చాట్ లో ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మొదలగున్నవి.::
1. మిగతా రెండింటి (వాయిస్, వీడియో) కన్నా టెక్స్ట్ చాట్ చెయ్యటం మీకు మంచిది అని గుర్తు పెట్టుకోండి.
2. వీడియో చాట్ అసలుకే చెయ్యకండి. అవతలి వ్యక్తిని బాగా చూసి, పరిచయం ఉంటేనే తప్ప చెయ్యకండి.
3. వాయిస్ చాట్ ని ఏదైనా విషయం త్వరగా చెప్పాలీ అనుకున్నప్పుడు / చాట్ టైపు చెయ్యటం కష్టం అనుకున్నప్పుడు చెప్పేస్తే మంచిది.
4. చాట్ మర్యాదలు నేర్చుకోండి. మొదట తప్పనిసరిగా Good Morning, Good Evening అంటూ మొదలెట్టండి. పెద్దవారు అయితే వారి అనుమతితో సర్ అని చెప్పండి. అలాగే బాగున్నారా? ఎలా ఉన్నారు..? అని అడిగండి. ఆ తరవాత వారు అడక్కముందే మీరెలా ఉన్నారో చెప్పండి. ఆడవారిని ఆంటీ అని సంభోదించకండి. వారిని ఏమని పిలవాలో అడిగి అలాగే పిలవండి.
5. చివరిసారిగా ఎప్పుడు చాట్ చేశామో గుర్తుంటే గుర్తు చెయ్యండి. అంతే కాని నిందలు వెయ్యకండి. ఎప్పుడూ ఆన్లైన్ లో ఉంటావూ, నాతో చాట్ చెయ్యవూ, మేమెప్పుడు గుర్తుంటామూ అనే నిందా పూర్వక మాటలు మాట్లాడకండి. దానివలన వారికి మాట్లాడాలని ఉన్నా - నాకు పని ఉంది అంటూ త్వరగా చాట్ నుండి వెళ్ళిపోతారు. అలా మీ మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అలా ఎందుకో నా అనుభవాల్లో చెబుతాను. అది చివరి పోస్ట్ గా ఉంటుంది.
6. చాట్ లో మాట్లాడేటప్పుడు అవైలబుల్ లోకి వచ్చి మాట్లాడండి. ఇన్విజిబుల్ లో ఉండకండి. ఒకవేళ ఉంటే ఆ విషయం వారికి చెప్పండి. అలా ఎందుకు ఉండాల్సి వచ్చిందో. వారు అర్థం చేసుకుంటారు.
7. ఒక విషయాన్ని పెద్ద పేరాల్లో చెప్పకండి. కొందరు బాగా సేపు పెద్దగా టైపు చేసి ఒకేసారి ఎంటర్ నొక్కుతారు. అవతలివారికి ఇదంతా వచ్చేసరికి బాగా ఎదురు చూడాల్సివస్తుంది. అలాగే అదంతా చదవాలంటే విసుగ్గా కూడా ఉంటుంది. మన మీద ఉన్న ఒక మంచి ఇంప్రెషన్ పోతుంది. వామ్మో వారు చాట్ కి పింగ్ చేశారా అనుకుంటూ నేను బీజీ అంటూ సమాధానం ఇస్తారు. అందుకే చిన్న చిన్న ముక్కల్లో చెప్పండి. ఒక వాక్యం కాగానే ఫుల్ స్టాప్ పెట్టగానే ఎంటర్ కొట్టడం నేర్చుకోండి. అది ఎదుటివారు చదివేలోగా మనం ఇంకో వాక్యం టైపు చెయ్యవచ్చును.
8. ఎదుటివారు చెబుతుంటే "ఊ" కొట్టడం మరవకండి. ఎప్పుడూ ఊ కొట్టడములో ఊ.. ఊ.. అంటూ ఉంటే వారికీ బోర్ వస్తుంది. ఊ, అలాగా, ఓహో, అయితే, అవునా, అప్పుడేమైంది?, హ్మ్మ్, నిజమా, అలా జరిగిందా..... అంటూ డిఫరెంట్ మాటలు మాట్లాడండి. దీనివలన మీరు శ్రద్ధగా వింటున్నారు అనే భావం వారికి అర్థం అవుతుంది.
