Friday, March 4, 2011

Social NW Sites - 19 - వారి మిత్రులు వారికి యే విధముగా భావిస్తూ స్క్రాప్స్ పంపుతున్నారు.?

ఇంతవరకూ మీరు సోషల్ సైట్ లో చాలా విషయాలు నేర్చుకున్నారు. అవి మీరు పాటిస్తున్నారు అని అనుకుంటున్నాను. ఇప్పుడు వారి మిత్రులు వారికి యే విధముగా భావిస్తూ స్క్రాప్స్ పంపుతున్నారు.? అనేది చూద్దాం!.

మనకి వచ్చిన ఆడ్ రిక్వెస్ట్ రాగానే ఎలా పరిశీలించాలో, ఏమేమి చూడాలో మీకు పాత టపాలలో వివరముగా చెప్పాను. అలా వారి రిక్వెస్ట్ ఒప్పుకొనే ముందు - అతని మిత్రులు అతనితో ఎలా ఉంటున్నారు? అనేది కూడా కాస్త ఓ లుక్కెయ్యండి. అతని స్క్రాప్ బుక్ ఓపెన్ చెయ్యండి. చాలా స్క్రాప్ బుక్స్ మిత్రులు అయితేనే చూసేలా సెట్టింగ్స్ ఉంటాయి. అందులో అంత గొప్ప రహస్యాలు కూడా ఉండవు. ఏవేవో కబుర్లు తప్పించి. తమ మిత్రులు మాత్రమే చూసేలా సెట్టింగ్స్ పెట్టినా, ఇతరులు చూడలేరు అని ధీమా ఒక్కటే మిగులుతుంది. ఆడ్ అయ్యాక అన్నీ తెలుస్తూనే ఉంటాయి. అప్పుడు ఆ స్క్రాప్ బుక్ లో రహస్యాలు (ఏమైనా ఉంటే) హాయిగా చదివేస్తారు. ఇలా సెట్టింగ్స్ పెట్టుకునేవారు - కాస్త గోప్యముగా ఉండేవారు అని అర్థం.

ఇంకొంత మంది ఉంటారు - తమ స్క్రాప్ బుక్ కొందరు చూడకుండా ఇలా సెట్టింగ్స్ పెట్టుకొని ఉంటారు. అలా పెట్టుకున్నా అందులోని విషయాలు ఎలాగూ వేరు వేరు దారుల్లోంచి అసలువారికి తెలుస్తూనే ఉంటాయి. ఎలా అంటే వారికి ఆడ్ అయిన మిత్రులు ఆ ఎవరికీ తెలియోద్దు అని అనుకుంటామో వారికి, వీరు ఆ సమాచారాన్ని చేరేస్తుంటారు. ఇలాంటి చాలా సంఘటనలని నేను చూశాను. నాకూ అవతలివారు ప్రైవేట్ స్క్రాప్ లలోనూ, మెయిల్ ద్వారానో, చాట్ లోనో, ఫోన్ ద్వారానో.. చెప్పారు. అందుకే ఏవీ రహస్యాలు కాలేవు అని అనేది.

మరికొంతమంది ఓపెన్ గానే స్క్రాప్ బుక్ పెడతారు. వీరు కా-స్త ఓపెన్ గా ఉండే మనస్తత్వం అని అనుకోవచ్చును. కా-స్త అని ఎందుకు అనడం అంటే అన్నీ ఓపెన్ గా ఉంటాయని, వీరు అన్నీ ఓపెన్ గా ఉంచారు అని అనుకోకండి. ఏవి దాచేయ్యాలో, అవి దాచేసే ఘనాపాటీలు.

