Bolt Cutter బోల్ట్ కట్టర్ - అనేది ఒక కత్తెర లాంటి పనిముట్టు. ఇది సాధారణ ప్రజానీకానికి అంతగా తెలీకపోవచ్చు. దీన్ని ఎక్కువగా నిర్మాణ రంగములో, ఫ్యాక్టరీలలో... మొదలగునవి చోట్ల దీన్ని వాడుతుంటారు. దీనితో కొద్దిగా మందపాటి ముక్కలని, తీగల్ని, సలాకా, బోల్ట్ లనీ, ఇనుప గొలుసులనీ.. లాంటి వాటిని కత్తిరించడానికి వాడుతుంటారు. దీనితో అర అంగుళం మందపాటి ఇనుప బోల్ట్ లనీ కొద్దిపాటి శ్రమతో తేలికగా రెండు ముక్కలుగా చెయ్యవచ్చును. అందుకే దీన్ని వెండి, బంగారు బిళ్ళల్ని కత్తిరించడానికి విరివిగా వాడుతుంటారు. దీన్ని ఎపుడూ చూడని వారు ఇలా చేస్తుంటే హశ్చర్యం గా చూస్తారు.
నాకు ఈ పనిముట్టు పదిహేను సంవత్సరాలుగా ( 15 ) తెలుసు. అప్పట్లో చాలా క్రొత్తగా అనిపించేది. కొందామంటే చాలా ధరలో ఉండెడిది. ఇప్పుడూ ధర ఏమీ తగ్గలేదు. పైపెచ్చు బాగా పెరిగిపోయింది కూడా.. ఈ పనిముట్టులో నాకు తెలిసి మంచి ప్రోడక్ట్ అంటే HIT company - Bolt cutter. నేను మొదటగా చూసింది కూడా ఆ కంపనీ వారిదే. ఈ కంపనీ జపాన్ లో ఉంది. జపాన్ వారి పనిముట్ల నాణ్యత గురించి మీకు క్రొత్తగా పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదనుకుంటా. చాలా నాణ్యతగా ఉండే ఈ వస్తువు రకరకాల సైజుల్లో దొరుకుతుంది. పెద్ద సైజులో ఉన్నది ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ధరనేమో చాలా మొత్తంలో ఉంది. నాకు అంత తప్పనిసరి వస్తువు కాకపోవటంతో అంతగా కొనాలన్న దృష్టి లేకపోయింది. కానీ నా దగ్గర అలాంటిది ఒకటి ఉంటే బాగుండును అనుకున్నాను. నాకు కావలసిన సైజు 24" కానీ ఆ సైజులోని ఆ కట్టర్ విలువ Rs. 2900+ గా ఉంది ఇప్పుడు. అందుకే కొనకుండా ఆగిపోయాను. ఆ కట్టర్ ఎలా ఉంటుందీ అంటే ఈ క్రింది ఫోటో చూడండి.
ఈ పనిముట్టు - ఇనుప సలాక, కమ్మీలు, గొలుసులు, బోల్ట్ లనీ ఎలా కత్తిరించగలదో ఈ క్రింది ఫోటో చూడండి. ఇప్పుడు యాంగిల్ గ్రైండర్, పైప్ కట్టర్ మెషీన్స్, Abrasive wheels వచ్చాక ఆయా రంగాల్లో దీని వాడకం అరుదై పోయింది.
అలాంటి ఈ అద్భుత పనిముట్టుని నా స్వంతం చేసుకోవాలని ఉన్నా, నాకు ఎక్కువగా ఉపయోగం ఉండదు కాబట్టి అంత ధరపెట్టి కొనడం ఇష్టం లేక ఆగిపోయాను. అలాంటిది ఈ 24" కట్టర్ పనిముట్టు విచిత్ర పరిస్థితుల్లో నా స్వంతం అయ్యింది. అదెలాగో మీకు చెప్పాలనే ఈ టపా.
నా పనిమీద ఒక వర్క్ షాప్ కి వెళ్ళాను. అక్కడ చూస్తే ఇలాంటి పనిముట్టు ఒకటి కనిపించింది. ఒకరు వాడుతుంటే చూడసాగాను. నిర్వహణా లోపం వల్ల అది కాస్త పాడయినట్లు ఉంది. సరిగా పనిచెయ్యడం లేదు. దానితో కత్తిరిస్తున్న అతను చాలా అసహనానికి గురి అవుతున్నాడు. అతను కాదని వేరే పద్దతిలో చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నేను ఆ వర్క్ షాప్ వాడిని అడిగా.. " ఏమైంది? " అనీ. దానికి అతడు - " అది పాడయింది.. క్రొత్తది కొనాలి.." అన్నాడు.
