ఒక ఆడ కూతురి జీవితానికి తండ్రి తరవాత ఎంతో ధీమాని అందించే అన్నయ్యల కోసం ఎదురుచూసే, తన జీవితానికి రక్షణ కలిపించమని కోరుతూ, ఆ సోదరులకి రక్ష కట్టి,  రక్షణ కోరే పండగ ఇది. నా చిన్నప్పడు ఉన్నంతగా ఈ రాఖీ పండగ తాలూకు మధురిమలు నేడు అంతగా కానరావటం లేదు. అసలు రాఖీ పండగ లోని మాధుర్యమేమిటో నేటి యువతకి తెలియటం లేదు అని అనుకుంటాను. అప్పటి ఆప్యాయతలు కూడా ఇప్పుడు చాలా తగ్గినట్లుగానే కనిపిస్తుంది. 

ఒకప్పుడు - మెట్టినింట్లో ఉన్న అమ్మాయి తన అన్నయ్యని చూడటానికి పుట్టినింటికి రావటం, లేదా తనకోసం తనింటికి వచ్చే సోదరులకోసం కన్నులు పత్తికాయలుగా చేసుకొని, పెందలాడే నిద్రలేచి, వాకిలిని రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్ది, వచ్చే సోదరులకి అనుగుణముగా ఉండేట్లుగా ఇంటిని అనుకూలముగా మారుస్తుంది. తరవాత శుచిగా, రుచిగా, తన ప్రావీణ్యమంతా చూపి, వారిపైన తనకుండే బోలెడంత అవాజ్యమైన ప్రేమని కూడా కలిపి, వారికిష్టమైన వంటలన్నీ వండుతుంది. సోదరులు రాగానే చిన్నపిల్లలా సంతోషము చెంది, కాళ్ళు కడుక్కోవటానికీ నీరూ, తుడుచుకోవటానికి టవలూ ఇస్తుంది. ఆ తరవాత యోగక్షేమాలు తెలుసుకొని, ఎప్పుడు తిన్నారో అని మాతృ హృదయముతో, భోజనానికి లేపి, కొసరు కొసరు వడ్డిస్తూ, కడుపారా తన చేతి భోజనంతో, అన్నా తమ్ముళ్ళ కడుపు నింపి, భుక్తాయాసముతో ఉన్నవారిని చూసి, ఆ అనుభూతితో తన మనసు తనివితీరా నింపుకొంటుంది.


ఆ తరవాత అన్నయ్యకి దేవుని గూటిలో దాచి ఉంచిన మమతానురాగాలు నింపిన రాఖీకి, చిన్ని పూజ చేసి, మా అన్నయ్యని చల్లగా చూడమని ఆ దేవదేవుళ్ళని బాగా కోరుకొని, వారి చేతికి కట్టే వేడుక వర్ణించతరం కాదు. "హమ్మయ్య.. మా సోదరుల చేతికి రాఖీ కట్టాను.. ఇక నాకు కొండంత ధీమాగా (కట్టకున్నా, తాను చూపే ఆప్యాయత కి ఎంతటి రాక్షసుడి మనసైనా నీరవుతుంది.) ఉంటాడ"న్న తృప్తితో తన మోము వేయి విద్యుద్దీపాలతో పోటీ పడుతుంది.


ఆ తరవాత అన్నయ్య ఇచ్చే కానుకలు కోసం చిన్నపిల్లలా ఎదురుచూస్తుంది. తాను ఎంత పెద్దగా ఎదిగిననూ, వయసు ఎంత అయిననూ, చిన్నప్పుడు అన్నయ్యలు ఇచ్చే "కాకి ఎంగిలి" చేసి ఇచ్చే చాక్లెట్ ముక్క కోసం ఎంతగా చూసిందో ఇప్పుడూ అలాగే చూస్తుంది. తాను ఏమాత్రం లోటులేని మెట్టినింటికి వెళ్ళినా, అన్నయ్యలు ఇచ్చే ఆ కానుక యే నాకు ఇష్టం అన్నట్లుగా తీసుకొని, అపురూపముగా కళ్ళకద్దుకుంటుంది. నిజానికి ఆ సోదరులకి అపుడే వచ్చే వర్షాకాలం వ్యవసాయం పెట్టుబడులకి డబ్బులు సరిపోకపోయినా, చాలకున్నా, అప్పైనా చేసి ఉన్నంతలో గొప్పగా కానుకని ఇస్తారు. చాలా తక్కువ విలువదే అయినా దాన్ని చూసి ఆ చెల్లెలి మనసు ఆనందంతో గంతులు వేస్తుంది. ఆ ఆనందమంతా ఆ మొఖములో కనిపిస్తుంది. దాన్ని చూసిన ఆ సోదరులకి కళ్ళలో ఆనంద భాష్పాలు. కాని బయటకి కనిపించనీయరు. 

