Tuesday, May 16, 2017

Repairing of Cheppal Stand

మొన్న ఖాళీగా ఉన్నప్పుడు - ఇల్లు సర్దుతూ ఉంటే మూలన ఉన్న చెప్పుల స్టాండ్ Cheppal stand కనిపించింది. దాని ఒక కాలు నీటి తేమ వల్ల తుప్పు పట్టి విరిగిపోయింది. ఇదే స్టాండ్ ని గతం లో ( 2012 సం.) బాగు చేసుకొని, రంగులు వేశాను. అదెలా చేశానో ఈ బ్లాగ్ పోస్ట్ లో http://achampetraj.blogspot.in/2012/01/blog-post_07.html లో వివరముగా వ్రాసాను. అప్పుడు తరవాత ఇన్నాళ్ళకు ఇప్పుడు పని పెట్టింది. ఒక మామూలు ఇనుప చెప్పుల స్టాండ్ ఇన్ని సంవత్సరాల కాలం పనిచెయ్యడం చాలా గొప్ప విషయమే.. బహుశా నేను దాన్ని 2008 - 2009 లో కొని ఉండొచ్చు. అంతగా గుర్తులేదు. 

ఇప్పుడు ఒక కాలు విరిగి - కదులుతూ పైన పెట్టిన చెప్పుల జతలు పడిపోవటం మొదలెట్టాయి. అయినా దాన్ని చెత్తలోకి పారెయ్యటం నాకు మనసొప్పలేదు.. ఇంకొంత కాలం దాని సేవలని పొందాలనిపించింది. బాగు చేసుకోవాలని అనుకున్నాను. కొద్దిసేపు ఆలోచిస్తే చాలా తేలికైన పరిష్కారం కనిపించింది. అది చాలా తక్కువ ఖర్చులో చేసుకోనేదిగా ఉంది. కేవలం 10 - 20 రూపాయల్లో అయిపోతుంది. ఇది గనుక సక్సెస్ ఐతే మరో ఐదేళ్ళు తేలికగా పనిచేస్తుంది అనిపించింది. చెప్పుల స్టాండ్ మరొకటి రెండొందలు పెట్టి కొనొచ్చు, కానీ 10 - 20 రూపాయల్లో బాగయ్యి, మరింతకాలం ఉపయోగానికి వస్తుందీ అంటే ఒక ప్రయత్నం చేయడం మంచిదే కదా.. అదీ చాలా తక్కువ ఖర్చు, తక్కువ సమయం, తక్కువ శ్రమ వల్ల. చూద్దాం ఈ ప్రయత్నం చేసి చూద్దాం అనుకున్నాను. బాగయితే వాడుకుందాం.. లేకుంటే చెత్తలోకి పంపడమే.. ఒకసారి ట్రై చేస్తే - నాకున్న సాంకేతిక నైపుణ్యాన్ని మరింతగా అప్డేట్ చేసుకున్నట్లూ అవుతుంది కదా.. అని అనుకున్నాను. 

ముందుగా స్టాండ్ ని బయట పెట్టి శుభ్రం చేసాను. ఇలా ఈ క్రింది ఫోటోలో ఎర్రని వృత్తాల వద్ద చూపిన చోట్ల తుప్పు పట్టి పాడయ్యింది. ఒక రంధ్రం పడింది, ఒక కాలు విరిగింది. నిజానికి ఇలా జరగకుండా చెయ్యటానికి ఒక మార్గం ఉంది. అదేమిటంటే - ఆ స్టాండ్ ని బిగించే ముందు ఆ పైపుల్లో ఎనామిల్ పెయింట్ గానీ, వేడి చేసిన క్రొవ్వొత్తి మైనం గానీ పోసి, లోపల ఒక పూతలా చేస్తే చాలు. కానీ అంత ఓపిక ఎవరికి ఉంది? తక్కువ ఖర్చులో మరొక స్టాండ్ వస్తుంది కదా.. అనుకొని ఆ ఆలోచనని అమలు చెయ్యరు.. ఇప్పుడు నేను బాగుచేసుకున్న పద్ధతిని చూద్దాం.  

