Sunday, September 1, 2013

స్నేహబంధం విచ్చిన్నం అవుతున్నప్పుడు..

సోషల్ సైట్స్ కి వచ్చిన క్రొత్తల్లో నాకో మిత్రుడు పరిచయం అయ్యాడు. అలా పరిచయమైన మా స్నేహం దిన దిన ప్రవర్ధమవుతూ చాలా మంచి మిత్రుడయ్యాడు. ప్రతిరోజూ విష్ చేసుకోకుండా ఉండలేనంతగా మా స్నేహం మారింది. అలా చాలా సంవత్సరాలు మా మధ్య స్నేహం కొనసాగింది. ప్రత్యక్షముగా మేము ఇంతవరకూ కలుసుకోలేక పోయినా ప్రతిరోజూ అలా ఆన్లైన్లో తప్పక కలుసుకొనే వాళ్ళం.

మా మధ్య ఎన్నో ముచ్చట్లూ, క్రొత్త కబుర్లు, రకరకాల విశేషాలు అన్నీ ఉన్నాయి. చాట్స్, మేస్సేజులూ, మెయిల్స్ అన్నీ మామూలు అయ్యాయి. నన్ను రాజ్ బ్రో, సోదరా!.. అని పిలిచేవాడు. నేనూ అలాగే ... పిలిచేవాడిని. నేనంటే భయం, గౌరవం, ఎంతగా అంటే - నామీద ఫోటో కామెంట్ చెయ్యటానికే భయపడుతాడు.

అలాంటి మా స్నేహం బ్రేకప్ అయ్యింది. ఎందుకంటే - ఏమి చెబుతాం.. ఒక స్నేహితునిగా, ఇంకో స్నేహితుని మీద ఇలా బ్లాగ్ లో పబ్లిక్ గా చెప్పటం అంత సంస్కారం కాదు. నిజానికి ఎక్కడా, ఎవరితోనూ పంచుకోవద్దు. కానీ ఇక్కడ ఎందుకు చెబుతున్నాను అంటే - ఒక చిన్న విషయం అందరికీ తెలియచేయ్యాలని.. ఆ విషయం చివరిలో వస్తుంది. తద్వారా మీరూ ఏమీ, ఎవరినీ అలా కోల్పోవద్దని.. మీకూ ఈ పోస్ట్ మీ స్నేహ జీవితాన చాలా ఉపయోగకరముగా ఉండాలని నా కోరిక.  అంతే!. అంతే కానీ అతను ఎవరూ? ఏమిటా కథ? అసలేమయ్యింది.. అన్న విషయాలు ఏమీ చెప్పకుండా నేరుగా ముగింపుకి వచ్చేస్తున్నాను. అందులకు మన్నించండి.

...... తనతో దూరంగా ఉండాలని అనుకున్నాను. విండో పీరియడ్ మాదిరిగా కొద్దిరోజులు ఆగాను. తన మీద ఎందరో చెప్పారు.. మీకీ ఇబ్బందులు అన్నీ తన సృష్టి యే అనీ. నా బ్లాగ్ కి రెగ్యులర్ వీక్షకుడు తను. ఏదైనా పోస్ట్ వేస్తే, దాన్ని ఇది వీరి మీద అంటూ ఏదో ఊహించేసుకొని వారికి చెప్పడం లాంటివి చేశాడు. ఒకటి, రెండుసార్లు చెప్పాను - " నీవు తెలుసుకున్నవి అన్నీ నిజాలు కాకపోవచ్చు.. ఏదేదో ఊహించేసుకొని, ఇలా చెప్పడం నాకేమీ నచ్చలేదు. నీవు అనుకున్నట్లు వారివీ, వీరివీ కావు.. అన్నీ ఇలా అందరికీ చెప్పటం, వారిని ఇబ్బంది పెట్టి, నన్ను ఇబ్బంది పెట్టడం.. ఇలా వద్దని చెప్పా. ఇలా చెయ్యటం స్నేహధర్మం కాదు. మీకు చెప్పడమూ నాకూ బాగోదు.. " అన్నాను.

అయినా మారలేదు. నాతో స్నేహముగా ఉంటూ నా విషయాలు ఇతరులకి నాకు తెలీకుండా చెప్పటం చేశాడు. కొద్దిరోజులు అతని విషెస్ కి బదులు ఇవ్వలేదు - నాకు కోపం వచ్చింది అని తెలియచెయ్యాలని. అయినా అలానే చెప్పటం మానలేదు. తద్వారా మరిన్ని చిక్కులు. ఆ చిక్కులు ఎంతగా అంటే - ఈ ఆన్లైన్ లో అంతగా చిక్కులు ఎవరివల్లా ఎదురుకోలేదు. ఈ ఒక్కమాట చాలు.. ఎన్ని ఇబ్బందులు ఎదురుకున్నానో..

