చాలాకాలం తరవాత మహేష్ బాబు నటించిన చిత్రం ఇది. ఖలేజా తరవాత ఒక మాంచి సక్సెస్ కావాలన్న లక్ష్యముతో ఈ మాస్ సినిమాని ఎంచుకున్నారు. మహేష్ స్టామినా ని నిలబెట్టాలని చేసిన ఈ ప్రయత్నం కాస్త మిశ్రమ ఫలితాలని అందించింది.
కథ స్థూలముగా చెప్పాలంటే - పాతకాలం కథకి నూతన ట్రీట్మెంట్ ఇవ్వటం. తండ్రిని చంపిన హంతకులను వేటాడి, కథానాయకుడు పగ తీర్చుకోవటం అన్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ లాంటి కథకి చిన్న ట్విస్ట్ - తండ్రిని బ్రతికించి, అదే తండ్రితో తనకి తెలీకుండా అయన చేతులతోనే, తనమీద దాడి చేసినవారిని తుదముట్టించటం - అనే ట్విస్ట్ తప్ప కథలో క్రొత్తగా ఏమీ ఉండదు.
ఇందులో అంతర్లీనముగా మహేష్ బాబు నటించిన "అతడు, పోకిరి" చిత్రాల ఇన్స్పిరేషన్ బాగా కనిపిస్తుంది. "ఖలేజా" లోని ఆహార్యం కూడా మిశ్రమమై ఉంది. వెంకటేష్ నటించిన "ఘర్షణ (సూర్య - కాక కాక)" సినిమా లాగా హీరో చుట్టూ నలుగురు అసిస్టంట్స్.. ని గుర్తుచేస్తాయి. అలాగే "నేనూ నా రాక్షసి" లోలా వేనీస్ కాకుండా టర్కీలో ఈ జంట మధ్య రోమాన్స్ సాగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అల్లుకొని తీసిన కథనే కావచ్చును. కాని అది బయటకు అలా కనపడకుండా బాగానే కష్టపడ్డారు. కాని ఫలితం లేకపోయింది.
నిజానికి చాలా చిన్న కథ. దీనికి చిన్నగా ట్రీట్మెంట్ ఇస్తే బాగోదు అని అనుకున్నారులా ఉంది. భారీ తారాగణం పెట్టారు. ఎవరికీ ఎక్కువగా నటించటానికి స్కోప్ లేకపోయిది కూడా. కోట శ్రీనివాసరావు, సుబ్బరాజు, హ్యాపీడేస్ శ్రావ్స్ ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతారో కూడా తెలీదు. ఇక అసలు విలన్ సోనూసూద్ పాత్ర చిత్రీకరణ ఒక అండర్ వరల్డ్ డాన్ లా లేదు. నిజానికి ఇంకా బాగా స్కెచ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. కాని ఆ పాత్ర తేలికగా తేలిపోయింది. అసలు డాన్ అంటేనే నమ్మని విధముగా ఆ పాత్ర తయారు అయ్యింది. ప్రకాష్ రాజ్ గురించి మధ్యలో పాత్ర నిడివి పెంచేసరికి అక్కడే సినిమా టెంపో బాగా స్లో అయ్యింది. దీన్ని నిడివి కాస్త తగ్గిస్తే ఇంకాస్త బాగుండేది ఏమో!..
వెన్నెల కిశోర్ హీరో అసిస్టంట్ శాస్త్రి పాత్రలో బాగా ఇమిడిపోయి, కామెడీ పండించాడు. బ్రహ్మానందం నటన ఇందులో రొటీన్ గా అనిపిస్తుంది. క్రొత్తగా ఏమీ చేసినట్లు అనిపించదు. తనకన్నా చిన్నదైనా, స్కోప్ తక్కువైనా - హీరో అసిస్టంట్ శాస్త్రి పాత్రనే కామెడీగా బాగుంటుంది. అలాగే ఎమ్మెస్ నారాయణ పాత్ర బాగుంది. తను చేసిన మగధీర, రోబో, యమదొంగ పాత్రల్లో చేసిన స్కూఫ్స్ చాలా ఫన్నీగా ఉన్నాయి. ఎమ్మెస్ మొహం లోని మడుతలు చూసి బ్రహ్మానందం అన్నమాటల్లో - కళ్ళ క్రింద క్యారీ బ్యాగులు... అన్నట్లుగానే మొహములో బాగా మడుతలు వచ్చేశాయి. ఇక భరత్ ని ఎంచుకొని, ఏమి చెయ్యాలని అనుకున్నారో తెలీదు. ఆ మిమిక్రీ శివారెడ్డి పాత్ర కాసేపు ఉన్నా కనిపించేలా చేశాడు.