ఇప్పుడు మీరు ఆ స్క్రాప్ బుక్ సెట్టింగ్ చూసి అవతలివారు ఎలాంటివారో కాస్త తెలుసుకోగలిగారు కదా!. ఇప్పుడు ఆ స్క్రాప్ బుక్ లోనవి చూద్దాం. నిజానికి ఇలా చెయ్యటం అంత సంస్కార పద్ధతి కాదు. ఇద్దరు వ్రాసుకున్న / చెప్పుకున్న విషయాలని ఇలా చాటుగా ఉంది చూడటం మంచి పద్ధతి కాదు. ఇలా ఎందుకు అంటున్నానూ అంటే - ఇలా చూడటం ఒకసారికే అని అనుకుంటాము. కాని ఎందుకో మళ్ళీ మళ్ళీ బాగా చూడాలి చూడాలి అనిపిస్తుంది. అలా చూడటం అలవాటుగా మారుతుంది. అందులోని స్క్రాప్స్ చదివి, చూసి కడుపు ఉబ్బరముతో చస్తాము. ఎవరికైనా చెప్పాలని అనిపిస్తుంది. కాని చెప్పకుండా ఆగలేము. అలా విన్నవారి నుండి (వారికీ ఇదే పరిస్థితి.. ఆపులేకపోవటం..) అలా అలా - భూమి గుండ్రముగా ఉండును అన్న విధముగా తెలిసిపోతాయి. ఈ మధ్యలో ఉన్నవారు కాస్త రహస్యముగా కూడా ఉంచరు. ఎవరు చెప్పారు మీకు అని గద్దిస్తే - నాపేరు చెప్పకు, నాకు ఫలానా వారు చెప్పారు, వారికి ఆ ఫలానా వారు చెప్పారు అని అంటారు. అలా చివరకి మన పేరు బయట పడుతుంది. అప్పుడు నెత్తీ నోరు కొట్టుకున్నా వారు వినరు. పైకి మామూలుగా మాట్లాడినా లోపల ఒక గాజుగోడ అంటూ ఏర్పడుతుంది. అలా గాజు గోడ అంటూ ఏర్పడ్డాక అంతా మామూలుగా ఉంది అని అనుకుంటాము. కాని మునపటి అంతగా స్నేహం మాత్రం ఉండదు. బాగా పరిశీలిస్తే గాని, అప్పుడు ఈ విషయం కనిపించదు. ఈ విషయం తెలియటానికి ఒక్కోసారి జీవితకాలం కూడా పట్టొచ్చు. అందుకే కాస్త మరీ మరీ జాగ్రత్తగా ఉండండి.

అందుకే ఒకసారి మాత్రమే - అదీ ఆడ్ అయ్యేటప్పుడే రఫ్ గా చూడండి. అవతలి వారు ఎలా వారికి స్క్రాప్స్ వ్రాస్తున్నారు.. మనం చూసిన రోజు రాత్రివరకూ ఎన్ని స్క్రాప్ వచ్చాయి.. అందులో ఒక రోజులో ఎన్ని స్క్రాప్స్ ఉన్నాయి, ఎన్ని గ్రీటింగ్స్ ఉన్నాయి, ఎన్ని కబుర్లు ఉన్నాయి అంటూ చూడండి. ఇదంతా లోతుగా పరిశీలించకండి. అలా చేస్తే కడుపుబ్బరం రావటం గ్యారంటీ.. పై పైన చెయ్యండి. ఎంతగా అంటే - ఏమి చూశారూ అంటే సరిగా గుర్తులేదు అని చెప్పెసేలా ఉండాలి. ఇక్కడ ముఖ్యముగా నేర్చుకోవాల్సింది ఏమిటంటే - వారికి ఎలా స్క్రాప్స్ ఉంటున్నాయని, అంతే కాని అందులో ఏమున్నాయని కాదు. వినటానికి కాస్త గందరగోళముగా ఉన్నా సరిగ్గానే చెప్పాను.