9. చాట్ లో పర్సనల్స్ అంటూ ఏమీ చెప్పకండి. చదువూ, పేరూ, ఏ ఊరు అంతే చాలు.. అంతే కాని కాలేజీ పేరూ, ఏ ఊరు లోని కాలేజీ, ఏ గ్రూప్, అమ్మా నాన్నలు ఏమి చేస్తారూ, ఎక్కడ పని చేస్తారూ, మీరెంతమంది, వారు ఏమి చేస్తున్నారో... ఇవన్నీ అనవసరం. మనం ఇక్కడ వచ్చింది స్నేహానికే. అంతే కాని పెళ్లి చూపులప్పుడు అడగాల్సిన ఎంక్వైరీ ప్రశ్నలు ఇక్కడ అవసరమా? అయినా అవన్నీ తెలుసుకొని చేసేది స్నేహం కాదు. అవసరార్థ స్నేహం అంటారు.
10. మొదట్లో చాట్స్ పెద్దగా మాట్లాడకండి. చిన్న చిన్న బిట్స్ బిట్స్ గా మాట్లాడండి. అంటే రెండు మూడు నిముషాల్లో మాట్లాడటం అయిపోయేవిగా ఉండాలి. ఇలా కొద్దిరోజుల వరకూ బిట్స్ బిట్స్ గానే మాట్లాడాలి. ఇలా ఎందుకూ అంటే - అప్పుడు అవతలివారు ఏమైనా అబద్ధాలు చెప్పినా మనకి కాస్త గుర్తు ఉంటాయి. ఆ వెంటనే మన మ్యూచువల్ మిత్రులని ఆ విషయాల గురించి అడిగితే వారు చెప్పినవి నిజమో కాదో తెలిసిపోతుంది.
11. ఉదాహరణకి నేను ABC సాఫ్ట్వేర్ కంపనీ లో పనిచేస్తానూ అని చెబితే, ఈ విషయాన్ని మన మ్యూచువల్ ఫ్రెండ్స్ ని అడిగితే చెప్పేస్తారు. అది నిజమో కాదో అని. కాదని అంటే - ఇంకో ఇద్దరినీ తెలుసుకుంటే సరి. అప్పుడు నిజమెంతో అడగవచ్చు. ఆ విషయం మీద నన్ను తరచి తరచి ప్రశ్నించవచ్చును. అప్పుడు నేనే ఇబ్బంది పడతాను. రేపొద్దున మీ ఫ్రెండ్స్ కి నేను ఆడ్ రిక్వెస్ట్ పెడితే - వారు ఎంక్వయిరీ కోసం మిమ్మల్ని అడిగితే - నేను అబద్ధాల కోరు, మొన్న ఇలా అబద్ధం ఆడాడూ అని చెబితే - వారు ఇక నా ఫ్రెండ్ రిక్వెస్ట్ రెజెక్ట్ చేసి, ఇక ఎప్పుడూ నేను వారికి ఆడ్ రిక్వెస్ట్ పెట్టకుండా నన్ను బ్లాక్ లిస్టు లో పెట్టేస్తారు. నాకు నేను అలా చేసుకోవటం ఏమైనా బాగుంటుందా?.. అలా చేసుకుంటే కొన్ని మంచి మంచి స్నేహాలు కోల్పోతాం. జీవితములో ఇక తిరిగి పొందలేము.. ఇలాంటి అబద్ధాల కోరులు ముగ్గురు తగిలారు. ఇక నాకు ఈ జన్మలో ఆడ్ రిక్వెస్ట్ పెట్టకుండా బ్లాక్ లిస్టు లో పెట్టాను.
12. చాట్స్ లలో ఎవరిమీదా చెప్పకండి. అవతలి వారు మీతో బాగోలేనప్పుడు, వారు ఆ చాట్స్ ని మీ శత్రువులకి చూపి, మీ మధ్య ఇంకా కక్షలు రేపుతారు. కనుక తస్మాత్ జాగ్రత్త.