నేను అన్నాను " బాగుంది కదా.. కొద్దిగా రిపేర్ చేస్తే వస్తుందేమో.. ఒకసారి నీవు ఖాళీగా ఉన్నప్పుడు నా వద్దకు దాన్ని తీసుకొని రా.. చూసి, సరి చేస్తాను.." అన్నాను.
" కాదన్నా.. నేను చూశాను. " అన్నాడు.
" ఒకసారి నేను ట్రై చేస్తే పోయేదేమీ ఉంది? " అన్నాను.
ఆ తరవాత మరో నాలుగుసార్లు ఇలాగే మాటలు గడిచాయి. కానీ ఆ అబ్బాయి నా వద్దకు దాన్ని తీసుకరాలేదు. నావల్లే కానిది తనవల్ల ఏమి అవుతుందని - ఆగిపోయినట్లున్నాడు.
మరో నెల రోజులకి - తన వద్దకి వెళితే - తన వద్ద మరొక క్రొత్త కట్టర్ కనిపించింది. " ఇదెప్పుడు కొన్నావ్..? ఎంతకి కొన్నావ్?? పాతది ఏమి చేస్తావ్..??? " అని ప్రశ్నలు గుప్పించాను.
" నిన్ననే కొన్నాను. ఈరోజే మొదలెడుతున్నాను. ధర : రూ. 2900.." అన్నాడు.
"మరి పాతది ఏమి చేస్తావ్ ? "
" దాన్ని పాత ఇనుప సామానుకి అమ్మేయ్యాలి.. లేదా ఎవరికైనా ఇచ్చేయ్యాలి.. ఎవరూ రిపేర్ చెయ్యరు. ఎక్కడా రిపేర్ కాదని తెలిసింది.." అన్నాడు.
" అలా అయితే నాకే ఇవ్వొచ్చు కదా.. నేనే తీసుకుంటాను.. అదీ నీకు ఇష్టమైతేనే.." అన్నాను. దానికి అతడు సరే అన్నాడు.. నాకు నమ్మబుద్ది కాలేదు. నిజమే అంటున్నాడా అని కాస్త ఆగి అడిగాను. తీసుకపో.. చెప్పాడు. ఎందుకైనా మంచిదని సాయంత్రం వచ్చి తీసుకెల్లుతా అని చెప్పా. తన మనసు మారి వద్దంటాడా ? అనీ. అలాని ఆగడం ఎందుకూ అంటే - నేను దాన్ని బాగుచేసుకున్నాక - వచ్చి నాది నాకివ్వు అంటే నా శ్రమ అంతా వృధానే. అందుకే ఆగాను.
సాయంత్రం వచ్చి, దాన్ని తీసుకొని అడిగా.. ఇచ్చాడు. దాన్ని తీసుకొని వెళుతున్నా అని చెప్పా. వెళ్ళు అని చెప్పాడు. ఊరికే తీసుకోకుండా చేతిలో ఒక ఇరవై రూపాయలు పెట్టి - దీన్ని పాత ఇనుప సామానులా నీ వద్ద నుండి కొన్నాను అని చెప్పాను. ఇలా చెయ్యడం ఎందుకూ అంటే కొన్ని కారణాలు ఉన్నాయి.
1. ఇచ్చినది మనసు మారి వాపస్ తీసుకోకుండా చేసేలా చెయ్యడం.
2. ఊరికే తీసుకున్నాడు.. డబ్బులేమీ ఇవ్వలేదు.. ఎంతో కొంత ఇస్తే పోయేదేమి ఉంది అనే మాటలు రాకుండా ఉండటానికి..
3. మనమేమీ ఊరికే అతని వద్ద నుండి తీసుకోలేదు.. కొంత డబ్బు ఇచ్చి, ఆ వస్తువుని కొన్నట్లుగా ఉండి, మనం దానికి ఇకనుండీ హక్కుదారులుగా మారుతాం. ఇక ఆ వస్తువుని అట్టే పెట్టుకోవచ్చు, దానం ఇవ్వొచ్చును, కానుకగా ఇవ్వొచ్చు, వాడుకోవచ్చును, వాడకంలో పాడయితే - వారు అడిగినప్పుడు తిరిగి క్రొత్తది కొని ఇవ్వాల్సిన ప్రశ్నే ఎదురవ్వదు.