వారికి ఎలాంటి స్క్రాప్స్ వస్తున్నాయో చూద్దాం.. కేవలం గ్రీటింగ్స్ మాత్రమే వస్తుంటే కేవలం పరిచయస్తుల్లాగా మిగిలిపోతారు అని సూచన. ఇది నాకు ఎన్నోసార్లు రుజువయ్యింది కూడా. అవియే కాకుండా వేరే స్క్రాప్స్ ఉంటే మితృత్వాన్ని బాగానే నెరుపుతున్నారు అనుకోవచ్చును. ఒకరోజులో ఎన్ని స్క్రాప్స్ ఉన్నాయో చూస్తే -వారి పాపులారిటీని చూడొచ్చు. అందులో వారిని ఎలా సంభోదిస్తూ, ఎలాగా ఉద్దేశిస్తూ స్క్రాప్స్ వ్రాస్తున్నారో, చూడండి.

ఇలా చూడటం మొదటి ఐదు స్క్రాప్ పేజీలు  - అంటే యాభై స్క్రాప్స్ మాత్రమే చూడండి. తెలిసిపోతుంది. ఇలా చూడటం కూడా కేవలం ఆడ్ అయ్యేటప్పుడే చూడండి. లేకుంటే అలవాటుగా మారిపోయి, మిమ్మల్ని చాలా ఇబ్బందుల్లోకి నెట్టివేయటం ఖాయం. చాలామంది దీన్ని సరదా అలవాటుగా తీసుకుంటుంటారు. కాని వారు క్రమక్రమముగా సరదాలని కోల్పోతుంటారు. ఎప్పుడూ అందరి స్క్రాప్ బుక్స్ చూడటమే పరమావధిగా భావిస్తుంటారు. వారు ఒప్పుకోకున్నా ఇది వారికి వ్యసనముగా మారుతుంది. ఎదుటివ్యక్తి మనసులోని ఉద్దేశ్యాన్ని ముందే మనకి తెలిసేలా ఒక విద్యని దేవుడు వరముగా ఇస్తే - ఆ తరవాత ఏమి జరిగిందో - అనే కాన్సెప్ట్ మనం చాలా సినిమాల్లో చూసే ఉన్నాము కదా!.. అలా అవచ్చును. అలా క్రమక్రమముగా మిత్రులతో దూరముగా జరుగుతూ ఉంటాము. ఇదంతా గమనించేసరికి మిత్రులకి చాలా దూరములో ఉంటారు. ముందే చెప్పానుగా గాజుగోడలు అంటూ ఏర్పడతాయనీ. దూరం నుండి చూస్తే అంతా బాగుంటుంది, కాని దగ్గరగా చూస్తే అడ్డముగా ఏదో ఉంది అనిపిస్తుంది.

వారికి వారి ఫ్రెండ్స్ ఎన్నిరోజులలో రిప్లై ఇస్తున్నారు కూడా ఇక్కడ గమనించవచ్చును. ఆ స్క్రాప్స్ కి ఉన్న తేదీలను గమనిస్తే - ఆయా స్క్రాప్స్ రెగ్యులర్ గా ఉన్నాయో లేవో చూడొచ్చును. అలా కాకుండా మొదటి పేజీలోనో, రెండో పేజీలోనో స్క్రాప్స్ తేదీలు చాలా గ్యాప్ ఉండి ఉన్నట్లయితే - వారు ఎక్కువగా ఏమీ వ్రాయరు అన్నమాట.

కొందరు అసలుకే స్క్రాప్స్ బుక్ మైంటైన్ చెయ్యరు.. ఇలా రాగానే అలా డెలీట్ చేస్తుంటారు. అసలుకి ఏమీ కూడా ఉంచరు. ఇలాంటివారికి బాగా కష్టపడి, టాలెంట్ ఉపయోగించి స్క్రాప్స్ పంపితే, చూసిన తరవాత ఎలాగూ అవి డెలీట్ అవుతాయి కదా.. అందుకే ఇలా మైంటైన్ చేసేవారికి  మామూలుగా పంపండి. ఎంత బాగా వ్రాయాలి అన్న టెన్షనూ, మీకూ సమయం బాగా మిగిలిపోతుంది.

