Sunday, July 10, 2011

ఆషాడమాసం - 2

..అలా క్రొత్తగా పెళ్ళయ్యిన వారి బాధలు అలా ఉంటే - కొందరికి సంతోషం, మరికొందరికి విసుగ్గా ఉంటుందీ మాసం. ఎరువులు అమ్మేవారు, స్కూల్ బుక్స్ అమ్మేవారు, స్కూల్ బ్యాగ్స్, షూస్, స్కూల్ డ్రెస్ అమ్మేవారు, ప్రింటింగ్ ప్రెస్, జిరాక్స్, గొడుగులు, వాహనాల టైర్స్, ట్రాక్టర్ రిపేరర్స్, స్కూల్ యాజమాన్యాలూ.. ఇలా ఈ ఈ రంగాలు చాలా బీజీగా ఉంటారు. పలకరించినా మాట్లాడనంత బీజీ. ఇలా వీరు తమ సంవత్సర కాలములో ఇప్పుడున్నంత బీజీ మరెప్పుడూ ఉండరు.

ఇక ఈ నెలలో అంతగా ఖాళీగా ఉండేవారిలో నగలు, బట్టలు, ఫంక్షన్ హాల్లూ, సినిమాలూ.. ఈ మాసములో గోళ్ళు గిల్లుకుంటూ కూర్చుంటారు. ఇందులో బట్టల షాప్ వారు కాస్త నయం. ఆషాడ మాసం సేల్స్ అంటూ, పాత స్టాక్ అంతా కాస్త తగ్గింపు ధరలకి అమ్మేసి, శ్రావణం లో నూతన స్టాక్ తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తారు.

అందాక రోడ్ల మీద హాయిగా తిరుగాడిన మనం కాసింత వర్షానికే చిత్తడిగా మారిన రోడ్డు మీద, నడవటానికే కష్టపడాల్సి ఉంటుంది. అందాక రోడ్డు మీద దృష్టి అంతగా పెట్టకుండా నడిచిన వాళ్ళం, ఇప్పుడు ప్రతి అడుక్కూ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడికి వెళ్ళినా గొడుగు పట్టుకెల్లాల్సిందే!. దాన్ని మరచిపోకుండా గమనించుకోవాలి. లేకుంటే "సమర్పయామి.."

పెంకుటిల్లు ఉంటే - తొలకరి వర్షాలు పడగానే, ఎక్కడెక్కడ వురుస్తున్నదో, కారుతున్నదో చూసుకొని, ఆ తొలకరి కాగానే వెంటనే బాగుచేయిన్చుకోవాలి. లేదంటే వర్షాకాలములో బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ తొలకరి వర్షాలు పడటం ఆగగానే వెంటనే ఇల్లు కప్పించే ఆలోచన పెట్టుకోవద్దు. బాగా ఎండ కాసాక నాలుగురోజులకి గానీ ఆ పని చెయ్యకూడదు. లేకుంటే కప్పించటం ఏమోగానీ, ఉన్న బాగున్న పెంకలు, ఈ కప్పించే పనిలో చాలా పాడవుతాయి. ఇప్పుడు ఒక్కో మంగళూర్ పెంక దాదాపు ఇరవై రూపాయల వరకూ ఉంది.

బీజీ గా ఉండే వ్యాపారస్తులు బీజీ గా ఉంటారు. అన్ సీజన్ వ్యాపారస్థులు ఈ మాసములో -  లాభ నష్టాల లెక్కలూ, అప్పుల తీర్చటాలు,  అప్పులు వసూలు చేయ్యటాలూ, పాతవి అమ్ముడుపోనివి తగ్గింపు ధరల్లో అమ్మి, ఆ స్థానములో క్రొత్త సరుకు నింపటానికి ప్రయత్నిస్తారు.

బీజీ గా ఉండి, బంధువుల దగ్గరికి వెళ్ళని వారు - ఈ అన్ సీజన్ కాలాన్ని బాగా వాడుకుంటారు. హాయిగా బంధువుల ఇంటికి, తీర్థయాత్రలకీ వెళతారు. తమ స్థానములో తమ వారసులని కూర్చోబెడుతారు.

ఈ మాసములో సిమెంట్ అమ్మేవారికీ, ఇటుకలూ వారికీ కూడా లాభాల పంట పండుతుంది. వర్షాకాలములో సిమెంట్ ఎక్కువగా స్టాక్ పెట్టుకోరు.. తేమ కారణముగా గడ్డ కట్టుతుందని. వీళ్ళకి దాదాపు యాభై శాతం వరకూ అదనపు లాభం వస్తుంది. కూరగాయలు కూడా అంతే!. వేసవిలో కూరగాయలు పండించేవారు ఆషాడం లో వేరే పంట వేస్తారు. కూరగాయల రేటు ఈ నెలలో బాగా పెరిగిపోతుంటాయి. ఇలా అయితే ఎలా  బ్రతికేది అనిపిస్తుంది కూడా..

గ్యాస్ బండ కూడా - ఈ నెలలోనే అసలు దొరకదు. బుక్ చేసిన కొన్ని రోజులకు గానీ రాదు. బాగా ఇబ్బంది పడాల్సిన నెల ఇది.

