డిసెంబర్ చివరి నెలలో అనుకుంటా!.. గడ్డం గీసుకుంటున్నప్పుడు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఆహా ఎంత బాగుంటుంది అని మనసు సంతోషముతో గెంతులాడింది. పాపం రేజర్ కి తెలీదుగా.. ఒక చిన్ని గాటు పెట్టింది. అసలు ఆ ఆలోచన వర్కవుట్ అవుతుందా? అనిపించింది. నాతో కాదేమో!! అనుకున్నాను.. ఒకసారి చేసి చూద్దాం అనుకున్నాను.. "ప్రయత్నం పురుష లక్షణం" అనుకుంటూ జై మాతాదీ.. అంటూ క్రొత్త సంవత్సరము లో మొదలెట్టాను. ఈ జనవరి అంతా చూద్దాం అనుకున్నాను.
ఇంతకీ అసలు ఆలోచన చెప్పలేదు గదూ! అయ్యో! నా మతి చెడ..
మరేమీ లేదండీ! బార్బర్ షాపుకెళ్ళి గడ్డం గీయించుకుంటామా.. అలా చేసుకోక ఇంట్లోనే చేసుకొని, అక్కడ ఇచ్చే డబ్బులని పొదుపుచేసి, దేనికైనా సత్కార్యక్రమాలకి వాడితే అనే ఆలోచన. నవ్వొస్తుందా.. మొదట్లో నాకూ అలాగే వచ్చిందండీ! సరదాగా ఉంటుంది అనుకొని ఈ జనవరి ఒకటి నుండి మొదలెట్టాను. నిష్ఠగా ఆచరించాను. గడ్డం చేసుకున్న ప్రతిసారీ డబ్బులు ఒక డబ్బాలో వేసేవాడిని. (నవ్వొస్తుంది కదూ) మా ఇంట్లో అలాగే నవ్వారు. అయినా ఫీలవక "నవ్వితే నాకేమిటి సిగ్గు.." అనుకొని అలా చేసుకున్న ప్రతిసారీ అలా వేస్తూ పోయాను. మా దగ్గర గడ్డానికి సెలూన్లలో ఇరవై రూపాయలు తీసుకుంటారు. బండేసుకొని వెల్లినందులకి ఆవో ఐదు రూపాయల పెట్రోలు ఖర్చు. మొత్తం ఇరవై ఐదు రూపాయలు అన్నమాట!
అలా జనవరి నెలలో గడ్డం గీసుకున్న ప్రతిసారీ డబ్బులు ఆ హుండీ లో వేయటం జరిగింది. మధ్యలో చిల్లర అవసరం వచ్చినా, చేబదులు కావాలన్నా నా శ్రీమతి, పిల్లలు దాట్లోంచి తీయటం మొదలెట్టారు. హమ్మో! లెక్క తెలిసేలా లేదని వాళ్లకి తెలియకుండా దాచేసాను. అలా చాలా కష్టపడి జనవరి అంతా జమ చేసాను. చివరికి జనవరి నెల అయిపోయి ఫిబ్రవరీ వచ్చేసింది. హమ్మయ్య! అనుకుంటూ ఆ నిధిని మహాభాగ్యము అనుకుంటూ సంతోషముగా తెరచి చూసాను. డబ్బులన్నీ లెక్కించాను.
మొత్తం మూడువందల రూపాయలు. ( నెలకి పన్నెండుసార్లు చేసుకున్నట్లున్నాను @ ఇరవై ఐదు ) వామ్మో! ఆఫ్ట్రాల్ గడ్డానికే ఇంత మిగులా.. ఈ డబ్బులతో ఏమి చెయ్యాలో ఇంకా నిర్ణయించుకోలేదు. ఇందులో పెట్టుబడి క్రింద బ్లేడులకీ, షేవింగ్ క్రీముకీ ముప్పై రూపాయలు ప్రక్కన పెట్టాలి. మిగతావి మిగిలినవి రెండువందలా డెబ్బై రూపాయలు. ఇవి ప్రస్తుతం ఇలానే ఉంచుతాను. ఇక ఫేసియల్, కలరింగ్, మేనిక్యూర్, పెడిక్యూర్.. లాంటివి ఇంట్లో (అంటే మనకి అందదు కాబట్టి శ్రీమతితో) చేయించుకుంటే ఇంకెంత మిగులుతుందో చూడాలి. అలా ఆలోచిస్తుంటే బాగానే మిగిలేలా ఉంది. పైగా అందమైన వారితో ఆ పనిచేయించుకుంటున్నామన్న ఆనందం ఉంటుంది.. (మనలో మన మాట)పనిలో పనిగా మాంచి రొమాన్సూ ఉంటుంది. ట్రై చేయాలి.
Thursday, February 4, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment