Sunday, June 28, 2015

Good Morning - 584


నీ స్నేహితుని పైన నీకు ఏమైనా సందేహం వస్తే - నిస్సందేహముగా, ధైర్యముగా, ఎవరి తోడు లేకుండా నేరుగా అడుగు మిత్రమా..! అంతే కానీ - అనుమానించి, నిందించకు నేస్తమా..! నింద ఎలాంటిది అంటే - చావు అయితే ఒకేసారి వస్తుంది. నింద అయితే నీవు గుర్తుకువచ్చినప్పుడల్లా అవతలి వారి మనసుని చిధ్రం చేస్తూనే ఉంటుంది. 

స్నేహం అన్నాక అప్పుడప్పుడు స్నేహితులతో వివాదాలు, వారిపైన అనుమానాలు సహజమే. కానీ స్నేహితుని మీద ఏదైనా సందేహం కానీ వస్తే లేదా ఇతరులు వారి మీద లేనిపోనివి కల్పించి చాడీలు చెబితే - ఆ స్నేహితుని మీద మనకు నిస్సందేహముగా అనుమానం కలుగుతుంది. తనని ఎంతవరకు నమ్మొచ్చు అన్న మీమాంస వస్తుంది. ఫలితముగా మనసులో మనసు ఉండదు.. ఏదో చేదు రుచి చూసినట్లు, మింగలేక కక్కలేక అన్న స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. ఆ పరిస్థితుల్లో మనం ఇంకో స్నేహితుల వద్ద తన మీద మీ అనుమానాల్నీ, మధ్యనున్న వివాదాలనీ చెబుతారు. వారు ఆ సమస్యని రెండువైపుల నుండి ఆలోచించక, కేవలం మనవైపు నుండే ఆలోచించి, మనతో పొందే మేలుని దృష్టిలో పెట్టుకొని, మనకి అనుకూలముగా మాట్లాడుతారు. అప్పుడు వారు చెప్పిందే సరియైనదిగా భావించి, స్నేహితునితో ఉన్న స్నేహబంధాన్ని దూరం చేసుకోవాలనుకుంటారు.. చివరకు చేసుకుంటారు కూడా.. ఈ లోకంలో చాలావరకు ఇలాగే జరుగుతున్నది కూడా. 

అలాచేస్తే - కాసింత ప్రశాంతత వస్తుందేమో కానీ, ఎప్పటికీ హాయిగా ఉండలేరు. మనసుకి దగ్గరగా వచ్చిన స్నేహితుని మీద మనవైపు నుండి ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని ( ఇతరుల ఆలోచనల ప్రభావితమై ) బలంగా వారిమీద రుద్దేస్తాం.. కానీ వారి వైపున గల (స)హేతుక  కారణాలని కనీసం ఐదు నిముషాలైనా వినదల్చుకోం. ఫలితముగా ఆ స్నేహబంధం కోలుకోలేని దెబ్బ తింటుంది. మళ్ళీ కలవాలని ప్రయత్నిస్తున్నప్పుడు అహం వస్తుంది. ఒకవేళ దాన్ని ప్రక్కన పెట్టినా - ఆ బంధం మళ్ళీ ఎప్పటిలా కలసిపోవడం అసాధ్యం. 

ఇలా కాకుండా - నీ స్నేహితుని మీద ఏదైనా అనుమానంగానీ, సమస్య గానీ వస్తే - ఎవరి తోడు లేకుండా / వెంట లేకుండా మీరొక్కరే నేరుగా వారి వద్దకి వెళ్ళండి. ఇంతకు ముందు నిర్భయముగా మీ స్నేహితున్ని కలసినప్పుడు లేని భయం, బెరకూ, మొహమాటం... ఇప్పుడెందుకని? సుతిమెత్తగా, ప్రశాంతముగా, నిజాయితీగా, నిర్మొహమాటంగా, ఉన్నది ఉన్నట్టుగా, విన్నది విన్నట్టుగా మీ ఇబ్బంది గురించి వారితో చెప్పండి. తను ఎలాంటి సమాధానం చెబుతాడో ఓపికగా వేచి చూడండి. తను తన సమాధానం ఎలా చెబుతున్నాడో - తత్తరపడి చెబుతున్నాడా, మాటలు మింగేస్తున్నాడా, సంబంధం లేని విషయాలు చెబుతున్నాడా.. తన బాడీ లాంగ్వేజ్ ని విశ్లేషిస్తూ వింటుండండి. అలాగే తన కళ్ళలోకి నేరుగా చూస్తూ వినండి. మీకు కావలసిన సమాధానం మీకే నేరుగా దొరుకుతుంది. ఆతర్వాత ఆ స్నేహాన్ని కొనసాగించాలో, లేదో మీరంతట మీరుగా నిర్ణయం తీసుకోగలుగుతారు. ఇలా చేశాక మీరు మునపటికన్నా చక్కని ప్రశాంతత పొందగలుగుతారు. 

అంతేకానీ, మీరు సూటిపోటి మాటలతో నిందవేసి, అనుమానిస్తే, అవమానిస్తే - వచ్చే బాధ ఎలా ఉంటుందీ అంటే - చావు ఒకేసారి వస్తుంది. కానీ ఈ బాధ వారికి గుర్తుకు వచ్చినప్పుడల్లా - మనసుని కోసేస్తూ ఉంటుంది. అలాంటి పనిని ఎన్నడూ దయచేసి చెయ్యకండి. అంది వచ్చిన ఒక చక్కని స్నేహబంధంని మీరంతట మీరుగా దూరం చేసుకున్న వారు అవుతారు. 

No comments:

Related Posts with Thumbnails