ఈ మధ్య మార్నింగ్ వాక్ అంటూ అనుకోకుండా అలవాటు అయ్యింది. తెలిసిన మిత్రునికి బండి నేర్పిద్దాం అనుకోని, ఉదయాన వెళ్ళటం అలవాటు అయ్యింది. సైకిల్ కూడా రాని వాడికి బండి నేర్పటం చాలా ఇబ్బందే అయ్యింది. అలా నేర్పించటం కూడా చా - లా సమయం తీసుకుంది. దానివలన చాలారోజులు ఉదయాన్నే - సూర్యుడు రాకమునుపే లేవాల్సి వచ్చింది. తనతో అలా బండి నేర్పించటానికి వెళ్లాను. నిజం చెప్పాలీ అంటే అంతకు ముందున్న నా దినచర్యకి పూర్తిగా వ్యతిరేకం.
అలా నిద్రలేచి, వాడికి బండి నేర్పించటానికి వెళ్లాను. ఆ పని చాలారోజులు సాగింది. నేను వెనకాల కూర్చొని, అలా ఆ బండి మీద అలా సాగాల్సిన సమయములో చుట్టూ చూస్తూ చాలా విషయాలు నేర్చుకున్నాను. అవి మీకు ఇప్పుడు చెప్పటం.
అలా వెళ్ళటం కూడా మూడు నెలలుగా వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే అలా మార్నింగ్ వాక్ చేసేవారు కూడా కనిపించేవారు. వారు అలా నడవటం ఏదో క్రొత్తగా తోచింది కూడా. అసలు మనం ఎప్పుడు ప్రొద్దునే లేచి అలా వెళ్లాం? వారు అలా వెళ్లి వచ్చాక, అందరూ లేచాక నిద్ర లేచేవాడిని. అలా ఉండేవాడిని ఎందుకో మారాలని అనిపించింది. నాతో వచ్చినవాడు హాయిగా గ్రౌండ్ లో డ్రైవింగ్ నేర్చుకుంటుంటే - నేను అలా గ్రౌండ్ లో ఒక మూలగా నిలుచునేవాడిని. అక్కడికి వచ్చిన వారిని గమనిస్తూ ఉండేవాడిని. అంతేకాని ఏమీ చేసేవాడిని కాదు.
కొంతకాలం తరవాత వాడికి బండి నడిపించటం వచ్చింది. వాడికి నేను చేసిన సహాయానికి ఋణం తీర్చుకోవాలని అనుకున్నాడు లా ఉన్నాడు.. మార్నింగ్ వాక్ కి వెళదాం అని చెప్పాడు. హా! నాకెందుకు? అవసరం లేదు. నాకు అంతా బాగుంది అన్నాను. చాలాసార్లు అడిగినా అసలు వద్దనే అన్నాను. వాడు బండి నేర్చుకోవటానికి, ప్రాక్టీస్ చెయ్యటానికి అలా తోడుగా రమ్మంటే మాత్రం కాదని అనలేకపోయాను. రాత్రి ఎంత నా బ్లాగ్ వ్రాసుకున్నా, ప్రొద్దున్నే నిద్రలేచి, నిద్ర సరిపోకున్నా - వెంట వెళ్ళేవాడిని.
కొద్దిరోజుల తరవాత నాలో చిన్నగా మార్పు.. ఎన్ని రోజులు అయినా వాడు రోజూ పట్టుదలగా బండి నేర్చుకుంటున్నాడు. తనకి అంత తొందరగా నేర్చుకునే లక్షణం లేకున్నా బాగా కష్టపడుతున్నాడు. నేర్చుకొని, తన జీవితాన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని చూస్తున్నాడు. ఏమీ లేని, రోజంతా కష్టముతో కూడుకున్న మామూలు జీవితం సాగించే అతను అంత పట్టుదలగా మూడు నెలలుగా బండి నేర్చుకుంటున్నప్పుడు, నేనేం చేస్తున్నాను.. అనే ప్రశ్న నాలో మొదలయ్యింది.
