Sunday, September 18, 2011

Thread cutter

మనం చేసే వృత్తుల్లో ఒక స్థాయికి రాగానే ఎందుకో స్తబ్దత మొదలవుతుంది. అలా మొదలయినప్పుడు అలాగే సాగించటానికి ప్రయత్నిస్తూ ఉంటామే కాని, క్రొత్తగా వచ్చే అప్డేట్స్ ని తెలుసుకొని, వాటిని వాడటములో మెళకువలు తెలుసుకొని, ఇంకా ఖచ్చితత్వముగా, ఇంకా తేలికగా ఆ పని చెయ్యవచ్చును. కాని ఆ ఏర్పడిన స్తబ్దత వల్ల అలాగే ఉండిపోతాము. ఇలాంటిదే ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను.

సెట్ పానా కన్నా రింగ్ పానా వాడటం చాలా ఈజీగా ఉంటుంది. సెట్ పానా వాడితే రెండు పాయింట్ల మీద ప్రభావం చూపిస్తుంది. అదే రింగ్ పానా వాడితే ఆరు పాయింట్ల మీద ప్రభావం ఉంటుంది. సెట్ పానా వాడకం కన్నా ఈ రింగ్ పానా వాడితే పని ఇంకా వేగముగా, మరింత నైపుణ్యముగా పని చేసుకోవచ్చును. ఆ మాటకి వస్తే రింగ్ పానా అలవాటు అయ్యాక సెట్ పానాని చేతిలోకి తీసుకోవటం ఇష్టం ఉండదు. ఇక తప్పదు అన్నప్పుడే సెట్ పానా చేతిలో ఉంటుంది. నాకైతే రింగ్ పానా వాడటమే చాలా ఇష్టంగా ఉంటుంది. 

అలాంటిదే ఇంకోటి చిన్న పరికరాన్ని మీకు ఇప్పుడు పరిచయం చెయ్యాలని అనుకుంటున్నాను. ఇది కొద్దిమందికే తెలిసి ఉంటుంది. కాని చాలామందికి తెలియాలనీ, తద్వారా అందరికీ మేలు జరగాలనీ నా అభిలాష. 

చాలామంది ఇళ్ళల్లో కుట్టు మిషీన్లు ఉంటాయి. బట్టలు కత్తిరించటానికీ, దారాలు కత్తిరించటానికీ ఒక పెద్ద అరకిలో బరువు ఉండే కత్తెర వాడుతుంటారు. బట్టలు కత్తిరించటానికి అంటే ఓకే.. కాని బట్టలు కుట్టాక మిషన్ నుండి బట్టలని వేరు చెయ్యటానికి, దారాలని కత్తిరించటానికీ, ఎక్కువైన దారాలని కత్తిరించటానికీ ఆ బరువైన కత్తెరనే చాలా మంది వాడుతుంటారు. నాజూకు అయిన మహిళలకి మాత్రం అంత బరువు మోయ్యాల్సిందే! దానివల్ల చేతికి చాలా శ్రమ, వృధా కాలయాపన అని ఎవరూ అనుకోరు. మాకు ఇదే అలవాటు.. అని పైగా దబాయిస్తారు కూడా. ఇంకా మాట్లాడితే ఆ కత్తెర తోనే మనల్ని కత్తిరించటానికీ వెనుకాడరు. ఇప్పుడు వచ్చే పండగ సీజన్ లో వారి శ్రమ కాస్త తగ్గిద్దామని నా ఆలోచన. 

మా తాత ఇలాగే చేసేవాడు, మా నాన్న కూడా అలాగే చేసేవారు, నేను ఇదే,  ఇలాగే వాడుతాను, రేపు నా కొడుకూ, ఎల్లుండి నా మనవడూ ఇలాగే చేస్తాడు.. అనే నరనరాల్లోన జీర్ణించుకుపోయిన భావాన్ని తొలగించుకోరు. అందుకే చాలామంది వృత్తి పనుల్లో మొనాటనీ వచ్చేసి, ఒక విధమైన నిర్లిప్తత కొనసాగిస్తుంటారు. అలా ఎన్నెన్నో వృత్తులు ఉన్నాయి. వాటిల్లో ఒకటైన దర్జీ వృత్తివారికి ఉపయోగపడే ఒక పరికరాన్ని ఇప్పుడు పరిచయం చేయ్యబోతున్నాను.

ఈ క్రింది ఫోటో చూడండి.. అందులో ఉన్న ఆ మూడు అంగుళాల పరికరాన్ని త్రెడ్ కట్టర్ Thread Cutter అని అంటారు. మేడిన్ చైనావే ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఉపయోగం ఏమిటంటే - బట్టలు కుట్టాక మాటిమాటికీ దారం కత్తిరించాల్సి ఉంటుంది. అప్పుడు ఇది సూపర్ గా ఉపయోగపడుతుంది. చిన్న చిన్న కత్తిరింపులకి ఎంతగానో సూపర్ గా ఉపయోగపడుతుంది కూడా. ఒక్కగంట అలవాటు చేసుకున్నాక, ఇక దీన్ని మీరు మరచిపోలేరు. ఇది లేకుంటే బట్టలు కుట్టాలంటేనే విసుగు వచ్చేలా - అంత మాలిమి అవుతుంది.


Thread cutter
(మొదటిది మేము వాడుతున్నది. కొని ఆరేడు సంవత్సరాలు అవుతున్నది. కాస్త డర్టీ గా ఉందని క్రొత్తది ఇంకో ఫోటో గూగుల్ లో సంపాదించి పెట్టాను - టీవీ వంటల కార్యక్రమం లోని పాత్రల్లాగా) కేవలం ఐదు రూపాయలు ఉండే (నేను కొన్నప్పుడు అంతే!) ఈ చిన్న పరికరం చాలా ఉపయోగకర పనిముట్టు లా ఉంటుంది కూడా. ఖాజాలు, హుక్కులూ, గుండీలు, మిషన్ నుండి దారాలు కత్తిరించేందుకు, మిగిలిన దారాలని తీసేయ్యటానికీ.. పూలదండల వ్యాపారులకీ, మీసాల ట్రిమ్మింగ్ కీ చాలా ఉపయోగకరముగా ఉంటుంది. ఏదో ఒక రంగానికి ఉపయోగపడేలా చేసిన వస్తువులు - వాటిలోని సౌలభ్యత వల్ల మరికొన్ని రంగాల వారికి మరింత ఎక్కువగా ఉపయోగపడతాయి.. అని చెప్పడానికి ఇదొక చక్కని ఉదాహరణ. 

3 comments:

వనజ తాతినేని/VanajaTatineni said...

వస్తువు చిన్నదే! పని సులభతరం. ధన్యవాదములు

Anonymous said...

కొత్త విషయం తెలుసుకున్నాము. మీరు ఇలాంటివి ఇంకా వుంటే మాకు వుపయోగకరమైనవి తెలియచేయండి. ధన్యవాదాలు.

Raj said...

హా!.. తప్పకుండా.. ఇంకోద్దిరోజుల్లో మహిళల షాపింగ్ మాల్లో జరిగే ఒక ఇబ్బంది గురించి వ్రాస్తాను. అది తప్పక చూడండి.

Related Posts with Thumbnails