13. చాట్స్ ఎప్పుడూ కంటిన్యూగా చెయ్యండి. మధ్యలో బీజీ లేదా, ఏదైనా వస్తే అవతలివారికి చెప్పి, ఒక ఇదు నిముషాలు అంటూ సమయం చెప్పండి. వారు అంతలోగా వేరే పనులు చేసుకుంటారు. వారికి చెప్పకుండా వదిలేసిపోతే అవతలివారు కారణం అడిగితే - మీరు కారణం చెబుతారు. అది విని వారు ఇక మళ్ళీ చాట్ చేయ్యకపోవచ్చును. మీరు నమ్మకున్నా ఇది నిజం. నాకే అలాంటివి చాలా జరిగాయి. వరంగల్ లో ఉండే అతను ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉన్న చాట్ మధ్యలోంచి లేచి, టీ పెట్టేసుకొని హాయిగా త్రాగేసి పన్నెండు నిమిషాల తరవాత వచ్చాడు. ఇప్పుడు MBA చేస్తున్న నా మిత్రురాలు - తన ఫ్రెండ్ దగ్గర నుండి ఫోన్ వచ్చిందని నాతో ఏమీ అనకుండా వెళ్ళిపోయి, ఫోన్ మాట్లాడింది. ఐదా? పదా? నలభై నాలుగు నిమిషాలు. అంత సేపూ వెయిటింగ్.. పై రెండూ నా అత్యవసర విషయాల్లో వారితో మాట్లాడుతున్నాను. ఒక ముక్క చెప్పేస్తే సరిపోయేదిగా.. ఇప్పుడు వీరిద్దరితో నేను చాటింగ్స్ కి పోవటమే లేదు. వారు చేసినా పొడిపొడి మాట్లాడేసి, నాకు పని ఉంది అని బై చెప్పేస్తున్నాను.
14. ఇంకో అతను ఫ్రెండ్ వచ్చాడని కనీసం "బై" కూడా చెప్పకుండా సిస్టం షట్ డౌన్ చేసి వెళ్ళిపోయాడు. చాలాసేపు అతడికోసం ఎదురు చూశాను. తెల్లారిన చెప్పాడు.. ఇలా వెళ్లానని. నేను ఏమీ అనలేదు. అలాగా అని ఊరుకున్నాను. మరొకతను చాట్ చేస్తూ నిద్రపోయాడు. ఈ ఇద్దరూ వారంతట వారే చాట్ పింగ్ చేశారు కూడా. వారిద్దరినీ ఇక నాతో చాట్ చెయ్యకుండా బ్లాక్ లిస్టు లో పెట్టాను. వారు ఏమి వ్రాసినా స్క్రాప్స్ మాత్రమే వ్రాయాలి ఇక. "అన్నా చాట్ ఓపెన్ అవటం లేదు ఎందుకో.." అని వారు అంటే - ఏమైనా వైరస్ వచ్చిందేమో అని తప్పించుకుంటున్నాను. హ అహహ హ్హ అ
15. ఇంకో అతనికి ఎలా మాట్లాడాలో తెలీదు. అతడి చాట్ చూడండి. ఒకసారి "నీ అయ్య ఎం చేస్తాడు.." అన్నాడు. కోపం వచ్చినా తమాయించుకొని, కూల్ గా చెప్పాను. అయినా అలాగేనా అడిగే పద్ధతి? అదేకాక వెంటనే "అన్నో! వదిన ఏమి చేస్తుంది?.." అడిగాడు. చదువుకున్నా ఎదగని మనస్థత్వం వారిది. ఇలాంటి స్నేహాలు మనకి అవసరమా..? ఆ తరవాత ఏమి జరిగి ఉంటుందో మీకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటాను. వెంటనే పీకేసి బ్లాక్ లిస్టు లో పడేశాను.
16. నా మిత్రురాలినీ ఒకరు రోజూ చాట్ లో అన్నీ అడుగుతూ ఉంటే - ఆవిడ భయపడిపోయి "అక్కౌంట్ డెలీట్ చేస్తానూ.." అంటే - "అదేమీ అవసరం లేదు. అతను ఎలాంటివాడు?.." అని అడిగితే - "మంచివాడే కాని, ఈ మధ్యనే అలా చేస్తున్నాడు.." అంటే - "చాట్ బ్లాక్ లిస్టులో అతన్ని పెట్టండి, ఇక చాట్ చెయ్యలేడు, సరిపోతుంది.." అని ఎలా చెయ్యాలో చెప్పాను... ఇప్పుడు ఆమె సంతోషముగా ఉంది.
