Saturday, March 12, 2011

Social NW Sites - 20 - వారు ఇతర మిత్రులకు ఎలా స్క్రాప్స్ పంపుతున్నారు.?

మీకు వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ లోని అతను, లేదా మీకు క్రొత్తగా ఆడ్ అయిన మిత్రుడు - అంతకు ముందు తన మిత్రులతో ఎలా వ్యవహరిస్తున్నాడో  కాస్త గమనించాలి. చాలామంది స్క్రాప్ బుక్స్ లోకి తొంగి చూద్దామన్నా, చాలా స్క్రాప్ బుక్స్ - స్నేహితులు మాత్రమే చూసేలా సెట్టింగ్స్ పెడతారు. ఇలాంటివారివి ఆడ్ అయ్యాకే చూడగలం. వీరు మిత్రులకి ఎలా వ్రాస్తున్నారో - వారి స్క్రాప్స్ బుక్ లోకి వెళ్లి, చూడగలం (ఓపెన్ టూ ఆల్ అనే సెట్టింగ్ లో ఉంటేనే.)

ముందే చెప్పానుగా.. ఎవరి స్క్రాప్స్ బుక్ చూసినా, మొదట్లోనే చూడాలి. ఆ తరవాత వద్దే వద్దు. చూసి వేరు వేరుగా అర్థాలు చేసుకోగలం. అలా చూసి ఎన్నో అపార్థాలు చేసుకుంటూ మనసులు పాడు చేసుకుంటూ, సఖ్యముగా ఉండలేకపోతాము. అది ఎలానో Social NW Sites - వివాదాలు అనే టపాలో చెబుతాను.

ఆ నూతన స్నేహితుడికీ, మీకు మధ్య మ్యూచువల్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే చూడండి. మ్యూచువల్ ఫ్రెండ్ అంటే - ఆ నూతన మిత్రుడి ఫ్రెండ్ లిస్టు లో, మీ ఫ్రెండ్ లిస్టు లో రెండింటిలో కామన్ గా ఉన్న మిత్రుడు అన్నమాట. అందులో బాగా ఆన్లైన్ లోకి వచ్చే ఆ మ్యూచువల్ స్నేహితుడి స్క్రాప్ బుక్ లో అతడి స్క్రాప్స్ వెదకండి. ఇక్కడ ఒక చిన్న గమనిక. అలా ఇతరుల స్క్రాప్స్ బుక్ చూడవద్దు అంటాడు.. మళ్ళీ చూడాలి అంటాడు ఏంటీ! అని అనుకోకండి. జస్ట్ అన్నీ కాదు ఆ నూతన మిత్రుడు వ్రాసినవే - అవి కూడా కొన్నే! అదీ పై పైనే చూడండి. అతని వ్రాసే స్టైల్, ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడూ, తను వ్రాసిన ఒక స్క్రాప్ కీ - ఇంకో స్క్రాప్ కీ గల సమయం తేడా ఎంత, ఎన్ని రోజులు తేడా ఉందో గమనించాలి. అలా చూడటం కూడా జస్ట్ ఒక అభిప్రాయం రావటానికి అంతే. కాని రంధ్రాన్వేషణ లా లోతుగా వెళ్ళకండి. అలా చేస్తే మీరు వెళ్ళిన ఉద్దేశ్యమే మారిపోతుందిఇలా చెయ్యటం కూడా మొదట్లోనే చెయ్యండి. ఆ తరవాత అలా చూడటం మానేయ్యండి. అలా రఫ్ గా చూస్తే - కాసింత అభిప్రాయానికి రావచ్చును. ఇదంతా బాధపడలేం అని మీరనుకుంటే ఇంకో మార్గమూ చెబుతాను.

