Thursday, May 30, 2013

Bhadrakali Temple, Warangal - 1

 చాలాకాలముగా లాంగ్ డ్రైవ్ చెయ్యక అదోలా ఉంది. ఎటైనా వెళ్ళాలీ అనుకున్నాను. మా అమ్మాయి కూడా వెళదాం అంది. ఒకసారి లాంగ్ డ్రైవ్ అంటే ఎలా ఉంటుందో, తనకీ తెలుసుకోవాలని ఆసక్తి చూపించింది. ఎటైనా వెళదాం అంటే - సరే అన్నాను. అప్పుడే నా చిన్నప్పటి మితృడి నుంచి శుభలేఖ అందింది. అదే కాకుండా ,తప్పకుండా రావాలంటూ ఫోన్ కాల్. వెళదామా అని ఇంట్లో అడిగాను. అంత దూరమా? అన్నారు. వరంగల్ లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయం గురించి విన్నాను. చాలా బాగుంటుందని, మహిమాన్వితమైనదనీ విన్నాను. చాలా రోజులుగా వెళ్ళాలనుకుంటూ, తీరిక లేక ఆగిపోయాను. ఈసారి అక్కడికే వెళదామని వారితో చెప్పాను.. 

ఇంత ఎండలో అంత దూరములో ఎలా వెళ్ళగలం? అని అంటే - వెంటనే చెప్పాను.. వేకువ ఝామునే మన ప్రయాణం మొదలవుతుంది. పదిన్నర వరకూ అవుట్ డోర్ లో ఉండి, ఆ తరవాత మూడున్నర వరకూ నీడపట్టు స్థలాలల్లో ఉండి, ఆ తరవాత మళ్ళీ ప్రయాణం. రాత్రి ఎక్కడైనా షెల్టర్. శని, ఆదివారాలు కలసి రావటముతో... ప్రోగ్రాం ఫిక్స్ చేశాను. అలా ఉదయాన ఐదు గంటలకే బైక్ మీద మా ప్రయాణం మొదలయ్యింది. 

బైక్ మీద ఎందుకూ అంటే చాలా సౌకర్యముగా ఉంటుంది. ఎలా పడితే అలా సాగిపోవచ్చును. అలాగే ఎక్కువ బాదర బందీలు ఎదురుకావు. ఇంతకు ముందు వెళ్ళిన లాంగ్ డ్రైవ్స్ లలో ఈ అనుభవం అయ్యింది. ఈసారి బంధువులది బైక్ తీసుకొని వెళ్ళాం. ఆ బైక్ కావాలనీ, ఏమైనా రిపైర్స్ ఉంటే అంతలోగా చేయించి పెట్టమని చెప్పాను.. ఇలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనీ.. కానీ వాళ్ళు బ్రేక్ మాత్రం రిపైర్ చేయించలేదు.. బ్రేక్ షూస్ మొత్తం అరిగిపోయాయి. చివరిలో ఉన్నాయి  అవి. బండి ఇచ్చినందులకు కృతజ్ఞతగా మధ్యలో మారుద్దామని అనుకున్నాను.. కానీ సమయం లేక, వీలుగాక పోయింది. 

మేమే అనుకున్నాం. మాలాంటి వాళ్ళు చాలామంది అలా ఎదురయ్యారు. ప్రొద్దున్నే లేచి, అలా కుటుంబాలతో ఎండా పూర్తిగా కాకముందే వెళ్ళిపోవటం చేస్తున్న వాళ్ళు చాలామందే కనిపించారు. దారిలో మాకు ఎదురుగా వస్తున్న ఒక బైక్ మీద వాళ్ళు వాళ్ళ లగేజ్ ని - స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా పడేసుకున్నారు. వారిని హెచ్చరించి, ఆపి, ఆ పడేసుకున్న లగేజ్ నీ తిరిగి పొందేలా చూశాం. 

నా చిన్నప్పటి స్నేహితుని కూతురు పెళ్ళికి వెళ్ళాం. అక్కడ వాళ్ళని కలిసి (ఇక్కడో విశేషం ఉంది. అదేమిటో ఇంకో టపాలో వ్రాస్తాను. అది వ్రాశాక ఇక్కడ లింక్ పెడతాను) అక్కడ కాసింత విరామం తీసుకొని, ఈ భద్రకాళి ఆలయానికి వెళ్లాము. 

నా స్మార్ట్ ఫోన్ లో నావిగేటర్ (దీన్నే GPS - Global Positioning System అంటారు. దారి చూపిస్తుంది. ఎంత దూరం ఉంది, ఇంకా ఎంత సమయం పడుతుంది, ఆ దార్లో మనం ఎక్కడ ఉన్నాము, ఎటు వైపు తిరగాలో.. అన్నీ చూపిస్తుంది) ఆన్ చేశాను. అందులో ఆలయం పేరు టైపు చేశాను. వెంటనే దారి చూపింది. చాలా దగ్గరగానే ఉన్నాము. అసలు రహదారి ఉన్నా, మేము ఒక సందులో ఉండేసరికి ఆ సందుల గుండా దారి చూపించింది. అబ్బో! ఆ సందుల గుండా కష్టముగా వెళ్ళాం. నిజానికి అలా రాదు.. అయ్యో! ఇలా సందుల గుండా దారి చూపించేదేమిటీ ? అనుకున్నాను.. అంతా అయ్యాక ఆ సందు మొదట్లో ఉన్న రహదారి మీద ఉండి, నేవిగేటర్ ఆన్ చేస్తే, చక్కని రహదారిని చూపించింది. సో, అలా ఒక పాఠం నేర్చుకున్నాము. అదేమిటంటే  - ఇక నుండీ ఎప్పుడు దారి చూడాలన్నా, రహదారి మీద ఉండే అలా ఓపెన్ చెయ్యాలన్నది. ఈ క్రింది ఫోటో  Bing నుండి సేకరించాను. దాదాపుగా ఇలాగే నేవిగేటర్ లో దారి చూపిస్తుంది. ఇంత గజిబిజి ఉండదు.. మనకి అవసరమైన దారి మాత్రమే కనిపిస్తుంది. 




