నా హోం థియేటర్ Creative 2.1 లో పాటలు వింటుంటాను. అప్పట్లో దాన్ని నేను Rs. 1700 లకి కొన్నాను. దానిలో నాకు నచ్చినది ఏమిటంటే - బాస్ బూస్ట్ అయ్యి, బాగా డీప్ గా రావటం. అలాంటి హోం థియేటర్ కి చిన్న బాక్స్ లా చెయ్యాలనుకున్నాను. నా దగ్గర మిగిలిన - చిన్న చెక్కముక్కలు ఉంటే వాటిని వాడాలనిపించింది. గది లోపలగా ఉండే ఈ హోం థియేటర్ - ముందూ, వెనక భాగాలు మాత్రమే బయటకు కనిపిస్తాయి. ప్రక్కభాగాలు గోడా, వేరే బాక్స్ రావటం మూలాన అవి కనిపించవు. సో, ఆయా భాగాల్లో ముక్కలని జత చేసి, వాడుకోవాలనిపించింది. నిలువుగా ఉన్న ఐదు చిన్న చిన్న చెక్కలని మేకులు కొట్టి, ప్రక్క ప్రక్కగా జత చేశాను. ఇలా చేశాక ఒక పెద్ద ప్లయ్ వుడ్ ముక్కగా మారింది. దాన్ని నాకు కావలసిన సైజులో రంపంతో కోశాను. ( ఆ ఫోటోలు తీసుకోలేదు అప్పుడు ) ముందూ వెనక భాగంలో గాలి తగలటానికి వీలుగా ఓపెన్ చేసి ఉంచేలా ఉండే డిజైన్ ని ఎంచుకున్నాను. ఈ డిజైన్ ని సైజులు తీసుకొని చేసినది కాదు.. ఇంత సైజు ఉండొచ్చు అనుకొని, చేసినది అని ప్రత్యేకముగా చెబుతున్నాను.
ముందుగా హోం థియేటర్ బాక్స్ ని దానితో బాటుగా వచ్చిన ప్లాస్టిక్ కవర్లో అలాగే ఉంచి ప్యాక్ చేశాను. ( క్రింద ఫోటోలో అలాగే కనిపిస్తుంది ) అంటే దుమ్మూ, ధూళీ ఆ హోం థియేటర్ మీద పడి, అసహ్యముగా కనిపించకుండా ఉండాలనుకున్నాను. అందుకే అలా ప్లాస్టిక్ కవర్ని అలాగే ఉంచి, స్పీకర్ వద్ద మాత్రం గుండ్రముగా కవర్ని కత్తిరించాను. కనెక్షన్స్ పూర్తికి అక్కడ చిన్నగా రంధ్రాలు చేసి, కనెక్షన్స్ వచ్చేలా చేశాను.
ఆ తరవాత ఆ 12mm చెక్కలని - కలప జిగురూ, మేకులు వాడి బిగించేశాను. పైన ఏదైనా వస్తువులని పెట్టుకోనేలా - టీపాయ్ మాదిరిగా ఉండేలా పాత ప్లైవుడ్ చెక్కని అమర్చాను. దానికి మిగిలిపోయిన డేకోలం ముక్కని ఫెవికాల్ తో అతికాను. ఇలా ఎందుకూ అంటే - రేపు ఎప్పుడైనా ఆ టేబుల్ ని ఆ హోం థియేటర్ కి మాత్రమే కాకుండా వేరే పనులకి కూడా వాడుకోనేలా అనువుగా ఉండాలన్న ఆలోచన. లేకుంటే ఆ టేబుల్ని ఇటు వాడుకోలేం, అటు పారవెయ్యనూలేం.
ఒక వస్తువు మనకి రెండు, మూడు విధాలుగా పనికొచ్చేలా ఉండాలి. లేకుంటే అవి తెచ్చుకోవడం వృధా అని నాకు అనిపిస్తుంది. వాటిని వాడనప్పుడు ఇంటిని స్టోరేజ్ రూం లా తయారు చెయ్యడం ఎందుకూ అని నా ఆలోచన. అందుకే ఏవైనా క్రొత్తగా వస్తువు కొనేటప్పుడు / చేసుకోబోతున్నప్పుడు ఇలాగే ఆలోచిస్తాను. అలా చేస్తే - మనదగ్గర, చుట్టూ ఎంతో చెత్త నింపుకోలేము. వినడానికి ఫన్నీగా అనిపించినా చాలా ఇళ్ళు - చిన్న స్టోర్ రూమ్స్ గా మిగిలిపోతున్నాయి. మన ఇళ్ళు చెత్తగా, వేరేవారి ఇళ్ళు అందమైన ఇళ్ళుగా కనిపిస్తున్నాయీ అంటే ఇదొక కారణం. అందుకే ఒక వస్తువు బహువిధాలుగా పనికి రావాలన్నది నా అభిమతం. దానివలన మనకి ఒక వస్తువుకి వివిధ ఉపయోగాలు ఉండాలన్నది.
అలా బిగింపు అయ్యాక - చెక్కల ప్రక్క భాగాలు గరకుగా అసహ్యముగా కనిపిస్తున్నాయని, వాటికి - టేకు హాఫ్ రౌండ్ బీడింగ్ ( Teak Half round beeding ) మిగిలి ఉంటే అవీ కొట్టేశాను. ఇక ప్రక్క భాగాలకి గోల్డెన్ బ్రౌన్ ఎనామిల్ కలర్ మిగిలితే - అదీ పూసేశాను. రాత్రంతా ఆరనిచ్చేసి, మరుసటిరోజున నుండీ ఎంచక్కా వాడుకుంటున్నాను.
ఇప్పుడు మీకు ఇలా కనిపిస్తుంది. ముందు, వెనకాల భాగాల ఫోటోలని మీరు చూడవచ్చును. ఫోటోలు అంత క్లారిటీగా లేనందులకు మన్నించాలి. మొబైల్ కేమరాని వాడాను.
No comments:
Post a Comment