Saturday, September 7, 2013

Good Morning - 444


ప్రతిరోజు కూడా ఇదే మన చివరిరోజు అన్నట్లు బ్రతకాలి. 
అవతలివాళ్ళు గతంలో మనల్ని బాధపెట్టి ఉన్నా, అది గుర్తులేనట్లుగానే వారిని ప్రేమించు.. 
ఎవరూ వినట్లేదు అన్నట్లుగానే ఆలపించు. 
ఎవరూ చూడటం లేదు అన్నట్లుగానే నర్తించు. 
అప్పుడే నీ జీవితాన్ని నువ్వు పూర్తిగా అనుభవించగలవు. 

అవును.. ఈరోజే మన ఆఖరి రోజులా బ్రతకాలి. మన మీద ఆధారపడ్డ వారికీ, మనతో సంబంధం ఉన్నవారికీ మనం వారికి చివరి రోజుల్లో ఏమి చెయ్యాలనుకుంటామో అది నేడే చెయ్యాలి. ఎవరికైనా ఏదైనా రుణానుబంధం తీర్చుకోనేది ఉంటే వెంటనే తీర్చేసుకోండి. ఏదీ వాయిదాల్లో పెట్టకండి అని భావం. 

అలాగే దారిలో మనకు ఎదురైన అవతలివారు మనల్ని బాధపెట్టి ఉన్నా, ఆ పెట్టిన బాధ మీ మంచికోసమే పెట్టారు. ఆరోజు అలా బాధ పెట్టినందువల్లనే ఈరోజు ఈ స్థాయికి ఎదిగారు అనుకొని, వేరే దారిలో వారిని తప్పించుకొని తిరక్కుండా, నేరుగా ఎదురుపడండి. వారు మాట్లాడటానికి అయిష్టత చూపినా, మీరు మాత్రం - మీ మొహాన సన్నని చిరునవ్వుతో వారిని ఇష్టపడి, పలకరించండి. అప్పుడే మీరు చాలా హాయిగా ఉంటారు. ఆ తరవాత మీరే ఈ విషయాన్ని ఒప్పుకుంటారు కూడా. 

మీరు ఏదైనా పాట పాడాలనుకొంటే - మీ చుట్టూరా ఎవరూ లేరనీ, మీరొక్కరే ఉన్నారనుకొని పాట పాడండి లేదా హమ్ చెయ్యండి. 

అలాగే మీరు నృత్యం చెయ్యాలనుకుంటే - మీకు సరిగా రాకున్నా, మీకు వచ్చిన రీతిలో మీదైన శైలిలో డ్యాన్స్ చెయ్యండి.  ఆ నృత్యాన్ని ఎవరూ చూడకపోతే మీరు ఎంత ఫ్రీ గా చేస్తారో అలా చెయ్యాలి. ఉదాహరణకు : గంగ్నం డ్యాన్స్ కూడా ఫ్రీ స్టైల్ లో ఉంటుంది.. కానీ అది ఎంత ప్రాచుర్యాన్ని పొందిందో మీకు తెలుసుకదా.. ఇలా మీరు చేస్తుంటే - మీరు మీ జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారు. 

అలా చేసిన నాడు చాలా సంతోషముగా, మీ మొహాన ఒక చెప్పలేని వెలుగుతో చాలా ఆనందముగా ఉంటారు. అది నిజం. మొదట్లో ఈ మాటలని ఒప్పుకోవటానికి సంశయిస్తారు కానీ ఒకసారి అనుభవించాక - మీరే అంటారు " అవును.. నిజమే!!" అనీ..  

No comments:

Related Posts with Thumbnails