Saturday, September 17, 2011

వంటింటి చెత్త - ఒక అందమైన పరిష్కారం

మీ ఇంటి పనిమనిషి చెప్పకుండా సెలవు పెట్టేసిందా?..

ఇంట్లో మిగిలిన పాచి అన్నం, కూరలు వాసన వేస్తున్నాయా..? 

వంటింట్లో ఉన్న చెత్తా చెదారం, డస్ట్ బిన్ నిండిపోయి వాసన వేస్తున్నదా?.. 

వాటిని బయట పారవేయటానికి ఎవరూ లేరా? 

మీ అపార్ట్మెంట్ పనివారు ఎవరూ అందుబాటులో లేరా?.. 

మీరు వెళ్లి బయట పడేద్దామని అనుకుంటున్నా ఇప్పుడు వెళ్ళితే బాగోదని అనుకుంటున్నారా?.. 

ఎవరూ చూడకుండా పాడేయ్యాలని అనుకుంటుంటే వీలు కావటం లేదా..? 

ఇల్లంతా ఆ చెత్త వాసనతో కంపుగా ఉంటుందా..?

మీ ఇంటి ఆడవారు పుట్టింటికి వెళ్ళారా?.. 

ఆ చెత్త మీ ఇంట్లో ఉంచుకుంటే ఇబ్బందిగా ఉందా..? 

ఇక రెండు మూడు రోజుల వరకూ బయట పారేసే వీలు లేదా..? 

అప్పటివరకూ ఇంట్లో ఈ కంపు వాసన లేకుండా ఉండాలా? 

..
..
ఇత్యాదివన్నీ మీ సమస్యలా..? 
ఓకే. 

వీటన్నింటికీ ఒక మార్గం ఉంది.. 
అదే ఇప్పుడు మీకు చెబుతాను.. చాలా సింపుల్. 

ఒకసారి నేను ఒక్కడినే నాలుగు రోజులు ఇంట్లో ఉండాల్సి వచ్చినప్పుడు ఇలా చేసి ఆ తల నొప్పులు పోగొట్టుకున్నాను. పనిలో పనిగా మా ఇంటి పనిమనిషీ ఆ నాలుగురోజులు సెలవు తీసుకొని వెళ్ళిపోయింది. అప్పుడే ఈ విషయం కనిపెట్టాను. 

ఇది చాలా సింపుల్, 

ఎకో ఫ్రెండ్లీ, 

చాలా ఖర్చు తక్కువ, 

ఎక్కువ మన్నిక, 

చాలా విశ్వాసనీయమైనది, 

తక్కువ సమయములో చేయవచ్చును, 

ప్రక్కన పెట్టుకొని కూర్చున్నా కంపు వాసన రాదు. 

మొదట చెప్పిన బాధలన్నీ మీకు తొలగిపోతాయి..

పశువులకీ మేలైనది.. ప్లాస్టిక్ కవర్లు తినే బాధ తప్పుతుంది. 

అర్రే!.. ఇంత బాగున్న ఈ విషయం ఏమిటో త్వరగా చెప్పరాదూ అని అంటున్నారా?.. 

హా.. అక్కడికే వస్తున్నా.. 
ఇదిగో చెప్పేస్తున్నాను.. 

1. ముందుగా ఆ చెత్త అంతా ఒక డబ్బాలోకి సేకరించండి. 

2. అందులోకి నింపాక, ఆ చెత్త డబ్బా పైన మూత పెట్టి, దాన్ని కాస్త సింక్ లోకి వంపి పట్టుకోండి. 

3. అలా చేస్తే ఆ డబ్బాలోని నీరు లాగా ఉన్న రసాలు అన్నీ సింక్ లోకి కారిపోతాయి. 

4. అలా కారిపోతే ఇక సగం సక్సెస్ అయినట్లే. వాసన అంతా ఆ నీటి తోనే వస్తుంది. 

5. ఇక ఆ సింక్ ని నీటి తో కడిగేసేయ్యండి. 

6. ఇప్పుడు నేల పైన రెండు మూడు దినపత్రికల పేపర్లు - పెద్దగా పరచండి. 

7. అలా పరచిన పేపర్ల మీద ఆ చెత్త డబ్బా గుమ్మరించండి. 

8. ఇప్పుడు ఆ పేపర్లని ఒక మూల నుండి రోల్ చెయ్యటం మొదలెట్టండి. 

9. అలా అంచుల వరకూ రోల్ చేసి, అంచులని లోనకి మడచి, కాగితముతోనే మడి చేయ్యండి. 

10. ప్రక్కవి తోకలు కూడా అలాగే లోనకి మడి చేసేయ్యండి. అంటే లాక్ చెయ్యండి. 

