Sunday, April 20, 2014

Good Morning - 557


స్నేహమేరా జీవితం.. 
స్నేహమేరా శాశ్వతం..

ఈ సృష్టిలో అతి మధురమైన వాటిల్లో స్నేహం కూడా ఒకటి. మనిషికి అవసరమైన చక్కని తోడూ, గురువు, ఆటగాడు, నమ్మకమైన వ్యక్తి, సంతోషాలనే కాదు బాధల్నీ పంచుకొనే వ్యక్తీ ఈ స్నేహంలోనే మనకి లభిస్తాడు. చాలామంది తమకి మంచి స్నేహితుడు ఇంకా దొరకలేదని ఫిర్యాదు చేస్తుంటారు. నిజానికి అది వారి తప్పే. 

తాము ఎలా ఆశిస్తున్నామో, ఎదుటివాడూ అలాగే ఆశిస్తుంటాడు అని తెలుసుకోరు. ఇక్కడే స్నేహాలు అపనమ్మకముగా, అపనమ్మకముగానే కొనసాగి... ముగిసిపోతాయి. ముందుగా మనమే ఒక మంచి స్నేహితుడికి ఉండే లక్షణాలతో మనమే ఎదుటివారితో ఎందుకు గొప్ప స్నేహితుడిలా కాకున్నా, ఒక మంచి స్నేహితుడిలా ఎందుకు ఉండలేక పోతున్నారో ఆలోచించరు. " స్నేహాలలో ఇతరులని తమ అవసరాల కోసం వాడుకుంటారు వారితో ఎలా నేను ఉండగలను..? అనుకుంటాం కానీ, మొదటగా మనమే ఒక మంచి స్నేహితుడిలా - మంచి స్నేహితుడి లక్షణాలని ఒంటపట్టించుకొని, ఎదుటివారితో సఖ్యతగా ఉందామని అనుకోం. ఇలా అనుకోని రోజులూ మన మనసుకి హత్తుకోనేంత దగ్గరగా యే ఒక్క స్నేహితుడూ కాలేరు. మనమూ ఇతరులకు ఆత్మీయ స్నేహితులం కాలేం. 

నేనూ మొదట్లో స్నేహితుల వల్ల బాధలు పడ్డవాడినే. అవసరార్థ స్నేహాలు చూసి, చూసీ స్నేహమంటేనే ఒకలాంటి విరక్తి వచ్చింది. స్నేహాల్ని నమ్మక ఒకలాంటి నిర్వేదంతో - మెటీరియలిస్టిక్ గా ఉంటూ, పైపైనే స్నేహం చేస్తూ ఉండేవాడిని. నిజమైన స్నేహాలు దొరికే స్థాయిని ( జీవనోపాధి లోకి రాకముందు ) దాటాక - ఇక అన్నీ అవసరార్థ స్నేహాలే. ముందు తేనెపూసిన మాటలు, చాటున వెక్కిరింతలు. అవన్నీ చూసీ, వినీ మెటీరియలిస్టిక్ గా మారాను. ఈ ఆన్ లైన్ లోకి వచ్చాక, కొద్దిమంది పరిచయస్థులు - స్నేహితులుగా మారారు. వారిలో ఒకరికోసం సోషల్ సైట్స్ గురించి ఈ బ్లాగ్ లోనే విపులముగా వ్రాశాను ( లింక్ : http://achampetraj.blogspot.in/search/label/Social%20Networking%20Sites ) 