వారికీ, మీకు మధ్య ఉన్న మ్యూచువల్ స్నేహితులలో మీకు బాగా తెలిసిన వారిని చాట్ కి ఆహ్వానించండి. అందులో అతని ప్రొఫైల్ ఐడి లింక్ ఇచ్చి, అతని గురించి అడగండి. అప్పటికే అతను మీ స్నేహితుడికి స్నేహితుడు అయి ఉంటాడు కదా! అతని మనస్తత్వం ఏమిటో అతనికి తెలిసే ఉంటుంది. మీ మనస్తత్వం కూడా మీ స్నేహితునికి తెలుసుకదా. అతను ఎంతవరకు మీతో సఖ్యముగా ఉండగలడో, అతనికి కాస్త తెలుస్తుంది.  మీకు అతని గురించి కాస్త విలువైన సమాచారం చెబుతాడు - అతను ఎవరూ, ఎలా పరిచయం, ఏమి చేస్తుంటాడు, ఎలా మాట్లాడుతాడు, ఏమైనా ఇబ్బందులు పెడుతున్నాడా, అతని వ్యక్తిత్వం.. ఇలా అన్నీ అపుడే తెలిసిపోతాయి. అప్పుడు మీరు మీ మనస్తత్వానికి వారు సరిపోయేదీ లేనిదీ చూసుకొని, ఆడ్ చేసుకోవచ్చును.. లేదా రిజెక్ట్ చెయ్యవచ్చును. ఒకవేళ వారు చెప్పింది కాస్త అనుమానం ఉందే అనుకోండి. అప్పుడు ఇంకో మ్యూచువల్ ఫ్రెండ్ ని అడగండి. సరిపోతుంది. వారు చెప్పిన దాంట్లో ఏవైనా ఇబ్బంది విషయాలు ఉంటే తప్ప, సగం ఓకే అనిపిస్తే ఆడ్ చేసుకోండి. - ఇక్కడ ఒక విషయం బాగా గుర్తు పెట్టుకోండి. వారి అభిప్రాయాలు వారు చెప్పారు. అవే నిజం కాకపోవచ్చును. మీరంతట మీరుగా బేరీజు వేసుకోండి. మనకి అలా సహాయం చేసిన ఆ మ్యూచువల్ ఫ్రెండ్స్ అభిప్రాయాలని అక్కడే మరచిపోవటం మంచిది. వాటిని గుర్తు పెట్టుకొని, తరవాత నీమీద అప్పుడు ఇలా అన్నాడు అని ఆ నూతన మితునికి చెప్పటం మరీ దారుణం. అలా చేస్తే - ఇక మీమీద ఎవరికీ నమ్మకం ఉండకపోవచ్చును. సహాయం చేసిన మిత్రున్ని వంచించటం అంత మంచి పద్ధతి కాదు.

ఆ నూతన మిత్రుడు స్క్రాప్ బుక్ చూస్తే అందులో వచ్చే స్క్రాప్స్ బట్టి అతను ఎదుటివారికి ఎలా స్క్రాప్స్ వ్రాస్తాడో, ఒక అంచనాకి రావచ్చును. ఇలాంటి సైట్లలో ఎక్కువగా యూత్ ఉంటుంది గనుక, వారి వారి స్టైల్ లోనే స్క్రాప్స్ ఉంటాయి.

కొద్దిమందికి స్క్రాప్స్ కూడా వ్రాయరాదు. ఏదో వ్రాశామా, లేదా అన్నట్లు వ్రాస్తుంటారు. వాటికి అర్థం ఏమిటో తెలుసుకోనేసరికి పుణ్యకాలం గడిచిపోతుందేమో!.

