Thursday, July 21, 2011

ఆటో తాత (దేవుడు) - ప్రేరణ

మొన్న నా బండి సీటీ బయట పంక్చర్ అయ్యింది. అలాగే కాస్త దూరం నెట్టుకోచ్చాను. కాని చాలా ఏళ్ళ తరవాత అలా చేయటం వల్లనేమో అది బాగా కష్టం అనిపించింది. ఇంకో ఐదారు కిలోమీటర్లు వస్తే గాని, యే సహాయమూ అందదు. ఆ టైర్ విప్పేసి - బాగుచేయించుకొని, మళ్ళీ ఎక్కించేద్దాం అనుకుంటే సెట్ పానాకి రావటం లేదు. ఇక తప్పనిసరిగా రింగ్ పానా కావాల్సిందే. అది లేదు. అలాగే నెట్టుకుంటూ కాస్త దూరం వచ్చానా.. వెనక ట్యూబ్ వాల్వ్ కట్ అయ్యింది. హా.. ప్రొద్దున్నే నా పర్స్ కి పెద్ద బొక్క పడింది అనుకున్నాను. మన టైం బాగా లేనప్పుడు అన్నీ ఇలా అవుతాయేమో.. ఇక లాభం లేదని మెకానిక్ కోసం బయలుదేరాను.

దారిలో లిఫ్ట్ కోసం చూశాను. అంత ప్రొద్దున్నే - ఉదయం ఆరింటికి ఎమొస్తాయి? అనుకుంటూ నడక మొదలెట్టాను. ఇంతలో ఒక డిజిల్ ఆటో ఎదురుగా వస్తూ నన్ను దాటేసి వెళ్ళుతున్నది. అది సీటీ బయట తిరిగే ఆటో. లోపలకి వస్తాడో రాడో అనుకుంటూ అపనమ్మకముగా ఆపాను. ఆగింది ఆ ఆటో.

అందులో ఉన్నది ఒక ముసలాయన. దగ్గర దగ్గరగా యాభై ఏళ్లు ఉంటాయి. ధోతి కట్టుకొని ఉన్నాడు. ఇప్పుడే ఆటో నేర్చుకుంటున్నవాడిలా అగుపించాడు. క్షేమముగా చేరగలనా అని అనుకుంటూనే, ఇంతకన్నా వేరే మార్గం ఏమీలేదు అనుకొని "వస్తావా.." అని అడిగాను.

"హా.." అని చెప్పాడు తను. నేను ఎందుకైనా మంచిది అనుకొని, ఆటో సీట్ చివర్లో కూర్చున్నాను ఏదైనా అయితే ఈజీగా జంప్ అవుదామనే ఆలోచనతో. బయలుదేరాక ఆయన డ్రైవింగ్ చూసి కాస్త నమ్మకం కుదిరింది. డ్రైవింగ్ లో కబుర్లలలోకి దించటం తప్పే అయినా మొదలెట్టాను.

"చాలా బాగా నడుపుతున్నావు ఆటోని.." ముందుగా మనస్పూర్తిగా ప్రశంసించాను. ఆ తరవాత వివరాలు అడిగాను. ఆయన ఐదెకరాల ఆసామి. వ్యవసాయములోని ప్రస్తుతపు అనిశ్చితి పరిస్థితుల వల్ల ఈ ఆటో నడపటం నయం అనుకొని ఇందులోకి దిగాడుట. లోకల్ ఫైనాన్సియర్ వద్ద అప్పు చేసి, సెకండ్ హ్యాండ్ లో ఈ డిజిల్ ఆటో కొన్నాడుట. ఒక అమ్మాయి పెళ్లి చేశాడు. ఇంకో అమ్మాయి పదోతరగతి చదువుతున్నది. గత ఐదు సంవత్సరాలుగా ఈ ఆటో నడిపిస్తున్నాడు.

"మరి ఈ ఆటో నడిపిస్తుండగా నీకు ఇబ్బందులు రాలేవా?" అడిగాను.

