నీ సమస్యని బయటకి చెప్పుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. ఎందుకంటే కొంతమంది మాత్రమే నీ పట్ల సానుభూతి చూపించి, సాయం చేస్తారు. మిగతావారంతా నువ్వు చెప్పేదాన్ని చిలువలు, వలువలు చేసి, పుకార్లుగా ప్రచారం చేస్తారు.
మన సమస్యలని సాధారణముగా ప్రక్కింటి వారికో, మిత్రులకో, ఆఫీస్ కొలీగ్స్ కో, కాసింత ఓదార్పు చూపిన వారికో - వారిని గ్రుడ్డిగా నమ్మేసి, అన్నీ ( చాలావరకు బయటకి తెలీనివే ) ఏకరువు పెడుతుంటాం. అవతలివారు మీరు చెప్పిన విషయాల్ని ఎంతవరకు అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకొని, ఎలా మనకి చక్కని దిశా నిర్దేశం చెయ్యగలరు? ఎంతవరకు మన విషయాల్ని గోప్యముగా ఉంచగలరు.. అన్న విషయాల్ని విస్మరించి, చెప్పేస్తాం. ఇలా మీరు చెప్పిన విషయాల్ని విన్న వారిలో కొద్దిమంది మాత్రమే - మీ పట్ల నిజమైన సానుభూతి చూపి, మనసా వాచా మీకు తగిన సహాయం చెయ్యగలరు. వీరు మీకు నిజమైన ఆపద్భాందవుల్లాంటి వారు.
అలా కాకుండా మీరు చెప్పిన విషయాల్ని చిలవలు వలవలు చేసి, మీ చుట్టూ ఉన్న వారితో ( మీ శత్రువులతో కూడా ) ఆ విషయాలకి మరింత ఊహాశక్తి జోడించి, మసాలాలు అద్ది పంచుకొనే వారు నిస్సందేహముగా మీకు కీడు చేస్తున్న వారే. ఇలాంటి వారి సహచర్యాన్ని మీరు ఎంత దూరముగా ఉంటే అంత మంచిది.
No comments:
Post a Comment