వరంగల్ ని పరిపాలించిన కాకతీయుల సామ్రాజ్యం యొక్క తాలూకు ఆనవాళ్ళు - వరంగల్ కోట Warangal Fort లో ఇంకా మిగిలే ఉన్నాయి. ఈ కోట నగరానికి దగ్గరలోనే ఉంటుంది. ఈజీగా చేరుకోవచ్చును. ఈ కోట బయట ప్రాకారము మట్టితో చేయబడి, ఎత్తుగా ఉంటుంది. ఆ తరవాత కొద్ది అడుగుల దూరములో రాతితో కట్టబడిన ప్రాకారము ఉంటుంది. ఈ రెండింటినీ కొద్దిగా తొలగించి, అందులోంచి రహదారి వేశారు. అలా ఈ వరంగల్ కోటలోకి రావచ్చును.
ఈ క్రిందున్న పటం శిల్పాల సముదాయం వద్ద కనిపిస్తుంది. నిజానికి ఇది బయట అక్కడక్కడ పెట్టాలి. ఈ గైడ్ మ్యాప్ ని మీ దగ్గర ఉంటే - అన్నీ చూడవచ్చును. చాలానే నడవాల్సి ఉంటుంది. అందుకే కొద్దిగా దృఢమైన వారు ఈ కోట అంతా తిరగటానికి ప్రయాణించాలి. మొత్తం తిరగటానికి ఒక పూట పడుతుంది. శిల్పాల నగిషీ పనితములో మీకు గనుక ఆసక్తి గనుక ఉంటే - చాలా సమయమే పడుతుంది. ఇక్కడ ఉన్నదంతా శిల్పాల శిథిలాలు, రాక్ గార్డెన్ పార్క్, చెరువు, చెరువు ప్రక్కనే ఉన్న ఏకశిలా పర్వతం.
దగ్గరలో ఏమీ తినడానికి కనిపించలేదు. ముందే ఆ పని కానిచ్చేసి, ఇక్కడికి రావాలి. ఏదైనా సరే - పెద్దగా అంచనా వేసుకొని దర్శిస్తే - నిరాశాపొందటం ఖాయం. మామూలుగా యే అంచనా లేకుండా వస్తే - సంతోషముగా ఉండి, ఒకటి మంచి స్థలాన్ని దర్శించం అన్నట్లు ఉంటుంది. ఇది అన్ని యాత్రాస్థలాలకూ, జీవితాన చాలా విషయాలకి అన్వయం అవుతుంది.
నిజానికి ఈ పార్క్ ని అభివృద్ధి చెయ్యొచ్చు. కానీ ఎందుకు అలా నిర్లక్ష్యం చేస్తున్నారో అర్థం కాదు. పచ్చని పచ్చిక గార్డెన్, ఉద్యానవనం వాటర్ ఫాల్స్, హైమాస్ట్ లైట్స్ పెడితే ( ఇవన్నీ ఉన్నాయి కానీ నిర్వహణ లేక లేనట్లే కనిపిస్తాయి ) టూరిస్ట్స్ మరింతగా పెరిగి, రోజువారీ రెట్టింపు ఆదాయం వస్తుంది. నగరానికి మరింత లాభముగా ఉంటుంది. ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చెయ్యరో..
ఇప్పుడు మనం వరంగల్ కోటకి వచ్చేద్దాం. ఇక్కడ శిల్పాల శిధిలాలు - అవీ అద్భుత కళాఖండాల తాలూకు భాగాలు లభ్యం అయితే ఇక్కడ పార్క్ గా ఏర్పరిచారు. ఇప్పుడు ఆ కోటలోని భాగం అయిన సితాబ్ ఖాన్ మహల్ Sitab khan mahal దగ్గరికి వెళదాం. ఇది సితాబ్ ఖాన్ కట్టించాడు కాబట్టి అలా పేరు వచ్చింది అంట. ఈ మహల్ నే ఖుష్ మహల్ Khush mahal గా కూడా పేర్కొంటారు. ఇక్కడ రాజులు తమ పరివారముతో సరదాగా స్నానాలకి వచ్చేడివారట. నిర్మాణము కూడా అలాగే ఉంది. ఈక్రింది మ్యాప్ లో బాణం గుర్తు చూపిన దగ్గర ఈ ఖుష్ మహల్ ఉంటుంది.
ఫొటోస్ అన్నీ చూడటానికి వీలుగా కంప్రెస్ చేసి, సైజ్ తగ్గించాను. మొదటి ఫోటో మీద క్లిక్ చేసి, బాణం గుర్తు కీలని వాడి పెద్దగా చూడండి.
ఈ ఖుష్ మహల్ ఈ కోటకి పడమటి భాగాన ఉంటుంది. అంటే పశ్చిమ ద్వార మార్గములో ఉంటుంది. ఈ మహల్ ముందువరకూ వాహనములో వెళ్ళొచ్చును. ఈ మహల్ ప్రక్కనే పెద్ద పార్కింగ్ స్థలాన్ని ఏర్పరిచారు. పార్కింగ్ ఫీజు ఏమీ లేదు.
