నటీనటులు : బ్రహ్మానందం, రవితేజ, చార్మి, బ్రహ్మాజీ, సుబ్బరాజు, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, సునీల్..
దర్శకత్వం : రాం గోపాల్ వర్మ
కథ: బ్రహ్మానందాన్ని కిడ్నాప్ చేసి డబ్బులు దండుకోవాలని ఒక మాఫియా గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంటే, అనుకోకుండా వచ్చేసి అతన్ని రవితేజ ఎలా కాపాడుతాడు అన్నదే ఈ సినిమా స్టోరీ.. నిజం చెప్పాలీ అంటే కథలో క్రొత్తదనం అంటూ ఏమీ లేదు. పాత కథనే కాని నూతన టెక్నాలజీ కోసం అని ఈ కథని ఎంచుకున్నారు. అంతే తప్ప మరేమీ లేదు. నిజానికి ఇంతకన్నా కథని బాగా చెప్పొచ్చు. కాని స్క్రీన్ ప్లే కోసం, కథనం కోసమే ఇలా చేశారు. అంతే కాని క్రొత్తగా అంటూ ఏమీ లేదు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ : ఈ సినిమాలో పాటలు లేవు. మ్యూజిక్ వర్క్ బాగా చేయ్యబోయారు. నిజానికి ఇలాంటి వాటిల్లో సన్నివేశపరముగా ఇంకా బాగా చెయ్యొచ్చు. కాని దర్శకుడు అలాంటి సన్నివేశాల మీద దృష్టి పెట్టలేదు. అలా చేస్తే సీన్స్ బాగా పండేవి.
నటన : రవితేజ - ఇలాంటి పాత్రలు అతనికి క్రోత్తకాదు. చెయ్యటానికీ ఏమీ లేదు. చార్మి - ని కేవలం అందచందాల కోసం వాడుకున్నారు తప్ప మరేమీ లేదు, ఇలాంటి కథల్లో ఆడవారు ఉంటే టెంపో వస్తుంది కాబట్టి తప్పలేదు. బ్రహ్మానందం - ఆయనకి ఇలాంటివి క్రొత్తకాదు. మనీ, మనీ మనీ, అనగనగా ఒకరోజు లో చేసి చేసి, బాగా చించేశాడు కాబట్టి ఇక్కడ చెయ్యటానికి అంత స్కోప్ లేకపోయింది.
దర్శకత్వం : రాంగోపాలవర్మ చాలా రోజుల తరవాత చేసిన తెలుగు సస్పెన్స్ సినిమా ఇది. ఇందులో కథ కన్నా కథనాన్ని నమ్ముకున్నాడు. ఎక్కువగా నూతన సాంకేతికతని బాగా చూపాలని, తెలుగు సినిమా ఫీల్డ్ కి ఒక క్రొత్త విషయాన్ని చెప్పాలని చూశాడు. అందులో బాగా సక్సెస్ అయ్యాడు. కేవలం ఐదు రోజుల్లో ఏడుగురు సిబ్బందితో సినిమా తీయటం నిజముగా నూతన ప్రక్రియ. కేవలం ఆరు కేమరాలకి అద్దె అరవై వేలు + ఇతరత్రా ఖర్చు అంతా కలిపి ఆరు లక్షల్లో ఈ సినిమా తీశారు. నటీనటుల పారితోషకం ఇందులో లేదు. ఇది నిజముగా సినిమా రంగానికి ఒక వరమనే చెప్పొచ్చు. కథ కోసం ఈ సినిమాకి వెళ్లటం మాత్రం - వృధా. ఆ కథ కన్నా కథనం అంతా ఆ డిజిటల్ కేమరాలని ఎలా వాడుకోవాలో చూపటానికి ఈ కథనం తయారు చేసుకున్నాడు అనుకోవాలి. అతి తక్కువ ఖర్చులో ఎలా తీయాలి అన్నది ఇక్కడ అయన చెప్పిన విషయం. కథని ఇంకా డెవలప్ చేస్తే బాగుండేది.
