Sunday, February 17, 2019

Ink pen



నాకున్న జ్ఞాపకాల్లో ఇదీ ఒకటి. ఈ ఫోటో నాకు గూగుల్ వారి ఫొటోస్ లలో దొరికింది. నాకున్న జ్ఞాపకాలని మీతో పంచుకోవాలని ఈ పోస్ట్.

పైన ఫోటోలో ఉన్నది ఒక పెన్. పెన్ అంటే ఇప్పటిలా వాడే జెల్ మరియు బాల్ పాయింట్ పెన్ కాదు. ఇంక్ / సిరా / శాయి పెన్. శాయి అంటే సిరా అని మరొక పేరు. పల్లెటూరి జనాలు ఎక్కువగా ఈ పదాన్ని వాడేవాళ్ళు. ఇప్పటి తరం వాళ్ళకి ఆ పెన్ గురించి అస్సలే తెలియదు. వారికోసం అని ఈ పోస్ట్. ఆ పెన్నులో రిఫిల్ అంటూ ఉండేది కాదు. పైన ఉన్న స్టీల్ క్యాప్ ని తీస్తే, క్రిందన ఒక చివర పాళీ / Nib ఉన్న పెన్ను ఉండేది. దాన్ని పట్టుకునే దగ్గర - రెండు చివర్లో గట్టిగా వ్యతిరేక దిశల్లో త్రిప్పితే - లోపల ఒక గొట్టం లాగా కనిపించేది. అందులో ద్రవరూపంలో ఉండే సిరాని / ఇంకుని జాగ్రత్తగా పోసేడి వాళ్ళం. అలా పోశాక మూతని బిగించి, ఒకసారి విదిలించి, ఇక వ్రాత పని మొదలెట్టే వాళ్ళం.

పైన ఉన్న పెన్ రెండు మోడల్స్ లలో దొరికేది. అప్పట్లో ఆ పెన్ రూపాయికి మరియు రూపాయిన్నరకి ( Rs.1.50 )  వచ్చేది. ఈ రూపాయి పెన్ లో ఆ పెన్ లో సిరా ఎంత ఉందో చూసుకోనేలా ఒక పారదర్శక ప్లాస్టిక్ ( Transparent ) భాగం ఉండేది. అందులోంచి ఆ పెన్ లో ఉన్న సిరా చక్కగా అగుపించించేది. దానివలన ఆ సిరా వల్ల మనం ఎంతగా వ్రాసుకొనే వాళ్ళమో ఒక అంచనాకి వచ్చే వాళ్ళం.



ఇక రూపాయిన్నర ఖరీదు పెన్ లో ఈ ట్రాన్స్ప రెంట్ ప్లాస్టిక్ భాగంతో పాటూ - ఆ బుడ్డి వెనకాల ఒక ఇంకు పిల్లర్ లాంటి ఆకారంలో ఒక రబ్బరు తిత్తి ఉండేది. పెన్ పాళీని సిరా బుడ్డిలో ఉంచి, వెనకాల ఉన్న ఈ తిత్తిని నొక్కితే - ఆ పెన్ లో ఉన్న గాలి బయటకి వెళ్ళిపోయి, ఆ తిత్తి సరి అయ్యే క్రమంలో ఆ పెన్ లోకి ఇంకు నీ పీల్చేది.( Sucking ) అలా ఆ పెన్ లోకి సిరాని నింపడం చాలా తేలిక అయ్యేది. కాస్త స్థోమత గల వాళ్ళందరూ వీటినే ఎక్కువగా వాడేవాళ్ళు. అప్పట్లో ఈ ఇంకు ని చేతి క్రింది పని వారే నింపి, పెన్ ని వ్రాత పనికి సిద్ధముగా ఉంచే వాళ్ళు. ఈ పెన్ మాడల్ రాక ముందు పెన్ లోకి నేరుగా సిరా బుడ్డితో సిరాని వంపుతూ... కారి చేతులూ, పేపర్లూ, నోట్సూ, టేబులూ, నేలా, వేసుకున్న దుస్తులూ.. పాడయ్యేవి. అలాంటి ఇబ్బందిని ఈ పెన్ తొలగించింది. ఇలాంటి సిస్టం ఉన్నమరొక పెన్ - Hero పెన్. ఇది చైనా తయారీ. దీని గురించి ఇంకో టపాలో తెలుసుకుందాం.