అలా చెబుతున్నాడు అని నాకు తెలుస్తూనే ఉన్నాయి. ఆధారాలు నాకు లభిస్తూనే ఉన్నాయి కూడా. అవన్నీ పక్కా అనేలా లేవు. ఏదో ఒక లూప్ లైన్ ఉండి, తప్పించుకోనేలా ఉన్నాయవి. ఒకవైపు విసుగూ, మరోవైపు చాలా పాత స్నేహం.. మధ్య నలిగిపోయాను. పోనీ తనేం చెడ్డవాడు అనుకుందామా? కానే కాదు. మనిషి మంచోడే.. నాతో స్నేహములో మనసుకి దగ్గరగా వచ్చేశాడు.

ప్రతి మనిషికీ లోపాలు ఉంటాయి. స్నేహితుడిగా అతన్ని అంగీకరించినప్పుడు - అతనిలోని లోపాలనీ అంగీకరించాలి. అలా అయితేనే - స్నేహం కొనసాగుతుంది. అది నాకు తెలుసు. 

మరి ఇంతగా తెలిశాక మరి అలా ? అని అంటే - అక్కడికే వస్తున్నా.. నా ముందు మంచిగానే ఉంటూ, ఏదో చూసి, ఏదేదో అనుకొని.. అలా చెప్పేసి, అపోహలు సృష్టించి ( తాను అలా సృష్టిస్తున్నాడని తనకి తెలీకున్నా ) ఏమీ తెలీనట్లు నాతో మామూలుగా ఉండటం నాకు నచ్చలేదు. చూసీ చూసీ ఒకసారి చాట్ లో పర్సనల్ గా చెప్పా.. ఇలా వద్దని. ఇలాగే కొనసాగితే - నేను మీకు మిత్రునిగా కొనసాగలేను అనీ. కొన్ని విషయాలు ఎరగా ( అంటే వేరేవారి మీద కొన్ని గాసిప్స్ సృష్టించి ) వేశా. తనొక్కడికే చెబితే - వాటిని ఎవరికైనా చెబుతాడా అనీ. అవీ వేరేవారికి తెలిసిపోయాయి. ఇక పక్కా అని తెలిసింది.

అంతలోనే దేవుడే నాకు మేలు చేశాడా అన్నట్లు, ఒకసారి ఒక విషయం లో తనే ఒక ఆధారాన్ని ( స్క్రీన్ షాట్ ) పంపాడు. అలా నేను పంపమని అడగలేదు. తనంతట తానుగా పంపాడు. అది చూశాక ఎక్కడో చిన్న అనుమానం.. ఇందులో ఏదో తిరకాసు ఉందని నా మనసు శంకించింది. అలా ఎందుకు అంటే - ఆ స్క్రీన్ షాట్ క్రాప్ చెయ్యబడింది కాబట్టి. " ఇలా కట్ Crop చేసినది కాదు, వెంటనే ఈ స్క్రీన్ షాట్ మొత్తంది Crop ( క్రాప్ ) చెయ్యకుండా ఉన్నది మెయిల్ చేసి, పంపమని " వెంటనే చెప్పా. అలా పంపిచేస్తే క్రాప్ లో కట్ కాకుండా మిగతా దాంట్లో ఏమి ఉందో తెలుసుకోవాలనీ.. తను నా వినతిని చూశాడు. చాట్లో కూడా చెప్పా. ఆ చాట్ చూస్తే ఆ చాట్ లో క్రింద seen at... అని వస్తుంది. వచ్చింది కూడా.. అంటే చూశాడు అన్నమాట. కానీ రెండురోజుల తరవాత స్క్రీన్ షాట్ కాపీని మెయిల్ చేశాడు.