మరికొంతమందికి మరీ బద్ధకముగా స్క్రాప్స్ వ్రాస్తుంటారు. అసలు ఎవరో బలవంతం చేసి వ్రాయమన్నట్లుగా వ్రాస్తుంటారు. నా ఇద్దరు మిత్రులూ.. ఇద్దరూ నాకు ఒకసారి ఇలా - GM :) స్క్రాప్ పెట్టారు. అంటే దాని అర్థం Good Morning & హాపీ స్మైలీ. అసలు స్క్రాప్స్ వ్రాసేదే నెలకు ఒకసారి అన్నట్లు ఉంటుంది. నాకూ విసుగు వచ్చేసి నేనూ - GE :) (Good Evening & Happy smily) అని రిప్లై ఇచ్చేశాను. అప్పుడు వారికి తగినట్లుగా చెప్పినవారిమి అవుతాము. ఇంకో బాగా దగ్గరి మిత్రుడు, చిన్నప్పటి మిత్రుడు నా పుట్టినరోజుకి hpy b'day అని చెప్పాడు. కాస్త పెద్దగా చెబితే ఏమి పోయేది. ఇది టెలిగ్రాం కాదు కదా - ఎక్కువ పదాలు వాడితే ఎక్కువ బిల్ కట్టాల్సివస్తుంది అనీ! నాకూ చిర్రెత్తుకొచ్చి నేనూ tnx అని చెప్పేసి ఊరుకున్నాను. అవతలి వారు ఎంతగా కన్సర్న్ చూపిస్తే అంతగా మనం చూపటం మన ధర్మం.

ఇంకొంతమంది పనికిరాని సోది అంతా అందరికీ స్క్రాప్స్ గా పంపిస్తుంటారు. అలాంటివారు ఎదుటివారికి అది ఇష్టమా కాదా అని తెలుసుకోరు. బాగున్నవి పంపిస్తే ఓకే.. వారికి ఇష్టం లేనివి పంపితే - ఏమి బాగుంటుంది?

ఇంకొంతమంది ఉంటారు.. వారికి వ్రాసిన వాటికి సమాధానం ఇవ్వటమే రాదు. నాలుగైదు స్క్రాప్స్ వ్రాస్తే - ఏ ఒక్కదానికో జవాబు ఇస్తుంటారు. ఇక వారితో స్నేహం ఎలా ముందుకు వెళుతుంది. అసలు ఈ స్నేహం చెయ్యటమే ఇరువురి నుండి నడవాలిగా. ఒక్కరి నుండి ఎన్నిరోజులని స్నేహ హస్తాన్ని చాచగలం. అవతలివారూ అందుకోవాలిగా.. అలా అందుకున్నప్పుడే స్నేహం కొనసాగుతుంది కదా!. ఇలా వారు చెయ్యనప్పుడు వారిని అలా వారి మానాన వారిని వదిలేయ్యటం మంచిది. దైనందిక జీవితములో మీరే ఒకరికి విష్ చేస్తున్నారే అనుకుందాము. ఎప్పుడూ మీరే విష్ చేస్తున్నారు కాని అవతలి వారు తమంతట తాముగా మీకు విష్ చెయ్యకున్నా సరే! కాని ప్రతిగా విషేష్ చెప్పకుంటే - వాడికి కళ్ళు నెత్తికి ఎక్కాయి ఆనుకొని, మీరు ఇంకా అలాగే కొనసాగించరుగా.. ఇక్కడే అంతే!.. వారంతట వారుగా విష్ చేయ్యకపోనీ, కాని మీ స్క్రాప్స్ కి అతను బదులు ఇవ్వకపోతే - మీరు వారిని పలకరించటం మానేయ్యండి. వినటానికి ఏటేటో ఉన్నా తప్పదు మరి.

ఇంకొంతమంది మహానుభావులు ఇలా వచ్చేసి, అలా వెళుతుంటారు. వారి పని వారు చూసుకొని - అంటే ఏమైనా వచ్చాయా అని చూసుకుంటారు. కాని రిప్లైస్ అసలు ఇవ్వరు. వారి పుట్టినరోజులకి మనం గ్రీటింగ్స్ చెప్పినా వారు - కనీసం ఒక థాంక్స్ కూడా బదులు చెప్పరు. అలా ఉంటారు వారు. పోనీ వారేమైనా బీజీ పర్సన్స్ అంటే కూడా కాదు, పోనీ నెట్ కి రావటం లేదా అంటే - ఇలా వచ్చేసి అలా పోతూనే ఉంటారు. వారివి మాత్రం అప్డేట్ చేస్తూ పోతూనే ఉంటారు. అలాంటివారు మీ ఫ్రెండ్స్ లలో ఉన్నారే అనుకోండి.. మెల్లమెల్లగా వారిని దూరం చేసుకోమనే నేను సలహా ఇస్తాను.