ఇదే ఖుష్ మహల్. చాలా పెద్దగా ఉంటుంది. కాకతీయుల శైలి కాకుండా, మహ్మదీయుల వాస్తు శైలిలో నిర్మాణం కనిపిస్తుంది. ప్రక్కగా పైకి వెళ్ళటానికి మెట్లు ఉన్నాయి. అవి నిలువుగా, కాసింత కష్టముగా ఎక్కాల్సిన విధముగా ఉంటాయి. ఎదురుగా పెద్ద రాతి ద్వారం కనిపిస్తుంది. లోపల మరో ద్వారం ఉంటుంది.
ఈ మహల్ గురించి, మరిన్ని వివరాలు ఇందులో తెలుగులో, ఆంగ్లములో ఉన్నాయి.
మొదటి ద్వారం ముందట ఇలా విరిగిన డ్రాగన్ సింహాల శిలారూపులు ఉంటాయి.
పెద్ద పెద్ద బండరాళ్ళతో కట్టిన ద్వారం ఉంటుంది. అంత పెద్ద బండరాళ్ళతో ఎలా కట్టారా? వాటిని అంత ఎత్తుకి ఎలా మోశారా అని అనిపిస్తుంది. అంతగా ఖచ్చితమైన రూపం ఎలా వచ్చిందో, అలా రావటానికి ఎంతగా శ్రమించారో అని అనిపిస్తుంది.
ప్రధాన ద్వారానికి అటూ ఇటూ విరిగిన కళాఖండాల్ని అందముగా అమర్చారు.
లోపలికి వెళ్ళటానికి ప్రధాన ద్వారం. లోపలికి ప్రవేశం ఉచితం. కోట పార్కు వద్ద టికెట్ ( రూ. 5 ) తీసుకుంటే, అదే టికెట్ ఇక్కడ చెల్లుబాటు అవుతుంది.
ఈ మహల్ లో లోపల ఇలా ఉంటుంది. మధ్యలో ఒక ఫూల్ మాదిరిగా లోతుగా ఉంటుంది. అందులో జలకాలు ఆడి, ఉల్లాసముగా ఉండటానికి ప్రయత్నించేవారట. మధ్యలో ఉన్న పూల్ చుట్టూ ఇలా ఇనుప పైపుల బారికేడ్ కట్టారు. ద్వారాల ప్రక్కన ఉన్న గోడలని ఆనుకొని, అక్కడ చుట్టూరా లభ్యమైన ఖండిత శిల్పాలని అమర్చారు. వాటిలో బాగున్నవి కొన్ని క్రింద ఉన్నాయి. చూడండి. లోపల అంతకన్నా చూడటానికి ఇంకేమీ లేదు.
లోపల ఏమీలేదు అనుకోవటానికి వద్దన్నట్లుగా, అక్కడక్కడ దొరికిన దండయాత్రల్లో నాశనమయిన అపురూప శిల్ప కళాఖండాల్ని ఇక్కడ అందముగా అలంకరించారు. వాటిల్లో శిల్ప జీవకళ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అలాంటి ఒంటరిగా మిగిలిపోయిన శిల్పాల భాగాలని ఇలా ఎత్తైన పీఠం మీద అమర్చారు.
గణేశుని ప్రతిమ.
కలశం
అవి చూశాక ఇలా ఈ మెట్ల మీదుగా ఈ మహల్ పైకి చేరుకుందాం. అలా పైకి వెళ్లటం కాస్త కష్టమే. ఎందుకూ అంటే కాసింత నిట్టనిలువుగా ఆ మెట్లు ఉండి, ఎత్తుగా ఉంటాయి.
ఆ మహల్ కి ప్రక్కగా ఉన్న మెట్ల మీదుగా ఆ మహల్ పైకి వెళితే పైన ఇలా ఉంటుంది.
పైనుండి చూస్తే ఇలా చుట్టుప్రక్కల ప్రాంతాలు కనిపిస్తాయి. ఆ తారు రోడ్డు ఈ ఖుష్ మహల్ కీ, పశ్చిమ ద్వారానికి వెళ్ళే దారి. ఈ ప్రక్కన ఉన్నది పార్కింగ్ స్థలము. దూరముగా తెల్లగా, గోడలా కనిపిస్తున్నది - ఖండిత అపురూప శిల్ప కళాసంపద ఉన్న స్థలం. ఆ స్థలం గురించి మరో టపాలో చెప్పుకుందాం.
ఖుష్ మహల్ ముందు రోడ్డు స్థలం ఇలా ఉంటుంది.
ఇది ఖుష్ మహల్ కి ఎదురుగా ఉన్న స్థలం. ఇలా ఓపెన్ గా ఉంటుంది. ఇందులో తిన్నని దారికెదురుగా పచ్చని లోతైన స్థలం కనిపిస్తున్నదా? దాన్నే శృంగార బావి అంటారు. ఎండాకాలములో దీన్ని దర్శించుకున్నాం కాబట్టి నీళ్ళు లేవేమో.
ఈ బావి చుట్టూరా నడవడానికి దారి ఉంటుంది. నేను బైక్ మీద వెళ్లాను కాబట్టి హాయిగా ఒక చుట్టూ వేశాను. అలా ఖుష్ మహల్ సందర్శన ముగిసింది.
No comments:
Post a Comment