ఈ స్నేహితుల గుంపుతో - స్నేహితుడిగానే ఉన్నాను. ఎక్కడా లేనిపోని భేషజాలకి పోలేదు. అక్కడే ఆస్థి, అంతస్థులు, వయసూ, ఎలాంటి తారతమ్యాలు లేకుండా చిన్నపిల్లల్లా మంచి మనస్సుతో ఉన్నాం. ఒకరకముగా చెప్పాలీ అంటే - బాగా పరిచయం ఉన్నవారందరినీ ఒక గదిలో వేస్తే ఎలా ఉంటుందో అలా.. మా స్నేహాన్ని చూసి, బయట నుండి వచ్చిన ఒకరు మా స్నేహాన్ని దారుణముగా, కావాలని అబద్ధాలు ఆడి విడగొట్టారు... వాటిని నమ్మినవారు దూరమయ్యారు. నమ్మనివారు మరింత దగ్గర అయ్యారు. అదీ ఒకరకముగా నాకు చాలా మేలే కలుగచేసింది. నా జీవితాన ఒక మంచి టర్నింగ్ పాయింట్ అయ్యింది. అలా కావాలని, ఏమి ఆశించి చేశారో కానీ, నాకంటూ బలమైన స్నేహాలు ఏర్పడి, ఒక మలుపుదిశగా  స్నేహబంధాలు కొనసాగాయి.. కొనసాగుతున్నాయి కూడా. అసలు వారికోసమే ఈ ఆన్లైన్ కి రావటం...ఇంతా చేసిన ఆ ఒకరికి వేవేల కృతజ్ఞతలు. తన ఋణం ఎలా తీర్చుకోగలనో ..!! తను చాలా బాగుండాలని కోరుకోవటం కన్నా ఇంకేమీ చెయ్యలేను. నేనేమిటో, నన్ను పూర్తిగా నమ్మినవారు ఎందరున్నారో, ఎందరు నాకు సపోర్ట్ గా ఉన్నారో, నామీద వచ్చిన పుకార్లని, అవి పుకార్లే అని తెలుసుకొని, ఆ ఒకరికి దూరముగా ఉండి, నాకు మద్దతు ఇచ్చారు. కొందరేమో - వారేదో చెబితే - నిజమేమిటో తెలుసుకోక, అవే నిజమని నమ్మారు. నిజానిజాలు ఏమిటో తెలుసుకోలేదు.. కనీసం ప్రయత్నించలేదు.. అవే నిజాలు అనుకొని, ఏదేదో చాటుగా చెప్పుకున్నారు. దూరమయ్యారు. నాకు తెలిసినా అన్నింటికీ మౌనముగానే ఉన్నాను. 

ఎందుకిలా మౌనంగా ఉండటం అంటే - 
అప్పుడే - నా స్నేహితులెవరో, కానివారు ఎవరో తెలుసుకోవటం మొదలెట్టాను. 
ఎవరెవరికో నా నిజాయితీ ఏమిటో చెప్పి, నా దగ్గరే ఉంచేసుకోవాలని అనుకోలేదు. 
ఇన్నేళ్ళ నా నాతో చేసినది స్న్హేహమేనా ? కాదా ? 
ఎవరు అసలు నా స్నేహితులు ? 
ఎవరు నన్ను ఎంతగా నమ్మారు ? 
నామీద ఎంత నమ్మకం ఉంచారు ? 
అసలు జరిగినది ఏమిటీ ? అందులో నా పాత్ర ఎలాంటిది ? అనేవి చూశారా ?
ముఖ్యముగా - 
ఇన్నేళ్ళ స్నేహములో వారు నన్ను పూర్తిగా విశ్వసించారా  ? లేక అపనమ్మకముతోనే ఉన్నారా ? జీవితాన సగదూరములో ఉన్న నాకు ఇక శేష జీవితాన ఎవరి మీద సమయాన్ని కేటాయించాలో, ఎవరిని అస్సలు పట్టించుకోవద్దో - తెలుసుకోవటానికి వచ్చిన చక్కని అవకాశం అనుకున్నాను. 
అలాగే తీసుకొన్నాను. నా మిత్రులలో ఎవరు ఎలా స్పందిస్తారో - ఇతరుల మీద ఆధారపడక, అన్నీ స్వయాన తెలుసుకుంటూ ఎవరేమిటో తెలుసుకున్నాను. 
ఓపెన్ గా ఉండే నా ప్రొఫైల్, నా అన్ని వివరాలు అన్నీ వారికి తెలుసు. వారికి నామీద నమ్మకం ఉంటే వారు నన్ను వీడరు. కొద్దిమందికి సందేహం వచ్చినా, నేరుగా అడిగారు. అడిగినవాటికి వివరణలు ఇచ్చాను. నిజమా, కాదా అని వేరేవాళ్ళ పేర్లు చెప్పి, వారిని నిజాలేమిటో తెలుసుకోమన్నాను. తెలుసుకున్నారు. స్నేహబంధం ధృడమయ్యింది. ఇదంతా ఒకెత్తు. 