చిన్ని చిన్ని సందుల్లో కెమరా వెళ్ళను చోట్లలోకి వెళ్ళి మరీ ఫోటోగ్రఫీ తీశాడు. ఇది చాలా క్రొత్తగా ఉంది. నిజానికి ఇలా తీయటం వల్ల అనుకున్న విధముగా వారి ఎక్సప్రెషన్స్ బాగా చూపవచ్చును. పెద్ద కేమరాలకన్నా ఇలా తీయటం నాకు నచ్చింది. అక్కడక్కడా కెమరా షేక్స్ ఇబ్బంది పెడతాయి. మామూలుగా సినిమాలు కేమరాని స్టాండ్ మీద పెట్టి ఆపరేట్ చేస్తుంటారు. కాని ఇక్కడ చేతుల్లో పట్టుకొని నడుస్తూ షూట్ చేశారు. స్టడీ క్యాం కెమరా వాడే ఎఫెక్ట్ ని మామూలు కెనాన్ డిజిటల్ కెమరా తో తీయటం నిజముగా సాహాసమే. ఎడిట్ చేసేటప్పుడు - చిన్న మానిటర్ లో చూసినప్పుడు వారికి ఈ షేకింగ్స్ కనిపించవు. అదొక్కటే లోపం అయినా ఆ లోపాన్ని బాగా హాండిల్ చేశారు. మొదటి ప్రయత్నం లో ఆ మాత్రం చెయ్యటం బాగా గొప్ప విషయమే.
ఇలా డిజిటల్ కేమరాతో షూట్ చేసి ఒక మూవీ చెయ్యటం నాకు క్రొత్తగా అనిపించలేదు. ఎలా అంటే నా సోషల్ సైట్ మిత్రుల్లో శివ మరియు కంచర్ల అనిల్ లాంటి యువకులు ఇలా చిన్న చిన్న మూవీలు తీసి నెట్లో అందరికీ షేర్ చేస్తుంటారు. వారికి ఈ వర్మకి ఉన్నంత సదుపాయాలూ లేకున్నా ఉన్నంతవరకూ బాగా తీస్తారు. అవి చూసి - ఈ సినిమా చూస్తే టేకింగ్ పరముగా క్రొత్తగా ఏమీ అనిపించలేదు. వారిలాగానే కేమరాని హ్యాండిల్ చేశారు అనిపించింది. వారూ & వర్మ కో - స్పెషల్ లైటింగ్ అంటూ ఏమీ వాడకుండా, ఉన్న నేచురల్ వెలుతురినే వాడి ఇలా తీశారు. అలాంటి సమయాల్లో కాస్త డల్ గానే ఉంటుంది సినిమా.
కొన్ని పాత్రల ఎలివేషన్ అంతగా బాగా లేదు. ఏదో గొప్పగా ఊహించేసుకుంటాము.. కాని అక్కడ ఏమీ ఉండదు. అలాంటి వాటిల్లో చార్మీ, బ్రహ్మాజీ, సుబ్బరాజు, సత్యరాజు, సునీల్ పాత్రలు ముఖ్యం. ఛార్మీని కథకు మెయిన్ పాయింట్ గా మార్చ బోయినా - ఆ పాత్ర కి అనుకున్నంత డెప్త్ లేదు. కేవలం గ్లామర్ డాల్ గా మిగిలిపోయింది. బ్రహ్మాజీ ఒక డిఫెరెంట్ స్టైల్ తెలుగువారికి చూపించాడు. జేబుల్లో చేతులు పెట్టుకొని అదో రకమైన చూపులతో ఏదో అవబోతుంది అన్నట్లు హైప్ తీసుకవచ్చాడు. కాని అనుకున్న హైప్ కి అతని పాత్రని డెవెలప్ చెయ్యలేదు వర్మ. మిగిలిన పాత్రలని పేకలో ఈక లాగా చెప్పుకోవచ్చును.