17. అవతలివారు "నాకు పని ఉంది బై.." చెబితే, వెంటనే ఆ చాట్ అక్కడితో ముగించేసి మీరూ "బై.." చెప్పెయ్యండి. అలాగే గుడ్ బై విషేష్ చెప్పటం మరచిపోకండి.
18. అవతలివారు చాట్ టైపు చేస్తున్నప్పుడు మీరు ఆగటం మంచిది. ఒకరు వ్రాశాక ఇంకొకరు వ్రాస్తే బాగుంటుంది. లేకుంటే చాట్ కన్ఫ్యూస్ గా అవుతుంది.
19. మీరు చాట్ పింగ్ చేస్తే - అడగాల్సింది త్వరగా అడిగేసి, చాట్ క్లోజ్ చెయ్యటం మంచి పద్ధతి. అందరికీ సమయం చాలా విలువైనది. అవతలివారు మీకన్నా ముందే బై.. నైస్ మీట్ యూ.. అని చెబితే మీరు అంతగా బోర్ కొట్టించేశారు అన్న సూచన అని బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు తప్పించుకోవాలంటే వెంట వెంటనే జవాబు ఇవ్వండి. చాట్ ని ఒక నిముషం ఆపితే - క్రింద Sent at.. అంటూ చాట్ ఆపేసిన సమయం వస్తుంది. క్రింద ఫోటో చూడండి. అది రాకుండా జాగ్రత్త పడితే చాలు. అంటే ఒక నిముషం పాటూ ఏమీ టైపు చెయ్యలేదు అన్నమాట. అలా ఉన్నప్పుడు మరలా కలుద్దామా అని చెప్పటం మంచిది.
21. ఎవరూ చాట్ చెయ్యకుండా సెట్టింగ్స్ పెట్టుకోవచ్చును. కాని అలా ఉండి, నష్టపోయే బదులు.. ఉంచుకోవటమే బెస్ట్. ఎవరికైనా ఏదైనా వెంటనే చెప్పాలీ అంటే ఈ మార్గం చాలా దగ్గరగా + పర్సనల్ గా ఉంటుంది.
22. చాట్ మధ్యలో - అలా వదిలేసి మీ పని మీరు చేసుకుంటూ ఉండిపోకండి. అవతలివారికి మీరు స్నేహాన్ని కూడా ఇలాగే మధ్యలో వదిలేసే మనస్థత్వం ఉన్నవారు అని అనుకోవచ్చును. అలాని మీకో ముద్ర పడొచ్చును. అందుకే తస్మాత్ జాగ్రత్త.
23. చాట్ చేస్తున్నప్పుడు ఎదుటివ్యక్తి ఎలాంటివాడో, అతని మానసిక స్థితి ఏమిటో అతని చాట్ లోని భావాల వల్ల తెలిసిపోతుంది. ఎలా మొదలెట్టాడూ, ఎలా చాట్ చేస్తున్నాడూ, ఎంత త్వరగా, సమర్థవంతముగా జవాబు ఇస్తున్నాడూ, చాట్ ని ఎంత హుందాగా నడిపిస్తున్నాడూ, తన భావాలని ఎలా బయటకి ఎలా ప్రదర్శిస్తున్నాడూ, ఎదుటివారు చెప్పేది ఎంతగా ఆసక్తిగా వింటున్నాడూ, మనం చెప్పే మాటలకి ఎలాంటి ఆసక్తిని ప్రదర్శిస్తున్నాడూ, మనం అడిగే వాటికి ఎంతటి సబ్జెక్ట్ నాలెడ్జ్ తో జవాబు ఇస్తున్నాడో తెలిసిపోతుంది. ఇలాంటివి ఇంకో రెండు మూడు సార్లు చూస్తే / చేస్తే చాలు. ఆ వ్యక్తి మన మనసుకి ఎంత దగ్గరో / దూరమో మీకే తెలుస్తుంది.
24. ఎక్కడైనా అవతలివారు చెప్పిన విషయం అర్థం కాకుంటే అర్థం కాలేదు.. మీరు చెప్పేది, మళ్ళీ ఒకసారి హుందాగా అడగటములో తప్పేమీ లేదు. మీకు అది ప్లస్ పాయింట్ అవుతుంది.