4. దాన్ని బాగు చేసుకొని, మనం అమ్ముకున్నా మనకే ఇక అధికారాలు సంక్రమిస్తాయి.
ఇలాంటి కారణాల వల్ల తనకి డబ్బులిచ్చి తీసుకోవడం..
నా వద్దకు తెచ్చుకున్నా - ఒక నెల రోజులు రిపేర్ ఏమీ చెయ్యకుండా అలాగే అట్టిపెట్టాను. మనసు మారి వచ్చి, నాది నాకు ఇమ్మని అంటాడేమో అనీ.. కానీ - రాలేదు. ఆ తరవాతే దాన్ని శుభ్రం చేశాను. అందరూ దాన్ని ఎలా పడితే అలా వాడారు కాబట్టి అది బాగా జిడ్డుగా, తుప్పు పట్టి, బిగిసి పోయి ఉంది. కనీస నిర్వహణ కూడా చెయ్యలేదు. కనీస నిర్వహణ అంటే అదేదో పెద్ద పని కూడా కాదు.. వారానికొకసారి బట్టతో తుడిచి, జాయింట్ల వద్ద కొద్దిగా నూనె చుక్కలు వేసి, మళ్ళీ శుభ్రం చేస్తే సరి.. అంతే. ఇదంతా చెయ్యటానికి మహా అంటే ఐదు నిమిషాలు కూడా పట్టవు. దానికున్న బోల్టులూ నట్లూ విప్పి, అదంతా శుభ్రం చేశాను. ఆ తరవాత రిపేర్ చేయటం మొదలెట్టాను.
ముందుగా కిరసనాయిల్ లో పాత పళ్ళ బ్రష్ ని ముంచి, వాడి పైన పేరుకొని ఉన్న త్రుప్పునీ, మురికిని తొలగించాను. ఆ తరవాత సమస్య ఎక్కడ అన్నది వెదికాను. సమస్య ఎక్కడ ఉందో గుర్తిస్తే - సగం విజయం సాధించినట్లే.. అలా చూస్తూ పోతే హ్యాండిల్స్ మధ్యలో ఉండే బోల్ట్ వద్ద అస్సలు సమస్య ఉంది. అక్కడ ఉండే బోల్ట్ రంధ్రం అరిగిపోయింది. ఈ క్రింది ఫోటోలో అది స్పష్టముగా కనిపిస్తున్నది చూడండి. గుండ్రంగా ఉండాల్సిన ఆ రంధ్రం పొడుగ్గా మారింది. ఆ కాసింత అరుగుదల వల్ల ఆ కట్టర్ పనిచెయ్యలేదు. ఇప్పుడు సమస్య ఏమిటో తెలుసుకున్నాను. అంటే సగం విజయం సాధించాను. ఇక సమస్యని సరిదిద్దాలి. ఇలాంటిదే సమస్య బైక్ సైడ్ స్టాండ్ లో కూడా ఎదురయ్యింది. మీకు వీలుంటే ఆ పోస్ట్ కూడా చూసిపెట్టండి. లింక్ : http://achampetraj.blogspot.in/2013/04/blog-post.html
ఇలా సాగిన రంధ్రం సరి చెయ్యాలీ అంటే
ఒక పద్ధతి : వెల్డింగ్ చెయ్యడం.
లేదా ఆ షేపులో బోల్ట్ ని అరగదీసి అక్కడ పెట్టడం.
లేదా ఆ రంధ్రాన్ని గట్టి స్టీలు లాంటి పదార్థముతో మూసి, వాడుకోవడం..
ఇందులో ఆ మూడో పద్ధతియే కరెక్ట్ అనిపించింది.
ముందుగా ఒక బోల్ట్ వెదికాను. ఆ సైజులో, సరిగ్గా అమరే, సరియైన కొలతలో ఉండే బోల్ట్ దొరకలేదు. అన్ని షాపుల్లో వెతికా.. ఊహు లాభం లేదు. చివరికి ఒక షాపుకి వెళితే - అక్కడ ముందు ట్రే లో వృధాగా పారేసిన TVS కంపనీ వారి 10.9 గ్రేడ్ బోల్ట్ కనిపించింది.
