ఆంధ్రపదేశ్ లో జైన మత వ్యాప్తి చాలానే ఉంది. అలా ఉన్నట్లు చాలా చోట్ల ఆధారాలు లభించాయి. రాష్ట్రములోనే పెద్దది అయిన కొలనుపాక జైన దేవాలయం. ఆ దేవాలయం అంత విస్తీర్ణములో కాకున్ననూ, కాస్త చిన్నగా ఉన్ననూ విశాలమైన ఆవరణలో ఈ కొల్చారంలో 1008 విఘ్న హర్నేశ్వర్ పార్శ్వ నాథ దిగంబర్ జైన అతిశయ క్షేత్ర 1008 Vighna Harneshwar Parshva Naatha Digambar Jain Athishaya Kshetra దేవాలయాన్ని నిర్మించారు. ఇక్కడి మూర్తి స్వయంభువు అంటే తనకు తానుగా భూమి నుండి బయటకి వచ్చినవారు అని అర్థం. ఇప్పుడు ఆ దేవాలయ విశేషాలు మీకు తెలియచేస్తాను.
మొన్న శుక్రవారం అనుకోకుండా కాస్త విరామం లభించింది. ఎక్కడికైనా అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలీ అనుకొని - బయలుదేరాను. ఆషాఢ మాసం ప్రారంభం.. కాస్త ఉక్కపోతా, చల్లని ఆహ్లాదకర వాతావరణం, మధ్యమధ్య కాసిన్ని వర్షం చినుకులూ.. ఓహ్! ఎంత ఆహ్లాదకరముగా ఉందో!.. నల్లని మబ్బులూ, మబ్బులతో దోబూచులాడుతున్న సూర్యుడూ, తొలకరి వర్షాలకి పులకరించి, క్రొత్తగా పచ్చదనం కప్పుకుంటున్న చెట్లూ.. ఓహ్!. అద్భుత, ఆహ్లాదకరమైన అనుభవముతో నా ప్రయాణం సాగింది.
నిజానికి అలాని అనుకోని అక్కడికి వెళ్ళలేదు. అనుకోకుండా బయలుదేరాను. అలా దాదాపు డెబ్బై కిలోమీటర్లు సాగిన మా ప్రయాణం వెనక్కి వచ్చేద్దాం అనుకున్నప్పుడు, ఈ దేవాలయానికి వెళ్ళటం జరిగింది. ఎప్పుడో నా హై స్కూల్ విద్యాభ్యాసం రోజుల్లో విన్నాను. అప్పుడు రెండు, మూడు సార్లు దర్శనం చేసుకున్నాను. మళ్ళీ చాలా సంవత్సరాల విరామం తరవాత ఇప్పుడే వెళ్లాను. ఆ విశేషాలు ఇప్పుడు మీకు అందిస్తున్నాను. నాకు గుర్తున్నవరకూ ఆ విశేషాలు మీకు తెలియచేద్దామని ఈ టపా ఉద్దేశ్యం.
కొల్చారం అనే చిన్న పల్లెటూరు హైదరాబాద్ దగ్గరలోని, మెదక్ జిల్లాలో ఉంది. దగ్గరలోని పెద్ద పట్టణం అయిన మెదక్ నుండి పదహారు కిలోమీటర్ల దూరములో ఉంది. ఇది చిన్న ఊరు నుండి, ప్రస్తుతం మండల కేంద్రముగా ఉంది. ఈ గ్రామం పేరు కొలిచెలమల వెంకట----- (పూర్తిపేరు తీలీదు) అని కవి పేరుమీదుగా ఏర్పడింది. ఆ తరవాత కుల్చారం గానూ, కాలక్రమేణా కొల్చారం గానూ మారినది. ఒక్కప్పుడు ఇక్కడ జైన మతం విరాజిల్లింది. ఆ ఆధారాలు అనుకోకుండా బయటపడ్డాయి.
1983 సంవత్సరం లో అనుకుంటాను. ఊరి చివరలో ఉన్న కొన్ని గుడిసెలు అగ్నికి ఆహూతయ్యి, బూడిద కుప్పగా మారాయి. ప్రభుత్వం ఆ బూడిద కుప్పలు తొలగించి, పేదలకి ఇళ్ళు కట్టే క్రమములో, అందులకు తీసిన పునాదుల్లో ఈ దేవాలయ మూర్తి యొక్క ఏడు తలల పాము యొక్క శిల్పంలోని కొంత భాగం మొదట బయట పడింది. దాన్ని తీసే క్రమములో, ఆ స్థలాన్ని జాగ్రత్తగా తవ్వారు. అప్పుడు ఈ - ఏడు సర్ప పడగల నీడలో నిలబడి ఉన్న పార్శ్వనాథ దిగంబర్ జైన విగ్రహం బయటపడింది. ఇలా నిలబడి ఉన్న పార్శ్వనాథ జైన విగ్రహం చాలా అరుదు. ఈ విగ్రహం తొమ్మిదవ శతాబ్దం (9 th century) కి చెందినది అని నిర్ధారించారు. అలా నిలబడి ఉన్న భంగిమలో ఉన్న జైన విగ్రహం - భారత దేశములో కర్నాటక లోని శ్రావణ బెలగోళ ఉన్న గోమటేశ్వర్ లేదా బాహుబలి విగ్రహము తరవాత పెద్దదీ, రెండోదీ, నల్లసరం రాయిలో చెక్కిన విగ్రహం ఇదొక్కటే. అందుకే ఈ క్షేత్రం జైనులకి ఎంతో ముఖ్యమైనది. ఈ విగ్రహం నల్లని రాయితో చెక్కబడి, పదకొండు అడుగుల మూడు అంగుళాల (11' 3") పొడవు ఉంది. దాదాపు 20-25 మంది పట్టి ఆ భూమి నుండి, బయటకి తీశారు. అలా దిగంబర జైనులకి ఆరాధ్యదైవం అలా బయటపడింది.
