Monday, September 19, 2011

ఒక సరదా ఘటన

మొన్న వంటింటి చెత్త - ఒక అందమైన పరిష్కారం అనే టపా వ్రాస్తున్నప్పుడు నా కాలేజీ రోజులప్పుడు నా స్నేహితుడు చేసిన ఒక చిలిపి పని మీకు ఇప్పుడు చెబుతాను.. బాగా ఫన్నీగా ఉంటుంది.

ఒకరోజు మిత్రులమందరమూ దగ్గరలోని డ్యాం వద్దకి విహారానికి వెళ్ళాము. ఒక పది మంది స్నేహితులం స్కూటర్ల మీద అలా అలా జాలీగా వెళ్ళాం. మాతో కొన్ని అరటిపళ్ళూ, స్వీట్లూ, ఆపిల్స్, బిస్కట్ ప్యాకెట్స్, కూల్ డ్రింక్స్.. ఇలా అన్నీ పట్టుకెళ్ళాము. పోయేటప్పుడే మోత, వచ్చేటప్పుడు మోత లేకుండా ఉండాలని - యూస్ అండ్ త్రో వస్తువులనే పట్టుకెళ్ళాము.

అప్పుడు వర్షాకాలం సీజన్. డ్యాములన్నీ పొంగుతున్న వేళ.. జనం తండోపతండాలుగా చూడటానికి వస్తున్న వేళ.. అప్పుడు వెళ్ళాం మేము. అక్కడ నీళ్ళల్లో ఆటలూ, పాటలూ.. ఓహ్! అదో అందమైన మధురానుభూతి. ఫుల్ ఎంజాయ్ చేశాము. సాయంత్రం కాగానే ఇళ్ళకి తిరుగు ప్రయాణం మొదలెట్టాము.

నా మిత్రుడు ఒకరు - దేవేందర్ ఏమి చేశాడూ అంటే - తినగా మిగిలిన బిస్కట్ కవర్లూ, ఆలుగడ్డ చిప్స్ ప్యాకెట్స్ అన్నీ ఒక క్యారీ బ్యాగ్ లో సర్దేశాడు. అలాగే ఖాళీ స్ప్రైట్ కూల్డ్రింక్ బాటిల్స్ లలో మామూలు నీరు నింపి, అలాగే అరటిపళ్ళ తొక్కలూ, స్వీట్ బాక్స్ డబ్బాలూ ఫుల్ గా ఉండేలా కొన్ని రాళ్ళు పెట్టి క్యారీ బ్యాగుల్లో పెట్టాడు. ఎందుకురా ఇవన్నీ అంటే - ఏమీలేదు.. చెత్త అంతా ఇక్కడే పాడేస్తే ఎలా? మెయిన్ రోడ్డు మీదకి వచ్చేశాక పారేస్తాను అని సమాధానం ఇచ్చాడు.

నా డ్రైవింగ్ లో నా బండి మీద వెనక కూర్చున్నాడు. అలా ఇంటికి వచ్చేశాం. ఆ కవర్ ని దారిలో వదిలేశాను అన్నాడు. ఆ విషయమే అందరమూ మరచిపోయాము.

మరుసటిరోజున మేము అలా గుంపుగా మాట్లాడుకుంటున్నప్పుడు మాకు తెలిసిన వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు.. అతను మేము మాట్లాడుకునే అడ్డాలో ఒక షాప్ నిర్వహిస్తుంటాడు. ఆయన వచ్చేసి ఆ అబ్బాయితో - "ఏమయ్యా! దేవేందర్.. అలా చేస్తావా?.. మీరేదో అలా పారేసుకుంటుంటే - ఏమిటా అని మా జీపు నుండి మీకు చేతులూపటం చేశాము.. నీవు ఏమిటీ అన్నట్లు తెలీనట్లుగా మొహం పెట్టావు. మీరేదో క్రింద ఏదో క్యారీ బ్యాగ్ పడేసుకున్నారు.. మన ఊరి పిల్లగాళ్ళు అలా పారేసుకున్నారు అని మేము అటు చూడండి అని చేతులూపినా మీరు గమనించక, అలాగే పోయారు. సరే.. పిల్లలకి రేపు ప్రొద్దున ఇద్దాం అని ఆ జీపుని ఆపి ఆ బ్యాగ్ లో ఏమున్నాయో అని అని విప్పిచూస్తే - అంతా మోసం.. అన్నీ చెత్త, అరటి పళ్ళ తొక్కలూ.. నీళ్ళూ అంతే!.. ఇంతలా మోసం చేస్తావయ్యా.." అని ముద్దుగా అతన్ని అన్నాడు.. అది విన్నాక మేమంతా పడీ పడీ నవ్వాము..