25. అవతలి వారు చెబుతున్నారు కదా అని, పర్సనల్ విషయాలలోనికి వెళ్ళకండి. కాస్త దాపరికం అంటూ ఉంటేనే స్నేహం బాగుంటుంది.
26. కష్టాలనీ, కన్నీళ్ళనీ, బాధలూ, సంతోషాలు పంచుకోవటానికి చాట్స్ ఉత్తమమైన వేదిక. అలాని చెప్పి ప్రతివారితో పంచుకోవటం వృధా ప్రయాస. మీ గోడుని వినే ఓపిక ఉండీ, మీకు తగిన సలహాలు నిజాయితీగా, నిర్భీతిగా ఇచ్చేవారు అయి ఉండీ, మీ సంతోషాన్ని రెట్టింపు చేసేవారినీ, మీ దుఃఖాలనీ, మీ రహస్యాలనీ కాపాడగలిగి ఉండేవారు ఉంటేనే వారికి చెప్పటం అలవాటు చేసుకోండి. లేదా ఆ తరవాత ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా తేల్చుకోవటానికి అప్పుడప్పుడూ టెస్ట్ చేస్తుండండి.
27. ఎవరైనా చాట్ ఏవైనా చెబితే అవి మనసు లోపలికి ఇంకిపోవాలి. మనసుని బ్లాటింగ్ పేపర్ లా మార్చేయ్యాలి. అంతే కాని వాటిని మన చేతల ద్వారా బయట చెప్పకూడదు. దానివల్ల లేనిపోని చిక్కులు మొదలవుతాయి.
28. నేను అప్పుడప్పుడూ క్రొత్తవారినీ, పాతవారినీ టెస్ట్ చెయ్యటానికి కొన్ని విషయాలు వారి స్క్రాప్స్ లో గానీ, చాట్స్ లో గానీ పెడుతూ ఉంటాను. నా స్క్రాప్ బుక్ లో "పెట్టిస్తుంటాను" కూడా. అది చూసినవారు ఆ విషయాన్ని ఇతరులకు స్ప్రెడ్ చేస్తుంటారు. భూమి గుండ్రముగా ఉంది అన్నట్లు - చివరకి నాకు తెలుస్తుంది. ఎవరు చెప్పారు అంటే ఫలానా అని చెబుతారు. చివరికి ఎవరు మొదట చూసి స్ప్రెడ్ చేశారో చెబుతారు. అప్పుడు ఏమీ చెయ్యను - జస్ట్ నా పాచిక పారింది అనుకొని వారికీ, నాకూ మధ్య గాజు గోడ లేపుతాను. అలా గాజు గోడ ఉంది అని నాకు మాత్రమే తెలుస్తుంది. వారికి అది తెలిసేసరికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఒక్కోసారి జీవితకాలం పట్టొచ్చు కూడా.
29. మనం ఎదుటివారి పట్ల ఏదైనా తప్పుగా చేసి ఉంటే క్షమించమని అడగటానికి ఇది సరియైన వేదిక అని నేను అంటాను. క్షమించమని అడగటానికి నామోషీగా ఉంటే - ఇంగ్లీష్ వాడు సింపుల్గా నేర్పించి వెళ్లాడే - సారీ అని.. అలా చెప్పెయ్యండి. సారీ చెప్పటం తప్పేమీకాదు. రెండున్నర గంటల సేపు ఉండే సినిమా టాకీస్ లో కాలు తాగితేనే సారీ చెప్పేస్తాం. జీవితాంతం స్నేహంగా ఉండబోయే మనం ఇక్కడ చెప్పటానికి అభిజ్యాతం (Ego) ఎందుకూ.? ఒక్కసారి చెబితే మీ గుండెల మీద ఉన్న అపరాధ భావం పోతుంది. రేపు మీరిద్దరూ దూరం అయినా మీ జీవితములో ప్రభావం చూపదు. "అప్పుడే చిన్నగా సారీ చెప్పేస్తే పోయేది.. ఒక మంచి స్నేహాన్ని కోల్పోయాను.." అని వృద్ధాప్యంలో / అంతా అయ్యాక బాధపడటం ఉండదు. ఈ పనిని మీ ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చిన తొలినాళ్ళలో చెయ్యటం మంచిది. సారీ చెప్పటం వల్ల మనకేదో నష్టం జరుగుతుంది అని కాదు. ఏమీ పోదు. మీ ఆస్థులు ఏమీ కరిగిపోవు. అలా చేస్తే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది కూడా. నేను మాత్రం అప్పుడే సారీ చెప్పాను అని ఎప్పుడైనా అనటానికి మనకంటూ ఒక ఆధారం ఉంటుంది. ఒక్కరి దగ్గర ఎవరూ చూడకుండా చెబుతాముగా.. ఇంకా ఇబ్బంది ఎందుకూ..? పది మంది వద్ద చులకన అయ్యే బదులు ఒక్కరివద్ద సారీ చెప్పటం వల్ల అపరాధ భావం పోతుంది అన్నప్పుడు చెప్పటమే మంచి పద్ధతి కదా..
