Wednesday, December 5, 2018

చలికాలం - స్నానాలు

ఇది నా చిన్ననాటి జ్ఞాపకం. ఇప్పుడంటే గీజర్లు, వాటర్ హీటర్స్ వచ్చాయి కానీ - అప్పట్లో వేడి నీళ్ళు కావాలంటే కట్టెల పొయ్యి మీద రాగి, ఇత్తడి లేదా అల్యూమినియం పెట్టి, ఆ పాత్రల్లో నీరు పోసి, క్రిందన కట్టెలు, కొబ్బరి పీచు కానీ, పిడకలు కానీ పెట్టి, వాటిని కాసింత కిరసనాయిలుతో తడిపి, అగ్గిపుల్ల సహాయాన దాన్ని మండించే వాళ్ళం. ఆ వేడికి కాగిన నీళ్ళను స్నానాలకు వాడుకొనే వాళ్ళం. అప్పట్లో చాలామంది ఇళ్ళల్లో - చలికాలం వచ్చిందంటే ఇదే తంతు.. 

ఇక మరింత పెద్ద కుటుంబాలలో - వారి స్నానపు గదుల్లో కానీ, ఆరు బయట గానీ, పెరడుల్లో గానీ బాత్ రూమ్ ప్రక్కనే మూడు రాళ్ళు వేసి, వాటిల్లో కట్టెలను పేర్చి, వాటిని కిరసనాయిల్ తో వెలిగించి, పైన పెద్ద అండా / డేకిసా / బగోనే / కొప్పెర / పెద్ద పాత్రని ఉంచి నీరు వేడి చేసేవాళ్ళు. 

పై రెండింట్లో ప్రధాన ఇంధన వనరు - కట్టెలు. వీటిని ఒక వైపుగా సిద్ధం చేసుకొని ఉండేవాళ్ళు. వర్షాకాలంలో తడిచి / చూరు గుండా కారే నీటితో తడిచి / ఈదురు జల్లుల వల్ల / స్నానం నీరు చింది ఆ చెక్కలు నాని మంట సరిగా రాక - బాగా పొగ వచ్చేది. ఒక గొట్టాన / పైపు సహాయాన ఆ నిప్పుల మీదకు నోటితో ఊదుతూ మంటకు ప్రయత్నించే వాళ్ళు. ఈ తెల్లని పొగ వల్ల ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసినట్లుగా ఉండేది. సరిగా మండని కట్టెల వాసన దీనికి అదనం. 

ఇక ఆ వేడి నీటి పాత్రల బాహ్య రూపం అంతా ఆ పొగ వల్ల నల్లగా మసి / మురికి / మకిలి పట్టేది. వీటిని ఇంటివారో, పనివాళ్ళో కొబ్బరి పీచు / ఇసుక / పుల్లని చింతపండు రసం / మిగిలిపోయిన సాంబారు రసం / బూడిద ఇలా నానా పదార్థాలతో మెరిసేలా తోమి మళ్ళీ వాడేవాళ్ళు. ఆతర్వాత కొద్దిరోజుల వాడకంతో మళ్ళీ ఎప్పటిలా నల్లగా / జిడ్డుగా మారేది. అయిననూ విసుగు చెందక - మళ్ళీ మళ్ళీ శుభ్రం చేసుకుంటూ వాడేవాళ్ళు. ఇప్పుడైతే "ఇంత" శుభ్రం చేసి వాడుకొనే వాళ్ళు చాలా తక్కువనే చెప్పుకోవాలి. 

అప్పట్లో ఉమ్మడి కుటుంబాలు కాబట్టి నలుగురూ సాయం చేసేడి వాళ్ళు. స్నానానికి బోలెడంత క్యూ ఉండేది. ఇక పండుగలకూ, పబ్బాలకు తలంటి స్నానం వల్ల ఈ స్నాన కార్యక్రమం అంటే విసుగొచ్చేది. స్నానం చెయ్యకుండా ఇల్లంతా తిరుగుతుంటే - నాన్నేమో తిట్లతో తలంటే వారు. ఇక అమ్మేమో - ప్రొద్దునే తలంటి స్నానం చేసి, మడి అంటూ ఇల్లంతా తిరగనిచ్చే వారు కాదు.. ఆ బాధలు పడలేక ఏదో తొందరగా స్నానం కానిచ్చేసేవాళ్ళు. అప్పుడైనా స్నానానికని వేడి నీళ్ళు బాత్ రూమ్ లో పెట్టుకున్నామా - బావ గారనో, చుట్టాలో చేస్తారని ఆ పెట్టుకున్న వేడి నీళ్ళు కాస్తా వారికే వెళ్లిపోయేవి. మళ్ళీ నీరు వేడి చేసుకొని ... పోసుకొని స్నానం కానిచ్చేసేయ్యాల్సిందే. ఆ నీరు వేడెయ్యేదాకా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాల్సిందే. 

ఇహ ఇదంతా నాల్ల కాదనుకున్నవారు - ఊరిలో ఏదైనా చెరువో, వాగో, కుంటనో గానీ ఉంటే అక్కడికే వెళ్లి స్నానం చేసి వచ్చేవారు. నాకింకా జ్ఞాపకం. ఉమ్మడి కుటుంబాలలో - పండుగ పబ్బాలలో స్నానం అయ్యేలోపు, కాస్త తెలివిపరులు - సమీప పుణ్యక్షేత్రాలకు ఏదైనా బండి మీద వెళ్లి అక్కడ స్నానం.. దర్శనం చేసుకొని వచ్చేవారు. అప్పటికీ ఇంట్లో స్నానాలు పూర్తయ్యేవి కావు.. కారణం సరిగా మండని కట్టెలు, వేడి నీరు అయ్యే సమయం,  స్నానం చేసేవాళ్ళు బోలెడంత మంది క్యూలో ఉండటం.. ఇవీ ప్రధాన కారణాలు. 

ఈ వేడినీటితో స్నానాలు చేస్తామా - బయటకు వచ్చాక పెట్టే చలికి గజగజా వణుకుతూ ఉండేవాళ్ళం. నిజానికి చన్నీళ్ళ స్నానం ఎంతో మంచిది. కానీ ఈ చలికాలంలో ఆ మాటని ఒప్పుకోరు. 

ఇప్పటివాళ్ళకు / నేటితరం వాళ్లకు ఈ ఇబ్బందులు ఏమిటో తెలీవు. ఎంచక్కా గీజర్స్ వాడి ఇట్టే స్నానం చేసుకొని వచ్చేస్తారు. వారికి అప్పటికాలంలోని స్నానాలు అంటే ఏమిటో తెలియాలని ఈ టపా. 




No comments:

Related Posts with Thumbnails