ఆ తరవాత హైదరాబాద్ జైన సమాజ్ వారికి కబురందించారు. వారు ఆ విగ్రహాన్ని హైదరాబాద్ కి తరలించాలని చూశారు. ఇక్కడి గ్రామస్థులకి - ఆ విగ్రహం అరుదైనదనీ, తమ ఊరిలోనే ప్రతిష్ఠిస్తే, వచ్చే యాత్రికుల వల్ల తమ గ్రామం ఆర్థికముగా అభివృద్ధి చెందుతుందనీ.. తమలో కొంతమందికి పరోక్షముగా జీవన ఉపాధి దొరుకుతుందనీ, అలా వారు పట్టుపట్టారు. గ్రామ అభివృద్ధికి కాస్త విరాళం ఇస్తామని నచ్చచెప్పినా, తమ దిగంబర జైన ఆచారాలు అక్కడివారికి కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు అని విన్నవించినా - ఆ గ్రామస్థులు ఏమాత్రం తగ్గలేదు. అలా 1983 నుండి 1997 వరకు సాగాయి. చివరికి ప్రధాన మెదక్ - హైదరాబాద్ రహదారి ప్రక్కన దాదాపు రెండున్నర ఎకరాల స్థలములో, చుట్టూ కాంపౌండ్ ఉన్న దేవాలయం నిర్మాణం జరిగింది. ఇవన్నీ అక్కడ ఉన్న స్నేహితుల వల్ల తెలిసాయి.
ఆ తరవాత చాలా ఆలోచనల నిర్ణయాల వల్ల అన్ని వసతులు గల పది గదుల సత్రముతో, పాత మరియు ఆధునిక లక్షణాలతో, వెనకవైపున చిన్న గుట్టల ముందు, పచ్చని పరిసరాల మధ్య అందముగా నిర్మించబడినది. 2003 లో ఈ దేవాలయం నిర్మాణం పూర్తి అయ్యింది. నల్లని, ఆకర్షణీయమైన ఈ మూర్తిని చూడటానికి అన్నిమతాల, కులాల యాత్రికులూ వస్తారు. ఈ దేవాలయ ప్రారంభోత్సవం - పంచ కళ్యాణిక ప్రతిష్టా మహోత్సవాన్ని 10 మార్చి 2003 నుండి 16 మార్చి 2003 వరకూ చాలా గొప్పగా, భారీగా, ఎన్నో కార్యక్రమాలతో చేశారు. మొదటి పూజని కోటిన్నర రూపాయల విరాళం ఇచ్చి ఒక జైన మతస్థుడు తొలి పూజని నిర్వహించారు ట.
ఈ నల్లని విగ్రహానికి క్షీరాభిషేకం చేసేటప్పుడు చూస్తే - ఆ పాలు ఆ నల్లని విగ్రహము పై ముత్యాలవలె దోర్లుతుండగా చూడటం ఎంతో ఆహ్లాదకరముగా ఉంటుంది.
దగ్గర లోని బస్ స్టేజి : కొల్చారం స్టేజి. ఇక్కడ నుండి కేవలం వంద అడుగుల దూరం.
రవాణా సౌకర్యాలు : బస్, ట్రావెల్ సంస్థలు, జీపులూ, కార్లూ.
దగ్గరలోని అన్నివసతుల పట్టణం, దూరం : మెదక్, 16 కిలోమీటర్లు.
దగ్గరలోని విమానాశ్రయం : శంషాబాద్ ఎయిర్ పోర్ట్. దాదాపు వంద కిలోమీటర్లు.
ఉండటానికి గదులు : ఆలయములో పది (10) అన్నివసతుల గదులు. ఒక ఫంక్షన్ హాల్.
దగ్గరలోని ఊరు : కొల్చారం. దాదాపు కిలోమీటర్ దూరం.
దగ్గరలోని బ్యాంక్ : సిండికేట్ బ్యాంక్. కొల్చారం. ఒక కిలోమీటర్ దూరం
సందర్శన వేళలు : 6 a.m to 6 p.m
భోజన హోటల్స్ : లేవు.
మరిన్ని సరిక్రొత్త ఫోటోలకి ఈ లింక్ ని నొక్కండి. : http://achampetraj.blogspot.in/2015/10/jain-temple-at-kolcharam-medak-dist-2.html
3 comments:
chala mandiki akkada gudi unnatle telidu mee valana chala mandiki telustundi, mee post chala informative ga undi
అవునండీ.. చాలా మందికి తెలీదు. తెలియచేయ్యాలని చెప్పే చిన్ని ప్రయత్నం ఇది.
దిల్వారా(మౌంట్ అబూ),గొమఠేస్వర్ ,కొలనుపాక దర్శించాము కాని కొల్చారం జైన ఆలయం గురించి తెలియదు.ఫొటోలతో సహా మంచివివరాలతో తెలియజెసినందుకు ధన్యవాదాలు.- రమణారావు.ముద్దు
Post a Comment