రెండో ఆట 9:20 కి మొదలైన చిత్రం 10:40 కి అయిపోతుంది. ఇందులోనే ఇంటర్వల్ సమయం కూడా ఉంది. అంటే గంటా పావు లో సినిమా అయిపోతుంది అన్నమాట. వన్డే మ్యాచుల్లా కాకుండా 20-20 అని అని అనుకోవాలి. ఇలా చిన్న చిన్న చిత్రాలు చాలానే తెలుగు తెర మీద ప్రదర్శింపబడ్డాయి. వంశీ "మంచు పల్లకీ" (9 రీళ్లు మాత్రమే) తరవాత నేను చూసిన స్ట్రెయిట్ చిన్న ఫిలిం ఇదే!.
మధ్యలో ఆంగ్ల సినిమా BLOODY BIRD అనే సినిమాని తమిళనాడులో దినేష్ అనే దర్శకుడు ప్రేరణగా తీసుకొని తమిళ్ లో - విలన్ గుడ్ల గూబ వేషం వేసుకొని ఒక నాటకం వేసేవారిని అందరినీ చంపుతూ ఉండే - సినిమా డబ్బింగ్ అయి తెలుగులో వచ్చింది. ఆ సినిమాని కేవలం 24 గంటల్లో తీశారు. ఇలాంటి వాటిల్లో స్క్రీన్ ప్లే నే బలం. ముఖ్యముగా షాట్ డివిజన్ అనేది మరీ ప్రాణం. ఎందుకంటే కథనం మాత్రమే దర్శకుడు నమ్ముకొని సినిమాని తీస్తాడు కాబట్టి.
ఇక్కడా ఈ సినిమాలో బాగానే చూసుకున్నారు. కాని కొన్ని సీన్లకి ఇంటర్ లింకింగ్ అంటూ లేకపోయింది. మధ్యలో ఒక షాట్ మిస్ అయ్యిందా అనిపిస్తుంది. సమయం కూడా చాలా తక్కువే ఉండి కాబట్టి మళ్ళీ షూట్ చేసి అ సీన్స్ కలిపేది ఉండెను. కాని ప్రచారం - షూటింగ్ ఆరు రోజులు చేశారని అనాల్సి వస్తుందని ఏమో.. అసలు ప్యాచ్ వర్క్ చేశారా అనేది సరిగ్గా తెలీనప్పుడు మనమేమీ ఆ విషయములో స్పష్టముగా చెప్పలేము.
కెమరా పనితనం బాగుంది. డిజిటల్ కెమరాలో ఉన్న లిమిట్స్ అక్కడక్కడా కనిపించినా - ఆ డిజిటల్ కేమరాలని బాగా వాడుకున్నారు. కెమరా ని స్టాండ్ కి పెట్టి తీసే సినిమా నుండి - చేతిలో పట్టుకొని, నడుస్తూ షూట్ చెయ్యటం నిజముగా రిస్క్ యే!. అక్కడ ఆ కేమరామెన్ ప్రతిభ బాగా తెలిసిపోతుంది. ముఖ్యముగా చిన్నని, సన్నని సందుల్లో బాగా ఆపరేట్ చేశారు. రిఫ్లేక్తర్స్, లైట్స్ వాడకుండా తీయటం కూడా గొప్ప విషయమే.
ఈ చిత్రానికి ఎడిటింగ్ ఫరవాలేదు. ముఖ్యముగా కొన్ని సీన్లు తీసేసినా ఫర్వాలేదు అన్నట్లు ఉండి. కొన్ని రిపీట్ అయ్యాయి. సరియైన లైటింగ్ వాడకుండా నేచురల్ వెలుతురులో ఈ సినిమా తీశారు కనుక వెలుతురు నుండి చీకట్లోకి వెళ్ళినప్పుడు, చీకట్లో నుండి వెలుతురు లోకి వచ్చినప్పుడు - కెమరా లోని సెన్సార్ వల్ల - ఆటో ఫోకస్ లోకి లెన్స్ మారుతున్నప్పుడు వచ్చే గ్లేర్ లాంటి సీన్ ఎడిటింగ్ లో తీసేస్తే బాగుండేది. ఇది డిజిటల్ కెమరా తో తీశాము అని చెప్పటానికా అలా ఉంచేశారేమో అనుకోవాలి కాబోలు..