ఆ గ్రౌండ్ లోని వాళ్ళందరినీ గమనించాను. మూడు సంవత్సరాల పిల్లల నుండీ అరవై సంవత్సరాల పిల్లల వరకూ ఉన్నారు అక్కడ. అందరూ బీజీ.. బీజీగా వ్యాయామం చేస్తున్నారు. వాళ్ళందరూ కష్టపడుతుంటే మరి నేను?.. అని అనుకున్నాను. నా ఫిట్నెస్ గురించి నాలో అనుమానం. కొద్దిరోజుల దినచర్యలో నా శరీర స్థితిని గమనించాను. నేను ఎంతో ఫిట్ అనుకున్నవన్నీ అబద్ధాలే అని తేల్చుకునేసరికి ఇక నా శరీరం ఎలా ఉందో అర్థం అయ్యింది. ఇక ఆలస్యం చేయ్యబుద్ది అవలేదు. ఇక మొదలెట్టాను..
అలా అలా ఒక నెల గడిచింది. ఆ నెల రోజుల్లో నేను పొందిన అనుభవాలను, అలా వాకింగ్ లో పరిచయం అయిన వారూ అన్నవీ, నేను పరిశీలించిన విషయాలనీ మీకు ఇప్పుడు చెబుతాను. నచ్చితే మీరూ వాకింగ్ / వ్యాయామం మొదలెట్టేయండి.
* రాత్రి పూట ఆలస్యముగా పడుకొని, ఆలస్యముగా నిద్ర లేవటం వల్ల - ఉదయాన ఉన్న కొన్ని అందమైన దృశ్యాలని పొందలేకపోతున్నాను. ఉదాహరణకి : సూర్యుడు ఉదయించేవేళ, పక్షులు ఆహారానికి వెళ్లటం, నిర్మానుష్యమైన రోడ్లు, దైనందిక జీవితం ఎలా మొదలవుతుంది, వాహానం మీద మంచు నీటి తుంపర ఎలా ఏర్పడుతుందో.. ఇత్యాది విషయాలు..
* అంతకు ముందున్న నా అథ్లెటిక్ శరీరంకీ, ఇప్పుడు వాకింగ్ పోక మునుపు ఉన్న స్థితికీ చాలా తేడా.. భూమికీ, ఆకాశానికి గల తేడా.. వయసు వల్ల వచ్చినది కాదు. కేవలం కొన్ని కారణాల వల్ల రాత్రి మేల్కోవటం అలవాటు చేసుకున్నాను. అది అలా కొనసాగిస్తూ పోయాను.
కానీ, ఇదే పని ఉదయాన / వేకువ ఝామున లేచి చేసుకుంటే అంతే పనీ అవుతుంది. మరియు బోనస్ గా పైన చెప్పిన దృశ్యాలనీ చూడొచ్చును.
* రాత్రి పూట బాగా మేల్కొని, ఉదయాన లేస్తే మామూలుగానే ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ, చాలా చాలా చా...లా నె...మ్మదిగా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇది మీ శరీర పరిస్థితిని బట్టి, మీ దైనందిక అలవాట్లని బట్టి - ఎంత త్వరగా అలా చేస్తుంది అనేది ఆధార పడుతుంది. కానీ ఇది మనం గమనించలేము. నాకేం అయ్యింది.. అంతా ఫిట్ గా ఉన్నాను అనే అపోహలో ఉంటాం. అది వేరేవారు చెప్పినా - తప్పు చెబుతున్నాడు అనే భావనలో ఉంటాము కూడా. నేనూ నెల క్రితం వరకూ అలాగే అనుకున్నాను.