"ఎందుకు రాలేదు?. చాలా కష్టపడ్డాను. ఎంత అంటే అబ్బో! చాలా.. అది గుర్తుచేసుకుంటే శానా ఉంది. ఒక్కటి మాత్రం నిజం 'మనిషి జన్మ అన్నింటికన్నా ఉత్తమమైనది. వాడు తలచుకుంటే కానిదంటూ ఏమీలేదు. ఒక్కటే - పట్టుదల కావాలి.. అది ఉంటే అన్నీ వస్తాయి.. ఈ బండి నేర్చుకునేటప్పుడు ఎన్నో ప్రమాదాలు జరిగాయి. అయినా నా జీవితములో చెయ్యాల్సిన పనులు చాలా ఇంకా మిగిలే ఉన్నాయి. వాటికోసం కష్టపడుతున్నాను. నిజానికి నాది సీటీ బయట బండి. లోకల్ లోకి రాకూడదు. అయినా కాసిన్ని డబ్బులుకోసం వస్తున్నాను. (నిజానికి ముప్పై రూపాయలు తీసుకోవాలి గానీ, పదిహేను రూపాయలకి రావటానికి ఒప్పుకున్నాడు) వట్టిగా కూర్చుంటే ఏమి వస్తుంది. ఈ వర్షం ముసురు కి ఎవరొస్తారు?, అనుకుంటూ కూర్చుంటే బువ్వ ఎవడు పెడతాడు..? ఎవరైనా వస్తే కాసిన్ని డబ్బులు అయినా వస్తాయిగా అనుకొని వస్తున్నాను. నాకింతే ఇస్తాను అంటే వస్తాను అనుకుంటూ పోతే - ఎలా బ్రతికేది.? " అంటూ నా జీవితానికి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ ఇచ్చాడు.

ఆయన అనుభవం అంతా చెపుతుంటే ఊ కొడుతూ పోయాను. నిజానికి అది అక్షరలక్షలు చేసే విషయం చెప్పాడు. ఆ మాటలు వింటుంటే ఏదో తెలీని శక్తి లోనికి ప్రవేశించి, నన్ను రీచార్చ్ బ్యాటరీలా శక్తిమంతున్ని చెయ్యసాగింది.

"నీకు అబ్బాయిలు లేరా..?" అని అడిగాను. "హా.. ఒకడుండెను.. కాని భీమార్ (రోగం) వల్ల పోయాడు. ఒక బిడ్డ పెళ్లి చేశాను. ఇంకో బిడ్డ చదువుతున్నది. దానికి నేనే కదా పెళ్లి చేస్తే నా గుండె బరువు దిగుతుంది... నా అల్లుడు ఆటో తోలుతాడు. ఆ అల్లుడు ఇలా డ్రైవింగ్ నేర్పించాడు.." అని అన్నాడు. అంతలోగానే నేను మా ఇల్లు వచ్చేసింది. దిగేశాను. డబ్బులు ఇచ్చాను. ఇంకా వినాలని అనుకున్నాను. కాని నా బండి ఊరిబయట అలా వదిలి రాకుంటే అలా కాసేపు వింటూ ఇంకా ఎంతో అనుభవాన్ని పొందేవాడినేమో..

రీచార్జ్ అయిన మనసుతో ఇంటికి చేరి, ఆ తర్వాత మెకానిక్ సహాయాన నూతన టైర్, ట్యూబ్ మార్చుకొని, ఇంటికి వచ్చేశాను.

అన్నింటికన్నా నన్ను ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే - ఆయనకి ఒక కన్ను లేదు. ఎడమ కన్నులో పూవు వచ్చి ఆ కనుగుడ్డు తెల్లగా అయ్యింది. అయినా అయన ఆ వయస్సులో కష్టపడటం నాకు గొప్ప ప్రేరణ ఇచ్చింది. అతని ఫోటో తీసుకుందామని, వివరాలు తీసుకోవాలని - మరిచేపోయాను. బహుశా దేవుడేమో.. ఇలా వచ్చేసి, తక్కువ డబ్బులకే నన్ను నా గమ్యానికి చేర్చి, పనిలో పనిగా నా జీవితాన్ని ఇంతగా రీచార్జ్ చేసే అవకాశాన్ని ఇచ్చి, అలా మాయం అయిన వారు దేవుడే కాకుంటే మరెవరు?.

3 comments:

it is sasi world let us share said...

nijame kastaalalo aadukune vaallu devude.kaani manam devudu kaavaalani yenduko anukomu.

rajachandra said...

ma friend chala kastam vachhindira ani nadaggara pedda cinima story cheppadu.. nato patu rara ani pani unnatluga kkd govt.hospital ki tisukuvelli chupinchanu hospital unna rogulanu.. vaditopatu naku kuda valla bhadato polichhi chuste manam fell avutunna kastalu .. isumanta kuda kavu.

Raj said...

అవునండీ.. సరిగ్గా చెప్పారు..

Related Posts with Thumbnails