దూరాన కొండల ప్రక్కన కనిపిస్తున్నదే - శ్రీ భద్రకాళి ఆలయం. అలాగే భద్రకాళి చెరువుని కూడా మీరు ఇక్కడ చూడవచ్చును. 


మంచి ప్రకృతి సుందర ప్రదేశములో ఉండి, చాలా ఆహ్లాదకర వాతావరణములో ఈ ఆలయం నిర్మించారు. 


పెద్ద కొండల ప్రక్కన, చక్కని పరిసర వాతావరణములో, ఎంతో హాయిగోల్పుతుంది. గుడివరకూ చక్కని పెద్ద తారు రహదారి ఉంది. ప్రస్తుతం ఆలయ ముందు భాగాన్నే వాహనాల పార్కింగ్ కి వాడుతున్నారు. మేము వెళ్ళినప్పుడు అప్పుడే పెద్ద గేటు ని ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఆ ఫోటో తీయలేదు. వాహన పార్కింగ్ బైక్స్ లకు రూ. 10 తీసుకొని, ఒక టోకెన్ ఇస్తారు. 


ఇదే ధ్యాన మందిరం. ఆలయానికి వెళ్ళే దారిలో కుడివైపున వస్తుంది. దీనికి ఎదురుగా చెప్పుల స్టాండ్ ఉంటుంది. అక్కడ జతకి రెండు రూపాయల చార్జీ వసూలు చేస్తారు. మధ్యలో ఉన్న దారిలో నూతన, పాత వాహనాలకు  - వాహన పూజ చేస్తారు. 


ఇదిగో, ఈ పై ఫోటోనే వాహన పూజ స్థలం. ఇక్కడే టోకెన్ తీసుకొని, వాహన పూజకి అన్ని ఏర్పాట్లు చేసి, పూజ చేస్తారు. ఇక్కడనే కొబ్బరికాయలు, పూల మాలలు అమ్ముతారు. అవి ఇక్కడే ఖరీదు చెయ్యాలి. లోపల ఎక్కడా దొరకవు.. దీన్ని దాటి ముందుకు వెళ్ళితే - ఒక మూడడుగుల వెడల్పు గల నీటి మడుగు కనిపిస్తుంది. ప్రక్కన పైపుల గుండా వచ్చే, పాదాలని స్పృశిస్తూ వెళ్ళే ఆ నీటిలో  పాదాలని కడుక్కొని, లోనికి వెళ్ళొచ్చును. కానీ, ఎండాకాలం అనే కారణమేమో  - ఆ నీరు రాలేదు. ముందు ఉన్న కుళాయిల వద్ద కడుక్కున్నాం. ( ఆ కుళాయిలు శ్రీ గోకులం - అనే ఆవుల పాక వద్ద ఉన్నాయి . క్రింద ఫోటోలో ఎడమవైపున గుడిసె లా ఉంది చూడండి.. అక్కడ కుళాయిలు ఉన్నాయి. )


ఇదిగో ఈ దారి గుండా ఆలయ పరిసరాల్లోకి ప్రవేశిస్తాం. దీనికి ఒక అడుగు ముందుగానే ఇందాక చెప్పిన - కాళ్ళు కడుక్కునే మడుగు వస్తుంది. ఇలా వెళ్ళే దారిలో ఎడమ వైపున భద్రకాళి చెరువు, కుడివైపున  - చెట్లు, చేమలూ, పెద్ద కొండ కానవస్తాయి. 


ఆ కొండ ప్రక్కన పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలని ఇక్కడ చూడవచ్చును. విశాఖ లోని కైలాసగిరి కొండ మీద ఉన్న శివపార్వతుల్లా తీర్చి దిద్దారు. ఇంకా చుట్టూ తీర్చిదిద్దుతున్న ఉద్యానవన పనులు సగములో ఆగిపోయాయి. 


ప్రక్కనే పెద్ద జలాశయం ఉన్నా, ఆ నీటి సహాయముతో ఆ గుట్ట మీద పచ్చని పచ్చికని నాటితే - అది చాలా ఆకర్షణీయముగా ఉంటుంది. బహుశా త్వరలో చేస్తారు అనుకుంటాను. 


శివపార్వతుల విగ్రహాలు. 


ఎడమ ప్రక్కన ఉన్న భద్రకాళీ చెరువు. చెరువులో చెట్టు ప్రక్కన కనిపిస్తున్నది వరంగల్ నగర త్రాగునీటి పంప్ హౌజ్. దాని ప్రక్కన కనిపిస్తున్నది వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం ( Link :  వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయం. )

No comments:

Related Posts with Thumbnails