గ్రామదేవతల మ్రోక్కుబడులూ, ఊరేగింపులూ, జాతరాలూ చేసే మాసం ఇదే.

అలాగే కొన్ని మధుర క్షణాలు పొందే మాసం కూడా ఇదే.. వేడి వేడి బజ్జీలూ, మక్కజొన్న కండెలూ చేసుకొని, వరండాలో కూర్చొని, వేడి వేడిగా తింటూ ఉంటే - ఆ మధురక్షణాలు ఇక ఎన్నటికీ మరువలేము. అందునా తోడుగా ఇష్టమైన వారు ఉంటే.

అన్నట్లు పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన నూతన వధువు - పెళ్ళయాక తొలిసారిగా ఇంటికి వచ్చేది కూడా ఈ మాసం లోనే. ఆషాడం లో అత్తా అల్లుళ్ళు ఎదురుపడోద్దు అని ఒక ఆచారం ఉంది. దీని వెనక ఒక అర్థం చెబుతారు.

భారతదేశం పూర్వం వ్యవసాయక ప్రధాన దేశం. ఇప్పుడంటే - ఎన్నో వృత్తులూ, జీవనాధారాలూ వచ్చాయి కాని అప్పుడు కేవలం వ్యవసాయమే ఉండేది. మిగతా పనుల వల్ల సంపాదన ఎలా ఉన్నా, తినడానికి కొన్ని గింజలు ఉండాలని, క్రొత్త వలపు మోజులో తినడానికి ఆధారమైన వ్యవసాయాన్ని ఎక్కడ నిర్లక్ష్యం చేస్తారో అనీ ఈ నిబంధన పెట్టారు. మరో అర్థం ఏమిటంటే - ఈ మాసంలోని వాతావరణం చాలా మార్పులు ఉంటాయి. ఇప్పుడు కొన్ని అంటువ్యాధులు బాగా ప్రబలుతాయి. పుట్టబోయే బిడ్డ మీద వాటి ప్రభావం ఉండొద్దని కూడా అంటారు. ( పిండానికి తొలి మూడు నెలలు చాలా ముఖ్యమైనదని - ఆ సమయములోనే అవయవాలు ఏర్పడుతాయనే ఈ మధ్యనే సైంటిస్టులు తెలియచేశారు.) పుట్టింటికి పోయిన వధువు ఇంట్లోనే ఉంటుంది. ఆమెకి తోడుగా ఆమె అమ్మ కూడా ఉంటుంది. వధువు నాన్న ఎలాగూ పొలానికి వెళతాడు. కనుక మొదట ఎదురయ్యేది అత్తా అల్లుళ్ళే. ఈ ఆలోచనతో అలా నానుడిని పుట్టించారు.

అలాగే ఇంకోకారణం ఏమిటంటే - ఎప్పుడూ పుట్టిన సమయం చూస్తారు అందరూ. కాని నిజానికి గర్భములో విత్తన సమయమే కీలకమైనది. అందుకే గర్భాదారణ సమయం అంటూ పదహారో పండుగ నాడు ముహూర్తం నిర్ణయించేది. ఇప్పట్లో అయితే సినిమాల్లో లాగా అయిపోతున్నాయి కాని, అప్పట్లో అదో పెద్ద తతంగం ఉండేది. బంధు, మిత్రులంతా ఆడి, పాడే ముచ్చటైన ఉత్సవం అది. (ఈ సమయములో అందరూ నాట్ల పనిలో బీజీ ఉంటారు కనుక నూతన వధూవరులకు చిరాకు తెప్పించే మాసం ఇది.) ఈ గర్భాదారణ సమయం మరియు కార్యక్రమం అది అనుకున్నట్లు జరుగదు + యే సమయాన లోపల అండముతో శుక్రకణం సంయోగం చెంది, ఫలదీకరణం చెందుతుందో ఎవరూ సరిగ్గా సమయాన్ని లేక్కించలేరు. అందులో చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకే పుట్టిన సమయాన్నే ప్రామాణికముగా తీసుకుంటారు.