11. ఇప్పుడు మళ్ళీ ఇంకో రెండు మూడు పేపర్లు తీసుకొని, నేల మీద పరిచేసి, ఇందాక చేసిన ప్యాక్ ని అందులో పెట్టి, రోల్ చేసి మళ్ళీ అంచులు మడి చేసేయ్యండి. ఇలా చేస్తే మొదట వాడిన పేపర్లు చెత్త తేమకి పాడయ్యినా, ఈసారి చుట్టిన పేపర్లు వాటిని కాపాడుతాయి.  

12. ఇప్పుడు మీ ఇంటివారు, పని అమ్మాయి, ఇంకెవరైనా వచ్చేవరకూ అలాగే ఆ ప్యాకెట్ ని ఆ చెత్త డబ్బాలో కానీ ఒక మూలన గానీ ఉంచండి. ఇక వాసన రాదు. లేదా అలాగే స్టైల్ గా చేతిలో పట్టుకెళ్ళి, లలలలా.. అంటూ విజిలేస్తూ  బయట పాడేసేయ్యండి. ఎవరూ మిమ్మల్ని అనుమానించరు. ఏదో పేపర్ చుట్ట పట్టుకెల్లుతున్నారు అని మాత్రమే అనుకుంటారు. 

ఇందులోని రహస్యం ఏమిటంటే - చెత్తలోని తేమని పూర్తిగా వంపేస్తాము. ఇక మిగిలిన కాసింత తేమని ఆ పేపర్ పీల్చుకుంటుంది. ఇక చుట్టూ ఉన్న మడిచిన పేపర్ వల్ల వాసన ఇక బయటకి రాదు. పశువులు తిన్నా ఏమీ కాదు. పర్యావరణానికీ డోకా ఉండదు. 

మీరూ ప్రయత్నించి చూడండి. నిజమేనని ఒప్పుకుంటారు. దీన్ని ప్రచారం కూడా చేసేస్తారు. 

పనిలో పనిగా ఆఖరు మాటగా చెబుతున్నాను.. చెత్తమాట గా ఫీలయ్యి, పేపర్లో చుట్టేయ్యకండి. ఈ టెక్నిక్ పైన కాపీరైట్ హక్కులు నాకే ఉన్నాయి. కమర్షియల్ గా ఎవరైనా చెయ్యదలిస్తే - నాకు రాయల్టీ చెల్లించగలరు. లేదా అంతర్జాతీయ కోర్టులో కేసు వేయగలను.. హ అహహా హ్హా.. 

4 comments:

Anonymous said...

సూపర్ గా ఉందండి మీ అయిడియా. మీకున్నంత ఓపిక మనోళ్ళకి ఉంటే దేశం ఎప్పుడో బాగుపడిపోయేది. కొన్ని మార్పులు చేస్తే ఇంకా బాగుంటుంది. కాపీరైటులు మీవే. కంగారుపడకండి.

నేను కూడా ఇలా చెత్తను నీళ్ళతో కడిగాను కొన్నిసార్లు. వాసన చాలావరకూ పోతుంది. కానీ మిగిలిపోయిన ఆహారపదార్ధాలు మరింత పాచివాసన రాకుండా ఉండాలంటే ఇలా తయారుచేసిన పొట్లాన్ని వెంటనే బయటపారేయాలి. అలా వీలుకాక కొన్ని రోజులు నిలవ ఉంచవలసి వస్తే ఎండలో ఎండబెడితే అసలు వాసనరాదు.

ప్లాస్టిక్ కవర్లను వేరుగా పారవెయ్యటానికి ప్లాస్టిక్ కు వేరే చెత్త కుండీలు ఏర్పాటు చెయ్యాలి ప్రభుత్వం.
చెత్తను పారవెయ్యటానికి దేవుని బొమ్మలు లేని పేపర్లు వాడాలి. ఇంగ్లీషు వార్తాపత్రికల్లో దేవుని ఎక్కువగా బొమ్మలు వెయ్యరు. చెత్తను పారవెయ్యటానికి ఏ బొమ్మలు లేని మందపాటి కాగితం కవర్లను ఎవరైనా తయారుచేస్తే మరీ మంచిది.

Raj said...

మీరు నాకన్నా బాగా చెప్పారు.. ఎందుకైనా మంచిది కాపీరైట్ హక్కులు తీసుకోండి. హ ఆహా హ

Anonymous said...

నేను లేచేసరికే చెత్త బండి వెళ్లిపోతోన్నది. మా ఆవిడ లేనపుడు. ఇది నాకు వుపయోగపడుతుంది. ఇంతకీ నేను ఇది వుపయోగించుకొంటే రాయల్టీ ఎలా కట్టాలి?. మా ఆవిడ ఇది ఒప్పుకోకుండా పొద్దున్నే లేవమంటుందేమో?

Raj said...

వ్యక్తిగత వాడకానికి రాయల్టీ లేదండీ.. కమర్షియల్ వాడకానికే రాయల్టీ కాబట్టి మీరు నిశ్చింతగా ఉండండి. నిద్రపోయి మరచినప్పుడు క్రమసంఖ్య 12 ని ఒకసారి చూడండి.

Related Posts with Thumbnails