అందరికన్నా మంచి కామెడీ పాత్ర అంటే - ధర్మవరపు సుబ్రహ్మణ్యం ది. కూల్.. అంటూ నటించినది కాసేపయినా బాగా కూల్ గా చేశాడు.
ఇక విలన్ కి విలనిజం లేకుండా ఒక జోకర్ లా ప్రాజెక్ట్ చేశారు. అక్కడే కథకి రావాల్సిన టెంపో పోయింది. అదేదో కామెడీ సినిమా చూసినట్లుగా అనిపిస్తుంది. అసలు ఈ పీలగా ఉన్న సోనూసూద్ ని కాకుండా అతని తమ్మునిగా నటించిన పాత్రధారిని విలన్ గా పెట్టినా కాస్త విలనిజం లో రిచ్ నెస్ వచ్చేదేమో..
మహేష్ బాబు ది చెప్పాలంటే - ఇలాంటి పాత్రల్లో చూసి రొటీన్ గా అయిపొయింది జనాలకి. తను త్వరలోనే దీన్ని బ్రేక్ చెయ్యటమే తన కెరీర్ కి మంచిది. లేకుంటే తనమీద ఉన్న క్రేజ్ - మొనాటనీ వచ్చేస్తుంది. చాలా ఈజ్ ఉన్న తన పాత్రలో చలాకీగా నటించాడు. చాలా బాగా చేశాడు. తన అభిమానులకి తన నటనతో సంతృప్తి చేకూరుస్తాడు. కాని మిగతా పాత్రలవల్ల అభిమానులు అనుకున్నంత హైప్ రాదు.
ఇక గొప్పగా చెప్పాల్సింది ఉందీ అంటే అది ఆ మహేష్ బాబు యొక్క గ్లామర్. తన గ్లామర్ తో ఆ సమంతా, శ్రావ్స్ నీ షాడో లోకి తీసుకవచ్చేశాడు. మహేష్ బాబు ఇలాగే తన గ్లామర్ మైంటైన్ చేస్తే - తన ప్రక్కన ఏ అమ్మాయి ఉన్నా తను ఇక తేలిపోవాల్సిందే..
పార్వతీ మెల్టన్ అందరి కళ్ళలో పడి, ఫీల్డ్ లో నిలదోక్కోవాలని అనుకుని, ఐటెం సాంగ్ చేసినా ఆ పాట లో కాస్త బీట్ తక్కువైంది. అక్కడా మహేష్ తన గ్లామర్, నృత్య రీతులతో తనని అడ్డుకున్నట్లే అనిపిస్తుంది.
తమన్ బాగా స్కోర్ చేశాడు. ఒకరకముగా చిత్రం హిట్ అయితే అందులో ముఖ్య భూమిక ఈ తమన్ సంగీతం అని కూడా చెప్పుకోవచ్చును. పాటలు క్యాచీగా ఉన్నాయి.
పీటర్ హెయిన్స్ + మరొకరు కంపోజ్ చేసిన స్టంట్స్ బాగున్నాయి. కెమరా, కంపోజింగ్, VFX బాగున్నాయి. కాని స్క్రీన్ మీద మధ్య మధ్య వచ్చే టైటిల్స్ ఎరుపు రంగు, చాకలేట్ బ్రౌన్ రంగులో ఉండి అంతగా చప్పున అర్థం కావు. శ్రీను వైట్ల ఒక ఖలేజా కన్నా కాస్త బాగున్న సినిమాని అందించారు. ఫ్యామిలీతో ఒకసారి చూడోచ్చును.
No comments:
Post a Comment