ఇదే సమయాన నూతన వధువుకి గోరింటాకు పెడుతూ ఉంటారు. గోరింటాకు లోని, కొన్ని రసాయనముల వల్ల వారికి సూక్ష్మ క్రిముల దాడి చాలా తక్కువ మరియు చేతికి అందాన్ని ఇచ్చేది కూడా. ఇందులో కూడా మరో సూక్ష్మం ఉంది. ఆకు రుబ్బి, వంటా, భోజనాలు తొందరగా ముగించుకొని, పెరడులో, లేదా ఎవరూ భంగం కలిగించని గదిలో వధువుకి గోరింటాకు పెడుతూ ఉంటారు. అప్పుడు కాలక్షేపముగా పిచ్చాపాటి మాట్లాడుతూ, అత్తవారి ఇంటి విషయాలూ, ఎవరు ఎలా ఉంటారు, వారితో ఎలా మసలుకున్నదీ, భర్తతో జరిగిన ఏకాంత సమయం సంఘటనలూ.. ఇలా అన్నీ చర్చకి వస్తాయి. అనుభవజ్ఞురాలైన ఆ అమ్మ తన అనుభవముతో తగు సూచనలు చేస్తుంది. ఏది, ఎప్పుడు, ఎలా, ఎందుకు, ఏమిటీ.. అనేవి అన్నీ చక్కగా తెలియచేస్తుంది. ఆ విషయాలని బట్టి చేతికి డిజైనులు పెరుగుతుంటాయి. ఇంకా మాటలు మాట్లాడేది ఉంటే - అరచేయికి వెనుకభాగాన కూడా వేస్తారు.. ఇంకా మాట్లాడటం ఉంటే కాలికి కూడా పెడుతూ మాట్లాడుతారు. ఇది అంటే ఇలా గోరింటాకు పెట్టుకోవటం మంచిది అని చెబుతూ లోపాయికారిగా కూతురి సంసారం తెలుసుకొని, తన అనుభవముతో కూతురి సంసారాన్ని ఒకదారిలో పెట్టేందుకై సాగే సమాలోచనల గోరింటాకు కార్యక్రమం అని అనుకోవచ్చును.

ఉదాహరణకి అల్లుడికి ఇష్టాఇష్టాలు ఏమిటో, యే వంటలంటే ఇష్టాలో తెలుసుకొని, ఈ నెల రోజుల్లో ఆ వంటలో తన కూతురిని ప్రావీణ్యురాలిని చెయ్యటం అన్నమాట. ఒక వేళ ఆ వంటకం తనకి రాకుంటే దగ్గరి బంధువుల్లో ఎవరికైనా వస్తే, వారింటికి రెండు, మూడు రోజులు పంపితే, వారింటికి నూతన వధువు వచ్చింది అన్నట్లు వారిని సంతుష్టపరిచినట్లు అవుతుందీ, బంధుత్వం కూడా పెరుగుతుంది, అలాగే నూతన వంటకాలూ, అక్కడి వారి అనుభవాలు, సూచనలూ తెలుసుకున్నట్లు అవుతుంది. అల్లుడు అత్త మొహం చూడవద్దు అన్నారు కాబట్టి అక్కడికే నేరుగా వెళ్ళితే, అక్కడ అత్త ఉండదు కాబట్టి ఏమీ దోషం ఉండదు. అందుకేనేమో - కాస్త వేరుగా అర్థం వచ్చేలా - అల్లుడూ, అత్త ఈ మాసం లో మొహాలు చూసుకోరాదు అన్నారు కాని వారి బంధువుల మొహం కూడా చూడొద్దని ఎక్కడా చెప్పలేదు. హ ఆహా హ్హా

ఇంకో కారణమూ చెబుతారు.. ఆషాడం తరవాత శ్రావణం లో అన్నీ పూజలూ, పునస్కారాలు జరుగుతూ ఉంటాయి. అందులో దాదాపుగా అన్నీ మంచి రోజులూ ఉంటాయి. ఆ శుభరోజులలో గర్భధారణ జరిగితే - మంచిది అని ఆలోచన. పైన చెప్పానుగా జన్మించిన సమయం కన్నా, గర్భధారణ సమయం ముఖ్యమని పూర్వకాలములో అనుకున్నారు. ఇప్పుడు అలా అయితే చాలా బాగుంటుంది అని వారి ఆలోచన. ఇప్పుడు గర్భము ధరిస్తే తొమ్మిది నెలలకి అంటే (శ్రావణం, భాద్రపదం.. అలా చూస్తే చైత్రం వస్తుంది. అంటే ఉగాది పండగ దగ్గరలో..) నిండు వేసవిలో - ప్రసవం జరుగుతుంది. పుట్టిన పిల్లలకి కాస్త తల్లిపాల వల్ల వ్యాధి నిరోధక శక్తి వస్తుంది. తద్వారా పిల్లలు వానాకాలములో వచ్చే వ్యాధులని తట్టుకుంటారు అని కూడా కావచ్చును.

ఇలా "ఒకనెల క్రాష్ కోర్స్" చేసిన ఆ నూతన కోడలు శ్రావణ మాసములో అత్తవారింట్లో అడుగిడిగి, తన కాపురం సుఖముగా జీవనం సాగిస్తుందని ఈ మాసం లో అలా నిబంధన పెట్టారు కావచ్చును.. కానీ ఇలా ఎందరు చేస్తున్నారు అని చెప్పటం కొద్దిగా కష్టమే!.

ఇంకోకారణం కూడా చెబుతారు. ఒక నెల వియోగం తరవాత కలుసుకున్నాక వారు ఎంతో అన్యోన్య దాంపత్యాన్ని పొందుతారని అని అంటారు కూడా. (ఇక్కడ ఇంకాస్త చెప్పోచ్చును. పెద్దవారి కంటెంట్ చెప్పినట్లుగా అవుతుంది. కనుక ఆపేస్తాను.)

అబ్బో!.. ఈ ఆషాడ మాసంగురించి ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడో తేలాను.. ఇక్కడితో ఆపేస్తాను. మిగతావి మరెప్పుడైనా చెప్పుకుందాము..

2 comments:

Related Posts with Thumbnails