మరొక స్నేహితురాలి వలన - స్నేహములో నిజాయితీగా ఉంటే - అంటే - అసలు స్నేహితుడి లక్షణాలని ఒంటబట్టించుకొని ఉంటే, ఎంత మధురమైన స్నేహ మాధుర్యాన్ని అనుభవిస్తామో తెలుసుకున్నాను. నేను చేసిన గొప్ప, మరచిపోలేని స్నేహాల్లో ఇదీ ఒకటి. కొన్ని బలమైన కారణాలవల్ల ఆ స్నేహం దూరం చేసుకోవాల్సి వచ్చింది.. గుళ్ళో ప్రసాదంలా కొద్దిగా దొరికినా, ఆమాత్రం దానికే మరచిపోలేని స్నేహ మాధుర్యాన్ని రుచి చూశాను. తనకి బాగా ఋణపడిపోయాను. అది ఈ జీవితాన తీర్చుకోలేనేమో.. 

పై రెండు విషయాలూ ఎందుకు చెప్పానూ అంటే - ఆ రెండూ నా అనుభవాలే. 
ఆ రెండూ స్నేహం విషయంలోనే జరిగాయి. 
ఒక స్నేహం వలన ఇబ్బందులు ఎదురుకున్నా, ఒక మంచి మలుపు పొందాను. 
మరో స్నేహం వల్ల స్నేహితుడిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. అలా మలుపు తీసుకున్నాను.
ఆ రెండూ భిన్నమైనవే. కానీ రెండింటి వల్లా నేర్చుకున్నాను.. 
నేనేమిటో, నా బలాలు, బలహీనతలూ తెలుసుకున్నాను..
నన్ను నేను మార్చుకున్నాను. 
ఎలా ఉండాలో, ఉండకూడదో అనుభవం ద్వారా నేర్చుకున్నాను. 
ఇవన్నీ స్నేహం కాక మరేమి నేర్పిస్తుంది ??

స్నేహాల్లో అప్పుడప్పుడు పెను తుఫానులు ఉండాల్సిందే. దానివల్ల మనమేమిటో, మన బలబలాలు ఏమిటో అన్నీ అర్థం అవుతాయి. 

చిన్నప్పుడు చదివిన ఒక కథ గుర్తుకువస్తున్నది. అది చెప్పేసి, ముగిస్తాను. 

అడవిలో ఒకసారి గాలి దుమారం వస్తుంది. బలంగా నిలబడిన చెట్లు కేవలం ఆకులు మాత్రమే కోల్పోతాయి. అదే బలహీనమైన వ్రేళ్ళు గల చెట్లు అడ్డముగా నేలకొరుగుతాయి. ఇది చూసి, ఒక చెట్టు మరొక చెట్టుతో అంటుంది కదా - " వాటిని చూశావా! అవి ఎలా కుప్పకూలాయో కదా.. ఈ పాడు గాలిదుమారం. మనలోని కొన్నింటిని పాడుచేసింది.." అంటే - అప్పుడు మరో చెట్టు అంటుంది కదా - " అది గాలిదుమారం తప్పుకాదు. మనం నేలతల్లి తో మన వ్రేళ్ళని కౌగిలిలా ఎంత ధృడంగా పెనవేసుకొని ఉన్నామో బట్టి (స్నేహ)బంధం ఉంటుంది. అక్కడ ధృడంగా లేనప్పుడు, మీద మీదనే అన్నట్లు ఉంటే - ఇలాగే నేలకొరగక తప్పదు.. " అంది నిజమే కదూ.. 

1 comment:

Anonymous said...

మీ స్నేహ అనుభవాలు బాగున్నాయండీ....
మాతో షేర్ చేసినందులకు ధన్యవాదములు.!

Related Posts with Thumbnails