నేను ఊహించినదే జరిగింది. వచ్చిన స్క్రీన్ షాట్స్ చూశాను. స్క్రీన్ షాట్స్ మారాయి. పక్కాగా అవి వేరు సమయాల్లో తీసినవని అనుమానం నిజం చేసుకోవటానికి ఆ స్క్రీన్ షాట్స్ యొక్క ప్రాపర్టీస్ Properties చూశాను. డౌన్లోడ్ చేసిన ఫోటో మీద మౌస్ కర్సర్ పెట్టి రైట్ క్లిక్ చేస్తే ఒక మెనూ వస్తుంది. అందులో అట్టడుగున ఉండేదే ప్రాపర్టీస్. ఇందులో ఆ ఫోటో ( స్క్రీన్ షాట్) టెక్నికల్ డిటైల్స్ ఉంటాయి. ఫోటో / స్క్రీన్ షాట్ తీసిన సమయం, ఎడిట్ చేసిన సమయం, చివరిసారిగా మార్చిన సమయం.. ఫోటో సైజూ, ఆ ఫోటో పాత్ Photo path అడ్రస్, డిటైల్స్ అన్నీ ఉంటాయి. 

వాటిని క్రియేట్ చేసిన తేదీ, సమయాలు వేరుగా ఉన్నాయి. అక్కడ దొరికాడు. అంటే మొదటి క్రాప్ ఇమేజ్ పంపాక, నేను అడిగితే - ఆ తరవాత ఉన్న మెస్సేజెస్ డిలీట్ చేశాక అప్పుడు మళ్ళీ స్క్రీన్ షాట్స్ కొట్టేశాడు అన్నమాట. ( అని నా ఊహ ) అప్పుడు నాకు పంపాడు. అందులో నాకు పంపిన మెస్సేజెస్ కీ, తరవాత మెస్సేజ్ కీ రెండు రోజుల గ్యాప్ ఉంది. ( మొదట పంపినదాంట్లో నా మీద చర్చ వచ్చింది, అది కంటిన్యూ తప్పక చేసే విషయం.. అక్కడ చర్చ తప్పక జరుగుతుంది. కానీ, దాని కొనసాగింపు మెస్సేజెస్ అక్కడ లేవు. తను చేస్తాడు ఎలాగూ. తను ఎలాగూ నెట్ దగ్గర నుండి దూరముగా వెళ్ళడు. మా మధ్య అన్ని సంవత్సరాల స్నేహకాలములో నాకా విషయం పక్కాగా తెలుసు )

ఇలా రెండు రోజులు ఎందుకు గ్యాప్ వచ్చింది అడిగా. గ్యాప్ ఏమీ లేదని అన్నాడు.

పోనీ రెండురోజుల తరవాత ఎందుకూ మెయిల్ ఆలస్యంగా పంపావూ అంటే - తనకి వంట్లో బాగోలేక ఆన్లైన్ కి రాలేదు అని చెప్పాడు. అవునా అన్నాను. ఇక చాట్ క్లోజ్ చేశాను.

అతడి / నా క్లోజ్ ఫ్రెండ్స్ ని అడిగా - తను ఆ రెండురోజుల్లో తానేమైనా మెస్సేజెస్ పెట్టాడా అనీ..?

" అవును.. వచ్చాడు కదా!.. శుభోదయం మెస్సేజెస్ ఉన్నాయి - అదీ ప్రైవేట్ ఆప్షన్ లో.. మాకు షేరింగ్ లో ఉన్నాయి " అన్నారు. ( పైవేట్ లో పెడితే ఎవరికైతే షేర్ చేశామో వారికి మాత్రమే కనిపిస్తాయి, ఇతరులకి కనిపించవు )

" వాటిని స్క్రీన్ షాట్స్ తీసి పంపరా నాకు.." అని అడిగా. ..తీసి నాకు మెయిల్లో పంపారు.

వాటిని చూశాను. షాకయ్యాను. నిజమే. వాటి మీద సమయం ఆ రెండు రోజులదే ఉంది. ఆ రెండురోజుల్లో ఆన్ లైన్ లోకి వచ్చేశాడు. అలా ఎన్ని ప్రవేట్ మెస్సేజెస్ పెట్టాడో ఏమో..? అవి నాకు అనవసరం.

ఇక నమ్మకం పోయింది. నమ్మకమే స్నేహానికి పునాది. ఆ పునాదియే బలహీనముగా ఉంటే - పైన ఎంత స్నేహ రాజప్రసాదం కట్టినా ఎలా ఉంటుంది. ? అందుకే స్నేహాలలో అనుమానం అంటూ రానీయకూడదు. వస్తే నేరుగా అడగాలి. అలా అడిగిన నాడు - అడగబడిన వారు - వెంటనే ఎన్ని పనులున్నా ప్రక్కన పెట్టి, కనీసం క్లుప్తముగా అయినా సమాధానం ఇవ్వాలి. లేకుంటే ఆ అనుమానం ఆ స్నేహాన్ని కోలుకొని దెబ్బతీసే స్థాయికి చేరుకుంటుంది. 