ఇంకొందరు కొన్ని స్క్రాప్స్ మాత్రమే మైంటైన్ చేస్తుంటారు. ఎక్కువగా స్క్రాప్స్ ఉండవు. ఏదో వారికి నచ్చినవీ మాత్రమే ఇందులో ఉంటాయి. నన్నడిగితే - ఈ పద్ధతే మంచిది అని అంటాను. ఏవైనా ఇబ్బందికర స్క్రాప్స్ ఉంటే వెంటనే డెలీట్ చేస్తారు కాబట్టి ఎక్కువగా ఏమీ టెన్షన్స్ రావు. అంతా మామూలువి ఉంటాయి కాబట్టి ఎవరెంత చూసుకున్నా పరవాలేదు అన్నట్లు ఉంటాయి. నేను ఇలాగే చేస్తుంటాను. మొదటి పేజీ ఒక్కటి మాత్రం ఏమీ తీసేయ్యను. రెండో పేజీ నుండి మాత్రం అన్నీ తీసేస్తుంటాను. అలా రోజుకి 20-60+ స్క్రాప్స్ అలా డెలీట్ చేస్తుంటాను. అవన్నీ ఉంచుకుంటే అందరికీ టైం పాస్ చేసినట్లు ఉంటుంది. అంత సీను అవసరమా..

ఇంకొందరు ఉంటారు. వారి స్క్రాప్ బుక్ లో వచ్చిన ప్రతి స్క్రాప్ అలాగే ఉంచేసుకుంటారు. దాని వాళ్ళ లాభం ఏమీ లేకపోగా, నష్టాలే అధికం. స్క్రాప్ బుక్ లో ఇన్ని స్క్రాప్స్ ఉన్నాయి అని చూపిన్చుకోవటానికి గొప్ప కోసం ఉంచుకుంటున్నట్లు అనిపిస్తుంది కాని, వచ్చే కీడు ఎక్కువ. ఎందుకంటే ఈమధ్య ఖాళీ దొరికితే ఎదుటివారి స్క్రాప్ బుక్ చూడటం చాలామంది మిత్రులకి అలవాటుగా మారింది. ఎక్కువ శాతం వారిలో ఈ అలవాటు ఉంది. అందుకే మనకి ఇబ్బందికరమైనవి, వారికి స్కూప్ ఇచ్చే అటువంటి ఆసక్తికర స్క్రాప్స్ తీసెయ్యండి. అప్పుడు అందరూ బాగుంటారు. ఎలా అంటే - ఒక అమ్మాయి ఫలానా మిత్రుడు మంచివాడు కాదు.. మొన్న నాకు ఐ లవ్ యూ అన్నాడు.. అని అన్నారు అనుకోండి. ఈ స్క్రాప్ పొందిన వారు అలాగే ఉంచేస్తే - ఆ అమ్మాయి చెప్పిన పర్సనల్ విషయాన్ని అందరికీ చూపించినట్లవుతుంది. ఆ వ్రాసిన అమ్మాయికి ఇబ్బందికరముగా మారుతుంది. చూసినవారికి ఇదేదో ఆసక్తికర విషయములా ఉందే అనుకొని, ఇంకా మిగతా స్క్రాప్స్ నీ, ఆ అమ్మాయి స్క్రాప్స్ నీ, ఆ అబ్బాయి స్క్రాప్స్ నీ ఆయా తేదీలలో, ముందు రోజుల్లో ఏమి జరిగిందో FBI ఏజంట్ లా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఇదంతా అవసరమా చెప్పండి. నిజం చెప్పాలంటే - వారి స్క్రాప్ బుక్ లైబ్రరీలా అనిపిస్తుంది. వారికీ, ఇంకో ఫ్రెండ్ కీ ఏదైనా తేడా వస్తే - అప్పుడు ఆ తేదీవరకూ స్క్రాప్ బుక్ లోపలకి వెళ్లి ఆరోజు , ముందు రోజు ఏమి జరిగిందో చూడొచ్చు / చదవవచ్చును. అక్కడ అంతా డిటైల్డ్ గా సమాచారం అక్కడ కనిపిస్తుంది. చెప్పాగా లైబ్రరీ మాదిరిగా ఉంటుందని.

