సమస్యలు అందరికీ ఉంటాయి.
వాటికి పరిష్కారం చూపడం విజేతల లక్ష్యం.
సాకులు వెదకడం సరికాదు.
పైగా సమస్యలు ఇంకా పెరుగుతాయి.
సమస్యలు అనేవి ఈ ప్రపంచములో అందరికీ, అన్ని ప్రాణులకీ ఉంటాయి.. కాదు కాదు ఉన్నాయి కూడా. అవి తప్పనిసరి. వాటినుండి ఎవరూ మినహాయింపు కాదు. అన్నీ వదిలేసి, హిమాలయాల్లో ముక్కుమూసుకొని, తపస్సు చేసుకొనే మునులకు కూడా తప్పదు. పుట్టిన క్షణం నుండీ ప్రారంభం అయ్యి, మరణించేవరకూ - ఒకదానివెంట మరొకటి వరుసపెట్టి ప్రతివాటికీ వస్తూనే ఉంటాయి. కాకపోతే సమస్యల్లో హెచ్చు తగ్గులు అనేవి వారి వారి స్థాయిని బట్టి ఉంటాయి. ఈ స్థాయి అనేది అనేకానేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది.
ప్రతి సమస్యకీ ఒక పరిష్కారం అంటూ ఒకటి ఉంటుంది. ఈ పరిష్కారం అనేది చప్పున కనిపించదు. సమస్య ఎదురవగానే బిత్తరపోయి, బెంబేలెత్తుతాం. ఈ పరిష్కారం కోసం ఎన్నెన్నో ఆలోచనలు చేస్తాం. కానీ కొన్నింటికి చప్పున సమాధానాలు దొరకవు. చదువుకునే రోజుల్లో ఎలా అయితే లెక్కల్లో లాగా ఆ సమస్యని అర్థం చేసుకొని, విడమర్చి, ఆలోచించి, ఆ లెక్క యొక్క సమాధానాన్ని సాధిస్తామో - ఇక్కడ కూడా అలాగే సాధించవచ్చు. వినటానికి తేలికగా ఉన్నా - ఈ పాఠం చిన్నప్పుడే మనకి అవగతం అయినా, అదేమిటోగానీ పెద్దయ్యాక ఎందువల్లనో ఉపయోగించుకోం. ఇంకా సూక్ష్మంగా, ఖచ్చితముగా చెప్పాలంటే -
అసలు సమస్యలోనే ఖచ్చితముగా జవాబు ఉంటుంది.
దీన్ని దొరకబుచ్చుకుంటే - మనకో దారి కనిపిస్తుంది. దానివెంటే మన ఆలోచనలు సాగిస్తే - పరిష్కారం దిశగా వెళతాం.
చాలామంది సమస్యలకు సాకులు వెదుకుతారు. కానీ అవేవీ సమస్యకి పరిష్కారం చూపవు. సమస్యకి దూరముగా తీసుకవెళుతాయి. సమస్యనీ ఇంకా పెద్దగా చేస్తాయి కూడా. అప్పుడు సమస్య పీటముడిలా పడిపోతుంది. సాకులు చూపడం వల్ల తాత్కాలికముగా సమస్య తీవ్రత తగ్గవచ్చునేమో గానీ, సమస్య మాత్రం ఇంకా సమస్యలా మారి, కొండగా కనిపిస్తుంది. అప్పుడు దానికి పరిష్కారం వెదకడం కష్టమవుతుంది. అంతలోగా ఇంకో సమస్య వస్తుంది. అప్పుడు ఈ రెండింటినీ పరిష్కరించలేక సతమతమవుతాం. అప్పుడే " ఏమిట్రా ఈ జీవితం.. నాకే ఇలా ఎందుకవుతున్నది..? " అనే డైలమాలో పడిపోతాం. ఒకదానివెంట వచ్చే మరొకటి వచ్చే సమస్యలు ఇంకా మనల్ని బాధిస్తూనే ఉంటాయి.
సమస్యలు చిన్నగా ఉన్నప్పుడే వాటిని క్షుణంగా అర్థం చేసుకోండి. వాటిని చక్కగా విడదీయండి. ఒక్కో పొరనీ విడదీసి, నిశితముగా ఆలోచించండి. అప్పుడు అసలు సమస్య ఎక్కడుందో, దాన్ని ఎలా దిద్దుకోవాలో చక్కగా బోధపడుతుంది. చక్కని సింబాలిక్ గా చెప్పాలంటే ఉల్లిగడ్డ మాదిరిలా సమస్య ఉంటుంది. అసలు పాయ లోన ఎక్కడో ఉంటుంది. పైనవన్నీ పొరలు ఊడదీస్తే అసలు సమస్య కనిపిస్తుంది.
No comments:
Post a Comment