మిగతా మిత్రులు హెచ్చరించినా, నా పాత మిత్రుడేగా, అలా చెయ్యడు అనుకుంటూ మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించేశాడు. అప్పుడే ఆలోచించుకొని నా విశ్లేషణలతో ఈ పొరపొచ్చాల మీద మెయిల్ పెట్టాను. జవాబు వచ్చింది కానీ అందులో తనదేమీ తప్పులేదని జవాబు. తనది ఉందా లేదా అని మళ్ళీ చూసే శక్తీ నాకు లేదపుడు.... సమస్యలు తగ్గించుకోవాలని అనుకున్నాను. మాటలు, మెస్సేజెస్ అన్నీ మానేశాను. ( ఇక్కడిదాకా చెప్పినది - నిజానికి బయటకి ఇలా పబ్లిక్ గా చెప్పకూడదు. అయినా చెప్పాను.. ఎందుకు చెప్పానూ అంటే - ఇలా మీకూ జరిగితే ఏమి చెయ్యాలో తెలుసుకోవచ్చును అనీ. అంతే! తప్ప తనని ఇబ్బంది పెట్టాలన్నది కాదు.. నేస్తమా! క్షమించు )

( ఇక్కడి నుండీ మీకు చెప్పాల్సింది ) తరవాత ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తకుండా ఉండొచ్చు. కానీ అది సంస్కారం కాదు. అలా చేస్తే - అన్ని సంవత్సరాల స్నేహానికి అర్థం ఉండదు. తన సమాధానం కూడా వినాలి కదా.. మహా అంటే - ఒక అరగంట కావొచ్చు. గంట కావొచ్చు.. అదే చివరిది అనుకున్నప్పుడు తప్పక ఆ సమయం తనకి ఇవ్వాలి. లేకుంటే ఆ స్నేహానికి అర్థం లేదు.  ముద్దాయిగా నిర్ణయం అయ్యాక కూడా కోర్టుల్లో - చివరిసారిగా నీవేమైనా చెప్పుకొనేది ఉందా? అని అడిగినట్లు. వింటే - అంతకాలం చేసిన స్నేహం వృధా కావొచ్చు, లేదా వారి మాటలు విన్నాక ఆ స్నేహం మళ్ళీ చిగురించుకోవచ్చును. కానీ చివరివరకూ ఆ స్నేహాన్ని నిలుపెట్టుకోవడానికి మనం ప్రయత్నించాం అన్న తృప్తిగా ఉంటుంది. 

ఆ తృప్తి మన మిగతా జీవన కాలం తన ఆలోచనలు లేకుండా హాయిగా కొనసాగటానికి, చక్కని అవకాశాన్ని ఇస్తుంది. ఇది నమ్మరు కానీ నిజం. నేను ఆచరించి, అనుభవపూర్వకముగా తెలుసుకున్నాకే మీకు చెబుతున్నాను. ఇంత మంచి విషయాన్ని తెలియచేసిన ఆ మిత్రుడికి ధన్యవాదములు తెలియచెయ్యటానికే ఈ పోస్ట్. 


అప్పుడు కాస్త బిజీ గా ఉన్నా. అయినా వీలుచేసుకొని మాట్లాడా. నన్నెందుకు దూరం చేస్తున్నారు ? ఇలా జరిగిందీ అని తన వైపు నుండి చెప్పాడు.

అంతా సావధానముగా విన్నాను. చాలాసేపు మాట్లాడాను. నా ఇబ్బంది ఏమిటో చెప్పాను. దానివల్ల నాకు ఎంత ఇబ్బందిగా ఉంటున్నదో, నేను ఎంతగా ఇబ్బంది పడ్డానో, ఇంకా ఎలా పడుతున్నానో, ఇవాళ ఇలాగే కొనసాగితే - భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావచ్చునో, తనకీ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకుంటాడో  అన్నీ చెప్పాను. తాత్కాలికముగా దూరం గా ఉండాలని అలా చేశాను. అలా దూరముగా ఉంటే నాకు ఎంత మంచిదో, తనకీ ఎంత మంచో చక్కగా విశ్లేషించి చెప్పాను. అలా తనని దూరం చేస్తున్న కారణాలు మాత్రం సూటిగా, స్పష్టముగా చెప్పాను. తను ఎక్కడ పొరబాటు చేశాడో అన్నీ విశదముగా వివరించాను. తన బాధ కొద్దిగా తగ్గటానికి ఈ దూరం కొంత అకాలమే అని చెప్పా. కానీ అది శాశ్వతమే అని నాకు తెలుసు. మొత్తం మాట్లాడనిచ్చాను. ఇక మాట్లాడటానికి ఏమీ మిగలనంతగా మాట్లాడనిచ్చా.

