Tuesday, June 16, 2015

My creation : Tool Box

Tray box, Home theatre box లు తయారు చేసుకున్నాక ఇక మిగిలిన చెక్కముక్కల మీద దృష్టి పడింది. అందులో మిగిలిన చెక్కలతో ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తుండగా - వాటితో ఒక టూల్ బాక్స్ Tool Box చేసుకోవాలనిపించింది. ఇక ఆలస్యమెందుకూ.. అనుకొని, రంగంలోకి దిగాను. టూల్ బాక్స్ అంటే - నేను వాడే ముఖ్యమైన పనిముట్ల కోసమని ఒక డబ్బా చేసుకోవాలనుకున్నాను. దానికి పైన ఒక చెక్కమూత కూడా ఉండాలనుకున్నాను. 
  • అలా మూత పెట్టేస్తే అదొక డబ్బాలా Box ఉంటుంది. 
  • లోపలి పనిముట్లు ఎవరికీ కనిపించవు. కాబట్టి వాటిని తీసుకెళ్ళి వాడుకోవటానికి ఎవరూ అడగరు. మన పనిముట్లు మనవద్దే భద్రముగా ఉంటాయి. 
  • మూతపైన ఏమైనా సామానులు పెట్టేసుకోవచ్చును. 
  • అదొక చిన్నసైజు స్టూల్ మాదిరిగా వాడుకోవచ్చును. 

...ఇలా ఆలోచించాక, డబ్బా ఆకారములోనే నా టూల్ బాక్స్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మూలగా ఉన్న ఒక ప్లై వుడ్ ముక్కని - చెయ్యాల్సిన డబ్బా అడుగుభాగముగా తీసుకున్నాను. దానిపైన నాలుగువైపులా నాలుగు ప్లైవుడ్ ముక్కలని మేకులూ, జిగురుతో కలిపి బిగించాను. ఆ తరవాత లోపల భాగములో డేకోలం / లామినేట్ షీట్ ని ఆ లోపలిసైజు కొలత తీసుకొని, దాని ప్రకారం కట్టర్ తో కత్తిరించి, జిగురుతో అతికాను. అది సరిగ్గా అతుక్కోవడానికి చిన్న చిన్న చెక్క బీడింగ్స్ ని సన్నని మేకుల సహాయాన అంచుల్లో కొట్టాను. ఇలా చేస్తే ఆ డేకోలం మీద చిన్న రంధ్రం ఏర్పడుతుంది. కానీ ఆ చెక్క ముక్క వత్తిడివల్ల ఆ ల్యామినేట్ షీట్ బాగా ఆ ప్లైవుడ్ కి అతుక్కుంటుంది. ఆ చిన్న రంధ్రం అంతగా కనిపించదు కూడా.. చాలామంది ఈ పనులకి బరువైన వస్తువులని వాడుతారు. అవి అన్ని చోట్లా సమయానికి దొరకవు. ఈ చెక్కముక్కలైతే ఆ ప్లైవుడ్ వాటిల్లోంచే కోసుకొని వాడుకోవచ్చును. చిన్నదైనా ఈ చిట్కా అమోఘముగా పనిచేస్తుంది. ఫర్నీచర్ వర్క్ చేసేవారు ఈ విషయాన్ని తెలుసుకోవాలని వివరముగా చెప్పాను. ఆ సందర్భములోని ఆ డబ్బా తాలుకు ఫోటో ఇది. ఇందులో అలా కొట్టాక మేకులు కూడా కనిపిస్తాయి. కాస్త పరిశీలనగా చూస్తే - అవి సగం వరకు మాత్రమే లోపలి దిగగొట్టినట్లుగా కనిపిస్తాయి. అలా ఎందుకూ అంటే - పని అయ్యాక వాటిని తేలికగా పట్టకారు పట్టి లాగేయ్యటానికి అన్నమాట. 


ఆ తరవాత లోపలి ప్రక్కభాగాలకూ, వెలుపలి ప్రక్క భాగాలకూ - ల్యామినేట్ షీట్ అతికాను. ఆ ప్లైవుడ్ పైన ఒక ఇంచీ టేకు బద్దలను జిగురూ, సన్నని మేకులూ వాడి, బిగించాను. ఆ తరవాత పైన ఆ లోపలి సైజు కన్నా కాస్త పెద్దగా ఉన్న ప్లైవుడ్ ని హింజీస్ సహాయాన బిగించాను. ఆ ప్లైవుడ్ కి  చుట్టూరా టేకుది హాఫ్ రౌండ్ బీడింగ్ ని కొట్టాను. ఇప్పుడు టూల్ బాక్స్ వాడుకోవటానికి రెడీగా ఉంది. ( క్రిందన ఉన్న ఫోటోని చూడండి ) 


మూతకి లోపల భాగాన కూడా  ల్యామినేట్ షీట్ ని కట్టర్ తో కత్తిరించి అతికాను. కానీ ఆ ముక్క కాస్త చిన్నగా ఉంటే - మధ్యభాగములోకి వచ్చేలా చేసి, చుట్టూరా బార్డర్ గా వేరే రంగులో ఉన్న ల్యామినేట్ షీట్ ని ఆ సైజులో కత్తిరించి అతికాను. ఫలితముగా ఒక క్రొత్త అందం వచ్చింది. ఇప్పుడు మూత ఉన్న టూల్ బాక్స్ అంతా సిద్ధమై - వాడుకోవడానికి రెడీగా ఉంది. 

Tool Box




బాగుందా? నేను బాగా చేశానా ? చేశాననే అనుకుంటాను.. 
నిజానికి నేను కార్పెంటర్ పని నేర్చుకోలేదు.. నా కుల వృత్తీ కూడా కాదు. అందుకు తగ్గ సమానులు కూడా సరిగా లేవు.. ( ఉన్నది - ఒక రంపం, హెక్సా బ్లేడు, సన్నని మొలలు, స్క్రూలు, ల్యామినేట్ షీట్స్, హింజ్స్, టేకు బీడింగ్స్, చిన్న సుత్తె, ల్యామినేట్ షీట్ అతకడానికి జిగురూ, టేపు, ఒక స్కేలు, కొలత పట్టీ.. అంతే - ఇవే సామానులతో ఈ బాక్స్ ని చేశాను అంటే ఎవరూ నమ్మటం లేదు. నన్ను నేను - నా జీవితం క్రొత్తగా కనిపించేందుకు చేసుకుంటున్న ప్రయత్నాలల్లో భాగం ఇది. విజయం సాధించానని అనుకుంటున్నాను. కొన్ని పరికరాలు త్వరలో కొనుక్కుంటాను. వాటితో మరికొన్ని వస్తువులు చేశాక - వాటి గురించీ పోస్ట్స్ పెడతాను ) 

ఇది చేశాక ఒక వడ్రంగి పని చేసే అతన్ని పిలిచి, చూపించా.. ఎలా ఉందనీ ? 

దానికతడు అన్నాడు కదా - " అన్నా! నీవు ఇది ఖచ్చితముగా చెయ్యలేదు.. ఎవరో చేశారు.. నీకు అంత సీన్ లేదు.. " అన్నాడు. " అదేమీ లేదు.. నేనే చేశా.. కావాలంటే చేస్తున్నప్పుడు చూసిన వారిని అడుగు.." అంటూ అప్పుడున్న వారితో ఒక క్లారిటీ ఇప్పిస్తే అప్పుడు నమ్మాడు - నేనే చేశానని. 

No comments:

Related Posts with Thumbnails