ఇక చెల్లెలి వద్ద వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు - అక్కడి వాతావరణం బరువెక్కి పోతుంది. ఆ శ్రావణ మాసం మేఘాలు ఈ వీడ్కోలు చూసి, తమలో నింపుకున్న నీటిని వర్షముగా మార్చి వీడ్కోలు చెప్పే దానికన్నా, ఇక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి, వాటికీ బరువుగా అనిపించి, అన్నట్లుగా కారు నలుపుగా మారిపోతాయి. వాటి కన్నీరా అన్నట్లుగా పెద్ద పెద్ద చినుకులుగా వర్షం పడి పోతుంది. 

(ప్రతి సంవత్సరమూ జరిగేదే అయినా) తమ వీడ్కోలు భరించలేక వెక్కి వెక్కి ఏడుస్తున్న చెల్లెలి ని ఎలా ఓదార్చాలో తెలీక, ఆ సోదరులు సాధ్యమైనంతవరకూ ఓదారుస్తారు. ఆ మెట్టినింటివారికి పేరుపేరునా వీడుకోలు చెబుతూ, చివరిగా చెల్లెలి తల నిమిరి వెళ్ళిపోతారు. కాని అందరికీ తెలీని విషయం ఏమిటంటే - అలా వెళ్తున్న ఆ సోదరుల గుండెల్లో అప్పటికే గట్లు తెగిన గోదావరిని ఆపలేక, అతి కష్టముగా చెదరని చిరునవ్వుతో అక్కడ వ్యవహరించి, వెళ్లినవారు ఆ సందు మలుపు వరకూ - మళ్ళీ వెనక్కి చూడలేక (తమ కన్నీరుని చూస్తే ఎక్కడ చెల్లెలు బెంగటిల్లుతుందో అనీ) వెళ్ళిన వారికి, ఆ మలుపు తిరగగానే గట్టు తెగిన గోదారిలా మారిపోతారు..  

నేడు ఇలాంటి - లోతున్న అప్యాయతలు చాలా తక్కువ. ఈ ప్లాస్టిక్ యుగములో ప్లాస్టిక్ మనసులుగా మారాయి. అంతే!. ఆప్యాయతలూ, అనుబంధాలూ చాలా తక్కువ. చాలామంది హృదయాలలో తడి ఆరిపోయింది.. బీళ్ళు గా మారాయి అవి. 

నా చిన్నతనములో అర ఇంచీ మందమున ఉండే స్పాంజ్ మీద చమ్కీ లని,రబ్బరు సులీషణ్ (సొల్యూషన్ / జిగురు) తో అతికి ఉండే, ప్రక్కన మెరుపు కాగితాలతో చేసినవి అరచేతి సైజు రాఖీలతో మోచేతివరకూ నిండి ఉండేవి. ఒక చేతికి నిండి పోతే, మరోచేతికి కట్టేడివారు. ఆ రాఖీలని వాటంతట అవి వూడిపోయేవరకూ అలాగే ఉంచుకునేవారు. అలా ఉంచుకోవటం కూడా నామోషీగా భావించేడి వారు కాదు. పైగా అలా ఉండటం గొప్పగా భావించెడి వారు. ఇప్పట్లో అయితే సన్నగా దారం పోగు కట్టినా, అదో మోతలా, విప్పేసేదాకా ఇబ్బందిగా భావిస్తున్నారు. 

అప్పటిలా ఉండే నిజమైన అన్నాచెల్లెళ్ళ ప్రేమలు మళ్ళీ ఎప్పుడు చూస్తానో.. 
Related Posts with Thumbnails