ఒక బాగా ఎరిగిన స్నేహ బంధం విచ్చిన్నం అవుతున్నప్పుడు మనమూ ఒక మెట్టు దిగి, దాన్ని నిలబెట్టుకోవాలన్న - నా ఆన్లైన్ స్నేహితురాళ్ళ అభిప్రాయాన్ని ఇక్కడ గుర్తు తెచ్చుకున్నాను. అందుకే ఇదంతా చేశా. ఇంత ఓపికగా ఆగాను. 

ఆ తరవాత అతని స్క్రాప్ బుక్ లో అందరికీ తెలిసేలా ఒక మెస్సేజ్ పెట్టి దూరం అయ్యాను. అప్పటి నుండీ ఇప్పటి వరకూ మళ్ళీ కలవలేదు. తనని దూరం ఉంచాను. మొన్న మొన్నే బ్లాక్ లిస్టు నుండి తనకి స్వేఛ్చ కలిగించాను.

ఇదీ సంగతి.. ఈ పోస్ట్ వల్ల మీకు ఏమి చెప్పాలని అనుకుంటున్నా అని మీరు అనుకోవచ్చు. అదే పాయింట్ కి వస్తున్నా. పై విషయం జస్ట్ ఉదాహరణ సమాచారం గా తెలియచేయ్యాలని అంతే. మీరు చెయ్యాల్సిందల్లా -

మీ మితృలకి ఇబ్బందులు కలిగించేలా మీరు ప్రవర్తించకండి.

వారితో నమ్మకముగానే స్నేహం చెయ్యండి.

మిమ్మల్ని వారు నమ్మారు అనుకోండి. ఆ నమ్మకాన్ని భగ్నం మాత్రం చెయ్యకండి. అలా చేస్తే - ఆ అవతలివారి హృదయం పైకి మామూలుగా ఉన్నా, లోపల మాత్రం అంతులేని క్షోభని అనుభవిస్తుంది.

మీ స్నేహం వారికి ఆహ్లాదకరముగా, నమ్మకముగా, మీ స్నేహము లో సేద తీరేలా, ఒక మంచి మనసు తోడు ఉండేలా చూడండి.

మిమ్మల్ని నమ్మోచ్చును అనేలా మీ ప్రవర్తన ఉండాలి.

కరి విషయాల్ని మరొకరికి, ఆ మరొకరివి ఇంకొకరికి చెప్పటం వలన మీకు వచ్చేది ఏమీ లేదు.  ఇలా అవతలివారికి ఇది ఎలా తెలుసు అని మీరు అనుకొంటే - నా పేరు బయటకి రావొద్దు అని మీరు ఆ విషయాన్ని చెప్పిన వాళ్ళలో ఎవరో ఒకరు - హామీ తీసుకున్నాక ఎవరు అలా అన్నారో వారికి చెప్పేస్తారు. అప్పుడు ఉన్న స్నేహాలు కూడా దూరమై పోతాయి. ఫలితముగా మీరు దూరం అవుతారు. ఇంతకాలం మీరు చేసిన స్నేహానికి, డబ్బుకీ, కేటాయించిన సమయానికి, చేసిన ప్రతిఫలాపేక్ష లేని సేవలకీ - అర్థం లేకుండా పోతుంది. అన్నీ గోవిందా.. గోవిందా.. కానీ మీరు ఇలా అన్నారు అని చెప్పినవారు - మీ మాజీ స్నేహితులకి అల్లం - బెల్లం లా మారిపోతారు. ఒక చిన్న మాట వల్ల వారికి బాగా దగ్గర అవుతారు. మనం అంత చేసి కూడా చిన్న లీకేజీ వల్ల అవతలివారికి దూరం అవుతాం. చాలా చిత్రమైన, చిన్నదైన, నమ్మశక్యం కాని విషయం ఇది.

కవేళ మీ స్నేహితుల్లో ఎవరైనా ఇలా చేస్తుంటే - సున్నితముగా మీ ఇబ్బంది ఏమిటో తన ప్రైవసీ లో చెప్పండి. అర్థం చేసుకుంటే మంచిదే. అప్పటికీ తన గుణం మారకపోతే - ఆ స్నేహానికి దూరముగా ఉండండి. జస్ట్ లైక్ హాయ్ & బై / కీపిన్ టచ్.. లా ఉండండి.

