మా వీధిలో మురుగు కాలువల పని మొదలెట్టారు. పాత కాలువలన్నింటినీ త్రవ్వేసి, క్రొత్తగా సీసీ మురుగు కాలువలు కట్టేస్తున్నారు. ఆ సీసీ మురుగు కాలువల వల్ల - అవి చాలా ధృడముగా ఉండటమే కాకుండా విశాలమైన వెడల్పుతో, లోతుగా ఉండే వాటివల్ల చాలా మేలు కలుగుతున్నది. ఆ నిర్మాణ ఆలోచన అద్భుతం. పనీ వేగముగా జరిగిపోయింది.. కానీ ముందస్తు ఆలోచన లేని ఆ పని వల్ల అందరూ ఇబ్బంది పడటం మొదలెట్టారు. ఆ మురుగుకాలువకి పైకప్పు కి బడ్జెట్ ఇంకా సాంక్షన్ కాని కారణముగా క్రొత్తగా ఇబ్బందులు మొదలయ్యాయి. అదీ ముఖ్యముగా చిన్నపిల్లల స్కూల్ పిల్లలకు. ఆ మురుగుకాలువకు అవతల ఉన్న ఆ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళాలీ అంటే దాన్ని దాటాల్సిందే. ఇక్కడ ఆ కాలువని దాటాల్సింది ఆ పిల్లలే.
ఈ మురుగు కాలువ పై స్లాబు పనిని పూర్తి చేసేలా ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం. పైకప్పుకి బడ్జెట్ ఇంకా అనుమతులు రాని కారణాన అలాగే ఇప్పటికీ ఉన్నది కూడా. ఇక లాభం లేదని తలుపు చెక్కని దారిలా వేశారు ఆ స్కూలు ఉపాధ్యాయులు. ...కొద్దిరోజులలో దాని స్వంతదారులు ఆ తలుపు చెక్కని పట్టుకెళ్ళారు. సమస్య మళ్ళీ మొదటికి వచ్చింది. అ ఆ ల నుండి ఐదో తరగతి వరకూ అక్కడ చదువుకొనే పిల్లలకు ఆ కాలువని దాటి వెళ్ళడానికి ఇబ్బంది మొదలయ్యింది. ఉపాధ్యాయులు తమ వాహనాలని ఇవతలే పార్క్ చేసుకొని, లోపలికి వెళ్ళాల్సివస్తున్నది.
ఇలా కాదనుకొని ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, టీచర్లు కలిసి, రెండు పెద్ద బండలను దానిపై పెట్టి, దారిలా చేశారు. సరిగ్గా ఆ సమయం లోనే నేను అక్కడికి వెళ్లాను. "మీకెందుకు ఈ శ్రమ.. మీరూ ప్రభుత్వ ఉద్యోగులే కదా.. కంప్లైంట్ చెయ్యలేక పోయారా ?" అని అడిగితే - "అలా చేశామే అనుకోండి.. మమ్మల్ని టార్గెట్ చేస్తే - అవో ఇబ్బందులు. ఇప్పటికే ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాం.. లాభం లేదు సర్.." అన్నారు. వారి ఇబ్బందీ అర్థం అయ్యింది. ఆ తవ్విన కాలువ వెడల్పుకి ఆ బండలు సరిపోవటం లేదు.. కొద్ది అంచుల ( ఒకటి రెండు ఈంచులు అంతే! ) మీద ఆ కాలువ పైన ఉన్నాయి. కొద్దిగా ప్రక్కకు జరిగితే ఆ బండలు ఆ కాలువలో పడిపోవటం ఖాయం. పిల్లలు దాని మీద కాలు పెట్టి దాటేటప్పుడు - అవి జరిగి పడిపోయినా చాలా పెద్ద ఇబ్బందే.. గతంలో ఒక అమ్మాయి అలా పడిపోయింది కూడా..
అప్పుడే నేను అన్నాను కదా.. "మీరు అంతగా శ్రమ పడుతున్నారు కదా.. నా వంతుగా కొద్ది చిరు సాయం చేస్తాను. మీరు బండలు వేసెయ్యండి. నేను దాని చుట్టూరా సిమెంట్ వేయిస్తాను. కదలకుండా ఉంటాయవి. కాకపోతే మీ పాఠశాల ఆయాతో ఆ సిమెంట్ నీటి తడులు కొట్టించండి.." అన్నాను. అందుకు వారు సరే అన్నారు.
అప్పుడు నేను సిమెంట్ పని చేయిస్తున్నాను. మేస్త్రీ చాలా బీజీగా ఉన్నాడు. తనని సిమెంట్ అక్కడ కొట్టేసేయ్ అని చెప్పాలన్నా కుదరనంత బీజీ.. ఇక లాభం లేదనుకొని - నేనే కొంత సిమెంట్ మాల్ ( సిమెంట్ + ఇసుక మిశ్రమం ) ని ఒక తట్టలో కలుపుకొని ఆ పరచిన బండల చుట్టూ పోశాను. ఒకటి రెండు తట్టల సిమెంట్ మిశ్రమం సరిపోతుందేమో అనుకున్నా.. కానీ ఆరుతట్టల నిండా సిమెంట్ మిశ్రమం కావాల్సి వచ్చింది. ఒక మంచిపనికి నావంతు సహాయం అనుకొని ఆ పనిని పూర్తి చేశాను.
ఇక ఆయా అయితే కనీసం ఒక్కసారి కూడా ఆ వేసిన సిమెంట్ కి నీటి తడిని ఇవ్వలేదు. ఆ బాధ్యతనూ నేనే తీసుకొన్నా.. తడి ఇవ్వకుంటే ఆ సిమెంట్ పొడిగా రాలిపోతుంది. అందుకే ప్రొద్దునా, సాయంత్రం అంటూ అలా రోజుకి రెండుసార్లు దానికి బకెట్లతో ఐదురోజులు నీరు కొట్టాను. ఫలితముగా సిమెంట్ గట్టిపడింది. ఇంకా బాగా మంచిగా ఉండేలా చేద్దామని అనుకున్నా - కానీ అది తాత్కాలికమైనది. త్వరలో పైన బెడ్ వేస్తే నేను చేసిన శ్రమ అంతా వృధానే.. అనుకోని ఆగిపోయా.. కానీ ఇప్పటివరకూ బెడ్ లేదు.. ఈ రాళ్ళ బండలు అలాగే ఉన్నాయి. పిల్లలూ, ఉపాధ్యాయులూ హాయిగా దాని పైనుండి అటూ, ఇటూ తిరుగుతున్నారు.
ఏది ఏమైనా కొందరికి నావల్ల కాస్త మేలు జరిగినందులకు చాలా సంతోషముగా ఉంది.
No comments:
Post a Comment