Friday, September 23, 2011

ఒకే దెబ్బకి ఎన్నో పిట్టలు.

అందరి పనిమనుష్యుల్లాగే మా ఇంటి పనిమనిషి. అవే డుమ్మాలూ, పనిని మీద మీద చేసిపోవటం.. సరిగ్గా రాకపోవటం.. ఎక్కువసేపు ఉండకపోవటం ఇత్యాది కారణాలు అన్నీ మామూలే. ఏదో ఎప్పుడైనా చేతకాని సమయాన అవసరం ఉంటుంది కదాని పెట్టుకుంటే (అలాంటి సందర్భం ఇంతవరకూ ఎదురుకాలేదు) ఇక ఆటలు ఎక్కువ అయ్యాయి.

ఏవైనా పెద్ద పండుగలకి రెండు రోజులు ఇల్లు దులిపితే, తను పట్టుకున్న మరో రెండు ఇళ్ళల్లో ఆరు రోజులు దులుపుతుంది. ఆ దెబ్బకి డమాల్. ఇక మంచానికి (కావాలని ? ) అతుక్కపోయి ఇక మళ్ళీ మొదటి తారీకు వరకూ అలాగే డుమ్మా. ఇక అన్ని రోజులూ సెల్ఫ్ సర్వీస్ తప్పదు. ఆతరవాత వచ్చి అన్ని రోజులకి జీతం పట్టుకోండి అని దీర్ఘాలు. తనకి బాగోలేక పోతే ఇక ఎలా మనసోప్పుతుంది. పోనీలే అని వదిలెయ్యటం..

ఇంకా మాకు ఇది సరిపోదు అన్నట్లు - 'మొన్న ఆ రెండిళ్ళ వారు ఫోన్ చేసి "నీకెలా ఉంది అమ్మా!.. జ్వరం తగ్గిందా..? బాగా అలసిపోయావు.. కాసింత రెస్ట్ తీసుకొని వద్దువులే. అసలే మాటలే సరిగా మాట్లాడటం రావటం లేదు.. హాయిగా రెస్ట్ తీసుకో, జీతం గురించి ఆలోచించకు.." అని వాళ్ళిద్దరూ అన్నారమ్మా.. అంటూ పెద్దగా, గొప్పగా చెప్పుకోవటం. అంటే ముందు జాగ్రత్తగా - నాకు జీతం తగ్గించవద్దు, అలాగే వారిద్దరిలా (వాళ్ళకి తను లేకపోతే ఒక్కపనీ చేసుకోలేరు) మీరు ఒక్కసారి ఫోన్ కాల్ చేసి అలా మాట్లాడరు.. అన్న అర్థములో మాట్లాడుతుంది.

ఇలా ఒకటా? రెండా? చాలా సార్లు అలాగే జరిగింది. ఇక ఈసారి అలాకాదు ఒకసారి జీతములో కోత వేద్దాం.. అప్పుడు తనకీ తెలిసొస్తుంది అన్నాను. నిజానికి పోయిన నెలలో చాలా పని ఉండెను. ఆగస్ట్ లో తొమ్మిదో తారీక్ న డుమ్మా మొదలెట్టింది అంటే మళ్ళీ సెప్టెంబర్ ఒకటో తేదీన వచ్చింది. అంతవరకూ జ్వరం. (ఇలా సరిగ్గా ఒకటో తారీకు వరకూ జ్వరం ఉండి వెళ్ళిపోయిన సందర్భాలు చాలాసార్లు జరిగాయి.) తను లేకపోయేసరికి బాగా ఇబ్బంది అయ్యింది కూడా. చూసీ చూసీ సరిగ్గా సమయానికి సెలవు పెట్టినట్లయింది. అది గమనించే అలాని అన్నాను.

ఒకవేళ ఆవిడ ఇక మళ్ళీ పనికి రాకపోతే? అని ప్రశ్నకి - చూద్దాం. రాకుంటే ఇరువురం కలసి మాట్లాడుకుంటూ చేసుకుందాం.. మన మధ్య అటాచ్మెంట్ కూడా ఉంటుంది (లేదని కాదు..) అని ప్రపోస్ చేశాను. ఓకే అని సమాధానం.

నా అంచనా మేరకి సరిగ్గా ఆగస్ట్ 31 సాయంత్రాన వచ్చి మళ్ళీ అవే మాటలు మాట్లాడటం మొదలెట్టింది. చెయ్యమంటారా?.. అని అడిగింది. (చెయ్యమనే చెబుతారు అని పని ఆవిడ ధైర్యం.) మేమూ చెయ్యమనే చెప్పాం. తెల్లారిన జీతం మాత్రం ఎన్నిరోజులకి వచ్చిందో అన్నిరోజులకి కట్టిచ్చేశాం. ఆమె నిజముగా షాక్. మేమిలా చేస్తామని అనుకోలేదు కూడా. కళ్ళలోకి నీరు తెచ్చేసుకుంది. రెగ్యులర్ గా రావటం మొదలెట్టింది.

మేము అనుకున్నది ఏమిటంటే - ఈ రాని ఇరవై ఒక్క రోజుల జీతం - ఎలాగూ దసరా అప్పుడు బోనస్ గా కొంత డబ్బులు ఇస్తాము కదా.. దానికి ఇది కలిపి ఇచ్చేద్దాం. తనకూ మనం ఎక్కువ డబ్బులు ఇచ్చేశాం అన్న తృప్తిగా ఉంటుంది. తన డబ్బులు తనకి ఇచ్చేశాం అన్న తృప్తీ ఉంటుంది. మనకూ తన డబ్బులు అలా వట్టిగా ఇవ్వకుండా, ఇలా పట్టుకున్నట్లుగా ఉంచేసుకొని, ఇప్పుడు వాటితో కలిపి ఇచ్చేస్తే - ఎక్కువ డబ్బులు కనిపిస్తాయి.. తనకీ పెద్ద వస్తువు కొనుక్కుంటుంది. అందరిలో బాగా డబ్బులు పెట్టాం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. తనూ - జీతం కట్ అవుతుందన్న భయముతో క్రమం తప్పకుండా పనిలోకి వస్తుంది... (అలాగే వస్తున్నది కూడా). మిగతా ఇద్దరి ముందు మమ్మల్ని కాస్త చులకన చేసి చెప్పటం మానింది. మేమంటే కాస్త గౌరవముతో కూడిన భయం మొదలయ్యింది. ఒకే దెబ్బకి ఎన్నో పిట్టలు కదూ..

మేము చేసింది కాస్త ఏదోలా ఉన్నా సరియైనదే అని తరవాత ఆమె రెగ్యులర్ గా రావటముతో అర్థం అయ్యింది.


No comments:

Related Posts with Thumbnails