సంవత్సరం క్రింద ఒకరి స్క్రాప్ బుక్ చూశాను.. అందులో డెబ్బై ఆరు వేల స్క్రాప్స్ ఉన్నాయి. ఇప్పుడు అవి లక్షకు దగ్గరగా ఉండొచ్చును. అవన్నీ ఏమి చేసుకుంటారు?.. అవేమైనా తిరిగి మళ్ళీ చూసుకోరు కదా..! ఎందుకో అన్నీ.. అందులోనిది మనకు అవసరమైనది ఉంది, అందుకే అలా దాచుకున్నాము అనుకుందాం. కాని దాన్ని వెలికి తీయటానికి ఎంతసమయం ఖర్చు చెయ్యాలి.? ఇష్టం అనుకుంటే ఉంచేసుకోవచ్చు కాని అవతలివారికి మాత్రం మనం ఏమేమి మాట్లాడుకున్నామో అన్నీ తెలవటానికి ఇది చక్కని నాలుగు లైన్ల ఎక్స్ ప్రెస్ హైవేలా సహకారం అందించిన వారిమీ అవుతాము. నమ్మకున్నా ఇది మాత్రం నిజం.

నేనూ, నా స్నేహితురాలు మాట్లాడుకున్నప్పుడు నా ప్రొఫైల్ విజిట్స్ ఎప్పుడూ లేనిది యాభై + వరకూ వస్తాయి. తను మాట్లాడని రోజున పాతిక వరకు మాత్రమే విజిట్స్ ఉంటాయి. విచిత్రంగా ఉన్ననూ - ఇది మాత్రం నిజం. చాలాసార్లు ఇది జరిగింది. దీన్ని బట్టే తెలుస్తూనే ఉంది కదా.. స్క్రాప్ బుక్ చూస్తుంటారని.. ఇలాంటివి మరెన్నో ఉదాహరణలు ఇవ్వొచ్చు.

ఇంత పక్కాగా ఎందుకు చెబుతున్నానూ అంటే - మామూలుగా నేను ఎవరి స్క్రాప్ బుక్ చూడను. నా బీజీ నాది. అంత సమయం ఉండదు. అవన్నీ చూసి మనసు పాడు చేసుకొని అనుమానం చూపులతో స్నేహం ఎందుకు చెయ్యాలో అనుకొని అసలు చూడను - ఎప్పుడో ఒకసారి తప్ప. అ మధ్య మిత్రుల రెండు మూడు గొడవల వల్ల వారివి నేను పరిశోధించాల్సివచ్చింది. అలాని ఎందుకు చూడాల్సివచ్చిందీ అంటే ఆ ఇద్దరి మిత్రుల గొడవలో ఎవరిదీ సరియైనది అని తేల్చటానికి. ఆహా!.. అప్పుడే తెలిశాయి. అసలు విషయాలు. మనం మంచివారు అనుకున్న మిత్రులు ఎలా మాట్లాడుతారో అక్కడ స్పష్టముగా కనిపించింది. అప్పుడే అనుకున్నాను. చాటుగా మాట్లాడుకొనే వారు ఇలా మాట్లాడుకుంటారా అని. మనమీద ఇలా మాట్లాడుకుంటారా అని అనిపిస్తుంది. అప్పటిదాకా వారికి బాగా విలువ ఇచ్చిన నేను - తగ్గించుకోవాల్సి వచ్చింది. అలా మేలూ / ప్రమాదాలూ కూడా జరుగుతాయి. అందుకే ఎదుటివారి స్క్రాప్ బుక్స్ చూడవద్దనేది.