ఈ సినిమా ప్రధాన ఉద్దేశ్యమేలా అని అనుకోవాలంటే - మొన్ననిర్మాతల మండలి మీటింగ్లో సినిమా వ్యయం బాగా పెరిగిపోయింది. అతి తక్కువ ఖర్చులో సినిమాలు తీస్తే నిర్మాణ వ్యయం తగ్గుతుంది. ఫలితముగా నిర్మాత కాస్త లాభాలు కళ్లారా చూస్తాడు అని చర్చ వచ్చింది. అందుకే కాబోలు.. ఇలా కూడా సినిమా తీయవచ్చు అని వర్మ తీసి చూపాడు. నిజానికి అదే అనుకుంటే ఆ ప్రకాష్ రాజ్, సుబ్బరాజు, సునీల్ పాత్రలలో వేరే క్రొత్తవారిని ఎన్నుకుంటే ఇంకా (రెమ్యునరేషన్) వ్యయం తగ్గేది. అలాగే కొంత కొత్తదనం కూడా వచ్చేది.
ఈ సినిమాని డిజిటల్ లో తీశారు. అలాగే డిజిటల్ పద్ధతిలో తెరమీద చూపారు. ఈమధ్యనే క్రొత్తగా వచ్చిన పద్ధతి ఇది. సినిమా రీలు పద్దతిలో (ఒక్కో కాపీకి 45 వేలు నుండి 60 వేలు ఖర్చు) కాకుండా హార్డ్ డిస్క్ (5 వేలు - 8 వేలు) లో సినిమాని నింపేసి, సిస్టం ద్వారా తెర మీదకి సినిమాని ప్రొజెక్ట్ చెయ్యటం అన్నమాట. అన్నమాట. బీరువా సైజులో ఓక్ సర్వర్, మెషీన్ (15-20 లక్షలు) వాడి నేరుగా తెరమీదకి ప్రాజెక్ట్ చెయ్యొచ్చు. దీని వలన ఖర్చు బాగా తగ్గుతుంది. ఒక ఆపరేటర్ చాలు.
ఈ సినిమానే ఆరు లక్షల వ్యయముతో (నటీనటుల పారితోషకాలు కాకుండా) సినిమా తీశారు. అంటే నిర్మాతకి ఎంత ఖర్చు తగ్గి, ఎంత ఆదానో మీరు ఇక్కడ చక్కగా గమనించవచ్చును. ప్రతి ప్రింట్ మీద స్క్రీన్ కి పైనో క్రింద మూలనో ఒక సీక్రెట్ నంబెర్ వెయ్యటం మూలాన (ఇది స్క్రీన్ మీద మూలన కనిపిస్తుంది.) పైరసీ అయినా ఎక్కడి నుండి కాపీ అయ్యిందో ఈజీగా కనిపెట్టేయ వచ్చును. డిజిటల్ పద్దతిలో కాబట్టి ఆడియో క్వాలిటీ బాగుంది. DTS సర్రౌండ్ కూడా క్లారిటీ గా ఉంది కూడా. ఇలా వస్తున్న నూతన టెక్నాలజీ సహాయముతో సినిమాని ఇంకా బాగా తీసి, తక్కువ వ్యయం చేసి (సినిమా లో దమ్ము ఉంటే) నిర్మాత లాభాలు గడించవచ్చు అనే సూత్రం మీద తీసిన సినిమా ఇది.
No comments:
Post a Comment