* మెల్లమెల్లగా మనలో అశక్తత మొదలవుతుంది. కానీ గమనించనట్లే ఉంటాము. ఇంకా ఏమీ కాలేదు అనే స్టేజీలోనే ఉంటాము. కానీ మనకు తెలీకుండానే కొన్ని జబ్బులూ, ఆధునిక జబ్బులూ (మానసిక ఒత్తిడీ, ఇంటర్నెట్ సిండ్రోం, సామాజిక సైట్ల విషయాలు.. ఇలాంటివి ) మనలో ప్రవేశిస్తాయి. ఎంతగా అంటే ఏమాత్రం చడీ చప్పుడు లేకుండానే. అవి మనం గమనించలేకపోతాము. కానీ మన శ్రేయోభిలాషులూ, ఆప్తులు మాత్రమే గమనిస్తారు. వారు ఇలా అనీ మీ దృష్టికి తీసుకరాగానే - మీరూ అతి తొందరగా ఒప్పుకోరు. వాదన పెట్టుకుంటారు. కాదని అంటారు. కానీ వాళ్ళు చెప్పేది నిజం అని చాలారోజులకి - అంటే మీలోని మార్పులు మీకే అనుభవం లోకి వచ్చాక గానీ నమ్మరు. ఇంతవరకూ వచ్చాక అప్పటికి మీ పరిస్థితి బాగుండదు. అప్పుడు కష్టపడినా మీరు కోలుకోవటానికి బాగా సమయం పడుతుంది. అందుకే మీ శ్రేయోభిలాషులు చెప్పగానే - నిజాయితీగా ఆలోచించి, ఒప్పుకోండి. అప్పుడైనా వింటే - కాస్త ఈజీగా, తొందరగా బాగుపడతాము. నమ్మినా, నమ్మకున్నా ఇది నిజం.
* రాత్రిపూట బాగా మేలుకొని చేస్తుంటే - ఏమీ కాదు కానీ వత్తిడి, ఆందోళనలూ, నిద్రలేమి వల్ల కాసింత ఏమిటీ - బాగానే ఆరోగ్యం పాడవుతుంది.. ఇటు శారీరకముగా, అటు మానసికముగా. మానసికముగా ఏమి అవుతుందో పైన చెప్పాను. మళ్ళీ రిపీట్ చెయ్యలేను.
ఇక శారీరకముగా అయితే - మీలో గ్లామర్ తగ్గుతుంది. మీ కళ్ళ క్రింద నల్లని వలయాలు, మొహములో ముడుతలూ, వయసు మళ్ళినట్లు లక్షణాలు, మీ గుండె చప్పుడు మీకే వినిపించటం, కొద్ది దూరం నడిస్తేనే ఆయాసం, మోహం మీద నీళ్ళు చల్లుకున్నట్లుగా చెమటలు, మొహములో కాంతి (Glow) అస్సలు లేకపోవటం, కాసింత బరువు మోస్తూ వెళ్ళితేనే పట్టుమని కొద్ది దూరం కూడా నడిచి, వెళ్ళలేని పరిస్థితి. చేతుల కండలూ, జబ్బలూ డీలా డీలా ఉండి, ఆకర్షణీయముగా ఉండకపోవటం, మీ పొట్ట కాస్త నేనూ బయటకి వచ్చేస్తున్నానోచ్! అంటూ కనిపించేలా రావటం.. ఇవన్నీ మీలో ఉన్నట్లయితే మీరు వెంటనే వ్యాయాయం మొదలు పెట్టండి. అయినా మొదలు పెట్టరు. ఇలా చదివేసి అలా వదిలేస్తారు.. ముందే చెప్పాను హితులూ, ఆప్తులూ చెబితే వినరనీ..
* చాలా పనులు మీ ఆరోగ్యం కన్నా ఏమీ ముఖ్యం కావు. మీరు బాగుంటేనే - అవి మీరు పూర్తి చెయ్యగలరు. మీరు ఒకవేళ లేకున్నా ఆ పనులలో చాలావరకు మీరు లేకపోయినా వేరేవారు చెయ్యగలరు. మీరు ఇప్పుడు కాసేపు ఆలోచిస్తే - ఇది నిజం అని ఒప్పుకుంటారు కూడా.
* మీ మీద ఆధారపడ్డ వారిని ఒక్కసారి లెక్కించండి. లెక్కించారా?.. ఓకే.. అంతమంది మీమీద ఆధారపడ్డప్పుడు మీరు ఎందుకు మారరు? వారిని నడిరోడ్డు మీద వారి మానాన వారిని వదిలేసి బీపీ, షుగర్, హార్ట్ అటాక్ అయ్యి పరలోకంకి వెళ్ళగలరా?.. ఈ ఊహ చాలా భయంకరముగా కనిపిస్తుంది కదూ.. ఇవన్నీ అవసరమా అని అనుకుంటాము కానీ, మొదట్లోనే ఆలోచిస్తే - సమయమూ, వయస్సూ, ఓపిక, కష్టపడే తత్వం.. అన్నీ మనకి అందుబాటులో ఉంటాయి. ఆలస్యం చేసిన కొద్దీ దూరం అవుతుంటాయి.