అలాంటి గ్రేడ్ బోల్ట్స్ ఇందులకు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవి చాలా గట్టిగా ఉంటాయి. ఈ నంబర్ పెరుగుతూ ఉంటే - ఆయా వాటికి దృఢత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీటికోసం వెదికా. పైన చూపిన ఫోటోలోని మధ్యలో ఉన్నదే - ఆ నంబర్ బోల్ట్. ఇవి ఎక్కువగా ఆటోమోటివ్ రంగాల్లో ఉపయోగిస్తారు. బోల్ట్ దొరికింది కాకపోతే నట్ లేదు. అయినా సరే అనుకొని ఆ బోల్ట్ ని 10 రూపాయలకు కొన్నాను. వారికి వృధా అనుకున్నది నాకు మిక్కిలి అవసరం. ఎందుకంటే చాలా శక్తి అంతా ఆ బోల్ట్ మీదే పనిచేస్తుంది. ఆ బోల్ట్ గనుక బాగుంటే ఇక అంతా బాగున్నట్లే. నట్ కూడా కావాలని రిక్వెస్ట్ చేస్తే వారే వెదికి ఇచ్చారు. హమ్మయ్య.. ఒక పని అయిపోయింది. ఇక మిగిలింది - సాగిన రంధ్రాన్ని గుండ్రముగా చెయ్యటానికి ఒక స్టీల్ ఫిలప్ మెటీరియల్.
నా దగ్గర గ్రైండర్ గానీ, యాంగిల్ గ్రైండర్ గానీ లేకపోవటంతో - సన్నని రంపంతో ఒక నట్ ని కోసి, గరకు కాగితం మీద అరగదీశాను. ఇలా చెయ్యటానికి బోలెడంత సమయం తీసుకుంది. అయినా నాకో కట్టర్ మిగిలిపోతుందని ఇష్టముగా చేశా. అలా ఆ గ్యాప్ నిండేలా దానిని అమర్చాను. ( ఈ క్రింది ఫోటోలో ఆ ఫిలప్ ముక్క - బాణం గుర్తు వెనకాల తెల్లని అర్ధ చంద్రాకారములో ఉండి, చూపెట్టబడి ఉన్నది. దాన్ని ఆ సాగిన రంధ్రంలో అమర్చి, నట్లు అన్నీ బిగించాను ) అది ఎంత బాగా సెట్ అవ్వాలీ అంటే - అది అమర్చాక - మిగిలిన గ్యాప్ లో బోల్ట్ పెడితే - ఆ బోల్ట్ ఏమీ ప్లే లో ఉండకూడదు. అందుకే ఈ చిన్న ముక్క సెట్టింగ్ కోసం చాలా సమయం, శ్రమ, ఆలోచన చెయ్యాల్సి వచ్చింది.
అన్నీ బిగించాక ప్రతీ జాయింట్ వద్ద కొద్దిగా నూనె వేశాను. నాలుగైదుసార్లు అలా ఆడించి చూసి, ఒక ఇనుప ముక్కని కత్తిరించి చూశాను. క్రొత్తదానిలా కత్తిరించడం మొదలెట్టింది. మరింతగా కత్తిరించి చూశాక, అప్పుడు ఒక విజయగర్వం నాలో కలిగింది.. చాలా తక్కువ ఖర్చులో ( రూ. 40 ) దాన్ని బాగు చేసుకొని, మళ్ళీ వాడుకోనేలా చేసుకోగలిగాను అన్న సంతోషం - ఈ టపా వ్రాయటానికి కారణమయ్యింది. నాకొక పెద్ద కట్టర్ ఉండాలీ అన్న కోరికా నెరవేరింది. పాతగా ఉన్న హ్యాండిల్స్ ని కలరింగ్ చేసుకోవాలి. ఇక యాంగిల్ గ్రైండర్ ని కొనుక్కోవాలి. అదొక కల. అది మొదలయింది కూడా ఈ మధ్యే. ఈ యాంగిల్ గ్రైండర్ నాకు చాలా చాలా పనులలో సాయం చేస్తుంది. క్రొత్త కట్టర్ కొనక మిగిలిన డబ్బులలో దాన్ని తేలికగా కొనుక్కోవచ్చును. అదీ త్వరలోనే కొనుక్కుంటాను.
నాకు దీన్ని ఇచ్చిన అతనికి ఈ బాగుచేసిన కట్టర్ ని చూపించా. మొఖం వాడిపోయింది.. అనవసరంగా ఇచ్చి, మంచి కట్టర్ ని కోల్పోయి, మరో కట్టర్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వచ్చిందీ అని అనుకొని ఉండొచ్చును.
2 comments:
Wow really so great our children should see this post
అలాంటి కట్టర్ ఉన్న ప్రతివారూ చూడాల్సిన పోస్ట్ ఇది. తెలుసుకోవాల్సిన విషయమూ ఇదే..
Post a Comment