మీరు ఇతరుల స్నేహితుల గురించి అనే హక్కు మీకు లేదు. విడమరిచి చెప్పే అంత సీను గానీ, అవతలివారి మాటల అర్థాలు కానీ విశ్లేషించి చెప్పే అంత అవసరం లేదు మీకు. వారితో కాసింత జాగ్రత్త అనే సూచన చెయ్యడం వరకూ ఓకే. అంతకన్నా ఎక్కువ లోలోతుల్లోకి వెళ్ళి మీ - పనికిరాని చెత్త విశ్లేషణలతో ఆ స్నేహాన్ని చెడగొడితే - పగిలిన ఆ స్నేహ హృదయాలు - ఎంతగా క్షోభిస్తాయో మీకు తెలీదు. ఆ పాపం అంతా మీ వల్లనే అని తెలిసిందే అనుకోండి. మిమ్మల్ని ఇక వారు ఎట్టి పరిస్థితుల్లో కానీ వారిరువురు క్షమించరు.. అని బాగా గుర్తు పెట్టుకోండి.

ఆ మిత్రుడు నాకు తెలియచేసిన - స్నేహం బ్రేకప్ అయినప్పుడు వారిరువురే మాట్లాడుకొంటే - ఒకవేళ ఆ స్నేహం తిరిగి కొనసాగవచ్చు, లేదా అంతటితో అక్కడే ఆగిపోవచ్చును.. కానీ ఆ తరవాతి జీవనం హాయిగా - తాము అన్ని ప్రయత్నాలు చేశాం అన్న తృప్తితో కొనసాగిస్తారు అన్న పెద్ద విషయాన్ని తెలియచేసిన ఆ మిత్రునికి వేవేల కృతజ్ఞతలు. ఈ విషయాన్ని మరీ విడమర్చి ( తానెక్కడ ఎలా తప్పు చేశాడో ) ఇలా అందరి ముందు చెప్పటం మాజీ స్నేహితునిగా తప్పే. అందుకే క్షమించు అంటున్నాను. కానీ అందరికీ ఉపయోగపడుతుందని ఈ విషయం మొత్తం వ్రాశాను. 

నిజానికి ఈ విషయం తను ఫోన్ చేసేదాకా నాకు అలా చెయ్యాలన్న ఊహే రాలేదు. ఇంత అనుభవం ఉన్నా - ఆ విషయం నాకు సరిక్రొత్త అనుభవమే. కానీ నా జీవితం మునుపటి కన్నా హాయిగా, మరింత ఆనందముగా ఉండటానికి ఈ విషయం చాలాసార్లు అనుభవం లోకి వచ్చింది. మొత్తం నా జీవితాన ప్రవేశించి, బాగా దగ్గర అయిన నలుగురు మిత్రులని ఇలాగే ప్రయత్నించి, ఇద్దరినీ పూర్వ మిత్రులుగానే తిరిగి పొందాను. మరో ఇద్దరినీ ఎన్నెన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని ప్రయత్నాలు చేశాను. అన్ని ప్రయత్నాలు చేసినట్లు వారికి తెలిసినా, అవతలి వారి నుండి ప్రతిస్పందన రాకపోయేసరికి, ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్ని యత్నాలు చేసి, దూరం జరిగాను.

ఇప్పుడు హాయిగా ఉన్నాను. నేను ఎన్నెన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేశాను. కానీ, అదృష్టం నా వైపు లేదని వదిలేసుకున్నాను. నా వైపు నుండి అన్నిరకాలుగా ప్రయత్నించాక, ఇంతకన్నా నేనేమీ చెయ్యలేను అనుకొనేలా చేశా. కానీ అవతలి వారి నుండి ఏమీ స్పందన రాలేదు, కానీ ఆ స్నేహాన్ని నిలుపుకోవటానికి అన్నిరకాలుగా ప్రయత్నించా అన్న తృప్తితో చాలా మామూలుగా ఉన్నాను. బాధ లేదు. కొద్దిరోజులు బాధ పడ్డా. ఇప్పుడు అంతా సర్దుకుంది. మనం చేయి ఇస్తే కూడా అందుకోవడానికి వారికి ఇబ్బంది ఉంటే మనమేమి చెయ్యగలం.

No comments:

Related Posts with Thumbnails