Sunday, November 27, 2011

క్రొత్త తినటం

ఈరోజు రోజు బాగుందని " క్రొత్త " తిన్నాము.. ఇదేదో రుచికర పదార్ధం పేరో, మరేదో ఆహార వస్తువు కాదు లెండి. ఈతరం వారికి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చును. కానీ కాస్త పాతతరం వారికీ, ఇంకా సంప్రదాయాలు పాటిస్తున్న ఇళ్ళల్లో ఇంకా జరుపుకుంటూనే ఉన్నారు. ఈతరం వారికి కాస్త పరిచయం చెయ్యాలని ఈ టపా వ్రాస్తున్నాను..

అప్పట్లో ఇప్పుడు ఉన్నన్ని వైవిధ్య వృత్తులు ఉండేవి కావు. అప్పట్లో కొన్ని రకాల సాంప్రదాయ వృత్తులతో బాటూ వ్యవసాయం ఉండెడిది. చాలామందికి కాసింత వ్యవసాయం ఉండెడిది. ఒక పంట క్రొత్తగా వేశాక, అది పండి, ఇంటికి వచ్చేది. ఈ ధాన్యం మా పంట పొలాల్లో పండింది.. అని బాగా తాదాత్మత చెంది, ఆ పంటని బియ్యముగా మార్చుకొని, ఒక మంచి తిథి, నక్షత్రం చూసుకొని, ఆరోజు వండుకొని, ఆ పంటని తొలిసారిగా తినేడివారు.

నిజానికి ఈ క్రొత్త తినడం ఒక పెద్ద ఉత్సవం లా ఉండేది. ప్రొద్దున్నే ఇళ్ళు కడిగి, శుభ్రం చేసి, ద్వారానికి మామిడి తోరణాలూ కట్టేడివారు. ఆ తరవాత పూలదండలతో అందముగా అలంకరించి, ఒక ఇంట్లో శుభకార్యం జరుతున్నదా.. అనేలా చేసెడివారు. ఇంట్లోని దేవుడి గుడికి కాసింత సున్నమూ, ఎర్రని జాజూ పూసి (ఇప్పట్లో పెయింట్లు వచ్చాయి కానీ, అప్పట్లో అవే పెయింట్లు ) దేవుని గూడు అలంకరించేడి వారు. ఆ తరవాత ఆ క్రొత్త బియ్యముతో అన్నం వండేసి, అలాగే కూరగాయలు కూడా వండేవారు. అన్నం అయితే చేతికి మెత్తగా, బంకగా అతుక్కపోయేది.. అయినా నోట్లో ముద్దలు పెట్టుకుంటే - గబా గబా జారిపోతుంది. ఆరోజు మార్కెట్లో లభ్యమయ్యే ప్రతి కూరగాయనీ వండేవారు. ముఖ్యముగా ఈరోజుల్లో అందరూ మరచిపోయిన గుమ్మడి కాయ కి ఆరోజు తప్పనిసరి. దానితో గుమ్మడికాయ కూర చేస్తారు. ఇది కూరగాయల్లో అతి ముఖ్యమైన వంటకం. ఇంకా పచ్చళ్ళూ, పొడులూ, వడియాలు, రసం, పెరుగూ... ఇవన్నీ అన్నీ ఉంటాయి..

అలాగే ఆ నూతన బియ్యముతో " పరమాన్నం " కూడా చేస్తారు. నూతన బియ్యముతో స్వీట్ లా చేస్తారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. క్రొత్త బియ్యం ఇంత రుచిగా ఉంటుందా? అనేలా చేస్తారు. ఆపిమ్మట ఇవన్నీ దేవుడు ముందు పెట్టి, చిన్నగా పూజ చేసి, వాయనం ఇచ్చి, మీ సహాయం వల్ల ఈ పంటని ఈరోజు భోజనం గా స్వీకరిస్తున్నాను.. అని మోకరిల్లి, మొదట ఒక విస్తరిలో దేవునికి మొదటి భోజనం పెడతారు. ఆ తరవాత ఆ ఇంటిల్లిపాదీ వారు ఆరగిస్తారు. వారితో బాటుగా తెలిసిన వారినీ అతిధులుగా ఆహ్వానించేడి వారు. అతిధులు లేకుండా క్రొత్త తినడం అయ్యేది కాదు..

ఒకవేళ అతిధులు రావటం ఆలస్యం అయితే వారికోసం ఆగేడివారు. లేదా వారు ఎవరినైనా తమ తరపున పంపితే వారితో కానిచ్చేస్తారు. పిల్లలు అయితే ఆరోజు స్కూల్ బంద్. ఏంట్రా! నిన్న స్కూల్ కి రాలేదు.. అని మేష్టారు అడిగితే - నిన్న క్రొత్త తిన్నాం సార్ అనెడివారు. మేష్టార్లు కూడా ఏమీ అనేదివారు కాదు. ఒక్కమాటలో చెప్పాలంటే - పంచభక్ష్య పరమాన్నాలతో, అన్ని లభ్యమయ్యే కూరగాయలతో, కడుపారా తినేసేరోజు అది. ఆరోజు వచ్చే భుక్తాయాసం చెప్పనవసరం లేదు..

ఇదంతా నా చిన్నప్పుడు జరిగేది.. అప్పుడు ఆర్థికముగా అందరూ అంతంత ఉన్నా బాగా శ్రద్ధగా జరుపుకునేవారు. కానీ ఈరోజుల్లో అన్నీ ఉన్నా,జరుపుకోవటానికి ఆసక్తి లేదు.. నేనూ పైన చెప్పిన దాంట్లో సగం కన్నా ఎక్కువే - ఈరోజు చేసుకున్నాము. 

6 comments:

వనజ వనమాలి said...

విషయం పాతది. మీరు చెప్పడం క్రొత్తగా ఉంది. మొత్తానికి అప్పుడే క్రొత్త పంట ..రుచి చూసారు. బాగుందండీ!!!

Ravi Khandavilly said...

Ours is also agriculture based brought up; but never had this done in our home any time. Nice to hear this festival about.

Raj said...

హా!.. అవునండీ.. ఈరోజే కానిచ్చేశాం.. ఆ అనుభూతులు మీతో పంచుకోవాలని ఇలా బ్లాగస్థం (గ్రంధస్థం లా)చేశాను. కృతజ్ఞతలు వనజ గారూ.

Raj said...

అవునండీ.. మా తాతలూ, మా నాన్న కొద్ది కాలం వ్యవసాయం చేశారు. ఆ మూలాలు అప్పుడప్పుడు అలా నాలో నుండి తొంగి చూస్తుంటాయి. రవి గారూ! మీకు కృతజ్ఞతలు.

కృష్ణప్రియ said...

ఇలాంటిది ఒకటుంటుందని ఇదే మొదలు. Interesting!

Raj said...

ఈ క్రొత్త తినడం అనేది ఎప్పటి నుండో ఉందండీ.. కానీ ఆధునిక పరిస్థితుల్లో, సమయమూ వీలులేక సాంప్రదాయాలు అన్నీ మరచిపోతున్నాము.. మరొక్కమారు గుర్తు చేసుకోవటానికి ఆ పోస్ట్ వ్రాశాను.

Related Posts with Thumbnails