Thursday, April 3, 2014

Good Morning - 554


కొన్నిసార్లు మనం పరిస్థితులకి తలొగ్గాల్సి వస్తుంది. 
అంతమాత్రాన లొంగిపోయినట్లు కాదు.. 

జీవితాన కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యిలా ఉంటాయి అవి. ఆ పరిస్థితుల్లో ఎదిరించాలని చూస్తాం. కానీ ఏవేవో బంధాల వల్లనే కానీ, కారణాల వల్లనే కానీ, చెప్పలేని భావాల వల్ల కానీ... ఎదిరించలేకపోతాం. అందరి ముందూ ఒక దోషిలా తలొంచుక నిలబడాల్సి వస్తుంది. మనకీ, మన ఆత్మకీ తెలుసు - మనదేమీ తప్పు / పొరబాటు లేదనీ. కానీ అలా తలొగ్గినట్లు ఉంటే - మనం అనుకున్న విధముగా ఆ పరిస్థితి చక్కబడుతుంది అన్నట్లుగా మనం భావిస్తాం. కానీ ఎదుటివారు ఎలా భావించినా సరే.. లొంగిపోయాడు అని వెక్కిరించినా సరే.. నిజానికి అలా చెయ్యడం లొంగిపోయినట్లు కాదు. మనకంటే ఎదుటివారు / పరిస్థితులు బలంగా ఉంటే తప్పదు కదా.. 

దీనికో చక్కని ఉదాహరణ ఇస్తాను. తనలో కలిసే నదీప్రవాహాలని సముద్రుడు అడుగుతాడు ఒకరోజు. ఏమనీ అంటే - మీరు మీ మీ ప్రవాహాలల్లో ఎన్నెన్నో వాటిని తీసుకవస్తారు, కానీ తుంగని ( గట్ల వెంట సన్నగా పుల్లల్లా పెరిగేది )మాత్రం తీసుకరారు అనీ.. 

దానికి అవి అంటాయి కదా " మా ప్రవాహాలు బలంగా ఉన్నప్పుడు ఆ మొక్క ఎదురు నిలవక తలొగ్గి, అణుకువగా ఉంటుంది. అప్పుడు మా ప్రవాహ బలం దానిని ఏమీ చెయ్యజాలదు. అదే మిగతా వృక్షాలు, రాళ్ళు వాటికి  ఉన్న శక్తి మా ప్రవాహ బలం ముందు తక్కువ అయినా - విర్రవీగి, ఎదురు నిలుస్తాయి. అందుకే వాటిని కూకటి వ్రేళ్ళతో పెకిలించుకొని వస్తాం. మా ప్రవాహ బలం తక్కువగా ఉన్నప్పుడు అదే తుంగ ఠీవిగా నిలబడి ఉంటుంది.. " 

అందుకే - జీవితాన ఒక్కోసారి మనకన్నా బలమైన వాటి ముందు తలొంచాల్సి వచ్చినా - అది కేవలం అప్పటి పరిస్థితుల ప్రభావమే అని అనుకోవాలి. అంతేకానీ  లొంగిపోయినట్లు కాదు. 


2 comments:

విశ్వ మోహన్ (సంజయ్) said...

చాలా బాగా చెప్పారు ......

Raj said...

ధన్యవాదములు సంజయ్ గారూ..

Related Posts with Thumbnails