Sunday, March 21, 2010

పాస్ వర్డ్ రక్షణ

పాస్ వర్డ్ రక్షణ:

మనం చాలా వెబ్ సైట్లలోకి వెళ్ళినప్పుడు లాగిన్ అవటానికి రిజిస్టర్ చేసుకోమని అడుగుతారు. మనం మన మెయిల్ ID తో, మన పాస్ వర్డ్ తో ఎంటర్ అయి.. ఆ అకౌంట్ ని తెరుస్తాము. ఆ తర్వాత ఆ సైటుని, ఆ పాస్ వర్డ్ సంగతీ మరిచిపోతాము. ఇది మనలో చాలా మందికి జరిగే అనుభవమే! ఇలా ప్రతివారూ ఇలా లాగిన్ అవటానికి వాడిన పాస్ వర్డ్ ని గుర్తుపెట్టుకోవటానికి ఒక చిన్ని సహాయం మీకు చేయదలచుకున్నాను.

ఇప్పుడు మీరు క్రొత్తగా ఏదైనా పాస్వర్డ్ గా గుర్తుపెట్టుకొని, దాన్ని మీరు ఆయా సైట్ల లోకి వెల్లుటకి వాడదలచుకుంటే ముందుగా మీరు అందులో వాడబోయే మెయిల్ ID క్రొత్తది ఏర్పాటు చేసినా సరే! లేదా మీరు వాడుతున్న మెయిల్ ID గానీ ఇచ్చినా సరే... కాని మీరు ఆ మెయిల్ ID కి ఉన్న పాస్ వర్డ్ మాత్రం అక్కడ ఎట్టిపరిస్థితిలోనూ వాడకూడదు. పాస్ వర్డ్ మాత్రం మార్చాలి. అంటే పాస్ వర్డ్ ని మాత్రం క్రొత్తగా పెట్టాలి. మరచిపోయి పాతదే వాడారా.. మీ మెయిల్ బాక్స్ వారిచేతిలో ఉందన్నమాటే! అంటే అప్పుడు వారు
  • మీ మెయిల్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న మీ పర్సనల్స్ చూడొచ్చు,
  • ఫోటోలు కాపీ చేసుకోవచ్చు.
  • మీ బాంక్ అక్కౌంట్ వివరాలు అందులో ఏమైనా ఉంటే అదీ చూడొచ్చు.
  • మీ రహస్యాలన్నీ విశ్వవ్యాప్తం చేయొచ్చు.  
  • ఇంకా మీరు గిట్టకుంటే - మీ మెయిల్ బాక్స్ లోని అన్ని మెయిల్లూ, కాంటాక్ట్ ID లూ డిలీట్ చేసేయొచ్చు..
  • మీ మెయిల్ ID తో అందరికీ చెడ్డ బూతు బొమ్మలు పంపొచ్చు...
మీరు క్రొత్త పాస్ వర్డ్ లని ఎలా తయారుచేసి, ఎలా గుర్తుంచుకోవాలో ఇప్పుడు కొన్ని చిట్కాలు:

"నాకు ఇద్దరు అన్నయ్యలు: శేఖర్ మరియు రాజ్" (I have 2 brothers: Shekhar and Raj) అనే ఉందనుకోండి. ఇప్పుడు ఈ వాక్యములోని మొదటి అక్షరాలని ఉపయోగించి, పాస్వర్డ్ తయారు చేద్దామా? అలా చేస్తే Ih2b:S&R అని వస్తుంది కదూ.. ఈ పాస్వర్డ్ కనీసం ఊహించగలమా.. ఎవరెంత ఆలోచించినా కాస్త కూడా తెలుసుకోలేము. ఒకవేళ ఇది తెలిసినా కేపిటల్, స్మాల్ లెటర్స్ టైప్ చేయక పోతే సైటు ఓపెన్ కాదు. అలా అలోచించి చేసినా మధ్యలో వాడిన : , & లని అసలు ఊహించలేరు.
ఇలాంటిదే ఇంకోటి: Bouncing tigers have every right to ice-cream: Bther2I-C.

