Thursday, June 4, 2015

Wooden trays

హ్మ్!.. రోజులన్నీ బోరుగా, నిరాసక్తముగా సాగిపోతూ...నే ఉన్నాయి. ఇలా అయితే నాకూ, మెషీన్ కీ పెద్ద తేడా తెలీకుండా అయిపోయేలా అనిపించింది. ప్రొద్దున్నే లేవడం, వాకింగ్ వెళ్లడం, రావడం,టీ, టిఫినీ కానిచ్చేసేయ్యడం, ఆ తరవాత నెట్ లో కాస్త విహారం.. మళ్ళీ రాత్రి కాసేపు నెట్ చూసి, తిని తొంగేయ్యడం.. ఇంతేనా జీవితం అంటే? కాదు.. ఇది కాదు నా జీవితం అనిపించింది. పరమ రొటీన్ గా ఉండే ఇది కాదు.. వేరేదేదో నాకోసం ఎదురుచూస్తున్నది. ఏదైనా క్రొత్త వ్యాపకం పెట్టుకోవాలి. తద్వారా ఈ ఆన్లైన్ కి రావటం తగ్గించాలి. నా ప్రియ స్నేహితునికి ఇచ్చిన మాట నెగ్గించాలి. నా జీవితాన్ని క్రొత్తగా ఆకర్షణీయముగా ఉండేలా మొదలెట్టాలి అని అనుకున్నాను. 

ఏమున్నాయి అలా అని ఆలోచిస్తుంటే - మూలగా ఫర్నీచర్ చెయ్యగా మిగిలిన ప్లైవుడ్ ముక్కలు కనిపించాయి. వాటిని ఏమైనా పనికొచ్చే వస్తువులుగా మార్చాలనుకున్నాను. నిజానికి నాకు ఈ వడ్ల / వడ్రంగి ( Carpenter ) పని రాదు. వేరేవారు చేస్తున్నప్పుడు చూశాను.. ఇది చాలా ఈజీగా అనిపించింది. ఎక్కడో చిన్న మెలికలు తప్ప అంతా ఈజీగా కనిపించింది. కొలతలు సరిగ్గా తీసుకొని, ముక్కలుగా కోసి, దగ్గరగా చేర్చటం వస్తే కొద్దిగా పనితనం వచ్చేసినట్లే! 

నామీద నాకు నమ్మకం వచ్చేంతవరకూ - ఏది ఎలా చెయ్యాలో, ఎలా చేస్తే నేను అనుకున్న పద్ధతిలో వస్తుందో మనసులోనే రిహాల్సల్స్ చేశాను. నా జీవితాన ఇదే మొదటి వడ్రంగి పని కాబట్టి - చిన్నదీ + తేలికైన పనిని ఎంచుకున్నాను. ఇలా ఎంచుకోవడానికి గల కారణమూ చిన్నదే - కానీ అది చేసే మేలు చాలా పెద్దది. నేనూ చెయ్యొచ్చు, నాకూ ఫర్నీచర్ చెయ్యవచ్చు అని నామీద నాకు నమ్మకం ఏర్పడేలా ఉండాలనుకున్నాను. 

మూలగా పడిఉన్న ఒక 6mm దీర్ఘ చతురస్రాకార ప్లైవుడ్ ముక్కని తీసుకున్నాను. రెడీమేడ్ గా దొరికే టేకు ప్లాట్ 1.5" అంగుళాల వెడల్పు గల ( 38mm ) బీడింగ్ కోసం వెదికాను. ఒక ఫర్నీచర్ షాపులో దొరికింది. దానిని వాడి, ఒక ట్రే బాక్స్ గా చేసుకోవాలనీ, అందులో ఏమైనా వస్తువులు వేసుకోనేలా ఉండాలనీ అనుకున్నాను. ఒక ఫీట్ పొడవుకి మూడు రూపాయలు. ఆరుఫీట్ల బీడింగ్ కి పద్దెనిమిది రూపాయలు తీసుకున్నాడు. 

ఇంటికి వచ్చాక నేను చెయ్యవలసిన ట్రే సైజు కొలిచా.. అది నాలుగు అడుగుల చుట్టుకొలత ఉంది. సరిగ్గా కొలతలు తీసుకుంటూ ఆయా సైజుల్లో ఈ బీడింగ్ ని హెక్సా బ్లేడు ముక్కతో కోసాను. ఆ తరవాత ఆ బీడింగ్ ని నాణ్యమైన చెక్క జిగురుని వాడి, ఆ 6mm ప్లైవుడ్ కి ఆనించి, సన్నని Headless nails ( తల లేని సన్నని మేకులు ) తో కొట్టాను. అలా మిగతా మూడు వైపులా చేశాను. అలాగే ఈ బీడింగ్ చెక్కలనీ కలిపేలా సన్నని మేకులు కొట్టాను. ఒక రాత్రంతా అలాగే వదిలేశాను. 

మరుసటి రోజున - నా దగ్గర ఆంగిల్ గ్రైండర్ ( Angle grinder )లేని కారణాన - ఒక గరకు కాగితముతో ఆ ట్రే ను నున్నగా తయారుచేశాను. మూలల్లో బాగా రుద్దాల్సివచ్చింది. ఆ తరవాత లోహ వస్తువులకి వాడే మెటల్ గ్రే కలర్ లప్పం ( Grey coloured knife paste for metals ) అంతటా పూసి,ఆరనిచ్చాను. ఆ తరవాత మళ్ళీ ఒకసారి - నీళ్ళల్లో ముంచిన wet and dry emery paper 180 no. తో బాగా రుద్దాను. ఇప్పుడు ట్రే మీద ఉన్న ఎక్కువైన లప్పం అరిగిపోయి, నున్నగా తయారయ్యింది. అదే ఇలా ఈ క్రింది ఫోటోలో మాదిరిగా ఉంది. 


ఇలా అయ్యిన ట్రేని చూశాక చాలా ముద్దుగా అనిపించింది. నామీద నాకే నమ్మకం కలగసాగింది. నాకు ఇంత బాగా చెయ్యడం వచ్చా? అనిపించింది. మరింత రెట్టించిన ఉత్సాహముతో ఆ చెక్క ట్రేని మరింత అందముగా చేసుకోవాలనిపించింది. నాకు అందుబాటులో ఉన్న పెయింట్లని కలిపి, లోపల తేలిక రంగు, బయట గోల్డెన్ బ్రౌన్ రంగునీ  - మల్టీ కలర్ గా వేశాను. అలా రెండో కోటింగ్ నీ వేశా. ఆ తరవాత ఇలా తయారయ్యింది. 


ఈ ట్రేని వాడుకోక బుద్ధి కాక, నా మొదటి చెక్క పనితనం కి గుర్తుగా అలాగే దాచుకున్నాను. దీన్ని చూసి, తెలిసినవాళ్ళు కొందరడిగితే వారికీ చేసిచ్చాను - ఏదో మామూలుగా ఉండేలా. ఇంత బాగా మాత్రం వారికి చేసివ్వలేదు. కారణం : నా ట్రే నే బాగుండాలని కోరిక కాబోలు.  

No comments:

Related Posts with Thumbnails