ఇంకొంతమంది ఉంటారు. వారికి స్క్రాప్స్ పెట్టినా బదులు ఇవ్వరు. వేరే వారికిమాత్రం బదులు ఇస్తూనే ఉంటారు. అలాంటివారిని కూడా ఒక నాలుగైదు సార్లు చూసి వదిలెయ్యండి - శాశ్వతముగా. వారి చర్యలకి అర్థం - మీతో నేను మాట్లాడదలచుకోలేదు అని చెప్పకనే చెబుతున్నారు అన్నమాట.

ఇంకొంతమంది ఉంటారు - వాళ్ళని వాళ్ళు అంబానీల కన్నా గొప్పగా ఊహించేసుకుంటారు. వారు చేసేది చిన్న ఉద్యోగమైనా - ఆ మొత్తం సంస్థ వారిమీదే ఆధారపడింది అన్నట్లుగా ఉంటారు. అలాంటివారు కాస్త రిలాక్స్ అవుదాం అన్న ఆలోచన వారికి ఉండదు. ఎంతసేపూ పనే పని అంటూ ఉంటారు. యే సంస్థ అయినా రోజులో ఇరవై నాలుగు గంటలూ ఆఫీస్ లో ఉద్యోగం చేయ్యనివ్వరుగా. కాని వీరే అలా గొప్పగా ఫీల్ అవుతుంటారు. తాము లేకపోతే ఆ సంస్థ మూతపడుతుంది అన్నంత బీజీ  చూపిస్తారు. నిజానికి ఉండొచ్చు ఉండకపోవచ్చు. సోమవారం నుండి శనివారం రాత్రి వరకూ బీజీ అనుకుందాం!.. మరి ఆదివారం ఏమి చేస్తారు? ఆరోజు బీజీ అని అనుకుందాము. వారివారి అప్డేట్స్ చూసుకొని, ఎదుటివారికి జవాబు ఇవ్వాల్సిన అవసరం చూపకుండా వెళ్ళిపోతారు. ఈ మధ్య నేను  ఇలాంటివారిని కొందరిని గమనించాను. ఉన్న స్క్రాప్స్ కి రిప్లైస్  ఇవ్వరు గాని, వేరే ఇతరులతో చాట్, మెయిల్స్, క్రొత్తగా ఆడ్ రిక్వెస్ట్స్ అనీ చేస్తుంటారు. కాని రోజూ ఒక పావుగంట కేటాయిస్తే చాలు - వచ్చిన అన్నింటికీ రిప్లైస్ ఇవ్వొచ్చు. ఇది నేనూ నమ్మలేదు. నేను ఈ మధ్య కొంత బీజీ అయ్యాను. అయినా ఉదయాన, రాత్రి కాస్త వీలు చేసుకొని అన్నీ ముగించేవాడిని. ఓస్! ఇంతేనా.. ఈ మాత్రం దానికి ఎందుకు అంత బీజీ ప్రదర్శిస్తారో అసలు అర్థం కాలేదు నాకు.

