Saturday, July 19, 2014

Orkut

ఆర్కుట్ 

ఈ ఆర్కుట్ అనే సోషల్ మీడియా సైట్ ఒకప్పుడు ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపింది. ఈ సైట్ క్రియేట్ చేసిన Orkut Büyükkökten దూరం అయిన తన గర్ల్ ఫ్రెండ్ ని తిరిగి పొందాలనుకొని, ఏర్పరిచిన ఈ సైట్ అందరినీ ఆకర్షించింది.  ఎందరెందరో ఈ సైట్ లో చేరారు. తమ తమ అనుభూతులనీ, భావాలనీ, భావోద్వేగాలనీ ప్రకటించుకున్నారు, పంచుకున్నారు కూడా. ఫేస్ బుక్ రాకతో ఆర్కుట్ ప్రాభవం తగ్గిపోయింది. అప్పుడూ ఇప్పుడూ ఆర్కుట్ సైట్ యొక్క వీక్షకులు ఆయా దేశాల వారిగా ఇలా ఉంది. 

నా మటుకు మాత్రం నేను ఈ సైట్ లో చాలా ఆలస్యముగా మొదలెట్టాను. 2008 లో ఈ సైట్ లోకి నా బంధు మితృల చలవ వల్ల అడుగుపెట్టాను. వారికోసం వచ్చిన నాకు ఈ సైట్ చాలా బాగా నచ్చేసింది. ఆ తరవాత ఎన్నెన్నో సైట్స్ వచ్చినా నాకు ఒకే ఒక సైట్ లో సభ్యత్వం ఉండాలని ( నాకున్న అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకూడదని ) దానిలోనే కొనసాగి, దాని ప్రాభవం తగ్గిపోయే వరకూ ( 2012 చివరి వరకూ ) ఉండిపోయాను. 

ఈ ఆర్కుట్ లో నాకు అనేకానేక అనుభవాలు. ఆన్లైన్ స్నేహాల ప్రపంచములో ఓనమాలు నేర్చుకుంటూ వెళ్ళిన నాకు - ఇదే బ్లాగ్ లో ఆన్లైన్ స్నేహాల గురించి వివరముగా వ్రాయటానికి ప్రేరణ, విషయం, సమాచారం, భావోద్వేగాలు, అనుభూతులు అన్నీ అక్కడ అనుభవాలే. ఎన్నెన్నో తీయని జ్ఞాపకాలు. అవన్నీ చెప్పాలంటే పోస్ట్స్ మీద పోస్ట్స్ వేసుకుంటూ వెళ్ళినా ఇంకా మిగిలే ఉంటాయవి. క్లుప్తముగా చెప్పాలీ అంటే - ఆ సైట్ లో చేరిక వల్ల నేను ఎంతో ఆనందాన్ని, అనుభూతులనీ, మధుర జ్ఞాపకాలనీ, చక్కని పరిచయాలనీ, నావాళ్ళు అని చెప్పుకోదగ్గ చక్కని స్నేహితుల్నీ, స్నేహితురాళ్ళనీ  పొందాను. ఎవరికేలా కనిపించినా నామటుకు మాత్రం నాకు అద్భుతమైన జ్ఞాపకాలు మిగిపోయాయి. అంటే ఆ సైట్లో చేరి నేను విజయం సాధించి, గొప్పనైన చక్కని జ్ఞాపకాలని మూటగట్టుకున్నానన్నమాట. ఇంతకన్నా విజయం ఏముంటుంది? నా జీవితాన చక్కని అనుభూతులు శాశ్వతాన మిగిలిపోయిన సమయం అది. ఇందులకు ఆ ఆర్కుట్ కి ఎంతగానో ఋణపడిపోయాను. ఆ ఋణాన్ని ఎలా తీర్చుకోగలనో !! అది ఈ జన్మకి తీర్చుకోనేమో.. 

అలాంటిది ఒక్కసారిగా ఇలా నా హోం పేజీ మీద కనిపించేసరికి షాక్ అయ్యాను. ఎక్కడో చిన్న బాధ. నా చుట్టూ ఉన్న సమాజానికి కాకుండా ఈ ప్రపంచములో ఎవరికీ తెలీకుండా ఉన్న నాకు అన్నీ అందించి, నన్ను ఈ లోకానికి పరిచయం చేసి, కాస్తో కూస్తో నాకంటూ ఒక ఆస్థిత్వం కలిగించిన ఆ సైట్ మూసేస్తున్నాం.. అని స్టేటస్ మెస్సేజ్ చూసి విచారానికి లోనయ్యాను. ఏదో ఆప్త మిత్రుడినీ కోల్పోతున్న భావన అది. 


ఆస్థిత్వం కోల్పోయినవన్నీ ఏదో ఒకప్పుడు కాలగర్భములో కలిసిపోక తప్పదు. పోలిక సరికాదేమో గానీ, నాకైతే ఎందుకో ఇది వ్రాస్తున్నప్పుడు టైటానిక్ సినిమాలోని జాక్ రోజ్ లు చివరిసారిగా విడిపోయే దృశ్యం కన్నుల ముందు మెదిలింది. పోల్చి చూస్తే మీకు నవ్వు రావోచ్చునేమో గానీ నా భావన అది. ఆ రోజ్ పాత్ర లా నాదనిపిస్తుంది ఇప్పుడు. ఆ జాక్ ( లియనార్డో డికాప్రియో ) సముద్ర గర్భములో కలిసిపోయే ఆ సందర్భాన్ని మరోమారు గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. కొన్నింటిని - అందునా మనసుకి నచ్చినవి దూరం అవుతుంటే - ఏమీ చెయ్యలేని నిస్సహాయత స్థితిలో ఉన్నప్పుడు అలాకాకుండా మరెలా ఉండగలం. బయటవారి భావొద్వేగం మరొకరికి వింతగా, పిచ్చిపనిలా తోచవచ్చు.. కానీ వారికోసమని మన భావోద్వేగాల్ని ఎలా ఆపుకోగలం. అందునా - మనకి ఆప్తుని విషయములో ? ఇంకా వుంది.. ఈ లింక్ లో చూడండి..

No comments:

Related Posts with Thumbnails