ఈ పెన్ కి పాళీలు మొదట్లో బంగారు వర్ణములో వచ్చేవి. వీటి ప్రభావం చివరల్లో స్టీలు రంగులో కూడా వచ్చాయి. ఇవి ఇదు పైసల నుండి పావలా వరకు ఉండేవి. అప్పట్లో ఈ పాళీలని ( NIB ) పత్తీలని అని కూడా అనేవాళ్ళు. దానితో ఈ పెన్ లని పత్తి పెన్ లని అనేవాళ్ళు. ఈ పత్తికి / పాళీ కి చివరన ఒక పాయింట్ ఉండేది. కాస్త లావుగా వ్రాయాలంటే పాళీ ని గట్టిగా వత్తితే ముందు భాగం కాస్త సందు వచ్చి, కాస్త లావుగా వ్రాసేది. ఒక్కోసారి ఇలా వత్తితే పెన్ పాళీ విరిగేది కూడా. పెన్ క్రిందన పడ్డప్పుడు కూడా పెన్ ములికి ( పాళీ ) విరిగేది కూడా.

ఇక ఇంకు నింపాక వెంటనే వీటితో అంటే ఈ సిరా పెన్ లతో వ్రాయటం కష్టం అయ్యేది. అందుకు కారణం - ఆ సిరాలో కాస్త గాలి చేరి, ఆ గాలి బుడగ వ్రాసేటప్పుడు ఆ పాళీ లోకి వచ్చి, ఇంకు ని ప్రవహించనీయకుండా చేసేది. అంటే Air Lock / ఎయిర్ లాక్ అయ్యేది అన్నమాట. అలాంటి సమయాల్లో పెన్ ని విదిలించే వాళ్ళు. అప్పుడు ఆ సిరా ఆ ఎయిర్ / గాలిని తోసుకుంటూ వచ్చి, కాస్త బయటపడేది. ఇలా పడటం ఒక్కోసారి ఎదుటి వ్యక్తుల మీదో, బట్టల మీదో పడేది అన్నమాట. వీటి వల్ల ఇదొక ఇబ్బంది అన్నమాట.

పై ఇబ్బందిని తొలగించటానికి ఆ తరవాత కనుకున్నదే - ఇంకు పిల్లరు. ఇది ప్లాస్టిక్ తో చేసి, వెనకాల ఒక చిన్న గాలి బుడగ తిత్తి ఉండేది, దాని సహాయాన ముందు భాగాన్ని సిరా బుడ్డిలో ఉంచి, వెనకాల భాగాన్ని నొక్కితే అందులోని గాలి బయటకి పోయి, ఆ స్థానాన, ఇంకు చేరేది. అప్పుడు ఆ పిల్లరు లోని ఇంకుని పెన్నులోకి పెట్టి వత్తితే - ఆ ఇంకు పెన్ లోకి సురక్షితముగా వెళ్ళేది.

ఒక్కోసారి ఈ ఇంకు పిల్లర్ లేని స్థానంలో - సిరా బుడ్డి సహాయాన నేరుగా ఇంకు ని పోసి, అప్పుడు మూత కాస్తంత బిగించి, పెన్ ని నిలువుగా, పాళీ ని సిరా బుడ్డిలోకి వచ్చేలా నిలబెట్టి, పెన్ కి మూత బిగించే వాళ్ళు. అలా చేస్తే - ఆ పెన్ లోని గాలి మాయమై. ఎక్కువైన సిరా కూడా బయటకు వచ్చేది. ఈ క్రమంలో ఆ పెన్ సిరా కాలువ శుభ్రం అయ్యి, పెన్ సాఫీగా వ్రాసేది.

ఈ బిగించే కార్యక్రమం ఎక్కువగా చేతులతో అయ్యేది.. బలం సరిపోనప్పుడు - నోటిలోని పళ్ళతో బిగించి, తిప్పెడి వాళ్ళు. ఒక్కోసారి అప్పుడు సిరా కారి, నోరంతా సిరామయం అయ్యేది. ఆ పెన్ ని పక్కన పెట్టి, నోరుని పుక్కిలించి, కడిగేవాళ్ళు.

ఇవీ నా ఇంకు పెన్ జ్ఞాపకాలు.



No comments:

Related Posts with Thumbnails