30. ఇలా చెప్పిన సారీని అందరి ముందు అవతలివారు నాదే గొప్ప అని ప్రదర్శిస్తే, వారిని ఇక వారి మానాన వారిని వదిలెయ్యండి. ఇక అలాంటి స్నేహితుడు మీకు నిశ్చయముగా అవసరం లేదు.
31. చాట్స్ లలో పనికిరాని సోదీ చెప్పుకొంటూ కాలం వెళ్ళబుచ్చే బదులు దాని బదులుగా ఏదైనా నేర్చుకోవటానికి ఆ సమయాన్ని కేటాయించండి. నేను మొదట్లో ఇలా చాలా సమయం వృధా చేశాను. ఆరునెలల నుండీ క్రొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. చాలా బాగా ఎదిగాను అని అనుకుంటున్నాను. పనికిరాని విషయాల మీద సమయం కేటాయించే బదులు మీకు ఉపయోగపడి, మీకు కాస్త గుర్తింపునీ, మీలోని టాలెంట్స్ ని అభివృద్ధి చేసుకోవటానికి వాడండి. మీకు కాస్త సెలెబ్రిటీ హోదాలా విజయం వస్తుంది. ఆ కిక్ ఈ పనికిరాని విషయాల చాట్ మీద వచ్చే ఆనందం కన్నా చాలా గొప్పగా ఉంటుంది. ఆ రుచి చూస్తే ఇంకా కావాలంటారు. నేను నా నిజమైన స్నేహితుల వల్ల ఈ మధ్యే ఆ రుచి చూశాను. వారికి నా కృతజ్ఞతలు.
32. అప్పుడప్పుడూ మీ మిత్రులని చాట్ ద్వారా పలకరించండి. జస్ట్ ఒకటీ, రెండు నిముషాలు మాట్లాడితే సరిపోతుంది.
33. గర్వముగా ఫీలవుతూ, చాట్ లో సమాధానం చెప్పేవారిని వదిలెయ్యండి.
34. అలాగే ఇతరులమీద తగిన ఆధారాలు లేకుండా చాడీలు చెప్పేవారి మీద సమయాన్ని వెచ్చించకండి. అవన్నీ వింటూ ఉంటే మీ మనసు పాడు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటివి నెట్లో కూడా ఉంటాయా అని హాస్చర్యపడి పోకండి. నిజమే!.. నేను నిజమే చెబుతున్నాను. ఈరోజు వేరేవారి మీద చెబుతారు - రేపు మీ మీద చెప్పరని గ్యారంటీ ఏమిటీ? ముందే నరంలేని నాలిక నాయే!.. అని నానుడి ఉంది కదా..
35. చాట్స్ లలో తెలుగులో కూడా చాట్ చేసుకోవచ్చును. నేను సోది, సినిమా కబుర్లు, రాజకీయాలు వదిలేసి కొద్దిగా సమయం కేటాయించాను అని చెప్పానుగా. అలా ఇది నేర్చుకున్నాను. తెలుగులో చాట్ కూడా ఈజీగా చేస్తున్నాను. ఇలా చేస్తుంటే నా మిత్రులందరూ బాగా ఆసక్తిగానూ, ఆశ్చర్యముగానూ చూస్తున్నారు. వారికి ఇలా చెయ్యటం రావటం లేదు. బాగా కుళ్ళు కుంటున్నారు నా మీద. హ అహహ హ్హ. నిజానికి నాకూ తెలీదు. నా మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి - ఇలా నాతో చాట్ చేస్తే - అడిగా. అతను ఎలా చెయ్యాలో చెప్పారు. అలా ఆసక్తి పెరిగి నేను నేర్చుకున్నాను. అతనికి నా కృతజ్ఞతలు.
