Sunday, February 14, 2010

రంగు రంగుల (ను అద్దిన) మాయాబజార్

మాయాబజార్ - తెలుగు చలన చిత్ర రంగములో విరబూసిన ఆణిముత్యాల్లో ఇదొకటి. అప్పుడెప్పుడో నేను చిన్నప్పుడు, నిక్కర్లు  వేసుకొనే వయస్సులో ఈ సినిమా చూసాను. అప్పుడు రేకులు వేసి డబ్బా లాంటి (శ్రీనివాస) టాకీసులో, ఇరవై ఐదు పైసల టికేట్టుతో తెర ముందు నేల క్లాసులో, ఇసుక పోసి ఉన్న స్థలములో కూర్చొని, ఫ్యానులేవీ లేని కాలములో మొదటిసారిగా ఈ నలుపుతెలుపు వర్ణాల మాయాబజార్ సినిమా చూసాను. అప్పుడు నేను నాలుగో, ఐదో క్లాసులో ఉండొచ్చు. మరి ఇప్పుడో..

అధునాతన డిటిఎస్ సిస్టం గల టాకీసులో, డిటిఎస్ సౌండ్ తో, రంగు రంగుల (ను అద్దిన) మాయాబజార్ సినిమాను చల్లని ఎసి లో కపుల్ సీట్లలో కూర్చొని, మరోసారి ఆ మధురమైన సినిమాని ఆస్వాదించాను. కలర్ వర్క్, మరియు శబ్ద గ్రహణం చాలా బాగా పునరుద్దరించి బాగా సొబగులద్దారు. నిజముగా ఈ రంగుల  మాయాబజార్ ని చూసాక ఒక చక్కటి చిత్రాన్ని, మదిలో మరచిపోతున్న తరుణములో పునశ్చరణ చేసుకున్నట్లుగా చూసినట్లయ్యింది.

చిన్నప్పుడు అంటే తెలియలేదు గానీ, ఇప్పుడు కొంత ఎదిగిన తరవాత ఈ సినిమాలో గొప్పదనం ఏమిటో తెలుస్తున్నది. అసలు ఎన్నని చెప్పను.. శ్రీకృష్ణుడి చిరునవ్వు అంటే ఏమిటో ఎలా ఉంటుందో, శ్రీకృష్ణుడి మాయలూ దూరదృష్టి, పాండవులు ఒక్క సీనులో లేకుండానే వారి కథని అన్యాపదేశముగా చెప్పటం, ద్రౌపది మానసంరక్షణ ఘట్టాన్ని చిటికె సేపట్లో అర్థం చేసి లాఘవముగా అక్కడ నుండి కథని మళ్ళించడం, అప్పటి కుటుంబ కలహాలు ఇప్పటికీ సజీవముగా ఉన్నట్లు, ఆస్థులు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలాగా ఉండే ప్రస్తుతకాల పరిస్థితిని దర్శకులు ఇందులో అప్పట్లోనే చక్కగా చెప్పారు. అందరూ గొప్పగా చేసారు.

నటులు తమ తమ కీర్తి, కళని చిరస్థాయిగా ఉండాలని - జీవించారనిపిస్తుంది. ఎవరిని తక్కువ చేసి చెప్పటం కాదుగానీ, సావిత్రి గారయితే పరకాయ ప్రవేశం విద్య వచ్చినట్లుగా అమోఘముగా ఎస్వీ రంగారావు గారిని.. క్షమించాలి ఘటోఘజున్ని అనుసరించారు. లక్ష్మణ కుమారులని ఓ ఆట ఆడించినప్పుడయితే అబ్బో!.. నేను వ్రాయలేను.. చూసి తరించాలి. ఇక ఎస్వీ రంగారావు అయితే ఇలాంటి పాత్రలయితే కొట్టిన పిండి అన్నట్లు చేసారు. ఇక లక్ష్మణ కుమారుల పాత్రలో రేలంగి గారి హావభావాలూ అదూర్స్! ముఖ్యముగా సావిత్రి గారితో వచ్చిన సీనులలో ఆయన నటన నభూతో నభవిష్యతి. ఇక ఘంటసాల గారి సంగీతం, పాటలూ, మార్కస్ బాట్లే చాయాగ్రహణం.. ఓహ్!.. లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట ఘంటసాల గారు మూడు గొంతుకలలో పాడటం, మార్కస్ బాట్లే ఈ పాటని మిట్టమధ్యాహ్నం తీసి, అది పండువెన్నెల్లో తీసినట్లుగా చూపించటం.. ట్రిక్ ఫోటోగ్రఫీ ని పెట్టి అప్పట్లోనే అంటే 1952లో గ్రాఫిక్స్ లేని కాలములో సావిత్రిగారిని ఒక సన్నివేశములో ఇద్దరినిగా (double)చూపించటం.. పాత్రలు, చెప్పులు కదలటం, లడ్డూలు ఎగరటం.. ఓహ్! ఇలా ఎన్నని చెప్పను. దర్శక ప్రతిభ కూడా అనన్య సామాన్యం. సుభద్ర ఏడ్చినప్పుడు ఆవిడ కన్నీరు పయ్యెదపై పడి, అది తడిచినట్లు చూపించి పరోక్షముగా ఆవిడ ఎంతగా బాధపడిందో చూపెట్టారు. ఘటోద్ఘచుడు వంటశాలకి వచ్చినప్పుడు వంటకాలు ఆవిరి వస్తునట్లుగా చూపటం.. చిన్న చిన్న లోపాలు రాకుండా ఎంత జాగ్రత్త పడ్డారో తెలియజేస్తున్నది.

No comments:

Related Posts with Thumbnails