ఇలా చాలా చాలానే గమనించాను. అన్నీ చెప్పేస్తే చాంతాడు అంతగా అయ్యేలా ఉంది. మీకూ బోర్ కొట్టించవచ్చును. కనుక ఆ విషయాలు ఇంకొన్ని ఉన్నా - నేను ఈ నెలరోజుల్లో పొందిన విషయాల్లో కలిపేసి చెబుతాను.
1. నేను ఉంటున్న దగ్గర రాత్రి పూట ఇరవై డిగ్రీలు చలి ఉండొచ్చును. ఇప్పుడు పదకొండు డిగ్రీలు ఉందంట. అయినా రోజూ వెళ్లాలనిపిస్తుంది. నేను మామూలుగా అయితే ప్రొద్దున్నే నిద్రలేవను. నా ఫ్రెండ్ కోసం నిద్రలేస్తున్నాను. వాడితో అలా వెళ్ళొచ్చాను. కొద్దిగా అలవాటు చేశాడు కదా.. ఇప్పుడు టంచన్ గా మెలకువ వచ్చేస్తున్నది. ఒక్కోసారి అయితే నేను నిద్ర లేచాక, ఒక నిమిషానికి అలారం వస్తున్నది.
2. కొద్దిరోజులు అలా వెళ్లాను వాడితో. అక్కడ కొన్ని జంటలు కుటుంబాలతో సహా వస్తున్నారు. అది చూశాను. కొద్ది రోజులు వారిని గమనించాను. ఈరోజుల్లో ఒకే ఇంట్లో ఉన్నా, మాటలు కరువైన ఈ ఆధునిక కాలములో - వారు మాత్రం మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, అన్నీ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. వారి ఆహ్లాదాన్ని చూస్తుంటే నాకు బాగా ఈర్ష్య కలిగింది. అది ఎంతగా అంటే - నా ఫ్రెండ్ ని వదిలేసి, మా ఆవిడతో అలా వెళ్ళేంతగా. పాపం! నా స్నేహితుడు.. వాడిని దూరం చేశానని మొదట్లో అనుకున్నా అతనూ సర్దుకపోయాడు.. నాకూ బాధగా ఉన్నా - నాకు ఒక మంచి అలవాటు చేశాడు. నేను వాడికి బండి నేర్పించి, వాడి జీవితానికి మంచి అలవాటు చేసినట్లే, వాడూ నాకు ఇది అలవాటు చేసి, అందమైన, ఆరోగ్యకర అలవాటు చేశాడు. అలా ఋణం తీర్చేసుకున్నాడు అనుకుంటున్నాను.
3. ఒకప్పుడు రెండు చేతులతో రెండు నిండు గ్యాస్ సిలిండర్స్ అలా కొద్దిదూరం పట్టుకెళ్ళేవాడిని.. ( నిజమండి బాబు! ) అలా వెళ్లక ముందు - రెండు చేతులతో పదికిలోల బరువు మోసే స్థితిలో లేనంతగా అయాను. ( ఇదీ అక్షరాల నిజమే! ) కేవలం వాకింగ్ చేస్తేనే - ఇప్పుడు కాస్త శరీరం గట్టిగా అయ్యింది. ఇంకా ఏమీ వ్యాయామం లేదు. జబ్బలు పెరిగాయి. చేతులు మంచి ఆకర్షణీయముగా మారాయి. శరీరం ఒక చక్కని ఆకృతికి మారసాగింది. పొట్ట కాస్త తగ్గింది. ఆయాసం, మానసిక ఒత్తిడీ.. వంటి వంట్లోని శత్రువులు తగ్గుతున్నాయి. ఇదొక శుభ పరిణామం.
4. టీ షర్ట్ గానీ కుర్తా గానీ వేసుకుంటే ఒకప్పుడు బాగా అనిపించేవి కావు. ఒకప్పుడు బాగా లోపలికి వెళ్ళి, ఇప్పుడు గుండె మీద కండ కాస్త ముందుకి వచ్చేసి, అవి వేసుకుంటే కాస్త ఆకర్షణీయముగా కనిపిస్తున్నాను. అలాగే నాలో వయసు తగ్గినట్లుగా, మోములో కాసింత ప్రశాంతముగా, కుర్రవాడిలా ఉన్నాను అని ఒక మెచ్చుకోలు. సంవత్సర కాలం తరవాత చూసిన నా నేస్తం ఒకరు ఈ విషయాన్ని చెప్పారు.
5. మొన్న మొన్నటివరకూ మినరల్ వాటర్ బబుల్ ని రెండు చేతులారా లేపాల్సి వచ్చేది. ఇప్పుడు ఒకే చేతితో మోసేస్తున్నాను. అంటే చాలా ఇంప్రూవ్ అయ్యాను అన్నమాటే కదా.. ఇంకా జిమ్ములూ, కసరత్తులూ అంటూ మొదలు ఏమీ లేవు.. వాకింగ్ తప్ప. అవీ చేస్తే ఇంకా ఆకర్షణీయంగా కనిపిస్తానేమో!.
6. మొహములో ఏదో తెలీని ఆందోళన నాలో ఉండేది అంట. ఇప్పుడు అలా లేదు.. మరీ అంతగా కాకున్నా కాసింత ప్రశాంతముగా ఉన్నాను - అంట. దానివల్ల కాస్త చిన్న వయస్సు వాడిలా కనిపిస్తున్నాను -ట. ఇది మాత్రం నాకు తెలీదు. ఎదుటివారు గమనించి చెప్పాలి.
7. నా మొహములో కాస్త గ్లో / అంతర్గత కాంతి / మెరుపు ప్రకాశవంతముగా ఉంది -ట. ఇది వారే చెప్పారు. జస్ట్ అలా మార్నింగ్ వెళ్ళితే ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు.
8. నేను వెళ్ళే దారిలో అన్నీ పెద్ద పెద్ద చెట్లే!.. అవన్నీ ఎప్పుడో ఇంగ్లీష్ వారు నాటినవి. ఊడలు దిగేశాయి. ఊరు బయలు ప్రదేశం. రహదారికి దూరముగా ఉండే ప్రదేశం. చాలా ప్రశాంతముగా ఉండే చోటు అది. పక్షుల కూజితాలు, పొగమంచు, ప్రశాంతమైన వాతావరణం.. ఓహ్!.. పగటి పూట మామూలుగా కనిపించే ఆ ప్రదేశం, ఆ వేకువ ఝామున మరోలా, అందముగా కనిపిస్తున్నది. ఇలా నాకు ఒక్కడికేనా?.. లేక అందరికీ నా?
9. వాకింగ్ లో శ్రమ తెలీకుండా ఉండేందుకై - మొబైల్ లోని ఉత్సాహపూరిత, మంచి పాటలని, ఒక ఫోల్డర్ లో వేసుకొని, నాకు మాత్రమే వినిపించేలా పెట్టేసుకొని, (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లాగా) హాయిగా నడక సాగిస్తున్నాను. దానివల్ల మాటలకి అంతరాయం లేకుండా, శ్రమ తెలీకుండా ఉంటున్నది.
10. నిర్ణీత సమయం కాగానే మొబైల్ లో ముందే ఫీడ్ చేసి పెట్టేసుకున్న అలారం రాగానే మరలి రావటం..
11. అన్నింటికన్నా - అలా ప్రొద్దున్నే జీవిత భాగస్వామితో అలా నడవటం చాలా బాగా నచ్చేసింది నాకు. వేరేవారు నడుస్తుంటే ఏమో అనుకునేవాడిని.. కానీ అందులోని లాభం ఏమిటో ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నది. అప్పుడే అక్కడే అన్నీ చర్చలు, లక్ష్యాలు, తప్పోప్పులూ, ఫన్నీ మాటలూ, వేరేవారి విషయాలు, చిలిపి విషయాలు.. ఇలా అన్నీ. నిజానికి అలా వాకింగ్ లో మాట్లాడుకోవద్దు. అయినా అప్పుడు మాట్లాడుకునే మాటలు బాగా విశ్లేషణాత్మకంగా ఉంటున్నాయి.