36. ఈ తెలుగులో ఎలా వ్రాయాలీ అంటే - ఈ బ్లాగులో తెలుగులో వ్రాయటం ఎలా అన్న పోస్ట్ లలో చెప్పినట్లుగా టైప్ చేస్తే సరి. అది ఎలా చేస్తున్నానో శాంపిల్ గా చూపటానికి ఒక ఫోటో అప్లోడ్ చేద్దామంటే అప్లోడ్ అవుతున్నాయి కాని, కనిపించటం లేదు. బ్లాగ్ సర్వర్ లో ప్రాబ్లెం అనుకుంటాను. అది సెట్ అయ్యాక ఆ ఫోటో పెడతాను. అప్డేట్ చేస్తాను. ఈరోజు ఆ సర్వర్ ప్రాబ్లెం పోయింది.
37. నేనూ నా మిత్రుడు మాట్లాడుకున్న చాట్ ఇది. మీకూ ఒక ఇన్ఫో గా ఉంటుందని పెడుతున్నాను. ఇలా పెట్టడానికి కారణాలు ఉన్నాయి. అలా ప్రోఫైల్స్ పెట్టి, ఎదుటివారికి ఆడ్ రిక్వెస్ట్ లు పెట్టి ఎదుటివారిని ఫూల్ చేస్తుంటారు. ఎవరిని నమ్మాలో, నమ్మోద్దో తెలీని స్టేజికి తీసుకవస్తారు. ఉన్నది ఉన్నట్లుగా చెబితే ఆడ్ చేసుకోమా.. ఎందుకా దాపరికాలు? క్రింద ఫిమేల్ అని పెట్టి, పైన అబ్బాయి ఫోటో పెట్టాడు అతను. అంతకు ముందే చెప్పాను.. ఇవి మార్చు అనీ. చేయ్యకపోయేసరికి బ్లాక్ లిస్టు లో పెట్టాను. ఆ ప్రొఫైల్ వదిలేసి, ఇంకో ప్రొఫైల్ ఓపెన్ చేసి మళ్ళీ నాకు పంపాడు. నా మిత్రునికీ పంపాడు. అలా ఈ చాట్ నడిచింది. ఒకసారి వద్దు అనుకున్నాను. కారణం అడిగితే చెప్పాను కూడా.. ఇలా ఇలా అంటూ. అయినా మళ్ళీ వెంట పడ్డాడు. ఆడ్ చేసుకోమని. ఆ మార్పులు చేసేదాకా కుదరదని, బ్లాక్ చేశాను. ఇలా కాదనుకొని, ఆ అబ్బాయి ఫిమేలంటూ ఇంకో ప్రొఫైల్ పెట్టి, మళ్ళీ పంపిస్తే ఎలా!.. ఇలా ఇబ్బంది పెట్టడం దేనికీ. నాకు అతని పద్ధతి నచ్చలేదు.. ఇప్పటికీ ఆ ప్రొఫైల్ లో లో అలాగే ఉంది కూడా..
38. తెలుగులో ఎలా చాట్ చేస్తామో చెప్పటానికీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇంగ్లీష్ లోలాగానే ఇక్కడ తెలుగులో కూడా వేగముగా టైపింగ్ చెయ్యవచ్చును. నిజం.. ఉదాహరణగా చూడండి.
38. తెలుగులో ఎలా చాట్ చేస్తామో చెప్పటానికీ ఇక్కడ చూపిస్తున్నాను. ఇంగ్లీష్ లోలాగానే ఇక్కడ తెలుగులో కూడా వేగముగా టైపింగ్ చెయ్యవచ్చును. నిజం.. ఉదాహరణగా చూడండి.
First : updated on 28-March-2011
Second : updated on 31-March-2011
Second : updated on 31-March-2011