నాకు తెలిసీ ఇప్పుడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానము వల్ల
  • ఆరు అక్షరాల పాస్వర్డ్ ని రెండున్నర గంటల్లో, 
  • ఏడు అక్షరాల పాస్వర్డ్ ని వారం రోజుల్లో,
  • ఎనిమిది అక్షరాల పాస్వర్డ్ ని మూడున్నర సంవత్సరాలలో 
తెలుసుకోగలము -అట.. అదీ పాస్వర్డ్ బ్రేకర్ల సహాయముతో. అందుకే ఇప్పుడే జాగ్రత్తగా ఉండండి.
మీ మెయిల్ ID వ్రాసాక పాస్వర్డ్ లో మీ స్వంత వివరాలు మాత్రం అసలు ఉంచకండి. అంటే మీ పొడవూ, మీరుండే వీధి పేరు, మీ ఊరిపేరు, మీ ఫోన్ నంబరు, లేదా మీ ఇంటి లాండ్ ఫోన్ నంబరూ, మీ తల్లితండ్రుల పేర్లూ, మీ తోబుట్టువుల పేర్లూ..  అలాంటివేవీ ఉంచకండి. మీ మిత్రులు వాటిని తేలికగా ఊహించగలరు. అలాగే ఒక వాక్యములోని మొదటి అక్షరాలన్నీ స్మాల్ లెటర్స్ వి ఎంచుకోవద్దు. ఉదాహరణకి: I like eating a mango with ice cream అని ఉందనుకోండి ఇప్పుడు పాస్వర్డ్ గా ileamwic గా అవుతుంది. ఇలాంటివీ మంచిది కాదు.

ఇప్పుడు మీరు చేయాల్సినవీ, చేయకూడనివి ::  
Do:
  • పెద్దా చిన్న అక్షరాలు కలిపి, సింబల్స్ సంఖ్యలూ కలిపిగానో, లేదా ఇవన్నీ కలిపిగానో పాస్వర్డ్ చేసుకుంటే మరీ మంచిది.
  • పాస్ వర్డ్ పెద్దగా ఉంటేనే మంచిది. కనీసం ఆరు అక్షరాల కన్నా పెద్దగా ఉండాలి. 
  • మీ పాస్వర్డ్ ని కనీసం అరవై రోజులకి ఒకసారి మార్చండి. ఉన్న పాస్వర్డ్ నే గుర్తుంచుకునేలా క్రొద్దిగా మార్చండి. అంటే పెద్ద అక్షరాలు చిన్నవిగానో, చిన్నవి పెద్దవిగానో, మొత్తం పదాన్నే తిరగేసి వ్రాయటమో.. ఇలాగన్న మాట! 
  • మీ పాస్వర్డ్ లోని కొన్నింటిని నైనా కాపీ మరియు పేస్ట్ పద్దతిలో ఎంటర్ చేస్తే - కీ లాగర్స్ అనే మీరు పాస్వర్డ్ టైప్ చేస్తున్నప్పుడు నొక్కే కీ స్ట్రోక్స్ అప్లికేషన్ ని తప్పించుకోవచ్చు. కీ లాగర్స్ చేసే పని ఏమిటంటే - మీరు నొక్కే ప్రతి కీ తాలూకు వివరాలు అన్నీ అవతలివారికి నెట్ ద్వారా అందిస్తాయి. ఈ కీ లాగర్స్ JPEG ఫోటో బొమ్మల రూపములో గానీ, టెంపరరీ ఫైల్స్ లో గానీ మీ సిస్టంలో తిష్ట వేసుకొని కూర్చుంటాయి.    
Don't:

  • పదాలుగానీ, వాక్యాలు కానీ, మీకు సంబంధించిన అంకెలుగానీ వాడకూడదు. పుట్టినరోజులనీ, మీ ఫోన్ నంబర్లనీ వాడితే తేలికగా మీ పాస్వర్డ్ ని గుర్తుపట్టవచ్చు. 
  • మీ పాస్వర్డ్ మేనేజ్ లిస్టులో కూడా వ్రాయకండి. అందునా కంప్యూటర్ లో ఉన్న ఏ పేజిలోనైనా అసలే వ్రాయకూడదు.
  • అన్ని సైట్ల లాగిన్ కోసమని ఒకే పాస్వర్డ్ ని వాడకండి.. ముఖ్యముగా మీ సున్నితమైన వ్యక్తిగత సంబంధమైన సైట్లలో గాని, ఆర్ధిక లావాదేవి సైట్లలో గాని అసలే వాడకండి.
  • మీ పాస్వర్డ్ ని ఎవరికీ చెప్పకండి. వారికి ఏ విధముగానూ తెలియనివ్వకండి.  
  • ఏదైనా వెబ్సైట్లలో మీ మెయిల్ ID కి పాస్వర్డ్ ఇమ్మన్నప్పుడు వేరేది ఏదైనా పెట్టండి. పర్సనల్ పాస్వర్డ్ మాత్రం ఎవరికీ ఇవ్వకండి.

1 comment:

Anonymous said...

Very Valuable Information. Thank You.

Related Posts with Thumbnails