అప్పటికే అతను ఏమి చేశాడు అంటే - ఈ తొక్కలనీ, వేస్ట్ నీ అంతా సవ్యముగా సర్దాడు. రెండుమూడు కవర్లలో అందముగా క్రొత్తవాటిల్లా ప్యాక్ చేశాడు కదా.. దాన్ని కుడిచేతిలో అలా వదులుగా పట్టుకొని, డ్రైవింగ్ చేస్తున్న నాతో ముచ్చట్లు పెట్టాడు. బకరాగా ఎవరు ఎదురు వస్తారా అని చూశాడు. ఎదురుగా మా ఊరి జీపు వస్తున్నది. అందులో ఈ పైన మీకు పరిచయం చేసిన ఆయన తన స్వంత జీపులో, తన మిత్రులతో అదే  డ్యాం కి - చూడటానికి వస్తున్నాడు. ఆయన్ని గమనించి, ఆ జీపు వారు గమనించేలా మనవాడు ఆ కవర్ ని - చూడక జారి పడిపోయింది అన్నట్లు వదిలేశాడు. నాతో పోనీయ్ రా త్వరగా అని అన్నాడు. మొత్తానికి పుష్పక విమానం సినిమాలోని బస్టాపులో గిఫ్ట్ డబ్బా వదిలేసినట్లు - సంఘటన లాగా.

ఆ జీప్ నుండి ఆయన మాకు "ఆగండి.. ఏదో పడేసుకున్నారు.. పడేసుకున్నారు.." అని చేతులూపారు. కాని మేము ఆగలేదు. అలాగే మాకు ఏమీ తెలీనట్లు వెళ్లిపోయాము. వారేమో మా ఊరి పిల్లలు, ఇలా తెలీక పడేసుకొని వెళ్ళిపోయి, ఎక్కడ ఇబ్బంది పడతారో అని, ఆ జీపుని ప్రక్కన ఆపి, మరీ ఆ కవర్ ని ఓపెన్ చేసి చూశారు. నీళ్ళ స్ప్రైట్ బాటిళ్ళూ, అరటిపళ్ళ తొక్కలూ ఉండేసరికి వారంతా ఫూల్స్ అయ్యామని బాగా నవ్వుకున్నారంట.. అది పోయి పోయి ఆయన్నే విప్పాడు మరి. అదీ మావద్దకి వచ్చేసి..

ఇప్పటికీ ఆ దారిలో వెళ్ళితే - ఆ సంఘటన ని బాగా గుర్తుచేసుకుంటాము. 

3 comments:

Anonymous said...

ఇవాళ పొద్దున్నే ఆఫీస్ కి వచ్చేప్పుడు బైక్ మీద వెళుతూ సెల్ ఫోన్ కింద పడేసుకుంటే పిలిచి మరీ ఇచ్చాను. ఈసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడతాను.

ఆత్రేయ said...

బ్రహ్మానందం, వేణుమాధవ్, సునీల్ ఒకళ్ళనొకళ్ళు కాళ్ళతో తన్నుకుని నవ్వించినంతగా ముతకగా ఉంది ఈ హాస్యం.
క్షమించండి. ఇలాంటి సంఘటన వల్ల నిజం గా విలువైన వస్తువులు పడిపోయినా ఇవ్వలేరేమో జనం.

buddha murali said...

naaku alane anipinchindi . indulo hasyam yemundi

Related Posts with Thumbnails