ఇంట్లో మాట్లాడిన దానికన్నా అప్పుడే, అక్కడే త్వరగా తెములుతున్నాయి.
12. ఇంకో జంటతో కలిస్తే, కాసేపు అలా మాట్లాడుకుంటే మరీ మరీ బాగుంటుంది.. జస్ట్ గెట్ టూ గెదర్ లా. అదొక మధురానుభూతిలా కూడా మారుతుంది. అలా వాకింగ్, వ్యాయామాలు అయ్యాక అలా కూర్చొని, శరీరం కూలింగ్ అవటానికి అలా ముచ్చట్లు పెట్టేసి, సరదాగా కాసేపు నవ్వుకుంటే - ఆహా! ఎంత బాగుంటుంది! ఆ అనుభూతులు వర్ణించ వీలు కాదు.
13. నాకైతే అలా నడిచి, వ్యాయామం చేసి, కాసేపు అలా నీరెండలో చలి కాచుకుంటూ కూర్చొని, అక్కడే ఎన్నెన్నో కబుర్లు చెప్పేసుకొని, వెంట తెచ్చేసుకున్న ఆరోజు దినపత్రికని చదువుకొంటూ, ఫ్లాస్కులో తెచ్చేసుకున్న కాసింత వేడి వేడి మసాలా టీ ని, ఊదుతూ త్రాగుతుంటే - నా సామిరంగా............................ అన్న ఊహ ఈ మధ్య దోబూచులాడుతుంది. ఆ కోరికని ఎప్పుడో తీర్చేసుకుంటాను కూడా.. ఇది చూసిన వాళ్ళందరికీ అసూయ రావాలి.
14. మేము వెళ్ళే దగ్గర రిటైర్ అయిన ఒక వయసు మళ్ళిన వృద్ధ జంట ఇలాగే చేస్తారు. వారే చుట్టుప్రక్కల వారిని ఏమాత్రం లక్ష్యపెట్టకుండా, హాయిగా కుర్రజంటల కన్నా చాలా అన్యోన్యతని చూపిస్తారు. వారిని చూస్తే చాలా బాగా నచ్చుతారు నాకు. వారితో మాట్లాడాలని ఉంటుంది. కానీ పానకములో పుడకలా వెళ్ళి, డిస్టర్బ్ చెయ్యటం ఇష్టం లేక మాట్లాడలేదు.
15. అలా వచ్చేశాక, ఒక్కోసారి ఆ దారేమ్మట ఉన్న ఇరానీ హోటల్లో వేడిగా ఒక బన్నో, బిస్కెట్ గానీ , టిఫిన్ గానీ తినేసి, అటు నుండి అటే దగ్గరలోని మార్కెట్ కి వెళ్ళేసి, దగ్గరి ఊర్ల నుండి వచ్చే, చాలా తాజా తాజా కూరగాయలు (ఏసీ ఫ్రెష్ స్టాల్స్ లలో ఉండేవి కాదు సుమా!.. ) మొదటి బేరముగా కొనుక్కోచ్చేసుకొని, ఇక ఇంటికి తిరిగి రావటమే!.
16. ఇంతా చేస్తే నాకేదో అయ్యింది, అందుకే అలా వెళ్ళుతున్నాను.. అని మాత్రం కాదు లెండి.
చేతులు కాలాక ఆకులు కట్టుకోవటం ఎందుకూ అనీ, అంతా బాగున్నప్పుడే - బాగా అవ్వాలని కోరిక. పైసా పైసా జమ చేసి, డాక్టర్ కి టోకుగా అందించటం ఎందుకూ.. అనీ..
17. ఇలా వెళుతున్నాక నాలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తున్నది. నా జీవితం ఇతకు ముందు కన్నా ఇంకా బాగా అందముగా కనిపిస్తున్నది కూడా.
18. ఈ చలికాలం వ్యాయామానికి చాలా మంచి అనువైన సమయం. చాలా బాగా ప్రతిస్పందన చూపే కాలం కూడా.