ఇక మిత్రులని ఎలా సంభోదిస్తున్నారు అనీ.. చాలామంది తెలీక సార్, అత్తయ్యా, తాత, ఆంటీ, అంకుల్, అమ్మమ్మ.. లాంటి పెద్ద పెద్ద విశేషాణలతో సంభోదిస్తూ, తెలీక మాట్లాడుతుంటారు. అలా మాట్లాడితే అవతలివారు ఎలా ఫీల్ అవుతుంటారో గమనించరు. పరిచయం అయిన మొదట్లోనే అవతలివారు పెద్దవారు అని తెలిస్తే, వెంటనే అడగాలి - మిమ్మల్ని ఏమని సంభోదించాలీ అనీ. అప్పుడు ఎదుటివారు చెప్పిన దానికి ఫిక్స్ అయిపోయి అలాగే పిలుస్తుంటే, చాలా బాగుంటుంది. హర్ష అనీ నా మిత్రుడు నాకు పరిచయం అయిన క్రొత్తలో - మిమ్మల్ని నేను ఫ్రెండ్ అని పిలవాలా? లేక సార్ అనా? లేదా బ్రదర్ అనా!.. అని అడిగాడు. నేను వెంటనే బ్రదర్ అని చెప్పాను. ఇప్పటికీ ఇన్ని రోజులయినా అతను నన్ను బ్రదర్ కి షార్ట్ కట్ అయిన బ్రో! అనే పిలుస్తాడు. ఇది చాలా మంచి పద్ధతి. నా స్నేహితురాలికి, నేను తనకి పరిచయం చేసిన ఇంకో పెద్ద వయసు ఫ్రెండ్ ని పరిచయం అయిన మొదట్లోనే అడిగారు - మీరు నా కంటే పెద్దవారు కదా మిమ్మల్ని ఏమని పిలవాలీ, మీరు చెబితే అలాగే పిలుస్తానూ అని. అందుకు ఆవిడగారు - నాకు ఉన్నది అమ్మాయిలే, అబ్బాయిలు లేరు కనుక నీవు అత్తయ్యా అని పిలువు (కోడలి వరుసలో) అని చెప్పారు. ఇలా అడిగి పిలుచుకోవటం సంస్కారం. ఇలా ముందే అడిగి ఫిక్స్ అవటం చాలా మంచిది. ఎదుటివారి అభిమానాన్ని మరింతగా చూరగొంటాము

నన్ను సార్ అన్నవారితో నేనూ వారిని సార్, మేడం లాంటి పదాలు వాడటం ఈమధ్య మొదలెట్టాను. ఎందుకో నాకు అలా పిలిపించుకోవటం ఇష్టం లేదు. ఫ్రెండ్ అనిపించుకోవటమే ఇష్టం. . అందుకే మీకు ఫ్రెండ్స్ అయినవారిని మొదట - మిత్రమా, నేస్తం, ఫ్రెండ్.. అలాంటి సంభోదనలతో మాట్లాడండి. వారికి ఇష్టం అయితే అప్పుడే అక్కయ్య, ఆంటీ, అమ్మా, సార్, అంకుల్.. లాంటివి వారిని అడిగి, అనుమతి తీసుకొని, మాట్లాడండి. లేకపోతే వారిని ఇబ్బంది పెట్టి - మీరు ఇబ్బంది పడతారు.

updated on :
1st : 4-March-2011 Evening.

2 comments:

Anonymous said...

I really like your post. Will continue reading your blog. :)

Raj said...

కృతజ్ఞతలు.. నా బ్లాగ్ చూడండి.. నేనేమీ వద్దనలేదుగా.. :)

Related Posts with Thumbnails