ఆమధ్య ఒక పెళ్ళికి ఉదయాన్నే వెళ్ళాల్సి ఉండెను. కాని నిద్ర లేవటం కాస్త ఆలస్యం అయ్యింది. లేచి బ్రష్ వేసేలోగా సిస్టం ఆన్ చేశాను. అది ఓపెన్ అయ్యి, లాగిన్ అయ్యేసరికి, నా మొబైల్ చార్జింగ్, అవసరమైన వస్తువులు అన్నీ చూసుకున్నాను. సోషల్ సైట్ ఓపెన్ చేసి చూశాను. ఏమున్నాయో, ఏమి వచ్చాయో, ఏమి అప్డేట్స్ అయ్యాయో.. స్నానం చేసి, పూజ చేసుకొని... వచ్చేసి, డ్రెసప్ అవుతూ కొన్ని స్క్రాప్స్స్ వ్రాశాను. వేరొకరి సహాయముతో వచ్చిన వాటికి, ఏవేవి పంపాలో అవి - కాపీ పేస్ట్ & పోస్ట్ చేయించాను. ఒకరు ఒకటి నావల్ల అయ్యే పని చెబితే - పెళ్ళికి వెళుతున్నాను అని చెప్పి రాత్రికి మీ ప్రశ్నకి సమాధానం చెబుతాను అని చెప్పాను. అంతలోగా నా తయారు అయిపొయింది. నా అప్డేట్స్, స్టేటస్ మెస్సేజ్,  ఫొటోస్, కామెంట్స్ మూడు నిమిషాల్లో ముగించాను. ఒకరు చాట్ కి అప్పుడే వచ్చారు. సారీ చెప్పి తరవాత కలుస్తాను అని చెప్పాను. విషయమేదైనా ఉంటే స్క్రాప్ పెట్టండి. వీలుంటే మధ్యలో సమాధానం ఇస్తాను అని చెప్పాను. సిస్టం ని షట్ డౌన్ చెయ్యమని చెప్పేసి..  ఇంట్లోవారికి బై చెప్పేశాను. అంతా కలిపి పావుగంటలో అంతా ముగించేశాను. హాయిగా పెళ్ళికి వెళ్లాను. జర్నీలో హాయిగా రెస్ట్ తీసుకున్నాను. ఇదంతా నా గొప్పకోసం చెప్పటం లేదు.  కాస్త కూల్ గా ఉండి చేస్తే అన్ని పనులూ చెయ్యొచ్చు అని చెబుతున్నాను అంతే!. చెయ్యాలీ అనుకుంటే మనసు అన్నీ నేర్పిస్తుంది. కష్టం అని అనుకుంటే ఏదీ రాదు.

మరికొంతమంది స్క్రాప్స్ కాపీ చేసి తమవిగా పంపుతుంటారు. ఏదో ఒకసారి అంటే ఓకే అనుకోవచ్చు.. కాని వారు పంపే ప్రతిదీ అలాగే ఉంటుంది. ఒక్కటన్నా వారి క్రియేటివిటీ ఉండదు.

ఇలా వారి వారి స్క్రాప్స్ చూసి, ఒక అవగాహనకి రండి. అన్నింటికన్నా మీకు మీ సమయం ముఖ్యమైనది. ఎక్కువగా వృధా చెయ్యకండి. ఆ సమయములో ఎన్నో విషయాలు చాలా బాగా నేర్చుకోవచ్చును.

2 comments:

Anonymous said...

Boss... Who is Orkut Now a days?? only FB now.. go on and use FB and come up again with this... No one will care to see and floow ur lesson or suggestion better dont waste your time..

Raj said...

మీకు చాలా కృతజ్ఞతలు.. మీరన్నట్లు అందులో ఎవరూ ఉండటం లేదు. అంతా ఫేస్ బుక్ లోనే ఉండొచ్చు. కాదనను. మీరు ఈ సోషల్ సీరీస్ లో మొదటి టపాలు సరిగా చదివి ఉండకపోవచ్చును. మళ్ళీ కాస్త సమయం తీసుకొని చదవండి. ఇది అన్ని సైట్లవారికీ, అందునా ఆర్కుట్ వారికి బాగా ఉపయోగం అని చెప్పాను. నా మిత్రురాలికీ, ఇంకొందరికీ చెబుతున్నాను.. పనిలో పనిగా అందరికీ ఉపయోగం అని ఇక్కడ చెబుతున్నాను అని చెప్పాను. చివరి టపాలో కూడా నేను ఇలా ఎందుకు వ్రాస్తున్నానో, ఏమిటో, నా ఆలోచన ఏమిటో, వ్రాయటానికి గల కారణం ఏమిటో కూడా చెబుతాను. అది కూడా చూడండి.

అలాగే నాకు ఫేస్ బుక్ అకౌంట్ లేదు. మీకు ఉంది కదా! దాని బాగోగులు గురించి చెబితే - తెలుసుకొని, అకౌంట్ ఓపెన్ చేసుకుంటాను.

Related Posts with Thumbnails