ముందుగా ఆ స్టాండ్ కాళ్ళు దూరేంతగా వెడల్పు ఉన్న ప్లాస్టిక్ పైపుని వెదికాను. ఒకరివద్ద కనిపించింది. వారు దాన్ని వృధాగా పడేశారు. ఒకరికి వృధా అన్నది మరొకరికి అవసరం. అది PVC పైపుల్లో హెవీ గేజ్ ది. ఇప్పుడు క్రొత్తగా నిర్మించే ఇళ్ళకు వాడే వాటర్ పైపులు అయితే మరింత ధృడంగా ఉంటాయి. హెవీ గేజ్ Heavy gauge అంటే - పైపు గోడలు మందముగా / లావుగా ఉంటాయని అర్థం. ఆ పైపుని తీసుకోచ్చేసి, ముందుగా ఒక కాలు సైజు తీసుకొని, ఆ సైజుకి హెక్సా బ్లేడ్ సహాయన కోశాను. అదే సైజుని ప్రామాణికముగా పెట్టుకొని, ఈ క్రింది విధముగా పెట్టి, మరో మూడు కాళ్ళు కోశాను. వాటి అంచులని, వెలుపలి భాగాల్ని ఎమరీ పేపర్ / సాండ్ పేపర్ మీద రుద్ది నునుపు / శుభ్రం చేశాను. 


ఇపుడు ఆ స్టాండ్ ని ఒక పేపర్ మీద తిరగేసి పెట్టి, పైకి వచ్చిన కాళ్ళకి ఆ పైపులని తొడిగాను. ఒక గిన్నెలో కాస్త సన్నని ఇసుక + సిమెంట్ ని జారుడుగా కలుపుకోవాలి. ఒక ప్లాస్టిక్ గరాటు తీసుకొని ఆ ప్లాస్టిక్ కాలులో పెట్టి, అందులోకి ఈ సిమెంట్ మిశ్రమాన్ని పోయాలి. బాగా కుదురుకోనేందుకు ఒక సన్నని స్క్రూ డ్రైవర్ తో లోపలికి అదమాలి. అలా ఆ కాలులో నిండుగా సిమెంట్ వేసుకోవాలి. ( క్రింది ఫోటోని చూడండి ) ఇలా స్టాండ్ నాలుగు కాళ్ళలో వేసుకోవాలి. సిమెంట్ వేశాక ఎలా ఉంటుందో మరొక కాలుని ఫోటోలో చూడండి. 


ఆ తరవాత ఆ సిమెంట్ మిశ్రమం గట్టి పడ్డాక - కారిన సిమెంట్ మిశ్రమాన్ని హెక్సా బ్లేడ్ తో గీసేసుకోవాలి. 
ఒక తడి స్పాంజ్ తో తుడిచినా శుభ్రమవుతుంది. ఇది జాగ్రత్తగా చెయ్యాలి. 
ఎందుకంటే లోపల పోసిన సిమెంట్ మిశ్రమం గట్టిపడలేదు. పౌడర్ లాగే ఉంటుంది.
అందువల్ల కదిపితే పగుళ్ళు వచ్చి, ఎక్కువ కాలం నిలబడదు. 
రెండు మూడు సార్లు నీటి తడి ఇవ్వాలి. అప్పుడు కాస్త గట్టి పడుతుంది.
అలా తడి ఇచ్చాక ఆ స్టాండ్ ని మాములుగా పెట్టుకోవాలి. 
ఆ తరవాత నాలుగు ప్లాస్టిక్ గ్లాసుల్ని తీసుకొని, వాటిల్లో ఈ సిమెంట్ పోసిన స్టాండ్ కాళ్ళని పెట్టాలి. 
ఆ గ్లాసుల్లో నీటిని పోయాలి. ( మన్నించాలి.. ఈ ఫోటోని తీయడం మరిచాను ) 
ఇలా కొన్ని రోజులు ఉంచాలి. 
ఇలా చేస్తే ఆ సిమెంట్ మిశ్రమం చాలా గట్టిగా తయారవుతుంది. 
ఆ తరవాత మామూలుగానే ఆ స్టాండ్ ని వాడుకోవచ్చు. మరింత ఎక్కువ కాలం వస్తుంది. 
పైపులు ఊడిపోయినా, సిమెంట్ రాడ్ లా ఉంటుంది. 
ఈ సిమెంట్ వేసేటప్పుడు GI / ఇనుప వైర్ ముక్క అందులో పెట్టి, 
సిమెంట్ వేస్తే - పగుళ్ళు వచ్చినా గట్టిగా ఆపుతుంది. 
ఇంతే.. 
ఆ స్టాండ్ ని మరో ఐదేళ్ళు లేదా ఇంకా ఎక్కువ కాలం నిరభ్యంతరముగా వాడుకోవచ్చును. 


No comments:

Related Posts with Thumbnails